గాంధి

0
12

[కన్నడంలో డా. బెసగరహళ్ళి రామణ్ణ రచించిన ‘గాంధి’ అనే కథని అనువదించి అందిస్తున్నారు రంగనాథ రామచంద్రరావు.]

[dropcap]ఇం[/dropcap]డియాలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక ప్రాథమిక ఆరోగ్యం కేంద్రంలో – ఆ రోజు సోమవారం కావటం వల్ల జనం కిక్కిరిసి ఉన్నారు. పెద్దాసుపత్రి రీతిలో రోగులు తమ పేరు నమోదు చేయించి, గుమాస్తా అమృతహస్తాల నుంచి తమ పేరు, కులగోత్రాలు, వయస్సు మొదలైన వివరాలు కలిగిన చీటి ద్వారా వైద్యాధికారులను కలిసే ఏర్పాటుకు ఇక్కడ అవకాశం లేకపోవటం వల్ల; ముందుగా వచ్చిన రోగి ఏదో మూలలోనో లేదా వైద్యాధికారి గది గుమ్మంలోనో నిలబడి నిస్సహాయంగా – కళ్ళను విపార్చుతూ, అతని దయ కోసం ఎదురుచూస్తూ, ఒక్కోసారి అలసిపోయి వరండాలో, తెచ్చిన సీసాను తలదిండుగా చేసుకుని తాను, లేదా తాము వచ్చిన పనినే మరిచిపోయి మూల్గుతూ పడుకునేవారు. ఇలా ఏవేవో నమ్మలేనటువంటి విషయాలు. చివరలో వచ్చినవాడికి వైద్యాధికారినుంచి హార్దిక స్వాగతం. ఇంకా వర్ణించటానికి అవకాశం లేనటువంటి వర్గం జనాలు వచ్చినపుడు కృత్రిమ విధేయత నింపుకున్న స్వాగతం – వీటన్నిటికి పూర్తిగా అవకాశం ఉండటం వల్ల బళ్ళేకెరె అనే గ్రామం నుంచి పొద్దుపొడవటానికి ముందే వచ్చి ఆస్పత్రిలో ఎదురుచూస్తున్న ఒక స్త్రీ, ఆమెతోపాటు సుమారు పదిహేనేళ్ళ కుర్రవాడు చాలా సేపటివరకూ ఎవరి దృష్టికి రాకుండా పడివున్నారు. ఆ స్త్రీ, ఆ కుర్రవాడి తల్లికి సుమారు నలభై ఏళ్ళ వయస్సు. కుర్రవాడు వరాండాలోని స్తంభానికి ఒరిగి, ఆస్పత్రికి వచ్చిపోతున్న వారిని ఎలాంటి కుతూహలం లేకుండా చూస్తూ కూర్చున్నాడు. అతడికి పదిహేనేళ్ళకే ప్రపంచం మీద ఒక విధమైన జుగుప్స ఏర్పడింది. కూర్చుని కూర్చుని విసుగొచ్చి అతను పక్కనే నిలుచున్న తన తల్లి చీరను బలంగా లాగి అన్నాడు –

“అమ్మా, ఎండ ఎక్కువవుతూ ఉంది, పదా ఊరికి పోదాం”

“కాస్త ఊరుకో. వచ్చినోళ్ళం ఎట్లాగో వచ్చినాం, సూపించుకునే పోదాం”

“పొద్దుపొడవనీకి ముందుగాలే వచ్చినాం మనం”

“ఈడ, నీమాటలు, నా బాధ ఎవరు వింటారు?”

తన తల్లి కంఠం నేపథ్యంలోని నిస్సహాయత, చుట్టుపక్కల వాతావరణం నిష్కరుణతో నిండి వుండటం, పరిచయం చేసే తీరులో ఏర్పడిన విధానాన్ని గమనించటం వల్లనో లేదా తన కోసం తన కన్నతల్లి మౌనంగా బాధను అవమానాన్ని భరిస్తూ నిలబడి వుండటం చూసో, కుర్రవాడు అన్నాడు – “నేను ఉంటే ఎంత, చస్తే ఎంత? పదమ్మా ఊరికి పోదాం.”

