ఫస్ట్ లవ్-12

0
13

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గౌతమ్‍కి ఫోన్ చేసి బయటకు వెళ్దామని అనడంతో గౌతమ్ హసంతి ఇంటికొస్తాడు. అప్పటికే ఆమె తయారై సిద్ధంగా ఉంటుంది. ఇద్దరు బైక్ మీద బయల్దేరుతారు. ఏంటివాళ ఇంత ఆనందంగా ఉన్నావని గౌతమ్ అడిగితే, కారణం నువ్వే అంటుంది హసంతి. చిన్నప్పడి నుంచి గౌతమ్ దగ్గర తాను చాలా నేర్చుకున్నానని చెబుతుంది. గచ్చిబౌలిలో స్టార్బక్స్ కాఫీ షాప్‍కి వెళ్లి కూర్చుంటారు. అక్కడ కౌంటర్‍లోని వ్యక్తితో మాట్లాడుతున్న శ్రీరామ్‍కి హసంతి కనబడుతుంది. వచ్చి పలకరిస్తాడు. చాలా రోజులనుంచి కలవాలనుకుంటున్నాను, అతనితో మాట్లాడాను – అని అంటుండగా గౌతమ్ కాఫీలు ఆర్డరిచ్చి అక్కడికి వస్తాడు. మా మేనత్త కొడుకు గౌతమ్, మాకు ఎంగేజ్‍మెంట్ అయిందని పరిచయం చేస్తుంది. తనకి పని ఉంది, మళ్ళీ కలుస్తానని చెప్పి అక్కడ్ని క్యాష్ కౌంటర్‍ దగ్గరకి వచ్చేస్తాడు శ్రీరామ్. అంతలో అక్కడికి కార్తీక్ వస్తాడు. శ్రీరామ్‍ని చూసి గుర్తుపట్టి పలకరిస్తాడు. శ్రీరామ్ అతన్ని దూరంగా తీసుకువెళ్ళి కూర్చోబెడతాడు. తన టోకెన్ నెంబరు రావడంతో వెళ్ళి కాఫీలు అందుకుని వస్తున్న గౌతమ్ చేతిని ఓ కస్టమర్ గట్టిగా తాకడంతో కాఫీ ఒలికి చేతిమీద పడుతుంది. అక్కడే ఉన్న కార్తీక్ చేతికి కప్పు ఇచ్చి, ఒక్క నిమిషం పట్టుకోమని అడిగిత్, చేతులు కడుక్కోడానికి వాష్ బేసిన్ దగ్గరికి వెళ్తాడు గౌతమ్. ఇంతలో కార్తీక్ ఫోన్ మోగుతుంది. కాఫీ కప్పుని అక్కడి గట్టు మీద పెట్టి, హలో అంటాడు. అతని గొంతు విని కార్తీక్‍ని చూసిన హసంతి విస్తుపోతుంది. ఆశ్చర్యం, దుఃఖం కలబోసిన మొహంతో వేగంగా లేచి నిలబడి, మొహం తిప్పుకొని, తన ఫోన్‍ని టేబుల్ మీదే మర్చిపోయి బయటకి వచ్చేస్తుంది. గౌతమ్ వచ్చి హసంతి కనబడపోయేసరికి, టేబుల్ మీద ఆమె సెల్ ఫోన్ తీసుకుని వేగంగా బయటకి వస్తాడు. అప్పటికే హసంతి ఆటో ఎక్కేస్తుది. ఇంటికొచ్చాకా తల్లి, అడిగితే, విసుగ్గా జవాబు చెప్పి తన గదికి వెళ్ళీ తలుపు వేసుకుంటుంది. కాసేపటికి గౌతమ్ ఇంటికి వచ్చి హసంతి సెల్ ఫోన్‌ని వాళ్ళమ్మకిచ్చి వెళ్ళిపోతాడు. గదిలో ఏడుస్తూ, తనలో తాను ఆలోచించుకుంటుంది హసంతి. హసంతి ప్రవర్తన ఆమె తల్లికీ, గౌతమ్ ప్రవర్తన అతని తండ్రికి అర్థం కావు. ఇక చదవండి.]

[dropcap]హ[/dropcap]సంతి గదిలో కూర్చుని యూ – ట్యూబ్ ఛానల్ లో వస్తున్న ప్రోగ్రాం చూస్తోంది. సడన్ గా ఒకచోట ఆమె కళ్ళు ఫ్రీజ్ అయ్యాయి.

