గల్పిక అంటే కీలెరిగిపెట్టిన వాతే!

2
10

[box type=’note’ fontsize=’16’] కథా రచనలోని విభిన్నప్రక్రియలను వివరిస్తూ కథ గురించి అవగాహన కలిగించే వ్యాసపరంపర, తెలుగు సాహిత్యంలో అత్యంత అనుభవజ్ఞుడయిన రచయిత విహారి విశ్లేషణాత్మక వివరణలివి. [/box]

[dropcap]“క[/dropcap]థావిస్తృతికి అనేక రకాల ప్రయోగాలు సాగిపోతున్న కొత్త సందర్భంలో ఉన్నది సాహితీరంగం. చివరికి ‘కథ’ని వెతుక్కోవలసిందే అనే పరిస్థితి కూడా కథా రచనలో ఒక గుణవైశిష్ట్యంగా ప్రశంసల్ని పొందుతున్నది. అప్పుడైతే, దానికి కథ పేరెందుకు?” అని ఒక ఔత్సాహిక రచయిత్రి అడిగింది. ఆలోచనీయమూ, చర్చనీయమూ అయిన ప్రశ్న! కథాప్రయోజనం గురించే ‘మళ్లీ మొదటికి’ వెళ్లాల్సిన ప్రశ్న. చిక్కుపడిన దారపు ఉండని కథాప్రియుల ముందుకు తెచ్చిన ప్రశ్న! ప్రస్తుతానికి దాన్ని అలా ఉంచుదాం.

ఆ ఔత్సాహిక రచయిత్రే అడిగింది – అనుబంధ ప్రశ్న – ‘గల్పిక’కీ ‘కథ’కీ ఉన్న భేదం ఏమిటి? – అని. ఈ అంశాన్ని పరామర్శించుకుందాం.

‘కథానికలు ప్రధానంగా సంస్కారాన్ని మెరుగుపరిస్తే, గల్పికలు ప్రధానంగా విజ్ఞానాన్ని పెంచడానికి ఉపకరిస్తాయి. గల్పికకు గొప్ప Educative value ఉన్నట్లు కొ.కు. గల్పికలు చదివితే స్పష్టంగా తెలుస్తుంది’ అన్నారు డా॥ కేతు విశ్వనాథరెడ్డి.

గల్పికకు వెటకారం ప్రాణం. వ్యంగ్యం దేహం. అందువలన చూడగానే కను, ముక్కు తీరు అంతగా బాగుండని మనిషిలా అనిపిస్తుంది. లేదా దానికి వ్యతిరేకంగా ఆశ్చర్యమూ కలిగించవచ్చు. కథానిక మనిషి జీవితంలో ఒక కోణాన్ని, లేదా ఒక పార్శ్వాన్ని చిత్రిస్తే, గల్పిక ఆ కోణంలోని లేదా పార్శ్వంలోని కొన్ని దశా విశేషాల్ని అంటే కొన్ని వంకరల్ని స్పృశిస్తుంది. గల్పికని ఆ పేరుతోనే రాసి ప్రాచుర్యం కలిగించినవారు కుటుంబరావే!

కొడవటిగంటి కుటుంబరావు ఒక్కరే 52 గల్పికలు రాశారు. ఆయన గల్పికల్లో ప్రధానమైన మెరుగు-వస్తువులో స్పష్టతే. ఆ తర్వాత శిల్పంలో సరళత, ఆ తర్వాత శైలిలోని పదును, సూటిదనం.

ఉత్తమమైన కాల్పనిక ప్రక్రియ జీవితానికి దర్పణంగా నిలవాలని చాలామంది విమర్శకులు రాసి కథా సాహిత్యాన్ని పాడుచేయటానికి తమవంతు సహకరించారు. కానీ, కథానిక కానీ, నవలకానీ, నాటకం కానీ, గల్పిక కానీ జీవితాన్ని వ్యాఖ్యానించగలగాలి. అప్పుడే చదువరిలో ఆలోచనా ప్రేరణకి అవకాశం కలుగుతుంది. దర్పణంలో లాగా ఉన్నది ఉన్నట్లు చూపటానికి మళ్ళీ వేరే వారెందుకూ? తనకు తానే ఆ ఛండాలాన్ని చూస్తున్నాడు కదా? అనుభవిస్తున్నాడు కదా? ఆ ఛండాలనికి కారణం, ఆ అనుభవం వెనుక సత్యం-చదువరికి అందేటట్లు నిరాడంబరంగా చెప్పే నైపుణ్యం కావాలి రచయితకి. కొ.కు. లాంటి మహా రచయితలు సాధించుకున్నది – ఆ నైపుణ్యాన్నే!