“మూడు పొద్దులు ‘చస్తాను చస్తాను’ ఇవే మాటలు నీ నాలుక మీద”

“ఉండి నేను ఏ రాజ్యాన్ని పాలించాలి?”-వయస్సుకు మించిన అనుభవంతో కూడిన మాటలు తన కొడుకు నోటి నుంచి రావటం తల్లికి ఆశ్చర్యం కలిగించలేదు. ఆ వయసుకే అనుభవించిన బాధల మూసలోంచి వచ్చిన మాటలవి. కన్నపేగు చురుక్కుమనటంతో కొంగుతో కళ్ళు తుడుచుకుంది. తన దేహంలో ఉన్న రోగం వల్ల కలిగే బాధనూ, తల్లి నిస్సహాయతనూ తమకు కలుగుతున్న అవమానాన్నీ ఇంక భరించటం సాధ్యంకాదనే తీరులో ఆ కుర్రవాడు గబుక్కున పైకి లేచి ముందుకు సాగాడు.

“ఎక్కడికి నాయనా?”

“డాక్టర్‌ను చూడ్డానికి..”

“ఒరేయ్, అసలే తూలుతుండావు, పడిపోయేవు నాయనా” అని పట్టుకోవడానికి వచ్చిన తల్లి చేతులను విదుల్చుకున్నవాడు, వైద్యాధికారి గదిలోకి ప్రవేశించి, గుమిగూడిన జనాన్ని చీల్చుకుంటూ, వైద్యాధికారి బల్లముందు నిలుచుని, బిగ్గరగా అన్నాడు- “సార్ నేనూ, మా అమ్మ పొద్దుటి నుంచీ ఎదురు చూస్తున్నాం”.

వైద్యాధికారి తలెత్తి చూశారు. సుమారు ఎత్తున్న, బక్కచిక్కిన, వెడల్పు చెవుల, ఉబ్బిన పొట్టతో ఒక కుర్రవాడు తన ముందుకు వచ్చి నిలుచున్నాడు. అవ్యక్తమై బాధతో కూడిన రోషం అతని ముఖం మీద స్పష్టంగా కనిపిస్తోంది.

కుర్రవాడే మళ్ళీ అన్నాడు:

“నన్ను కాసింత చూడండి సార్”

వైద్యాధికారి ఈ అరుదైన కుర్రవాడిని చూసి కాస్త హాస్యం చేయాలనిపించి, అతడినే చూస్తూ అన్నారు-

“కాసింత ఏమిటి? బాగానే చూశాను. నీ పొట్ట లావుగా ఉంది. కాళు చేతులు సన్నగా ఉన్నాయి, చెవులు మాత్రం గాంధి చెవుల్లా ఉన్నాయప్పా”

కుర్రవాడు తన కుడిచేతిని ముందుకు చాపి, “నా జబ్బు ఏమిటో చూడండి సార్?” అని వేడుకున్నాడు.

“మీకు దండం పెడతాను. కోప్పడకుండా సూడండి స్వామి, వీడొక్కడే నాకుండే మగబిడ్డ” అని ఆ ఆడమనిషి బతిమిలాడింది. వైద్యాధికారికి తన ముందు నిలుచున్న వ్యక్తులు తనలాగే మనిషి వర్గానికి చెందినవాడని జ్ఞాపకానికి వచ్చో లేదా వైద్యుడైనవాడికి కనికరంతో కూడిన హృదయం ఉండాలనే మాట గుర్తొచ్చో, ఏమి కథనో, మొత్తానికి ఈ తల్లీ కొడుకుల మీద జాలి కలిగి అడిగాడు – “వీడు నీ కొడుకమ్మా?”

“అవును స్వామి, దేవుని మింద పెమాణం స్వామి”

‘వీడి పేరేమమ్మా?”