ప్రోగ్రాం యాంకర్ మాట్లాడుతూ

“హాయ్! హలో! నా పేరు శంకర్. ఈరోజు వేలెంటైన్ డే. ముందుగా పెళ్ళికాని వాళ్ళకి, పెళ్లయిన వాళ్ళకి వాలెంటైన్ డే శుభాకాంక్షలు. ఈరోజు మన లవ్ బర్డ్స్ షో కోసం ఇక్కడున్న కొంతమంది జంటల్ని కలుద్దాం.” అని కార్తీక్, అతని పక్కనున్న మృదుల ముందు మైక్ పట్టుకుని

“హాయ్! బ్రో! హాయ్ అండీ!! మా లవ్ బర్డ్స్ షో కోసం మీ జంటని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. మీ ఇద్దరికీ వాలెంటైన్స్ డే శుభాభినందనలు.”

హసంతి కళ్ళు పెద్దవి చేసి చూస్తోంది. కార్తీక్ కనిపించగానే విప్పారిన మొహం, అతని పక్కన అమ్మాయిని చూడగానే ముడుచుకుపోయింది. తనకు సంబంధించిన వస్తువేదో పరాధీనం అవుతున్నట్టు ఫీలవుతోంది ఆమె మనసు.

“బ్రదర్ మీ గురించి చెప్పండి.” అన్నాడు యాంకర్.

“నా పేరు కార్తీక్, తను మృదుల”

“సూపర్ బ్రో! కార్తీక్, మృదుల పేర్లే అద్భుతంగా ఉన్నాయి. మీ ఇద్దరి ప్రేమ గురించి రెండు మాటల్లో చెప్పండి.”

“అదీ.. అది..” ఎంబ్రాసింగా అన్నాడు కార్తీక్.

“ప్రేమ, లవ్, కాదల్, ఇష్క్, ప్రేమమ్.. బ్రదర్ చెప్పండి.”

“నేను ప్రేమలో పడ్డాకే తెలిసింది,

కన్నులతో కూడా మాట్లాడవచ్చని,

హృదయంతో కూడా చూడవచ్చని,

మౌననానికి కూడా భాష ఉంటుందని,

మనసుతో మనసుని చదవచ్చని”

హసంతి క్యూరియాస్‌గా చూస్తోంది.

“ఎక్సలెంట్ బ్రో ! ప్రేమ గురించి ఎంత అందంగా చెప్పారు.” అన్నాడు యాంకర్ శంకర్.

కార్తీక్ మాట్లాడుతూ

“ఇప్పటిదాకా జ్ఞాపకాలలో జీవిస్తున్న నేను, వాటిని నిజంగా చూడాలని ఆశపడుతున్నాను. కాలాలు మారవచ్చు కలలు మారవచ్చు కానీ నువ్వంటే నా మనసులో ఉన్న ప్రత్యేక స్థానం ఎప్పటికీ మారరు. ఐ లవ్ యు” అన్నాడు కార్తీక్.

హసంతి మొహంలో చిరాకు, ఏడుపు, అసహనం.

“ఎక్సలెంట్ బ్రో! మీ ప్రేమ సక్సెస్ అవ్వాలని, మా ఛానల్ తరఫున అభినందనలు తెలుపుతున్నాను.”

హసంతి ఏడుస్తూ, ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేసింది.

“కంగ్రాట్స్ బ్రో!”

“కంగ్రాట్స్ మేడం! ఇప్పుడు మీరు ప్రేమ గురించి చెప్పండి” అన్నాడు శంకర్.

“ప్రేమ అనేది మరో వ్యక్తి యొక్క ఆనందం, మీ సొంతం కావటానికి అవసరమైన పరిస్థితి” అంది మృదుల.

“సూపర్ మేడం!” అని చెరో చిన్న బొకే ఇచ్చి,

“మా వీక్షకుల కోసం ఒకరినొకరు ప్రపోజ్ చేసుకోండి” అన్నాడు

“అయ్యయ్యో! మీరు పొరబడుతున్నారు. ఈమె నా లవర్ కాదు. ఫ్రెండ్. నేను ప్రేమిస్తోంది వేరే అమ్మాయిని. ఆమె పేరు హసంతి. ఐ లవ్ యు హసంతీ! హ్యాపీ వాలెంటైన్ డే. ప్రస్తుతం మనం దూరంగా ఉన్నా, వచ్చే వాలెంటైన్ డే కి పక్క పక్కనే ఉంటాం. ఆల్ ది బెస్ట్” అన్నాడు ఉద్వేగంగా.

