ఫస్ట్ లవ్-16

1
12

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[ధృతి ఇచ్చిన అడ్రస్ ప్రకారం హసంతి ఇల్లు వెతుక్కుంటూ వచ్చి కాలింగ్ బెల్ కొడతాడు కార్తీక్. తలుపు తీసిన హసంతి అతన్ని చూసి విస్తుపోతుంది. శిలలా నిలబడిపోయిన ఆమెను చూసి హసంతీ అని పిలుస్తాడు. మొన్న స్టార్‍బక్స్ కేఫేలో నన్ను చూసి కంగారుగా వెళ్ళిపోయింది మీరే కదా అంటాడు. మీరు హసంతే కదా అని అంటాడు. కాదంటుంది. అబద్ధం చెప్పద్దంటాడు. నాకు ఫేస్ రీడింగ్ తెలుసని, మీరే హసంతి అని కార్తీక్ అంటుండగానే, తలుపు వేసేస్తుంది. నిర్ఘాంతపోతాడు కార్తీక్. లోపలికి వచ్చిన హసంతి తన గదిలోకి వెళ్ళి ఏడుస్తుంది. కాసేపటికి ధృతి వచ్చి, కార్తీక్ వచ్చాడా అని అడిగితే, కార్తీక్ నీకెలా తెలుసని ఎదురు ప్రశ్నిస్తుంది హసంతి. జరిగినదంతా తెల్సుకున్న ధృతి – గౌతమ్‍కి చెప్పేసి, కార్తీక్‍నే పెళ్ళి చేసుకోమంటుంది. ఈ విషయం తనతో మాట్లాడద్దని హసంతి, అంటే, ధృతి వెళ్ళిపోతుంది. ఓ గంట తరువాత ఫ్రెష్ అయి కిందకి దిగబోతూ బాల్కనీ నుంచి చూస్తే, రోడ్డు మీద కార్తీక్ కనిపిస్తాడు. తల్లి చూడకుండా బయటకు వెళ్ళి, ఇంకెప్పుడూ ఇటువైపు రావద్దని కార్తీక్‍ని బ్రతిమాలుతుంది. ధృతి నీ అడ్రస్ ఇచ్చిందనీ, మృదుల తన్ ఫ్రెండ్ అనీ చెప్పి, శ్రీరామ్ ద్వారా తనకి పంపిన గిఫ్ట్‌లన్నీ చూపిస్తాడు. ఈలోపు హసంతి ఫోన్ మ్రోగుతుంది. గౌతమ్ చేస్తున్నాడు. నేను వెళ్తాను అంటూ వచ్చేస్తుంటే, చేయి పట్టుకుని ఆపుతాడు కార్తీక్. మళ్ళీ గౌతమ్ కాల్ వస్తుంది. మర్నాడు మధ్యాహ్నం ఒంటిగంటకి చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఎదురు చూస్తాననీ, హసంతి రాకపోతే, ఇంక తనకెప్పుడూ కనిపించనని చెప్తాడు కార్తీక్. ఇక చదవండి.]

[dropcap]మ[/dropcap]రుసటి రోజు..

“హసంతీ!10 గంటలు అవుతున్నా, ఇంకా నిద్ర పోతున్నావు. పెళ్లి కావాల్సిన పిల్లవు. రేపు అత్తారింటికి వెళ్ళాక ఇలా పడుకుంటే ఊరుకుంటారా?” అంది తల్లి.

“ఈ రోజు శనివారమే కదా! అమ్మా! ఆఫీస్ లేదుగా!” అంది.

“సరే! త్వరగా ఫ్రెష్ అయి రా! కాఫీ కలుపుతా!” అని కిందికి వెళ్ళింది కవిత.

తర్వాత తల్లితో కలిసి కాఫీ తాగుతూ..

“అమ్మా! పెళ్లయితే స్వేచ్ఛ కోల్పోతామా?” అంది.