“గాంధి స్వామి”

“ఏమమ్మా, తమాషాకు నేను నేను వీడి చెవులు గాంధీజీకి ఉన్నట్టు ఉన్నాయని అంటే వీడినే సాక్షాత్తు గాంధి అని అనుకున్నావా?”

“లేదు స్వామి అబద్ధం సెప్తే నా నాలుక్కి పురుగులు పడనీ, సేదుకునిపోనీ, నామీదొట్టు, వీడి పేరు గాంధీనే”

“దేవుని ప్రమాణంగా నా పేరు మహాత్మా గాంధి సార్” కుర్రవాడు ధైర్యంగా, దృఢనిశ్చయంతో అన్నాడు.

వైద్యాధికారి తెల్లబోయాడు. అతను వైద్యవృత్తి చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఉన్న అవధిలో ఈ విధమైన కాకతాళీయమైన సంఘటనను చూడలేదు. విననూ లేదు. తన జీవితంలో కలిసి వచ్చిన ఈ సంఘటన మరీ అరుదైనదని అనిపించీ, దీన్ని తన సహోద్యోగులతో పంచుకోవటానికి, మునుముందు తాను ఎవరికైనా వర్ణించినపుడు ఇదొక పచ్చి అబద్ధం అని చెబితే, ఫలానా వాళ్ళు ఉన్నారు, కావాలంటే విచారించండి అని సాక్షులను నమోదు చేసుకోవటానికి జవానును బిగ్గరగా పిలిచి చెప్పాడు.

“చూడు నాయుడు, నరసింహమూర్తి, సరసమ్మ- వీళ్ళను వెంటనే నేను పిలుస్తున్నానని పిలవ్వయ్యా” అన్నాడు.

అందరూ వచ్చారు. వైద్యాధికారి చెప్పింది విని కిసుక్కున నవ్వారు. అందులోనూ ఈ మధ్యనే కుటుంబ నియంత్రణ విస్తరణాధికారిగా ఉద్యోగంలో చేరిన నరసంహమూర్తి తాను ఇదంతా నమ్మనన్నట్టు కిసుక్కున నవ్వాడు. వైద్యాధికారికి కాస్త కోపం వచ్చి-

“కావాలంటే వాణ్ణి అడగండి” అని అన్నారు.

నరసింహమూర్తి వైద్యాధికారుల కుర్చీ వెనుక గోడమీద వేలాడదీసిన ఒక ఫోటోను చూపించి- “ఏ అబ్బాయ్, ఆ ఫోటో ఎవరిదయ్యా?” అని అడిగాడు.

“మహాత్మా గాంధీగారిది సార్, ఇది నాకు తెలియదా?”

“నీ పేరేమిటయ్యా?”

“మహాత్మా గాంధి సార్”

“అబద్ధాలు చెప్పకు”

“అబద్ధం చెప్పి మీ నుంచి నేను ఏ సామ్రాజ్యాన్ని తీసుకోవాలి?”

అందరూ నోట మాటలు రానట్టు నిలబడ్డారు. మహాత్మా గాంధీజి ఫోటోను ఒకసారి; తరువాత రక్తమాంసాలు నింపుకుని, దీర్ఘంగా ఊపిరి పీలుస్తూ, బాధను అనుభవిస్తూ, నేలమీద తమ కళ్ళముందు నిలుచున్న మహాత్మా గాంధి వైపు ఒకసారి చూపులుసారిస్తూ నిలబడ్డారు. వైద్యాధికారి, అతని సహచర బృందం, ప్రపంచంలో మరీ ఆశ్చర్యకరమైన దృశ్యాన్ని చూసినవారిలా నిలబడివుండటం చూసి మహాత్మా గాంధీకి విసుగొచ్చింది.

“నా జబ్బును చూడండిసార్! నా తలరాత” అన్నాడు.

“నీకు ఈ పేరు ఎవరు పెట్టారు?”

