గంగిరెద్దు

0
7

[dropcap]రా[/dropcap]మలచ్చిమి తోటి కలిసి పటేళోల్ల పొలం కలుత్తాన. రామలచ్చిమి మస్తు పాట పాడతాంది.

నాకు నొప్పైతాంది ఓరోరి రాజీరు…

మందన్న ఎయ్యపోతివిరో నా రాజీరు…

నీకు మందెయ్య మీ గుడిసెకు వత్తనే కస్తూరి…

మనసిప్పి మాటాడుకుందాం కస్తూరి…

మా గుడిసెకు వత్తె మా అయ్య జూత్తడురో…

మన గుట్టు తెలిసి అల్లరైతమురో…

అయ్యజూత్తే మరి అటెన్కరానా…

……

…..

……

పాట ఇట్ల తీగ పార్తనే ఉన్నది. ఆఖర్న “కులముదేమున్నదే నా ముద్దు కస్తూరి…

నిన్ను మనువాడ నా కులమైన ఇడుస్త…

నీ కులము వాన్నయి నీ తోడే నేనుంట…

కులం సాకు జెప్పి నన్ను వదిలెయ్యకే కస్తూరి…”

అంటూ కులం కన్నా ప్రేమే గొప్పదైనట్టు పాడింది. ఈ పాట ఇనుడు ఇదే మొదాలు మొదాలు గూడ కాదు. ఇంతకు ముందెప్పుడు ఇంతగనం సోచాయించలే. గని ఇయ్యల నాకు నా బిడ్డ యాది కచ్చి మనసును పురుగు కొరికినట్టైతాంది. మనసుకు ఆ పురుగెట్ల పట్టిందో నెమరేసుకుంట కలుపుతీసే వరకు మధ్యాన్నం బువ్వ యాళ్ళయ్యింది.

***

రామలచ్చిమి, నేను, సోమమ్మ ఇంకో ఇద్దరం మర్రి చెట్టు కింద సద్దు లిప్పి తిన్నం. కాసేపు కొంగులు పరుసుకుని అడ్డమొరిగినంక అట్నుండి గంగిరెద్దును తోలుకొని వచ్చిన ధనయ్య దాన్ని నీడల కట్టేసి నెత్తికి కట్టుకున్న తువ్వాలిడిసి కింది పర్సుకొని కూసుంట నన్ను జూస్కుంట.

“రామేశ్వరి…! రామేశ్వరీ…!” అన్నడు.

నేను కావల్ననే ఏం సప్పుడు జెయ్యలె.

“రామేశ్వరీ…! ఓ పోరి! … నిన్నేనే” అన్నడు. ఎన్కటి సంది వున్న దగ్గరితనం తోటి.

“ఏందే బావా!” అన్న.

“ఏందే మరి, పిలుత్తాంటే చెవు మీద పేను వారినట్టు కూడ జూత్తలెవ్వేందే?”

“ఏం జెయ్యమంటవ్? నువ్వు గా ముచ్చటకే వచ్చుంటవని”

“మరి ఎరికె గద! ఏం జేత్తానవ్? ఏమనుకుంటానవ్?”

“అనుకునేదేంది?”
“ఏందే? నీకో టయం దగ్గరవడ్తాంటె దున్నపోతు మీద వాగ గురిసినట్టె ఉన్నది”

“అంటే…”
“లేకుంటేందే? నీ బిడ్డ కులం గానోన్ని జేస్కున్నదని కులం పంచాయితీల జమానతు లక్ష రుపాయలన్న లేకుంటె నీ గంగిరెద్దునన్న పండుగ లాగ కట్టమన్నరు గదె. అయితనాయ పైసలు? నెల రోజుల గడువు దగ్గర పడ్తాంటె నీకేమొ చీమ కుట్టినట్టు గూడ లేదు కద?”

