గాలివాన వెలిసింది

0
8

[dropcap]“ఈ[/dropcap] మధ్య బొత్తిగా అర్ధరాత్రవుతున్నాది, మీరు ఇంటికి వచ్చేసరికి. మీ ఆరోగ్యం సంగతి కూడా చూసుకోండి.” కేంద్ర ప్రభుత్వంలో జాయింట్ సెక్రెటరీగా పని చేస్తున్న విద్యాసాగర్, ఇంట్లో ప్రవేశిస్తూంటే, గుమ్మం దగ్గరే ఆందోళన వ్యక్తపరుస్తు అడిగింది ఆయన భార్యామణి భానుమతి.

“భానూ, మరో వారం పది రోజులు ఇలాగే ఉంటుంది.” ఆలస్యానికి కారణాలు వివరిస్తూ, ఇంట్లోకి అడుగులేసిన విద్యాసాగర్, డ్రాయింగ్ రూమ్ లోని సోఫాలో ఆసీనుడై, క్రొద్ది క్షణాలు రిలేక్స్ అయి, తన కోటు జేబులోని ఎన్వలప్ నుండి ఫోటో ఒకటి తీసి, భార్యకు చూపిస్తూ, “భానూ, ఎలా ఉన్నాడు, ఈ అబ్బాయి.” అని ఆవిడ ముఖంలోకి చూస్తూ అడిగేడు.

“ఎవరీ కుర్రాడు.” అని ఆతృతగా భర్త ముఖంలోకి చూస్తూ, ప్రశ్న సంధించింది, భానుమతి.

“మొదట, అబ్బాయి ఎలా ఉన్నాడో చెప్పు.”

“ఫరవాలేదు, ఓకే.”

“అయితే విను. ఈ అబ్బాయి, మదన్ మోహన్ అని ఈ మధ్యనే ఐ.ఏ.ఎస్.కి సెలెక్టయ్యేడు. ఆల్ ఇండియాలో పదిహేనో రేంక్ వచ్చింది. ప్రస్తుతం, మసూరీలోని మా ఎడ్మినిస్ట్రేటివ్ ఎకాడమీ లో ట్రైనింగ్ అవుతున్నాడు. ఎకాడమీ డైరెక్టరుకి, ఈ మధ్యనే ఫోన్ చేసి, ప్రస్తుతం అక్కడ ట్రైనింగ్ అవుతున్న ఫ్రెష్ బేచ్‌లో, మన సుజాతకు సూటబుల్ గా ఉన్న అబ్బాయి ఎవరైనా ఉంటే, తెలియబరచమని రిక్వెస్ట్ చేసేను. దానికి రెస్పాండ్ చేస్తూ, ఆయన ఈ ఫోటో, అబ్బాయి బయోడేటా వివరాలు, కొరియరులో పంపేడు.”

“సరే, ఆ కుర్రాడి వివరాలేమిటండి.”

“అబ్బాయి తండ్రి, ప్రభాకరరావు, ప్రైవేట్ కాలేజీలో మేథ్స్ లెక్చరరుగా పని చేసి రిటైరయ్యేక, విశాఖపట్నంలో ఓ కోచింగ్ సెంటర్ లో మేథ్స్ ఫేకల్టీ గా పని చేస్తున్నాడు. అబ్బాయి మన సుజాత కన్నా నాలుగేళ్లు పెద్ద. అతనికి ఓ ఎల్డర్ సిస్టరు, ఓ తమ్ముడు ఉన్నారు. సిస్టర్ ఈజ్ మేరీడ్. తమ్ముడు, అహమ్మదాబాద్ ఐ.ఐ.ఎం.లో ఎం.బి.ఏ. చేస్తున్నాడు.”

“పెళ్ళికొడుకు క్వాలిఫికేషన్స్ ఏమిటండి.”

“విశాఖపట్నం గీతం లో ఇంజనీరింగ్ చేసి, టాటాస్ లో వర్క్ చేస్తూండగా, ఐ.ఏ.ఎస్. కి సెలెక్టయ్యేడు.”

