ఫస్ట్ లవ్-19

0
11

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గౌతమ్‍కి ఫోన్ చేసి ఎక్కుడున్నావని అడుగుతుంది హసంతి. ఆఫీసు పని మీద గచ్చిబౌలి వచ్చానంటాడు. నన్ను బిర్లామందిర్‍కి రమ్మని మెసేజ్ చేశావు కదా, రానా, నువ్వు వచ్చి పికప్ చేసుకుంటావా అని అడుగుతుంది. నేను మెసేజ్ పెట్టానా అని ఆశ్చర్యపోతాడు గౌతమ్. తర్వాత గుర్తొస్తుంది ఆ మెసేజ్ సుధాకర్ పెట్టాడని. సరే, సాయంత్రం ఐదు గంటలకి వచ్చేయ్ అని చెప్తాడు. గుళ్ళో కలుస్తారు ఇద్దరూ. తాను మొన్న హార్ష్‌గా మాట్లాడాను సారీ అంటాడు. మౌనంగా ఉండిపోతుంది హసంతి. నువ్వేదో చెప్పాలనుకుంటున్నప్పుడల్లా, నేను నిన్ను మాట్లాడనివ్వకుండా చేశాను. ఇప్పుడు చెప్పు అంటాడు. ఇప్పుడు కాదులే, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంటుంది. తాను హసంతిని ఎంతగా ప్రేమిస్తున్నాడో చెప్తాడు. కాసేపు మాట్లాడుకున్నాకా, తేలికపడిన మనసులతో ఇళ్ళకి చేరుతారు. గౌతమ్ కారు సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు, పక్కనే కార్తిక్ బైక్ కూడా వచ్చి ఆగుతుంది. గౌతమ్‍ని ఇంతకు ముందెప్పుడో చూసినట్టు అనిపిస్తుంది కార్తీక్‍కి. రెస్టారెంట్‍లో కలిసిన సంగతి గుర్తొస్తుంది. సిగ్నల్ క్లియరవడంతో కారును ముందుకు పోనిస్తాడు గౌతమ్. ఇంతలో ఓ బైకర్ రాష్‍గా వచ్చి గౌతమ్ కారుని ఢీ కొట్టి వెళ్ళిపోతాడు. కారు ఓ పక్కగా ఆపి దిగి చూస్తే స్క్రాచెస్ కనబడతాయి. ఈలోపు అటే వచ్చిన కార్తీక్ బైక్ ఆపి గౌతమ్‍ని పలకరిస్తాడు. జరిగినది చెప్తాడు గౌతమ్. ఒకరినొకరు పరిచయం చేసుకుంటారు. ఇంతకుముందు రెస్టారెంట్‌లో కలిసిన సంగతి కార్తీక్ గుర్తు చేస్తాడు. అక్కడే కాకుండా, మరోచోట ఓ వారం క్రితం హసంతితో మిమ్మల్ని చూశానని గౌతమ్ అంటాడు. హసంతి మీకెలా తెలుసు, తను నా లవర్ అంటాడు కార్తీక్. గౌతమ్ మాట్లాడడు. కార్తీక్ రెట్టిస్తే, హసంతి తన వుడ్‍ బీ అని చెప్తాడు. హసంతిని తనకి వదిలేయమని ఓ వార్నింగ్‍లా చెప్పి వెళ్ళిపోతాడు కార్తీక్. గౌతమ్ ఇంటికి వచ్చేసరికి తండ్రి బంధువులకు ఫోన్లు చేస్తూ, పెళ్ళికి పిలుస్తూంటాడు. సాయంత్రం నాలుగు గంటలకి హసంతికి ఫోన్ చేస్తాడు గౌతమ్.  లొకేషన్ పంపించి అక్కడికి రమ్మంటాడు. అక్కడికి వచ్చిన హసంతిని నువ్వు ఇంతకు ముందు ఎవర్నైనా ప్రేమించావా అని అడుగుతాడు. లేదంటుంది. అబద్ధం చెప్తున్నావంటూ, అక్కడ పక్కన నిలుచున్న కార్తీక్‍ని పిలుస్తాడు. కార్తీక్‍కీ నీకూ మధ్య ఏమీ లేదా అంటాడు. తనది వన్ సైడ్ లవ్ అని చెప్తుంది హసంతి. ఆ విషయం ముందు చెబితే తాను హసంతికి దూరంగా ఉండేవాడిని కదా అంటాడు. హసంతికి కోపం వస్తుంది. నువ్వు అమెరికాలో ఉన్నావు, నువ్వు వర్జిన్‍వేనా అని అడుగుతుంది. నువ్వు కార్తీక్‍నే పెళ్ళి చేసుకో అని గౌతమ్, గౌతమ్‍నే చేసుకో అని కార్తీక్ చెప్పి వెళ్ళిపోతారు. ఏడుస్తూ ఇంటికొస్తుంది హసంతి. ఇక చదవండి.]

