గమ్యం

0
7

[dropcap]“ఓం[/dropcap] హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్

చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీజాతవేదో మమావహా॥”

నా నోట్లోంచి శ్రీసూక్తం ఒక ప్రవాహంలా బయటకువస్తోంది. నేను చెప్పడం ఆపగానే నా ఎదురుగా కూర్చున్న పాతిక మంది పిల్లలు దాన్ని అలాగే ఉచ్చరిస్తున్నారు.

అది ఏటి గట్టు… కార్తీకం… అందునా ప్రత్యూషపు వేళ కావడంతో తీరం వెంబడి చలిగాలులు వీస్తున్నాయి. ప్రతీ రోజూ ఈ సమయంలో పిల్లలకి వేదపారాయణం చేయించడం నా నిత్య కృత్యం. వేద పఠనానికి, సంగీత సాధనకి నదీతీరం ప్రశస్తి అనీ పెద్దలు చెబుతారు. నేను బియస్సీ పూర్తైన తరువాత ఆలస్యంగా ఈ వేదాన్ని నేర్చుకున్నాను.

మాదో చిన్న అగ్రహారం. అందులో చాలా మంది వ్యవసాయం మీద ఆధారపడే పేదవారు. మా కుటుంబం పౌరోహిత్య కుటుంబం. ఇది మా తాత ముత్తాల నుంచీ వస్తున్న వృత్తి అనీ మా తాతగారు చెబుతుండే వారు. తాతగారి తదనంతరం మా నాన్న, పెద్దనాన్నలు ఆ వృత్తిని స్వీకరిస్తే చిన్నాన్న మాత్రం వ్యవసాయం చేసేవాడు.

మా ఊరి పౌరోహిత్యం నాన్నగారు చూస్తే పక్కనే ఉన్న రెండూళ్లవి పెద్దనాన్న చూస్తుండేవాడు. గ్రామ పౌరోహిత్యం అంటే కత్తి మీద సాములాంటిది. స్వేచ్ఛ ఉండదు. ఎక్కడికి వెళ్లాలన్నా మనిష్టం కాదు. ప్రతీ రోజూ వ్రతమనో, ముహూర్తమనో రైతులు వస్తునే ఉంటారు. వారిళ్లలో ఏ శుభకార్యం జరిగినా వెళ్లాలి. లేకపోతే ఊరుకోరు. ముఖ్యంగా కార్తీకమాసంలో ఎక్కువగా అభిషేకాలుంటాయి…. అలాగే శివరాత్రికి. ఆ తరువాత ఏకాదశి వ్రతాలు… అప్పుడు ప్రతీ ఇంట్లో వ్రతాలుంటాయి.

అటువంటప్పుడు ఎంతో ఇబ్బంది. అందరూ ఉదయాన్నే రావాలంటారు. ఉన్నది నాన్నగారు, మరో మగ్గురు కుర్రవాళ్లు. బాగా ఇబ్బంది అయ్యేది. అప్పుడు నేను కూడా వ్రతాలు చేయించడానికి వెళ్లేవాడిని.

అందుకే నేను పదవ తరగతిలో ఉన్నప్పుడు నాకు కూడా స్మార్తం నేర్పేరు… విఘ్నేశ్వర పూజ పుణ్యఃవాచనం, సత్యనారాయణ వ్రతం… ఇవన్నీ నాకు నేర్పేరు.

ఇక ఏరువాక సమయంలో నాన్నగారికి తీరిక ఉండేది కాదు. ప్రతీ రైతుకి అతని నక్షత్రాన్ని బట్టి ముహూర్తం చెబితే ఆ రోజు తల్లవారిజామున నాగలితో తొలి దుక్కి పొలంలో దున్నతారు.

ఇక మాఘమాసంలో పెళ్లిళ్ల హడావుడి చెప్పన్కర్లేదు. పెళ్లి ముహూర్తాల దగ్గర్నుంచి పెళ్ళికూతుళ్లను అత్తవారింటికి దిగబెట్టే దాకా అన్నీ నాన్నగారే చూడాలి.

ఇక బ్రాహ్మణుల ఇళ్లల్లో తద్దినాలైతే మూడు రోజులపాటు ఎటూ వెళ్లలేని పరిస్థితి ఉండేది. ముందు రోజు ఉపవాసం, తద్దినం నాటి రాత్రి ఉపవాసం…. అప్పుడప్పుడు నాన్నగారికి ఆటంకం ఎదురైతే నేను కూడా వెళ్లేవాడిని ఆ మంత్రం చదవడానికి.