“అది బాగానే ఉంది… సిస్టర్ కి మేరేజ్ అయిపోయిందన్నారు, ఆవిడ హస్బెండ్ ఏమిటి చేస్తున్నాడు.”

“అతను, బేంకులో ఆఫీసర్‍గా ఉన్నాడు. ఆ అమ్మాయి కూడా అదే బేంకులో ఆఫీసర్‌గా ఉంది. అన్ని విధాలా సంబంధం బాగానే ఉన్నట్టుంది. నీ అభిప్రాయమేమిటి.”

“పెళ్ళికొడుకు ఐ.ఏ.ఎస్. ఆఫీసరు, ఫేమిలీ ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ కూడా బాగానే ఉందండీ. పిల్లలు చాలా తెలివయిన వాళ్లలా ఉన్నారు. కానీ…”

“మరేమిటి, నీ సంశయం.”

“పెళ్ళికొడుకు తండ్రి, ఏదో కోచింగ్ సెంటర్ లో పని చేస్తున్నాడన్నారు. ఆ విషయం కొంచం ఆలోచించేరా.”

“భానూ, అదంత ముఖ్యమయిన విషయం కాదు.”

“మరేమీ లేదండి. పెళ్లయ్యేక, మన పిల్ల వాళ్ళింట్లో కంఫర్టబుల్‌గా ఉండగలుగుతుందా, అని.”

“నాకా కాన్ఫిడెన్స్ ఉంది. సుజాతకి అదేమీ పెద్ద సమస్య అవ్వదు.” అని, ఎం.ఏ. జర్నలిజమ్ చేస్తున్న తన కూతురు మీద తనకున్న నమ్మకాన్ని, నొక్కి చెప్పేడు, విద్యాసాగర్.

“మీకు నమ్మకముంటే మంచిదే.” భానుమతి చిరునవ్వుతో ఉవాచ.

“భానూ, ఒక్కమారు, మన విషయమే జ్ఞాపకం తెచ్చుకో. మన పెళ్లినాటికి, మన ఫేమిలీ లెవెల్స్ ఏమిటి. మా నాన్నగారు జర్నలిస్టుగా ఉండేవారు. మాదో మిడిల్ క్లాస్ ఫేమిలీ. మీ నాన్నగారు, ఇన్‌కమ్ టేక్స్ కమిషనరుగా ఉండేవారు. అప్పుడు ఏమిటి చూసి, మీవాళ్లు నిన్ను, నాకు ఆఫర్ చేసేరు. కేవలం, నా పేరు చివర ఉన్న మూడక్షరాలు చూసి, నీ మెడలో మూడుముళ్లు నా చేత వేయించేరు. నీకు, ఎప్పుడయినా, ఏవయినా ప్రోబ్ల్మ్స్ వచ్చేయా. అంచేత, లెట్ అజ్ బి ప్రేక్టికల్.”

“మహానుభావా, మీరు ఎవరినైనా కన్విన్స్ చెయ్యగలరు.”

“భానూ, మన వాదనలెందుకు. డెషిషన్ తీసుకోవలసినది, అమ్మాయి. రేపు పొద్దున్న, ఈ ఫోటో, అబ్బాయి బయోడేటా అమ్మాయికిచ్చి, తన అభిప్రాయమేమిటో కనుక్కో. తను ఓకే అంటే, ఫర్దర్ ప్రొసీడ్ అవుదాం.”

***

“ఏవమ్మా, మీ డేడీకి చెప్పేవా.” ఎదురుగా వస్తున్న కూతురు సుజాతను, ప్రశ్నించింది, భానుమతి.

“ఫోన్‌లో మాట్లాడుతున్నారమ్మా, డిస్టర్బ్ చెయ్యడం మంచి పని కాదు.”

“తల్లీ, మీ డేడీ మీద ఈగని కూడా వాలనియ్యవు. మంచిదే. కానీ, ఇటు టిఫిన్ చల్లారిపోతున్నాది. అదీ, నా బాధ.” కొద్దిపాటి వ్యంగ్యంతో అన్నాది, భానుమతి.

“అనవసరంగా వర్రీ అవ్వకమ్మా.” తల్లికి సలహా ఇచ్చింది, కూతురు.

