ఫస్ట్ లవ్-14

0
8

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కార్తీక్‍కి ఓ లొకేషన్ పంపి అక్కడికి పది నిమిషాల్లో రమ్మని చెప్తుంది మృదుల. తీరా అక్కడికి వెళ్తే అది శ్రీరామ్ రెస్టారెంటు. ఇక్కడి కెందుకు పిలిచావంటూ అడిగి, శ్రీరామ్‍ని కలుస్తావా ఏంటి అని అడుగుతాడు. అతనికేగా హసంతి వివరాలు తెలుసు, అందుకే కలుద్దామని వచ్చాను అంటుంది. కార్తీక్ శ్రీరామ్‍కి కనబడకుండా దూరంగా నిల్చుంటే, మృదల వెళ్ళి హసంతి వివరాలడిగితే, కార్తీక్ పంపించాడా అని అడిగి, ఆమెను పంపించేస్తాడు శ్రీరామ్. నేను ముందే చెప్పాను కదా అంటూ మృదులని ఇంటికి వెళ్ళమంటాడు కార్తీక్. అక్కడ తన గదిలో హసంతి అంతర్మథానానికి గురువతుంది. ఈలోపు కవితకి రఘురాం ఫోన్ చెసి – గౌతమ్, హసంతీల మధ్య పెళ్ళి చేసుకుంటున్నామన్న ఉత్సాహం కనబడడం లేదని అంటాడు. ఎంగేజ్‍మెంట్ అయినప్పటి నుంచి హసంతి కూడా అదోలా ఉంటోందని చెప్తుంది కవిత. వాళ్ళిద్దరికీ త్వరగా పెళ్ళి చేసేద్దామని అనుకుంటారు రఘురాం, కవితలు. హసంతి కోసం మరోసారి ప్రయత్నించాలని అనుకుంటారు మృదుల, కార్తీక్‍లు. ఓ రోజు కార్తీక్ ఫోన్‍లో ఫేస్‍బుక్ చూస్తుంటే అందులో ఓ కవిత కనిపిస్తుంది. అది హసంతి డైరీలోనే కవితే అయ్యేసరికి, ఆ పోస్ట్‌కి రిప్లైగా నేను కార్తీక్‍ని అని టైప్ చేస్తాడు. ఈసారి మృదుల ఒక్కర్తే వెళ్ళి శ్రీరామ్‍తో మాట్లాడుతుంది. అసలు కార్తీక్‍‍కి హసంతి గురించి, చెప్పి అతని మనసుని దారి మళ్ళించింది మీరేనని అంటుంది. చివరికి ఆమె బాధ చూడలేక, హసంతి ఫోన్, నెంబరు అడ్రస్ ఇచ్చి, హసంతికి వాళ్ళ బావతో ఎంగేజ్‍మెంట్ అయిందని చెప్పి, ఈ విషయం కార్తీక్‍కి చెప్పాలో వద్దో ఆమెనే తేల్చుకోమంటాడు శ్రీరామ్. హసంతి తనకేదో చెప్పాలని వస్తే, తాను ఆమె మాటల్ని వినకుండా హర్ట్ చేసినట్టు గ్రహిస్తాడు గౌతమ్. హసంతి ఇంటికి వస్తాడు. ఆమె గదిలోకి వెళ్ళి సారీ చెప్పేస్, నువ్వేంటో నాకు తెలుసు, నువ్వెప్పుడు నాకు సంజాయిషీ చెప్పక్కర్లేదని అంటాడు. ఇంతాలో ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో హడావిడిగా వెళ్ళిపోతాడు గౌతమ్. ఇక చదవండి.]

[dropcap]గాం[/dropcap]ధీనగర్, స్టేట్ బ్యాంక్ కాలనీ 1-1-419/F, స్ట్రీట్ 13..

అడ్రస్ కోసం కార్తీక్ వెతుకుతున్నాడు. స్ట్రీట్ ఎంట్రన్స్‌లో ఉన్న నంబర్ల బోర్డు చూసి కన్ఫ్యూజై తిరిగి తిరిగి చివరికి కనుక్కున్నాడు. ఆ ఇంటి కాలింగ్ బెల్ మోగించాడు.

ఒక అమ్మాయి వచ్చి తలుపు తీసింది.

“హసంతీ!”

“అవును”

“హసంతీ! నేను కార్తీక్” అన్నాడు ఆశగా.