“ఏంటే కొత్తగా అడుగుతున్నావు? స్వేచ్ఛ కోల్పోయినట్టు కలేమైనా వచ్చిందా?”

“మా ఫ్రెండ్స్ అంటున్నారు. నిజమా? కాదా?”

“కొంతవరకు నిజమే. కానీ గౌతమ్ వాళ్ళ ఇంట్లో నీకు అలాంటి ప్రాబ్లం ఉండదు కదా! రఘురాం మావయ్య నిన్ను బంగారంలా చాలా బాగా చూసుకుంటాడు.”

“గౌతమ్ కోహినూరు డైమండ్‌లా చూసుకుంటాడు” అంది హసంతి.

“ఎలా చూసుకుంటారు తర్వాత తెలిసేది. ఎక్కువగా ఆలోచించకు” అంది కవిత.

గంట తర్వాత..

“అమ్మా! కబోర్డులో పెట్టిన నా పెయింటింగ్ బాక్స్ కనిపించడం లేదు. చూసావా?” అడిగింది హసంతి.

“ఇప్పుడు నువ్వు పెయింటింగ్స్ వేయటం లేదుగా! అందుకని నీ బెడ్ రూమ్‌లో కబోర్డ్ పైన పెట్టాను”

హసంతి వెళ్లిపోయింది.

కాలింగ్ బెల్ మోగింది. కవిత తలుపు తీసి రఘురాం, గౌతమ్‌లని చూసి “రండన్నయ్యా! రా గౌతమ్!” అంది.

“కవితా! పిల్లలు బాగున్నారా?” అడిగాడు రఘురాం.

ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు.

“నిన్న పంతులు గారిని కలిసి వచ్చాను. వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయట. 14, 28 తేదీల్లో వీళ్లిద్దరి పేరున బాగుందట” అన్నాడు.

“చాలా సంతోషం అన్నయ్యా!”

“మంచి రోజు చూసి పెళ్ళి పనులు మొదలు పెట్టాలి”

“గౌతమ్, హసంతి కలిసి వాళ్ల బట్టల షాపింగ్ చేసుకుంటారు. పెళ్లి బట్టలకు మాత్రం అందరం కలిసి వెళ్దాం అన్నాడు” రఘురాం.

“అలాగే అన్నయ్యా! ఉండండి కాఫీ తీసుకొస్తాను” లోపలికి వెళ్ళింది కవిత.

“హసంతి ఇంట్లో లేదా?”

“పై గదిలో ఉంది వెళ్ళు.. గౌతమ్!” అంది కవిత.

గౌతమ్ నవ్వుతూ పైకొచ్చాడు.

గది ముందున్న ఖాళీ ప్రదేశంలో హసంతి కూర్చొని కాన్వాస్ బోర్డు మీద పెయింటింగ్ వేస్తోంది. వెనుక నుంచి వచ్చిన గౌతమ్ ఆశ్చర్యంగా “హసంతీ! నీకు పెయింటింగ్ వెయ్యటం తెలుసా? బ్యూటిఫుల్.. చాలా బాగుంది” అన్నాడు.

“రా గౌతమ్!” అంది నవ్వుతూ.

“నువ్వు పెయింటింగ్ వేస్తావని నాకు తెలియదే”

“నీకు ఎలా తెలుస్తుంది గౌతమ్. మనం చూసుకుని 10 ఏళ్ల పైనే అయిందిగా!”

“ఎక్కడైనా నేర్చుకున్నావా?”

“లేదు”

“రెగ్యులర్‌గా వేస్తుంటావా ?”

“లేదు.. ఎప్పుడైనా ఎక్కువ హ్యాపీగా ఉన్నప్పుడో, లేదా శాడ్‌గా ఉన్నప్పుడో, లేదా బోర్ కొట్టినప్పుడో.. మనసు తేలిక పడటం కోసం వేస్తుంటాను.”

“నేనూ సింగపూర్ వెళ్ళాక స్కూలింగ్‌లో ఉన్నప్పుడు కొన్నాళ్లు నేర్చుకున్నాను. కానీ కంటిన్యూ చేయలేదు.”

