‘గాజుల’ మల్లయ్య

0
9

[box type=’note’ fontsize=’16’] కన్నడంలో బాలచంద్ర భట్ గారు రచించిన ‘బళేవోడు’ అనే కథని తెలుగులోకి అనువదించి అందిస్తున్నారు శ్రీ కల్లూరు జానకిరామరావు. [/box]

[dropcap]టౌ[/dropcap]న్ కెళ్లిన నాన్న, అన్నయ్య ఇంకానూ ఇంటికి రాలేదు. పుట్టింట్లో ఏదో శుభకార్యానికని వచ్చిన నాకు ఈ రోజే తిరిగి వెళ్లిపోవాల్సి వచ్చి, “అమ్మా! అన్నయ్య వాళ్లకి ఫోన్ చేయనా త్వరగా రమ్మని” అని అన్నప్పుడు, “ఏంటే నీకంత తొందర, పోవాల, పోవాల అని ఒకటే పోరు. అమావాస్య అయినాక పోదూగానీలే,” అని అమ్మ అంటుండగా, బయట్నుంచి, “అమ్మగారూ, అమ్మగారూ,” అని ఎవరో పిల్చినట్టయి బయటకొచ్చి చూశా. తొన్ను పట్టి,  కృశించి పోయిన ఓ ముసలాడు చేతిలో జోలెలా వున్న దాన్ని క్రింద వుంచి, ‘ఉస్సాప్పా’ అంటూ ఇంటి అరుగు మీద కూలబడి వున్నాడు. లోపలి కెళ్లి ఓ గిన్నెల్లో కొంచంగా బియ్యం వేసుకొచ్చి, భిక్ష వేద్దామని “ఏమప్పా నీ సంచి పట్టు” అన్నా. ఏదో గుర్తు చేసుకుంటున్న వాడిలా నా మొఖాన్నే చూస్తూ వుండిపోయాడు, నీళ్లతో నిండిన కన్నుల్తో. నాకెందుకో ఆ మనిషి మీద జాలేసింది. “పాపం ఈ బిచ్చగాడి బాధేమిటో” అని నేను అనుకుంటూండగానే “నేను బిచ్చమడగడానికి రాలేదమ్మా,” అన్నాడు అతి దీనంగా. నాకెలాగో అనిపించింది. ఆ మనిషికేం జవాబియ్యాలో తెలీక, ‘సారీ’ అనే మాట మాత్రం వచ్చేసింది నోటి నుండి. బిచ్చమేయడానికి తెచ్చిన గిన్నె తోటి అలాగే లోనికెళ్లిపోయా. నాకూ పెళ్లయి ఏడేండ్లు గడిచె. ఈ మనిషి ఎవరో ఏమిటో పొల్చుకోలేక, “అమ్మా అదెవరో వచ్చారు చూడవే.. ఆయనెవరో నాకు తెలీదు,” అన్నా.“ఔనేమే, ఎవరబ్బా ఆ మనిషి,” అంటూ బయటికొచ్చింది. ఆమె వెంటనే నేనూను. ఆ వచ్చిన వ్యక్తిని ఎగాదిగా చూసి గుర్తు పట్టలేక, “ఎవరయ్యా నీవు” అంది. “అమ్మగారూ, నేనండి గాజుల మల్లయ్యని. ఈ వూరి పక్క మల్లిరెడ్డిపల్లి మల్లయ్య” అన్నాడు.

“ఓ మైగాడ్.. దేవుడా..” గాజుల మల్లయ్యనా! తొన్ను పట్టి, పూచిక పుల్లయిన శరీరం, పీక్కుపోయిన ముఖం, చప్పి దవడలు, కాంతిహీనమైన కళ్లు, ఏదో పోగుట్టుకున్న వాడిలా నిర్వికారంగా వున్న ఆ ముఖాన్ని చూస్తూనే ఆనాటి గాజుల మల్లయ్యే అంటే నమ్మటానికి శక్యం కాలేదు. శిలా ప్రతిమలా వాణ్ణే చూస్తుండి పోయిన అమ్మ కొంచం సేపటికి తేరుకుని, “మల్లయ్యా, ఇదేంటిరా ఇలా అయిపోయావు” అని విస్మయంతో ప్రశ్నించింది.

