ఫస్ట్ లవ్-18

0
11

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[కార్తీక్ ఫోటోలని చూసి తల్లి తనని తిడుతున్నట్లు కలగంటుంది హసంతి. హఠాత్తుగా మెలకువ రాగానే, లేచి కప్‍బోర్డు లోంచి కార్తీక్ ఫోటోలని తీసి, వాష్‌రూమ్‍లో వాటికి నిప్పంటిస్తుంది. అవి కాలి బూడిదయ్యాకా, కమోడ్‍ ఫ్లష్ చేసి గదిలోకి వస్తుంది. ఎదురుగా గౌతమ్ ఇచ్చిన మొబైల్ కనబడగానే, అతనికి మెసేజ్ చేస్తుంది. కానీ జవాబు రాదు. ఆలోచనలలో కార్తీక్, గౌతమ్ మెదులుతుంటే, ఎప్పటికీ నిద్రపడుతుందామెకు. పార్కులో కార్తీక్‍ని హసంతిని చూసి చిరాగ్గా ఇంటికి వస్తాడు గౌతమ్. అతని మనసంతా గందరగోళం. కళ్ళు మూసుకుంటే, అతని తల్లి కనబడి.. అతని ఆలోచనలు తప్పని, హసంతి మనసు తెలుసుకోమంటుంది. హసంతిని మర్చిపోలేక, ఆమెని తానే పెళ్ళి చేసుకోవాలని అనుకుంటాడు కార్తీక్. రాత్రి పెట్టిన మెసేజ్‍కి జవాబు రాకపోయేసరికి మర్నాడు ఉదయం గౌతమ్‍కు ఫోన్ చేస్తుంది హసంతి. నెంబర్ నాట్ రీచబుల్ అని వస్తుంది. రఘురాంకి చేస్తుంది. ఆయన నెంబర్ కూడా నాట్ రీచబుల్ అని వస్తుంది. ఏమవుతోందో అర్థం కాక గౌతమ్ ఇంటికి వెళ్తుంది. గౌతమ్ ఇల్లు తాళం వేసుంటుంది. తిరిగి అదే ఆటోలో ఇంటికి వచ్చేస్తుంది హసంతి. లోపలికి వచ్చి చూస్తే గౌతమ్ కనబడతాడు. మీ ఇంటికే వెళ్ళొచ్చాను, తాళం వేసుంది అంటుంది. నాన్న ఊరెళ్ళారనీ, నేను నీ కోసం వచ్చానని చెప్తాడు. ఫోన్ కలవడం లేదంటే, ఛార్జింగ్ అయిపోయిందంటాడు. ఇద్దరూ పార్క్‌కి వస్తారు. తాను హసంతి కార్తీక్‍లను పార్కులో చూసినట్టు అన్యాపదేశంగా ఓ మిత్రుడి సమస్యలా చెప్తాడు. నువ్వేం సలహా ఇచ్చావని అడిగితే, నా గతం, భవిష్యత్తూ రెండు నువ్వే, నీ దగ్గర దాచేందుకు ఏదీ లేదు. నువ్వూ నాలాగే అని అనుకుంటున్నాను అని చెప్పి వెళ్ళిపోతాడు గౌతమ్. అతనలా వెళ్లగానే కార్తీక్ వస్తాడక్కడికి. తనకి పెళ్ళి నిశ్చయమైందనీ, తనని ఇబ్బంది పెట్టవద్దని మళ్ళీ చెప్తుంది హసంతి. ఓ గులాబీ ఆమెకిచ్చి, నీ డ్రెస్ బావుందని చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. ఎంత చెప్పినా కార్తీక్ అర్థం చేసుకోవటం లేదు, గౌతమ్ మాటల్లోనే అనుమానిస్తున్నట్టు అన్పిస్తోందని అనుకుని మౌనంగా ఇల్లు చేరుతుంది. మర్నాడు అమ్మతో కలిసి గుడికి బయల్దేరుతుంది హసంతి. ఇంతలో ఒక్క క్షణం అంటూ కవిత లోపలికి వెళ్తుంది. అదే సమయంలో హఠాత్తుగా అక్కడ ప్రత్యక్షమైన కార్తీక్ – గుడికెళ్ళొచ్చాను, ఇదిగో ప్రసాదం అంటూ ఓ కవర్ ఆమెకిచ్చి, ఐ లవ్ యు అని చెప్పి బైక్ వెనక్కి తిప్పుతాడు. ప్రసాదం కవర్‍ని పూలకుండీల వెనక దాస్తుంది. కార్తీక్ మళ్ళీ వచ్చి, నువ్వు టైమ్ ఇస్తే చిలుకూరు బాలాజీ టెంపుల్‍కి వెళ్ళొద్దాం అని నెమ్మదిగా చెప్పి వెళ్ళిపోతాడు. ఎంత టెన్షన్ పెట్టాడు అనుకుంటుంది. లోపల్నించి కవిత బయటకొచ్చి పద వెళ్దామని అంటుంది. ఇక చదవండి.]