“కరిసిద్ధేగౌడ అని మా తాత ఉన్నాడు. అతనే పెట్టినాడు”

వైద్యాధికారి, మిడ్ వైఫ్‌ను పిలిచి గాంధిని పరీక్షాగదికి తీసుకునివెళ్ళి పడుకోబెట్టమని చెప్పారు. ఆమె అలాగే చేసింది. నాలుక, కళ్ళు, గొంతు, చూసిన తరువాత గుండె, శ్వాసకోశాల పరీక్ష ముగించి, పొట్టను పరీక్షించిన వైద్యాధికారి గాంధి తల్లి వైపు తిరిగి, “నీ పేరు ఏమమ్మా?” అన్నారు.

“నింగమ్మ స్వామి”

“చూడమ్మా, మీ పిల్లవాడికి పొట్టలో నీళ్ళు చేరుకున్నాయి. పైగా కాళ్ళూ ఉబ్బి వున్నాయి. ఇది గుండెకు సంబంధించిన జబ్బు. ఇప్పటికే జబ్బు లివర్‍కూ వ్యాపించింది. అక్కడ ముట్టితే చాలు, గాంధి నొప్పి అని మొత్తుకుంటున్నాడు”

“ఏమో స్వామి. మీ దయ. మూడు మైళ్ళు నడవటానికి ముప్పయి చోట్ల కూర్చోని, దోక్కుంటూ వచ్చాడు. కాపాడండి. రేపు మా నాయన్ను పిల్చుకొస్తాను. తండ్రి లేని అనాథ”

“నీ భర్తకు ఏమైంది?”

“స్వామి, కల్లు దింపటానికి షావుకారు తాన ఉండేటోడు. ఒక పొద్దు చెట్టు మింద నుంచి పడి గబుక్కున పేణాలు వదిలిండు”

“అయ్యో పాపం! చూడమ్మా, మీ పిల్లవాడికి ఎక్స్‌రే తీయించాలి. గుండె పరీక్ష చేయించాలి. రక్త, మూత్ర పరీక్షలు చేయించాలి. ఇక్కడ జరిగే విషయం కాదు. వీణ్ణి జిల్లా ఆస్పత్రిలో చేర్చాలి. నేను అన్ని విషయాలు రాసిస్తాను. పొట్టలో ఉన్న నీళ్ళు తగ్గటానికి ఇప్పుడు రెండు మాత్రలు మింగిస్తాను” అని చెప్పి నీళ్ళు తెప్పించి, మాత్రలను మింగించేశారు. గబగబా పెద్దాసుపత్రికి గాంధి జబ్బు విషయంలో తాము కనుక్కున్న వివరాలనూ నమోదు చేసి, ఆమె చేతికి ఇచ్చారు.

***

మనుమడి పరిస్థితి చింతాజనకమైనదని కరిసిద్దెగౌడకు ఎవరూ చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఆశల మొలక, తన కూతురు నింగమ్మ, ఆమె పిల్లలు పద్ది, గాంధిలు. పద్ది ఎంతైనా పరాయి ఇంటికి వెళ్ళే ఆడపిల్ల. గాంధి మీద కరిసిద్దేగౌడకు ఎక్కడలేని ప్రేమ. తన మనుమడికి పేరును పెట్టడమే ఒక మరవలేని సంఘటన.

