గంగిరెద్దు – రేడియో నాటిక – పరిశీలన

0
11

[box type=’note’ fontsize=’16’] సంక్రాంతి సందర్భంగా శ్రీమతి రాజేశ్వరి దివాకర్ల గారు ఈ విశిష్ట వ్యాసాన్ని అందిస్తున్నారు. [/box]

[dropcap]అ[/dropcap]ల్లసాని పెద్దన, ప్రవరాఖ్యుడు పుట్టిన ఊరు గురించి చెబుతూ ‘అచట పుట్టిన చిగురు కొమ్మయిన చేవ’ అంటాడు. అలాగే మడికొండ గ్రామానికి ఒక చరిత్ర ఉంది. ఎంతోమంది సాహిత్యకారులకు పండితులకు అది పుట్టినిల్లుగా విరాజిల్లింది. వారిలో పల్లా దుర్గయ్య గారు మడికొండ పగడంగా విరాజిల్లారు. పల్లా దుర్గయ్య గారు స్వతహాగా కవి, రచయిత. ఆయన రాసిన ‘గంగిరెద్దు’, ‘పాలవెల్లి’ ప్రఖ్యాత రచనలు.

దుర్గయ్య గారి కావ్యం ‘గంగిరెద్దు’ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొంత కాలం పాఠ్యాంశంగా ఉంది. సంక్రాంతి కన్నా ముందు, ఆ తర్వాత కూడా తెలంగాణ పల్లెల్లో గంగిరెద్దులను ఆడించే వారి బతుకుదెరువు, వారి జీవితాన్ని అందులో కవి చాలా చక్కగా వర్ణించారు. తెలంగాణ సంస్కృతి సాహిత్యాలను వికాసవంతం చేయడంలో గంగిరెద్దు కావ్యం మహోన్నత పాత్ర వహించింది. తెలంగాణ ప్రాంతంలో సంక్రాంతి వైభవాన్ని ‘గంగిరెద్దు’ కావ్యం ఉదాత్తంగా తెలియజేస్తుంది. ఈ కావ్యంలోని పద్యాలలో మాండలిక పదాల ప్రయోగం ఒక విశేషం. ఈ కావ్యం ద్వారా దుర్గయ్య గారు తెలుగు సంస్కృతికి అద్దం పడుతూ భారతీయ సంస్కృతి పరిమళాలను విస్తరించారు.

ఈ కావ్యాన్ని ఆకాశవాణి హైదరాబాద్‌ కేంద్రం వారు 2015వ సంవత్సరం డిసెంబరు 30వ తేదీ తేది రాత్రి పదిన్నరకు రేడియో నాటికగా ప్రసారం చేశారు. దీని నిడివి 30 నిమిషాలు. ఈ నాటకీకరణను ఆకెళ్ళ శివ ప్రసాద్‌ రసవత్తరంగా కావించారు. నాటిక ప్రక్రియ కావ్యానికి మరింత గౌరవాన్ని తీసుకువచ్చింది. ఈ ప్రసారానికి 2016లో ‘రేడియో ప్లే’ విభాగంలో అవార్డు లభించింది. అలాగే ఈ కావ్యంలో అనేకమార్లు ఎద్దు అని సంబోధించకుండా బసవన్న అనడం కవిగారి పై పాల్కురికి సోమనాథుని ప్రభావం స్పష్టమవుతుంది.

పల్లా దుర్గయ్య గారి శత జయంతి (25 -5 -2015 వ సంవత్సర) ఉత్సవాల సందర్భంగా వారి కావ్యాలు గంగిరెద్దు, పాలవెల్లి, పారిజాతాపహరణం, లను ‘పల్లా దుర్గయ్య కావ్యాలు’ పేరుతో ప్రచురించారు. గంగిరెద్దు కావ్యం ఆ నాటికి మూడు ప్రచురణలను పొందిన ఖ్యాతిని వహించింది.

ప్రస్తుత వ్యాసం, ఆచార్యులు, గురువర్యులు పల్లా దుర్గయ్య గారు రచించిన ‘గంగిరెద్దు’ కావ్యం రేడియో నాటిక ప్రసారానికి కావించిన పరిశీలన.