“కార్తీకా!? మీరెవరో నాకు తెలియదే” అందామె.

“తెలీదా?!”

వెంటనే ఫోన్ తీసి ఫేస్‌బుక్ ఓపెన్ చేసి, అందులో ఉన్న కవితను చూపించి,

“దీనిని పోస్ట్ చేసింది మీరే కదా!”

“అవును నేనే”

“మీరే అయితే.. మీకు నేను ఖచ్చితంగా తెలిసి ఉండాలి”

“లేదు. ఇది నా ఫ్రెండ్ వాట్సాప్ స్టేటస్‌లో పెడితే, చదివి బాగుందని నేనే పోస్ట్ చేశాను”

ఎంతో ఉత్సాహంగా, నమ్మకంతో వచ్చిన కార్తీక్‌కి ఆ మాటలు చలిలో చన్నీళ్లు కుమ్మరించినట్టు అనిపించింది.

“ఓ .కే . థాంక్స్ అండీ! సారీ ఫర్ ద డిస్ట్రబెన్స్” అని వెళ్లబోతుంటే

“అయ్యో! పర్లేదండీ! సారీ ఎందుకు?”

“ఓ.కే” అన్నాడు ఆగి..

“మీరు ఎవర్నో వెతుకుతున్నట్టున్నారు.” అందామె.

“అవును. నేను ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె పేరు కూడా హసంతే”

ఆశ్చర్యంగా చూసింది ఆ అమ్మాయి.

“లవర్ అంటున్నారు. ఆమె వివరాలు తెలియవా?” అంది ఆశ్చర్యంగా.

“లేదండి. ఇంతవరకు నేను ఆమెను చూడలేదు. ఆమె నన్ను ప్రేమిస్తున్నప్పుడు, నేను ఆమెతో లేను. ఇప్పుడు నేను ఆమెను లవ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఆమె నాతో లేదు” అన్నాడు.

“ఇంట్రెస్టింగ్. లాజిక్ కొత్తగా ఉంది. మీరు వెతుకుతున్న మీ హసంతి మీకు తప్పకుండా దొరుకుతుంది” అందామె.

“థాంక్స్ అండీ”

“మీ నంబర్ నాకు ఇస్తే, మా ఫ్రెండ్‌తో మాట్లాడి ఏమైనా క్లూ, వివరాలు తెలిస్తే మీకు చెబుతాను” అంది.

“ఓ.కే” అని నంబర్ షేర్ చేసి బయటకు వచ్చాడు.

***

గౌతమ్ ఇంట్లో వాళ్ళ అమ్మ ఫోటో ముందు నిలబడి..

“అమ్మా! ఇవాళ హసంతితో గడిపిన సమయం అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు ఇద్దరి మధ్య ఉన్న దూరం దగ్గర అవుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వు చెప్పినట్టు హసంతి చేతిని జీవితాంతం వదిలిపెట్టను. నువ్వు నన్నెలా చూసుకున్నావో అంతకు రెట్టింపు శ్రద్ధగా తనని చూసుకుంటానని నీకు మాటిస్తున్నాను” అని హాల్లోకి వచ్చి హసంతి వాళ్ళమ్మ కవితకి ఫోన్ చేశాడు.

“ఆఁ.. చెప్పు గౌతమ్!” అంది.

“హసంతి తలనొప్పి ఎలా ఉంది అత్తయ్యా?”

“ఇప్పుడు బాగానే ఉంది. కొంచం తగ్గిందట”.

“సరే అత్తయ్యా! ఉంటాను.”

“ఒక్క నిమిషం గౌతమ్. హసంతి రెండు రోజులుగా ముభావంగా ఉంటోంది. ఎంత అడిగినా ఏమీ లేదంటుంది. నీకు టైం ఉంటే దాన్ని కాస్త బయటకు తీసుకెళ్తావా? దానికి రిలీఫ్ గా ఉంటుంది” అంది.

“అలాగే.. కానీ ఇవాళ రెస్ట్ తీసుకోనివ్వండి. రేపు తీసుకెళ్తాను” అన్నాడు .

***

మరుసటి రోజు సాయంత్రం కార్తీక్, మృదుల పార్కులో ఓ చెట్టు కింద నిలబడి ఉన్నారు.

“నువ్వెన్నైనా చెప్పు.. ఆ శ్రీరాం ఇచ్చింది కరెక్ట్ అడ్రస్ కానే కాదు” అన్నాడు.