[dropcap]“గౌ[/dropcap]తమ్, ఎక్కడున్నావు?” ఫోన్‌లో హసంతి అడిగింది.

“ఆఫీస్ పని మీద గచ్చిబౌలి వచ్చాను.”

“నన్ను బిర్లా మందిర్‌కి రమ్మని మెసేజ్ చేశావు. వచ్చి పికప్ చేసుకుంటావా? నేను రానా?”

“నేను మెసేజ్ పెట్టానా!?” ఆశ్చర్యంగా అడిగాడు.

“అవును ఉదయం ఎనిమిది గంటలకు వచ్చింది. నేను ఇప్పుడే చూశాను.”

అప్పుడు గుర్తొచ్చింది గౌతమ్‌కి. ఉదయం జిమ్‌లో సుధాకర్ తన ఫోన్ తీసుకొని హసంతికికి మెసేజ్ పెట్టాడని.

“సరే సాయంత్రం ఐదు గంటలకు వస్తావా! నేను ఇక్కడి నుంచి వస్తాను” అన్నాడు.

“అలాగే” అంది.

***

సాయంత్రం ఐదు గంటలు: ఆటోలో హసంతి బిర్లా మందిర్‌కి వచ్చింది. ఎంట్రన్స్ లోనే ఆమెను కలిశాడు గౌతమ్. ఆమె చేయి పట్టుకుని పైకి వెళ్ళాడు. ఇద్దరూ దైవ దర్శనం చేసుకున్నారు. ఎడమచేతి వైపున మెట్ల మీద కూర్చున్నారు. చల్లగాలి వీస్తోంది.

“హసంతీ! మొన్న నేను నీతో చాలా హార్ష్‌గా మాట్లాడాను. సారీ!” అన్నాడు

“………..”

“ఎన్నోసార్లు నాతో మాట్లాడాలన్నావు. నేను నిన్ను మాట్లాడనివ్వకుండా సారీ ఏదేదో మాట్లాడుతున్నాను. నువ్వు నాతో ఏం చెప్పదలచుకున్నావో ఇప్పుడు చెప్పు. వింటాను” అన్నాడు.

“వద్దు గౌతమ్! సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను” అంది.

