గంగమ్మ దర్శనం!

5
12

[శ్రీ యన్. వి. శాంతి రెడ్డి గారు రచించిన ‘గంగమ్మ దర్శనం!’ అనే వేదాంత కథ అందిస్తున్నాము.]

[dropcap]“దే[/dropcap]వుడు ఆడా? మగా?” అడిగాడు బెల్లంకొండ మూర్తి.

“నీవు ‘డు’ పెడితే మగాడు. ‘త’ గానీ ‘మ్మ’ గానీ పెడితే ఆడ!” చెప్పారు సువర్ణ లక్ష్మి.

“అది ఎలా?” మళ్లీ అడిగాడు బెల్లంకొండ

“రాముడు, కృష్ణుడు అంటే మగాడు! కృష్ణమ్మ, రామమ్మ, దుర్గామాత అంటే ఆడ!” సువర్ణ లక్ష్మి

“వారికి నేను చెబుతాను! అందరూ వినండి! బొలీవియా అనే దేశంలో దేవుడు జీన్ ప్యాంటు, షర్ట్ వేసుకొని, పెద్ద టోపీ పెట్టుకొని, సిగరెట్ తాగుతూ, ప్రక్కన మందు బాటిల్, గ్లాసు, సోడా పెట్టుకొని వుంటాడు! ఎందుకంటే అక్కడ స్త్రీ పురుష భేదం లేకుండా అదే వేషధారణ, అవే అలవాట్లు కలిగి ఉంటారు కాబట్టి!” వివరించారు రెడ్డి గారు.

ప్రణవానంద సేవాశ్రమవాసులు పన్నెండు మంది డెహ్రాడూన్ ఎక్స్‌ప్రెస్‍లో హరిద్వార్, ఋషీకేశ్‌లు టూర్ వెళుతూ పిచ్చాపాటీ కబుర్లు చెప్పుకుంటున్నారు.

“దేవుడికీ నాకూ తేడా ఏమిటి?” నూలు నారాయణ ప్రశ్న

“దేవుడు విత్తనమైతే నువ్వు చెట్టు! అజ్ఞానం + నువ్వు జీవుడైతే, జ్ఞానం + నువ్వు దేవుడు!” రెడ్డి గారు.

“అజ్ఞానులంటే ఎవరూ, ఎలా ఉంటారు?” అప్పల రాజు

“తను దేహము మాత్రమే అనుకున్న వాడొకడు క్లబ్బు కెళ్ళి పేకాడు కుంటాడు. తను దేహమే అనుకున్న ఇంకొకడు గుడికి వెళ్లి పూజలు చేస్తాడు. వీరిద్దరూ అజ్ఞానులే!” చెప్పారు హోమియో డాక్టర్ కూడా అయిన రెడ్డి గారు.

“అజ్ఞానులు చేసే పనులు ఎలా వుంటాయి?” శ్రీధర్ బాబు.

“ఇండియా జట్టు క్రికెట్ నెగ్గినా బాణసంచా కాలుస్తారు. అలాగే దేవుడి కళ్యాణానికి కాలుస్తారు. అజ్ఞానంలో తేడా వుండదు” డాక్టర్ రెడ్డి గారి జవాబు.

“కలకూ ఇలకూ ఏమయినా పోలికలు వున్నాయా?” నూలు నారాయణ ప్రశ్న

“మీ ఊహల నుండి అంటే మనసు నుండి ఎలా అయితే స్వప్నం సృష్టించుకుంటారో అలాగే ఈ జగత్తును కూడా మీరే సృష్టించుకుంటారు. అదే నిత్య సృష్టి” సువర్ణ లక్ష్మి.

“స్వప్నంలో ఇచ్చిన అప్పు సంగతి..?” కాటమరెడ్డి ప్రశ్న.

“స్వప్నంలోనే వసూలు చేసుకోవాలి” డాక్టర్ రెడ్డి గారు.

“నిన్న – నేడు – రేపుల్లో ఏది సత్యం?” షావుకారు గొల్లపూడి నాగేశ్వర రావు గారి ప్రశ్న.

“అరువు ‘రేపు’ అని బోర్డ్ పెడతారు కదా? అందులో ‘రేపు’ నిజమా?” ఎఱ్ఱమిల్లి బంగార్రాజు షావుకారు గారి ఎదురు ప్రశ్న.

“కాదు! అరువు లేదనడానికి మనం చెప్పే సాకు మాత్రమే” గొల్లపూడి వారు.

