గాంధేయం

1
8

[box type=’note’ fontsize=’16’] ఓ డాక్టర్‍గా కాకుండా లౌక్యంగా ఆలోచించి, ఓ రౌడీకి గాంధేయ మార్గంలో శిక్ష వేయించి అతడి మనసు మార్చిన వైద్యుడి కథ బి.వి. కోటేశ్వర రావు వ్రాసిన ‘గాంధేయం‘. [/box]

(ఇందలి పాత్రలు, ప్రదేశాలు, సన్నివేశాలు ఎవరినీ ఉద్దేశించినవి కావు. కేవలం కల్పితాలు మాత్రమే.)

[dropcap]ఒ[/dropcap]క పెద్ద కార్పోరేట్ హాస్పటల్ లోని క్యాన్సర్ విభాగానికి చెందిన ఔట్ పేషంట్ కార్డును చూస్తున్నారు డాక్టర్ శర్మగారు. రాబోయే పేషంట్ తాలూకు బయోగ్రఫీ, రిపోర్టులు చూస్తూ రోగ నిర్ధారణకు రాసాగారు డాక్టర్ గారు. కేవలం స్త్రీలకు మాత్రమే వచ్చే ఈ క్యాన్సర్ గురించి ఇంకా పరిశోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడూ వైద్యాన్ని సవాలు చేస్తూనే ఉంది.

“నమస్కారం”

“రండి, కూర్చోండి” వాళ్ళను చూస్తూ అన్నారు డాక్టర్ గారు.

ఇరువురు వ్యక్తులు, తండ్రి కూతురు కావచ్చు. బహుశా ఆ అమ్మాయి క్యాన్సర్ రోగి నీలిమ కావచ్చు. రిపోర్టుల ప్రకారం ఆ అమ్మాయికి బ్రెస్ట్ క్యాన్సర్ లేత దశలోనే ఉంది. దాదాపు నయం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. భయపడాల్సిన పనిలేదు. తరువాత ఆ అమ్మాయి పెళ్ళి చేసుకొని కాపురం కూడా చేసుకోవచ్చు. అంతకంటే ముందు ఆమెను ధైర్యంగా ఉంచాలి. నమ్మకం కలించాలి.

“చూడండి… ” ఉపోద్ఘాతంగా ప్రారంభించాడు డాక్టరు గారు.

“నేను పిచ్చిరెడ్డి, ఎర్రగుంట, కడప జిల్లా. ఈమె నా కూతురు నీలిమ” డాక్టర్ గారి మాటలకు అడ్డుపడుతూ అన్నాడు పిచ్చిరెడ్డి. నల్లగా దృఢంగా ఆరడుగుల ఎత్తులో ఉన్నాడు.

‘ఎక్కడో చూసినట్లుగా, ఆ శబ్దం విన్నట్లుగా ఉంది. ఎవరితను? ఎక్కడ చూశాను? బాగా పరిచయమైన, చాలాసార్లు విన్న కంఠంలా ఉంది. ఎవరైతేనేం, ఆ అమ్మాయి రోగి, నేను డాక్టరును. ఆ అమ్మాయికి రోగ విశేషములు చెప్పి వైద్యం చేయాలి’ అనుకున్నారు శర్మగారు.

“నేను మా ప్రాంత రాజకీయ నాయకుడిని. నాకు నేరుగా మా జిల్లా శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు బాగా తెలుసు. వారి నుండి రికమండేషన్ లెటర్లు ఎన్నైనా తేగలను” అభ్యర్థించడం కాకుండా ఆర్డర్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు పిచ్చిరెడ్డి.

గుర్తుకు వచ్చాడు పిచ్చిరెడ్డి ఎవరో. వాడి చర్యలు కూడా గుర్తుకు వచ్చాయి. అటువంటి వానితో చర్చలు అనవసరం. దుష్టునికి దూరంగా ఉండడం మంచిది.

“మీ బలము. బలహీనము నాకు అనవసరము. ఈ అమ్మాయికి వైద్యం నేను చేయలేను. తమరు వెళ్ళి రండి” ఒక రకమైన నైరాశ్యం ఆవరించగా అన్నారు డాక్టరు గారు.