***

ఇప్పటికి ముఫై ఏళ్ల క్రితం నాటి మల్లయ్య రూపం నా ముందు సాక్షాత్కరించింది. ఎవరో దానం చేసిన ప్యాంట్‍ను ఉతికి ఇస్త్రీ చేసి వేసుకుని, ఓ వదులైన అంగీ తొడిగి, కేరం బోర్డ్ లాంటి ఓ పలకకు మేకులు కొట్టి, వాటికి నానా రకాలైన గాజులని వ్రేలాడదీసి, భుజానికి వ్రేలాడేసుకున్న గాజులు సంచిలో ప్లాస్టిక్ గాజులని నింపి, ఈ గాజుల మల్లయ్య ఊర్లోకి వచ్చేడంటే, పిల్లలు మొదలుకొని ముసలాళ్ల వరకూ వాడి చేత గాజులు తొడిగించుకునే సంబరమే సంబరం. ఈ గాజుల మల్లయ్య ఉండేది, మా వూరికి ఓ రెండు కిలోమీటర్ల దూరంలో వుండే మల్లిరెడ్డిపల్లి. చిన్నపాటి సంసారం. ఓ కొడుకు. వాణ్ణి చదివిస్తూండేవాడు. ‘మంచి నిఖార్సయిన, నిజాయితీ మనిషి’ అని నాన్న చెబుతూ వుండేవాడు. మూడు నాల్గు నెలలకోసారి మా వూరొచ్చి వ్యాపారం చేసుకొని వెళ్లేవాడు, రివాజుగా.

నా పెళ్లి ఇంకో నెల వుంది అనగా, ఓ రోజు నాన్న టౌన్ నుంచి ఇంటి కొచ్చి అమ్మతో, “ఈ రోజు ఉస్మానియా హాస్పిటల్ దగ్గర మన గాజుల మల్లయ్య కన్పించాడే. పాపం, వాడి పెళ్లానికి కాన్సర్ వచ్చి వెళ్ళిపోయిందట. ఓ మూడు వేలు అడిగాడు. ఇచ్చి వచ్చా.” అని అన్న మాటలు నాకు గుర్తుకొచ్చాయి. అంతే మల్లయ్య మా వూరు రానేలేదు.

ఇప్పుడొచ్చాడు. అయిదేళ్ల తర్వాత. అప్పుడు సాయంత్రం ఆరయ్యింది. డిశెంబర్ నెల కావటం చేత చీకటి త్వరగా ఆవరించింది. చిన్నగా చలి ప్రారంభమయ్యింది. అదే సమయానికి వచ్చారు టౌన్ నుండి నాన్నా, అన్నయ్య. గాజుల మల్లయ్యను నాన్నగారికి చూపిస్తూ అమ్మ“ఏమండీ! వీణ్ణి గుర్తు పట్టారా! మన గాజుల మల్లయ్యండి. పాపం! ఎల్లా అయిపోయాడో చూడండి” అంది. “ఏంటి! వీడు గాజుల మల్లయ్యానా?” విస్తుపోయి నాన్నగారు, “ఓరే! మల్లయ్యా, ఏంట్రా ఇలా అయిపోయావు. ఈ తొన్ను ఎలా వచ్చిందిరా నీకు?” అన్నారు. వాడు నవ్వుతూ, “ఏంటి కాలేదు అమ్మగారూ, నే బాగానే వున్నా” అన్నాడు. అలా అంటున్నా వాడి కన్నుల అంచుల్లో తడిని మేము గమనించకపోలేదు. ఏం కష్టాలో ఏంటో! పాపం!