పూర్వ ఆంధ్రకవులు పిల్లలమర్రి పినవీరనాదులు కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలాది నాటకాలను శ్రవ్యకావ్య రూపాలుగా రచించారు. నాటకం శ్రవ్య కావ్యంగా అనేక రూపభేదాలను పొందింది. కావ్యం రేడియో నాటికగా ప్రత్యేకమైన నిడివిలో రూపొందడం మరొక నిరూపక ప్రక్రియ. శబ్ద ప్రధానమైన రేడియో నాటకంలో శ్రవ్యం కళ్ళకు కట్టాలి. శబ్ద చిత్రాన్ని దర్శించడం శ్రోతను ప్రతి సంభాషణకు అభ్యాసపూర్ణుని కావిస్తుంది. రేడియో నాటకంలో ఒక పాత్రధారి సంభాషణ చెప్తుంటే అతని హావ భావాలు ఎలా ఉన్నాయో, అతని వయస్సు ఏమాత్రమో మొదలైన అంశాలన్నీ శ్రోత మనో నేత్రంతో చూడాలి. రేడియో నాటకం వినిపిస్తూ కనిపించాలి. మూల కావ్య సంగ్రహాన్ని సమయ నిబంధనతో సంఘటనలుగా ప్రస్తుతీకరించడం రేడియో నాటక ప్రధాన లక్ష్యం. రేడియో నాటకం టెలిగ్రాం లాంటిది అంటారు.

గంగిరెద్దు కావ్యం, ఎద్దును నాయకునిగా చేసుకుని రచించిన కావ్యం. ఇది కరుణ రస ప్రధానమైన కావ్యం. పల్లా దుర్గయ్య గారి కావ్యం సరళమైన పద్య రచనతో, పద ప్రయోగ వైశిష్ట్యంతో ప్రత్యేతను చాటుకుంది. ఇతివృత్త ప్రాధాన్యంగా సాగిన ఈ కావ్యంలో జానపద జీవనం ప్రతిబింబించింది. ఇతివృత్త కల్పనలో కవి గారి ఊహ పల్లె పట్టుల రైతు జీవితాన్ని సమీక్షించింది. జీవ జంతువులపై మానవుడు చూప వలసిన దయకు ప్రాతినిధ్యం వహించింది.

రేడియో నాటిక ప్రసార గుణాన్ని వివరించడానికి ముందుగా ఆ నాటికలోని ప్రధాన అంశాలను తెలుసుకుందాం.

అదొక పల్లె. అక్కడ నివసిస్తున్నారు కాపు దంపతులు రామయ్య, లక్ష్మి. గోవు వారికి జీవనాధారం. గోవును మహాలక్ష్మిగా తలచి ఎంతో అనురాగంతో చూసుకుంటున్నారు ఆ పేద దంపతులు. వారు కరణానికి అప్పు చెల్లించాలి. కాపు భార్య లక్ష్మి ఈతకు సిద్ధంగా ఉన్న ఆవు ముఖంలో కళను చూసి దానికి పెయ్యి పుడుతుందని నిర్థారించింది. ఆ మాట విని కాపు తథాస్తు దేవతలుంటారు పెయ్యి పుడుతుందని అలా పదిసార్లు అనకు అని చనువుగా వారించాడు. కాపు ఇల్లాలు విస్తు పోయింది. ఈ లోకరీతి అంతే. “మనుషుల్లో ఆడ అంటే ఆమడ దూరంగా అయిపోయారు.. పెంచడానికి అమ్మ కావాలంటే ఆడ పుట్టుక కావాలి, అని ఆడపుట్టుక గౌరవాన్ని నోటినిండుగా తెలుపుతుంది”. కాపు కూడా ఆ మాట తెలియని వాడేమీ కాడు. కాని ఊరి కరణానికి అతడు అప్పు తీర్చాలి. ఈసారి ఆవుకు దూడ పుడితే దానిని కరణానికి ఇచ్చి అప్పు చెల్లించుకోవాలి. అది కరణం ఒప్పందం. అందుకనే కాపు అలా కోరుకున్నాడు. అప్పుడో ఇంకాసేపటికో అన్నట్టు ఈతకు సిద్ధంగా వున్న ఆవు కళ్ళళ్లో బెరుకును స్త్రీగా అర్థం చేసుకుంది కాపు ఇల్లాలు లక్ష్మి. గోవును ఎంతో మమకారంతో లాలించింది. కాపు ఆయుర్వేదం ఆచారిగారి దగ్గరకెళ్ళి ఆకులను తీసుకొచ్చి మెల్లగా గోము చేస్తూ తినిపించాడు. ఇది ఆరంభ రూపక సన్నివేశం.

మర్నాడు చీకటితో మెళకువ వచ్చిందే తడవుగా కాపుకు గోవును గురించిన ఆత్రుత. రాత్రంతా అరుస్తూనే వున్న గోవు అరుపు ఆగిపోయింది. ఎలావుందో నని దగ్గరకు వెళ్ళాడు భార్యను పిలుస్తూ. ఆవు దగ్గర బుజ్జి దూడను చూసి మురిసి పోయాడు కాపు రామయ్య.

సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అవుతూ వచ్చింది ఇల్లాలు. పెయ్య అయినా కోడె అయినా ఏదైనా ఆనందమే అంది ఇల్లాలు. “బుజ్జిది సిట్టి తల్లిలా సిట్టి పువ్వులా” ఉందని మురిసి పోయారు దంపతులు. కాపు కోరుకున్నట్టు కోడె దూడ పుట్టింది. ఇదిగో ఇటు చూడు అంటూ కాపు భార్యకు చూపుతున్నట్టు ఆ దూడకు మూపు మీద మరో కాలుందనీ, తోకలు రెండున్నాయనీ తెలుపుతాడు. కాపు దుఖం వర్ణనాతీతం. అటు వేపుగా వచ్చిన పంతులుగారికి అవ లక్షణాలతో పుట్టిన కోడె గురించి చెప్పి బాధపడ్డారు. పంతులు గారు ఈశ్వరేచ్ఛను గురించి చెప్పి ఓదార్చుతూ ముందు తల్లి ఆవు ఎలా ఉందో చూడమంటాడు. చిట్టి దూడను వదిలి తల్లి ఆవు చని పోయింది. దంపతులు వగచారు. కాపు భార్య భర్తకు ధైర్యం చెప్పింది. కష్టపడడం తమ సొత్తు, తిరగలి, కొడవలి, రోకలితో తాను, నాగలి, గొడ్డలితో కాపు నాలుగు చేతులతో కష్టపడుతూ బుజ్జి దూడను పెంచుకుందాం అని చెప్పింది. కాని కథ మారింది.

కాలం మాయ చేసింది. దూడ కనిపించటం లేదు. భార్యా భర్తలిద్దరూ పొలంగట్టు వైపుకొకరూ చెరువు గట్టు దగ్గరకొకరూ వెతకడానికి వెళ్ళారు. చుట్టు పక్కల వాళ్ళని వాకబు చేసారు. ఊరంతా వెతికినా కనబడలేదు.

గంగిరెద్దుల నాడించే శివయ్య కొత్త దూడను తెచ్చానని గుడి అయ్యవారికి చెప్పాడు. ఆయన దూడకు మూపురం మీద మొలిచిన కాలును చూసి, ఇటువంటి దూడని ‘దేవుడావు’ అని, ‘కాశీ ఆవు’ అని కూడా అంటారని ఆ ఆవు విశేషమైనదని తెలిపాడు. అలాంటి ఆవుతో పని చేయించరని కూడా చెప్పాడు. అందుకే ఆ దూడను చక్కగా గంగిరెద్దులా ముస్తాబు చేసి ఊరూరా తిప్పి పొట్ట పోసుకుంటానని అన్నాడు శివయ్య. మంచి ముహూర్తం చెపితే ఈ కొత్త కోడెకు ముకు తాడు వేయాలని అన్నాడు. అయ్యవారు ఆరోజు మంచి రోజని చెప్పగా శివయ్య సంతోషించి దూడతో ఆలయ ప్రదక్షి కావించాడు.

శివయ్య కోడెను బసవ అని పిలుస్తూ శుశ్రూషను మొదలు పెట్టాడు. అక్కడకు వచ్చిన బాలుడు దూడ విశేషమైన ఆకారాన్ని చూసి ముచ్చట పడి అడిగినపుడు, శివయ్య “దేవుడావులు అంతే బాబూ” అని కోడెను దైవంగా పేర్కొంటాడు. బసవయ్యకు స్నానం చేయించాడు. గుడికి తీసుకుని వెళ్ళి ఈనందితో పశుపతికి నందీశ్వరునికి దండం పెట్టించుకుని వచ్చాడు. ఇక శిక్షణను ఆరంభించాడు.

ఇక సంక్రాంతి వస్తోంది. గంగిరెద్దును ఊరూరా తిప్పుకుని రావాలి. నాకూ బువ్వ కావాలి కదా బాబూ అని బాలునికి చెప్పినట్టుగా తన బతుకు తెరువును గురించి స్పష్టం చేసాడు శివయ్య.

శివయ్య దూడకు శిక్షణ నిచ్చాడు. అలంకరించాడు. చప్పట్లు కొడుతుంటే దూడ చెప్పినట్టుగా అనుసరించింది.

చిట్టి దూడ ఇప్పుడు గంగిరెద్దుగా ఆటకు ముస్తాబయింది.

కాపు దంపతులు కాలం కలసి రాలేదనుకున్నారు. ఉన్న ఎకరం పొలం అమ్ముకున్నారు. పాడి ఆవు చనిపోయింది. కోడె దూడ తప్పి పోయింది. షావుకారు అప్పు మాత్రం పెరిగి పోయింది. ఊరు వెళ్ళిన షావుకారు తిరిగి వచ్చేలోపున బాకీ తీర్చే ప్రయత్నం చేయాలి. కాపు దంపతులు ఆవును, కోడె మసలిన ప్రదేశాలను తలచుకుంటూ, విడువలేక విడువలేక ఊరు విడిచి కూలిని చేసుకునేందుకు మరో ఊరు వెళ్ళారు.

