గాలాపాగోస్ దీవుల్లో మా పర్యటన

1
11

డార్విన్ ఐలాండ్:

పసిఫిక్ సముద్రంలోని గాలాపాగోస్ దీవులు ప్రపంచ వారసత్వ స్థలాలలో ఒకటి. మేము బ్రెజిల్ నుండి ఈక్వేడార్, అక్కడి నుండి గాలాపాగోస్ వెళ్ళాము.

ఇండియా నుండి బ్రెజిల్ 14766 కిమీ దూరంలో ఉంది. అక్కడి నుండి ఈక్వేడార్ 3195 కిమీ, ఈక్వేడార్ నుంచి గాలాపాగోస్ 1388 కిమీ. మొత్తంగా 19,349 కిమీ 6 రోజులు పాటు ప్రయాణించి అద్భుతమైన దీవులను సందర్శిస్తున్నామని ఉవ్విళ్ళూరుతూ గాలాపాగోస్ దీవులను చేరుకొన్నాం.

గాలాపాగోస్ దీవులు అగ్నిపర్వతం ద్వారా ఉద్భవించిన దీవులు. ప్రపంచంలోనే మొక్కలు, చెట్లు, Wild-Life కి చాలా ప్రసిద్ధికెక్కిన దీవులు. ఈ గాలాపాగోస్‌కి వచ్చేందుకు డార్విన్ అమెరికా నుండి 600 మైళ్ళ దూరం 25 సార్లు ప్రయాణం చేశాడు.

1809లో ఇంగ్లాండులో పుట్టిన డార్విన్, జీవశాస్త్రం (బయాలజీ) గురించి అధ్యయనం చేశాడు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ‘జాన్స్ హుసన్’ అనే మిత్రుడు డార్విన్‌కి బేగల్ అనే ఓడ ఇంగ్లాండు నుండి 5 సంవత్సరాలు తిరిగి వస్తుందని చెప్పాడు. డార్విన్ చాలా ప్రకృతి ప్రేమికుడు, ప్రపంచమంతా చుట్టి రావచ్చు అని, ప్రపంచ యాత్రకు బయల్దేరాడు. 1830 నుండి 1836 వరకు ప్రపంచం మొత్తం తిరిగి చూస్తూ ఎన్నో దేశాలు చూస్తూ తన టెలిస్కోపు చూచి ‘రాక్షసి చెట్లు మనుషుల్ని తింటాయి’ అని, ‘చెట్లు, పూలు విషపూరితమైనవి మనుషుల్ని చంపేస్తాయి’ అని ఎన్నో సత్యాలను తన నోట్స్‌లో రాసుకున్నాడు.

అలాగే ఈ గాలాపాగోస్ దీవులకి వెళ్ళినప్పుడు ఈ దీవులు, ఇతర దీవులకి భిన్నంగా వున్నాయని అక్కడి ఆహారపు అలవాట్లు కూడ వేరుగా వున్నాయని గమనించాడు. కొన్ని రోజులు ఈ గాలాపాగోస్ దీవి తేడాగా ఉందని డార్విన్ గమనించాడు. ఆచార వ్యవహారాలు ఆ ద్వీపంలో ఉన్న పరిసరాలని బట్టి మనిషి తనను తాను మలుచుకున్న అని డార్విన్‌కి అర్థమయ్యింది.

చిన్న వయసులో ఉన్నప్పుడు డార్విన్ జన్యుపరిణామ క్రమం గురించి నమ్మేవాడు కాదు. అతనికి భగవంతుడిపై భక్తి ఉండేది. ఫాదర్‌గా చర్చికి సేవలు చేద్దామనుకున్నాడు. ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఆశ్చర్యకరంగా చార్లెస్ డార్విన్ తాత ఎరాముస్ డార్విన్ కూడ జన్యుపరిణామ క్రమం గురించి పరిశోధన చేసినవాడే. లక్షల వేల సంవత్సరాలు గడిచి పొయ్యాయి. ఆనాటి మనిషికి ఈనాటి మనిషికి ఎంతో తేడా వుంటుందంటారు డార్విన్. ఇతని కన్నా ముందే ఎంతో మంది శాస్త్రజ్ఞులు జీవులలో మార్పు గురించి ఊహించి చెప్పారు. కాని మార్పు గురించి సిద్ధాంతాన్ని (Theory) మన ముందు ఉంచినాడు డార్విన్.