చీకటి దట్టమయ్యింది. ఇచ్చిన కాఫీ తాగేసి, లోటాను బోర్లించి పెట్టాడు. మల్లయ్య అక్కణ్ణుంచి కదలేటట్టు లేడని అనిపించేసరికి, అన్నయ్య “ఎన్నింటికి నీ బస్సు,” అని అడిగాడు. “చిన్నయ్యగారూ, ఇప్పుడు మా వూరు వెళ్లటానికి నా చేతకాదండి. రాత్రికి ఇక్కడే తొంగొని రేపు ఎల్లిపోతా” అన్నాడు. అలా అన్నప్పుడు మా ముఖాల్లో కొంచం తడబాటు. లోనికి రమ్మని, అన్నయ్యతో “వాడికి తొన్ను.. మరి ఇప్పటి వాడి చూస్తే.. ఎందుకులే గాని, వాడి ఊరిదాకా వాడి వెంట వెళ్లి వాణ్ని వాడింట్లో దిగబెట్టి వస్తా” అన్నాడు. “ఓరే! మనింట్లో వాడెన్ని సార్లు రాత్రిళ్లు ఉండిపోలేదు.. ఉండనీ, బయట ఆ బచ్చలింట మూల్లో పడుకుని పోతాడులే” అంది అమ్మ. “అమ్మా! వాడి మొదటి స్థితి వేరే, ఇప్పటి స్థితి వేరే.. వాణ్ని చూస్తుంటే.. ఈ రాత్రి జరగరానిదేదైనా జరిగితే.. ఎందుకు గొడవ. వాణ్ణి వాడి ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేస్తా,” అన్నాడు అన్నయ్య. “సరే నీ ఇష్టం” అన్నారు అమ్మా నాన్న.

మల్లయ్య పరిస్థితిని చూసి నాకు జాలేసింది. కాని అన్నయ్య చెప్పినది కూడా సరేనని అనిపించింది. ఈ రాత్రి ఏమైనా జరిగితే!

మల్లయ్య దగ్గరికెళ్లి “మల్లయ్యా! రా, నిన్ను మీ ఇంటి వద్ద దిగబెట్టి వస్తాను” అన్నాడు అన్నయ్య. “చిన్నయ్యగారు, నేనిప్పుడు మల్లిరెడ్డిపల్లిలో లేనండి. ఈ రాత్రి ఇక్కడే తొంగుండి, తెల్లారంగానే ఎల్లిపోతానండి” అని మళ్లా పాత పాటే పాడాడు.

“మరి నిన్నెక్కడ దింపాలో చెప్పు, అక్కడికే కూడా వస్తాను” అన్నాడు అన్నయ్య. అంతే మల్లయ్య కన్నులు వర్షించినాయి. “చిన్నయ్యా! రాత్రంటే నాకు మా చెడ్డ భయం. నన్ను పో అనొద్దు,” అని బతిమాలాడాడు. వాడి కన్నీళ్లని చూడలేకపోయింది అమ్మ.

“ఓరే! విశ్వా.. లోనికి రా.” అని అన్యయ్యని లోనికి పిలిచి అమ్మ “ఏంట్రా నీ మొండితనం. ఈ రాత్రికి ఎక్కడో ఓ చోట పడకొని పోతాడులే.” అంది.

భోజనాలు అయిం తర్వాత బచ్చలింట ఓ మూల కూర్చుని వున్న మల్లయ్య తోటి, “మల్లయ్యా! ఇప్పుడెక్కడుంటున్నావ్ రా నీవు. నీకో కొడుకు ఉండాలి కదా!  ఏం చేస్తున్నాడు?  పెళ్లి కూడా అయ్యిండాలే,” అన్నారు నాన్న. అలా అడిగిందే తడువుగా, వలవలా ఏడ్చేశాడు మల్లయ్య. “ఏం చెప్పమంటారు, అయ్యగారూ, అన్నీ దేవుడే ఇచ్చి, మళ్లీ వాడే వెనక్కు తీసుకున్నాడు. నా కొడుకు బాగుండాలనే ఇష్టం లేకపోయింది దేవుడికి.” అంటూ పూర్తి కథ వినిపించాడు.