కొ.కు. గల్పికా రచయితగా గొప్ప దార్శనికుడు. దీన్ని నిరూపించే రెండు గల్పికల్ని చెప్పుకుతీరాలి. ఒకటి ‘పారిన్ కొలాబొరేషన్’. అది ఇలా నడుస్తుంది, పాపారావు బంకు మారిపోయింది. అతనూ మారిపోయాడు. పెరిగిన జుట్టుతో, బెల్ బాటమ్ పాంట్‌తో దర్శనమిచ్చాడు. షాపంతా అవే ఫారిన్ కొలాబొరేషన్. పెట్టుబడంతా అమెరికా వాడిదే. “నాకు రోజుకు అయిదారు రూపాయలు మిగులుతాయి. చాలదా?” అన్నాడు. ఇది జరిగి ఏడాదయింది. ఇప్పుడు అటువేపు వెళితే పాపారావు లేడు. ఇంకెవడో వున్నాడు. పాపారావు ఏమయ్యాడో?… ఇంక నాకు కనిపించే అవకాశం లేదు. ఇదీ దార్శనికత అంటే. ప్రపంచీకరణం! చూడండి-ఈ గల్పిక ఎంతసారవంతమైనదో. 1977 జూన్‌లో రాశాడు కొ.కు. ఇంతకు మించి ఆ దుష్పలితం మీద చెప్పేందుకేం వుంది?

అలాగే, కొ.కు. కాలిక స్పృహకు అద్దంపట్టే మరో గల్పిక- ‘స్వాతంత్ర్యం ఖరీదు‘ అనేది. భర్త తన భార్య పేరుతో స్త్రీల విమోచనం గురించి వ్యాసాలు రాద్దామని ఉద్యమం మొదలెట్తూన్నాడు. తన పేరున వద్దంటుంది భార్య. భర్త వినడు. చివరికి భార్య అంటుంది. ….. “సరే, నా స్వాతంత్ర్యాన్ని అమ్ముకుంటాను. దానికి ఏమిస్తారు? అయిదు తులాల బంగారం నగలూ, మూడు పట్టు చీరెలూ ఇస్తారా?” అని అడుగుతుంది. అతను విస్తుపోయాడు.

“… పెట్టుబడిదారీలో ఎవరికీ స్వాతంత్ర్యం ఉండదని లక్షసార్లు అన్నారే. ఆడవాళ్ళ స్వాతంత్ర్యం ఉండదని లక్షసార్లు అన్నారే, ఆడవాళ్ళ స్వాతంత్ర్యానికి పెట్టుబడిదారీ అడ్డంరాదా?” అని వాతపెడుతుంది స్త్రీవాదం. ఇంతకంటే స్పష్టంగా, పటిష్టంగా చెప్పేదేముంది? ఇది జనవరి 77లో రాశాడు. సమాజ జీవనంలో ఉన్న వైచిత్రి అంతా కొ.కు. గల్పికల్లో ఉంది. మానవ సంబంధాల్లోని వైరుధ్యాలన్నీ ఆ రచనల్లో ఉన్నాయి. జీవితంలోని అయోమయత్వాన్ని ఉద్వేగం లేకుండా స్తిమితంగా రాశాడు కొ.కు. అందుకే ఆయన రచనలకు అంత పదునూ, అంత ‘ఫోర్సూ’!

గల్పిక వస్తు నిర్మాణ పద్ధతుల్ని చక్కగా వినియోగించుకుని మంచిగల్పికల్ని రాసిన మరో రచయిత-శారద.