కరిసిద్ధేగౌడ జీవితంలో పదిహేనేళ్ళ క్రితం మాట. పొలం దున్ని తానూ, తన అల్లుడు బుక్కే గౌడ పొద్దు మునిగిన తరువాత ఇంటికి వచ్చేసరికి చాట నిండా సలసలకాగుతున్న ఒంటితో మనుమడు పడుకుని వున్నాడు. కరిసిద్దేగౌడ సంతోషంతో పొంగిపోయాడు. తన మనుమడి వెడల్లయిన చెవులు చూసి ఆనందపడుతూ జోస్యుల ఇంటికి వెళ్ళాడు. జోస్యులవారు బిడ్డ చాలా ప్రశస్తమైన ఘడియలో పుట్టాడని లెక్కలు వేసి చెప్పి, బిడ్డ చెవులు వెడల్పుగా ఉండటం వల్లనూ, కరిసిద్ధేగౌడ చాలాకాలం క్రితం శివపురకు వెళ్ళి మహాత్మాగాంధీగారిని స్వయంగా దర్శనం చేసుకుని వచ్చినవాడు ఈ చుట్టుపక్కలకంతా ఇతనొక్కడే కావటం వల్లనూ బిడ్డకు ‘మహాత్మాగాంధి’ అని పేరుపెట్టాలనీ నిర్ణయం చెప్పారు. కరిసిద్ధేగౌడ ఎంత అమాయకుడు అంటే, ‘మహాత్మాగాంధి గారు మళ్ళీ జన్మించి నీ కూతురు గర్భంలో జన్మించారు’ అని చెబితే దాన్నీ నమ్మేసేవాడు. ప్రస్తుతం జోస్యులు అంతటి ఘోరమైన నేరం చేయలేదు.

కరిసిద్ధేగౌడకు రెండెకరాల పొలం, ఒకటే ఇల్లు. ఈ మధ్యన ఈ పొలంలో ఒక ఎకరం బీదవాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి పంచటానికి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇది కరిసిద్ధేగౌడకు అల్లుడు చనిపోయినదానికన్నా తీవ్రమైన విచారానికి గురి చేసింది. విచారంలో మునిగి ప్రభుత్వం స్వాధీనపరుచుకున్న ఒక ఎకరం భూమిలో చక్కగా ఫలమిచ్చే పనస చెట్టును నరుక్కోవాలా వద్దా అనే జిజ్ఞాసలో చిక్కుకున్నందువల్ల ఆయన తన మనుమడి ఆరోగ్యం పట్ల అంతగా దృష్టి సారించలేదు.

కూతురు వైద్యులు రాసిచ్చిన చీటిని ఇచ్చి, గాంధిని ‘పెద్దాసుపత్రిలో చేర్చాలట’ అని చెప్పినపుడు కరిసిద్ధేగౌడ గుండె గుభేలుమంది.

మరుసటి రోజే మొత్తం సంసారమే బస్సులో అంత ఇంతో ఉన్న చిన్న మూట కట్టుకుని, ‘పెద్దాసుపత్రి’ ఉన్న తమ జిల్లా కేంద్రానికి ప్రయాణమయ్యారు.

ఆస్పత్రి చేరేసరికి మధ్యాహ్నమైంది. ఔట్ పేషంట్లను పరీక్షలు చేసే విభాగంలో రోగుల పేరు నమోదు చేసుకుని, చీటి యిచ్చి వైద్యుడి దగ్గరికి పంపే గుమాస్తాకు తమ తాలూకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఇచ్చిన కాయితాన్ని ఇచ్చినపుడు, గుమాస్తా అంతా చదివి, రోగి పేరును రెండు మూడు సార్లు చదివి, ఏదో అనుమానం వచ్చినవాడిలా, కరిసిద్దేగౌడ వైపు చూసి, “ఎవరిని చూపించడానికి తీసుకొచ్చారు?” అని అడిగినపుడు, కరిసిద్ధేగౌడ తన మనుమడిని చూపించడంతో, “ఓహెూ, ఇతని పేరు ‘మహంతే గౌడ’ అని కదా? మీ డాక్టర్ ఇతడి పేరు ‘మహాత్మాగాంధి’ అని రాశారుకదా?” అని నవ్వాడు.

కరిసిద్ధేగౌడ “ఆయన రాసింది సరిగ్గానే ఉంది స్వామి. వీడి పేరు మహాత్మాగాంధినే” అన్నాడు. గుమాస్తా తెరిచిన నోరు తెరుచుకునే మహాత్మాగాంధిని చూశాడు. “సరేనయ్యా, తీసుకో ఈ చీటి” అంటూ పాత చీటితో పాటు, కొత్త చీటి యిచ్చి, అటు వైపు వెళ్ళమని చూపించాడు.