“ఎందుకుండాలె? నా తాన పైసల్లేవు. మెడకాయ దీసి మొలేత్తరా? ఎయ్యుండ్రి. ఆ పున్నెం గూడా మీరే మూట గట్టుకోండ్రి. నిండా మునిగినంక సలెక్కడిది?”

“అంటె నీ ఉద్దేశమేంది? నువ్వు గూడ కులం కట్టు నుండి వేరు పోదమనుకుంటానవా?”

“మరింక ఏం జెయ్యాలె? రెక్కలు ముక్కలు జేస్కున్నా కరువెనుక కరువు తోని బాయిల్లల్ల నీళ్ళు లేక యెవుసం కైకిలి కూడ దొరకక తిప్పలపడ్తి. ఈ తాప మంచిగ కాలమైంది, కాలువ పార్తాంది. ఇంత పనులు నడ్మి పొలాలు పచ్చవడ్తానయ్. నా బతుకు గూడ దినమెల్ల కైకిలికి వోతె పైసలు దొరికి తిండికి కరువు లేక పచ్చగుంటననుకున్న. ఆశపడ్డ. కని నడుమిట్ల నా బిడ్డ ఏందో కులంగానోన్ని జేస్కున్నదని అటీటని నా గంగిరెద్దును గుంజుకొని నా కడుపు కొడుదామనుకోవడ్తిరి” అనుకుంటనే లేశి సోపతిగాండ్లతోటి, “మాపటీలి మాట్లాడుకుందాం తీ” అని మళ్ళ చేన్లకు దిగిన.

***

పొద్దుగూకినంక ఒక్కదాన్నే పొయ్యికాడ కూసొని బువ్వండుకుంటాంటె ధనయ్య చేతిల గిన్నె పట్టుకొని మల్లచ్చిండు. గుడ్డి గుడ్డి లైటెలుక్కు వాకిట్ల బండ మీద కూసుంట “బువ్వుండకుంనావె? ఇగొ! చాపల కూర దెచ్చిన దీస్కో, మీ అక్క పంపింది” అన్నడు.

“నేనెంటే మీకెందుకే ఇంత పావురం? యాన్నుంచి వచ్చిన్నో దెల్వది. నా కులమేందో నాకే దెల్వకుంట వున్నదాన్ని. ఎవలకు పుట్టిన్నో ఎట్ట పెరిగిన్నో గాలికి పుట్టి గాలికి పెరిగినదాన్ని. మీ కులపోడు తెచ్చుకొన్నడని, వాడేడ తప్పుల వడ్తడోని వానికి నాకు లగ్గం చేసి తాడు, బొంగరం లేని దానసొంటిదానికి ఓ పసుపు తాడు కట్టించి ఓ బిడ్డనిచ్చిండ్రు. దేవుడు ఇంత దయగల్గిండని సంబరపడుతాంటే నెత్తిన పిడుగేసి నా ఈరగాన్ని తీస్కవాయె. మల్ల నన్ను ఒంటరి కోతినే జేసిండు. ఎప్పటికన్న ఒడ్డు జేరనాన్ని ఆనాట్నుండి ఈదుతనే వుంటి. ఇంక గూడ ఒడ్దు జేరపోతి. ఇంకా బండరాల్లేసి ముంచుదామనే అనుకోవట్టిరి. ఎట్ల ఏడ్వాల్నే?” అని కొంగు దీసి కండ్ల నీళ్ళొత్తుకున్న.

“పిచ్చిదాన! మేమంత లేమానె? గందుకే ఈ తండ్లాట. బండ కింద చెయ్యిరికితె నిమ్మలంగ చెయ్యి తీస్కోవాలె గని చెయ్యి నరుక్కుంట మానె? అట్లనె ఇది గూడ కర్ర ఇరగకుండ పాము సావకుండ జేసి బైటవడాలె. కులం పంచాయితీల వాళ్ళు పెట్టిన కిటికు నాకు సమజైంది. ఆయంత నీకున్న లక్షరూపాయల విలువజేసే గంగిరెద్దును మింగుదామనుకుంటాండ్రు. నువ్వెందుకు జంకుతానవ్? ఒక్కసారి స్టేషన్‌కు వొయి ఒక్క కేసు పెడ్తె అంత సరిగ్గైతదంటె నా మాటెందుకింట లేవు? నా మాటను గంజిల ఈగ లెక్క ఎందుకు తీసేస్తానవ్?” అన్నడు.