క్షణంలో సగం‘ ఉంది. తిరపతి, పరపతి అన్నదమ్ములు. ఉన్నట్టుండి పరపతికి కీర్తి వ్యామోహం అపారంగా ఎక్కిపోయింది. తిరపతికి మొరపెట్టుకున్నాడు. ఆయన ‘ప్రజాసేవ చెయ్యాలోయ్. తర్వాత కీర్తి దానంతటదే వస్తుంది’ అని విలువైన ఉచిత సలహా ఇచ్చాడు. ఇద్దరూ రంగంలోకి దిగారు. చక్రం తిప్పేవాడు తిరపతి. పరపతి ప్రజా సేవకుడు అయ్యాడు. క్రమంగా ఎదిగాడు. మంత్రిత్వంలో బెర్త్ దక్కింది. అన్ని ప్రభుత్వాల్లోనూ దక్కుతూనే వుంది కూడా. కీర్తి చాలా బాగా సంపాదించాడు. ‘అదివరకల్లా నిర్భాగ్యుడూ, ఆగర్భ దరిద్రుడూ’ అయిన తిరపతిగారు లక్షాధికారి అయినాడు. ‘మన ప్రభుత్వాలు ఎన్నడైనా ప్రజల కోసం ఏమైనా చేసిన పాపాన పోయినై?’ అని ఒకసారి అన్ననడిగాడు తిరపతి. తిరపతి అసలు రహస్యం చెప్తాడు. ‘తమ్ముడూ, మనది ప్రజాస్వామ్య పరతంత్ర వ్యవస్థ. ఓటర్లు ఎలక్షన్లప్పుడు స్వతంత్రులూ, తర్వాత పరతంత్రులున్నూ!’ అని.

ఇదీ గల్పిక. ఇదే గల్పిక! ఎంతటి సమకాలీన సామాజిక వాస్తవికతో చూడండి. ఎంత వ్యంగ్యాత్మకమో. అంతకంత ఆలోచనా ప్రేరకంగా కూడా సాగింది రచన. గల్పికకు ముగింపు ప్రాణం. ఈ గల్పిక ముగింపులో ఒక విరుపు వుంది. ప్రజాస్వామ్యం అపహాస్యం పాలవుతున్నది. ఆలోచించండి. జాగ్రత్తపడండి అని ఓ మెరుపు విరిసింది.

‘తిరపతి’ పాత్ర తన నైజాన్ని మేలి ముసుగులోంచీ కనిపింపజేసుకున్నాడు. ఇదీ వస్తు విషయకంగా ఆవిష్కృతమైన జీవిత సత్యం. అదీ అసలైన విచారణ పరిస్థితి. రచయితగా శారద జాతి గుండె చప్పుడులో ‘మర్మర్స్’ని ఆనాడే పసిగట్టగలిగాడు!

ఉదాహరణ పూర్వకంగా ఇవీ – గల్పిక స్వరూపస్వభావాలు. కాలక్రమేణా – ‘గల్పిక’ పేరు మార్చుకొని ‘స్కెచ్’ గానూ దర్శనమిచ్చింది, ఆ కాలంలో. ‘తెలుగు స్వతంత్ర’ ప్రత్యేకించి ఈ ప్రక్రియని ప్రోత్సహించింది.

భాస్కరభట్ల కృష్ణారావు వంటివారు రాశారు. ఆ తర్వాత్తర్వాత గల్పిక కథలో కలిసిపోయింది. అందులోనే ‘మినీ కథ’ రూపమెత్తింది. అయితే, మినీ కథలుగా వచ్చిన కథలన్నీ ‘గల్పిక’లు కావు. గల్పిక ‘ఆత్మ-వ్యంగ్యం‘. ఒక సమూహ వర్తనకు అధిక్షేపం. ఒక వర్తమాన పరిస్థితి మీద తిరస్కార ధిక్కారంలో ఉంటుంది. ఈ elements వున్న మినీ కథలు చాలానే వచ్చాయి.

ఇక్కడ నుంచీ నేను ప్రస్తావించేవన్నీ అలాంటి మినీ కథలే. నిశాపతి “నీతి” ఉన్నది. దోపిడీ చేయటానికీ, సామాజిక వర్గానికీ సంబంధం లేదనే “నీతి”ని చెబుతుంది. అలాగే పెద్దమనుషుల్లోని ద్వంద్వ ప్రవర్తనా, దోపిడీ-ఒక తమలపాకులు అమ్ముకునే కుర్రాడిలో ఉండకపోవచ్చుననే “నీతి”నీ బోధిస్తుంది ఇది. ఎలక్ట్రాన్ ‘ముఖపరీక్ష’ అని ‘జనారణ్యం’లో ఒక కథనం ఉంది. ‘మూడు ఖాళీలకు నూటయాభైమందిని ఇంటర్వ్యూ చేసి, ఎనభై తొమ్మిది సిఫారసు ఉత్తరాల్ని ఎదుర్కొనే దౌర్భాగ్య స్థితి, ఆవిష్కారం!