అలా నా బాల్యం అంతా మా ఊరి హైస్కూల్లో చదువు నాన్నగారితో పౌరోహిత్యం…. ఇలా గడిచిపోయింది. ఎలాగైతేనేం పదవ తరగతి ప్రథమ శ్రేణిలో పాసయ్యాను. అప్పుడు నాన్నగారు నన్ను చదువు మానేసి స్మార్తం పూర్తిగా నేర్చుకొని పౌరోహిత్య వృత్తి కొనసాగించమన్నారు.

కానీ నాకు ఈ పౌరోహిత్యం అంటే చిన్నప్పట్నుంచీ ఇష్టం ఉండేది కాదు. ముఖ్యంగా ఆ వేష భాషలు నాకు నచ్చేవి కావు.

పౌరోహిత్యమంటే తప్పక పంచె కట్టుకోవాలి. బొట్టు పెట్టుకోవాలి. నేను అప్పుడప్పుడు వ్రతాలు చెయ్యడానికి పంచెకట్టుకొని వెళ్తుంటే నన్ను చూసి మా మేనమామ కూతురు అర్చన నవ్వినపుడు నాకు చాలా కోపం వచ్చేది. అదీ నేనూ ఒకే స్కూల్లో చదువుకునే వాళ్లం. అది నాకన్నా రెండేళ్లు చిన్న కానీ చాలా తెలివైనది. ఏడవ తరగతిలో అర్చన జిల్లాకే ఫస్టొచ్చింది.

మామేనమామ మా ఊరి హైస్కూల్లో హెడ్మాస్టరుగా పనిచేసేవాడు. ఆర్థికంగా  మా కన్నా బాగా ఉన్న కుటుంబం వాళ్లది. మాది పౌరోహిత్యపు కుటుంబం అనీ మమ్మల్ని చిన్నచూపు చూసేవాడు మా మేనమామ. అది నాన్నగారికి నచ్చేది కాదు. అందుకే వాళ్లకీ మాకూ రాకపోకలు అంతంత మాత్రంగా ఉండేవి.

అర్చన చదువులోనే కాదు సంగీతం, నాట్యంలోనూ దిట్ట. ఒక పక్క చదువుతూనే మా చిన్నతాత దగ్గర సంగీతం. కూచిపూడి నాట్యం నేర్చుకుంటూ ఉండేది. మా స్కూల్లో ప్రతీ రోజూ ఉదయం ప్రార్థన, సాయంత్రం జాతీయగీతం అర్చనే పాడేది.

నాన్నగారు నన్ను చదువు మానెయ్యమని చెప్పినప్పుడు నేను మానననీ కరాఖండీగా చెప్పేను. ఆ విషయంలో నాకు మా పెద్దనాన్నగారు సపోర్ట్ చెయ్యడంతో చివరకు ఇంటర్లో చేరాను. ఇంటర్ తరువాత నేను బీయస్సీలో చేరితే అర్చన ఇంటర్‌లో చేరింది. అలా ముడేళ్లలో అత్తెసరు మార్కులతో నా డిగ్రీ పూర్తైంది. అర్చన మాత్రం ఎమెసెట్లో మంచి రేంక్ తెచ్చుకొని ఇంజనీరింగ్ చేరింది.

అప్పటికే నాన్నాగారికి వృద్ధాప్యం మీద పడటంతో చాలా కార్యక్రమాలకు వెళ్లలేకపోయేవారు. అతనికి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన మంచానికి పరిమితమైపోవడంతో మా ఊరి పౌరోహిత్య భారమంతా పెద్దనాన్న మీద పడింది.

ఊళ్లో రైతులకు ఈ విషయంలో చాలా సమస్యలు తలెత్తడంతో వాళ్లంతా మా కుటుంబం మీద వత్తిడి తేవడంతో మాకు ఏం చెయ్యాలోతోచని స్థితి ఎదురైంది.

