గ్రహణం

0
7

[dropcap]అ[/dropcap]మ్మాయి పుడుతుందా! అబ్బాయి పుడతాడా! అనే ఎడతెగని ఆలోచనలతో సతమతమవుతూ ఆసుపత్రి కారిడార్‌లో శంకర్ అటూ ఇటూ తిరుగుతున్నాడు. తల్లి, తండ్రి, అన్న ఒక బెంచి మీద కూర్చుని మాటల్లో మునిగి పోయారు.

కొద్దిసేపటికి లోపలి నుంచి సిస్టర్ బయటకు వచ్చి “మీకు అబ్బాయి పుట్టాడు” అని చెప్పింది. శంకర్ మోహం విప్పారింది. ఎక్కడ అమ్మాయి పుడుతుందో అని భయం భయంగా ఆలోచిస్తున్నాడు. అమ్మాయి అంటే అంత ఖర్చే. తన అదృష్టం బాగుండి అబ్బాయి పుట్టాడు. గంపెడంత సంతోషంతో రూము లోపలికి అడుగు పెట్టాడు. భార్యను పలకరించకముందే ఉయ్యాల వైపు అడుగులు వేశాడు. ఉయ్యాలలో ఉన్న పిల్లవాడిని చూసి మొహం వివర్ణమైంది. అసహ్యంగా నొసలు ముడి పడ్డాయి. అలాగే బయటకు వెళ్ళిపోయాడు శంకర్. భర్తతో మాట్లాడాలని ఎదురు చూస్తున్న సీత ఏమీ పలక్కుండా బయటికెళ్తున్న శంకర్‌ను ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది.

“బాబూ! తల్లి బిడ్డ కులాసానా!” అంటూ అత్తమామలు ఎదురొచ్చారు. వాళ్ళను చూడగానే శంకర్‌కు కోపం తన్నుకొచ్చింది. “సీత పోయిన నెలలో మీ ఇంటికి వచ్చింది కదా! అప్పుడు సూర్యగ్రహణం వచ్చింది కదా! అప్పుడు సీతను ఇంట్లో ఉంచకుండా బయట తిప్పారు కదూ!” కోపంతో ఉగిపోతూ మామను అడిగారు.

“అదేమిటి శంకర్! గ్రహణం సమయంలో గర్భిణిని బయట ఎలా తిప్పుతాం. మాకు మాత్రం తెలియదా! అయినా ఇప్పుడా సంగతి దేనికి అడుగుతున్నావు” మామకు అర్థం కాక అడిగాడు.

“ఎందుకా! లోపలికి వెళ్ళి నీ మనవడిని చూసిరా! అప్పుడు తెలుస్తుంది” అదే కోపంతో అన్నాడు.

అప్పటి దాకా అక్కడే కూర్చున్న శంకర్ అమ్మానాన్నలు ముందుకొచ్చి “ఏమైందిరా?” అని అడిగారు. ఏం అయిందో అర్థంకాక శంకర్ అత్తామామలు కూడా అలాగే నిలబడ్డారు.

“చూడమ్మా! వీళ్ళు జాగ్రత్తగా చూడరనే కాన్పుకు నేను వాళ్ళింటికి పంపించనన్నాను. ఏదో ఒక్కసారి మా ఇంటికి తీసుకెళ్తానంటే సరేనన్నానా! చూడు పిల్లాడికి ఇప్పుడు గ్రహణం మొర్రి వచ్చింది. మొన్న గ్రహణంలో వీళ్ళు సీతను పట్టించుకోకుండా బయటకు పంపి ఉంటారు” భాదతో ఏడుస్తూ శంకర్ తల్లితో అన్నాడు.

“అయ్యో నాయనా! ఏమంటున్నావు. పిల్లాడికి గ్రహణం మొర్రి వచ్చిందా. మగ బిడ్డ పుట్టాడని సంతోష పడుతుంటే ఇదేం ఖర్మరా” అంటూ శంకర్ అమ్మ ఏడుపు మొదలు పెట్టింది.

ఇంతలో శంకర్ తండ్రి, అత్తమామలు లోపలికి వెళ్ళి పిల్లవాడిని చూశారు. పిల్లవాడు ముచ్చటగానే ఉన్నాడు కానీ పై పెదవి మొత్తం చీలిపోయి ఉన్నది. సీతను పట్టుకొని ఆమె తల్లి తండ్రి ఏడవడం ప్రారంభించారు. సీత అయోమయంలో పడి పోయింది. ఏమయిందంటూ ఆదుర్దాగా అడిగింది.

ఉయ్యాల్లో పిల్లాడిని తీసుకువచ్చి సీతకు చూపించింది తల్లి. సీత అప్పటిదాకా పసివాడిని చూడలేదు. పై పెదవి చీలిపోయి ఉన్న పిల్లవాడిని చూసి సీత కూడా ఏడవడం మొదలుపెట్టింది.

