ఫాదర్స్ డే స్పెషల్ – కొన్ని జ్ఞాపకాలు – కొన్ని పాటలు

7
6

[dropcap]రెం[/dropcap]డు రోజుల క్రితం రాత్రి బాగా అలసటగా అనిపించి మామూలు సమయానికన్నా ముందే నిద్రపోయాను. నిద్ర పడుతుండగా… మా అమ్మాయిలిద్దరు వాళ్ళమ్మతో నెమ్మదిగా మాట్లాడడం నాకు లీలగా వినిపించింది. ‘ఫాదర్స్ డే’ సందర్భంగా గ్రీటింగ్ కార్డ్ ఎలా చేయాలో అడుగుతున్నారు. మా ఆవిడ ఏం సమాధానం చెప్పిందో వినబడలేదు, నాకు నిద్ర పట్టేసింది.

మర్నాడు ఫ్రెష్‌గా నిద్ర లేచాను. పిల్లలు రడీ అయి స్కూలికి వెళ్ళిపోయారు. నేనూ రెడీ అయి నా పనులు మొదలుపెట్టాను.

“ఫాదర్స్ డే కి మీకు గ్రీటింగ్ కార్డ్ తయారు చేస్తున్నారు…” చెప్పింది మా ఆవిడ.

నేను నవ్వేశాను.

“మనం ప్రత్యేకించి మదర్స్ డేలు, ఫాదర్స్ డేలు జరుపుకోనక్కరలేదు. మనం తల్లిదండ్రులతో కలిసే ఉంటాం, వాళ్ళని గౌరవిస్తూనే ఉంటాం, వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తూనే ఉంటారు” అన్నాను.

“పిల్లలు ఏదో సరదా పడుతున్నారు లెద్దూ…” అంది.

“అమ్మానాన్నల ప్రస్తావన వస్తే… మనం పిల్లలమయిపోతాం కదూ…” అన్నాను.

“ఇలాంటి ఫాదర్స్ డే, మదర్స్ డే లాంటి వాటివల్ల రెండు ప్రయోజనాలున్నాయి. ఒకటి ముందుగా మన పేరెంట్స్‌నీ, మన బాల్యాన్నీ గుర్తుచేసుకోవచ్చు. రెండు, పేరెంట్స్‌గా మన పిల్లల బాల్యాన్ని మరోసారి తలచుకోవచ్చు” అంది.

ఇద్దరం గతంలోకి వెళ్ళి మా బాల్యాన్ని గుర్తు చేసుకున్నాం. మా అమ్మానాన్నలు మమ్మల్నెంతగా ప్రేమించారో తలచుకున్నాం.

చిన్నప్పుడు నాన్నగారి చెయ్యి పట్టుకుని రెండు రోజుల కొకసారి పొద్దున్నే బేగంపేట స్టేషన్ దగ్గరున్న కొట్లో కూరలు తేవడం, అక్కడి హోటల్‌లో ఇరానీ చాయ్ తాగడం నాకింకా గుర్తే. ప్రతీ నెలా మొదటివారంలో ఆయన ‘చందమామ’ కొనుక్కురావడం; చదవడానికి నేనూ, అక్కా, తమ్ముడు పోటీపడడం… అన్నీ కళ్ళ ముందు కదలాడాయి.

***

మాట్లాడుకుంటుండగా మా కజిన్ జ్యోతి వచ్చింది. తను ఓ ఎఫ్.ఎమ్ రేడియోలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తుంది. వాళ్ళ ఆఫీసుకి వెళ్ళాలంటే, మా ఏరియా దాటి వెళ్ళాలి. ఆఫీసుకి వెళ్ళేడప్పుడో, ఆఫీసు నుంచి వచ్చేటప్పుడో ఒక్కోరోజు మా ఇంటికి వస్తూంటుంది.

పలకరింపులయ్యాకా, “ఈ ఫాదర్స్ డే స్పెషల్‌గా మీ రేడియోలో ఏం పాటలు వేస్తున్నారు?” అడిగాను.

“అయినా ‘నాన్న’ సినిమాలు చాలా తక్కువేగా… పెద్దగా పాటలు ఉండి ఉండవేమో…” అంది మా ఆవిడ.