“నా వద్ద మీ మోసం కుదరదని వైద్యం చేయనని అంటున్నారు. నా పరిచయాలు పలుకుబడితో నా వద్ద నుండి రూపాయలు మీకు అదనంగా రావని వైద్యమునకు అంగీకరించుట లేదు. అదే నేను బలహీనుడనైతే వైద్యం చేసి, వైద్యం పేరుతో రూపాయలు అదనంగా గుంజేవారు. మమ్ములను భయపెట్టి టెస్టులు, రిపోర్టులు పెంచి-మీరు కమీషన్లు కొట్టేవారు. ఇంకొంతమంది వైద్యులు జబ్బు తగ్గించడానికి బదులు రూపాయల కోసం పెంచుతారు. భయపెడతారు. దోపిడి చేస్తారు. అర్థం అవుతూనే ఉంది. మీరు తెలివిగా తప్పుకుంటున్నారు” తెలివిగా మాట్లాడాననుకున్నాడు పిచ్చిరెడ్డి.

“అనవసరమైన విషయాలు ఎందుకులెండి? దయయుంచి వెళ్ళండి” రోగులందరి మధ్యలో ఈ దుర్మార్గుడు అనవసరంగా మాట్లాడతాడు. త్వరగా పంపితే నయం అనుకుంటూ అన్నాడు డాక్టరు గారు.

“మీరు కాకపోతే వైద్యులు లేరా? ఇక్కడ కాకపోతే బొంబాయిలో, అక్కడ కాకపోతే అమెరికాలో. రూపాయలతో ఏదైనా చేయ్యొచ్చు” కోపంగా వెళ్ళాడు పిచ్చిరెడ్డి.

‘వీడిది పశులక్షణం, రాక్షసనైజం. సమాజానికి పనికిరాడు. ఇదొక రకం పిచ్చి. వీడి చర్యలతో ఇంకేతమంది వృత్తికి దూరం కావలెనో? వీడికి గట్టిగా బుద్ది చెప్పాలి.’ ఆ ఆలోచనలకు దూరం కాలేకపోతున్నాడు డాక్టర్ శర్మ గారు.

***

కడప జిల్లా ఎర్రగుంటలో ఒక హాస్పటల్. పల్లె ప్రాంతాలలో ప్రజలకు తక్కువ ధరలకు వైద్యం చేయాలని, ఎక్కువ సమయం రోగులకు అందుబాటులో ఉండాలన్న మంచి ఆదర్శంతో వచ్చారు ప్రేమికులైన ఆ డాక్టర్ దంపతులు. మంచి వైద్యం చేస్తూ పల్లె ప్రజలకు క్రమంగా దగ్గర అవసాగారు. చాలా చోట్ల లాగానే అక్కడ కూడా రౌడి రాజకీయాలు తప్పలేదు ఆ వైద్య దంపతులకు.

ఎవరి అనుమతి లేకుండా డాక్టర్ గారి రూంలోకి లుంగీలు ధరించిన యువకులు వచ్చారు. ఇంకా కొంత మంది బయట ఉన్నారు. కూర్చోమని చెప్పకుండానే కూర్చున్నారు అడ్డదిడ్డంగా.

“చూడండి! ఇది హాస్పటల్. పేషంట్లను చూడవలసిన సమయం. తమరు అనుమతి తీసుకోకుండా ఇలా నేరుగా రావడం నా పనికి అభ్యంతరం. దయయుంచి త్వరగా చెప్పండి” కొద్దిగా విసుగు, అసహనం కలిపి అనాడు డాక్టర్ ఆనంద్.

“మేము సీమ సమితి సభ్యులం. సీమ అభివృద్ది మా ధ్యేయం. ప్రత్యేక రాయలసీమ మా అంతిమ ధ్యేయం” నాయకుడుగా ఉన్నవాడు చెప్పుకపోతున్నాడు.

“మంచిది. మీ సమితికి మా వైద్యశాలకు సంబంధం ఏమిటి?” డాక్టరు గారి భార్య డాక్టర్ మధురిమ చికాకుగా వారిని ప్రశ్నించింది.

“మీరు మరీ ఇబ్బంది, చికాకు పడకండి. వివరంగా చెపుతాము”.

“ఊరు బయట పోలేరమ్మ తలి దేవాలయం లేక ఇబ్బంది పడుతోంది. ఆ దేవత ఇబ్బంది పడడం గ్రామానికి మంచిది కాదు. మీరు ఒక లక్ష రూపాయలు చందా ఇవ్వవలసి ఉంటుంది” ఇంకొకడన్నాడు.

“ఇది మా ఊరు కాదు. గ్రామ ప్రజలకు తక్కువ ధరలో వైద్యం చేద్దామని ఇచటకు వచ్చాము. మేము ఇటువంటివి ఇవ్వలేము!” ఇక మాట్లాడేదేమీ లేదు అన్నట్లుగా అన్నాడు డాక్టర్ ఆనంద్.

