ఫస్ట్ లవ్-22

0
12

[శ్రీ ఎం. వెంకటేశ్వరరావు రచించిన ‘ఫస్ట్ లవ్’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[హసంతి కోసం గౌతమ్ రెస్ట్‌లెస్‌గా వెతుకుతుంటాడు. ఇదివరకు వెళ్ళిన చిల్ట్రన్స్ పార్క్‌కి వెళ్ళి చూస్తాడు. అక్కడా కనబడదు. బయటకు వస్తుంటే సుధాకర్ ఎదురయి ఏమైందని అడుగుతాడు. జరిగినది చెప్తాడు గౌతమ్. అసలు తనకి నువ్వు నచ్చావో లేదో సరిగ్గా తెలుసుకున్నావా అని అడుగుతాడు సుధాకర్. తనే అడగొచ్చుగా అని గౌతమ్ అంటాడు. నీది మేల్ ఈగో, జాగ్రత్త వెతుకు అని, నేను తప్పనిసరిగా ఆఫీసుకు వెళ్ళాలి, లేకపోతే నీతో వచ్చేవాడినే అని చెప్పి వెళ్ళిపోతాడు సుధాకర్. కార్తీక్ తనతో అన్న మాటలు గుర్తొచ్చి కార్తీక్‌కి ఫోన్ చేసి హసంతి ఎక్కడుందని అడుగుతాడు. కార్తీక్ ఏమీ మాట్లాడడదు. హసంతికి ఏమైనా జరిగితే ఊర్కోనని హెచ్చరించి ఫోన్ పెట్టేస్తాడు గౌతమ్. అటు కార్తీక్ కూడా హసంతిని వెతకడానికి బైక్ మీద బయల్దేరుతాడు. ఇద్దరూ తెగ తిరుగుతుంటారు. కార్తీక్ ఒక చోట ఆగి ధృతికి ఫోన్ చేస్తే, ఆమె అతన్ని తిడుతుంది. ఫోన్ కట్ చేసి, బిర్లామందిర్‍కి వెళ్ళి ఓ కార్నర్‍లో కూర్చుంటాడు కార్తీక్. హసంతికీ, తనకీ మధ్య జరిగిన, జరుగుతున్న సంఘటనలను తల్చుకుని బాధపడ్తాడు. టాంక్‍బండ్ మీద, జనం అంతగా లేని చోట బెంచీ మీద కూర్చుని గౌతమ్ గురించి, కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది హసంతి. వాళ్ళిద్దరి వల్ల ఏర్పడిన సమస్యని కాసేపయినా మర్చిపోయేందుకు కాలేజీ రోజులలోని సంఘటనలను గుర్తు చేసుకుంటుంది. కాసేపటికి సెల్ ఆన్ చేస్తే మిస్డ్ కాల్స్ – తల్లివి 12, గౌతమ్‌వి 7, ధృతివి 4, కార్తీక్‌వి 2 కనిపిస్తాయి. ఇంటికి వెళ్దామని లేస్తుంది. ఇంతలో దూరంగా కార్తీక్ కనిపిస్తాడు. దగ్గరకు వస్తాడు. ఆమె అతడిని పలకరించదు. ఇద్దరు ఒకరినొకరు మౌనంగా చూసుకుంటారు. అప్పుడే అక్కడకు వచ్చిన గౌతమ్ వాళ్ళిద్దరినీ చూసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. ఇంట్లో కవిత అసహనంగా పచార్లు చేస్తూంటుంది. లోపలికి అడుగుపెట్టిన కూతురిని చూసి, చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు, ఎంత కంగారు పడ్డామో అంటుంది. తల్లి మాటలు వినకుండా హసంతి పైకి వెళ్ళబోతుంది. అప్పుడే అక్కడికి గౌతమ్ వస్తాడు. హసంతితో వాదిస్తాడు. హసంతి చిరాకు పడి ఎదురు సమాధనం చెప్తుంది. గౌతమ్ బయటకు వచ్చేస్తాడు. తనకి తలనొప్పిగా ఉందట, కాసేపు ఒంటరిగా వదిలెయ్యండి అని కవితకి చెప్పి వెళ్ళిపోతాడు. ఇక చదవండి.]

