మబ్బులు నింగినిఁ జూచిరి
యబ్బురములతో, చినుకుల నాశల మది తా
నిబ్బరమందిన తరి వా
రుబ్బిరి సంతోషపడిరి యొక్క క్షణమునన్.
పంటలకై నీరు దొరకు
నింటను త్రాగెడు జలములనిమ్ముగ చేరం
గంటను తడి చిప్పిల్లక
నుంటయె నిశ్చయమిక యని యోచన కలిగెన్.
వర్షము కొఱకై మనసున
హర్షముతోడను మరింత యానందముగా
కర్షకలోకము నితరులు
తర్షికులై గాచుకొనిరి తపనలఁ బడుచున్.
ఏవీ చిటచిట చినుకులు?
రావేల పరగ వరముల రాల్చంగ, నదో,
వేవే సంఖ్యల లక్షల
నీ వేళ భువికి యమృతము నిచ్చు నెపమునన్.
గాలులు వీచెను వడిగా
నేలలు చల్లంబడియెను నిజమిక వానల్
చాలును మాకన కురిసెడు
కాలములివియే మనకిక కలుములు నిండున్.