“మీరు ఈ ఊరిలో ఉంటూ, ఈ ఊరి నీరు త్రాగుతూ, ఈ ఊర్లో సంపాదించుకుంటూ కూడా ఈ ఊరు మాది కాదు అనడంలో న్యాయం లేదు” ఇంకొకడన్నాడు.

“మీరేమి చెప్పినా మేము ఇవ్వలేము. ఇంకా హాస్పటల్‌కు చాలా సామాగ్రి తేవలసి ఉంది. దయయుంచి ఇబ్బంది పెట్టకుండా వెళ్ళండి” వేడుకోలుగా అన్నది మధురిమ.

“మీరు ఇంతే మాట్లాడతారని మేము ఊహించిందే. మీరు చెప్పే కారణాలు వినడానికి మేము పిల్లలం కాదు” కొంచెం సీరియస్‍గా అన్నాను ఇంకొకడు.

మౌనంగా ఉన్నారు డాక్టర్ దంపతులు.

“చూడండమ్మా! మీకు తెలియదు, అనుభవం లేదు, సమస్యను పెంచుకోకండి, ఒక లక్ష ఇచ్చి రెండు లక్షలు సంపాదించుకునే అవకాశం పొందండి.”

“అదెలాగా!”

“ఏముంది మేము వేరే చెప్పాలా? మందుల రేట్లు పెంచండి. టెస్టులలో కమీషన్ తీసుకోండి. మీ ఫీజు పెంచండి. మీరు పెంచడం న్యాయమనీ, మీరు మంచోళ్లని, మీకు మద్దతుగా ఊరిలో చెబుతూ ఉంటాము. కాబట్టి మీరు మాకిచ్చే చందాను డబుల్‌గా ఒక నెలలో సంపాదించుకోవచ్చు” నచ్చచెపుతూ అన్నాడు నాయకుడిగా కనిపించే పిచ్చిరెడ్డి.

“ఇలా ఎలా కుదురుతుంది? అయోమయంగా ఉంది” అయోమయంగా అన్నాడు ఆనంద్.

“కురుతుంది. కుదుర్చుకోవాలి. మీరేకాదు అందరూ బతకాలి. చాలామంది డాక్టర్లు ఇటువంటివి ఆనందంగా, అవసరంగా చేస్తున్నారు. డాక్టరు రాజకీయ నాయకులు, రౌడీలు కలివిడిగా కలిసిపోయి ఉంటారు చాలాచోట్ల. దీన్ని మీరు వింతగా చూడకూడదు” కొంత బెదిరింపు, కొంత అనునయం కలిపి మాట్లాడాడు పిచ్చిరెడ్డి.

“ఇన్ని మాటలు అనసరం. ఇటువంటివి మా వల్ల కాదు. దయయుంచి వెళ్ళండి” కొద్దిగా భయం, ఆందోళన, ఆవేశం కలగలిపి అన్నది మధురిమ.

“ఎవరైనా అనాథలు, అంగవికలురు లాంటి వారికి ఇవ్వటంలో అభ్యంతరం ఉండకూడదు కానీ, ఇటువంటి రాజకీయ వ్యవహారాలకు ఎలా ఇవ్వగలము? ఇంకొన్ని రోజులయ్యాక అలోచిద్దాం. దయయుంచి మా పనిని మమ్ములను చేసుకోనివ్వండి.”

“మీరు చాలా ఇబ్బందులు ఎదర్కోబోతున్నారు. కొనుక్కోబోతున్నారు. తరువాత విచారించి లాభం ఉండదు.”

“వారిని బతిమిలాడేందిరా? వారంటత వారే మనల్ని పిలిచి ఇస్తారు. పదండి” అసహనంగా, కోపంగా తలా ఒక మాటా అనుకుంటూ వెళ్ళారు అందరూ.

***

సీడీలో చూసిన పిచ్చిరెడ్డి రూపురేఖలు మాటలు గుర్తుకు రాగా ఆలోచనలో పడ్డారు డాక్టర్ శర్మ గారు. ఈ దున్నపోతుకు బుద్ధి తీసుకురాకపోతే వీడి అకృత్యాలకు తను వత్తాసు ఇచ్చినట్లవుతుంది. తాను డాక్టర్‍గా కాకుండా లౌక్యుడిగా ఆలోచించి వీడికి శిక్ష వేయాలి. వీటి పొగరు, మదము తగ్గించి ప్రపంచానికి న్యాయం చేయాలి. క్రమంగా, జాగ్రత్తగా, ఒక పథకం ప్రకారం ఆలోచించి అడుగు వేయాలి.