మానవుడి పరిణామ క్రమం గురించి చాలా బాగా రాశారు. కొన్ని కోట్ల సంవత్సరాల మార్పు మనిషిలాగ పరిమాణం చెందినదని డార్విన్ తెలియచేశారు. సరీసృపాలు, పక్షులు, జంతువులు, ఏవైనా భూవాతావరణానికి తట్టుకొని నిలబడగలిగినవి మాత్రమే జీవించాయని తెలియచేశాడు. ఆయా ద్వీపాలలో లభించిన జీవ జంతువుల శిలాజాలను సేకరించాడు. జీవ పరిణామ క్రమంలో ఆ జంతువులు ఇప్పుడు లేవు.

డార్విన్ ఇంగ్లాండులోనే ‘ఎమ్మా’ అనే యువతిని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె డార్విన్ పరిశోధనల కనుగుణంగా ఉండి అతనికి సహకరించింది. కుటుంబాన్ని చక్కదిద్దింది. డార్విన్‍కు నలుగురు కొడుకులు పుట్టారు. నలుగురూ గొప్ప శాస్త్రజ్ఞులు అయ్యారు. రాయల్ సొసైటీలో సభ్యులయ్యారు. చార్లెస్ డార్విన్ 1882లో చనిపోయారు. ఆయన జీవించి వున్నంత వరకు మానవ జీవన పరిమాణక్రమం గురించి పరిశోధనలు చేస్తూనే వున్నాడు. జీవితాంతం పుస్తకాలు రాస్తూనే వున్నాడు. ప్రపంచమంతా ఆయన సిద్ధాంతాల గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. ముందు తరాలవారు కూడా డార్విన్ సిద్ధాంతాన్ని మర్చిపోరు.

జీవ పరిణామ క్రమం గురించి ఆయన పుస్తకాలు రాశాడు. గాలాపాగోస్ దీవులలో చెట్లు, చేమలు, పూల సుగంధాలు సముద్ర గర్భంలో వున్న పగడపు రాశులు దగ్గరకు రాగానే మనిషిని లాక్కుని తినే చెట్లు ఇప్పుడు లేని జంతువులు వీటన్నిటిలో కలుగుతున్న మార్పుల గురించి రాశాడు.

డార్విన్ – Origin of Species (1859), The voyage of the People (1839), The Decent of Man and in the Selection in relation to Sex (1871), Expression of emotions in Man and Animals వంటి 22 పుస్తకాలు రాశారు. “ప్లెమింగో నవ్వు” అని పక్షుల మీద, పిట్టల మీద, evolution మీద, Dolphin పరిణామం ఎలా చెందింది అని, ఇలా ఎన్నో ప్రయోగాలు చేసి లోకానికి ఎంతో జ్ఞానాన్ని పంచాడు.

డార్విన్ 25 సార్లు వెళ్ళిన ఈ దీవులకి మేము వెళ్ళాలని కుతూహలం కొద్దీ  రానూ పోనూ సుమారు 40 వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము.

గాలాపాగోస్‌లో drug traffic ఎక్కువ. అందుకని మా సూట్ కేస్ చెక్ చేశారు. అప్పుడు నాకు ఒక సినిమా గుర్తుకొచ్చింది. ఒక ఎయిర్‌పోర్ట్‌లో ఎవరో ఒక డ్రగ్ పాకెట్‌ని ఒక అమ్మాయి పర్సులో వేస్తారు. ఆ అమ్యాయి అమాయకురాలు, 20 సంవత్సరాలు జైలులో వుండి వస్తుంది – “Broke Down Palace” అనే మూవీలో. నాకు ఇక్కడ ఆ సంఘటన గుర్తుకొచ్చింది. మొత్తానికి 2, 3 గంటలపాటు ఈక్వేడార్ ఎయిర్‌పోర్ట్‌లో అందరి బ్యాగ్లు చెక్ చేశాకా, గాలాపాగోస్ ఫ్లయిట్ ఎక్కాము.