“అలాగే నిన్న ఎప్పుడో పోయింది. రేపు ఎప్పటికీ రాదు! నేడు మాత్రమే నిజమని భావిస్తాము. నిన్నను (గతాన్ని) తల్చుకుంటే ఎవరికైనా బాధ కలుగుతుంది. రేపును తల్చుకుంటే ఎలా గడుస్తుందనే భయం కలుగుతుంది. బాధ కలిగినా భయం వేసినా నేడు మాత్రం సత్యం లా భాసిస్తుంది. నిజానికి ఈ కాల బుద్ధిని విడిచి పెట్టేస్తేనే ఎవడైనా తనను తాను తెలుసుకోగలడు” వివరించారు రెడ్డి గారు.

రాత్రి పది గంటలకు ట్రైన్ రామగుండంలో ఆగింది. అందరూ మాటలు ఆపేసి తెచ్చుకున్న అల్పాహారం కానిచ్చి ఎవరి బెర్త్ మీద వారు నిద్రకు ఉపక్రమించారు.

***

ట్రైన్ ఎక్కిన ముప్పై ఆరు గంటల తర్వాత తెల్లవారు ఝామున మూడు గంటలకు హరిద్వార్ చేరింది. హరిద్వార్‌లో ఆటోలు చాలా పెద్దవి వుంటాయి. ఋషీకేశ్‍ డ్రాపింగ్‌కు ఆరు వందలకు మాట్లాడారు. 12 మందిని ఎక్కించుకున్న ఆటో తెల్లవారు ఝామున నాలుగు గంటలకు ఋషికేశ్‌లో కోవిలూర్ వేదాంత మఠం ముందాగింది. ఆ మఠం నిర్వాహకురాలు శ్రీమతి విశాలాచ్చి అమ్మగారు ప్రేమగా రిసీవ్ చేసుకుని అందరి వివరాలు రిజిష్టర్‌లో రాసుకొని ఆధార్ జెరాక్స్‌లు తీసుకొని రూములు ఇచ్చారు. ఆ విధంగా ప్రణవానంద సేవాశ్రమవాసులు హిమగిరుల పాదాల చెంతకు చేరారు. ఈ మఠం గంగానది పడమర ఒడ్డున వున్నందున గంగమ్మ గలగలలు వీరి కుటీరాలకు వినిపిస్తున్నాయి.

***

ప్రతి రోజు తెల్లవారు ఝామున నాలుగు గంటలకు నిద్ర లేచి గంగా తీరంలో వాకింగ్ చేసుకొని, గంగలో పవిత్ర స్నానం చేసి, మఠం లోని పూజా కార్యక్రమాల్లో పాల్గొని అల్పాహారం కానిచ్చి తొమ్మిది గంటలకు మన చిత్తూరు జిల్లా వాసి పూజ్య గోదావరి మాతాజీచే నిర్వహింపబడుచున్న శివ సాయి మందిరానికి వెళ్లి విష్ణు సహస్ర నామ పారాయణలో పాల్గొన్న తర్వాత ఋషీకేశ్‌లో చూడదగిన ప్రదేశాలు రోజుకు ఒకటి సెలెక్ట్ చేసుకుని చూసి వచ్చేవారు. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక కొంత విశ్రాంతి తీసుకొని సాయంత్రం స్వామీ దయానంద సరస్వతి ఆశ్రమం లోని హైమవతి సమేత గంగాధరేశ్వరుని గుడిలోని పూజా కార్యక్రమాల్లోను, అక్కడి గంగా హారతి లోనూ పాల్గొని రాత్రి ఎనిమిది గంటల వరకూ గాంగా తీర విహారం చేసి మఠం చేరి అల్పాహారాలు చేసి కుటీరాలు చేరడం దినచర్యగా మారింది.

***

అలా ఒక నెల రోజులు రోజుకో ముఖ్య ప్రదేశం చూస్తుండే వారు. జీయర్ మఠం, చంద్ర బాగ్ పూల్, త్రివేణీ ఘాట్, ప్రక్కనే వున్న ఆంధ్ర నిర్వాణ ఆశ్రమము, పంజాబీ వారి నిర్మల్ ఆశ్రమం, వారిదే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఆ ప్రక్కనే వున్న భరత్ మందిర్, మన తిరుమల తిరుపతి వారి ఆంధ్రా ఆశ్రమం, కైలాస ఆశ్రమం, ఓంకారానంద ఆశ్రమం, వారివే విద్యా సంస్థలు, స్వామి శివానంద ఆశ్రమం, రాం ఝాలా లక్ష్మణ్ ఝాలా, గంగమ్మ తూర్పు తీరంలో ఉన్న స్వర్గాశ్రమం, గోరఖ్‌పూర్ వారి గీతాభవన్ పుస్తక విక్రయశాల, వస్త్రశాల, మిఠాయి బండార్, ఆయుర్వేద స్టోర్, ఆ తర్వాత పరమార్థానంద ఆశ్రమం – ఇందులో దేశ విదేశ యాత్రికుల వసతి కోసం వెయ్యి గదులున్న వసతి గృహ సముదాయం వుంది. అన్నీ ఫైవ్ స్టార్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. చిత్ర మేమిటంటే అక్కడ వరల్డ్ టాయిలెట్ కాలేజ్ వుంది!