***

“అయితే తమరు పిచ్చిరెడ్డి. ఈ అమ్మాయి నీలిమ. ఎర్రగుంట, కడప జిల్లా, మీ అమ్మాయికి క్యాన్సర్. ఖచ్చితంగా నయమవుతుంది. ఆందోళన చెందాల్సిన పనిలేదు. చాలా లేత దశ. చిన్నపాటి ఆపరేషన్ చేయాలి” డాక్టర్ శర్మగారి నుండి వచ్చిన మెయిల్‌ను దృష్టిలో పెట్టుకొని, పిచ్చిరెడ్డి ఇచ్చిన రిపోర్టులను చూస్తూ మాట్లాడనారంభించాడు నగరంలోని ఇంకొక క్యాన్సర్ డాక్టర్ రాజేంద్ర.

“నగరంలోని ఒక డాక్టరు పొగరుతో తను వైద్యం చేయనని, ఇంకెవరూ చేయరని విర్రవీగుతున్నాడు, తమరు సహృదయంతో వైద్యం చేస్తాననడం ఆనందం” సమస్య సులభంగా పరిష్కారం అయిందన్న ఆనందం పిచ్చిరెడ్డి మాటల్లో కనపడుతోంది.

“పెద్దగా ఇబ్బంది ఉండదు రెడ్డిగారు! కొద్ది సమస్య. తమకు సులభంగానే ఉంటుంది.”

“చెప్పండి డాక్టరు బాబూ! నాకు చాలా మంది రాజకీయ నాయకులు తెలుసు. ఏ వ్యవహారమైన పరిష్కారం చేయగలను.”

“మీ శక్తిసామర్థ్యాలు నాకు తెలుసు. ఆపరేషన్‍కు ఎటువంటి సమస్య, భయము లేదు. అయితే ఫార్మాలిటీ కోసం తమరు ఒక లెటర్ వ్రాయవలసి ఉంటుంది.”

“సహజంగా అందరూ అటువంటిదేదో వ్రాయించుకుంటుంటారు. మీరు కూడా వ్రాయించుకోండి, సంతకం పెడతాను” నిబ్బరంగా అన్నాడు పిచ్చిరెడ్డి.

“ఆపరేషన్ సందర్భంగా ఏమైనా అనుకోనిది జరిగితే డాక్టర్‌గా నా బాధ్యత ఏమీ లేదని, యాదృచ్ఛికంగా జరిగిందని, ఈ నష్టానికి నాకు ఎటువంటి సంబంధం లేదని, నూరు రూపాయల స్టాంపు కాగితంపై ఒక మెజిస్ట్రేట్ గారి సమక్షంలో లీగల్ అడ్వైజర్ చేత అగ్రిమెంట్ రాయించుకోవాలి. దానిపై సాక్షులుగా ఇద్దరు ఎమ్మెల్యేలతో సంతకం పెట్టించుకుంటే సరిపోతుంది. అలాగే మెడికల్ షాపు వారికి, మత్తు డాక్టర్ గారికి కూడా లెటర్లు వ్రాయించవలసి ఉంటుంది. తరువాత రెండు, మూడు లోకల్ చానల్స్‌లో మరియు స్థానిక పత్రికల్లో వారం రోజుల పాటు ఈ విషయం ప్రకటనలుగా రావలసి ఉంటుంది. తరువాత మీ నుండి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఈ ఆలోచన. ఏం అనుకోకండి. మీరు తలచుకుంటే అన్ని త్వరగానే అమరుతాయి” డాక్టర్ గారి మాటలతో బిత్తరపోయాడు పిచ్చిరెడ్డి. మైండ్ బ్లాంక్ అయింది. తన కూతురుకి వైద్యం చేయడానికా? లేక చంపడానికా? ఈ లెటర్లు. అందరికీ ఇన్ని కండీషన్లు ఉండవు కదా? నాకు మాత్రమే ఎందుకుండాలి? అంటే తాను అందరిలాంటి వాడిని కాననే కదా! తను రౌడీననే కదా? తన గురించి భయపడే కదా? మొదటిసారిగా డైలమాలో, భయంలో పడ్డాడు పిచ్చిరెడ్డి.

***

డాక్టరు శర్మ గారి ఫోన్ పిలుపుమీద వచ్చాడు పిచ్చిరెడ్డి శర్మగారి ఇంటికి.