“తీసెయ్యకుండ నీ మాట మీద కేస్తు పెడ్తె పోరిని ఆగం జెయ్యరా? జమానాతు కడితె వాళ్లు సప్పుడు జేకుంటరు. నా బిడ్డ జోలికి పోరు” అన్న.

“అటెన్క నీ బతుకెట్ల? గంగిరెద్దును దూరం జేస్కొని ఏం తిందామని?ఈ గంగిరెద్దును ఈరిగాని పాలు నేనే తిప్పి వచ్చిన డబ్బో, దస్కమో నీకన్నిచ్చి నేనిన్ని తీస్కొని ఇద్దరం బతుకవడ్తిమి. నాకా గంగిరెద్దును తిప్పుడు, పీక ఊదుడు తప్ప వేరే ఏం పనులు సుతరావు, నా భార్య సంగతి తెల్వన్దేమున్నది?దానికి నీ లెక్క కైకిలి పని రాదు. మునుపటోలె గాజులు బొట్టుసీసలు అమ్ముకుంట తిరుగుదమంటే గంపనెత్తిన వెట్టుకోను పాణం మంచిగుండక గుడిసెల్నే పెట్టుకోని ఉండవట్టె. పెద్ద పెద్ద టేరాలుండంగ దీని గుడెసెకు ఎవడచ్చి కొంటాండ్రు. ఎవరో నీ అసంటోళ్ళు దప్ప. అండ్ల ఇద్దరు పోరగాండ్లాయె. అయ్య, అవ్వ. అందరికీ నేను తెస్తేనే తిండాయె. నువ్వు నీ కోసం కాకపోయినా మా కోసమైనా గంగిరెద్దు కాపాడాలె. కాపాడాలె. అంటే నీవు ఇదేమి అన్నాయం? అని ప్రశ్నించాలె. ప్రశ్నించినోళ్లకు జవాబియ్యాలె. అంతెగని నువు గూడ గంగిరెద్దలె వాళ్లెట్ల జెప్తె గట్లనేనంటే మనసంటోల్ల బతుకులు గిట్లనే తెల్లార్తయ్. మంచి మాటకు జెప్పిన, బాగ ఆలోచించి అడుగెయ్. అండ్ల జర మా బతుకులను గూడ జూడు. ఇక చీకటి చిక్కగైతంది. నేను పోతనా” అంటూ చీకట్లో కలిసిపోయిండు.

కంచంల బువ్వేసుకుని చాపల కూర వెట్టుకుని తృప్తిగ తిన్న. ఎన్నొద్దులయిందో అట్ల తిని. ఈరిగాడు, నేను, నా బిడ్డ ముగ్గురమున్నప్పుడు తాపతాపకు తెచ్చెటోడు. వాడే అలవటు జేసిందు. అంతకు ముందు గింత సుఖమెక్కడుండె? ముద్ద ముద్దకు వాడే గుర్తుకురాంగ బువ్వు తిని బుడ్డి దీపం ముట్టించి లైటు బంజేసుకున్న. గాలి వెడ్తాందేమో, దీపం మిణుకుమిణుకు మంటాంది.

అచ్చం నా పాత కథ లాగనే.