“అవునా!?” ఇది ఆశ్చర్యంగా మృదుల.

“ఆ అడ్రస్‌లో వేరే హసంతి ఉంది”

“శ్రీరామ్ ఇచ్చిన ఫోన్ నెంబర్ కూడా కరెక్ట్ కాదు” అన్నాడు అసహనంగా.

“రేయ్ బాబూ! నవ్వరా! ఏదో సర్వం కోల్పోయినట్టు ఆ జిడ్డు మొహం ఏంట్రా? నవ్వు” అంది మృదుల అతని చెయ్యి పట్టుకుంది.

***

బైక్ మీద గౌతమ్, హసంతి వస్తున్నారు.

“ఎక్కడికెళ్దాం?”

“ఈ రోడ్డులో ఓ పార్కు ఉంది. చిన్నప్పుడు నేను, గీతిక యిక్కడికి వచ్చి ఆడుకునే వాళ్ళం”

“ఆఁ.. నాకు తెలుసు. ఇప్పుడు అలాగే ఉందా? ఎవరైనా కబ్జా చేశారా?”

“అలాగే ఉంది”

ఐదు నిమిషాల్లో.. పార్కులోకి వచ్చారు ఇద్దరూ. ఓ బెంచీ మీద కూర్చున్నారు. “నేనూ, గీతిక అక్కడ ఆడుకున్నాం, ఇక్కడ ఆడుకున్నాం” అని హసంతి చిన్న పిల్లలా చెప్తోంది.

అంతలో ఎవరో “హసంతీ!” అని పిలిచారు. హసంతి ఠక్కున అటువైపు చూస్తుంది. హసంతే కాదు.. కార్తీక్, మృదుల కూడా తల తిప్పి చూశారు.

ఓ నాలుగేళ్ళ పాప పరుగెత్తుతుంటే.. వెనకాల వాళ్ళ అమ్మ “హసంతీ! ఆగు, ఆగమంటుంటే..” అని వెనకాల వస్తోంది.

హసంతి తనని కాదనుకొని తల తిప్పబోతుంటే కార్తీక్, అతని పక్కన మృదుల కనిపించారు. ‘అవునా? కాదా?’ అన్నట్టు మళ్లీ చూసింది. యూ-ట్యూబ్ ఛానల్‌లో కార్తీక్ పక్కన చూసిన మృదులను గుర్తుపట్టింది.

నవ్వుతూ ఏదో చెబుతోంది. కార్తీక్ సీరియస్‌గా మొహం పెట్టి వింటున్నాడు.

“మళ్లీ ఏమైంది రా బాబూ! హసంతి పేరు వింటేనే, నీ మూడ్ మారిపోతోంది. నవ్వరా!” అని అతని గడ్డం పట్టుకుని లాగింది.

దూరం నుంచి చూస్తున్న హసంతికి వాళ్ళిద్దరూ నిజంగా లవర్సే అనిపించింది.

‘ఛా! ఈ కార్తీక్‌కి క్యారెక్టర్ లేనట్టుంది’ అనుకుంది.

“హసంతీ! ఏదో చెబుతానన్నావుగా! ఇప్పుడు చెప్పు” అన్నాడు గౌతమ్.

“ఇప్పుడు మూడ్ లేదు”

‘ఇతని కోసమా! నేను ఇంతగా ఆరాటపడుతోంది’ అనుకుంది.

“చెప్పు.. పర్లేదు”

“వెళ్ళిపోదాం పద గౌతమ్! మంచి కాఫీ తాగాలని ఉంది” కార్తీక్‌కి కనిపించకుండా వెళ్ళిపోవాలన్న తొందర్లో గౌతమ్‌ని తొందరపెట్టింది.

“ఇప్పుడే వచ్చాం కదా! కాసేపు ఉండి వెళ్దామా! పార్క్ బాగుంది”

“ప్లీజ్ గౌతమ్! మరెప్పుడైనా వద్దాం! రా! వెళ్లి కాఫీ తాగుదాం”

“సరే పద..” అని బైక్ దగ్గరకు వచ్చారిద్దరూ.

“ఇప్పుడు చెప్తా.. అడ్డు చెప్పకుండా విను..”

బుద్ధిమంతుడిలా చేతులు కట్టుకొని ‘సరే’ అన్నాడు గౌతమ్.