అప్పటిదాకా భయపడి, డీలాపడిన పిచ్చిరెడ్డి తన కూతురికి శర్మ గారు వైద్యం చేస్తాడనే ఆశ పుట్టింది. విషయాన్ని లౌక్యంగా, బెట్టుగా సాధించుకోవాలనుకున్నాడు. అచట శర్మగారు ఆయన కూతురు, అల్లుడు ఉన్నారు. వారిని చూస్తూనే అవాక్కవడం, ఆశ్చర్యపోవడం పిచ్చిరెడ్డి వంతైంది. శర్మగారు, రాజేంద్ర గారు తన కూతురికి వైద్యాన్ని ఎందుకు నిరాకరించారో ఇప్పటికి అర్థమయింది. ఇంకా ఎవరూ కూడా వైద్యం చేయరని అర్థమవసాగింది.

“కూర్చోండి, రెడ్డిగారు. ఈ అమ్మాయి నా కూతురు, ఈ అబ్బాయి అల్లుడు” అంటూ మొదలు పెట్టారు శర్మగారు.

“వీరు తెలుసు. మా ఊరిలోనే వైద్యవృత్తి చేస్తుండేవారు” కూతురి వైద్యం మీద ఆశలు వదులుకొని మాట్లాడనారంభించాడు.

“సావధానంగా ఈ సీడీని చూడండి రెడ్డిగారు” శర్మగారి ఆర్డర్‌తో అటెండర్ వచ్చి ఒక సీడీని టీవీలో ఆన్ చేశాడు. ఎర్రగుంట హాస్పిటల్ సన్నివేశం టీవీలో రాసాగింది. ముప్పావు శరీర భాగం కాలిన అమ్మాయిని దుప్పటి కప్పి నలుగురు నాలుగు వైపులా మంచాన్ని మోస్తూ తెచ్చారు. డాక్టర్ ఆనంద్, మధురిమలు రోగిని చూశారు. చాలా శరీర భాగం కాలింది. బాగా కష్టం. పైపెచ్చు పోలీసు కేసు. అదే చెప్పారు. రోగి తాలూకు వారు బాధపడడం, బ్రతిమిలాడడం, ఏడవడం, నిష్ఠూరమాడడం, కాళ్ళు పట్టుకోవడం ఆడియోతో సహా టీవిలో రాసాగినాయి. కాలిన అమ్మాయి బాధ వర్ణనాతీతం. కనీసం ప్రాథమిక చికిత్స అయినా చేయడం మానవీయం అనుకున్నారు డాక్టరు దంపతులు. చూస్తుండగానే లోకం విడిచింది ఆ అభాగ్యురాలు.

ఎక్కడి నుండి వచ్చారో వచ్చారు పిచ్చిరెడ్డి బృందం. చనిపోయిన రోగి తాలూకు తల్లిదండ్రులుకు ధైర్యం చెబుతూ వారికి ఎటువంటి అన్యాయాన్ని జరగనివ్వమని, డాక్టరు దంపతుల రూపాయల ఆశ నైజం గురించి, వైద్యం చేయకుండా ఆలస్యం చేసిన విషయం గురించి, రూపాయలు ఉండే ధనికవర్గానికి అయితే అత్యుత్తమ, త్వరితగతిన వైద్యం చేయడం గురించి, ఇదే వారి బంధువైతే పోలీసు కేసు గురించి అడగరని, వైద్యులను ప్రశ్నించే వారు ఎవరూ ఉండరని వారి ధీమా అని, పల్లె జనం అంటే లోకువ అని, ఇటువంటి వైద్యులు సమాజానికి చేటని రకరకాలుగా జనాన్ని రెచ్చగొట్టారు. రెచ్చిపోయిన జనం హాస్పటల్ మీద రాళ్ళు వేయడం, వైద్య సామాగ్రిని నాశనం చేయడం జరిగింది. మరలా వారిని శాంత పరచడం, పరిష్కారంగా ఐదు లక్షల రూపాయలు ఇచ్చేలాగునా సెటిల్‌మెంట్ చేయడం, రోగి తాలూకు వారికి కొద్దిగా ఇచ్చి వారిని మాటల గారడీతో శాంత పరచడం సీరియల్‌గా, కాలుక్యులేటడ్‌గా, కన్విన్సింగ్‌గా టీవీలో రావడం, అందరూ చూడడం జరిగింది.