[dropcap]అ[/dropcap]క్కడి నుంచి గౌతమ్ తన ఫ్రెండ్ డాక్టర్ నరేష్ దగ్గరికి వచ్చాడు.

“రా! రా కొత్త పెళ్లికొడకా!”

“డ్యూటీ ఉందా?”

“ఈ రోజు రెస్ట్”

“బయటికి వెళ్దాం రా! నీతో కొంచెం పర్సనల్‌గా మాట్లాడాలి” అన్నాడు గౌతమ్.

“సరే పద!” అని గౌతమ్‌తో బయలుదేరాడు నరేష్.

ఇద్దరూ కాఫీ డే కి వచ్చారు.

“ఏంట్రా! ఎలా ఉన్నావు? ఉడ్ బి తో క్లోజ్ అయ్యావా?”

“అదేరా ప్రాబ్లం” అని జరిగింది, జరుగుతున్నది చెప్పాడు.

అంతా విన్నాక “ఆమె నిన్ను ఇష్టపడుతోందా!” అడిగాడు నరేష్.

“ఇష్టం లేకపోతే పెళ్లి వరకూ వచ్చేది కాదుగా!”

“ఎప్పుడైనా నీతో ఐ లవ్ యు అని చెప్పిందా!”

గౌతమ్ ఏమీ మాట్లాడలేదు.

“నువ్వు చిన్న వయసు నుండి హసంతిని ప్రేమిస్తున్నానని అన్నావు కదా!”

“అవును అందులో అనుమానం ఏం ఉంది?”

“అయితే ఆమెకి ఏం నచ్చుతుందో, ఏం నచ్చదో నీకు తెలుసు కదా!”

“తెలుసు”

“అమ్మాయిలు తన మనసుకు నచ్చిన వాడు ఏది ఇచ్చినా.. ప్రాణప్రదంగా చూసుకుంటారు. లవ్‌లో అయితే ఇంకా ఎక్కువ. ఆ వస్తువు విలువ కూడా చూడరు. ఇచ్చే మనసు వెనక దాగున్న ప్రేమనే చూస్తారు. అలా నువ్వు ఇచ్చిన వస్తువు ఏదైనా తన దగ్గర ఉందా? వాడుతోందా? నువ్వు చూసావా?”

‘ఆపిల్ ఐ -ఫోన్ ఇచ్చాను. డైమండ్ రింగ్ ఇచ్చాను. కానీ అవి ఏనాడూ హసంతి వాడటం చూడలేదు’ తనలో తనే అనుకున్నాడు గౌతమ్.

“చెప్పు ఆ అమ్మాయి వాడటం చూసావా?”

బ్లాంక్‌గా మొహం పెట్టాడు గౌతమ్.

అంతలో గౌతమ్‌కి తండ్రి ఫోన్ చేశాడు.

“సరే మా డాడీ ఫోన్ చేసి రమ్మంటున్నాడు రా! వెళ్దాం. కలుస్తాను” అని లేచాడు. ఇద్దరు బయటికి వచ్చారు.

***

అమ్మవారి గుడి దగ్గరికి హసంతి కుటుంబం, గౌతమ్ కటుంబం కలిసి కారులో వచ్చారు. ధృతి, స్వప్న మోపెడ్ మీద వచ్చారు.

పూజారి వాళ్ళను చూసి

“రండి రఘురాం గారూ! మీరు వచ్చి చాలా రోజులైంది” అన్నాడు.

“అవునండీ! మా ఇంట్లో పెళ్లి పెట్టుకున్నాం. మా అబ్బాయి గౌతమ్‌కి, మా చెల్లెలి కూతురు హసంతికి పెళ్లి.”

“శుభస్య శీఘ్రం”

హసంతి, గౌతమ్ ఎదురెదురుగా కూచున్నారు. హసంతి పక్కన ధృతి, స్వప్న కూచున్నారు.

గౌతమ్‌తో సుధాకర్, నరేష్, రవి కూచున్నారు.

“హసంతి గారూ! కొంచెం నవ్వండీ!” అన్నాడు సుధాకర్.