“జీవితంలో కొంతమంది చెయ్యి పట్టుకున్నప్పుడు జీవితాంతం ఆ చేతిని వదలకూడదనిపిస్తుంది. నీ చేయి పట్టుకున్నప్పుడు నాకు అలాగే అనిపించింది. ఇది ప్రేమా!, స్నేహమా! నాకు ఎలా చెప్పాలో తెలియటం లేదు” అంది.

అంతే! ఆమె మాటలకి గౌతమ్ మనసు “ఎన్నెన్నో జన్మల బంధం నీదీ.. నాదీ” పాట పాడింది.

‘గొడవపడితే ఎవరైనా విడిపోతారు. కానీ జరిగిన గొడవను మర్చిపోయి, హ్యాపీగా ఉన్నవాళ్లే నిజమైన ప్రేమికులు అనుకుంది’ హాసంతి మనసులో.

***

అర్ధరాత్రి 12 గంటలకు కార్తీక్ తన చేస్తున్న షార్ట్ ఫిలింకి రీ-రికార్డింగ్ కీ బోర్డు మీద కంపోజ్ చేస్తున్నాడు. ఫోన్ మోగింది.

“హలో!”

“కార్తీక్ మీరేనా?” అవతలి వైపు అమ్మాయి గొంతు.

“ఎస్”

“మీరు మొన్న ఓ అమ్మాయిని కలిసి ఫోన్ నెంబర్ ఇచ్చారు కదా!”

 అంతే! కార్తీక్ కుర్చీలో నుంచి లేచి నిలబడి “ఒరిజినల్ హాసంతి మీరేనా!?!” అన్నాడు

“నో .. నో.. కాదు. నేను హసంతి ఫ్రెండ్ ధృతి”

“ఓ!” అన్నాడు నీరసంగా

“మీరు ఎందుకు హసంతి కోసం వెతుకుతున్నారు?”

“కవిత ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది మీరేనా?”

“నేనే. అది హసంతి తన లవర్ కోసం రాసింది. తనని కలిసినప్పుడు చూశాను. బాగుందనిపించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాను”

“హు .. ఆ లవర్ నేనేనండి. కార్తీక్‌ని.” అన్నాడు ఎక్సైటింగ్‌గా.

“లవరా!? మీరా!?” అందామె రెట్టింపు ఆశ్చర్యంగా.

“హసంతి నన్ను ప్రేమిస్తోందన్న విషయం నాకు తెలియదు. కానీ ఆమె నాకు అందమైన గిఫ్ట్ ప్యాక్ పంపింది. అందులో ఉన్న డైరీలో ఆమె రాసిన ప్రతి అక్షరం నా కోసమే. పంపిన ప్రతి గిఫ్ట్ నాకు అమూల్యమే. ఆమె నన్ను ఎంతగా ఇష్టపడుతోందో వాటిని చూశాక అర్థమైంది. మనం ప్రేమించే వాళ్ళ కంటే, మనల్ని ప్రేమించే వాళ్ళు దొరకడం అదృష్టం అని అంటారు కదా! అలాంటి అదృష్టమే నన్ను వలచిన అశాంతి. అందుకే ఆ క్షణమే నిర్ణయించుకున్నాను చేసుకుంటే హసంతినే చేసుకోవాలని. ఇప్పుడు ఆమెను చూడటానికి, కలవడం కోసం అన్వేషిస్తున్నా! ఎప్పుడో.. ఎక్కడో!” అని శ్రీరామ్ చెప్పిన విషయాలు, హసంతి ఇచ్చిన గిఫ్ట్ గురించి చెప్పాడు.

“అన్నీ నిజాలే! కానీ మీరు ఇప్పుడు ఆమెను చూడలేరు”

“ఎందుకు? ఏమైంది?”

“ఇప్పుడు తనిక్కడ లేదు”

“మీరు అబద్ధం చెబుతున్నారు హసంతి నా పక్కనే ఉంది. నేను ఆమెను చూడలేకపోవచ్చు. కానీ ఆమె ఎలా ఉంటుందో తెలియకపోయినా, అనుక్షణం నాతో ఉన్నట్టే ఉంది. ఒకళ్ళన్నొకళ్ళు చూసుకొని సంవత్సరాల తరబడి ప్రేమించుకన్న వాళ్ళు, అదే అమ్మాయిని చేసుకుంటారన్న అ గ్యారెంటీ లాస్ట్ మినిట్ వరకు లేదు. కానీ నా ప్రేమ అలా కాదు హసంతి అదృశ్యంగా ఉండి నన్ను ఇష్టపడటం, ప్రేమించటం అరుదుగా జరిగే విషయం. తను కన్పించే వరకూ అన్వేషిస్తూనే ఉంటాను” అన్నాడు ఉద్వేగంగా.