“ఇంత దరిద్రంగా వ్యక్తులు ఉన్నారా? రౌడీయిజం, రాజకీయం ఇంతగా పెనవేసుకున్నాయని ఆశ్చర్యపోతున్నారా? కులము, మతము, ప్రాంతము, భాష, లింగము, చదువు ఏదీ కూడా రౌడీయిజానికి అడ్డురావు. అందరిలోనూ ఉన్నారు. అన్ని చోట్లా ఉన్నారు. మీకు గుర్తుంటే సంతోషం. గుర్తులేకపోతే గుర్తు చేసుకునే ప్రయత్నం చేయండి. అన్ని నిజాలే. అబద్ధాలు కావు. వైద్యాలయాలే కాదు, విద్యాలయాలు, దేవాలయాలు, కర్మాగారాలు కూడా రౌడీరాజకీయానికి భయపడాల్సిందే.

యానాంలో ఒక ప్యాక్టరీ యజమానిని చంపి ఆ ఫ్యాక్టరీ మూసివేతకు కారకులయ్యారు అక్కడి నాయకులు. నరసరావుపేటలో ఒక ఆర్టీవో గారు బాగా పనిచేస్తూ జరిమానాలు వేస్తున్నారని అతని కాళ్ళు విరగొట్టారు అక్కడి పల్లెనాయకులు. దీనికి ఒక మీడియా కూడా ఆ రోజుల్లో సహకరించింది.

ఎలక్ట్రికల్ ప్రభలపై నగ్న నృత్యాలను భంగపరుస్తున్నారని ప్రభల లైట్లు ఒక్కసారిగా ఆపేసి, ప్లానింగ్‌గా పది నిమిషాల పాటు పోలీసులకు దేహశుద్ధి చేశారు బాపట్లకు దగ్గరగా ఉండే ఒక ఊరి చోటా రాజకీయులు. ఇంకొక ఊరి నేతలు రాస్తారోకో చేసి నగ్ననృత్యాలను సాధించుకున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీలు, జూట్ మిల్లులు ఈ రౌడీ రాజకీయాలకు బలయినాయి. రాయాలంటే పేజీలు చాలవు. ఇంటికొక ఉద్యోగం చూపిస్తామనే రాజకీయ నాయకులు ఇంటికొక నిరుద్యోగిని తయారు చేస్తున్నారు వారి రౌడీ రాజకీయంతో. గాంధీ హాస్పటల్‌లో మొదటిసారి మీడియా వారు చిత్రీకరించలేదని, రెండవ సారి నాశనం చేశారు రౌడీ విద్యార్థులు. చిన్న యాక్సిడెంట్ ఎక్కడయినా అయిందా, అక్కడ రాజకీయం తయారు. స్థల, కుటుంబ సమస్య ఏదయినా కావచ్చు, వీరు తయారు…. ఒక విద్యార్థి ఎందుకో చనిపోతే ఆ విద్యాలయం మూతపడాల్సిందే. మార్కులు ఎక్కువ వస్తే విద్యార్థులను ఎక్కువగా క్రమశిక్షణలో ఉంచారనీ; మార్కులు రాకపోతే చదువు చెప్పరని ప్రచారం చేస్తారని విద్యాసంస్థల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు భయపడడం మనం నిత్యం చూస్తూనే ఉన్నాము. చివరకు మిర్చి బండి వద్దకూడ రాజకీయ స్వార్ధ వ్యాపారమే. రౌడీయిజం మానుకుని సైలంట్‌గా ఉంటే అన్ని అభివృద్ధి పనులు సక్రమంగా జరుగుతాయి. అభివృద్ధి జరగడానికి చట్టాలు, నిబంధనలు చక్కగా, నిర్దుష్టంగా, అమరికగా ఉన్నాయి. దయయుంచి తాము కల్పించుకోకుండా మీ పని మీరు చూసుకోండి. అభివృద్ధి జరుగుతుంది.”

***

డాక్టర్ శర్మగారిలో రెండు రకాల భావనలున్నాయి. డాక్టరుగా ఎవరికైనా వైద్యం చేయడం ఆయన బాధ్యత. రోగి పుట్టుపూర్వోత్తరాలు, తల్లిదండ్రుల చరిత్ర డాక్టరుగా అనవసరమనుకుంటారు. రోగికి వైద్యం చేయడం వరకే వైద్య శాస్త్రం ఆయనకు నేర్పింది. అల్లారుముద్దుగా పెంచి, ఖరీదైన వైద్య చదువు చదివించి, వివాహం చేసి ఆమె కోరిక ప్రకారం పల్లెలో హాస్పిటల్‌ను పెట్టించి, తక్కువ ధరలకు వైద్యం చేద్దామన్న సదాశయంతో వైద్యం చేస్తున్న ఆమె, వైద్యవృత్తి అంటే భయపడే స్థితికి తెచ్చిన పిచ్చిరెడ్డి అంటే మండిపడడం, పిచ్చిరెడ్డిని చక్రబంధంలో ఇరికించాలన్నది మరొక ఆలోచన. ఈ రెండు ఆలోచనల మధ్య సతమతమవడం, చికాకు పడడం, కుటుంబ సభ్యులతో కోపంగా మాట్లాడడం, శర్మగారి ఇరవై సంవత్సరాల కుమారుడు గమనించాడు. ఆలోచనలో పడ్డాడు.