***

హసంతి కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా కారుతున్నాయి. కార్తీక్ యూ-ట్యూబ్ ఛానల్‌లో చెప్పిన మాటలు

‘నేను కార్తీక్. తను మృదుల. ఐ లవ్ యు’ ఇవే మాటలు పదేపదే ఎకో సౌండ్‌లో వినిపిస్తున్నాయి.

ఆ మాటలు వినలేక చెవులు మూసుకుంది.

కాసేపటి తరువాత.. తలపైకి ఎత్తి వాల్ క్లాక్ వైపు చూసింది. దాని కింద గోడ మీద ఉన్న ఫోటో తీసుకుని దాని గుండెలకు హత్తుకుంది.

అది హసంతి, గౌతమ్‌ల చిన్నప్పటి ఫోటో. వెనక్కి వెళ్లి సోఫాలో కూర్చొని, ఫోటో చూస్తుంటే.. అలనాటి జ్ఞాపకాలు కళ్ళముందు తచ్చాడాయి.

***

పిల్లలు హసంతిని ఆటల్లో చేర్చుకోకపోతే, ఆమె ఏడుస్తుంటే గౌతమ్ వచ్చి

“ఏడవకు హసంతి! నేను ఎప్పుడూ నీతోనే ఉంటా. రా! మనిద్దరం కలిసి ఆడుకుందాం. నువ్వు ఎప్పుడైనా నాతో ఆడుకోవచ్చు.” అని అనేకసార్లు భరోసా ఇచ్చేవాడు.

కొంచెం పెద్దయ్యాక..

హసంతి వాళ్ళ వీధిలో పిల్లలు గల్లీ క్రికెట్ ఆడుతుంటే

“ఒరేయ్ నన్నూ చేర్చుకోండి రా! క్రికెట్ అంటే నాకు ఇష్టం” అని హసంతి అంటే..

“అమ్మో! నీతోనా? ఒక్కసారి నీ చేతికి బ్యాట్ ఇచ్చామంటే తూచ్ గేమ్ ఆడతావు. ఏదైనా అంటే నువ్వు మమ్మల్ని తిట్టి, మా మీదే పితూరీలు చెప్తావు” అని రానివ్వక పోతుంటే..

గౌతమ్ కూడా వాళ్లతో ఆడకుండా..

“రా హసంతీ! మనిద్దరం ఆడుకుందాం” అని పక్క గల్లీలోకి తీసుకెళ్లి హసంతికి బ్యాట్ ఇచ్చి, తన బౌలింగ్ చేసేవాడు.

ఇంకొంచెం పెద్దయ్యాక.. ఇద్దరూ క్యారమ్స్, కార్డ్స్, ఛెస్ ఆడుకునే వాళ్ళు. సినిమాలు చూసేవాళ్ళు.

ఆ విషయాలన్నీ గుర్తొచ్చి.. కళ్ళు తుడుచుకుని ఫోటోని మరోసారి గుండెలకు హత్తుకుంది.

కొన్ని రిలేషన్స్ కలవకుండా ఉంటేనే మంచిది. మనల్ని ఎవరు ఇష్టపడతారో.. వాళ్లతోనే జీవితం సుఖంగా ఉంటుంది. నిజమైన ప్రేమ అంటే.. వెంటబడి ప్రేమించడం కాదు. మనం ప్రేమించిన వాళ్ళకి మన వల్ల ఇబ్బంది కలుగుతుందని తెలిసినప్పుడు వదిలేయడం కూడా ప్రేమే. అందుకే కార్తీక్ ప్రేమని కలలో కూడా తలుచుకోకూడదనుకుంది.

‘గౌతమ్‌ని వెంటనే చూడాలి, కలవాలి, మాట్లాడాలి’ అనుకొని ఫోటో యథాస్థానంలో ఉంచి గౌతమ్‌కి ఫోన్ చేసి.. వస్తున్నానని చెప్పకుండా సర్ప్రైజ్‌గా వెళ్లాలని లోపలికి వెళ్ళింది.