“మీరు చెప్పేది నాకు అర్థం అవుతోంది కానీ..”

“ఇంతకు మించి మీకు ఎలా వివరించి చెప్పాలో నాకు కావటం లేదు. మీరు ఇప్పుడు నా ఎదురుగా ఉంటే, మీ కాళ్ళు పట్టుకుని హసంతిని వెంటనే చూపించమని అడిగి ఉండేవాడిని” అన్నాడు కార్తీక్.

“అయ్యో! అలా అనకండి. కావాలంటే తన అడ్రస్ ఇస్తా! కానీ నేను ఇచ్చినట్టు మాత్రం చెప్పకండి” అంది ధృతి.

“థాంక్స్ అండీ! థాంక్స్ ఎ లాట్”

“ఓ.కే వాట్సప్‌లో షేర్ చేస్తాను” అని ఫోన్ పెట్టేసింది.

ఆ తర్వాత కార్తీక్కి నిద్రపట్టలేదు. ధృతి పంపే వాట్సప్ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నాడు.

పది నిమిషాల తర్వాత ధృతి మెసేజ్ వచ్చింది. చూసి ఎగిరి గంతేశాడు.

కీబోర్డ్ మీద..

‘ప్రేమించే.. ప్రేమవా

ఊరించే.. ఊహవా..’

పాట ప్లే చేశాక కానీ అతని సంతోషం సద్దుమణగలేదు.

అప్పుడు కాలింగ్ బెల్ మోగింది. ఎదురుగా ఇంటి ఓనరు.

“సారీ! అంకుల్ రేపు రీ-రికార్డింగ్ ఉంది”

“అందుకే మా ఆవిడ బ్యాచిలర్‌కి గది ఇవ్వొద్దంది. కింద మనుషులు ఉన్నారని లేకుండా అర్ధరాత్రి ఈ వాయిద్య కచేరీ ఏంటి?” అని విసుక్కుంటూ వెళ్లిపోయాడు.

తలుపేసి హసంతి పంపిన వస్తువుల్ని చూపులతో ఆప్యాయంగా తడిమాడు. మంచం మీద పడుకుని కిటికీలో నుంచి పున్నమి చంద్రుణ్ణి చూస్తుంటే.. హసంతి నక్షత్రాలు మధ్య నిలబడి

“నా అడ్రస్ కావాలా? అయితే రాసుకో..

మెరుపు చుక్కల వీధి,

జాబిల్లి ఊరు,

గాలి పరదాలు,

నీలి అంచుల తోరణాలు,

ఆహ్వానం పలికే వాకిలి,

అక్కడికి వస్తే.. నా నగుమోము బింబం నీకు కనిపిస్తుంది. ఇద్దరం కలిసి మా వెన్నెల వాడలో విహరిద్దాం. రా!” అన్నట్టు అనిపించింది.

ఈ క్షణమే నిన్ను చూడాలని మనసు తహతహలాడుతోంది హసంతీ!. రేపు మనం కలుసుకుబోయే క్షణం ఎంత మధురంగా ఉంటుందో!? అది మాత్రం జీవితంలో మరపురాని రోజుగా మార్చుకుందాం హసంతీ! ఆమె తలపులతో కార్తీక్‌కి నిద్ర పట్టేసరికి రాత్రి పగలు అవటానికి సిద్ధమవుతోంది.

***

ఉదయం 5 గంటలు:

గౌతమ్ నిద్రలేచి సెల్‌ఫోన్‌లో తల్లి ఫోటో, చూసి తర్వాత హసంతి పిక్ చూశాడు.

వాట్సప్‌లో ‘గుడ్ మార్నింగ్’ మెసేజ్ పంపాడు. బదులు వస్తుందో!, రాదోనని క్యూరియస్గా ఎదురు చూశాడు. కాసేపటికి ‘వెరీ గుడ్ మార్నింగ్’ హసంతి నుండి రిప్లై వచ్చింది.

గౌతమ్ మొహంలో చిరునవ్వు.

“నా మెసేజ్ నీ నిద్రను డిస్ట్రబ్ చేసిందా?!”

“నేను అలా అన్నానా?” రిప్లై వచ్చింది.