సంక్రాంతి పండుగ వచ్చింది. ఆ ఊరిలో బుడబుక్కలు, హరిదాసరి, కోడిపందాలు సందడి ఆరంభం అయింది. సన్నాయి ఊదుతూ శివయ్య గంగిరెద్దు ఆటకు వచ్చాడు. బసవా నీ ఆట చూపించూ అంటూ నర్శిగాడిని దరువెయ్య మన్నాడు. అందరినీ గంగిరెద్దు ఆట ఆకర్షించింది. గజ్జెలతో గంగిరెద్దు నాట్యం చేస్తుంటే ఆ గంగిరెద్దు ఎంత బాగుందో అని మురిసిన పిల్లలకు అమ్మ ఆ గంగిరెద్దును గూర్చి “భారత దేశ చిత్ర పటంలా పైన ఎత్తుగా మూపురం, మధ్యలో విశాలంగా ఎంత అందంగా ఉందో చూడూ” అని వర్ణించింది. గంగిరెద్దులు, సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకలని ఊరివాళ్ళు గోవుల, ఎద్దుల గొప్పతనాన్ని చెప్పుకుంటూ భక్తి ప్రపత్తులను ప్రకటించారు. అయ్యగారికి దండం పెట్టు అమ్మగారికి సలాము జెయ్యి అంటూ ఆటను రక్తి కట్టించాడు శివయ్య. గంగిరెద్దు షాష్టాంగ పడుతున్నట్టు మోర వంచి అందరికీ దండం పెట్టింది. ఎద్దు ముందు కాళ్ళు పైకెత్తించి తన గుండెల మీద పెట్టి ఆడిస్తానంటూ బసవన్నను లేపి ఆడిస్తుంటే జనాలు బ్రహ్మాండం అంటూ చప్పట్లుకొట్టారు. బసవన్నను అందరూ సంతోషంగా ఉంచాలని జనాలను కోరాడు శివయ్య. కొందరు పట్టు బట్టలిచ్చారు, పసుపు కుంకుమలను రాసారు. శాలువా లిచ్చారు. బియ్యం దానమిచ్చారు. బసవన్నకు దండంపెట్టుకుంటే కోరికలన్నీతీరతాయంటాడు శివయ్య. ఎద్దుకు మూపురం మీదున్న కాలునూ రెండు తోకలనూ చూసి ఇలాంటివి దేవుడావులని జనులు అనుకున్నారు.

లక్ష్మి ఆత్రంగా కాపుతో ఆ ఊరి కొచ్చిన గంగిరెద్దు విశేషాలను చెప్పింది. ఊళ్ళో అందరూ దాని గురించి విచిత్రంగా చెప్తున్నారనీ, అది మన కోడేనని అనుమానంగా ఉందంటుంది. వెళ్ళి చూసొద్దామని ఇద్దరూ బయలు దేరారు. తెల్లారింది, శివయ్య సంతోషంగా బసవన్నను కీర్తిస్తూ ‘ఓంకారా బసవన్నా’ అంటూ చుట్టు పక్కల తిరుగుతున్నాడు. ఆ గంగిరెద్దు తమదో కాదో గంగిరెద్దు ఆయన్నే అడిగి తెలుసుకుందామని అనుకున్నారు రామయ్య, లక్ష్మి. ఈ గంగిరెద్దు నీదేనా అని నిలదీసి అడిగారు. సాముల దగ్గరినుంచి నేరుగా తన దగ్గరకు వచ్చిందన్నాడు శివయ్య. లక్ష్మి ఆతురత పట్టలేక “ఏ సాముల దగ్గరనుంచి? ఎప్పుడొచ్చింది” అంటూ గట్టిగా అడుగింది. తనది పక్కూరే నని, సరిగ్గా రెండేళ్ళ కిందట కార్తిక పున్నమికి ముందు రోజు ఏడ్నించి వచ్చిందో వచ్చిందంటూ తన పేరు శివయ్య అని చెప్పాడు. అదేమిటి ఈ ఎద్దు ఆ దంపతులను చూడగానే తన చేతిని వదిలించుకొని దంపతుల దగ్గరకు వెళ్ళిందని ఆశ్చర్యపోయాడు. తమ బంగారు తల్లి పెద్దదైపోయిందని కాపు దంపతులు తెగ ముచ్చట పడ్డారు. సందేహం లేదు ఎద్దు తమదేనని నిర్థారణకు వచ్చారు. లక్ష్మి భావుకురాలయింది. యజమానులను చూసి అంబారవం చేసింది గోవు. “గంగి గోవు అంటారు అలాంటిది మమ్మల్ని ఎందుకు ఒదిలి పెట్టి వెళ్ళావు” అమాయకంగా అడుగాడు రామయ్య. గోవు తన మాట వినకుండా దంపతుల దగ్గరకు వెళ్ళడం, వాళ్ళకు కలిగిన ఆనందం చూసి శివయ్య వాళ్ళెవరో అడిగి తెలుసుకున్నాడు. తమ పరిచయం చేసుకుని, వాళ్ళిద్దరూ ఈ గోవు మాదేనయ్యా అంటూ ముక్త కంఠంతో చెప్పారు. తప్పి పోయిన పిల్లాడు తల్లిదండ్రులను చూసి కంట నీరు పెడుతున్నట్టుగా ఉన్న గోవును చూసి శివయ్య దిగ్భ్రమ చెందాడు. ఆ కలయికను చూసిన శివయ్య తాను ఒంటరి వాడినని ఆ గోవు తన దగ్గరి కంటే కాపు దంపతుల దగ్గర ఉంటే వారికి సాయపడుతుందని అన్నాడు. లక్ష్మి ఆ గోవు తమ ఇంట పుట్టినా దానిని అందంగా అలంకరించి, గొప్పగా చూసుకున్న శివయ్య మాటను ఒప్పుకోదు. శివయ్య దానిని సక్కంగా సాకాడని ప్రశంసించింది.