***

ఇప్పటికి ఆరేళ్ల క్రితం, కొడుకు కృష్ణ కాలేజ్ చదువు ముగిశాక, ఎవరి చేతులో కాళ్లో పట్టుకొని అక్కడే ఓ సొసైటీలో గుమస్తా ఉద్యోగంలో చేర్పించాడు. ఆ పిమ్మట ఓ ఏడాది గడిచాక పెళ్లి కూడా జరిపించాడు. ఆ తర్వాత ఏడాదికే కృష్ణకి కొడుకు పుట్టాడు. అక్కడే, తన తండ్రికి, ఓ ఫ్యాషన్ షాప్ ఓపెన్ చేయించి ఆయన్ను అక్కడ కూర్చోబెట్టాడు.

కృష్ణ భార్య గంగ కూడా మామకు సహాయకంగా వుండేది. మొదట్నుంచి మల్లయ్యకు ఇరుగుపొరుగూర్ల వాళ్లతో పరిచయాలు వున్నందువల్ల వ్యాపారం లాభసాటి గానే ముందుకు సాగింది. అయితే, ఏ కారణం చేతనయితే నేమి గాని మల్లయ్యకు శరీరం మీద తొన్ను పొడసూపింది. ఎందుకో దేవుడికి ఈ కుటుంబం పైన చిన్న చూపు ప్రారంభమయ్యింది. రెండేళ్ల క్రిందట.. కృష్ణతో పాటు కొడుకు వెంట బెట్టుకుని బైక్ మీద వస్తుండగా, యాక్సిడెంట్‍కి గురై కృష్ణతో పాటు కొడుకు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగిన తర్వాత మల్లయ్యకు జీవితం మీద విరక్తి పుట్టింది. తనకే తొన్ను విజృంభించింది. తన ఆరోగ్యమూ దెబ్బతింటూ వచ్చింది. అయితే కోడలు మాత్రం మామను తన తండ్రి కంటే ఎక్కువగానే చూస్తూ వచ్చింది. ఓ ఆరు నెలలయిం తర్వాత, కోడలిని ఒప్పించి తన కొడుకు స్నేహితుడైన శంకరునితో, వాడూ విదురుడైనందున- వివాహం జరిపించాడు. ఆమె ఎన్ని విధాలా ప్రాధేయపడినా, వాళ్లతో వుండ నొల్లక వేరు పడ్డాడు.

తాను వేరు పడిన తర్వాత మల్లయ్యకు జీవితం మీద ఆసక్తి సన్నగిల్లింది. అంగడిని అమ్మేసి, వచ్చిన 3 లక్షల రూపాయల్ని బ్యాంకులో వేసి దాని మీద వచ్చే వడ్డీ తోటి బ్రతుకు గడపనారంబించాడు.

మల్లయ్య కథ విని ఇంటిల్లిపాదీ కన్నీరు కార్చారు.

వాడి కథ విన్న తర్వాత నాకు కడుపులో దేవినట్టయ్యింది. అయితే వాడిని ఆవరించిన ఆ తొన్ను, కృశించిన వాడి శరీరం చూచిన నాకు ఓ రకమైన భయం, అసహ్యం కూడా వేసింది అంటే అబద్ధం కాదు. అన్నయ్య ప్రాక్టికల్‍గా ఆలోచించాడు. అది నాకూ సరేననిపించింది. అయితే మానవత్వం లోపిస్తూ వుందా అని నాలో గిల్టీనెస్. రాత్రి ఇక్కడే పరుండి పోనీలే అనే భావన నాలో ఎందుకు కలగటం లేదు. అమ్మకు కలిగిన ఆ మాత్రపు మానవత్వపు భావన మాలో ఎందుకు కలగలేదు? మా  ఈ జనరేషన్‍కి మానవత్వపు విలువలు తగ్గుతున్నాయా?