“సరే, చేతిలో కారు తాళాలున్నాయి, ఎంతవరకేంటి. టిఫిన్ చేసి వెళ్ళు.”

“నీరజ ఆంటీ, పావుభాజీ చేస్తున్నాను, రమ్మనమని ఫోన్ చేసేరమ్మా. వాళ్ళింటికి వెళ్తున్నాను. డేడీకి చెప్పేను. అదిగో…డేడీ వస్తున్నారు. బై డేడీ, బై మమ్మీ.” అంటూ, చక చకా కారువైపు దారి తీసింది, సుజాత.

విద్యాసాగర్ డైనింగ్ టేబులు చేరుకొన్నాడు. ఎదురుగా ఉన్న, ప్లేటులోని ఒక ఇడ్లీని, బౌల్ లోని సాంబారులోకి మెల్లగా జారవిడిచి, దానికి చెంచాతో సాంబారు స్నానం చేయిస్తూ,

“భానూ, వైజాగ్ కలెక్టర్ ఇప్పుడే ఫోన్ చేసేడు. ఆయన ప్రభాకరరావు గారింటికి వెళ్లి, నేను పంపించిన కవరు స్వయంగా డెలివర్ చేసి, విషయం ఆయనతో మాట్లాడేడట. ఆయన ఆ కవరు అందుకొని, అమ్మాయి ఫోటో, బయోడేటా, వాళ్ళ అబ్బాయికి పంపించి, అతని ఒపీనియన్ తెలుసుకొన్నాక, నన్ను కాన్టాక్టు చేస్తానన్నారట.” అని లేటెస్ట్ బులెటిన్ సతీమణికి తెలియజేసేడు, విద్యాసాగర్.

“బాగానే ఉంది. కానీ, ఆ ఫేమిలీ వివరాలేమయినా తెలుసుకొన్నాడా.” భానుమతి ఎంక్వైరీ.

“చాలా విషయాలు తెలుసుకొన్నాడు.” అని, కలెక్టర్ చెప్పిన వివరాలన్నీ తెలియజేసేడు, విద్యాసాగర్.

“ఈ సంబంధం బాగానే ఉన్నట్టుంది. వాళ్లేమిటంటారో చూడాలి.”

“రెండు మూడు వారాల్లో, వాళ్ళ అభిప్రాయం తెలుస్తుందనుకొంటాను.” విద్యాసాగర్ జవాబు.

***

అటు విశాఖపట్నంలో, పెళ్లికూతురు ఫోటో, బయో డేటా జాగ్రత్తగా చూసి, ఆ విషయం ఆలోచిస్తూ, “అమ్మాయి ఎలా ఉంది, గాయత్రీ.” భార్యామణి అభిప్రాయాన్ని కోరేడు, ప్రభాకరరావు.

“కన్ను, ముక్కు, తీరుగానే కనిపిస్తున్నాయండీ. సంసార పక్షంగా కనిపిస్తున్నాది. మీ అభిప్రాయమేమిటి.”

“నాకూ, అలాగే అనిపిస్తున్నాది. బయో డేటా కూడా బాగానే ఉన్నట్లుంది.”

“కాని…ఆ కుటుంబం గురించి మనకు ఏమీ తెలీదు కదండి. పెద్ద స్టేటస్ లో ఉన్నారు. వాళ్ళ వ్యవహారం ఎలా ఉంటుందో ఏమిటో. అదీ కాక…”

“ఏమిటి నీ సందేహం.”

“అంత పెద్ద ఆఫీసరు గారి అమ్మాయి. అందులోను, ఒక్కర్తే కూతురు. ఎలా పెరిగిందో ఏమిటో. ఏకాకిగా పెరిగిన వాళ్ళ మనస్తత్వాలు భిన్నంగా ఉంటాయండి. పెళ్లయ్యాక, మన కుటుంబంలో ఇముడుతుందా, అని…”

“మనకి ఏ విషయం తెలీదు గాయత్రీ.”

“అందుకేనండి, నా భయం.”

