వి. శాంతి ప్రబోధ రచించిన 11 కథల సంపుటి ‘గడ్డి పువ్వు గుండె సందుక’.
“పువ్వులా సహజంగా విరియాల్సిన పసితనం విషం గానూ శాపంగానూ మారడానికి కారణమయ్యే పరిస్థితుల గురించి ఆలోచించడం వాటిని నడిపే సామాజిక రాజకీయ శక్తుల గురించి విశ్లేషించడం వాటినుంచి బయట పడటానికి దారులు అన్వేషించడం … యీ క్రమంలో కల్గిన వొక అలజడిలోంచి వొక ఆవేదనలోంచి వొక అశాంతిలోంచి పుట్టినవే శాంతి ప్రబోధ కథలు. నిజానికి యివి తప్పటడుగుల బాల్యం కాలి బొటన వేలికి తాకిన పోట్రవుతు దెబ్బలు. రక్తమోడుతున్న రసి కారుతోన్న లోతైన మానని ఆ గాయాలకి మందు పూసి కట్టుకట్టే మానవీయ స్పందనలో భాగంగా వెలువడ్డ యథార్థ కథనాలని “పూల మనసుల్లోకి…” అనే ముందుమాటలో ఏ. కె. ప్రభాకర్ రాశారు. “ఈ కథలన్నీ సూటిగా వుంటాయి. డాంబిక శైలి యెక్కడా కనిపించదు. శిల్ప ప్రయోగాల జోలికి పోలేదు. నిరాడంబరంగా సాదా సీదాగా వుండటం వల్ల కథలు సహజంగా మొదలై అంతే సహజంగా ముగుస్తాయి. అందుకే కృత్రిమ పరిష్కారాల ముగింపుల్లేవు” అన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తపరిచారు.
అమ్మ లాలన, నాన్న ఆప్యాయత కూడా అందుకోలేని వర్తమానంలో జాలి మాటలో… కరకు చూపులో… కఠిన పనులో వెంటాడుతుంటే, పసివాడని పాలబుగ్గల బాల్యం ముక్కలు చెక్కలై రక్తమోడుతూంటే, బాల్యపు గుండె గొంతుక మూగపోతుంటే.. చూసి భరించలేని హృదయపు భారాన్ని దింపుకోవటానికి ఈ కథలు రాశానని రచయిత్రి వివరించారు.
***
గడ్డి పువ్వు గుండె సందుక (బాల్యం చెప్పిన కథలు)
వి. శాంతి ప్రబోధ
పేజీలు: 136, వెల: 100/-
ప్రతులకు: అన్ని ప్రధాన పుస్తక కేంద్రాలు
సంచిక బుక్ డెస్క్