“మన యాత్ర బ్రహ్మాండంగా సాగుతుంది!” సంబరంగా అన్నాడు నూలు నారాయణ.

“రేపటి ప్రోగ్రాం నిర్ణయించండి” కరుటూరి ప్రకాశరావు.

“ఇక్కడికి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న, చాలా పవిత్ర మైన, ధ్యానం చేసే సాధకులకు స్వర్గధామం అయిన వశిష్ఠ గుహకు రేపటి మన ప్రయాణం!” రెడ్డిగారు.

“ఆల్‍రైట్! అదుర్స్!” ఇంగ్లీషు అప్పారావు.

***

ఏప్రిల్ నెల చివర రోజులు. ఎండలు మండిపోతున్నాయి. మన ఆంధ్రాలో మే నెలను గుర్తు చేస్తున్నాయి. కారణం ఆ ప్రదేశం సూర్యుడికి దగ్గర కావడమే! తెల్లవారు ఝామునే వాకింగ్ చేసుకొని, గంగలో మూడు మునకలేసి మఠం చేరారందరు.

“ఈ రోజు మన ప్రయాణం మామూలు ప్రయాణం కాదు. ఎత్తైన కొండలు, లోతైన లోయల గుండా సాగుతుంది. దూరం ఎంతో కాదు. కానీ సమయం ఎక్కువ పడుతుంది. ఇదే మన చింతపల్లి అడవుల్లో అయితే అరగంట చాలు. ఇక్కడ రెండు గంటలు పట్టొచ్చు. వాతావరణం అనుకూలించకపోతే ఒక పూట పట్టొచ్చు. ఇంకో సమస్య ఏమిటంటే కొందరికి వికారం, వాంతులు, తల తిరగటం జరగవచ్చు. అసలే ఎండాకాలం! వడ దెబ్బ, స్పృహ తప్పడం జరగొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందరూ నేను ఇచ్చే హోమియో మందులు వాడాలి!” చాలా సీరియస్‌గా హెచ్చరించారు డాక్టర్ రెడ్డి గారు.

“టెంపరేచర్ ముప్పై ఐదే కదా వుంది. ఇప్పుడు మన ఆంధ్రాలో నలభై పై మాటే! ఇది మనకో లెక్కా?” అన్నాడు కాటమ రెడ్డి వ్యంగ్యంగా.

“ఈ ముప్పై ఐదు అక్కడి యాభైతో సమానం! ఈ ప్రదేశం సూర్యుడికి దగ్గరలో వుండటంతో సూర్య కిరణాలు సూటిగా తగులుతాయి. మనం గంగాతీరంలో ఉన్నాము కాబట్టి పగలు ఎలా వున్నా రాత్రి చల్లగా వుంటుంది. నేను చెప్పొచ్చేదేమిటంటే నేనిచ్చే మందు అశ్రద్ధ చేయకుండా వేసుకోండి. వేసుకున్న తర్వాత అరగంట వరకూ ఏమీ తినవద్దు. తాగవద్దు!” అన్నారు డాక్టర్ రెడ్డి గారు.

“ఇప్పుడు అర్థమైంది మన ట్రూపులో ఒక డాక్టరు ఉండటం మన అదృష్టం” కాటమ రెడ్డి.