“సరే! ఓ.కే. టేక్ యువర్ ఓన్ టైం. ఒక్క విషయం నేను మా నాన్న దగ్గర ఎంతో నిజాయితీగా ఉంటానో, అంతకంటే నాలుగు రెట్లు ఎక్కువ నిజాయితీగా నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. మా అమ్మ నా చిన్న వయసులో నన్ను వదిలి వెళ్ళిపోయినా, ప్రతిరోజూ రాత్రి మా అమ్మ ఫోటో ముందు నిలబడి, ప్రతి విషయమూ తనతో పంచుకున్నాక గానీ నిద్రపోను. నీతోనూ అంతే. మనిద్దరి మధ్య ఎటువంటి సీక్రెట్స్ ఉండకూడదని అనుకుంటున్నాను. నిన్ను తప్ప మరొకరి వైపు కన్నెత్తి కూడా చూడను. దిస్ ఈజ్ మై ప్రామిస్. మగాడి జీవితంలో అమ్మ స్థానం ఎంత పవిత్రమైనదో, భార్య స్థానం కూడా అంతే పవిత్రమైనదిగా భావించే మనసు నాది. కార్యేషు దాసి, శయనేషు రంభ, భోజ్యేషు మాతా అంటారు. మొదటి రెండు గురించి నాకు తెలియదు. మూడోది అమ్మ ప్రేమను ఆస్వాదించే లోపలే మా అమ్మ నన్ను ఒంటరిని చేసి వెళ్ళిపోయింది. ఆ స్థానం మళ్లీ నువ్వు భర్తీ చేస్తావన్న నమ్మకంతో మన బంధానికి పునాది వేసెళ్ళింది. అందుకే మనసులో స్థిరపడ్డ ఆ బంధం అపురూపమైతే, మిగతా రెండూ వాటంతటవే వస్తాయని నమ్ముతున్నాను. నువ్వూ నాతో అంతే నిజాయితీగా ఉండాలని కోరుకుంటున్నాను” అన్నాడు.

‘గౌతమ్ ఒక్క మాట ప్రతిసారీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, చిన్నప్పటి నుంచి ప్రేమిస్తున్నాను, మా అమ్మకు ఇచ్చిన మాట ప్రకారం నేను చేసుకుంటున్నాను. ఇవన్నీ వినీ విని బోర్ కొడుతోంది. ఇంకేదైనా చెప్పు. ఇవేనా మనిద్దరం బయటకు వచ్చినప్పుడు మాట్లాడుకునే మాటలు’ అని అడగాలనుంది. అతని మాటలు మౌనంగా వింటున్నా, ఆమె మనసు ఎక్కడో ఆలోచిస్తోంది.

“హసంతీ! ఐ లవ్ యు.”

ఆ మాటకి తలెత్తి అతని వైపు చూసింది.

ఇద్దరి మధ్య మౌనం.

“దీనికి నీ దగ్గర నుంచి రిప్లై వస్తుందా!?” అన్నాడు నవ్వుతూ.

హసంతి నవ్వింది. మనసులో కమ్ముకున్న నల్ల మబ్బులు తొలగిపోతున్నట్టు అనిపించింది. పూల మొగ్గలు విచ్చుకుంటున్న అనుభూతి. అనుమానాలు పటాపంచలవుతున్న ఫీలింగ్. ‘గౌతమ్ అంత క్లారిటీగా ఉన్నప్పుడు, తనకెందుకు ఈ డోలాయమానం? ఎందుకీ రెండు పడవల ప్రయాణం’ అనుకుంది. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని నడుస్తుంటే, తేలికబడ్డ మనసుతో గౌతమ్‌తో మాటలు కలిపి, అతని భుజం మీద చెయ్యేసింది.

గౌతమ్ సంతోషంగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఆమెని ఇంటి దగ్గర దింపి, గౌతమ్ వెళ్తుంటే ‘బై’ చెప్పింది. లోపలికి వెళ్ళబోతుంటే సమీపంలో బైక్ మీద వస్తున్న కార్తీక్ కనిపించాడు.

అంతే! అతని కంట పడకూడదనుకుని వేగంగా ఇంట్లోకి పారిపోయినట్టు వెళ్ళింది. గదిలోకి వెళ్లి ఫోన్ సోఫాలో పడేసింది. కార్తీక్‌ని చూసేసరికి అప్పటి వరకూ నిర్మలంగా ఉన్న మనసు కొలనులో మళ్ళీ రాయి పడ్డట్టయింది.