అక్కడొకడు వీళ్ళు ఇచ్చిన కాగితాలనూ, ఇంకా చాలామంది ఔట్ పేషంట్లు ఇచ్చిన కాగతాలనూ తీసుకుని లోపలికి వెళ్ళి ఒక పెద్ద బల్ల చుట్టూ కుర్చీలో కూర్చున్న వైద్యుల గుంపు ముందు పెట్టి వచ్చాడు.

మహాత్మా గాంధి వంతు వచ్చినపుడు వైద్యుల గుంపు పకపకా నవ్వింది. బిగ్గరగా అరిచి పిలిచారు, “ఎవరయ్యా మహాత్మా గాంధి?”

“పిల్చుకొని వచ్చినాను స్వామి. ఇక్కడే ఉన్నాడు” అని కరిసిద్ధేగౌడ తన మనుమడిని తీసుకుని లోపలికి వెళ్ళాడు.

జవాను నింగమ్మనూ, పద్దినీ బయటే ఆపాడు.

కరిసిద్ధేగౌడ తీసుకొచ్చి తమ ముందు నిలిపిన వ్యక్తిని చూసి వైద్యమహాశయులందరూ ఒక విచిత్రమైన జబ్బును కనుకుకన్నప్పుడో లేదా కాన్సర్ వ్యాధికి ఔషధం కనుక్కున్నప్పుడో కలిగే విస్మయంతో చూశారు.

‘మహాత్మా గాంధి’ అని పిలవబడే వ్యక్తిని చూసి వారికి ఏడ్వాలో, నవ్వాలో లేదా నమ్మలేనటువంటి ఒక స్థితిలోనే ఉండిపోవాలో, ఏమీ తోచకుండా పరీక్షా గదికి తీసుకునిపోయి పరీక్షించి, కరిసిద్దేగౌడను పిలిచి, “చూడయ్యా, నీ మనుమడికి గుండె, మూత్రపిండాల జబ్బు. మందులన్నీ రాసిస్తాం. తీసుకో. వాటిని ఎలా వాడాలో చెప్తాం. చెప్పినట్టు ఇవ్వండి. కాస్త నయమవుతుంది” అన్నారు.

కరిసిద్ధేగౌడకు మెడపట్టి నీళ్ళల్లోకి అదిమినట్టు అనిపించింది.

“మీ దయ, ఎలాగైనా మా మనుమడిని కాపాడండి. ఇక్కడే కొన్ని రోజులు పెట్టుకుని కాపాడండి. అదే మీరు వీడికి చేసే సహాయం. ఈ నా తండ్రికి చేస్తున్న ఉపకారమని భావించి చేయండి. మీకు పుణ్యం వస్తుంది” అని అక్కడే గోడకు వేలాడదీసిన భారత భాగ్య విధాత గాంధిజిగారి ఫోటోకు చేతులు జోడించి, కన్నీరు పెడుతూ నిలబడ్డాడు. వైద్యులు మారు మట్లాడకుండా, చీటిలో రాసి, మగవాళ్ళ వార్డులో మహాత్మా గాంధిని చేర్చమని ఒక జవానును పిలిచి, తోడుగా పంపారు.

***

తరువాత జరిగిన విషయాలు ఎక్కువగా పెంచకుండా ముగించడం సమంజసమని నాకు అనిపిస్తుంది.

మహాత్మా గాంధిని ముప్పయిమందిని పెట్టవలసిన వార్డులో అరవైమంది ఉన్న చోట నేలమీద ఒక పక్క వేసి పడుకోబెట్టారు. ఎక్స్‌రే మొదలైన పరీక్షలతోపాటు ఔషదోపచారాలూ జరగసాగాయి. వైద్యులు రాసిచ్చిన ఔషధాలను తెచ్చివ్వటానికి మూడు రోజులకే కరిసిద్దేగౌడ తెచ్చిన చిన్నమూట కరిగిపోయింది.