జింబో-తన వ్యక్తిగత అనుభవాలతో చాలామంచి కథలు రాశారు. వాటిల్లో ఒకటి ‘జస్టిఫికేషన్‘. ఒక ఎస్సై బదిలీ. అకారణంగానా-అంటే-అవును, కాదు-సమాధానం. ‘మీ పట్ల నీ ఎమ్మెల్యే సంతోషంగా లేడు’! అదీ సంగతి! శ్రీకంఠస్ఫూర్తి ‘గోడమీద బొమ్మ’ గల్పిక లక్షణాలున్న మినీ కథే. పిల్లవాడు చిన్నప్పుడు చదువుకున్న ‘గోడమీద బొమ్మ గొలుసుల బొమ్మ‘ పొడుపు కథకి సామ్యం కూరుస్తూ గోడమీద తుపాకీ బొమ్మ వేశాడు సూరీడు. వీడి తండ్రి అసిరయ్యని పోలీసులు పట్టుకుని కుళ్లబొడిచారు- అన్నల ఆరా గురించి ప్రశ్నిస్తూ! నిజం తేలుతుందా? తేలినా అసిరయ్య ఏడీ? ‘చిలక రాయబారం’ అరిపిరాల సత్య ప్రసాద్‌‌ది. చిలక పేరు చిలకమ్మ. ఆమె బాధ్యత మొగుడికీ, అతని భార్యకి మధ్య ఉత్తరాలు బట్వాడా చేయటం. ఒక నీడన ఉంటున్నారు వాళ్ళిద్దరూ. మరి ఈ ఉత్తరాలెందుకూ! ఎందుకంటే చివరి వాక్యంలో ఉంది జవాబు. ఆ యువ దంపతులకి కష్టకాలం, పాపం-ఒకరిది పగలు షిఫ్టూ, మరొకరిది రాత్రి షిఫ్టూ! చిలక అనబడే చిలకమ్మ వాళ్ళ పనిమనిషి! చిలకమ్మ అంటుంది-వీరిద్దరూ ఒకే షిఫ్టులో ఉద్యోగాలు వెతుక్కోకూడదూ? అని!

యెన్నం ఉపేందర్ ‘జారిపోయిన నేను‘ అని అతి గొప్ప చిన్న కథ రాశారు. శైలీ, శిల్పంలో దట్టించిన వ్యంగ్యమూ, ఆర్తీ బాధల గాథ-అన్నీ కలిసి దాన్ని ఉత్తమ గల్పిక అనమంటుంది. ఒక గతమెంతో ఘనకీర్తి గల-పెన్షన్ రాని స్వాతంత్ర్య సమరయోధుడి సంవేదన. అంతా మూడు పేజీలే! శతకోటి వర్తమాన సామాజిక దౌర్భాగ్యాల్ని ఏకవాక్య చరుపులుగా సంధిస్తూ, ఒక నిరుద్యోగి ‘బతికేస్తున్న శవం‘ – ఆత్మావిష్కరణం చేశారు తనికెళ్ళ భరణి. ఉత్తరం రూపం. పేరు మరణ శాసనం!!, ‘పిచ్చివెధవని ఇంకా బతికున్నానన్న భ్రమలో ఏదో రాసి పారేశాను. క్షమించండి’ అనేది ముక్తాయింపు!

మీరెన్ని రాసినా మన వాళ్ళు మన వాళ్ళ కథల్ని చదవరు. ఒకవేళ చదివినా, అవి మంచివని ఒప్పుకోరు. చెప్పుకోరు” అన్నది పక్కనున్న నా శ్రీమతి. ఆమెవైపు కొంచెం కినుకగానే చూశాను. “అవును మరి, మనం తెలుగువాళ్ళం కదా” అన్నాన్నేను!

ఇదండీ అసలైన గల్పిక! ఇంకా చెప్పేదేముంది? సెలవు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here