“ఏమిటి సంగతులు?”

“బయటికి వెళ్దామా?”

“వద్దు గౌతమ్! వచ్చే మూడ్ లేదు”

“సరే! నీకో సర్‌ప్రైజ్. కళ్ళు మూసుకో!” అన్నాడు.

హసంతి కళ్ళు మూసుకుంది. ఆమె చేతిలో ఉన్న బ్రష్ తీసి పక్కన పెట్టి, ఆమె వేలికి అందమైన డైమండ్ రింగ్ తోడిగాడు.

కళ్ళు తెరిచి “వావ్! చాలా బాగుంది. ఇప్పుడేం సందర్భంగా లేదుగా!” అంది మురిపెంగా.

ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని “నా మొదటి జీతంలో నీకోసం చేయించాను.”

గౌతమ్ వైపు విస్మయంగా చూసింది.

“ఇదిగో యాపిల్ ఐ ఫోన్. ఎంగేజ్మెంట్ అప్పుడు నీకు ఇద్దామని తెచ్చాను. ఆ రోజు తర్వాత ఇచ్చే అవకాశం రాలేదు.”

“గౌతమ్!” అంది అతని చేతిని సున్నితంగా నిమురుతూ.

“మదర్ ప్రామిస్ హసంతీ! నా చివరి శ్వాస వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి ప్రయత్నిస్తాను”

“థాంక్యూ! గౌతమ్. నేను కూడా నీకు అనుకూలంగానే ఉంటాను. అయినా ఈ రోజు వాలెంటైన్ డే కాదు కదా! గిఫ్ట్ మీద గిఫ్ట్‌లు ఎందుకు ఇస్తున్నావు?”

“మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో ఆ రోజే మనకి వేలంటైన్ డే. మన పెళ్లి తర్వాత కూడా ప్రతిరోజు ప్రేమికుల రోజుగా మార్చుకుందాం” అన్నాడు.

హసంతికి వెంటనే.. ‘ప్రేమ అనే పరీక్ష రాసి, వేచి ఉన్నా విద్యార్థిని’ ప్రేమికుల రోజులో పాట గుర్తొచ్చి మనసులోనే పాడుకుంది.

అంతలో.. “ఇంకో సర్ప్రైజ్ ఉంది. ఉండు తీసుకొస్తాను” అని కిందకి వెళ్ళాడు.

గౌతమ్‌ని ఎలా అర్థం చేసుకోవాలో తనకే ఇన్నాళ్లు అర్థం కాలేదేమో! చిన్న వయసులో కలిసి ఆడుకున్నాం, పాడుకున్నాం, కలిసి పెరిగాం, అది స్నేహమో, ప్రేమో అర్థం కావటం లేదు. నేను దానిని స్నేహం అనుకుంటే, గౌతమ్ ప్రేమ అనుకుంటున్నాడు. ఏదో అర్థం కాక క్రాస్ రోడ్స్‌లో ఉన్నది నేనే. కానీ గౌతమ్ క్లారిటీతో పెళ్లి వరకు తీసుకొస్తాడని ఏనాడూ ఊహించలేదు.

అంతలో గౌతమ్ ఓ బాక్స్ చేతుల్లో పదిలంగా పట్టుకుని ఎదురుగా వచ్చి నిలబడగానే లేచి నుంచుంది. ఆ బాక్స్ చూడగానే తను కార్తీక్‌కి పంపిన గిఫ్ట్ బాక్స్‌లా అనిపించింది.

“ఇందులో చిన్న వయసు నుండి నీ కోసం దాచిపెట్టుకున్న జ్ఞాపకాలు” అని గౌతమ్ అంటుంటే, వెంటనే కార్తీక్ కోసం సేకరించి పంపిన వస్తువులు కళ్ళ ముందు కదిలాయి. వేగంగా ఆమె చెవిలో కార్తీక్ అన్న మాటలు ప్రతిధ్వనించాయి.