[dropcap]“హ[/dropcap]సంతీ! నేను పిన్ని వాళ్ళింటి దాకా వెళ్ళొస్తాను. రావడానికి సాయంత్రం అవుతుంది. వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను. తర్వాత తిను” అని కవిత వెళ్ళిపోయింది.

హసంతి గదిలోకి వెళ్లి తలుపేసుకుని కూర్చుంది. దుఃఖం కట్టలు తెంచుకొని వస్తోంది. మధ్య మధ్యలో వెక్కుతోంది. మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని కూర్చుంది. ఓ పక్క తనను ఎన్నో ఏళ్లుగా ప్రేమిస్తున్న గౌతమ్, ఇంకో పక్క సంవత్సరంన్నర నుండి తను ప్రేమిస్తున్న కార్తీక్. ఇద్దరి జ్ఞాపకాలు ఒకదాని తర్వాత ఒకటి పోటీపడి దాడి చేస్తుంటే.. విసురుగా లేచి కబోర్డ్ లో ఉన్న వస్తువులన్నీ కిందికి విసిరి కొట్టింది. గోడకున్న కాన్వాస్ పెయింటింగ్ ఓ మూలకు విసిరేసింది.

ఒక్క క్షణం తర్వాత విసిరేసిన వస్తువుల్లో గౌతమ్ ఇచ్చిన సెల్ ఫోను, డైమండ్ రింగ్ పెట్టిన చిన్న బాక్స్ కనిపించాయి. వాటితో పాటు కార్తీక్ ఇచ్చిన చిన్న గులాబీ బొకే కనిపించింది. వాటి మీద ఏడుస్తున్నఎం.ఓ.జీలు కనిపించాయి. ఆపై హసంతి ఏమీ ఆలోచించ లేకపోయింది. వేగంగా కబోర్డ్ తెరిచి అందులో ఉన్న చీర తీసుకొని ఫ్యాన్‌కు వేలాడదీసి ఉరిసుకోవడానికి తలదూర్చింది.

అదే సమయంలో ధృతి వచ్చింది. వాకిలి తలుపు దగ్గరగా వేసుంది.

ఎప్పటిలాగే “ఆంటీ.. ఆంటీ!” అని పిలిచింది.

కవిత కనిపించకపోయేసరికి,

‘ఇదేంటి ఇంట్లో ఎవరూ లేరు?’ అనుకుంటూ మేడ మీద గదికి వచ్చింది. గది తలుపు వేసుంది.

“హసంతీ! హసంతీ!” అని తలుపు మీద కొడుతున్న చప్పుడు వినిపించి ఒక్క క్షణం ఆగింది హసంతి.

కంటిన్యూగా ఎవరో తలుపు మీద కొడుతున్న శబ్దం వినిపిస్తోంది

ధృతి గొంతు గుర్తుపట్టింది. మెడ చుట్టూ ఉన్న ఉరి బిగించుకోబోతూ ఆగింది హసంతి.