ఒక రోజు నేను ఇంటికి వచ్చేసరికి పెద్దనాన్న నా కోసం ఎదురు చూస్తున్నాడు. నన్ను చూడగానే నా దగ్గరకు వచ్చి “రామం నువ్వు స్మార్తం నేర్చుకోక తప్పదు రా… తాతముత్తాతల నుంచీ వస్తున్న ఆచారం. ఈ వృత్తి…. నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రం… మీ నాన్నైతే ఏకంగా మంచమే పట్టేసాడు. ఈ పరిస్థితుల్లో నేనొక్కణ్ణే మూడూళ్ల పౌరోహిత్యం చెయ్యలేక మాట పడిపోతున్నాను. అదీ కాక ఈ అగ్రహారంలో ఎవరింట తద్దినం వచ్చినా ఊళ్లో మంత్రం వచ్చిన వాడు ఒక్కడూ లేడు.  ఈ కాలం మీరంతా స్మార్తం నేర్చుకునేందుకు, పౌరోహిత్యం చెయ్యాడాని ముందుకు రావడంలేదు. ఈ వృత్తి అంటే మీ అందరికీ చిన్నచూపు. అందరికీ ప్రతీ కార్యానికీ పురోహితుడు కావాలి కానీ ఏ తండ్రీ తన కొడుకుని ఆ వృత్తిలోకి దించడానికి ఇష్టపడటంలేదు. అందుకే నువ్వు ఈ వృత్తిలోకి దిగక తప్పదు… ఈ ఊరి పురోహితుడి కొడుకుగా నీకీ బాధ్యత ఉంది” అన్నాడు.

ఆ సమయంలో అతనికేం చెప్పాలో నాకు తోచలేదు. ఎదురుగా ఆజానుబాహుడిలా పెదనాన్న అతను ముందు వామనుడిలా నేను…. చివరకెలాగో నోరు పెగల్చుకొని “నాకీ వృత్తి ఇష్టంలేదు పెద్దనాన్నా దానిలో ఎన్నో సాదక బాధకాలున్నాయి.

బీయస్సీ పాసైన నేను ఈ వృత్తికి న్యాయం చెయలేనేమో. అయినా  ఈ వయస్సులో స్మార్తం, వేదం నేర్చుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఏ వృత్తి మీదైనా ఇష్టం గౌరవం లేకపోతే అది రాణించదనీ నువ్వే ఎన్నో సార్లు చెప్పేవు. ఈ వృత్తి మీద ఆ రెండూ లేని నేను రాణించగలనంటావా?” అన్నాను కంటనీరు తుడుచుంటూ…

నా మాటలు విన్న పెద్దనాన్న చాలా సేపు మౌనం వహించాడు. ఆ తరువాత చెప్పడం మొదలు పెట్టాడు.

“ఈ వృత్తికి ఏం తక్కువరా… ఈ రోజుల్లో పురోహితుడు లేకపోతే ఏ కార్యక్రమమైనా జరుగుతుందా? మంచీకీ చెడుకీ రెండింటికీ అతను కావాలి. చదువనేది ప్రతీ వ్యక్తికీ ముఖ్యమే. అందుకే కదా నిన్ను మీ నాన్న వద్దన్నా చదివించాము. చదువున్నది కేవలం ఉద్యోగాల కోసం. డబ్బు సంపాదన కోసం కాదు… లోకజ్ఞానం కోసం. సమాజాన్ని ఆర్ధం చేసుకోవడం కోసం…. మంచి చెడుల విచక్షణ తెలుసుకోవడం కోసం… ఇదీ చదువుల పరమార్థం… ఆ విద్యని నువ్వు ఎలాగూ పూర్తి చేసావు. చదువుకోని వాడు స్మార్తం నేర్చుకోవడం కోసం కష్టపడాలి కానీ నీలాంటి చదువుకున్న వాడికి అది నల్లేరు మీద నడక. అదీకాక నీలాంటి విద్యాధికుడు ఈ వృత్తిని స్వీకరిస్తే ఆ వృత్తికే గౌరవం పెరుగుతుంది. అప్పుడు ఈ గ్రామం అంతా నీకు నీరాజనం పడుతుంది.ముఖ్యంగా మన కుటుంబ ప్రతిష్ఠ మరింత పెరుగుతుంది” వేదంలా అతని నోటి వెంట వచ్చిన ఆ మాటలు నాలో అంతర్మధనం కలిగించాయి,

రెండు రోజుల ఆత్మ శోధన తరువాత నేను నా మనసు కూర్చుకున్నాను.