“సరేలే, అవన్నీ తరువాత ఆలోచించొచ్చు. ముందుగా, అబ్బాయికి, ఫోటో, బయో డేటా పంపించి, వాడి అభిప్రాయం తెలుసుకొన్నాక, అమ్మాయితో కూడా ఆలోచించి, నిర్ణయం తీసుకోవచ్చు.”

మదన్ మోహన్, ఆ సంబంధం విషయంలో, తన సుముఖతను తల్లిదండ్రులకు తెలియబరచడంతో, కథ ముందుకు సాగింది. పెళ్లి చూపులు జరిగేయి. అమ్మ, నాన్నలకు తోడుగా, భోపాల్ నుండి, బేంక్ లో ఆఫీసరుగా పనిచేస్తున్న సరోజిని కూడా వెళ్ళింది. మదన్, సుజాత, వేరే గదిలో సుమారు గంట సేపు, మనసులు విప్పి మాట్లాడుకున్నారు. గాయత్రికి, తన సందేహం పూర్తిగా తీరకపోయినా, మిగిలిన ముగ్గురు నచ్చచెప్పడంతో, భగవంతుడి మీద భారం వేసి, ‘సరే’ అంది. ఓ శుభముహూర్తాన్న, పెద్దలు మదన్, సుజాతల పెళ్లి జరిపించేరు.

మదన్ మోహన్ తమ్ముడు బాలగంగాధర్, అహమ్మదాబాదు ఐ.ఐ.ఎం.లో ఎం.బి.ఏ. పూర్తి చేసి, కేంపస్ ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అయి, పేరున్న ఒక బహుళ జాతి కంపెనీలో, నెలకు లక్షన్నర జీతం మీద, పూణేలో ఉద్యోగం చేస్తున్నాడు. అన్న ఒక ఇంటివాడవడంతో, గంగాధర్ కు సంబంధాలు రావడం ప్రారంభమయింది. ఇంటిపట్టున ఉండి, ఇల్లు, పిల్లల పెంపకం, జాగ్రత్తగా చూసుకోగలిగే భార్యను తను కోరుకొంటున్నాని, అందువలన, ఇంజినీరింగు, మెడిసిన్ వంటి ఉన్నత విద్యలు చదివిన పెళ్లికూతుళ్ల సంబంధాలు చూడవద్దని, గంగాధర్ తెలియ బరచడంతో, ప్రభాకరరావు దంపతులు తదనుగుణంగా కార్యాచరణ మొదలుపెట్టేరు.

గంగాధర్ సూచనలకు అనుగుణంగా మూడు సంబంధాలు వచ్చేయి. వాటిలో, ఒక అమ్మాయి జాతకంలో సప్తమశుద్ధి లేదని సిద్ధాంతి గారు సలహా ఇవ్వడంతో, దానిని పరిగణన లోనికి తీసుకోలేదు. మిగిలిన రెండింటిలోనూ జాతకాలు కుదిరేయి. వాటిలో ఒక సంబంధం, భువనేశ్వరం ఏ.జి. ఆఫీసులో, ఆఫీసరుగా పనిచేస్తున్న పరమేశ్వరరావు గారి అమ్మాయి. రెండు రోజుల క్రిందటే, ఆయన, భార్య విశాలాక్షితోబాటు, విశాఖపట్నం స్వయంగా వచ్చి, కూతురు గిరిజ ఫోటో, బయో డేటా, జాతకం అందజేసి, తమ కుటుంబ వివరాలు తెలియజేసేరు. అమ్మాయికి, వంట వార్పూ వచ్చునని, నొక్కి నొక్కి, చెప్పేరు. వీలు చూసుకొని, అమ్మాయిని చూడడానికి భువనేశ్వరం రమ్మనమని, వినయపూర్వకంగా ఆహ్వానించేరు. మరొకటి, జబల్పూర్ ఆర్డినెన్స్ ఫేక్టరీలో ఇంజనీరుగా పనిచేస్తున్న విశ్వేశ్వరరావు గారి అమ్మాయి. వీటిలో, భువనేశ్వరం సంబంధం గాయత్రిని బాగా ఆకర్షించింది. ఆ సంబంధం విషయం రాత్రి భోజనాలప్పుడు, భర్తతో చర్చిస్తూ,

“ఏమండీ, ఈ భువనేశ్వరం సంబంధం ఎలా ఉందండి.” అని భర్త అభిప్రాయం తెలియగోరింది, గాయత్రి.