‘ఏంటి? ఏం చేస్తోంది లోపల’ అనుకుంటూ తలుపు బలంగా నెట్టేసరికి తలుపు తెరుచుకుంది.

హసంతిని ఆ స్థితిలో చూసిన ధృతికి నోట మాట రాలేదు.

“ఏంటే!?! ఏం చేస్తున్నావు?” అని ఒక్క పరుగున దగ్గరకు వచ్చింది.

తలుపు తీసుకుని లోపలికి వచ్చిన ధృతి వైపు బేలతనంగా చూసింది హసంతి.

ధృతి కోపంగా.. “ఏయ్! ముందు కిందికి దిగవే.. దిగు!” అనే సరికి, అదిరిపడి తలకున్న ఉచ్చు తీసి భయంగా దాని వైపు చూసింది.

ఒక్క క్షణం వెన్నులో వణుకుమొదలైంది. ఒక్క క్షణం ధృతి రావటం లేటయితే ఏం జరిగి ఉండేది?

రెండు అంగల్లో వేగంగా ముందుకు వచ్చిన ధృతి హసంతి.. చెంప మీద లాగి కొట్టింది.

“ఏంటే! ఈ పిచ్చి పని. సిగ్గు లేదా? ఏమైనా మతి ఉండే చేస్తున్నావా ఈ పని?” అంది ధృతి.

హసంతి ఏడుస్తోంది.

“ఏంటే! ఆ ఏడుపు దరిద్రంగా! ముందాపు. జీవితాంతం ఏడుస్తూనే ఉంటావా? అసలేం జరిగిందని ఇంత డ్రాస్టిక్ నిర్ణయం తీసుకున్నావో చెప్పు” అంది కోపంగా.

ఏడుస్తూనే కార్తీక్‌కి, తనకి మధ్య జరిగిన సంభాషణ, అతను రావటం గులాబీ పువ్వు ఇవ్వటం, ఐ లవ్ యు చెప్పటం,

గౌతమ్‌తో బయటికి వెళ్ళటం, కార్తీక్ బయట కనిపించినప్పుడు తనికి పెళ్లి కుదిరిందని చెప్పడం, అతను దాన్ని తేలిగ్గా తీసుకోవడం, చివరికి గౌతమ్, కార్తీక్, తనకి మధ్య జరిగిన సంభాషణ.. నువ్వు కార్తీక్‌ని చేసుకోమని గౌతమ్, లేదు గౌతమ్‌నే చేసుకోమని కార్తీక్ అన్న మాటలు.. ఏడుస్తూనే హసంతి చెప్పింది.

ఆమెను దగ్గరకి తీసుకుని ఓదారుస్తూ..

“సరే! ఓ.కే. దీనికే సూసైడ్ చేసుకుంటావా?” అంది ధృతి.

“మరి ఏం చేయమంటావు? వాళ్ళిద్దరూ వాళ్ళ మనసులో ఉన్నది చెప్పి వెళ్లారు. కానీ ఇద్దరిలో ఒక్కడు కూడా నా మనసులో ఏముందో!? ఒక్కసారి కూడా అడగలేదు. అమ్మాయి తన మనసుకు నచ్చిన వాడిని ప్రేమించడం నేరమా? ఎంతో ఆశగా కార్తీక్‌ని ఇష్టపడ్డాను. అదే ఇప్పుడు నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది.

అందమైన సీతాకోకచిలుక కళ్ళ ముందే తిరుగుతూ.., ఎగురుతూ కనిపించింది. చూడగానే నచ్చింది. దగ్గరికి వెళ్లి చేతుల్లోకి తీసుకుందామనుకున్నాను. దగ్గరికి వెళ్తే అది నన్ను వదిలి ఎగిరి వెళ్లి పోతుందేమో అనే భయంతో దూరం నుండే దాని అందాన్ని, రంగుల్ని ప్రేమించి, ఆరాధించటం మొదలుపెట్టాను.