***

ఆ మర్నాటి నుంచి నా జీవన గమనం మారిపోయింది.అహోరాత్రులు కష్టపడి పెదనాన్న దగ్గర స్మార్తం, వేదాలు నేర్చుకున్నాను. ఉపనయన వివాహాది కర్మలు.నాలుగు వేదాలు, జ్యోతిష్యశాస్త్రంతో పాటు అష్టాదశ పురాణాలను ఆరు నెలలో ఔపాసన పట్టాను. ఇప్పుడు నాకు వేదం తప్ప మరో ప్రపంచం లేదు. ఒక శుభముహూర్తాన మా ఊరి పౌరోహిత్యాన్ని మా నాన్న దగ్గర్నుంచీ నేను స్వీకరించాను. ఇప్పుడు నా వేష భాషలు మారిపోయాయి. ఇది నేనూహించని జీవన పరిణామాక్రమం.

చిన్నప్పట్నుంచీ అర్చనని నాకిచ్చి పెళ్లి చేస్తారనీ మా అగ్రహారంలో అందరూ అనుకుంటూ ఉండేవారు. మొదట్లో ఆ విషయానికి నేను పెద్దగా ప్రాధాన్యత ఇవ్వతకపోయినా ఇంటర్‌లోకి వచ్చిన తరువాత వయసు ప్రభావం వల్ల అర్చనని నేను ఆరాధనాభావంతో చూసే వాణ్ణి. ముఖ్యంగా పదహారు ప్రాయంలోకి అర్చన ప్రవేశించి కుందనపు బొమ్మలా అందంగా తయారైన తరువాత అది ప్రేమగా మారింది.

కానీ ఎప్పుడైతే నేను పౌరోహిత్యా వృత్తిని స్వీకరించానో మా మేనమామ నాకు అర్చనని ఇవ్వననీ మా అమ్మకి నిష్కర్షగా చెప్పేసాడు. ఆ విధంగా మా కుటుంబాల మధ్య స్పర్థలు మొదలై చివరకు అర్చనకు అమెరికాలో పని చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌తో పెళ్లి కుదరడంతో ఆవి తారాస్థాయికి చేరుకున్నాయి.

ఆ తరువాత ఆమె భర్తతో అమోరికా వెళ్లిపోవడం, మరో సంవత్సరానికి మా మేనమామ, అత్తలిద్దలూ చనిపోవడం, నేను నా వృత్తిలో నిమగ్నమవడంతో అర్చనని పూర్తిగా మరిచిపోయాను.

కాలచక్ర భ్రమణంలో నాలుగేళ్లు గడిచిపోయాయి. మా అమ్మ నన్ను వివాహం చేసుకోమ్మనీ పోరు పెడుతున్నా నాకెందుకో దాని మీద మనసు మళ్లలేదు.

దానికి కారణం నేను అర్చనని పూర్తిగా మరిచి పోలేకపోవడమేననీ నా భావన.

అటువంటి సమయంలో ఒక రోజు నేను పొలంలో ఉండగా అర్చన నుంచీ ఫోన్ వచ్చింది. నాలుగేళ్ల తరువాత ఆమె గొంతువినీ ఆశ్చర్యపోయాను. “బావా ప్రస్తుతం నేను కూచిపూడిలో ఉన్నాను. ఒక్క సారి వచ్చి నన్ను కలుస్తావా?” అనీ దీనంగా అభ్యర్థిస్తుంటే ఆశ్చర్యపోయాను.

***

ఉదయాన్నే విజయవాడలో రైలు దిగి టాక్సీలో కూచిపూడి బయలుదేరాను. కారులో ప్రయాణిస్తున్నంత సేపూ మనసంతా అలజడే…. ఆమెరికాలో ఉండ వలసిన అర్చన కూచిపూడిలో ఎందుకుంది నన్నెందుకు రమ్మనమనీ అడిగింది.

గంట తరువాత నేను కూచిపూడి చేరుకున్నాను. అక్కడ ఎదురు పడ్డ వాళ్లని అడిగి కూచిపూడి కళాక్షేత్రానికి చేరుకున్నాను. విశాలమైన ప్రాంగణంలో ఉందా కేంద్రం.