“బాగానే ఉన్నట్టుంది. నీ ఉద్దేశమేమిటి.” భార్యామణి అభిప్రాయం ఏమిటో అడిగేడు ప్రభాకరరావు.

“అన్నివిధాలా బాగుందనిపిస్తున్నాది. సాయంత్రం, సుభద్రమ్మ గారింట్లో పేరంటానికి వెళ్ళేను. అక్కడ, బరంపురం మంగమ్మ గారు కలిసేరు. ఆవిడ, ‘మీ రెండో అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారా.’ అని అడిగేరు. ఈ సంబంధం గురుంచి నేను చెప్పగానే, ఆ కుటుంబం తనకు బాగా తెలుసునన్నారు. ఆ దంపతులిద్దరికి దైవభక్తి ఎక్కువట. అమ్మాయి తెల్లగా ఉంటుందని, బాగా అందమైనదని, అన్నారు. ఇద్దరు అక్కలు, పెళ్ళిళ్ళయి కాపురాలకు వెళ్ళేరని, తమ్ముళ్ళిద్దరు కాలేజీలో చదువుకొంటున్నారని, వివరాలన్నీ చెప్పేరు.”

“ఫోటో చూడగానే, అమ్మాయి అందంగా కనిపిస్తున్నాదని అనుకొన్నాం. అది కన్ఫర్మ్ అయిందన్నమాట. మిగిలిన విషయాలు, వాళ్ళు మనకు చెప్పినవే.”

“వాళ్ళూ, మనలాగే మధ్య తరగతి కుటుంబీకులు. భువనేశ్వరం నుండి ఇద్దరూ స్వయంగా వచ్చి, ఆఫర్ ఇచ్చేరు. ఆ దంపతులిద్దరికి, దైవభక్తి ఎక్కువన్నారు, మంగమ్మగారు. అంటే, పిల్ల సాంప్రదాయ పద్దతిలో పెరిగుండాలి. నలుగురి మధ్య పెరిగిన పిల్ల. మన కుటుంబంలో ఇముడుతుందనుకొంటా. మనకు అనుగుణంగా ఉండొచ్చు.”

“మనకు అనుకూలంగా ఉంటుందనే అనుకొందాం. కాని, చదువు విషయంలో, ఈ అమ్మాయి బి.ఏ. పాస్ అయింది. వయస్సు తేడా, ఏడేళ్ల దాకా ఉంది. జబల్పూర్ అమ్మాయి, ఎం.ఏ.హిస్టరీ చేసింది. మనవాడి కన్నా మూడేళ్లు చిన్నది.” అని క్రొద్దిగా తటపటాయిస్తూ, “సరే, అవన్నీ వాడే ఆలోచించుకొని, ఏది అనుకూలంగా ఉంటుందో, వాడే నిర్ణయించుకొంటాడు. రెండు సంబంధాల వివరాలూ వాడికి పంపిద్దాం. వాడి అభిప్రాయం తెలుసుకున్నాక, ముందడుగు వెయ్యొచ్చు.”అని ఒక నిర్ణయానికి వచ్చేరు, ప్రభాకరరావు దంపతులు.

