గరళ కంఠుడు

2
8

[శ్రీ అంబల్ల జనార్దన్ రచించిన ‘గరళ కంఠుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

[dropcap]“హా[/dropcap]య్! ఎలా ఉన్నారు? చాలా ఏళ్లయింది మనం కలిసి. మనం ఇంట్లో వాళ్లతో, ఇంట్లో వాళ్లు మనతో విసుగెత్తిన సందర్భంలో మన వయస్కులందరిని ఇలా ఒక్క చోట చేర్చడం ఆటవిడుపుగా ఉంది”

“అంతే కాదు. డెబ్భై ఐదు ఏళ్లు పూర్తి చేసుకున్న అందరిని శాలువా, జ్ఞాపికతో సత్కరించ పూనడం మరీ బాగుంది.”

“ఔను. మనందరం ఇలా కలిసి మన ఉద్యోగ జీవితాల్లోని తీపి కబుర్లు చెప్పుకోవడం ఆనందంగా ఉంది”

“నాకైతే మళ్లీ యౌవనంలోకి ఆడుగిడిన అనుభూతి కలుగుతోంది.”

“మన వయసు పెరిగింది కాని, మనసింకా ముదియౌవన వసంతంలా తాజాగా ఉంది.”

“ఈ శుభ సమయంలో మన బి.పి., మదుమేహం, గుండె జబ్బుల గురించి పట్టించుకోకుండా హాయిగా అన్ని దినుసులు లాగించేయాలనుంది. మనల్ని అడ్డుకునే వారెవ్వరూ లేరిక్కడ.”

“నాకు మాత్రం ఆ వృద్ధాశ్రమ జైలు నుంచి బయటపడి, ఈ ఒక్క రోజైనా మీ అందరితో గడపడం మహదానంగా ఉంది”

“మీ వాడు బుద్ధిమంతుడని, చదువులో చురుగ్గా ఉన్నాడని, ఉన్నదంతా ఊడ్చి, మీ వాణ్ణి అమెరికాలో చదివించావుగా? నిన్ను వృద్ధాశ్రమంలో చేర్చడమేంటి?”

“కడుపు చించుకుంటే కాళ్లమీద పడుతుంది. మా బుద్ధిమంతుడి భార్యకు మా పొడ గిట్టాలని ఎక్కడుంది?” అని కళ్లు తుడుచుకున్నాడతను.

“నువ్వేంటి రిటైరై పది సంవత్సరాలు దాటుతున్నా, ఇంకా నలభై ఏళ్ల నడివయసులో ఉన్నట్టున్నావ్. దాని గుట్టేమిటి తిరుమలేశా?” నాటక ఫక్కీలో ఒకతనిలో ఉత్సుకత.

“ఏముందీ? రోజూ ఉదయం ఐదు గంటలకు లేచి గంటసేపు యోగాసనాలు చేస్తాను. ఆ తర్వాత స్నానాదులు ముగించి, ఓ గంట సేపు ఆ రోజటి దిన పత్రికను పరామర్శిస్తాను. పది గంటలకల్లా మా ఇంటికి దగ్గరలో ఉన్న సేవా సంఘానికి వెళ్లి, బ్యాంకింగ్ విషయంలో సమస్యలతో వచ్చిన జనాలకి సలహాలిస్తాను, దాంతో నాకు చురుగ్గా ఉండే అవకాశం లభిస్తోంది. ఆ తర్వాత పగలు ఒంటి గంటకి భోంచేస్తాను. భోజనంలో కూడా సాత్విక పదార్థాలే ఉంటాయి. వేపుడులకు దూరంగా ఉంటాను. ఆకుకూరలు, కీరదోస, క్యారెట్ సలాడ్‌గా తింటాను. పగలు ఓ గంట కునుకు తీసి లేచింతర్వాత పత్రికలు, పుస్తకాలు చదువుతాను. రాత్రి ఎనిమిది గంటలలోపు భోంచేసి, కుటుంబ సభ్యులతో పిచ్చాపాటిలో పడతాను. ఇలా క్రమబద్ధమైన జీవన సరళి వల్లె ఇంకా మన వయస్సులో వచ్చే బీ.పీ., షుగరు, హృదయపోటు, నా దగ్గరికి రావడానికి జంకుతాయి.” చాల సుదీర్ఘ సుత్తి కొట్టాడో శాల్తీ. అలా జీవన చరమాంకంలో ఉన్నవారు తమ పాత సహచరులతో సుఖదుఃఖాలు పంచుకుంటున్నారు.

అది ‘గతిశీలక బ్యాంక్’ విశ్రాంత ఉద్యోగుల సంఘ రజతోత్సవ సంరంభం.

అనుభవంతో తలలు పండిన వారితో ఆ వేదిక కళకళలాడుతోంది. పాత మిత్రులు పిచ్చాపాటిలో పడ్డారు. అంతలో ఒకతను హడావుడిగా హాల్లోకి వచ్చి అందరినీ పరామర్శించ సాగాడు.