‘రేపు ఒక్కరోజూ.. నీ ఆలోచనలో ఒక్క సెకండ్ కూడా నేను గుర్తు రాకపోతే నువ్వు నాకోసం రావద్దు’.

గౌతమ్ బాక్స్ తెరిచి ఏదో చూపించబోతుంటే.. హసంతి సెల్‌ఫోన్‌లో టైం చూసుకుని,

“గౌతమ్ ఏమీ అనుకోవద్దు. నాకు అర్జెంటుగా పనుంది. మా ఫ్రెండ్‌ని కలవాలి. వస్తానని చెప్పాను” అని గబగబా కిందికి వస్తూ వేగంగా మెట్లు దిగుతుంటే,.. రఘురాంతో మాట్లాడుతున్న కవిత చూసి

“హసంతీ! ఎక్కడికి వెళ్తున్నావు?” అంది.

“అమ్మా! అర్జెంటుగా ఫ్రెండ్‌ని కలవాలి. నీకు చెప్పటం మర్చిపోయాను. తను వెయిట్ చేస్తోంది” అని వెళ్ళబోతుంటే,

“నువ్వు ఎక్కడికీ వెళ్ళొద్దు. మామయ్య, గౌతమ్ ఇంట్లో ఉన్నారు. కావాలంటే మీ ఫ్రెండ్‌నే ఇంటికి రమ్మను.”

“అమ్మా! అర్థం చేసుకో ప్లీజ్! అర్ధగంటలో వస్తాను”

వెంటనే రఘురాం కల్పించుకుని “వెళ్లనీ! చెల్లెమ్మా! ఫ్రెండ్‌ని కలవాలని చెప్పింది కదా!” అన్నాడు.

పైనుంచి దిగుతున్న గౌతమ్ హసంతి వైపు చూసాడు.

“అత్తయ్యా! తనని వెళ్ళనివ్వండి. అర్జెంట్ అంటోంది కదా!” అన్నాడు.

“వెళ్లిరా! హసంతీ!”

“సరే మామయ్యా!”అని హసంతి వేగంగా వెళ్ళింది.

“పెళ్లికి ముందే తండ్రీ, కొడుకులు హసంతికి ఇలా సపోర్ట్ చేస్తుంటే, నేనేం మాట్లాడేది?” అంది కవిత.

***

హసంతి రోడ్డు మీద వేగంగా వెళ్తోంది.

గౌతమ్ ఫ్రెండ్ సుధాకర్ రోడ్డు పక్కగా బైక్ ఆపి, ఫోన్లో మాట్లాడుతూ, యథాలాపంగా రోడ్డుమీద వెళ్తున్న హసంతిని చూసాడు. గౌతమ్‌కి కాల్ చేశాడు.

“హలో! గౌతమ్ ఎక్కడున్నావు రా?”

“హసంతి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. నువ్వు ఇక్కడికి వచ్చేయ్”

“నేను దగ్గరలోనే ఉన్నాను. కానీ, నువ్వు హసంతి వాళ్ళ ఇంట్లో ఉంటే.. హసంతి ఎక్కడికి వెళ్తోంది రా! గబగబా ఇప్పుడే ఆటో ఎక్కింది.. మొహం సీరియస్‌గా ఉంది.”

“అవునా!” అన్నాడు ఆశ్చర్యంగా గౌతమ్.

***

చిల్డ్రన్స్ పార్క్ గేటు దగ్గర చెట్టు కింద నిలబడి కార్తీక్ టైం చూసుకుంటూ, హసంతి కోసం ఎదురు చూస్తున్నాడు.

‘ఏంటి హసంతి ఇంకా రాలేదు? హ్యాండ్ ఇచ్చిందేమో!’ అనుకున్నాడు .

అంతలో ఆటోలో నుంచి హసంతి దిగి, కార్తీక్ ముందుకు వచ్చి నిలబడింది. ఆమె మొహంలో సంతోషం, ఆనందం తొణికిసలాడుతోంది. చిరునవ్వుతో తన ముందు నిలబడ్డ హసంతిని చూసి..

