[box type=’note’ fontsize=’16’] గాలి స్వరూప స్వభావాలను వివరిస్తూ గాలి తత్వాన్ని కవితాత్మకంగా ప్రదర్శిస్తుంది శ్రీధర్ చౌడారపు కవిత “గాలి ఎంత గొప్పదో!!”[/box]
చెట్లకొమ్మలను కౌగిలించుకుని
నిశ్వాసల వేడి ఊపిరులూది
ఎన్ని చక్కిలిగింతలు
ఎంత చక్కగా పెడుతుందో ఏమో ??
గలగలల గమ్మత్తు చప్పుళ్శతో
ఆకులు
ఫెళ్ళు ఫెళ్ళున నవ్వుతుంటాయి
పూలకన్నెల వలువలు చెదరివేస్తూ
సరసాల సయ్యాటలాడుతూ
రంగుల వసంతోత్సవాలు
రంజుగా ఎన్నెన్ని ఆడుతుందో …
చల్లుకొన్న సువాసనల పన్నీట తడిసి
నవ్వుతూ తుళ్ళుతూ, నలువైపులా ఎగిసి
వీచిన చోటల్లా ఎంతో కొంత
పరిమళాన్ని అలా అలా పంచిపెడుతుంది
పక్షుల రెక్కల కిందికి చేరి
పసిపాపల్లా వాటిని పైకెత్తుకుని
మేఘాల గొడుగులు కప్పుకుంటూ
ఆకాశపు నీలి రహదారుల్లో
వెలుగుల లాంతరు చేతబట్టుకుని
ఎక్కడెక్కడి దూరాల గమ్యాలు దాటిస్తుంది
జీవుల శ్వాసకోశాల్లోకి దూరి
ప్రాణవాయువును గుండెల నిండుగా ఊది
బతుకును బహుమతిగా ఇచ్చేస్తుంటుంది
ఖాళీగా వెనుతిరిగి వెళ్ళడం
ఎందుకనుకుంటుందో ఏమో !
ఊపిరిగదుల్లోని చెత్తనంతా ఊడ్చేసి
తన చేతిసంచి నిండా చేర్చేసుకొని
చక్కగా బయటకొచ్చి
చెట్ల ముంగిళ్ళలోకి, శుభ్రం చేయమంటూ
సుద్దులు చెబుతూ చేరవేస్తుంది
స్వరతంత్రుల మీద తమకంగా
తకధిమితోం తకతై నాట్యమాడుతుందేమో
ధ్వనుల ధాన్యపు గాదెల్ని
నిరంతరం నిండుగా నింపుతూంటుంది !
సంభాషణల సంభావనల్ని
మూగజీవుల మధ్య చెల్లింపు చేస్తుంది
మాటల రహదారుల్ని
మనిషికీ మనిషికి మధ్య నిర్మిస్తుంది
వర్షపు స్నానాలగదిలో తడిసి
గాలివానగా మారి ఈడ్చికొట్టినా
వేసవికొలిమిలో వేడివేడిగా కాగి
వడగాలిగా వీచి భయపెట్టినా
చలువ పందిళ్ళలో సేదదీరి
మంచుముత్యాల స్నానాలు చేసి
చల్లగాలిగా మారి గిలిగింతలు పెట్టినా
వెన్నలవాడలందు ఆగి ఊగి, తాగి తూగి
పిల్లగాలిగా చిలిపి అల్లరెంత చేసినా
ఆ గమ్మత్తు
వింతగా నిలిచేది కొంతసేపేగా
గాలి ఎంత గొప్పదో
విప్పని పొడుపుకథలా
గుట్టుగానే గట్టిగానే ఉంటుంది !
గాలికెంత గుట్టో
కంటికైనా కనిపించకుండా
కంచికెళ్ళని కథలెన్నో నడుపుతోంది !!
… శ్రీధర్ చౌడారపు