***

గౌతమ్ కారు సిగ్నల్ దగ్గర ఆగింది కారు. పక్కనే కార్తీక్ బైక్ మీద వచ్చి ఆగాడు. యథాలాపంగా అతని వైపు చూసాడు. అంతకు ముందు ఎక్కడో చూసినట్టు అనిపించింది. రెస్టారెంట్లో కాఫీ కప్పు పట్టుకోమన్న సంగతి గుర్తొచ్చింది. తననే చూస్తున్న కార్తీక్‌కి ‘హాయ్’ అని చెయ్యూపాడు గౌతమ్. అంతలో సిగ్నల్ పడటంతో గౌతమ్ కారు వేగంగా ముందు కదిలింది. కార్తీక్ కూడా అతని వెనకే బైక్ పోనిచ్చాడు.

గౌతమ్ కారుకి ఓ బైక్ వ్యక్తి సడన్‌గా అడ్డొచ్చి, కారుకి తగలటంతో, స్క్రాచెస్ పడ్డాయి. గౌతమ్ కార్ పక్కగా ఆపాడు. అంతలో బైక్ కుర్రాడు వెళ్లిపోయాడు. వెనకే వస్తున్న కార్తిక్ బైక్ ఆపాడు.

“ఏమైంది బ్రో!?” అన్నాడు.

గౌతమ్ చెప్పాడు.

“బైక్ వాడికి దెబ్బలు ఏమైనా తగిలాయా!?” అన్నాడు కార్తీక్.

“తగిలితే ఈ పాటికి నేను పోలీస్ స్టేషన్‌లో, వాడు హాస్పిటల్‌లో ఉండే వాళ్ళం. ఎస్కేప్ అయ్యాడు” అన్నాడు.

“బై ద బై ఐ యాం.. కార్తీక్” అన్నాడు.

“అవును.. మనం ఈ మధ్యే ఎక్కడో కలిసినట్టు అనిపిస్తోంది!?”

“రెస్టారెంట్లో” కార్తీక్ గుర్తు చేశాడు.

“ఎస్.. ఐ యాం గౌతమ్” అని చెయ్యి ముందుకు చాపాడు.

“ఓ.కే. బ్రో” అని కార్తీక్ కదలబోతుంటే..

“వన్ మినిట్ మిస్టర్ కార్తీక్.. అక్కడ కాకుండా మరెక్కడో వారం క్రితం మిమ్మల్ని చూశాను”

“నేను చూడలేదు”

“నేను చూశాను”

“ఎక్కడ?”

“హసంతి మీ కొలీగా?”

“హసంతి మీకెలా తెలుసు!? షి ఈజ్ మై లవర్” అన్నాడు కార్తీక్.

“……….”

మాట్లాడకుండా చూస్తున్న గౌతమ్‌తో..

“ఏమైంది బ్రో?” అన్నాడు కార్తీక్.

“షి ఈజ్ మై వుడ్ బి” చెప్పాడు గౌతమ్.

“ఓ అది మీరేనా బ్రో! రెండు నిమిషాలు మీతో మాట్లాడొచ్చా” అన్నాడు కార్తీక్.

“ఓ.కే. నిన్ను నేను చూశాను. కానీ పరిచయం లేదు. చెప్పు” అన్నాడు గౌతమ్ కూల్‌గా ఏక వచనంలో.