గాలాపాగోస్ చాలా ఖరీదయిన స్థలం. అక్కడ హోటల్స్ అన్ని చాలా కాస్ట్లీ. ఫుడ్ పర్వాలేదు, ఖరీదు మధ్యస్థంగా ఉంటుంది.

మేము బస చేసేందుకు హోటల్ బుక్ చేయాలని చూస్తే – ఆ హోటల్ రెంట్ 15 వేల నుండి 1 లక్ష వరకు ఉంది. అది చూసి మా బాబు రోజుకి 5 వేలకి ఒక మామూలు హోటల్ బుక్ చేశాడు. 4 రోజులకి 20 వేలు చాలా ఎక్కువ. మేము ఎయిర్ పోర్టులో దిగగానే ఒక బోట్ ఎక్కాము. ఆ బోట్ మీద గాలాపాగోస్ దీవులకి వెళ్ళాము.

Santa Cruz, San Christobal, Isabela మరియు Florena అనే ఈ దీవులలో మనుషులు వుంటారు. మిగతా దీవులలో ఒక్క రాత్రి కూడ ఆగడానికి లేదు.

మేము Santa Cruz islandలో దిగాము. దిగగానే అందరూ ఒక package tour లాగా బుక్ చేశారనుకుంటాను. పెద్ద వ్యాన్ వచ్చింది. అందరిని తీసుకొని వెళ్ళింది.

మాకు వెహికల్స్ దొరకలేదు. ఇంతలో లోడ్‌తో ఉన్న ఒక వేన్ వచ్చింది. డ్రైవర్ ప్రక్కన 2 సీట్లు ఖాళీగా వున్నాయి. Per head ఇంత అని కలెక్ట్ చేసి St. Maria Hotel వద్ద దించారు.

బస్ చాలా చవకే కాని ఉదయమూ, సాయంత్రము మాత్రమే వస్తుందట. సరే అని దిగి రాత్రికి అన్నం వండుకుని తినేసి బడలికతో పడుకున్నాము.

***

రెండవ రోజు పొద్దున్నే 9:00 గంటలకి కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ తింటున్నాను. ఒక స్త్రీ నా ముందు కూర్చుని కాఫీ త్రాగుతుంది. తను నన్ను చూచి “ఇండియా నుండా?” అని అడిగారు. ‘అవును’ అన్నాను. తర్వాత “అక్కడ ట్రాన్స్‌పోర్టు ఎలా?” అని అడిగాను. “మెయిన్ సిటికి చాలా ట్రాలీలు, వ్యాన్స్ వెళ్తాయి. వాళ్ళు 2 డాలర్లకి తీసుకొని వెళ్లారు. బస్ అయితే డాలరే కాని బస్సులు తక్కువ” అని చెప్పారు. ఆ రోజు ఒక కారు వచ్చింది. మేము 4 మెంబర్స్ అందులో వెళ్ళి సిటి దగ్గర దిగాము. మేము ఒక వారం వున్నాము. ప్రతి రోజు ఒక దీవి, కొన్నిసార్లు రెండు రోజుల పాకేజ్‌ తీసుకుని దూరంగా వున్న దీవికి వెళ్ళేవాళ్ళం. అలా ఆ దీవులన్నీ చూశాము.

 

మా స్నేహితులు చాలా ఖరీదయిన హోటల్‍లో వున్నారు. వారు ప్రతి రోజు బోట్ దగ్గర అందరం కలిసేవాళ్ళం. బోట్‌లో వెళ్తుంటే నా టోపీ పడిపోయింది. ఆ అబ్బాయి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ టోపీ తెచ్చి ఇచ్చారు.