“పేరులో ‘నాన్న’ అనే పదం ఉన్న సినిమాలు ఉన్నాయ్…” అంటూ నేను నాకు స్ఫురించిన పేర్లు చెప్పాను – ‘మా నాన్న నిర్దోషి’, ‘మా నాన్న చిరంజీవి’, ‘నేను నాన్న అబద్దం’, ‘నాన్న’ (విక్రమ్, అనుష్క, డబ్బింగ్ సినిమా), ‘మా నాన్నకి పెళ్ళి’ – ఇంకా… ” అని చెబుతుండగా –

“నాన్నకు ప్రేమతో, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, డాడీ…” అంటూ అందించింది జ్యోతి.

“ఈ సినిమాల్లోంచి పాటలు వేస్తారా మీ ప్రోగ్రామ్‌లో?” అడిగింది జ్యోతిని.

“ఊహూ! ఈ సినిమాల్లోంచే కాకపోయినా, వేరే సినిమాల్లోవీ.. తండ్రీ పిల్లల మధ్య చిత్రీకరించినవీ వినిపించడానికి ప్రయత్నిస్తాం….” చెప్పింది జ్యోతి.

“ఏమున్నా లేకపోయినా ఒక పాట మాత్రం తప్పకుండా ఉంటుంది” అంది మా ఆవిడ.

మేమిద్దరం తనకేసి ప్రశ్నార్థకంగా చూశాం.

“ధర్మదాత సినిమాలోది! ఓ నాన్నా….. ఓ నాన్నా ఓ నాన్నా నీ మనసే వెన్న అమృతం కన్నా అది ఎంతో మిన్న…”

“అది మంచి పాటే, అయినా ఇంకా చాలా పాటలున్నాయక్కా” అంది జ్యోతి.

“ఓహో! అయితే ‘నాన్నకు ప్రేమతో’ సినిమా టైటిల్ సాంగ్ వేస్తారు…” అంది మా ఆవిడ.

ఏ కష్టమెదురొచ్చినా…  కన్నీళ్ళు ఎదిరించినా…. ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన …. నాన్నకు ప్రేమతో..  నాన్నకు ప్రేమతో… నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీ క్షణం” అంటూ పాడాను.

అమ్మైన నాన్నైన ఎవరైన ఉండుంటే.. పైనుంచి ఈ వాన ఇట్టా దూకేనా… సర్లే అని ఎవరైనా.. ఆపుంటే ఎపుడైన.. సయ్యాట సాగేన ఎగిసే కెరటాన” అంటూ ‘సింహాద్రి’ సినిమాలోది పాడింది మా ఆవిడ.

జ్యోతి నవ్వేసింది… “మేం ఏ పాటలు వేయాలో మా వాళ్ళు నిర్ణయిస్తారు గానీ, మనం కొన్ని పాటలు, మంచి ఫీల్ ఉన్న సీన్స్ గుర్తు చేసుకుందాం…” అంది.

“సీన్స్ అంటే గుర్తొచ్చింది. ‘ఆకాశమంత’ సినిమా అప్పట్లో శుభదకి బాగా నచ్చింది. చాలాసార్లు చూసింది. ‘ఆటల పాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా! ఆశగ చూసిన నాన్నకి పుట్టిన అమ్మరా అమ్మరా!’ పాట తనకి బాగా ఇష్టం…” అన్నాను మా పెద్దమ్మాయి చిన్నప్పటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ.

“మీకూ ఇష్టమేగా ఆ సినిమా? పాటలు తెగ వినేవాళ్ళుగా… ‘దూరం కావాలా అన్నీ విడిచీ‘ అనే పాటలో ‘ఇన్నాళ్ళుగా ఇన్నేళ్ళుగా నువ్వే లోకం…. నీ నాన్నగా నా ప్రేమలో ఉందా లోపం… వేరే దారే వెతికీ..’ అనే వాక్యాలు ఆ రచయిత ఎలా రాశాడో అని ఎన్నిసార్లు అనుకోలేదూ?” అంది మా ఆవిడ.

***

మొదటిసారి నాన్ననయిన క్షణాలు గుర్తొచ్చాయి. 2005 డిసెంబర్ 24 వ తేదీ రాత్రి 11.29 నిమిషాలకు నా జీవితంలో కొత్త అధ్యాయానికి తెర లేచింది. ఆ పసిగుడ్డును చేతుల్లోకి తీసుకున్న ఆ క్షణాలు అపురూపమైనవి, అనిర్వచనీయమైనవి. అలాగే శుభద మొదటిసారిగా ‘నాన్న’ అని పలికిన క్షణాలు కూడా… I started reliving those moments! పిల్లలిద్దరికి సంబంధించిన కొన్ని మెమొరీస్ మదిలో మెదిలాయి…

శుభద మూడో క్లాసు చదువుతున్నప్పుడు ఇంటి దగ్గరే ఉండే ఓ సంగీతం టీచర్ గారి దగ్గర నేర్చుకున్న దాశరథీ శతకంలోని పద్యాన్ని రాగయుక్తంగా చదవడం నాకు గుర్తే!