***

ఎనిమిది గంటల లోపు అందరూ టిఫిన్లు చేసి రెఢీ అయిపోయారు. మిశ్రాజీ ఆటో ఎక్కి చంద్ర బాగ్ పూల్‌కి కుడి వైపు కిలోమీటర్ దూరంలో ఉన్న ఉత్తరాఖండ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ బస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఎంక్వయిరీలో అడిగితే బద్రీనాథ్ మార్గంలో వెళ్ళే శ్రీనగర్ బస్ ఎక్కమని చెప్పారు. ఇది అందరూ అనుకునే శ్రీనగర్ కాదు. ఉత్తరాఖండ్ లోని చిన్న పట్టణం. పన్నెండు మంది ఎక్కేసారు. వీరితో పాటుగా ఎక్కిన గుజరాత్, మహారాష్ట్ర నుంచి వచ్చిన యాత్రికులు ఎక్కడంతో బస్ నిండి బయలు దేరింది. ఋషీకేష్ ఆశ్రమాలను దాటుకుంటూ, గంగమ్మ కనుసన్నలలో, ఆ కొండల్లో లోయల్లో ఆ పయనం ఒక మధుర అనుభవం! భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలకు చెందిన యాత్రికులతో, భజనలు, సంకీర్తనలతో బస్ భద్రినాథ్ ఘాట్‌లో ప్రయాణిస్తూ రెండు చోట్ల ట్రాఫిక్ జామ్‍లను, కొన్ని చోట్ల కొండ చరియ విరిగి పడ్డ అడ్డంకులనూ అధిగమించి బయలుదేరిన గంటా యాభై నిముషాల్లో వశిష్ఠ గుహ స్టాప్ చేరింది. ఇంచుమించు అందరూ బస్ లోంచి దిగిపోయారు. బస్ ముందుకు సాగిపోయింది.

***

అక్కడ వున్న మంగళ్ పాండే టీ బంక్‌లో టీలు త్రాగి అందరూ మెట్ల దారి గుండా లోయ లోకి దిగారు. అక్కడ వశిష్ఠుడు తపస్సు చేసుకున్న గుహ లోకి ప్రవేశించ గానే మతిపోయింది! అద్భుతం! ఆ గుహ మానవ నిర్మితం కాదు! చీకటి గుయ్యారం! కొన్ని క్షణాలకు కళ్లు చీకటికి అలవాటు పడ్డాయి. ఆధ్యాత్మిక సాధకుల స్వర్గం ఇదే అనిపించింది. అక్కడ ఎంత సేపు అయినా కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు.

దిగువ లోయలో గంగానది చాలా స్వచ్చంగా, ప్రశాంతంగా ప్రవహిస్తుంది. పవిత్ర స్నానం చేయడానికి అనువుగా ఘాటులు అన్ని రక్షణ పరికరాలతోనూ ఏర్పాటు చేయబడి వున్నాయి. స్వామీ పురుషోత్తమానంద ఆశ్రమం వుందక్కడ. వారే ఈ గుహల బాధ్యతలు చూస్తున్నారు.

అందరూ ఒక గంట సేపు గుహ లోపల ధ్యానం చేసుకొని బయటికి వచ్చి, నది ప్రక్కనే వున్న అరుంధతి గుహలో కొన్ని నిమిషాలు గడిపి గంగా ఘాట్‍లో పవిత్ర స్నానాలు ఆచరించి, అక్కడ అమ్ముతున్న అందమైన ప్లాస్టిక్ కాన్లు కొనుక్కొని వాటిలో గంగా జలం నింపుకొని, బ్యాగుల్లో భద్రం చేసుకొని తిరుగు ప్రయాణానికి సిద్ధం అయ్యారు.

లోయ లోంచి రోడ్డులో కొచ్చి తాగాలనుకున్నవారు, మళ్ళీ మంగళ్ కొట్టులో టీ తాగారు. ప్రణవానంద సేవాశ్రమనికి చెందిన పన్నెండు మందితో పాటు కొందరు గుజరాతీయులు, కొందరు మరాఠీలు ఎక్కిన బస్ బయలు దేరింది. ఎండ దంచేస్తోంది. వడగాల్పు అదిరి పోతుంది. ఉదయం డాక్టర్ రెడ్డి గారు ఎందుకంత గట్టిగా చెప్పారో ఇప్పుడు అర్థమయ్యింది. ప్రయాణీకులంతా అపసోపాలు పడిపోతున్నారు. ఋషీకేష్ ఇంకా ఏడెనిమిది కిలోమీటర్లు వుంటుందనగా ఒక గుజరాతీ స్త్రీ వడదెబ్బకు కళ్లు తిరిగి స్పృహ తప్పి పడిపోయింది. బస్ ఆపేశారు. పైట చెంగులతో గాలి విసురుతున్నారు. ఏమీ ప్రయోజనం కనిపించలేదు. డా. రెడ్డి గారు హోమియో డైల్యూషన్ రెండు చుక్కలు ఆమె నోటిలో పోశారు. నాడి చూసి, తన వాచ్ వంక కొన్ని సెకండ్స్ చూశారు. వేసిన మందుకు స్పందన లేకపోవడంతో ఆశ వదిలేసుకున్నారు.