***

చైతన్య ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. చదువుతున్నట్లు అనిపించడు కానీ, తెలివిగల వాడు. క్రికెట్, చెస్‌లో బాగా ప్రావీణ్యంగా ఉంటాడు. ఇతను ఏ గడ్డి పెడతాడో ఆలోచనతో వచ్చాడు పిచ్చిరెడి చైతన్య నుండి ఫోన్ పిలుపుతో.

“చూడండి రెడ్డి గారు! మీకు తెలియదనుకుంటాను, తెలుసుకోండి. ఒక వైద్య విద్యార్థి చదువు పూర్తి కావడానికి ప్రభుత్వం, విద్యార్థి కలిసి దాదాపు కోటి రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. వెయ్యి మంది ఇంటర్ విద్యార్థులలో ఒకరు మాత్రమే వైద్య విద్యను పూర్తి చేయగలరు. వైద్య విద్యే కాదు. ఏ విద్య అయినా అంతే. అటువంటిది తమరు రాజకీయ, రౌడినైపుణ్యంతో ఒక హాస్పిటల్‌ను నాశనం చేయించి ఇద్దరు అపర బ్రహ్మలను వారి వృత్తికి దూరం చేశారు. అప్పటికెంతమందిని నాశనం చేశారో? ఇంకెంతమందిని నాశనం చేస్తారో? ఏం చేద్దాం చెప్పండి” అన్నాడు.

తన కూతురుకు అనారోగ్యం తెలిసినప్పటినుంచి రెడ్దిలో మార్పు రాసాగింది, తను చేసిన పాపం తన కూతురు పాలిట రోగమై వేధిస్తున్నదని అర్థమవసాగింది. డాక్టర్ శర్మగారు వైద్యాన్ని నిరాకరించడంలో ఆందోళన పడ్డారు. రాజేంద్రతో భయపడ్డాడు. ఇక తన కూతురుకు వైద్యం కష్టమనుకున్నాడు. తన వద్ద ఉన్న జులుం విద్య నిష్ప్రయోజనం. ఏ భగవంతుడు రక్షిస్తాడో? తనలో ఉన్న రాక్షసుడు క్రమంగా తెరమరుగై మానవుడవసాగాడు పిచ్చిరెడ్డి.

“ఏం చెప్పమంటారు బాబూ! నావద్ద ఇంకా ఏముందని మాట్లాడమంటారు? మీకేమైనా అవకాశం ఉంటే, ఏ వైద్యుడైనా పరిచయం ఉంటే నా కూతురుకు వైద్యం చేయించగలిగితే, మీరు చెప్పేదేదైనా వినగలను, నిస్సందేహంగా ఆచరించగలను” భయము, ఆందోళన, బాధ కలగలిపి అన్నాడు కూతురు మీద బెంగతో,

“మీ కూతురు ఇక మీ కూతురు కాదు.”

“అంటే?”

“నాకు దత్తు ఇస్తారు”

“మీకు వివాహం అయిందా బాబూ? అయితే ఆమె అంగీకరిస్తుందా? వివాహం కాకపోతే మీకు భార్య కాబోయే వ్యక్తి అంగీకరించకపోతే ఎలా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మీరెవరు? మీ కోరిక ఏమిటి? రోగిష్టి నా కూతురును మీ కూతురు చేసుకొని ఏం చేసుకుంటావు? మా అమ్మాయి నీకంటే పెద్దదయి ఉండవచ్చు కూడా!” అయోమయంగా, అనుమానంగా చూస్తూ అన్నాడు పిచ్చిరెడ్డి.