రెండు సంబంధాల వివరాలు పరిశీలించేక, గంగాధర్, అక్క సరోజినితో, తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఒక నిర్ణయానికి వచ్చేక, తల్లిదండ్రులకు అది తెలియజేసేడు. భువనేశ్వరం అమ్మాయి వైపే, మొగ్గు చూపేడు. కేవలం బి.ఏ. పాస్ అయింది కాబట్టి, గృహిణిగా ఇల్లు, పిల్లల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ, కాలం గడపడానికి వెనుకాడక బోవచ్చునని, మనసులోని మాట చెప్పేడు. కొడుకు నిర్ణయం, గాయత్రికి ఎక్కువ సంతోషాన్నిచ్చింది. పెళ్లి చూపులు ఏర్పాటయ్యేయి. తల్లిదండ్రులతో బాటు, గంగాధర్ భువనేశ్వరం చేరుకొన్నాడు. బేంకులో పని ఒత్తిడివల్ల, సరోజిని రాలేక పోయింది. గిరిజతో ఏకాంతంగా మాట్లాడినప్పుడు, గంగాధర్ తన ఉద్దేశాలను ఆమెతో విడమరచి చెప్పేడు. గిరిజ వాటిని అంగీకరించింది. ఈ సంబంధం కుదిరితే, ఏడుకొండల స్వామి దర్శనం చేసుకొని, తిరుమలలో పెళ్లి జరిపించుకొంటామని, పరమేశ్వరరావు దంపతులు మ్రొక్కుకొన్నారు. ఓ శుభ ముహూర్తాన్న, వారా మ్రొక్కుబడి తీర్చుకొన్నారు. గంగాధర్, గిరిజ, ఒక ఇంటివాళ్ళేయ్యేరు.

***

ట్రైనింగు పూర్తయ్యాక, మదన్ మోహన్‌కు రాజస్థాన్ జైపూరులో పోస్టింగ్ అయింది. ఆ పట్టణంలో, అతడు ఓ శుభ దినాన్న, సుజాతతో కలసిన జీవనయానానికి, శ్రీకారం చుట్టేడు. ఇద్దరూ, రోజూ ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, మార్నింగ్ వాక్‌కు వెళతారు. ప్రతి దినం, ఆప్యాయంగా ప్రియురాలు చేసిన బ్రేక్ ఫాస్ట్ ఆరగించి, ఆఫీస్ చేరుకోవడం, మదన్‌కు అలవాటయింది. తల్లి శిక్షణ, ఇంటర్నెట్ సహాయంతోను, సుజాత పాకశాస్త్రం మీద క్రమంగా పట్టు బిగించింది. ఆమె చేసిన రుచికరమయిన వంటలు, మదన్ ప్రశంసలను అందుకొంటున్నాయి. సుజాత, తన చదువును సార్ధకం చేసుకొంటూ, సమాజంలోని సమస్యలపై రాసిన వ్యాసాలు, ప్రముఖ పత్రికలలో ప్రచురితమవుతున్నాయి.

పూణేలో,ఆధునిక సౌకర్యాలన్నీ ఉన్న, ఒక విశాలమయిన అపార్టుమెంటులో, గంగాధర్ తన వైవాహిక జీవితంలో మొదటి అడుగులు, భార్య గిరిజతో బాటు వేయనారంభించేడు. అప్పటివరకు, భువనేశ్వరంలో, రెండు బెడ్ రూముల అపార్టుమెంటులో మధ్య తరగతి జీవనం గడిపిన గిరిజ జీవితంలో, అది ఆమె కలలోనూ ఊహించని మలుపు. ఆ పరిణామంతో, ఉబ్బి తబ్బిబ్బవుతున్న గిరిజ, ఖరీదయిన దుస్తులు, జోళ్ళు, హేండ్ బేగులూ, తనవిగా చేసుకొంటూ, ఒక విలాసవంతమయిన జీవితాన్ని అలవరచుకొంటోంది. ఇంటిపనులకే నియమింప బడ్డ సీతాలుకు, వంటింటి బాధ్యతలు కూడా కట్టబెట్టింది. సీతాలు అమర్చిన బ్రేక్ ఫాస్ట్ పొట్టలో వేసుకొని, భార్యామణి నిద్రలేవక మునుపే, ప్రతి రోజూ ఉదయం ఏడు గంటలకు, గంగాధర్ ఆఫీసుకు బయలుదేరుతాడు. ఆ పరిస్థితి, తనకు అంతగా నచ్చకపోయినా, కొత్త పెళ్లికూతురని, కొంత ఔదార్యం చూపిస్తున్నాడు.