అదే సమయంలో నన్ను వెతుక్కుంటూ మరో సీతాకోకచిలుక వచ్చింది. అది నా చుట్టూ తిరుగుతూ నిన్ను బాల్యం నుండి ప్రేమిస్తున్నాను. నీకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను, నిన్ను బంగారు బొమ్మలా చూసుకుంటాను.. అని చెప్పి నా చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటే.. దానిని దగ్గర తీసుకుందామని నిర్ణయించుకున్నాను.

సరిగ్గా ఆ సమయంలో కొన్నాళ్లుగా దూరం నుంచి నేను ప్రేమించిన సీతాకోకచిలుక, నా ప్రేమ గురించి తెలుసుకుని నువ్వు నాకు కావాలి అని నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఒకే సమయంలో ఇద్దరూ నా కోసం పోటీ పడుతుంటే.. నేనేం చేయాలో చెప్పు.

ఒక ఆడపిల్ల తన అభిరుచులకు, తన ఇష్టాలకు, తన ఆశయాలకు, అనుగుణంగా జీవించటానికి అవకాశమే లేదా? వాళ్ళిద్దరూ నన్ను అర్థం చేసుకోకుండా.. ఏదేదో మాట్లాడి వెళ్లారు. నేను వాళ్ళిద్దరి జీవితాలతో ఆడుకుంటున్నానని అందరూ అనుకోవచ్చు. కానీ ఎక్కడైనా చూడు.. ఎప్పుడూ 99% అమ్మాయిలు, మిగతా వాళ్ళు బాగుండాలనే తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య ఇమడలేక నేను సూసైడ్ చేసుకోబోయేది అందుకే” అంది హసంతి ఏడుస్తూ.

“నువ్వు చెప్పేవన్నీ వాస్తవాలే. కానీ ఎప్పుడూ మనం అనుకున్నదే జరిగితే, అది జీవితం కాదు. అలా జరగాలని రూలు కూడా ఎక్కడా లేదు.”

“మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు ధృతీ! వాళ్ళిద్దరి దగ్గరకి వెళ్లి మీ ప్రేమ లాగే నా ప్రేమా పవిత్రమైందని చెప్పమంటావా!” అంది కన్నీళ్లు తుడుచుకుంటూ.

“ఇప్పుడు ఫైనల్‌గా నీ నిర్ణయం ఏమిటి?” అంది ధృతి.

అంతలో ఫోన్ మోగుతుంటే తీసి చూసింది హసంతి.

***

గౌతమ్ ఇంట్లో తల్లి ఫోటో ముందు నిలబడి జీరమైన గొంతుతో..

“అమ్మా! హసంతే ఈ ఇంటికి కోడలుగా వస్తుందని నువ్వు చెప్పావు. హసంతిని పెళ్లి చేసుకోవాలని అన్నావు. తెలిసీ తెలియని వయసు నుండడే నాలో హసంతి తప్ప మరో ఆలోచన రాకుండా చేశావు. హసంతిని పెళ్లి చేసుకుంటే మన ఇల్లు సంతోషంగా ఉంటుందన్నావు. ఇప్పుడు నా జీవితంలో ఏ సంతోషమూ లేదు. నువ్వూ లేవు, హాసంతి లేదు. నా బాధ ఎవరితో పంచుకోవాలమ్మా! ఎంత కష్టమొచ్చినా ఏడవకూడదని చెప్పేదానివి. కానీ ఇప్పుడు నాకు మనసారా ఏడవాలని ఉందమ్మా!” అని ఏడుస్తూ మోకాళ్ళ మీద కూర్చున్నాడు.

అంతలో తండ్రి రఘురాం వచ్చాడు.