“దయ చేసి ఎవరైనా ఆమె ముఖం మీద నీళ్ళు జల్లండి. అది ఆఖరి ప్రయత్నం” అన్నారు డాక్టర్ రెడ్డి గారు. కొద్ది క్షణాలు వెయిట్ చేశారు. బస్ లోని చాలా మంది దగ్గర గంగాజలం వుంది. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అప్పుడు అర్థమైంది బంగార్రాజుకు, డా. రెడ్డి గారికీ, తాము చేసిన పొరపాటు! వశిష్ఠ గుహ దగ్గర గంగాజలం నింపడానికి ప్లాస్టిక్ కాన్ కొనడానికి సిద్ధ మైన బంగార్రాజుతో కాటమ రెడ్డి “బావా! మనం ఇంకా చాలా రోజులు ఋషీకేశ్‌లో వుంటాము. ఇప్పటి నుండీ మోత దండుగ. పైగా నీళ్ళు పాడై పోవచ్చు. ఆంధ్రా వెళ్ళే ముందు గంగాజలం నింపు కొందాం. ఈ జలంతో ఇక్కడ మనకేమి పని? అక్కడికి వెళ్లిన తర్వాత ఆశ్రమవాసులకు ఒక్కో స్పూను పంచడానికే గదా ఈ నీరు!” అంటూ ఆపేశాడు. ఆ తప్పుకు ఫలితం ఇంత త్వరగా, దారుణంగా వుంటుందని వూహించలేదు.

బస్‌లో చాలా మంది దగ్గర నీళ్లు వున్నాయి. ఇక్కడ ఒక మనిషి చావు బతుకులలో వున్నప్పటికీ ఎవ్వరూ ముందుకు రాలేదు. దేశంలోని మూలమూలలకూ తీసుకెళ్ళి వితరణ చేసే ఈ గంగాజలానికి ఇక్కడ ఒక ప్రాణాన్ని కాపాడేకంటే ప్రయోజనం వుంటుందా? మానవత్వమా నీకు జోహార్లు!

డా. రెడ్డి గారు మరో మారు ఆమె నాడి చూసారు. అందరి మొహాల్లోకి ఒకసారి చూసారు ఆశగా! ఆశ వదిలేసుకొన్నారు.

సరిగ్గా అప్పుడే వెనుక సీట్లోంచి ఒకామె చేతిలో గంగాజలం వున్న మరచెంబుతో ముందుకు వచ్చి చెంబును డాక్టరు చేతిలో పెట్టింది. ఒక్కసారి ఆనందంతో ఆమె వైపు చూసారు డా. రెడ్డి గారు. ఆమె మొహం వెయ్యి సూర్యుల కాంతితో వెలిగి పోతున్నట్టు అనిపించింది. చేనేత చీర కచ్చా పోసుకొని వుంది. మెడ లోని, ముక్కులకు వున్న అలంకారాలను బట్టి చూస్తే ఆమె రూపం మరాఠీ జానపద నృత్య కళాకారిణిలా అనిపించింది.

ఆ చెంబు లోని నీటిని స్పృహ తప్పిన స్త్రీ మోహం మీద చిలకరించారు డాక్టరు. నాడి పరీక్షించారు. ఆమెలో చిరు కదలిక! అందరూ ఆనందంగా వూపిరి పీల్చుకొన్నారు.

“అమ్మయ్య! ఇంకేమీ పర్లేదు. బయలు దేరండి!” డాక్టరు గారి మాటతో బస్ బయలుదేరింది!

గమ్యం చేరింది బస్. అందరికంటే ముందు దిగేసి, తర్వాత దిగే వారిని పరిశీలిస్తున్నాడు కాటమ రెడ్డి.

అందరికంటే ఆఖరున బస్ దిగిన బంగార్రాజు ఇంకా బస్సులోకి తొంగిచూస్తున్న కాటమ రెడ్డితో “ఇంకేమి చూస్తావు? పద. పద చాలా టైం అయ్యింది” అన్నారు.

“బావా! ఆమె దిగలేదు!” కాటమ రెడ్డి చాలా ఉద్విగ్నంగా.

“ఎవర్రా?” బంగార్రాజు చాలా చిరాగ్గా అడిగారు.

“ఆమే! మర చెంబుతో నీళ్లు ఇచ్చింది. ఆమె బస్ దిగలేదు! బస్ లోనూ లేదు!!”

“ఆ!!!” బంగార్రాజు, డాక్టరు గారు ఒకేసారి.

మా మాటలు విన్న ఆ ప్రక్కనే వున్న తెలుగు తెలిసిన సాధువు అందుకున్నాడు సంస్కృతంలో!

‘జయ జయ గంగే జయ జయ గంగే!

జయ జయ గంగే జయ జయ గంగే!!’

*స్వస్తి*

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here