***

గౌతమ్ గదిలో లాప్‌టాప్‌లో వర్క్ చేస్తున్నాడు. హసంతి డార్క్ గ్రీన్ కలర్ అనార్కలి డ్రెస్‌లో అక్కడికి వచ్చింది. ఆమెని అతను గమనించలేదు.

రెండు నిమిషాల తర్వాత

“గౌతమ్!” అంది.

అంతే! తల తిప్పి దేవతని చూసినట్టు ఆశ్చర్యంగా చూశాడు.

“హసంతీ! టు మై సర్ప్రైజ్. సడన్‌గా ఏంటీ దేవీ దర్శనం. గాడ్జియస్, బ్యూటిఫుల్, అమేజింగ్.. లోపలికి రా!” అన్నాడు.

లోపలికి వచ్చి కూర్చుంది.

“ఏం తీసుకుంటావు?”

“ఏమీ వద్దు”

“నో.. నో..” అని ఫ్రిడ్జ్ తెరిచి ఐస్ క్రీం తీసి, రెండు రెండు కప్పుల్లో పెట్టి, ఆమెకిచ్చి, ఎదురుగుండా కుర్చీలో కూర్చున్నాడు.

“నీతో ఒకటి చెప్పాలని వచ్చాను. గౌతమ్!” అంది మెల్లగా.

“చెప్పు హసంతీ!”

“అదీ.. అదీ..” అని సాగదీస్తుంటే..

“వన్ మినిట్” అన్నాడు సిక్స్త్ సెన్స్ టీ.వీ షో లో యాంకర్ ఓంకార్ అన్నట్టు.

హసంతి ఉలిక్కిపడ్డట్టు చూసింది.

“ఒక్క నిమిషం. నువ్వు చెప్పడానికి ముందు నేనే నీకు ఒక విషయం చెప్తాను”

హసంతి గుండెలో లబ్ డబ్ రేటు పెరగసాగింది.

“నేను.. నేను.. ” అని చెమట తడుచుకుంటూ, “అదీ… నేనూ… నేను..” అంటుంటే హసంతి వేగంగా కుడి అరచేతిని అతని నోటికి అడ్డంగా పెట్టి..

“వద్దు గౌతమ్! నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. జీవితాంతం నా చెయ్యి పట్టుకుని నడుస్తానని, నాతోనే ఉంటానని, నువ్వు చెప్పడాని కంటే ముందే.. నేను నీకు జీవితాంతం తోడుంటానని, నేను నీ చెయ్యి పట్టుకుని నడవటానికి సిద్ధంగా ఉన్నానని చెబుదామని.. ఇంత దూరం వచ్చాను” అంది గుక్క తిప్పుకోకుండా..

ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి “హసంతీ! ఇది కలా? నిజమా? నాకు అంతా అయోమయంగా ఉంది.”

“అయ్యో! బుద్ధూ! ఇంతకంటే ఎలా చెప్పాలి రా! నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఐ లవ్ యూ గౌతమ్” అని అతని చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని “దిస్ ఇస్ మై ప్రామిస్” అంది.

“ఈ ప్రామిస్ ఇప్పటికేనా? ఎప్పటికీనా!” అన్నాడు గౌతమ్.

“ఎప్పటికీ.. ఎప్పటికీ.. ఎప్పటికీ” అంది హసంతి చిరునవ్వుతో.

అంతే గౌతమ్ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. చిన్న హగ్గుతో ఇద్దరూ సాంత్వనం పొందారు.

“నేనెప్పుడూ నీతోనే ఉంటాను. ఐ లవ్ యు హసంతీ!” అన్నాడు తన్మయత్వంతో.

“ఐ.. టు” అంది హసంతి.

***

రోడ్డుమీద కార్తీక్, మృదుల పక్క పక్కనే నడుస్తున్నారు.

“ఎవర్రా? ఆ హసంతి”

“ఆమె.. ఆమె.. ఆమె..” అంటూ ఐదు నిమిషాల్లో జరిగిందంతా చెప్పాడు.

“సరే ఇంతకీ శ్రీరామ్ హసంతి వివరాలు చెప్పాడా? లేదా?”