“ఏంట్రా గౌతమ్! ఏమైంది? ఎందుకు చిన్నపిల్లాడిలా బాధపడుతున్నావు? హసంతికి, నీకు మధ్య ఏమైనా మనస్పర్ధలు ఉన్నాయా? ధైర్యంగా నాతో చెప్పరా! బాధ ఏదైనా ఉంటే నాతో పంచుకోరా! హసంతితో లేదంటే ఫ్రెండ్స్‌తో పంచుకోరా! నీలో నువ్వే దాచిపెట్టుకొని ఇలా బాధపడటం మంచిది కాదు రా!.. ఇలా ఇంట్లో ఒక్కడివే కూర్చొని, నువ్వే ఏదేదో ఊహించుకొని బాధపడితే, దాని వలన ఏంట్రా ప్రయోజనం? నువ్వు చిన్నపిల్లాడివి కాదు, ఆలోచించు..” అని వెళ్ళిపోయాడు.

గౌతమ్ సెల్‌ఫోన్‌లో హసంతి పిక్ చూస్తూ..

‘హసంతీ! నన్ను మర్చిపోవడానికి నీకు ఇంకొకరితో పరిచయం ఏర్పడితే చాలేమో! కానీ నిన్ను మర్చిపోవడానికి నాకు ఇంకో కొత్త జన్మ కావాలి’ అనుకున్నాడు కన్నీరు తుడుచుకుంటూ.

***

ఫోన్ రింగ్ అవుతుంటే తీసి

“హలో!” అన్నాడు కార్తీక్.

“రేయ్ కార్తీక్! ఉదయం నుండీ నీకు కాల్ చేస్తున్నాను. ఒక్కసారి కూడా లిఫ్ట్ చేయవేంట్రా?!” అన్నాడు కొలీగ్ సురేష్.

“మేటరేంటో చెప్పరా!” అన్నాడు చిరాగ్గా.

“నీకో గుడ్ న్యూస్ చెబుదామని చేశాను. మళ్లీ నీకు అమెరికా వెళ్ళే ఛాన్స్ వచ్చింది. ఈసారి సియాటెల్” అన్నాడు.

“అలాగా!”

“ఏంట్రా అంత క్యాజువల్‌గా అంటున్నావు! నీకు హ్యాపీగా లేదా? ఇంతకు ముందు వచ్చిన రెండు ఛాన్సులు మ్యూజిక్ కోసం ఒక సారి, ఫ్రెండ్ కోసం ఒకసారి వదులుకున్నావు. ఇప్పుడైనా వెళ్ళరా! లేకపోతే నీకు వచ్చిన అవకాశాన్ని మరొకడు ఎగరేసుకు పోతాడు.”

“వెళ్ళనీ రా! ఎవరైతే ఏంటి?”

“అవున్రా! నీకు వచ్చిన అవకాశాలు ఇంకొకరికి ఇచ్చేస్తూ ఉండు. ఏదో ఒక రోజు వెనక్కి తిరిగి చూసుకుంటే నువ్వు ఒక్కడివే బంటరిగా మిగిలిపోతావు” అని ఫోన్ కట్ చేశాడు సురేష్.

ఒక్క నిమిషం ఆలోచించి ఎదురుగా కనిపిస్తున్న బడ్డీ షాప్‌కి వెళ్లి ఒక సిగరెట్ తీసుకొని వెలిగించబోతే..

“నో! డోంట్ స్మోక్ కార్తీక్” అని హసంతి అంటున్నట్టు అనిపించింది. చుట్టూ చూసి చేతిలో ఉన్న సిగరెట్ విరక్తిగా విసిరి కొట్టాడు.

‘ఎవరైతే నిజాయితీగా ప్రేమిస్తారో వాళ్ళు ఖచ్చితంగా ప్రేమలో ఓడిపోవాల్సిందేనా! ఎందుకంటే నిజాయితీగా ఉండే ప్రేమకు చివరకు మిగిలేది ఓటమేనేమో!’ అనుకుంటూ వెళ్లిపోయాడు కార్తీక్.