“నువ్వు వస్తావని నాకు తెలుసు హసంతీ! నన్ను నువ్వు మర్చిపోలేవు. నా పరిస్థితి అదే. జీవితంలో తొలిప్రేమని ఎవరూ మర్చిపోలేరు. వదులుకోలేరు. ఇప్పుడు నిజం చెప్పు. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తున్నావు కదా!” అన్నాడామె చేతులు పట్టుకుని.

హసంతి ప్రేమగా కార్తీక్‌ను చూసి, “అవును. అందుకేగా నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నిన్నటి నుంచి నిన్ను గుర్తు చేసుకోని క్షణం లేదు” అంది.

“నువ్వు నన్ను గుర్తు పెట్టుకున్నావేమో! గానీ నేను నిన్ను గుండెల్లో దాచుకున్నాను. గుర్తుపెట్టుకున్నది ఎప్పుడైనా మర్చిపోవచ్చు. కానీ గుండెల్లో ఉన్నది ఆ గుండె ఆగే వరకు మాసిపోదు” అని కార్తీక్ అంటే వెంటనే..

“నేను రాసిచ్చిన కవిత నాకే అప్ప చెబుతున్నావు కదూ!” అంది అందంగా నవ్వుతూ.

“ఓసారి గుర్తు చేద్దామని” అన్నాడు.

“మర్చిపోతే కదా గుర్తు చేయడానికి” అంది.

“ఎవర్ని నన్నా? కవితనా?”

హసంతి ఏమీ మాట్లాడకుండా కార్తీక్‌ని చూస్తుంటే..

“ఏదైనా చెప్పు హసంతి” అన్నాడు.

“గొంతులో ఉన్న మాట అయితే నోటితో చెప్పగలను.. కానీ గుండెలో ఉన్న మాటను కేవలం కళ్ళతోనే చెప్పగలను” అంది అతని చేతులు పట్టుకుని.

అంతలో ఆటో హార్న్ సౌండ్ వినిపించడంతో కార్తీక్ కళ్ళు నులుముకున్నాడు. చెయ్యి గిల్లుకున్నాడు. తన ముందున్న హసంతి కనిపించలేదు. మళ్లీ టైం చూశాడు. ఆటో ఆగకుండా వెళ్ళిపోయింది.

అంతలోని మరో ఆటో వచ్చింది. అందులో నుంచి దిగిన హసంతి వేగంగా కార్తీక్ ముందుకొచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహమంతా జేవురించినట్టుంది. అతని చూడడంతో కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆమెకి.

కార్తీక్ కంగారుగా “ఏమైంది? హసంతీ!” అన్నాడు కంగారుగా.

“…….. “

“నువ్వొస్తావని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నన్ను మర్చిపోలేవని నాకు తెలుసు. ఇవి ఆనందబాష్పాలే కదా!” అని వేలితో ఆమె చెంపల మీద కన్నీరు తుడబోతుంటే.. వేగంగా వెనక్కి జరిగింది.

“మర్చిపో! కార్తీక్! నన్ను పూర్తిగా మర్చిపో! ప్లీజ్. ముందు నేను ఏం చెప్పటానికి వచ్చానో విను. నన్ను చెప్పనివ్వకుండా, నువ్వే ఏదేదో ఊహించుకుని మాట్లాడుతున్నావు” అంది కోపంగా.

ఆమె మాటలకి ఆమెను చూసిన సంతోషం ఆవిరైపోయింది. కార్తీక్ మొహం గంభీరంగా మారింది.

“చెప్పు” అన్నాడు.