“భండన భీముడా ర్తజన బాంధవుడుజ్జ్వల బాణతూణకో
దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్
రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా
దాండద దాండ దాండ నిన దంబులజాండము నిండమత్తవే
దండము నెక్కి చాటెదను దాశరథీ కరుణాపయోనిధీ.”

చిన్నమ్మాయి అనన్య తెలుగు రైమ్స్ బాగా చెప్పేది. ‘చిట్టి చిలకమ్మా’ రైమ్‌కి యాక్షన్ చేస్తూ… చివర్లో ‘గుటుక్కుమన్నావా’ అని భలే తమాషాగా అనేది. ‘చిట్టీ చిట్టీ మిరియాలు చెట్టు కింద పోసి’ రైమ్ కూడా బాగా చెప్పేది. అనన్య యుకేజీలో ఉన్నప్పుడు స్కూల్లో ఫాన్సీ డ్రెస్ పోటీల కోసం వాళ్ళ టీచర్ గోపికమ్మ వేషం వేయించారు, ఆ డ్రెస్‍లో ఎంత ముద్దుగా ఉందని మా ఆవిడా నేను ఎన్నిసార్లో అనుకున్నాం… ఆ ఈవెంట్‌లో అనన్యకి ప్రైజ్ కూడా వచ్చింది…

ఇలాంటివి పిల్లల జ్ఞాపకాలు అందరు తల్లిదండ్రులకీ ఉండేవే… మేమేం ప్రత్యేకం కాదు… ప్రతీ రోజూ పిల్లల చిన్ననాటి సంఘటన ఏదో ఒకటి గుర్తొస్తునే ఉంటుంది… కాకపోతే ఇలాంటి రోజున ప్రత్యేకించి తలచుకోవడం బావుంటుంది.

***

కొన్ని క్షణాల తర్వాత, బల్ల మీద కొడుతూ… “ఏంటి బావా… జ్ఞాపకాలా…” అంది జ్యోతి.

వర్తమానంలోకి వచ్చిన నేను తలూపుతూ, “అవును. తండ్రీ కూతుర్ల ప్రేమని చక్కగా చూపించారు ‘ఆకాశమంత’ సినిమాలో” అన్నాను.

“సరే, ఇప్పుడు నీ వంతు. పాడు” అన్నాను మా ఆవిడతో.

మా నాన్న జేమ్సుబాండు తనదంతా పాత ట్రెండు, ఇరవయ్ నాలుగు గంటలు చదువని ప్రాణం తీస్తూ ఉంటాడు, పాకెట్ మనీ ఇచ్చేటప్పుడు ఫేసు అదో టైపులో పెడతాడు“…. పాడింది మా ఆవిడ.

“దీర్ఘ సుమంగళీ భవ సినిమాలోది కదా… పాత కాలం తండ్రులెలా ఉండేవారో హాస్యంగా చెప్పిన పాట అది” అంది జ్యోతి.

“మనం సినిమాలో అనూప్ రూబెన్స్ సంగీతంలో భరత్ పాడిన పాట…..” అంటుండగానే, ఆ పాటందుకుంది జ్యోతి.

“కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన మా నాన్నకు నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు
ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది”

“వావ్! చంద్రబోస్ గారూ” అన్నాను.

“డాడీ సినిమాలో ఓ పాట… గుర్తు రావడం లేదు… అదీ బావుంటుంది” అంది మా ఆవిడ.

“గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి
డాడీకి ఊపిరిలో మురిసే కూచిపూడి
చిందాడీ చిందాడి తుళ్ళిందంటే చిన్నారి
మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి”
…. అని పాడి, “ఇదేనా?” అంది జ్యోతి.

అవునన్నట్లు తలూపి, “ఈ పాట రాసింది సిరివెన్నెల గారేనా?” అంది.

“అవును. హరిహరన్ పాడారు. సంగీతం ఎస్.ఎ.రాజకుమార్” అంటూ డీటైల్స్ ఫిల్ చేశాను.

“సినిమా పాటలు కాకుండా ‘నాన్న’ మీద వేరే పాటలు ఏవీ లేవా?” అంది మా ఆవిడ.