అందులోకి ప్రవేశించేసరికి ఒక పవిత్రమైన భావన కలగసాగింది. హాల్లో నుంచి “ఇందిరా మందీరా భక్తా మందరా హృదయారవింద” అన్న నట్టువాంగం వీనుల విందుగా వినిపిస్తోంది. నేను లోపలికి ప్రవేశించగానే కనిపించిన అక్కడి దృశ్యం నన్ను కట్టిపడేసింది.

ఎదురుగా స్టేజి మీద పెద్ద నటరాజు విగ్రహం. విశాలమైన ఆమందిరంలో చుట్టూ గోడల నిండా ఈ నాట్యానికి మూల పురుషుడైన సిద్ధేంద్రయోగి చిత్రంతో పాటు ప్రముఖ నాట్యాచార్యుల నిలువెత్తు చిత్రాలున్నాయి.

ఆహాలు మధ్యలో సుమారు పది మంది అమ్మాయిలు సాంప్రదాయ కూచిపూడి నృత్యరీతి దుస్తులు ధరించి నాట్యాన్ని అభ్యసిస్తునారు. ఒక ఇత్తడి పళ్లెంపై పాదాల నుంచి రెండు చేతుల్లో వెలిగించిన ప్రమదల్ని ఉంచుకొనీ వివిధ భంగిమల్లో నృత్యం చేస్తున్నారు.

అలా మైమరచి నాట్యాన్ని చూస్తున్న నాకు దీపపు వెలుగు ముఖం మీద పరావర్తనం చెందుతున్నప్పుడు అర్చన కనిపించింది.

అరగంట తరువాత ఆమె బయటకొచ్చింది. ఆమె వెనకాల రెండేళ్ల చిన్నపిల్లవాడు… బహుశా ఆమె కొడుకునుకుంటాను… ముద్దుగా ఉన్నాడు.

నన్ను చూస్తూనే “రా బావా పిలవగానే వచ్చినందుకు థాంక్స్… పద…. ఆ చెట్టు కింది కూర్చొని మాట్లాడుకుందాం. అన్నట్టు మరిచిపోయాను… వీడు నా కొడుకు సిద్ధార్థ” అంటూ ఆ చెట్టు వైపు దారి తీసింది.

“మా నాన్న మూర్ఖపు పట్టుదల వల్ల నా కిష్టం లేని పెళ్లి చేసుకోవలసి వచ్చింది. కానీ నా మనసంతా అప్పటిదాకా నువ్వే… కానీ తప్పలేదు. నేనూహించినట్లుగానే నా వివాహ జీవితం సాఫీగా సాగలేదు. అతగాడికి లేని అలవాట్లు లేవు. నన్ను ఈ నాలుగేళ్లు నానా హింసలు పెట్టాడు. ఇక వాడి బాధలు భరించలేక ఆరు నెలల క్రితం విడాకులు తీసుకొని ఇక్కడికొచ్చేసాను. ఈ నాలుగేళ్లల్లో నేనక్కడ సంపాదించిన డబ్బు నా జీవనానికి సరిపోతుంది. నీకు తెలుసు కదా… చిన్నప్పట్నుంచీ సంగీతమన్నా, కూచిపూడి నాట్యమన్నా నాకు ప్రాణం అనీ…. అందుకే ఇక్కడికొచ్చీ ఆ నటరాజు స్వామి పాదాల దగ్గర శేష జీవితాన్ని గడిపెయ్యాలనీ నిర్ణయించుకున్నాను. నేను వచ్చినట్లుగా మన వాళ్లకెవ్వరికీ చెప్పలేదు. నువ్వు నాకు అత్యంత ఆత్మీయుడివి కాబట్టి నీకు చెప్పాను.”

ఆమె చెబుతుంటే కళ్ల నుంచి చెమ్మ గిల్లిన నీరు చుక్కలు చుక్కలుగా చెక్కలి మీదకు జారిపోతోంది.

వైవాహిక జీవితపు విషాదఛాయలు ఆమె ముఖంలో ఆనందాన్ని హరించి వేసినా కళ్లల్లో తేజస్సు మాత్రం అలాగే ఉంది.