***

నాది ఈ ఊరు గాదు, ఈ పల్లె గాదు. ఆ మాటకత్తె ఈ ప్రాంతమే కాదు. ఏ జాతో, ఏ ఫ్రాంతమో సరిగ్గ తెలువనిదాన్ని. నాకున్న గుర్తల్లా ఓ ముసలోడు నన్ను రైలు డబ్బల సాదిందొక్కటే. వాడు అడుక్కునెటోడు. వాడు తెచ్చింది నాకు వెట్టి వాడింత తిని నన్ను అడుక్కునెటోళ్ళ పిల్లలతోటి ఆడుకొమ్మని జెప్పి అడుకచ్చెటానికి పొయెటోడు. నాకప్పుడు ఏడేండ్లుంటయో ఏమో వాడు వట్టి వట్టిగనె అదే పాడు బడ్డ రైలు డబ్బల పండుకున్నోడు పండుకున్నట్టే సచ్చిపోయిండు. గౌర్నమెంటోళ్లు వాన్ని తీస్కపోయిండ్రు. నా గురించి వాని తోటి బిచ్చగాల్లెవ్వరూ చెప్పలే. మా పిల్లే మా పిల్లే అన్నరు. అందరొక్కటై వాళ్లను నమ్మించిండ్రు. నన్ను గూడ వాళ్ల తోటి అడుక్కోవడానికి తీస్కపోయేది. నేను పెరుగుతాంటె పెరుగుతాంటె మంచి అందంగ ఆరోగ్యంగ ఉంటుండె వరకు వాళ్లకు వేరే పాడు బుద్ధి పుట్టింది. నన్ను అమ్మేయాలనుకున్నరు. ఇది పసిగట్టిన నేను రాత్రికి రాత్రే అటొచ్చిన్ ఓ బండెక్కి హైద్రాబాద్‌ల దిగిన. రెండు రోజులు తిండీ తిప్పల్లేవ్. పట్టించుకున్నోడే లేడు. ఆకలికి ఓర్వలేక ఓనాడు ఓ హోటల్ ముందు బిచ్చానికి చెయి జాపిన. ఆ హోటల్ ఓనరు ఆడమనిషే. నన్ను జూసి కడుపునిండా తిండి వెట్టి, పనిత్తె జేత్తవా? అన్నది. అట్ల హోటళ్ల గిన్నెలు కడిగి ఊడ్శి శుభ్రం చేసే పనిలవడి మొత్తానికి మల్లనున్నగైన. కని – ఆడ గూడ నాతోటి జేసే ఓ చింపిరి జుట్టోడు ఎట్లనో ఎట్లనో జూస్కుంట మాట్లాడుడు మొదలువెట్టిండు. ఆఖర్న ఓ రోజు నేను జెప్పినట్టు ఇనాల్నని భయపెట్టిండు. ఈడ గూడ ఉండెటట్టు లేదని తెల్లారి వానికి కనవడకుండ పోవాల్ననుకొని ఏ బస్సో ఏమో చూడకుంట బస్సెక్కి ‘యాడికి’ ఊరు జేరిన. అనంతపురం జిల్లా అని తర్వాత తెలిసింది. నేను బోయిన యాళ్ల నాగబైరవస్వామికి ఆ ఉళ్లె నాగుల చవితి సంబురాలు జరుగుతానాయ్. సాముగారడీల ఆటలతోటి సంబరం గున్నది. నేను ఒయి ఆ కుటుంబాల తోటి కల్సిన. అట్ల ఆ కుటుంబాలు ఏ ఊరు తిరిగితె ఆ ఊరు తిరుక్కుంట ఉంటాంటె ఈరిగాడు గంగిరెద్దును ఆడించుకుంట, పీక ఊదుకుంట ఇల్లిల్లు దిరిగి బట్టలు, ధాన్యం తీసుకొనుడు. పండగ ప్రభోజనం, చావు ఇట్ల అన్నిట వానికి ఆందాను బాగానే ఉండేది. అసోంటోడు నాకు బాగ ఇష్టమైండు. వాడు నన్ను పెండ్లి చేస్కుంటనన్నడు. వాళ్ల తోటి జెప్పి ఈ ఊరు తీస్కచ్చుకున్నడు. వచ్చిన సంది పెండ్లి, పేరంటం, ఓ ఇల్లు, ఇర్బాటం, ఓ పిల్ల, ఓ సంసారం, ఓ బాధ్యత, కులం అన్ని ఏర్పాటైనయ్. మారుతున్న కాలంతో పాటు పరిస్థితులు గూడ మారి గంగిరెద్దు ఆట ఒక పేరుకే అయిన కాలమచ్చింది.