వెంటనే “మీ గౌతమ్ గారిని నవ్వించమనండి” అంది ధృతి.

వెంటనే గౌతమ్ “ఏయ్ గుల్ఫీ నవ్వు” అన్నాడు.

హసంతి మాత్రం ఫక్కున నవ్వింది.

“గుల్ఫీ ఏంట్రా? బాబు! నువ్వు అనటం, ఆవిడ నవ్వడం” అన్నాడు సుధాకర్.

“వాళ్ళిద్దరి మధ్య కోడ్ లాంగ్వేజ్ ఏమో! మనం కూడా నవ్వుదాం.. గుల్పి గుల్పి” అంది ధృతి.

అక్కడున్న వాళ్లంతా నవ్వారు.

“హసంతి నువ్వు కూడా దణ్ణం పెట్టుకో” అని తల్లి బొట్టు పెట్టింది.

“అయ్యా! పూజ మొదలు పెడుతున్నాను” అన్నాడు పూజారి.

సరిగ్గా అప్పుడే కార్తీక్ గుడిలోకి వచ్చాడు.

ఎంట్రన్స్ లోనే హసంతి వాళ్లను చూశాడు. దూరంగా వాళ్ళకి కనపడకుండా నిలబడ్డాడు. గౌతమ్, హసంతి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని చూశాక ఓ నిర్ణయానికి వచ్చాడు కార్తీక్.

పూజారి అమ్మవారికి హారతి ఇచ్చాడు.

“పూజారి గారూ! అమ్మవారి పాదాల దగ్గర పెళ్ళి పత్రిక పెట్టి పూజ చెయ్యండి” అని కళ్యాణ పత్రిక తీసి పూజారికి ఇచ్చాడు రఘురాం.

పూజ అయ్యాక..

“పత్రికని అమ్మవారి సన్నిధిలో ఒక పర్యాయం చదవండి” అన్నాడు.

“దానికేం భాగ్యం” అని పెళ్లి పత్రిక పెద్దగా చదివాడు పూజారి.

అందరూ తీర్థప్రసాదాలు తీసుకుంటున్నారు.

కుటుంబం తల్లి తండ్రి అన్నా అక్క చెల్లి తమ్ముడు పిల్లలు ఎంత హాయిగా ఉంటుంది తనకి మాత్రం ఇవేవీ లేకుండా ఒంటరిగానే పెరిగాడు. ఏదీ తనంత తానుగా నా దగ్గరికి రాలేదు ఆఖరికి ప్రేమ కూడా వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది

కుటుంబ బంధాలు ఆప్యాయతలు ఉన్న హసంతికి గౌతమ్‌కి పెళ్లి జరగటమే న్యాయం – అనుకుని ఓ నిర్ణయానికి వచ్చిన వాడిలా వాళ్ళకి కనిపించకుండా కార్తీక్ బయటికి వేగంగా వెళ్ళాడు.

***

హసంతి కవిత కూర్చుని పట్టు చీరలు చూస్తున్నారు. ధృతి వచ్చింది.

“రావే! ధృతీ! హసంతి కోసం పెళ్లి చీరలు తీసుకొచ్చాం. చూడు” అని నాలుగు కవర్లు టీపాయ్ మీద పెట్టింది కవిత.

ధృతి నాలుగు పట్టుచీరలు తీసి, చూసి..

“హసంతీ! ఈ నాలుగింటిలో ఏ కలర్ నీకు నచ్చిందే” అని అడిగింది.

హసంతి చూసి నెమలి పింఛం డార్క్ బ్లూ కలర్ చూపించింది.

అక్కడే కూర్చున్న కవిత

“హసంతికి ఈ డార్క్ గ్రీన్ కలర్ శారీ బాగుంటుంది. చూడు” అంది.

హసంతి తల్లి వైపు పరితాపంగా చూసింది. తనకి నచ్చిన శారీ పక్కన పెట్టి, తల్లి చెప్పిన డార్క్ గ్రీన్ సారీ తీసుకోబోయింది.

వెంటనే ధృతి దానిని పక్కన పెట్టి..

“ఏయ్! నిజంగా నీకు ఏది నచ్చిందో చెప్పవే?”