శంకర్ తల్లిదండ్రి శంకర్‌తో పాటుగా సీత తల్లిదండ్రుల్ని నిందించటం మొదలుపెట్టారు. “గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి కదా! గర్భంతో ఉన్న పిల్లను బయిట ఎలా తిప్పుతారు. మా వారసుడనే కదా మీకీ చిన్న చూపు. మీ ఇంటికి పంపడమే మా బుద్ధి తక్కువ. సన్న కిరణాలు కూడా రాకుండా బట్టలు కట్టి చీకట్లో ఉంచుతారు, మీకేం పట్టలేదు.” అన్నారు.

సీత తల్లిదండ్రులు కూడా బాధపడుతూ “మీ మనవడైతే మాకు మాత్రం మనవడు కాదా! అట్ల అనవద్దు వదినా! మేము బయటికే రానియ్యలేదు సీతని. తలుపులు కూడా తియ్యలేదు. గ్రహణం అయిపోయాక ఇల్లంతా శుధ్ధి చేశాక స్నానాలు చేశాకనే అన్నాలు తిన్నాం. అప్పటి దాకా అన్నాలు కూడా వండలేదు. గ్రహణం కాలంలో వండిన పదార్థాలు చెడి పోతాయి కదా!” అన్నారు.

“మీరంత జాగ్రత్తగా నిష్టగా ఉన్నట్లయితే పిల్లాడికి పెదవి చీలిక ఎట్లోచ్చింది. ఊరికే మాతో మాట్లాడటం కాదు. ఆ పిల్ల వాడిని జీవితాంతం ఎలా సాకాలి? అసలు పిల్లాడికి ఈ సమస్య ఎట్లోచ్చింది చెప్పండి?” అంటూ శంకర్ నిలదీశాడు.

“నేను చెప్తాను వినండి” అంటూ వెనక నుంచి మాటలు వినపడగానే అందరూ వెనక్కి చూశారు.

అక్కడ ఆ హాస్పిటల్ డాక్టర్ ప్రసాద రావు నిలబడి ఉన్నాడు. “ఈ జబ్బు లేదా లోపానికి సూర్యగ్రహణం లేదా చంద్ర గ్రహణం కారణం కాదు. మేనరిక సంబంధాల వాళ్ళ ఇలాంటి జబ్బులు రావచ్చు లేదా గర్భం ఏర్పడేటప్పుడు జరిగే ఉత్పరివర్తనాల వలన రావచ్చు లేదా అనువంశికంగా తాత ముత్తాతల నాటి జబ్బుల వలన రావచ్చు. క్రోమోజోములు అతుక్కునే విధానాన్ని బట్టి అనేక జబ్బులు వస్తుంటాయి. కారణం చెప్పలేము. కానీ గ్రహణ సమయంలో గర్భిణి బయటకు వచ్చినందుకు మాత్రం ముమ్మాటికీ కాదు.” అన్నాడు.

“గ్రహణం వల్లనే వస్తుందని పూర్వం నుంచి పెద్దోళ్ళు చెప్తున్నారు కదా సార్! మీరు కాదని ఎట్లా చేస్తారు” అంటూ శంకర్ అమాయకంగా డాక్టర్‌ను ప్రశ్నించాడు.

“శంకర్, గ్రహాల చలనాల గురించి కనుక్కోక ముందు పూర్వ కాలం వాళ్ళు ఏర్పరచుకున్న భావన అది. కానీ ఈనాడు మనం గ్రహాల గురించి గ్రహణాల గురించి ఎంతో తెలుసుకున్నాం. ఉపగ్రహాలను విశ్వం లోకి పంపి ఫోన్లు, టివిల వంటివి మాట్లాడటం చూడటం చేస్తున్నాం. వరదలు, గాలి వానల్లాంటివి ఎప్పుడు వస్తాయో ఎప్పుడు తగ్గి పోతాయో తెలుసుకుంటున్నాం. అన్నిటికి మించి చంద్రుని వద్దకు అంగారకుని వద్దకూ యాత్రలు చేస్తున్నాం. కాబట్టి గ్రహణాలకూ  ఈ గ్రహణం మొర్రికి ఈ సంబంధం లేదు.

గర్భం ఏర్పడేటపుడు జరిగే కొన్ని ఉత్పరివర్తనాల వలన ఇవి జరగవచ్చు. దానికేం బాధపడద్దు. ఇప్పుడు వాటికీ ఆపరేషన్లు వచ్చాయి. ఆపరేషన్ వలన ఎలాంటి ప్రమాదం ఉండదు. చీలిపోయిన పెదవిని దగ్గరకు పెట్టి కుట్టేస్తాం. దీని గురించి బాధపడకు” డాక్టరు నిదానంగా సావధానంగా వివరించాడు.

“అంతేనా సార్ మీరు చెపితే సరే! మీరే ఆపరేషన్ చేయండి” అన్నాడు శంకర్. “మీరు చెపితే మాకు నమ్మకం” అంటూ శంకర్ తల్లిదండ్రులూ, సీత తల్లిదండ్రులా తలాడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here