ఆ గోవు శివయ్య దగ్గర ఉండడమే న్యాయం అన్నాడు రామయ్య. అది తమదగ్గర ఉంటే తమలాగే బక్కచిక్కి ఉంటుందనీ, కాడి మొయ్యలేక యాతన పడుతుందనీ పలికాడు. కష్టాలు తమకు అలవాటే అవి ఎలాగూ తీరుతాయి, అది శివయ్య దగ్గర ఉంటే దేవుళ్ళా ఉంటుందని మనసులోని మాట చెప్పాడు. ఎద్దుమీదున్న తమ ప్రేమను త్యాగం చేసి దాని సుఖం కోసం ఆలోచించారు ఇద్దరూ. లక్ష్మి దుఖంతో గోవును విడువ లేక విడువలేక మాటాడుతూ, గోవు దేవుడు, దేవుడు లాంటి శివయ్య దగ్గర ఉండడమే న్యాయం అని చెప్పింది. .

అంతలో అటు వేపుగా వచ్చి, ఆ దంపతులను చూసిన కరణం తన బాకీ ఎగవేతకు తప్పించుకు తిరుగుతున్నారనీ, ఊరు మారితే పట్టుకోలేనా అని హుంకరించాడు. అక్కడ పని దొరక్క ఈ ఊరు కొచ్చామని చెప్ప బోతున్న కాపును నోరుముయ్య మన్నాడు. లక్ష్మి పౌరుషంగా తమకలాంటి ఉద్దేశం లేదని గట్టిగా చెప్పింది. రామయ్య కూలీ చేసి డబ్బు వెనకేయడానికి ఈ ఊరు వచ్చామనీ, బాకీ తీర్చాలనే తమ ప్రయత్నం అని వినయంగా చెప్పబోతుంటే, డ్రామాలాడుతున్నారా అంటూ అహంకరించిన కరణం గద్దించాడు. మిమ్మల్నిలా కాదురా! అంటూ దండించ బోయాడు. శివయ్య ఆగండి బాబూ ఆగండి అనేసరికి నువ్వెవడివిరా మధ్యలో నువ్వుగాని వీళ్ళ బాకీ తీరుస్తావా అంటూ అతని పట్ల నిర్లక్ష్యం చూపాడు కరణం. కాని శివయ్య ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఆ తీరుస్తాను, చెప్పండి వీళ్ళు మీకు ఎంత ఇవ్వాలి అంటూ ఉంటే రామయ్య శివయ్యను వారిస్తూ, నీ దారిని నువ్వెళ్ళు అన్నాడు. లక్ష్మి తన దగ్గరే గోముగా నుంచున్న బసవన్నతో నువ్వు కూడా వెళ్ళు అంటూ దుఃఖించింది. ఇన్నాళ్ళూ కోడె దూడ తనకు ఆదరువయింది, ఆ కోడె కాపు దంపతులది, దాని ద్వారా సంపాదించుకున్న డబ్బు కాబట్టి వాళ్ళ అప్పు తను తీర్చాలి అన్నాడు శివయ్య. కరణం “నీ అప్పువాడు తీరుస్తానంటుంటే సణుగుడు నీ కెందురా” అంటూ రామయ్యను వారించి, తన లాభం చూసుకున్నాడు. తీయరా తీయ్ అంటూ శివయ్య ను గద్దించాడు. మొత్తం మూడు వేలూ కట్టు అంటూ గద్దించిన కరణానికి డబ్బు ఇచ్చేసి ఇంక “ఎల్లు జలగ బతుకు నువ్వూను” అంటూ శివయ్య కరణాన్ని ఈసడించాడు.