హసంతి తనకు నచ్చింది మౌనంగా చూపించింది.

“మరి ఆ గ్రీన్ శారీ ఎందుకు చూపించావు? మీ అమ్మని శాటిస్ఫై చేయడానికా? ఇది చాలా చిన్న విషయం హసంతీ! కన్ఫ్యూషన్ ఎందుకు? చూడటానికి అన్నీ బాగానే ఉంటాయి. నీకు ఏది కావాలో నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. చిన్న చిన్న విషయాలకి కాంప్రమైజ్ కావటం అలవాటు అయితే జీవితంలో పెద్ద పెద్ద నిర్ణయాలు ఎలా తీసుకుంటావు? మొదట నీకు ఏది కావాలనేది నీకు తెలియాలి. లేకపోతే జీవితంలో చాలా బాధపడతావు. నేను వెళ్తున్నాను” అని ధృతి బయలుదేరింది.

హసంతి తనకు నచ్చిన బ్లూ శారీ, తల్లికి నచ్చిన గ్రీన్ శారీ రెండు చేతుల్లో పట్టుకుని మార్చి, మార్చి చూసింది.

‘అవును ధృతి చెప్పిందే కరెక్ట్. నాకేం కావాలో నేనే నిర్ణయించుకోవాలి. లేకపోతే కాంప్రమైజ్ అవ్వాలి. అమ్మో! కాన్ఫిడెంట్ గా ఉండే నేను, కాంప్రమైజై బతకలేను’ అని లేచి డ్రెస్ చేసుకుని బయటికి వచ్చింది.

***

“చేజారిపోతే,

నే రాలిపోతా,

నువ్వు కాదని అంటే

నా శ్వాస ఆగిపోదా”

పాట మనసులోనే హం చేసుకుంటూ.. ఎప్పుడూ కార్తీక్ కన్పించే రోడ్డుపక్క టీ స్టాల్ దగ్గరికి వచ్చింది. దూరంగా అతనున్నాడేమోనని చూసింది.

కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని చేతి కడియాన్ని తీసి, టేబుల్ మీద గుండ్రంగా తిప్పుతూ ఆలోచిస్తున్నాడు.

ప్రేమ గొప్పదా? ఆరాధన గొప్పదా? అంటే ఆరాధనే గొప్పదని అనిపిస్తుంది.

ప్రేమించుకోవడానికి ఇద్దరు మనుషులు కావాలి. కానీ ఆరాధించటానికి ఒక ప్రేమించే హృదయం చాలు.

ప్రేమలో దూరాలు రావొచ్చేమో కానీ, ఆరాధనలో తాము ప్రేమించేవారు ఎప్పుడూ వారి హృదయంలోనే ఉంటారు.

ఫోన్‌లో వాట్సప్ మెసేజ్ చూస్తూ, టీ తాగుతూ, మళ్లీ మళ్లీ రింగు తిప్పుతున్నాడు.

ప్రేమ, ఆరాధన అంతా ట్రాష్.

హసంతీ! ప్రేమించినంత తొందరగా, మర్చిపోవడం అలవాటు చేసుకుంటేనే ప్రేమించాలనుకుంటాను.

ప్రేమ ఒక్క క్షణంలో పుడితే మర్చిపోవడానికి కొంత టైం తీసుకుంటుంది. పర్వాలేదు.

‘రెండు రోజులు బాధగా ఉంటుంది. నాలుగు రోజులు ఇబ్బందిగా ఉంటుంది. ఒక వారం తర్వాత రొటీన్ అవుతుంది. తప్పదు అని తెలిసినప్పుడు తపస్సు చేసినా తప్పించుకోలేం. ఇదే ప్రతి ఓటమి ప్రేమ వెనక ఉండే వాస్తవం.’ అనుకున్నాడు.

అంతలో..

రోడ్డు మీద హార్న్ సౌండ్ పెద్దగా వినిపిస్తుంటే తల తిప్పి చూశాడు. తన బైక్‌కి సమీపంలో నిలబడ్డ హసంతి కనిపించింది.

