“గధేడో” అనే చదువుకున్న గాడిదల కథ

0
7

[box type=’note’ fontsize=’16’] “లఘు చిత్రంలో దాన్ని చెప్పిన తీరు, వాడుకున్న కెమెరా కోణాలు, విడివిడి దృశ్యాలు కలిపిన మాంటేజీల తీరు అన్నీ చాలా బాగున్నాయి” అంటున్నారు పరేష్ ఎన్. దోషి ‘గధేడో’ లఘుచిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

మొన్నా మధ్య “జగ్గా జాసూస్” అనే సినెమా వచ్చింది. ఆడలేదు గాని బలే చిత్రం. indulgence అంటామే ఇంగ్లీషులో, కేవలం అదే. సినెమా గురించి కలలు కనేవాళ్ళు కూడా క్రేజీగా రంగుల్లో కలలు కంటారు. కాని ఆ కలలలోని పిచ్చిని తెరకెక్కించడం అంత సులువు కాదు. ఆ విశాల environs, రకరకాల ఇళ్ళూ పరిసరాలు, రకరకాల రంగులు, రకరకాల నాటకాలూ, మలుపులూ. పూర్తిగా వో పిచ్చి చిత్రం, పిచ్చెక్కించే చిత్రం.

అయితే అంత సాహసం చెయ్యడానికి అందరికీ వీలుండదు. ఆ క్రియేటివిటీని తెరకెక్కించడానికి మొదటి మెట్టు లఘు చిత్రం. ప్రస్తుతం చర్చించుకుంటున్న చిత్రం “గధేడో” ఒక సెటైర్. ఒక రాజస్థానీ జానపద గాధ ఆధారంగా జయ్ శర్మ వ్రాసిన కథ ఆధారంగా తీసిన చిత్రం ఇది. కథగా బాగుంది. కాని లఘు చిత్రంలో దాన్ని చెప్పిన తీరు, వాడుకున్న కెమెరా కోణాలు, విడివిడి దృశ్యాలు కలిపిన మాంటేజీల తీరు అన్నీ చాలా బాగున్నాయి.