“లేదు, కానీ నా రాజకుమారికి నిద్రాభంగం కలగకూడదని”

“అదేం లేదు. ఇష్టమైన వాళ్ళు డిస్టర్బ్ చేస్తే నిద్ర పారిపోతుంది”

“హ్హ..హ్హ..హ్హ”

“మెల్లగా నువ్వు. మెల్లగా నవ్వితే నీ నవ్వు చాలా బాగుంటుంది”

“థాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్”

“ఇంత పొద్దున్నే నిద్ర లేచి ఏం చేస్తావు గౌతమ్!”

“వాకింగ్‌కి వెళ్తా!”

“అయితే వెళ్లి రా! నాకు నిద్ర వస్తోంది”

“సారీ ఫర్ ద డిస్ట్రబెన్స్”

“అయిన దానికి, కాని దానికి సారీ ఎందుకురా కాబోయే మొగుడా! నన్ను డిస్ట్రర్బ్ చేయటం నీ హక్కు” అంది.

“హసంతీ! నువ్వేనా? ఇలా మాట్లాడుతోంది. నీలో ఇంత హ్యూమర్ ఉందా?”

“అప్పుడే ఏం చూసావ్! ముందు.. ముందు.. ఊఁ..ల..ల..ల్లా”

అంతలో నిద్రలేచిన తండ్రిని చూసి..

“ఇవాల్టికి చాలు. తర్వాత కాల్ చేస్తా”

“ఓ.కే”

“హసంతీ! వన్ మినిట్ నీకో మాట చెప్పనా!?”

“వ్వాట్?”

“నిన్ను ప్రేమించడం, ఆరాధించడం నా లైఫ్‌లో సెకండ్ బెస్ట్ థింగ్ తెలుసా!”

“సెకండ్ బెస్టా?!?”

(ఏడుస్తున్న ఎమోజి పెట్టింది)

“ఫస్ట్ ఏంటో తెలుసా! చిన్న వయసు నుండే నువ్వు నా జీవితంలోకి రావడం.”

“ఓ..హో!”

(నవ్వుతున్న ఎమోజి)

ఇద్దరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మెసేజెస్ పంపుకుంటూనే ఉన్నారు. గౌతమ్ వాకింగ్ సమయాన్ని సూర్యుడికి ఇచ్చేశాడు. మాటల మధ్యలో హసంతి ‘గుల్ఫీ’ అంది.

“గుల్ఫీ అంటే..!”

“గుల్ఫీ అంటే ఐస్క్రీం”

“ఆఁ.. చిన్నప్పుడు ఇది నీకు ఊత పదం. ఆటల్లో ఓడిపోతే ఏడుస్తూ, ఉక్రోషంతో ‘పోరా గుల్ఫీ’ అనేదానివి. అప్పుడు నేను ఓడిపోయి, నిన్ను గెలిపించేవాడిని” అన్నాడు.

“నిజమా! నా గుర్తులేదు. ఇదొక్కటేనా? నీ బాల్య జ్ఞాపకాల చిట్టాలో ఇంకేమైనా ఉన్నాయా? ఉంటే చెప్పు.. చెప్పు..” అంది చిన్నపిల్లలా.

“అమ్మో ఇప్పుడు నాతో మన ‘బాల్యభారతం’ కథలు చెప్పించేట్టున్నావు” అన్నాడు.

 అంతలో హసంతి వాళ్ళమ్మ “హసంతీ! పొద్దున్నే డాబా మీద ఎవరితో మాట్లాడుతున్నావు?” అంది.

“గౌతమ్‌తో” అంది ఫోన్ ఆఫ్ చేయకుండా

“ఎవరు హసంతీ” అన్నాడు గౌతమ్.

“మా అమ్మ”

“హసంతీ! హసంతీ! హసంతీ!” ఫోన్‌లో గౌతమ్ మూడుసార్లు పిలిచాడు.

“ఏంటి? కోర్టులో పిలిచినట్టు”

“ఎన్నిసార్లు అయినా పిలుస్తాను. ఇన్నాళ్ళకి నీ పేరుని నోరారా పిలిచే అవకాశం దొరికింది. మూడుసార్లు కాదు మూడు వేల సార్లు పిలుస్తాను నా ఇష్టం” అన్నాడు.

“ఉంటాను గౌతమ్. మా అమ్మ పిలుస్తోంది” అని లవ్ సింబల్ పంపి, మెసేజెస్ ఆపేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here