“ఇంతవరకు నువ్వు ఎవరో! ఏం చేస్తున్నావో! ఇదంతా ఎందుకు జరుగుతుందో నాకు తెలియదు. కానీ ఇప్పుడు తెలుసుకునే సమయం వచ్చింది. ఇది నా లవ్‌కి సంబంధించిన విషయం. దీంతో నా జీవితం ముడిపడింది. నీకు అమ్మానాన్న, తమ్ముడు, చెల్లెలు, అత్త మామ, అన్ని రిలేషన్స్ ఉండి ఉండొచ్చు. నీకు కావాల్సింది చేయటానికి బంధువర్గం ఉండొచ్చు. కానీ నాకు ఎవరూ లేరు. అందుకు నాకేం బాధ కూడా లేదు. ఈ క్షణం వరకూ నా జీవితంలో తనంత తానుగా ఏదీ దక్కలేదు. నాకు కావలసిన తిండీ, బట్టలు, షెల్టర్, చదువు, ఉద్యోగం.. జీవితం అన్ని నేనే వెతుక్కున్నాను. ఇలాంటి నా జీవితంలోకి ఓ అందమైన అమ్మాయి ఇవన్నీ నేను నీకు ఇస్తానని వచ్చింది. ఆమే హసంతి.

నీ కోసం నేను తనని వదులుకోలేను. హసంతే నన్ను వెతుక్కుంటూ వచ్చి, తన ప్రేమను పంచిందని తెలిసిన మరుక్షణమే డిసైడై పోయాను. ఆమెను వెతకడం కోసం తిరిగి, తిరిగి చివరికి ఆమెని కనుగొని కలుసుకున్నాను. ఆమెను చూసిన తర్వాత నేను ఆమెను ఎవరికోసమో త్యాగం చెయ్యటం నావల్ల కాదు. ఇది హసంతికి, నాకు మధ్య ఏర్పడ్డ జీవితం. మధ్యలో నువ్వు అడ్డు రావద్దు. అర్థమైందా!” అని వార్నింగ్‌లా చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు కార్తీక్.

***

గౌతమ్ ఇంటికి వచ్చాడు.

రఘురాం ఫోన్‌లో “ప్రసాదూ! వచ్చే నెలలో మా గౌతమ్ పెళ్లి. ముందుగానే చెప్తున్నాను. నువ్వు వారం ముందే రావాలి. వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్‌కి ఇచ్చాం. రాగానే ముందు నీకే పంపుతాను” అని ఫోన్ ఆఫ్ చేశాడు.

బంధువులకు, మిత్రులకు వరుసగా ఫోన్లు చేస్తున్నాడు రఘురాం.

***

సాయంత్రం నాలుగు గంటలు: హసంతి ఫోన్ మోగుతుంటే బద్ధకంగా వచ్చి చూసింది.

“హలో! గౌతమ్!”

“ఇంట్లోనే ఉన్నావా?”

“అవును..”

“నువ్వు ఫ్రీ గా ఉంటే నీకు ఒక లొకేషన్ షేర్ చేస్తాను. వస్తావా?” అన్నాడు.

“సరే” అనగానే ఫోన్ ఆఫ్ అయింది.

***

హసంతి మోపెడ్ మీద గౌతమ్ పెట్టిన లొకేషన్‌కి వచ్చేసరికి అరగంట అయింది.

గౌతమ్ అక్కడే వెయిట్ చేస్తున్నాడు. అతని మొహం అసహనంగా ఉంది. హసంతి అతనికి ఎదురుగా వచ్చి..

“గౌతమ్! ఎప్పుడూ నువ్వే వచ్చి నన్ను పికప్ చేసుకుంటావు కదా! ఈ మధ్యేంటి కొత్తగా నన్నే రమ్మంటున్నావు” అంది.

“ఎప్పుడూ నేనే రావాలా? నువ్వూ దిగి రావచ్చు. తప్పేం లేదు.”

అతని మాటల్లో కరకుతనాన్ని ఆమె అన్వయించుకోలేకపోయింది.

“ఏంటి గౌతమ్! కొత్తగా మాట్లాడుతున్నావు?” అంది.

“కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నప్పుడు మాటలు కొత్తగానే వస్తాయి” అని.. ఆమె కళ్ళలోకి చూస్తూ..

“నాతో షేర్ చేసుకునే విషయాలు నీ దగ్గర నిజంగా ఏమీ లేవా?” అన్నాడు.