***

మర్నాడు హసంతి దగ్గరికి ధృతి వచ్చింది. హసంతి చదువుతున్న పుస్తకం పక్కనపెట్టి, “ఏంటే! చెప్పా పెట్టకుండా వచ్చావు” అంది.

“నీ కోసమే వచ్చాను. ఏ పరిస్థితుల్లో ఉన్నావో, అని చూసి పోదామని వచ్చాను. సరే.. రా! గుడికి వెళ్దాం.” అంది.

“ఇప్పుడు నాకు రావాలని లేదు”

“ఇలా ఇంట్లోనే కూర్చుంటే పిచ్చి పుడుతుంది. రావే! వెళ్దాం.”

“ఐదు నిమిషాల్లో రెడీ అయి వస్తాను” అని లేచింది హసంతి.

***

రఘుపతి మోపెడ్ మీద వస్తున్నాడు. సడన్‌గా మోపెడ్ రోడ్డు పక్కన నిలిపి, గుండె పట్టుకొని హేండిల్ బార్ మీద తల పెట్టుకున్నాడు.

“అబ్బా! అమ్మా” అని పెద్దగా అంటున్నాడు.

ఆ సమయంలోనే అటువైపు వెళుతున్న కార్తీక్ అది చూసి బైక్ నిలిపి, దగ్గరకొచ్చాడు.

“సార్! సార్! ఏమైంది?” అన్నాడు కంగారుగా.

“ఏం లేదు బాబూ! కొద్దిగా అలసటగా అనిపిస్తోంది.”

కార్తీక్ వేగంగా ఎదురుగా ఉన్న షాప్ కెళ్ళి వాటర్ బాటిల్ తెచ్చి “సార్! నీళ్లు తాగండి. ప్లీజ్!” అని వాటర్ బాటిల్ ఇచ్చాడు.

రఘురాం నీళ్లు తాగాక, “సార్ నేను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా!?” అన్నాడు.

“వద్దు బాబూ! ఇల్లు దగ్గరే వెళ్తాను.”

“పర్వాలేదు సార్! నేనూ వస్తాను.”

“వద్దు. నేను వెళ్తాను. థాంక్స్. ఆఁ.. నీ పేరేంటి?”

“కార్తీక్.”

రఘురాం వెళ్లిపోయాడు.

***

ధృతి, హసంతి గుడికి వచ్చారు.

“హసంతీ! ప్రతివాళ్ళూ మనసులో ఉన్న కష్టాన్ని నిజాయితీగా చెప్పుకునేది దేవుడు దగ్గరే. ప్రశాంతమైన మనసుతో కళ్ళు మూసుకుని నీ బాధంతా విన్నవించుకో. ఖచ్చితంగా నీ ప్రశ్నలకి ఒక సమాధానం దొరుకుతుంది.” అంది ధృతి.

ఇద్దరూ దైవ సన్నిధిలో కళ్ళు మూసుకున్నారు.

హసంతి మనసులో ‘దేవుడా! అందరి ఇళ్లలో అమ్మాయిల పెళ్ళి దగ్గర చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. నా పెళ్లి వల్ల మా కుటుంబంలో పెద్ద సమస్య తలెత్తుతుందేమోనని భయంగా ఉంది. అటు కార్తీక్, ఇటు గౌతమ్. వీళ్లిద్దరికీ ఏ సమస్యలూ లేకుండా ఉండాలి. వాళ్ళిద్దరూ ఏ తప్పు చేయలేదు. ఉన్న సమస్య నా వల్లనే. నా కన్ఫ్యూజన్ వలన. దీని వలన నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ కష్టమో రాకూడదు. దేవుడా! నువ్వే దారి చూపాలి’ అని ప్రార్థించింది.