“చాలా ప్రశ్నలు వేశారు. నాకు వివాహం కాలేదు. మీ అమ్మాయిని కూతురుగా అంగీకరించే అమ్మాయినే నేను పెండ్లి చేసుకుంటాను. నేను ఎవరైతే మీకేంటి? నాకంటే పెద్దదయిన అమ్మాయి నన్ను బాబాయి అంటుంది దూరపు అన్నయ్య కూతురు. నేను అమ్మమ్మా అంటాను మా అమ్మ వయస్సు ఉన్న ఒక దూరపు బంధుపును. కాబట్టి మీ అమ్మాయి పెద్దదయినంత మాత్రాన అభ్యంతరం లేదు.”

“ఇంతకు నా కూతురును ఏం చేసుకుంటావు బాబూ”

“వైద్యం చేయంచి మామూలు మనిషిని చేస్తాను. ఆమెకు నచ్చిన వానితో వివాహం చేస్తాను. నాకు పుట్టే పిల్లలకు అక్కను చేస్తాను. నా పిల్లలతో సమానంగా ఆస్తిలో వాటా కూడా ఇస్తాను. మీ అమ్మాయిని రాణిలా మారుస్తాను.”

“నా ఆస్తిని కూడా మన అమ్మాయికే ఇస్తాను. ఇద్దరినీ కూడితే ఇంకా ఎక్కువవుతుంది.”

“ఆగండి రెడ్డి తాతగారు! తమరు కొంత నెమ్మదించాలి” నవ్వుతూ అన్నాడు చైతన్య

“అయ్యా మీరెవరో తెలియదు. నా కూతురుకు నయమవుతుందనుకుంటే ఏమైనా చేస్తాను.”

“ఎర్రగుంట లోని కోటలాంటి నీ ఇంటిలో మా అక్కబావలతో వైద్యశాల ఏర్పాటు చేయించి, నీ మిగతా ఆస్తి అంతా అమ్మి ఏదైనా బ్యాంక్‌లో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో హాస్పటల్ నడిచేలా, భవిష్యత్తులో ఏ ఆస్తిని నీవు కొనకుండా ఉండేలా అంగీకరించాలి”.

“మరి నన్నెలా బతకనుంటావు బాబూ! నీ అక్క బావా అంటే ఎవరు? నేను నాశనం చేసిన హాస్పటల్ తాలూకు డాక్టర్లేనా? అంటే మీరు శర్మగారి కుమారులా? అంతా అయోమయంగా ఉంది. ఏమైనా చేస్తాను. అమ్మాయికి వైద్యం చేయించండి.”

“ఆ హాస్పటల్లోనే ఉండి దానిని బాగుచేస్తూ, వారిచ్చే జీతంతో తిని, అక్కడే పడుకొని అచటికి వచ్చే రోగుల మంచిచెడ్డలను చూడగలగాలి నీవు జీవించి ఉన్నంత వరకు.”

అప్పటికి అర్థమయింది సిచ్చిరెడ్డికి తాను ఎంత తీయని శిక్ష అనుభవించబోతున్నానో అని.

“మీరేం భయపడనవసరం లేదు. మీ అమ్మాయి మీరుండే హాస్పటలకు ఎప్పుడైనా వస్తుంది మా అమ్మాయిగా. అపుడు నిరభ్యరంతంగా చూడొచ్చు మీ యజమానురాలిని. అంతేకాదు మీకు ఎవరు కొరివి పెడతారని బాధ పడాల్సిన అవసరం లేదు. మీ కాదు మా కాబోయే అల్లుడు గారు కాని వారికి పుట్టబోయే పిల్లనాడు కానీ కొరివి పెడతారు. అనాథ సంస్కారం పుణ్యం కదా! ఆలోచించండి. అంగీకరిస్తే మా నాన్నగారే తన మనవరాలికి పూర్తి వైద్యం చేయగలుగుతారు నిరభ్యరంతంగా, ఆనందంగా.”

“బాబూ నన్ను ఇంకా చంపమాకండి, మొత్తం చచ్చిపోయాను. మీరు చెప్పిన అన్ని విషయాలు అంగీకరిస్తాను. నా కూతురై పుట్టి పాపం చేసుకున్న నా నీలిమను మీ కూతురుగా చేసుకొని ఆనందంగా జీవించండి. ఇక నా వృత్తిని నేను మార్చుకొని తమరు చెప్పినట్లు పాచి పని చేసుకుంటూ తమ హాస్పటల్లోనే జీవిస్తుంటాను. ఆ హాస్పటల్‌నే నా కుతురుగా భావిస్తుంటాను. చిన్నవాడివి నమస్కారం చేయకూడదు. అయినా మనస్పూర్తిగా నమస్కరిస్తున్నాను బాబు” అన్నాడు.

బి.వి. కోటేశ్వర రావు, 9948047389

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here