“ఏమైంది గౌతమ్? కొత్తగా అడుగుతున్నావు”

“ఇప్పుడు అడగాల్సి వచ్చింది. నిజం చెప్పు. నీకు గతంలో ఎవరితోనైనా క్రష్ ఉందా?”

తలదించుకుని “లేదు” అంది.

“అబద్ధం చెపుతున్నావు. ఇప్పుడు కూడా నీకు నిజం చెప్పాలనిపించడం లేదు కదా!?” అని పక్కకు తిరిగి “కార్తీక్” అన్నాడు. పక్కన ఉన్న కార్తీక్ మెల్లగా వచ్చాడు. అతని వైపు చివాల్న తలెత్తి చూసింది హసంతి.

అంతకు ముందు హసంతి, కార్తీక్‌లు మాట్లాడుతున్నప్పుడు దూరం నుండి తీసిన పిక్ చూపించాడు గౌతమ్.

ఆమె మొహం వివర్ణమైంది. స్వేదం మొహం మీద పేరుకుంది.

మనసు, శరీరం నెర్వస్‌గా మారాయి

“కార్తీక్‌కీ, నీకు మధ్య ఏమీ లేదా?” అన్నాడు.

హసంతి కన్నీళ్ళతో “ఇతనిని నేను సంవత్సరం నుండి ప్రేమించిన మాట వాస్తవమే. అది వన్ సైడ్ లవ్” అంది.

“ఈ విషయం నాతో ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా? నిన్ను మా అమ్మతో సమానంగా చూసుకోవాలనుకున్నాను. నీ చేతిలో చెయ్యేసి, నీతో ఏడడుగులు నడిచి, నీతోనే జీవించాలని నేను అంటున్నప్పుడైనా.. నాతో చెప్పాలనిపించలేదా నీకు! నన్ను పిచ్చివాడిని చేశావు. ఇప్పుడు కార్తీక్‌ని కూడా పిచ్చివాడిని చేయాలనుకుంటున్నావా? ఇది ముందే చెప్పి ఉంటే.. నేను నీ జీవితంలోకి వచ్చి ఉండేవాడినే కాదు. తర్వాత తెలిసినా తప్పుకునే వాడిని కదా!”

“విల్ యు స్టాప్ గౌతమ్! అసలు ఇవేం మాటలు? మనం కలిసినప్పుడల్లా.. నేను నిన్ను 15 ఏళ్ళుగా ప్రేమించాను. మా అమ్మతో సమానంగా చూసుకుంటాను. ఈ కొద్ది రోజుల్లో ఈ నీ మాటలు వినీ, విని చిరాకు పుడుతోంది. మానసికంగా ఓ వ్యక్తిని ఇష్టపడటం తప్పా? అది మనిషి మనసుకున్న హక్కు గౌతమ్! ప్రతి మనిషి జీవితంలోనూ, ఏదో ఒక క్రష్ ఉంటూనే ఉంటుంది. పెళ్ళికి ముందు ఎవరిని ఇష్టపడలేదనో, ప్రేమించలేదనో ఏ అమ్మాయైనా, అబ్బాయైనా చెబితే.. వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటున్నారని అర్థం. అలా ఉన్న వాళ్లంతా పెళ్లిళ్లు చేసుకుంటున్నారా? ఏవో కొన్ని స్థిరమైన అభిప్రాయాలతో, నీలాగే అందరూ ఉండాలంటే సాధ్యపడుతుందా? పెళ్ళికి ముందు ఎవరు ఎవరిని ప్రేమించకూడదా? ఇష్టపడకూడదా? మనిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిన సంగతి నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు గౌతమ్. నేను కాదు. ఇదే విషయం నేను నిన్ను అడిగితే!? అమెరికాలో ఉంటున్నావు! నువ్వు వర్జిన్‌వేనా? అని అడిగితే ఏం చెప్తావు. బ్లేమ్ చేసే ముందు కొంచెం ఆలోచించుకుని మాట్లాడు. చిన్నప్పటి అభిప్రాయాలు పెద్దయ్యాక మారవా? మారకూడదా? నీ మనస్తత్వం ఏమిటో నాకు అర్థం కావటం లేదు.” అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.