రామయ్య శివయ్య చూపిన ఆదరానికి ముగ్ధుడయ్యాడు. గారూ అని గౌరవం చూపిన రామయ్య తో శివయ్య తను వాళ్ళకు తమ్ముడి లాంటి వాడినని, శివా అని పిలువ మన్నాడు. మా కష్టాలను తీర్చడానికొచ్చిన సామివి నువ్వు అంది లక్ష్మి ఉద్వేగంతో. కాలం మారినా ధర్మం మారదుకదా, మాటలు రాని పశువులు మనకెంతో సాయం చేస్తున్నాయి, పూజలు కూడా అందుకుంటున్నాయి. మనుషులుగా పుట్టిన మనం కనీసం మానవ ధర్మం పాటించలేమా? భగవంతుడు పంపిన వాడిని కాను, “గంగిరెద్దు శివయ్యను” గంగరెద్దును తీసుకోండి నేను ఊరు వెళ్ళిపోతాను అని సిద్ధపడిన శివయ్య మాటలకు అందరం కోడెదూడతో కలిసి ఉందాం అని శివయ్యను ఒప్పించారు ఆ దంపతులు. సన్నాయి స్వరంలో పరిసర ఆనందం ప్రకటమయింది.

రచనా సంవిధానం: రేడియోకి అనుకూలంగా నాటక రచన కావించడం ఒక కళ. కథా సంవిధానంలో రచయిత కృతకృత్యులయ్యారు. మూలంలో 450 పద్యాలతో, విస్తారమైన వర్ణనలతో ఒప్పారిన కావ్యానికి అనివార్యమైన మార్పు చేర్పులతో, మూల కథా గౌరవానికి భంగం వాటిల్లనీయక శ్రద్ధ వహించారు. అందు వల్లనే గంగిరెద్దు ప్రసార వాణి మన్ననలను పొందింది.

మూల కథలోని ఆయువు పట్లకు రచయిత ప్రాణ ప్రతిష్ఠను కావించారు. సన్నివేశ వింగడనలో ప్రతిభను చూపారు. సంభాషణలలో పాత్ర స్వభావాలను నిరూపించారు. పాత్రోచిత భాషా యాసల వైవిధ్యాన్ని స్పష్టం చేసారు. రేడియో నాటకానికున్న పరిధులను జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని చిన్ని చిన్ని వాక్యాలలో మాటలను రక్తి కట్టించారు. సమయ వ్యవధిని మరువకుండా మూలకావ్యాన్ని సంగ్రహించారు. కావ్యంలోని స్థల, కాల, వస్త్వైక్యతలను చక్కగా సాధించారు

నిర్మాణ సారథ్యం: రేడియో నాటిక (రూపక) రచనా ప్రాధాన్యం గుర్తించిన తరువాత ప్రయోగ సారథ్యం అత్యంత ప్రాముఖ్యం వహిస్తుంది. రేడియో రూపకం ఆరంభంలో రక్తి కట్టించాలి. లేకుంటే శ్రోత వెంటనే మరో స్టేషనుకు మారిపోతాడు.

గంగిరెద్దు నాటిక ఎత్తుగడలోనే ఊపందుకుంది. ఆరంభంలోనే ఈతకు దగ్గర పడిన గోమాత అంబారవం ఆర్తిగా వినిపించి, పెయ్య పుడుతుందా, కోడె జనిస్తుందా అన్న ఆతురత రేడియో ముందు నుంచి కదలనీయదు. కోడె వికారాకారం, మును ముందు కథకు ఉత్కంఠను కలిగిస్తుంది.

స్వల్ప అవధిలో రూపకాన్ని బిగువుగా సాగించగల ప్రయోగ నైపుణ్యం అలరిస్తుంది. నటీ నటుల ఎన్నిక సమర్థవంతంగా ఉంది. ఎక్కడికక్కడ సన్నివేశాల ప్రాధాన్యం సంఘటనలను ప్రత్యక్షం చేస్తూ, ఇది శ్రవ్యమేనా అన్న సందేహం కలుగుతుంది.