“కార్తీక్! ఇంకెప్పుడూ నన్ను వెతుక్కుంటూ మా ఇంటి వైపు రావద్దు. మా ఇంట్లో నాకు పెళ్లి ఫిక్స్ చేశారు”

“హసంతీ! నన్ను ఆట పట్టించడానికే కదూ! ఇలాంటివి చెప్పి నన్ను హర్టు చెయ్యకు ప్లీజ్”

“నేను ఇంత సీరియస్‌గా చెప్తుంటే ఆటలు, నవ్వులు అంటావేంటి కార్తీక్! నిజమే చెబుతున్నా. అనవసరంగా నా గురించి ఆలోచిస్తూ నీ ఫ్యూచర్ పాడు చేసుకోకు. దయచేసి నన్ను మర్చిపో ప్లీజ్!”

“ఇది చెప్పటానికా ఇంత దూరం నా కోసం వెతుక్కుంటూ వచ్చావు? యు కెన్ కాల్ మీ అండ్ టెల్. నా మీద ఉన్న ప్రేమే నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది”

“కాల్ చేసి చెప్పటానికి నా దగ్గర నీ ఫోన్ నెంబర్ లేదు”

“నన్ను ప్రేమించడానికి నీకు నా అనుమతి అక్కర్లేదు. నన్ను అడగకుండానే నువ్వు ఎప్పుడూ నాకు గుర్తు ఉండాలని ప్రేమ కవితలు, గిఫ్ట్‌లు, అడ్వైజ్‌లు, ఆప్యాయతలు పంపావు. ఎప్పుడూ నువ్వు నాతో తోడుండాలని చేతికి ఈ కంకణం పంపావు. ఇవన్నీ అవతల పారేసి, నిన్ను మర్చిపోమ్మనే హక్కు నీకుందా? పైగా ‘ఎంగేజ్మెంట్ అయింది, నన్ను కలవకు’ అని మొహం మీదే అంత కఠినంగా ఎలా చెప్తున్నావు హసంతి. నిన్ను ప్రేమించే హక్కు నాకు ఉంది. అది నా ఇష్టం. ఇంకోసారి ఇలా మాట్లాడుకు” అన్నాడు కోపంగా.

“నేను నిజమే చెబుతున్నాను కార్తీక్! వచ్చే నెలలో నా పెళ్లి జరగబోతోంది. దయచేసి జరిగిందంతా కల అనుకుని మర్చిపో. నన్నే తలుచుకుంటూ నీ లైఫ్ పాడు చేసుకోవద్దు. నేను వెళ్తాను” అంది జీరబోయిన గొంతుతో.

“ఒక్క నిమిషం ఆగు హసంతీ! నన్ను నీ మనసులో నుండి తీసిపారేయాలని నువ్వు ఎంత ప్రయత్నించినా ఏదో ఒక మూల నేను ఉంటూనే ఉంటాను. బి కాజ్ ఫస్ట్ లవ్, తొలిప్రేమ. నాకూ అంతే. నిజాయితీగా నా కళ్ళలోకి చూసి చెప్పు. నిన్నటి నుంచీ ఒక్కసారి కూడా నేను గుర్తు రాలేదని”

మెల్లగా వంచిన తలపైకి ఎత్తి ఒక్క క్షణం చూసింది.

“చెప్పానుగా! నాకు ఫేస్ రీడింగ్ తెలుసని. నీ కళ్ళు నిజం చెప్తున్నాయి. నా జ్ఞాపకాలు రాత్రంతా నిన్ను నిద్రపోనివ్వలేదు. అలాగే నా కళ్ళు నీకు చెబుతాయి నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో!”

అంతే! ఆ పై కార్తీక్ కళ్ళలోకి చూడలేక, రాలటానికి సిద్ధంగా ఉన్న కన్నీళ్లు తుడుచుకుంటూ వేగంగా వెళ్ళిపోయింది.

సరిగ్గా అప్పుడే సుధాకర్ బైక్ మీద వెనకాల కూర్చుని అక్కడికి గౌతమ్ వచ్చాడు.

దూరంగా నిలబడ్డ కార్తీక్‌నీ, ఏడుస్తూ వెళుతున్న హసంతినీ చూశాడు గౌతమ్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here