“హసంతీ! ఈ గుళ్ళో వెయ్యి సార్లు ప్రదక్షిణాలు, చేస్తే మనసులో అనుకున్నది నెరవేరుతుందట. మా నాయనమ్మ చెప్పింది”

తీర్థం ప్రసాదం ఇవ్వటానికి వచ్చిన పూజారి ఆ మాటలు విని “నిజమేనమ్మా! మనస్ఫూర్తిగా ఈ గుళ్లో ప్రదక్షిణాలు నిజాయితీగా చేస్తే మనసులో కోరికలు తప్పకుండా నెరవేరుతాయి అని అంటారు” అన్నాడు.

తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక ధృతి, హసంతి టాప్ దగ్గర చెయ్యి కడుక్కోవటానికి వెళ్లారు. ఇద్దరూ చేతులు కడుక్కొని బయటకి వెళ్ళిపోయారు.

వాళ్ళు వెళ్ళాక గౌతమ్ వెయ్యి ప్రదక్షిణాలు చేసి వచ్చాడు.

“ఏం బాబూ! ఉదయం నుండి ప్రదక్షిణాలు చేస్తూనే ఉన్నావు! ఏమైనా బలమైన కోరిక ఉందా! అది తీరితే ప్రదక్షిణాలు చేస్తానని మొక్కుకున్నావా?” అడిగాడు పూజారి.

“అదేం లేదు. స్వామీ! చిన్న వయసులో అమ్మతో గుడికి వచ్చేవాడిని. అప్పుడు ఎంతోమంది వెయ్యి ప్రదక్షిణలు చేసే వాళ్ళు. మా అమ్మ కూడా చేసేది. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ గుడికి వచ్చాను. నాకు ప్రదక్షిణాలు చేయాలనిపించింది. చేసి వచ్చాను. అంతే!” అన్నాడు గౌతమ్.

“బలంగా వేడుకో! అమ్మవారి కటాక్షం. అనుకున్నది జరిగి తీరుతుంది” అన్నాడు తీర్థప్రసాదాలు ఇచ్చిన పూజారి.

గౌతమ్ అక్కడి నుంచి వచ్చి గుడి ప్రాకారంలో ఉన్న ఓ చెట్టు కింద కూచుని, ప్రసాదం తిన్నాడు. రెండు నిమిషాలు అయ్యాక, లేచి చేయి కడుక్కుందామని టాప్ దగ్గరికి వచ్చాడు.

అక్కడ చెయ్యి కడుక్కుంటుంటే.. అతని దృష్టి అక్కడున్న రిస్ట్ వాచ్ మీద పడ్డది. దాన్ని తీసుకొని చూశాడు.

‘అరే! లేడీస్ వాచ్. ఎవరో ఇక్కడ పెట్టి మర్చిపోయారు. అచ్చం నేను హసంతికి ఇచ్చిన వాచ్ లాగే ఉంది’ అనుకుంటూ గుడి అంతా తిరిగి చూశాడు. అప్పటికే మధ్యాహ్నం కావడం వల్ల, లేడీస్ ఎవరూ కనిపించలేదు. దానిని తీసుకొని బయటకు వస్తుంటే ఫ్రెండ్ సుధాకర్ వచ్చాడు.

“ఏంట్రా! చేతికి పెట్టుకోవాల్సిన వాచ్ పట్టుకుని తిరుగుతున్నావు” అన్నాడు.

“నాది కాదు రా! లేడీస్ వాచ్. ఎవరో ట్యాప్ దగ్గర మర్చి పొయ్యారు.”

“ఒక్క నిమిషం ఉండు అక్కడే పెట్టి వస్తాను” అని గౌతమ్ వెళ్లబోతుంటే..

“రేయ్! నువ్వు కాకపోతే మరొకరు దాన్ని తీసుకెళ్తారు. మాట్లాడకుండా జేబులో పెట్టుకోరా!”

“పాపం! ఎవరిదో రా!”

“ఎవరిదైతే వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ వస్తారు” అన్నాడు.

“సరే! పద” సుధాకర్ గౌతమ్ బైక్ వెనకాల కూర్చున్నాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here