గిట్లయితే బతుకెట్లనని పిల్లని గౌర్నమెంటు బల్లె హాస్టల్లేసి జదివిత్తె జదువుకొని ఓ రేవుల వడ్డది. అదృష్టం మంచిగుండి చిన్నపాటి సర్కారి నౌకరీ దొరికింది. ఈరిగాడు, నేను ఫుల్లు కుషీ అయినమ్. మన కులంల నౌకరి జేసుడంటె మామూలు గాదని, నక్కని తొక్కినమని సంబురపడ్డమ్. దేవుడా! కోతికైన గీత మంచిగుండాలెనన్నట్లు నాకెంత మంచి రాత రాసినవ్ అని ముందటి కష్టమంత మర్శి తేటగైన. కని నా బైడ్డ పనిజేసే సోపతిగాన్నే జంగాల కులంవాన్ని జూసి ఒకరికొకరు ఇష్టమై పెండ్లి జేసుకుంది. గంతకు తగ్గ బొంతని మేం ఏమన్లే. ఇప్పుడు అందరోలె వైభోగంగ జెయ్య ఆందాను గూడ లేక రిజిస్టర్ ఆఫీస్‌ల పెద్దసారు ముందట దండలు మార్పిచ్చి పెళ్లి జేస్కున్నంక ఓ కాయిదం (సర్టిఫికెట్) ఇచ్చిండ్రు. తరువాత యాట కూర తోటి కోటి కులపోళ్ళకు డిన్నర్ జేసినం. బిడ్డ దాని సందాల అది సల్లగ బతుకుతాంటె నడుమిట్ట ఎవరో కులంగానోనోన్ని జేస్కున్నది ఎట్లూకుంటమని పంచాయితీ పిల్శి దండుగ కింద లచ్చ రూపాయలన్న, గంగిరెద్దన్న అప్పుజెప్పుండ్రి. లేకుంట కులమన్న ఇడువండ్రని కట్టు జేసిండ్రు. ఈరిగాడు నెత్తి నోరు మొత్తుకున్నడు. ఐనా వాళ్లు మూన్నెళ్ల గడువు పెట్టిండ్రు. ఇంతల్నె వీరిగానికి పిడుగువడి వాడం ఒడిశిండు. గని పంచాయితోల్లు కనికరించెలె. పట్టు విడువలె. నేను ఈరిగాడు నా భర్తే అయిన ఎన్నడు తిట్టుకొన్నది, కొట్టుకున్నది లేదు. ఈరిగాడు అనే చెప్పుకునేది. గంత పాణం బెట్టుకున్నోడే పోయినంక ఆ కులం తోటి నాకు పనేంది? నడుమిట్ల వచ్చిన కులం కోసం జాతి కోసం కొట్లాడుడెందుకు? నకు వాని గంగిరెద్దు ఉంటె సాలనుకున్న. కులం ఇడ్సిపెడ్తనని నిమ్మలవడ్డ. ధనయ్యేమొ ఎదురీదమంటాడు! కులం పెద్దలేమొ నువ్వు ఇడ్శిపెట్టినంక గంగిరెద్దు తోని నీకు పనేంది? అది మా గంగిరెద్దుల కులదైవమసోంటిది. నువు, నీ బిడ్డ జంగాల కులం ఇయ్యమందుకొని నీతి తప్పినోళ్లైయిండ్రు. కాబట్టి గంగిరెద్దును మాకిచ్చి మా కులం ఇడ్వువమి అంటాండ్రు. నా బిడ్ద గూడ “ఎన్నాళ్లీ గంగిరెద్దుల బతుకులు. ‘పోరాటం జేత్తె పొయ్యేదేమున్నది బానిస సంకెళ్లు తప్ప’ అని ఎవరో మహానుభావుడన్నట్టు అది నువ్వే ఎందుకు గాగూడదు? ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తే ముందటి తరమన్న బాగుంటరు గద” అంది. గొంగట్ల తినుకుంటనే ఎంటుకలు ఏరితే ఎట్ల? జంగాలోల్లు, గంగిరెద్దులోల్లయి అందరివి అత్తెసరు బతుకులేనాయె. ఇప్పటికన్నా కుల పంచాయితీలు, కుల విడుపులు ఆపి కులం బాగుకోసం ఒక్కకట్టుగా ఉండి అందరి బతుకులు బాగుజేస్కుంటె మంచిది గద! కులం రీతులు దెబ్బతినకుండా మంచి బతుకుల కోసం కులం కట్టుగా ఉండాలెగాని మన కన్ను మనమే పొడ్సుకున్నట్లు కుల కొట్లాటల్లల్ల కొట్టుకుంటె ఎట్ల? బైటి కులపోడు ఎవడు విలువిత్తడు. వీళ్లకు బుద్ధి చెప్పల్నంటె ధనయ్య చెప్పింది, నా బిడ్డ జెప్పిందే మంచిగున్నది అని మిణుకు మిణుకు మంటున్న దీపమే నాకు మంచి ఆలోచనతో వెలుగు నిచ్చింది.