కథా సందర్భ నిరూపణలో విరామ సూచన నిశితంగా సాగింది. నేపథ్య సంగీతం, ధ్వని సంయోజన ఎప్పటి కప్పుడు కథా వాతావరణాన్ని నిరూపించింది

పాత్రధారులు: ఈ రూపకానికి పురస్కార ఔన్నత్యం కలిగించిన అంశాలలో పాత్రధారుల వాచికాభినయం అగ్రస్థానాన్ని వహించింది.

ఈ రూపకంలో ప్రధానం కోడె దూడ, గంగిరెద్దుగా పెరిగిన వృత్తాంతం. రూపక ఆసాతం ఆ మూగ జీవి ఉనికి మనకు దాని గజ్జెల శబ్దంతో, దాని చేష్టల వ్యాఖ్యానంతో, అనుబంధ చర్యల, శ్రవణ చక్షు దర్శనం, గంగిరెద్దు పాత్ర ప్రాధాన్యాన్ని నిరూపణ కావించింది.

ఇక మానవ పాత్రలలో ముఖ్యులు కాపు దంపతులు, రామయ్య. లక్ష్మి. ఆ పాత్రధారుల వాచికాభినయానికి ముగ్ధులం కాకుండా ఉండలేం. ప్రతి సంభాషణలో భావం అర్థవంతమై శోభించింది. లక్ష్మి పాత్రధారి సంభాషణలలో, పల్లె పట్టునున్న పేద ఇల్లాలి అమాయికత్వం, ఆత్మ విశ్వాసం, గోమాత పట్ల అనురాగం, పుట్టిన దూడ అంటే గల మమకారం ద్యోతక మయ్యాయి. భార్యగా భర్తకు అండగా నిలువగలిగే బాధ్యతా వర్తన ఆమె పట్ల గౌరవాన్ని కలిగిస్తుంది. కాపు రామయ్య పాత్ర పరిస్థితులకు లోబడి జీవించే పేద రైతు లోని నిస్సహాయతను ప్రతి మాటలో వ్యక్తపరుస్తుంది. ఆవు చనిపోయినప్పుడు దూడ తప్పి పోయినప్పుడు వారిరువురి హావ భావ ప్రకటన అవిరళం. ఇరువురి పాత్రలు పతాక సన్నివేశంలో చూపిన ఉద్వేగం, గోవు పట్ల ప్రేమ,దుఖం, దైన్యం, రస భరితమౌతాయి. ముఖ్యగా కరుణరసం ఉప్పతిలే సన్నివేశంలో లక్ష్మి పాత్ర వాచికాభినయం అపురూపం అనిపించక మానదు. ఒకపక్క తప్పి పోయిన దూడను చూసిన ఆనందం. అది తమదేనని నిర్థారణకావించుకునేటప్పుడు నిఖార్సు తనం, షావు కారు వేసిన అపనిందకు కలిగిన రోషం, శివయ్య చూపిన ఔదార్యానికి, తట్టుకోలేక సంభ్రమ పడుతూనే, గంగిరెద్దు సుఖంగా ఉండాలని కోరుకోడం వంటి సందర్భాలను ఆమె గాత్రం పరిస్ఫుటంగా వ్యక్తీకరించింది. ప్రధాన పాత్రల పలుకులలో స్వభావ నిరూపణ ప్రతి ఫలించింది. శివయ్య గొంతులో మార్దవం, ఆత్మీయతలు పలుకరించాయి. కరణం పాత్రలో దర్పం, ఓరిమి కొరవడిన అహంకారం ఆతని మాటల వల్ల ఇతర పాత్రలకు కలిగిన సంకటం తెలిసి వచ్చింది. అతిథి పాత్రగా కరణం పాత్ర పతాక సన్నివేశాన్ని ఆరంభంతో ముడివేసి రక్తి కట్టించింది. సందర్భవశంగా ప్రవేశించిన పంతులు గారు, అయ్యవారు, చినబాబు (బాలుడు), పాత్రలు కథా గమనానికి సహకరించాయి. గంగిరెద్దు కళా ప్రదర్శనను చూచిన ఊరిలోని జనం మాటలు సహజంగా కుదిరాయి.

సన్నివేశ కల్పన: గంగిరెద్దు రూపకం సంఘటనా ప్రాధాన్యమున్న కథకు సమర్థవంతమైన సన్నివేశ కల్పనలను కావించింది. ప్రథమ సన్నివేశంలోని బీజావాపన నాటకాంత పరిస్ఫూర్తికి పట్టుగొమ్మగా విస్తరించింది. పల్లె దంపతులకు గల జీవ కారుణ్యమూ, అన్యోన్యత ఆరంభ సన్ని వేశానికి సంప్రదాయ గౌరవాన్ని సంపాదించింది.