Florena అనే దీవికి వెళ్ళాము. ఇక్కడ ముక్కు పుడక వేస్తే కూడ కనబడుతుందేమో అన్నంత స్వచ్చమైన నీరు. ఆ నీటిలో మావారు snorkeling చేశారు అంటే నీటి అడుగున వున్న చేపల్ని చూడడానికి వెళ్ళారు. నేను మాత్రం వాళ్ళందర్నీ చూస్తూ Wild life వింత వింత జంతువులను చూస్తూ ఆ ఇసుకలో గడిపాను.

తర్వాత ఒక దీవిలోని వింత వింత జంతువుల్ని, trees & fauna చూడడానికి వెళ్ళాము. నల్లగా బల్లి ఆకారంలో వున్నాయి. ఇక్కడ Iguanas అంటారు. ఈ తొండ ఆకారం పెద్దగా వుంది. 1) Marina Iguanas, 2) నీలం రంగులో కాళ్ళు వున్న Boobies, 3) Darwin’s finches, 4) Flightless cormorants, 5) Giant tortoise, 6) Sally light foot crabs, 7) Iguanas, 8) Frigate birds, 9) Sea lions. ఇన్ని రకాల జంతువులు గాలాపాగోస్‌లో ప్రసిద్ధికెక్కినవి.

ఈ గాలాపాగోస్ దీవులలో జనాభా 15000-30000 వరకు వుండవచ్చును. ఎక్కడ చూచినా అడవి చెట్లు. చాలా అందంగా వుండేవి. గాలాపాగోస్ నుండి మేము పడవలో ప్రయాణం చేసి El Juno Lagoon చూడడానికి వెళ్ళాము. చాలా రకాలు చూశాము. మేము బోట్‌లో వెళ్ళి అక్కడ 10 seater vehicle తీసుకొని, అక్కడి నుండి crater, 5 miles నడిచి పైకి ఎక్కాము.

అందరం గాలిలో మేము కొట్టుకుపోతామా! అన్నంత గాలి. అక్కడే అరగంట కూర్చొని కొన్ని ఫొటోలు దిగి క్రిందికి దిగి వచ్చాము.

San Christobal (సాన్ క్రిస్టోబాల్) అనే దీవిలో వున్నాము. ఈ దీవులు ప్రొద్దున 7 గంటలకి చిన్న పడవలో వెళితే సాయంత్రం 7 గంటలకి తిరిగి వస్తాము. ప్రతి రోజు ఇదే తంతు. తర్వాత రోజు మేము Darwin Creator కి వెళ్ళాము. ఇక్కడ చాలా పెద్ద ఆఫీసు వుంది. ఇది ఒక మ్యూజియం లాగ వుంది. ఈ మ్యూజియం లాగ వుంది. ఇక్కడ చిన్న గ్రుడ్డు దగ్గర నుండి అవి పిల్లలుగా మారే వరకు అన్ని stages  చూపిస్తారు. ఇక్కడ Research Centre వుంది. చాలా పెద్దగా వుంది.

ఈ Research Centre లో ఎన్నో వందల తాబేళ్ళని hatching చేస్తున్నారు. చిన్న చిన్న తాబేళ్ళు వున్నాయి. అక్కడ గ్రుడ్డు తాబేలు ఎప్పుడు పెడుతుందో ఆ క్రిందికి పడ్డ position లో వుంటేనే అందులో నుండి పిల్ల పుడ్తుందట. ఏ మాత్రం కదిలించినా ఆ గ్రుడు పొదగదు. ఇలాంటి ఎన్నో క్రొత్త విషయాలు వారు చెప్పారు. ఇక్కడ 250 ఏళ్ళలుగా నివసించే తాబేలుని చూశాము. 300 ఏళ్ళ వరకు బ్రతుకుతుందనుకుంటా.