“ఎందుకు లేవు, ఉన్నాయి” అంది జ్యోతి.

“ఒక చక్కని లలితగీతం ఉంది. కాని ఎవరో రాశారో నాకు తెలియదు. తన శిష్యుల కోసం స్వరపరిచింది మాత్రం రామాచారి గారు” అంటూ “నాన్నా అను పదమే.. నాదసుధారసమై నడిపించును జీవితం నవరస భరితం… నవరస భరితం” అనే గీతం వినిపించాను.

“మధుప్రియ ఒక మంచి పాట పాడింది నాన్న మీద” అంటూ ఈ జానపద గీతం పాడింది జ్యోతి.

“మేమమ్మ కడుపులోనున్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదంట
మేము భూమి మీద పడ్దవేళప్పుడు బాధలన్నీ మరిసిపోయినావంట
నాన్నా నాన్నా నాన్నా నీ మనసెంతో మంచిదో నాన్నా
నాన్నా నాన్నా నాన్నా నీ ప్రేమెంత గొప్పదో నాన్నా”

“వాహ్! చాలా బాగుంది” అంది మా ఆవిడ.

“ఇంకో గీతం కూడా బావుంటుంది. “చెట్టుకేమో విత్తుకు ఋణమున్నది తెలియలేదు. నాకేమో నాకేమో మా నాన్న విలువ ఎంత అన్నది తెలియలేదు” అనే పాటని రెంటాల వెంకటేశ్వర్లు రాసారు. గజల్ శ్రీనివాస్ పాడారు” చెప్పాను.

“నాకో పద్యం గుర్తొస్తోంది” అంది మా ఆవిడ. “గుమ్మా సాంబశివరావు గారు రాసిన ‘తెలుగు బాల శతకం’ లోది” అని చెప్తూ, పాడింది.

“అమ్మ అనెడి పిలుపు అమృతము వలెనుండు
నాన్న యనెడి పిలుపు వెన్న సమము
అమ్మ నాన్నపిలుపు లాప్యాయతల్‌ పెంచు
తెలిసి మెలగ మేలు తెలుగు బాల.”

“బావుంది బావుంది” అన్నాం నేనూ, జ్యోతి.

“నాకు సరిగ్గా గుర్తు రావడం లేదు కానీ, రైతైన తన తండ్రిని తలచుకుంటూ ఓ యువకుడు పాడే పాట యూ-ట్యూబ్‌లో ఉంది. చాలా బావుంటుందా పాట” అన్నాను.

“మళ్ళీ సినిమా పాటల్లోకి వద్దాం…. ఇంకో మంచి పాట గుర్తొస్తోంది…” అంటూ

“నీకేం కావాలో చెప్పు
లోకమంతా చూడాలా చెప్పు
కొత్త ఊరు కొత్త వాడ చూసి వద్దామా
నచ్చినవి కొనమని చెప్పు
నచ్చనివి వద్దని చెప్పు
కొత్త నీరు కొత్త యేరు ఈది చూద్దామా
రేయి పగలనక ఎండా వాననక
తెలిసి తెలియనివన్నీ చూసి వద్దామా”
అని పాడింది జ్యోతి.

ఒక్క నిమిషం నేను, మా ఆవిడ మౌనంగా ఉండిపోయాం.

“ఏ సినిమాలోదీ పాట… నేను మిస్సయ్యాను” అన్నాను.

“డబ్బింగ్ సినిమా బావా! కూతురికి లోకం చూపిస్తూ తండ్రి పాడే పాట… అజిత్ నటించిన ‘ఎంతవాడు గాని’ సినిమాలోది. బెన్నిదయాళ్, మహతి.ఎస్ పాడారు, సంగీతం: హారిస్ జయరాజ్. ఎ.ఎమ్.రత్నం, శివగణేశ్ రాశారు” విడమర్చి చెప్పింది జ్యోతి.

“కొన్ని సినిమాలు ఆడకపోవడం వల్ల, వాటిల్లోని కొన్ని మంచి పాటలు శ్రోతలకి అందవు” అన్నాను.

“అలాంటి సినిమా ఏదైనా నీ దృష్టిలో ఉందా?” అడిగింది జ్యోతి.