‘నిజమేనా?!?’ అనుకుని, మళ్ళీ చూశాడు.. దగ్గరికి  వెళ్దామని అనుకున్నాడు. అంతలో ఆలోచన విరమించుకున్నాడు. తీరా దగ్గరికి వెళ్ళాక

‘నాకు పెళ్లి కుదిరిందని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అని ఛీత్కారంగా మాట్లాడితే.. తన చిన్ని గుండె ఇహ తట్టుకోలేదు’ అనుకొని వేగంగా లేచి, ఆమెకి కనిపించకుండా పక్కకెళ్లాడు.

హసంతి నిరాశగా చూసి ‘ప్రతిక్షణం నీకు దూరం కావాలని అనుకుంటున్నాను. కానీ అనుక్షణం నీ ఆలోచనలతో నీకు మరింత దగ్గరవుతున్నా!’ అనుకుని కళ్ళు  తుడుచుకుంటూ..

‘ఇప్పుడు నేను ఎవరికి జవాబుదారీ.. నన్ను ఇష్టపడ్డ గౌతమ్‌కా? నేను ఇష్టపడుతున్న కార్తీక్‌కా? లేకపోతే నన్ను ఇష్టపడుతున్న ఇద్దరికీనా?’ అనుకుంటూ వేగంగా ఇంటికి వెళ్ళింది.

***

కార్తీక్ బట్టలు బ్యాగుల్లో సర్దుకుంటున్నాడు. గుమ్మంలో ధృతి నిలబడి

“లోపలికి రావచ్చా! కార్తీక్” అంది.

“వచ్చి, రావచ్చా! అంటావేంటి? ఏంటి? ఇక్కడ ఇంత దూరం వచ్చావు?”

“రాకూడదా?”

“ఎందుకు? ఎవరైనా చూస్తే బాగుండదు”

“చూడకపోతే బాగుంటుందా” అంది ధృతి.

“ఇప్పుడేం కావాలి నీకు.”

“ఎక్కడికెళ్తున్నావు? కార్తీక్!”

“నీకెందుకు అది” అన్నాడు కోపంగా.

“హసంతిని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా!”

“నిన్నటి వరకూ ప్రేమించాను. కానీ ఇప్పుడు కాదు.”

“ఆహా! నిన్నటిదాకా ప్రేమించి, ఇప్పుడు ఎస్కేపా!?”

“నువ్వేమైనా అనుకో” అన్నాడు కోపంగా.

“కోపం తెచ్చుకోకుండా కార్తీక్! ఇప్పుడు చెప్పు”

“నేనేమైనా కథ చెబుతున్నానా! చూడు ధృతీ! నీకు ఇది ఆటలా అనిపించొచ్చు. కానీ నాకు అలా కాదు జీవితం. అర్థం చేసుకో”

“ఎందుకంత సీరియస్ కార్తీక్! ప్రేమించిన అమ్మాయి ప్రాబ్లమ్స్‌లో ఉంటే వదిలి వెళ్ళిపోతావా?”

“నువ్వెలా అనుకుంటే అలాగే.. అనుకో. కానీ గౌతమ్‌కి ద్రోహం చేయలేను. అతను చెప్పిన ప్రతి మాట నా చెవుల్లో విన్పిస్తోంది. ప్రేమించిన వాళ్ళంతా ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటారో! లేదో! చివరి నిమిషం వరకు ఎవరికీ తెలియదు. కానీ ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. ఇక మీదట ఇదే ఎన్విరాన్మెంట్లో ఉండటం నా వల్ల కాదు. అది కరెక్ట్ కాదు కూడా.”

“ఓ! అంటే నీ లవ్‌ని త్యాగం చేసి వెళ్తున్నావు. అంతేగా! చూడు కార్తీక్! ఇది జీవితం. ఒక్క సెకండ్‌లో అంతా ముగిసిపోతుంది. తర్వాత ఏం చేసినా ఆ క్షణం తిరిగి రాదు. త్యాగం చేస్తున్నాడట పేద్ద త్యాగం.”

“చాలా బాగా చెప్పావు ధృతి! ఈ ప్రపంచంలో దేన్నైనా కొలవడం సులభమేమో గానీ, మగవాడి హృదయం భరించే వేదనను కొలవడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదు. అది అసాధ్యం. అది ఎవరికి అర్థం కాదు కూడా” అని కార్తీక్ కోపంగా చూసాడు.