మన ఊహకు అందని ఎన్నో విషయాలు వాళ్ళు అక్కడ చెప్పారు. ఎన్నో వందల తాబేళ్ళు natural గా పెరిగే విధంగా అక్కడ అన్ని సదుపాయాలు సమకూర్చారు. మేము అన్ని దీవులు ఒక్కొ దీవి ఒక్కో విశిష్టత కల్గివున్నాయి. పెద్ద తొండ ఆకారంలో వున్న జంతువుల్ని చూశాము.

అక్కడ ఈ చిలీ అమ్మాయి అక్కడి ఫుడ్ ఎక్కడెక్కడ రుచిగా వుంటుందో ఆ రెస్టారెంట్లకి తీసుకెళ్ళింది. ఒక రోజు మా hotel owner shark చిన్న చేపని తెచ్చి మాకందరికి వండి పెట్టారు. చాలా రుచిగా వుంది. ఇక్కడ వీరు అన్ని రకాల మాంసాన్ని తింటున్నారు. కాని చాలా ఖరీదు.

అక్కడి నుండి మేము ఒక గుహలోకి వెళ్ళాము. ఆ గుహలో Santa Cruz Lava Caves. ఈ గుహలలోకి వెళ్ళడానికి ఒక రంధ్రం వుంది. అందులో నుండి దిగాము. లోపల అంతా చీకటి, torch lights తీసుకొని వెళ్ళాము. ఒక ఫర్లాంగ్ వరకు నడిచి ఆ రంధ్రం నుండి మళ్ళీ పైకి వచ్చాము. Chili అమ్మాయి అక్కడికి తీసుకొని వెళ్ళింది.

అక్కడ తాబేలు డొప్పలు వున్నాయి. ఆ డొప్పలలోకి మేము దూరి ఫొటోలు తీసుకున్నాము. విభిన్నమైన అనుభవం. ఆ రోజు సముద్ర తీరానికి వెళ్ళాము. ఎక్కడ చూచినా lobos, reals వున్నాయి. తొండలు లాగ ఎక్కడ బడితే అక్కడ వున్నాయి. చాలా భయమేసింది నడవాలంటే.

మర్నాడు మళ్ళీ ఒక దీవికి వెళ్ళాము. అక్కడ Puerto-rico లో నివాసిస్తున్న Bonei Rasorio అనే మహిళ కల్సింది. ఆవిడ ప్రపంచం తిరగటం కోసం పెళ్ళి చేసుకోలేదట. చాలా ఆశ్చర్యమేసింది. తను డాలర్లకి ఒక రూమ్ తీసుకొని వుంటున్నానని చెప్పింది. ఎంతో కుతూహలంగా ఆ అమ్మాయితో వారి రూమ్ చూడడానికి వెళ్ళాను. ఆమే paying guest లాగ వుంది. ఆ ఇంటిలో మంచం, ఒక చెయిర్ పట్టే స్థలం, ఒక టివి వుంది. బాత్ రూమ్ బయటికి వుంది. ఆమె అక్కడ 2 నెలలు వుంది. అమెరికా నుండి వచ్చినవారికి స్పానిష్ రాదు కదా. తను ఒక గైడ్ లాగ పనిచేస్తుంది. తను రాగానే అన్ని ప్రదేశాలు చూచి అన్ని notes రాసుకొని రోజుకి ఒక గ్రూప్‌కి గైడ్ లాగ పనిచేసి వారిచ్చే డబ్బుతో తన అవసరాలు తీర్చుకుంటూ ఆ దేశాన్ని చూచి తిరిగి వేరే కొత్త దేశానికి వెళ్తుందట. తను ఇప్పటికి నాకు కాంటాక్ట్‌లో వున్నారు.

ఇలా ఎన్నో అందమైన అనుభవాలతో మేము గాలాపాగోస్ నుండి ఈక్వేడార్ వచ్చి, అక్కడ్నించి ఇండియాకి తిరిగి వచ్చేశాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here