“నీతో కొన్ని ముఖ్య విషయాలు మాట్లాడాలనే నిన్నిక్కడికి పిలిచాను. నువ్వెలాగైనా మన ఊళ్లోని మా పొలాన్ని అమ్మి ఆ డబ్బుని నాకు తెచ్చిస్తే ఇక్కడ ఒక ఇల్లు కట్టుకొని ఆ నటరాజస్వామికి సేవ చేస్తూ శేష జీవితాన్ని గడిసేస్తాను. తరువాత ఇంకో ముఖ్య విషయం…. కోరకూడని కోరిక… సిద్ధార్ధ ఇక్కడ నాతో పాటే ఉంటే వాడి జీవితం బాగుపడదు. అందుకే వీడ్ని నీతో తీసకెళ్లి బాగా చదివించి ప్రయోజకుణ్ణి చెయ్యి…. ఎవరైనా అడిగితే ఒక అనాథ అనీ చెప్పు” అంటూ ఆగిపోయింది. ఆమాట అంటున్నప్పుడు దుఃఖం ముంచుకొచ్చింది అర్చనకు… వాడిని అలాగే పొదివి పట్టుకొని చాలే సేపు ఉండిపోయింది.

“అర్చనా ఏమిటా మాటలు…. నీ జీవితంలో జరిగిన ఆ పెళ్లి ఓ పీడకల. ఇప్పటికైనా మించి పోయింది లేదు. నేను నిన్ను వివాహం చేసుకుంటాను. మన ఊరు వెళ్లి హాయిగా జీవిద్దాం… వీడు మన కొడుకు” అనీ నేను చెబుతుంటే…

“బావా నువ్వు చేస్తున్నది పవిత్రమైన పౌరోహిత్య వృత్తి. నాలాంటి దాన్ని నువ్వు ద్వితియ వివాహం చేసుకుంటే ఊళ్లో నీకు చెడ్డ పేరొస్తుంది. ఊరంతటికీ పురోహితుడవైనను నువ్వు మచ్చలేని వ్యక్తిలా ఉండాలి. అది నా ద్వారా నువ్వు పోగొట్టుకోకూడదు. సమాజంలో ఎంత మార్పొచ్చినా ఇంకా పెళ్లిళ్ల విషయాల్లో రాలేదు. అందుకోసం మనం రాజీపడక తప్పదు” ఆమె కంట నీరు తుడుచుకుంటూ చెప్పింది.

“నీతో వివాహం కాకపోవడంతో వివాహం అనే మాటే మరిచి పోయాను. నువ్వు చెప్పినట్లే వాడిని తీసికెళ్లి పెంచుతాను. పొలాన్ని అమ్మడం దేనికి అది మనదే…. అవసరమైన డబ్బు నేనే ఇస్తాను. రెండు మూడేళ్లు ఇక్కడే ఉండి ఆ తరువాత మన ఊరు వచ్చేయ్. కాలం ఎంతటి గాయాన్నైనా మాన్పుతుందంటారు… నీ రాక కోసం, నేను బాబు ఎదురు చూస్తూ ఉంటాం…. లోకులు కాకులు… వాళ్ల గురించి మనం భయపడకూడదు… ధైర్యంగా మనం వివాహం చేసుకొని బాబుకి అందమైన జీవితాన్నిద్దాం”  అనీ చెప్పి ఆమెకి వీడ్కోలు పలికి బయటకు వచ్చాను.

ఆ తరువాత అర్చన బాబుని తనివితీరా ముద్దాడి వాడికన్ని జాగ్రత్తలు చెప్పి నాకిచ్చింది. వాడిని వదిలి ఉండాలన్న వేదన ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది.

మా కారు కదిలిన తరువత వెనక్కి చూస్తే అర్చన మాకు వీడ్కోలు పలుకుతున్న దృశ్యం చాలా సేపటి వరకు కనిపించి ఆ తరువాత చెమ్మగిల్లిన కంటి నీరు వల్ల మసక బారిపోతుంటే భారమైన హృదయంతో చూపు మరల్చుకున్నాను.

నదికి తన గమ్యం తెలియకపోయినా అది తన గమనాన్ని ఆపకుండా దాని వైపు సాగిపోతుంది.

ఇన్నాళ్లు నా జీవితానికి కూడా గమ్యం లేదు… కాని ఇప్పుడు…. నా వెనుక అర్చన… పక్కనే బాబు సిద్ధార్థ…. వీళ్లే నా జీవితం…. నా గమ్యం నాకు తెలిసింది… ఇక నా గమనం అటువైపే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here