ఉదయమే ఆవు దగ్గర చేరిన కాపు రామయ్యకు ఆవుపై గల శ్రద్ధ వినిపిస్తూ కనిపిస్తుంది. పేద కుటుంబం లోని ఇల్లాలి ఆత్మౌన్నత్యం సునిశితంగా ప్రకటమయింది. ఈతకొచ్చిన ఆవుపట్ల కాపు ఇల్లాలు చూపించే ముగ్ధ ప్రేమ మనసును కట్టి పడేస్తుంది. గోవుకు కానుపు అయి తల్లీ పిల్లా క్షేమంగా ఉండాలని ఆమె కోరుకుంటుంది. దూడ తప్పి పోయిన సన్నివేశం, దంపతులతో బాటు శ్రోతలకు సైతం వెతికే ఆత్రుత కలుగ జేస్తుంది. శివయ్యకు కోడె దొరకిన సన్నివేశం తదితర పాత్రల సహకారంతో వ్యక్తమయింది. అలాగే దూడకు శిక్షణ నిచ్చిన సన్నివేశం, ఊరిలో సంక్రాంతి కోలాహలం, గంగిరెద్దు ఆట ఇత్యాది సన్నివేశాలు శబ్ద సౌజన్యంతో నిరూపితం అయ్యాయి. పతాక సన్నివేశం అమోఘంగా రక్తి కట్టింది.

నేపథ్యం, ధ్వని సంయోజన: ఆరంభంలో మురళీ నాదం ఆవు అంబారవం, గిట్టల గజ్జెల చప్పుడు కోడి కూత పక్షుల కిల కిలలు, పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించాయి. విరామ సంగీతం తదుపరి సన్నివేశాన్ని సూచించింది.

కథార్థాన్ని సూచిస్తూ వచ్చే పదం “కాలం మాయనే సేసింది సిలకా తోడైన ఆవేమొ దూరమై పోయింది, దూడగా మిగిలింది భారమై పోయింది” అంటూ కాపు దంపతుల గృహ పరిస్థికి అనుకూలంగా వినవచ్చింది. శివయ్యకు కోడె దొరికినప్పుడు ఆలయ ప్రదేశానికి వచ్చినప్పుడు గుడి గంటలు, దేవదేవుని స్తుతి ఆ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. శివయ్యకు దూడ దొరకగానే తప్పిపోయిన దూడ తలరాత మారిందంటూ వినవచ్చిన పదం అర్థవంతంగా ధ్వనించింది. దూడను అలంకరించేటప్పుడు అందుకు తగ్గ ధ్వనులు, దూడకిచ్చే శిక్షణా విధానం అంతా దృగ్గోచరమౌతాయి. ఇప్పుడు రంగు ముస్తాబులతో గోవు రాజులా నిలించింది అన్న పదం మారిన కథకు వివరణ నిచ్చింది.

మూలకావ్య కథకు రేడియో అనుసరణ కావించినమార్పులు తప్పని సరియైనవి. ఆకాశవాణి ప్రసారంలో కావించిన ఘట్టాల అనుసంధానం ప్రయోక్త అనుభవాన్ని తెలిపింది.

గంగిరెద్దు కరుణ రస ప్రథానమైన కథ. మనిషికి గోవుకు గల మధుర బాంధవ్యాన్ని నిరూపించే కథ. మూగ జీవుల కష్టాన్ని గుర్తించి, మానవత్వంతో వర్తించాలని సందేశమిచ్చే కథ. మనుష్యలలోని జలగ స్వభావాన్ని నిరసించిన కథ.

అనేక దృశ్య మాధ్యమాలు గడపలోనికొచ్చి, పిడికిట తెరుచుకుంటున్న అంతర్జాల యుగంలో ఆకాశవాణి బాధ్యతాయుతంగా నాటకాలను రస రమ్యంగా ప్రసారం చేస్తూనే ఉంది. కథా ప్రకారంగా గంగిరెద్దు కథ సార్వకాలీనమూ, సర్వ జన జీవనాను బంధమూ, సంస్కృతీ వికాస దోహదమూ అయినట్టిది. సంప్రదాయానికి సృజనాత్మకతను మేళవించిన రూపక రచయిత ఆకెళ్ళ శివ ప్రసాద్, నిర్వహణను కావించిన అంబడిపూడి మురళీ కృష్ణ, సాంకేతిక సహకారం, నిర్మాణ సహకారాలను అందించిన చలపతిరావు, సత్యనారాయణగార్లు అభినందనీయులు.

ఈ రేడియో నాటిక యూట్యూబ్ లో ఉంది. ఈ సంక్రాంతికి వెలుగునిచ్చే ఈ రూపకాన్ని తప్పక చెవులతో విని కనులకు కట్టుకోవాలి.

https://www.youtube.com/watch?v=G38V2H72EsM

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here