“లేదు.. నేను లీవ్‌లో ఉన్నాను”

“అసలు ఎవరో తెలియకుండా, చూడకుండా ఒక గిఫ్ట్ ఇచ్చిందని లవ్ చేస్తానంటా వేంట్రా బాబూ!”

“అందుకేగా అన్వేషిస్తోంది.”

“ఆమె నీకు దొరుకుతుందన్న నమ్మకం నీకుందా? నాకైతే లేదు. నిన్ను ఫూల్ చేయడానికి ఎవరో ప్లాన్ వేసి ఉంటారు” అంది మృదుల.

“మనం పోగొట్టుకున్నది ఏదైనా, ఎంత దూరంలో ఉన్నా, అది మనదైతే మనకి ఖచ్చితంగా దక్కి తీరుతుంది” అన్నాడు కార్తీక్ నమ్మకంగా .

“ఆల్ ది బెస్ట్ మళ్లీ కలుద్దాం” అని ఆఫీస్ క్యాబ్‌లో ఎక్కింది మృదుల.

 ***

డార్క్ గ్రీన్ కలర్ అనార్కలి డ్రెస్ వేసుకొని సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది హసంతి.

“గౌతమ్‌ని కలవడానికి వెళ్తానన్నావు. వెళ్లలేదా? ఇంకా ఇక్కడే ఉన్నావేంటి?” అంది తల్లి కవిత.

‘ఛా! ఇదంతా కలా!? ఏంటి తనిలా పగటి కలలు కంటోంది’ అనుకుని “బయలుదేరుతున్నానమ్మా!” అంది బయటికి వెళుతూ.

“సరే! జాగ్రత్తగా వెళ్ళిరా!” అని తల్లి లోపలికి వెళ్ళింది.

క్యాబ్‌లో కూర్చుని ‘గౌతమ్‌ని ఒక లవర్‌గా, భర్తగా చూడగలనో లేదో అర్థం కావటం లేదు. కానీ నన్ను నన్నుగా గౌతమ్ అర్థం చేసుకున్నంతగా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఎందుకంటే తను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి. నేనూ గౌతమ్‌తో అలాగే ఉండాలి. అతన్ని ఇంకా అర్థం చేసుకోవాలి. దానికి కొంత సమయం పడుతుంది ఏమో. అతనితో మనసు విప్పి మాట్లాడితే పెళ్లి లోపల అన్ని అవే సెట్ అవుతాయి’ అనుకుంది.

***

హసంతి వచ్చేసరికి గౌతమ్ కిటికీ దగ్గర నిలబడి ఫోన్లో మాట్లాడుతున్నాడు.

రెండు నిమిషాల తర్వాత ఫోన్ ఆఫ్ చేసి, తలతిప్పిన గౌతమ్‌కి ఎదురుగా హసంతి. అప్సరసలా, దేవతలా అందంగా కనిపించిన ఆమెని ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూశాడు.

ఒక్క హగ్గు చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. కానీ హసంతి అసహ్యించుకుంటే తను తట్టుకోగలడా అనుకున్నాడు. అంతకు ముందులా ఆమెను చూడగానే మోహంలో రియాక్షన్ గానీ, ఎక్స్‌ప్రెషన్ గానీ కనిపించనీయకుండా క్యాజువల్‌గా చూసినట్టు చూశాడు.

“ఏంటి? లోపలికి రమ్మనవా? గౌతమ్!” అంది.

“అదేం లేదు. రా! ప్లీజ్ కం.”

“గౌతమ్! నేను నీతో మాట్లాడాలి” అంటూ తలుపులు దగ్గరగా వేసి లోపలికి వచ్చింది.

గౌతమ్ వెళ్లి తలుపులు తీశాడు.

“ఎందుకు తలుపులు తీస్తున్నావు?” అంది ఆశ్చర్యంగా.

“ఎందుకంటే ప్రతిసారీ నాతో మాట్లాడాలని వస్తావు. వచ్చి ఏమీ మాట్లాడకుండా కన్నీళ్ళతోనో, కోపంతోనో, బాధతోనో, విసుగుతోనో వెళుతున్నావు. అందుకని వెళ్లేటప్పుడు మళ్ళీ నీకు తలుపులు తెరిచే శ్రమ కలిగించకూడదని” అన్నాడు సర్కాస్టిక్‌గా.

అంతే! అతని మాటలకి హసంతి మనసు ముడుచుకుపోయింది. ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్టు అయింది. వేగంగా ఆమె మొహం గంభీరంగా మారింది.