***

రెండ్రోజులు అయినంక పంచాయితికి పిలిశిండ్రు. “ఏంది దండగ కడ్తానవా? కులం ఇడ్తానావా?” అన్నరు. నేను ధైర్నం జేస్కొని “దండగ కట్టేది లేదు, కులం ఇడిశేది లేదు. నేను గంగిరెద్దులు ఆడిచ్చెటోని భార్యనే కావచ్చు గని మీరెట్లంటె అట్లని మీ సన్నాయి మాటలకు తలూపుకుంట ఆడటానికి నేనేం గంగిరెద్దును గాదు. ఎన్కట పెద్దమనుసులు మంచి కోసం నియతి గల్గి కులకట్టని ఏర్పాటు జేత్తె దాన్నిట్ల నవ్వుల పాల్జేత్తాండ్రు. కులం కట్టు కులం కాపాడుకోవడం కోసం, కులంల ఉన్నోన్ని లేనోన్ని జూస్కుంట అందరికీ సమన్యాయం జరగాలని పెడ్తె ఇయ్యాల ఇండ్ల గూడ నీతులుదప్పి ముప్పు జేత్తాండ్రు. మీరే గనుక నిఖార్సైన కులపెద్దలైతే నన్నిడ్శి పెట్టుండ్రి. లేదంటె నేను ఎక్కడికైనా పోయి ఎంతవరకైనా పోరాడుతా” అని ఆన్నుంచి ఓ మార్పుకు శ్రీకారం చుడుతున్న దానిలా అడుగు ముందుకేసి నడుస్తుంటే ఆళ్లంత నోరెళ్లబెట్టు జూసుడు తప్ప కిక్కురుమనలే.

నా ఎదురుగ ధనయ్య చేతిలో ‘గంగిరెద్దు’ తలూపడం ఆపి తలెత్తి నిల్సున్నది. ఆప్యాయంగా దాన్నముదుముకున్న. ధనయ్య రెండు చేతులెత్తి దండం బెట్టిండు.

“వల్ల బావా! వల్ల!” అని ఎద్దును బావ చేతుల పెట్టిన ఆనందంగ. నాకు బతుకునిచ్చిన ఆ కులం బాగు కోసం ఏమైనా జేత్త, ఆ కులంలోనే ఉంది ఆండ్లనే మట్తి కలువాలని, ఋణం తీర్చుకోవాలని అనుకుని ఒట్టేసుకున్న.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here