ఆమె మళ్లీ ఏదో చెప్పబోతుంటే.. ఏమీ చెప్పొద్దన్నట్టు గౌతమ్ చెయ్యి ముందుకు అడ్డుపెట్టి..

“వద్దు. నువ్వేమీ చెప్పొద్దు. మన పెళ్లి జరగదు. ఎందుకంటే నువ్వు ఏది కోరుకుంటావో దానిని అదెంత కష్టమైనా నీకు తెచ్చి ఇస్తానని చెప్పాను. నువ్వు కార్తీక్‌నే పెళ్లి చేసుకో.. బై” అని గౌతమ్ కొంచెం దూరం వెళ్లి, అసహనంగా ఆకాశం వైపు చూస్తూ నిలబడ్డాడు.

“గౌతమ్! గౌతమ్ నేను చెప్పేది విను” అని హసంతి అంటున్నా అతను తల తిప్పలేదు.

అక్కడే నిలబడి చూస్తున్న కార్తీక్ ముందుకొచ్చి..

“సారీ! హసంతీ! నన్ను క్షమించు. మనం కలుసుకున్న రెండు, మూడు సార్లు నువ్వు నన్ను మర్చిపో, నన్ను మర్చిపో! నాకు పెళ్లి ఫిక్స్ అయిందని చెబుతుంటే, ఏదో తమాషాకి అంటున్నావనుకున్నాను. కానీ నువ్వు నిజమే చెబుతున్నావని ఇప్పుడే అర్థమైంది. పరిచయం లేని నా వల్ల నీ జీవితంలో సమస్యలు తలెత్తుతాయని నాకు తెలియదు. ఐ యాం సారీ! గౌతమ్ ఎన్నో ఏళ్ళుగా నిన్ను చూడకుండా, బాల్యం నుండి నిన్నే ఇష్టపడుతున్నాడు. నువ్వు గౌతమ్‌ని చేసుకోవటమే న్యాయం. ఇహ మీద ఎప్పుడూ నిన్ను డిస్టర్బ్ చేయను. నీకు కనిపించను కూడా! సారీ!” అంటుంటే..

హసంతికి కన్నీళ్లు ధారలు ధారలుగా చెంపలు దిగుతున్నాయి.

“నిన్ను చూడకుండానే మేమిద్దరం నిన్ను ఎంతగానో ప్రేమించాం. నీ ప్రేమ నా జీవితంలో నాకు మరపురాని తియ్యని, తీయలేని అందమైన అనుభూతి. ఇకపై నావల్ల నీకు ఎలాంటి ఇబ్బంది కలగదు. నీకు సరైన భర్త గౌతమ్ మాత్రమే. అతనికే ఆ అర్హతలు ఉన్నాయి. అతన్నే పెళ్లి చేసుకో. నేను వెళ్తున్నాను” అని వెళ్ళిపోతుంటే.. హసంతిని వదిలి కార్తీక్ కూడా వెళ్లిపోయాడు.

అప్పటివరకు పక్కన గుడిలో వినిపించిన నాదస్వరం సడన్‌గా ఆగిపోయింది.

సన్నగా వర్షం తుంపర మొదలైంది. హసంతికి ఏం చేయాలో తెలియడం లేదు. మనసంతా అయోమయంగా మారిపోయింది. తనను వదిలి కుడివైపు వెళుతున్న గౌతమ్‌ని, ఎడమవైపు వెళుతున్న కార్తీక్‌ని, చూస్తూ ఏడుస్తూనే.. ఇంటికి వచ్చింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here