సుమారు ఒక సంవత్సర కాలం గడిచింది. ఒక రోజు, మదన్ ఆఫీసు నుండి త్వరగా వచ్చి, విశాఖపట్నంలో తన తల్లి నట్టింట జారి పడడంతో, కుడికాలులోని ఎముక కొద్దిగా పగిలిందని, భార్య సుజాతతో ఆందోళన వ్యక్తబరుస్తూ చెప్పేడు. కనీసం మూడు వారాలు బెడ్ రెస్ట్ తీసుకోవాలని, డాక్టరుగారు చెప్పేరన్నాడు. భోపాల్ నుండి అక్క సరోజిని, రెండు మూడు రోజులలో, తల్లి సంరక్షణకు విశాఖపట్నం బయలుదేరుతున్నాదని, చెప్పేడు. వీలయినంత త్వరలో తామిద్దరమూ కూడా వెళదామన్నాడు. అది విన్న సుజాత, రెండు రోజుల క్రింద, ఫోనులో మాట్లాడినప్పుడు, వచ్చే వారం నుండి, కొడుకు వివేకుకు పెద్ద పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు, వదిన గారు చెప్పేరంది. ఆ కారణాన్న, వాడిని వదిలి, వదిన గారు వెళితే, వాడికి ఇబ్బంది అవుతుందంది. కావున, ఆవిడ వెళ్లడం ఉచితం కాదని, తన అభిమతం తెలియజేసింది. అందుచేత, అత్తగారి సంరక్షణకు, తను వెంటనే బయలుదేరుతానంది. ఆ పరిస్థితులలో, అత్తగారికి ఆడ సాయమే ముఖ్యమని, వీలు చూసుకొని, తాపీగా తను రావచ్చని భర్తకు చెప్పి ఒప్పించింది. భార్య సత్వర స్పందనను మదన్ కొనియాడేడు. సుజాత వెంటనే తన ప్రయాణవిషయం వదినగారితో చర్చించి, ఆమెను కూడా ఒప్పించింది. సరోజిని మెచ్చుకొంది. సుజాతకు ప్రయాణం ఏర్పాట్లు జరిగేయి. విశాఖపట్నం విమానాశ్రయానికి, ప్రభాకరరావు స్వయంగా వెళ్లి, కోడలుకు ఆహ్వానం పలికేడు.

పై సమాచారం పూణేలోని గంగాధర్‍కు, ఆఫీసులో ఉండగా చేరింది. వెంటనే, ఇంటికి వెళ్లి, భార్య గిరిజకు వివరంగా ఆ విషయం తెలియజేసేడు. వదినగారు విశాఖపట్నం వెళుతున్నారని చెప్పేడు. తనని కూడా విశాఖపట్నం ప్రయాణానికి సిద్ధంగా ఉండమన్నాడు. వెంటనే ప్రయాణం ఏర్పాట్లు చేస్తానని, వీలయినంత త్వరలో తనూ వస్తానని, చెప్పేడు. దానికి, భార్యామణి స్పందన విని, అవాక్కయ్యేడు. అక్కడ, ఇద్దరికి అంత పని ఏమిటుంటుందని, తను వెళ్లి, తోడికోడలు కాళ్లలో పడుతూ, ఆవిడకు ఇబ్బంది కలిగించడమే అవుతుందని, నిజానికి, ఆ పరిస్థితులలో అనుభవమున్న నర్సుని పెట్టుకోవడం అవసరమని, ఉచిత సలహా పారేసింది. నిజానికి, గిరిజ విశాఖపట్నం వెళ్ళడానికి, అంతగా వెనుకాడడానికి కారణం, పూణే వచ్చేక తను అలవరచుకొన్న బద్ధకం. తను, అక్కడకు వెళ్ళేక, మంచానున్న అత్తగారికి, రోజులతరబడి, రాత్రింబగళ్లు సేవ చెయ్యాలని, మనసులో నున్న భయం. భార్యా భర్తల మధ్య గట్టిగా వాదోపవాదాలు జరిగేయి. గిరిజ వైఖరిలో ఏ మార్పు రాకపోవడం, గంగాధర్‌ను నిరాశకు గురి చేసింది. జీవితంలో, ఎంత పెద్ద పొరబాటు చేసేనా, అని విచారిస్తూ, కుమిలిపోయేడు. గిరిజ వెళ్లకపోతే, తను వెంటనే వెళ్లాలని నిశ్చయించుకొని, ప్రయాణ సన్నాహాలు చేసుకొన్నాడు. వదినగారు చేరుకొన్న రెండవ రోజుకు,గంగాధర్ విశాఖపట్నం చేరుకొన్నాడు.