నాలుగవ రోజు తన తల్లి నింగమ్మ, చెల్లెలి చెవుల కమ్మలు తీసి తన తాతకు ఎందుకు ఇస్తున్నారో ఊహించి, తన ప్రియమైన తాతయ్యను పిలిచి గాంధి అన్నాడు “తాతయ్యా, నన్ను ఊరికి తీసుకుని పోండి. నా నుదుటి రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది”

“అలా మాట్లాడకు నాయనా.. నేను ఇంకా బతికివున్నాను బిడ్డా.. నిన్ను కాపాడుకుంటాను”

తన మీద తాతయ్యకు ఉన్న ప్రేమ వల్ల గాంధికి లోపలినుంచి ఏడుపు తోసుకుని వచ్చింది. తన ప్రియమైన తాతయ్య తొడమీద తలపెట్టుకుని పడుకుని, ఆయన చూపులతో చూపులు కలిపి అన్నాడు-

‘తాతయ్యా, నేను చనిపోతే నన్ను మన పనస చెట్టు కింద పూడ్చాలి”.

కరిసిద్దేగౌడ వెక్కి వెక్కి ఏడ్చేశాడు. నింగమ్మ “అలాంటి పాడుమాటలు అనొద్దు, వదలింది అను” అని గాంధీని కసిరింది. పద్ది ‘అన్నా.. అన్నా’ అంటూ వెక్కవెక్కి ఏడ్చింది.

ఇదరతా జరుగుతున్నప్పుడు ఎం.డి. పాయిన పెద్ద డాక్టర్ గారు దయచేశారు. గాంధిని పరీక్షించి, ఒక చీటిలో మందులు రాసి, వీలైనంత తొందరగా తెప్పించాలని ఉత్తర్వులు ఇచ్చి, ఇతర రోగులను చూడసాగాడు. కూతురు, మనుమరాలి చెవికమ్మలు తీసుకుని, ఊరికి వచ్చి కరిసిద్దెగౌడ కుదువ పెట్టడానికి ప్రయత్నించాడు. ఎవరూ ఒప్పుకోలేదు. అప్పు తీసుకోవటానికి ప్రయత్నించాడు. ఎక్కడా ఒక్క పైసా పుట్టలేదు. అయితే పనస చెట్టు అమ్మేటట్టయితే కొనుక్కోవటానికి మనిషి దొరకటానికి, రెండువందల యాభై రూపాయలకు చెట్టును అమ్మటానికి రెండు రోజులు పట్టాయి. డబ్బు తీసుకుని కరిసిద్దేగౌడ బస్సెక్కి ఆస్పత్రి దగ్గరికి వచ్చినపుడు కూతురు నింగమ్మ, గుమ్మంలోనే పద్దితోపాటు నిలుచుని ఏడుస్తూ ఉంది. కరిసిద్ధేగౌడ “గాంధి ఎలా ఉన్నాడు?” అని అడగలేదు. బదులుగా “ఎప్పుడు ప్రాణం పోయింది?” అని అడిగాడు

“అర్ధరాత్రి సమయంలో. శవాల గదిలో పడుకోబెట్టారు” అని ఏడ్వటం ప్రారంభించిన కూతురును ఓదార్చుతూ కరిసిద్ధేగౌడ అన్నాడు: “మనుషులు చావకుండా రాళ్ళు చస్తాయా? ఊరుకోమ్మా” అని గాంధి శవాన్ని తీసుకోవటానికి అనుమతి కోసం పెద్ద డాక్టర్ గారి రూము వైపు అడుగులు వేశాడు.

కన్నడ మూలం: డా. బెసగరహళ్ళి రామణ్ణ

అనువాదం: రంగనాథ రామచంద్రరావు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here