నాకెందుకు మల్లయ్యను ఆవరించిన ఆ తొన్ను మీదే వుంది దృష్టి. ఆ పట్టింది చర్మానికి మాత్రమే కదా! కొడుకు మరణానంతరం, తన స్వార్ధానికి పక్కకు నెట్టి కోడలకి ఓ క్రొత్త జీవితాన్ని ఇచ్చిన ఈ మల్లయ్యలోని ఉన్నత మానవతా విలువలు ఎందుకని నాకు గోచరించలేదు! తాను చదివింది కేవలం నాల్గవ తరగతి. చదివింది తక్కువే కాని వాడి మానవతా విలువలకి తక్కువ లేదు. వాడి ఆ మానవతా విలువలకి గౌరవమియ్యాలనే ఆలోచన తనకెందుకు రాలేదు. తన స్వార్థాన్ని చంపుకుని, విధవరాలైన కోడలికి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఆ ఉత్తముడికి సెల్యూట్ చేయాలని నా కెందుకు అనిపించలేదు. ఆలోచనలో మునిగిపోయిన నాకు ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు.

రోజూ 5-30కి నిద్ర లేచే అలవాటున్న నాకు, 6-30కి అమ్మ నిద్ర లేపితే గాని మెలుకువ రాలేదు. అమ్మ కాఫీ కప్పుతో నా ముందు నిల్చున్నప్పుడు, ఆ మల్లయ్యకూ కాఫీ ఇద్దామని వెళ్లిన నాకు ఆ మల్లయ్య అక్కడ కన్పించలేదు. నాలో అనుమానం.. ఎక్కడికెల్లాడు! పోతూ పోతూ ఇక్కడున్న రాగి పాత్రలని ఎత్తుకు పోలేదుకదా.. అన్ని అక్కడే వున్నాయి. మరి చెప్పాపెట్టకుండా ఎందుకు వెళ్లినట్టు? అప్పటికే ఇంటిల్లిపాదికీ తెల్సిపోయింది మల్లయ్య వెళ్లిపోయిన సంగతి. అంతలోనే వదినె వచ్చి, “ఇదిగో ఇక్కడో కవర్ ఉంది. బహుశః మల్లయే దాన్ని ఇక్కడుంచి వెళ్లినట్టుంది” అంది. ఆ కవర్‍ని చించి చూచాడు అన్నయ్య. ఆశ్చర్యం! అందులో 500 రూపాయల కొత్త నోట్లు ఆరు బయటపడ్డాయి. దాంతోపాటు వచ్చీరాని రాతతో ఓ ఉత్తరం, “అయ్యగారూ, క్షమించండి. మీ డబ్బు తిరిగి ఇవ్వడానికి చాలా ఆలస్యమయ్యింది.”

ఓ క్షణం మౌనం ఆవరించింది. నాకెందుకో అక్కడ ఉండబుద్ది కాక లోనికెళ్లాను. నా పైన నాకే అసహ్యం వేసింది. “ఎంత చెడ్డగా ఆలోచించాను? స్వాభిమాని, తన వలన కోడలికి ఎల్లాంటి తొందరా కూడదనే, ఆమె నుండి దూరంగా వెళ్లిపోయిన వాడు,  ఈ ఇంట్లో దొంగతనం చేయగలడా!” ఎంతటి సిగ్గు చేటైన అనుమానం వచ్చింది తనకి! వాడి నిజాయితీ గురించి నాన్న ఎన్నో సార్లు నాతో అన్నాడు. మల్లయ్య వదలి పోయిన ఆ క్రొత్త నోట్లు నాకంటి ముందు నన్ను హేళన చేస్తూ కనిపించాయి. అన్నీ తెల్సుకున్న నాన్న అన్నాడు “వాడు స్వాభిమాని. నిన్న రాత్రే వాటిని నాకిచ్చి వుండవచ్చు, నేను నిరాకరిస్తానని వాడికి తెలుసు. అందుకే ఈ పని చేశాడు.” అని. మల్లయ్య వ్యక్తిత్వాన్ని తలుచుకుంటూ కళ్లు ఆర్ద్రం కాగా అలాగే నిలబడిపోయాను.

కన్నడ మూలం: బాలచంద్ర భట్

అనువాదం: కల్లూరు జానకిరామరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here