గుమ్మంలో అడుగు పెట్టినప్పటినుండి, సుజాత అత్తగారి పరిచర్యలతో బాటు, వంటింటి బాధ్యతలు కూడా, అనుభవమున్న వ్యక్తివలె, మనస్ఫూర్తిగా నిర్వహిస్తూ ఉండడం, అత్తమామలిద్దరకు ఆశ్చర్యం కలిగించి, మెచ్చుకోసాగేరు. ఆమె గురించి ఏమీ తెలియకుండా, అభిప్రాయాలు ఏర్పరచుకోవడం ఎంత తప్పో, గ్రహించింది గాయత్రి. గంగాధర్ ఒక్కడే రావడం, అతని హావభావాలు గమనించిన గాయత్రి, ఏమి జరిగుంటుందో అర్థం చేసుకొని, రెండవ కోడలు గిరిజ విషయంలో, తను ఎంత పొరబాటు బడ్డాదో కూడా తెలుసుకొంది. కాని, కొడుకు మనసు గాయబరచడం ఇష్టం లేక, ఆ ఊసెత్తలేదు.

బరంపురం మంగమ్మ గారి ద్వారా, వియ్యపురాలి కాలు విరగడం, రాజస్తాన్ జైపూరునుండి పెద్దకోడలు, పూణెనుండి గంగాధర్, విశాఖపట్నం చేరుకోవడం విషయాలు, భువనేశ్వరంలోని విశాలాక్షికి తెలిసేయి. కూతురు ఎందుకు వెళ్లలేదో తెలుసుకొని. వెంటనే బయలుదేరి విశాఖపట్నం వెళ్ళమని, గిరిజకు సలహా ఇవ్వడానికి, పూణే ఫోన్ చేసింది, విశాలాక్షి. తాను వెళ్లడం అవసరం లేదని, దానికి కారణాలు, గంగాధర్ తో చెప్పినవే కూతురు చెప్పడం వినగానే, విశాలాక్షికి ఒళ్ళు మండి “నీకేమయినా మతి పోయిందా. బాగా ఆలోచించుకో. పెద్దకోడలు వెంటనే వెళ్లి, నువ్వు వెళ్లకపోతే, మా పెంపకంలో లోపమేనని, నలుగురూ మా నోట్లో గడ్డి పెడతారు. నీ అదృష్టానికి, అంత మంచి భర్త దొరికేడు. నీ మొండి వైఖరి మార్చుకోకపోతే జీవితంలో కష్టాలపాలవుతావు. జాగ్రత్తగా ఆలోచించుకో. మీ నాన్నగారు పక్కనే ఉన్నారు. అంతా వింటున్నారు. నువ్వు వెంటనే బయలుదేరి విశాఖపట్నం వెళ్లకపోతే, మా ఇంటి గుమ్మం ఎప్పుడూ తొక్కవద్దని చెప్పమన్నారు. మేమింతకన్నా చెప్పలేము. ఆ పైన నీ ఖర్మ.” అని విసుగ్గా ఫోను పెట్టేసింది, విశాలాక్షి. తల్లి ఇచ్చిన ఔషధం, గిరిజకు పని చేసింది. జ్ఞానోదయమయింది. వెంటనే విశాఖపట్నానికి ప్రయాణ సన్నాహాలు చేసుకొంది. భార్య రాక ముందుగానే తెలుసుకొన్న గంగాధర్, విమానాశ్రయానికి వెళ్లి, గిరిజను సంతోషంగా ఎదుర్కొన్నాడు. తోటికోడళ్ళిద్దరూ కలసి మెలసి పనులు చేసుకోవడం తిలకించిన ప్రభాకరరావు, గాయత్రీలు, సంతోషం పంచుకొన్నారు. గంగాధర్ జీవితంలో గాలివాన వెలిసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here