మాస్టర్జీ (చందన్ కుమార్ సాన్యాల్) ఒక రాజస్థాన్ పల్లెలో బడిపంతులు. ఏదో లోకంలో వుంటాడు, మాలోకంలా. తనకే ఇంగ్లీషు రాదు. తప్పుతడకలతో నేర్పిస్తుంటాడు. mande అంటే మంగళవారం అంటూ. బోర్డు నుంచి తల తిప్పడు. వెనకాల పిల్లలు వాళ్ళ ఆటల్లో వాళ్ళు ఉంటారు. కొంతమందికి గోడ కుర్చీ లాంటి శిక్షలు పడుంటాయి. వాళ్ళు ఆ పనిలో వుంటారు. నిద్రపోయేవాళ్ళు నిద్రపోతుంటారు. అదే వూళ్ళో గోరూ ధోబి (విక్రాంత్ మేస్సి) అతని భార్య (తృప్తి ఖాంకర్) వూరి జనాల బట్టలు ఉతుకుతుంటారు. చాకలి జంట. వొక గాడిద వుంది కానీ, మెయ్యడం తప్ప మరో పని చెయ్యదు. వో పది వాషింగ్ మషీన్లు పెట్టుకుని బట్టలు ఉతుకుతుంటారు. ఓ రోజు గోరూ మాస్టర్ని అడుగుతాడు, ఎప్పుడు చూసినా పిల్లలు మిమ్మల్ని మూగి వుంటారు ఏమి రహస్యం అని. మరి నేను చేసే పని మామూలుదా, గాడిదలను మనుషులు గా మారుస్తాను మరి. (గాడిదలను మనుషులుగా మార్చడం అంటే, అక్షరం ముక్క రాక గాడిదతో సమానులైన పిల్లలను చదివించి మనుషులుగా మార్చడం. వో సామెత లాంటిది. మనదగ్గర కూడా చదువు రాని గాడిద అంటామే అలా). గోరూ దాన్ని లిటరల్ గా తీసుకుని, నా గాడిదను కూడా మనిషిగా మార్చి ఇవ్వండి అంటూ డబ్బు ఇస్తాడు. మాస్టర్ ఆ గాడిదని తీసుకెళ్ళి అమ్మేస్తాడు. ఇక గోరూ రోజూ వెంటపడటం, నా గాడిద మనిషిగా మారిందా, ఎంత వరకు వచ్చింది? అని. స్వాతిముత్యం లో ఉద్యోగం కోసం కమల్ హాసన్ వెంటపడినట్టు. చివరికి విసుగొచ్చి మాస్టర్ అంటాడు, ఓ మార్చేశాను, ఇప్పుడది సిటీలో తహసీల్దారు అని. గోరూ అతని భార్య సంతోషంగా దాణా, తాడు తీసుకుని పట్టణం వెళ్తారు. తహసీల్దారును చూసి భార్య దాణా చూపిస్తూ దా దా అంటే, గోరూ తాడు పట్టుకుని సిధ్ధంగా వుంటాడు కట్టేసి తీసుకెళ్ళడానికి. అటెండర్ వచ్చి ఇద్దరినీ బయటకు తీసుకెళ్తాడు, ఏమిటీ పిచ్చి పనులు అంటూ. లేదు, అది మా గాడిదే, మేము ఎట్లాగైనా తీసుకెళ్తాము అంటాడు గోరూ. వెనక నుంచి వచ్చిన తాసిల్దారు భార్యా భర్తలిద్దరినీ తంతాడు. దాణా చెల్లా చెదురవుతుంది. తాడు ఎటో పడిపోతుంది. నేల మీద పడ్డ గోరూ నెమ్మదిగా లేచి, నడుమూ, పిరుదులూ నిమురుకుంటూ మనసులో అనుకుంటాడు : మనిషి గా మారినా (తన్నడం) గాడిద బుధ్ధులు పోలేదు.

పల్లెల్లో చదువుల గురించిన ఈ సటైర్ మనం ఎక్కడ ఆపాదించినా అతికేటట్టు వుంది. గాడిదని గుజరాతీలో గధేడో అనీ, మార్వాడీలో గధో అనీ అంటారు. బహుశా ఆ పల్లె గుజరాత్-రాజస్థాన్ బోర్డర్ లోది అయి వుండవచ్చు. సంభాషణలు మార్వారీలో వున్నాయి. ఆ క్రేజీ షాట్స్, చందన్, విక్రాంత్ ల నటన గొప్పగా వున్నాయి. చందన్ కుమార్ సాన్యాల్ ఇదివరకు “ప్రాగ్/ప్రాహా” లాంటి చిత్రాల్లో చేశాడు. మంచి నటుడు. కాని ఎందుకో ఎక్కువ అవకాశాలు వచ్చినట్టు లేదు. అతని నటని ఇందులో బాగుంది. ఇక విక్రాంత్ మాస్సీ ఈ మధ్యే వచ్చిన మంచి నటుడు. డెథ్ ఇన్ అ గంజ్, లిప్స్టిక్ అండర్ బుర్ఖా లాంటి చిత్రాల్లో వచ్చాడు. ఇందులో చెయ్యడానికి ఎక్కువ లేదు గాని, అతను తన ఎక్స్ప్రెషన్స్ తో ప్రతీ ఫ్రేమునీ ప్రత్యేకంగా తీర్చిదిద్దాడు. సంభాషణలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వమూ జయ్ శర్మ చక్కగా చేశాడు. సచిన్ పిళ్ళై చాయాగ్రహణం స్క్రీన్‌ప్లే కు న్యాయం చేసే విధంగా వుంది.

మరో మంచి లఘు చిత్రం. చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here