“నువ్వు నీ గురించే ఆలోచిస్తున్నావు. కాని ఒక్క నిమిషం హసంతి గురించి ఎప్పుడైనా గురించి ఆలోచించావా? నువ్వు సెల్ఫిష్ కార్తీక్.”

“నేనేదో తనని ప్రేమించి మోసం చేసినట్టు మాట్లాడుతున్నావు. ఏంటి తను నన్ను ఇష్టపడుతోందన్న విషయం తెలిసి, తనకోసం ఎంతో తిరిగాను. వెతికాను. అడ్రస్ తెలియగానే, ఆమె కోసం వెతుక్కుంటూ వెళ్లాను.

తను కనిపించిన మొదటిసారే ‘నాకు పెళ్లి ఫిక్స్ అయింది. నన్ను వదిలి వెళ్ళు’ అంది. ఆ తర్వాత కూడా ఎన్నోసార్లు ప్రయత్నించాను. ప్రతిసారీ ‘నువ్వు నన్ను డిస్ట్రర్బ్ చేయకు. దయచేసి నన్ను వదిలి వెళ్ళు’ అని దండం పెట్టింది.

చూడు! ధృతీ! నువ్వేం చెప్పినా, నా నిర్ణయం మారదు. నిన్న వాళ్ళ కుటుంబాన్ని చూశాక అంతా ముగిసిపోయింది. ఇప్పుడు నా వల్ల ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. ఇప్పుడు హసంతి వచ్చి నన్నే ప్రేమిస్తున్నానని, పెళ్ళి చేసుకుంటానని చెప్పినా నా నిర్ణయంలో మార్పు ఉండదు” అని బట్టలు సర్దుకుంటున్నాడు.

“నీ పాటికి నువ్వు వదిలేసి వెళ్ళిపోతే.. ఎలా!? తనంత బాధలో ఉంటే.. మనసారా ప్రేమించిన నీ దగ్గరికే వచ్చి నువ్వు నాకు వద్దని చెప్పిందంటే.. చెప్పడానికి తనెంత బాధపడ్డదో ఆలోచించావా! నిన్ను కాదని తను అక్కడ సుఖంగా ఉందనుకుంటున్నావా? నీతో ఎవరైనా ఉంటే.. కదా! నీకు ఆ బాధ తెలిసేది. నీకు ఇంకొకళ్ళ ఫీలింగ్స్ అర్ధం కావుగా!” అంది.

కార్తీక్ ముందుకొచ్చి “ఇప్పుడు నన్నేంచేయమంటావు?” అన్నాడు గట్టిగా.

“నిజంగా నువ్వు హసంతికి వెల్ విషర్‌వి అయితే, దాని పెళ్లయ్యే వరకూ ఉండి, ఆ తర్వాత ఎక్కడికి కావాలంటే.. అక్కడికి వెళ్ళు” అని ధృతి వెళ్ళిపోయింది.

కార్తీక్ విరక్తిగా.. ‘అవును ఎవరైనా ఉంటేగా! ఇంకొకళ్ళ ఫీలింగ్స్ తెలిసేది’ అనుకున్నాడు. బాల్యం కళ్ళ ముందు కదిలింది. బాల్యంలోనే తల్లీదండ్రు పోయాక, బంధువుల ఇళ్ళల్లో ఉంటూ.. అక్కడ తంతే ఇక్కడ, ఇక్కడ తంతే అక్కడ.. అన్నట్టు కష్టాల మధ్య కసితో చదివిన ఇంజనీరింగ్, ఉద్యోగం, సంగీతం అన్నీ అద్భుతాలే.

‘ఎడారి ప్రయాణంలో ఒయాసిస్సులా కనిపించిన ప్రేమ కూడా ఆవిరే.. నీళ్లు కాదని తెలిసాక, మనుషుల కోసం మనసుల కోసం నా దాహం జీవితంలో తీరేది కాదని తెలిసి పోయాక.. ఎక్కడుంటే ఏం?’ అనుకొని బ్యాగ్‌లో సర్దిన బట్టలన్నీ తీసి విసిరి కొట్టాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here