ఆమెను చూసి “ఇప్పుడైనా మాట్లాడతావా? ఎప్పటిలాగా మౌనంగానే ఉంటావా?” అన్నాడు

అతని వైపు కోపంగా చూసింది.

“మాట్లాడాలని వచ్చి, మాట్లాడకుండా నిలబడితే.. అందుకే అలా అన్నాను”

“కనీసం కూర్చొమని అనవా!”

“రా! ప్లీజ్ కూర్చో.”

“లేదు గౌతమ్..” అని ఆమె ఏదో చెప్పబోతుంటే అడ్డొచ్చి..

“నేను నీకు అర్థం కావటం లేదో? నువ్వు నాకు అర్థం కావటం లేదో? తెలియటం లేదు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తుందో చెప్పనా, 15 సంవత్సరాలు నిన్ను చూడకుండానే, అనుక్షణం నిన్నే తలుచుకుంటూ పెరిగాను. నీకు తెలియకుండానే నా ప్రేమను నీకు పంచాను. నాలో పెంచుకున్నాను. అది చాలు జీవితాంతం నిన్ను ఆరాధిస్తూ జీవించగలను.”

“అసలు నేనేం.. చెప్పాలనుకుంటున్నానో, దయచేసి ఒక్కసారి విను గౌతమ్” అంది.

“ప్రతిసారీ నేను నువ్వు చెప్పేది వినటానికి సిద్ధంగానే ఉంటున్నాను. కానీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావో..  ఓపెన్‌గా చెబితేనే కదా, నాకు తెలిసేది. మాట్లాడాలంటావు. నేను ఎంతో ఆశగా నీ మాటలు వినాలని ఎదురు చూస్తుంటాను. కానీ నువ్వు పెదవి విప్పవు. కనీసం నామీద నీ అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా! చూడు ప్రేమ ఎవరో బలవంతపెడితే ఏర్పడేది కాదు. అది సహజంగా రావాలి. ఇష్టపడే వాళ్ళ పేరు చెబితే చాలు గుండెల్లో ఆప్యాయత కెరటంలా ఎగేసి పడాలి. అది మొహంలో కనపడుతుంది. చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. హృదయంలో స్పందనలు సృష్టిస్తుంది. అలా నీ పేరు చెప్తే నాలో అనువణువునా వైబ్రేషన్స్ వస్తాయి.” అన్నాడు ఉద్వేగంగా.

“నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు గౌతమ్. నేను నీతో మాట్లాడాలని వచ్చిన ప్రతిసారీ.. ఏదో ఒక విషయం నన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా నేను నీకు చెప్పాలనుకుంటున్న విషయం..” మళ్ళీ ఆమె మాట పూర్తిగా వినకుండా

“వద్దు.. హసంతీ! ఇప్పుడు నాకు టైం లేదు..” చెప్పనీయకుండా అడ్డుపడ్డాడు.

హసంతి కళ్ళలో నీళ్లు తిరిగాయి.

అంతలో.. “హసంతీ! నువ్వొచ్చి ఎంతసేపయిందమ్మా!” అన్నాడు బయటి నుంచి లోపలికి వచ్చిన రఘురాం.

“పది నిమిషాలు అవుతోంది మామయ్యా!” అంది నవ్వుతూ.

“గౌతమ్ హసంతిని నుంచో బెట్టే మాట్లాడుతున్నావా?”

“ఇప్పటిదాకా కూర్చునే ఉన్నాను మామయ్యా! నాకు పని ఉంది. వచ్చి కూడా చాలాసేపయింది. వెళ్ళొస్తాను మామయ్య” అంది హసంతి

అవాక్కయినట్టు చూస్తున్న గౌతమ్‌తో..

“వస్తాను గౌతమ్! మళ్లీ కలుద్దాం” అని వెళ్ళిపోయింది.

ఆమె వెళ్లగానే గౌతమ్ తలొంచుకుని లోపలికి వెళ్ళాడు.

ఎవరి త్రోవన వాళ్ళు వెళ్తున్న హసంతిని, గౌతమ్‌ని చూసి ‘వీళ్లిద్దరి మధ్య సరైన అవగాహన కనబడటం లేదు’ అనుకున్నాడు రఘురాం.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here