“2016లో వచ్చిన ‘ఆమె… అతడైతే…’ సినిమా. ఈ సినిమాలో సుద్దాల అశోక్ తేజ రాసిన ‘ఇక్కడ ఓ చెట్టుండేది ఇక్కడ ఓ చేనుండేది…’ పాట తండ్రులకు గొప్ప నివాళి” అంటూ పాటలో మధ్యలో వచ్చే లైన్స్ పాడాను.

సంతోషాలని మాకిచ్చి… సంతాపాలు నువు మోసి… మేమడిగినవే ఇచ్చేసి, నువ్వడగడమే మానేసి… అన్నీ భుజాలకెత్తుకుని… ఎన్నో నిజాలు దాచుకుని.. ఒంటి స్తంభం మేడల్లే… ఒంటరి సైన్యంలా నువ్వే… జీవితమంతా నడిచీ నడిచీ అలుపొచ్చిందా ఓ నాన్న…”

“యశోకృష్ణన్ సంగీత దర్శకత్వంలో సాయి చరణ్ పాడిన ఈ పాట ఎమోషనలైజ్ చేస్తుంది” అన్నాను.

కొద్ది సేపు ముగ్గురం మౌనంగా ఉన్నాం.

“ఈసారి మేం కొంతమంది శ్రోతల అనుభూతులని రికార్డు చేసి వినిపిస్తున్నాం. మీ ఇద్దరూ మాట్లాడచ్చు. మీకిష్టమైతే సాయంత్రం ఎక్విప్‌మెంట్‌తో వస్తాను” చెప్పింది జ్యోతి.

“మా అనుభూతుల కన్నా, పిల్లలు నా గురించి ఏమనుకుంటున్నారో అడిగితే బెటర్.. కావాలంటే వాళ్ళ ఆడియో బైట్స్ తీసుకో…” చెప్పాను.

“సరే మావాళ్ళకో మాట చెప్తాను…” అంది. ఇంతలో జ్యోతికేదో ఫోన్, రావడంతో ‘నేను వెళ్ళాలి’ అంటూ తను బయలుదేరింది.

ఫాదర్స్ డే మిష మీద కొన్ని మధురస్మృతులనీ, కొన్ని మంచి పాటలని తలచుకున్నందుకు హాయిగా అనిపించింది.

***

తండ్రిపై ప్రేమని చాటుకున్న ఓ కొడుకు గురించి 11 జూన్ 2019 నాడు దినపత్రికలో చదివిన ఓ వార్తని ప్రస్తావించడం అవసరం అనిపిస్తోంది. అప్పులభారం మోయలేక 2001లో రాజస్థాన్ లోని సొంతురుని విడిచి కుటుంబంతో సహా నేపాల్ వెళ్ళిపోయాడట మీతారామ్‌ అనే వ్యాపారి. నేపాల్‌లో ఓ కిరాణా కొట్టు పెట్టుకుని నిలదొక్కుకోడానికి ప్రయత్నించాడట. అప్పులు తీర్చలేక పారిపోయి వచ్చానన్న బాధ అతన్ని వెంటాడగా, మరో ఆరేళ్ళకి తనువు చాలించాడు. అతని కొడుకు సందీప్‌కి అప్పుడు 12 ఏళ్ళ వయసు. అప్పటి నుంచి సందీప్ కష్టపడి రకరకాల వ్యాపారాలు చేసి… డబ్బు కూడగట్టి ఇటీవలే భారతదేశంలోని సొంతూరుకి వచ్చి తన తండ్రి చేసిన మొత్తం 55 లక్షల రూపాయల అప్పును తీర్చేశాడట. జనాలకి కుచ్చుటోపీ పెట్టి దేశం విడిచి పారిపోయే బడా వ్యాపారులెక్కడ, చిన్న వ్యాపారమయినా ఎప్పుడో 18 ఏళ్ళ క్రితం తన తండ్రి చేసిన అప్పును తీర్చడానికి స్వచ్ఛందంగా భారతదేశం వచ్చి తండ్రిని ఋణవిముక్తుడిని చేసిన ఈ కొడుకెక్కడ! నాన్న మీద ప్రేమ, కుటుంబ విలువలే ఆ కొడుకు చేత ఈ పని చేయించాయని నాకనిపించింది.

ఆ రాత్రి పిల్లలు వాళ్ళు తయారు చేసిన గ్రీటింగ్ కార్డు ఇచ్చి “హ్యాపీ ఫాదర్స్ డే నాన్నా” అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

“థాంక్యూ కిడ్స్” అంటూ వాళ్ళని దగ్గరకి తీసుకున్నాను.

Happy Fathers’ Day!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here