“ఏమోయ్ ఎలా ఉన్నావ్? ఇంత సన్న బడ్డావేంటి? కోడలు సరిగా తిండి పెట్టడం లేదా? ఔనులే నాదీ అదే గతి. ఈ వయసులో వారి దయాదాక్షిణ్యాల మీదే అధారపడాలి మనం. కొడుకు మన వాడు కాని, కోడలు మనదౌతుందా? అందుకే సర్దుకు పోవాలి.”

అతను స్పందించేలోగా ఇంకో శాల్తీ దగ్గరికి వెళ్ళి “కట్టె పుల్లలా ఉండేవాడివి, పిప్పళ్ల బస్తాలా ఊరావేంట్రా? జాగ్రత్త. క్రమం తప్పకుండా యోగాసనాలు వెయ్యి. రోజుకి కనీసం ఐదు కిలోమీటర్లన్నా నడవడం అలవర్చుకో. లేకపోతే ఏ క్షణమైనా గుండె ఆగి పైకి టపా కడతావు.” ఎవరా ఇతను? అని అతను ఆశ్చర్యంగా చూస్తుండగానే ఇంకో అతన్ని ఉద్దేశించి.. “నువు మాత్రం మారలేదు సుమా. వెంట్రుకలింకా నల్లగానే ఉన్నాయి. మనలో మన మాట. ఏ రంగు వాడుతున్నావేమిటి? ఇప్పటికీ మిసమిసలాడుతూ పూలరంగడిలా తయారయ్యావు. నిన్ను చూస్తే నాకు యమ ఈర్ష్యగా ఉందంటే నమ్ము. ఇంతకీ ఏ గుళికలు మింగుతున్నావ్?”

“నువ్వేంటి అలా గుడ్లప్పగించి చూస్తున్నావ్? నన్ను గుర్తు పట్టలేదా? మనం మీ ఫలానా బ్రాంచ్‌లో కలిసాం. నేనంతగా మారానా? పరవాలేదులే. పండగ చేస్కో.”

అలా అందరినీ పలకరిస్తూ కాళ్లకు చక్రాలు కట్టినట్టుగా హాలంతా కలియ తిరుగుతున్న అతన్ని అందరూ ప్రశ్నార్థక మొహాలతో చూస్తున్నారు. ఎవరితను చెప్మా? అని. బ్యాంకులో ఎప్పుడు, ఎక్కడ చూశాం చెప్మా? అని తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు.

అంతలో ఓ పరిచిత వ్యక్తి ఆ ఆసామి చేయి పట్టుకుని ఓ కుర్చీలో కూర్చుండపెట్టాడు. ఉన్నట్టుండి ఆ అపరిచిత వ్యక్తి ఏడవడం మొదలు పెట్టాడు. వెంటనే అతన్ని బయటకు తీసుకెళ్ళాడు పరిచిత వ్యక్తి. ఓ పదిహేను నిమిషాలు ఊరడించి తిరిగి హాల్లోకి తీసుకువచ్చాడు.

“ఎవరండీ ఇతను? ఎప్పుడూ చూసిన గుర్తు లేదు. ఓ విద్యుల్లతలా మెరిసి, ఎంతో మందిని పలకరించి, అకస్మాత్తుగా ఏడవడమేమిటి?” ఆ పరిచిత వ్యక్తిని అడిగాడు సంస్థ కార్యదర్శి.

ఆయనను పక్కకు తీసుకపోయి..

“ఏం చెప్పమంటారు సర్? ఇతను మా పిన్ని కొడుకు. ఇతనికీ మన బ్యాంకుకీ ఏ సంబంధమూ లేదు. వీడు రాష్ట్ర ప్రభుత్వంలో అధికారిగా చేసి రిటైరయ్యాడు. నేను మన బ్యాంకులో పని చేస్తున్నప్పుడు, అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చేవాడు. అలా మన వాళ్లు కొందరు వీడికి పరిచయం అయ్యారు. ఐతే ఈ మధ్యే వీడికి క్యాన్సర్ చివరి స్టేజ్‌లో ఉందని వైద్య పరీక్షల వల్ల తెలిసింది. మహా అంటే ఓ ఆర్నెళ్లు బతుకుతాడని డాక్టర్లు తెగేసి చెప్పారు. అప్పటి నుండి వీడు, హైపర్ యాక్టివ్‌గా ప్రవర్తించడమో లేక డిప్రెషన్ లోకి వెళ్ళి ఏడవడమో చేస్తున్నాడు. మనందరిని కలిస్తే ఐనా వీడికి కాస్త మనశ్శాంతిగా ఉంటుందని ఈ సమావేశానికి తీసుకు వచ్చాను. ఈ కాస్త సేపైనా తన జబ్బు విషయం మరచి, సంతోషంగా ఉంటాడని ఆశ. మీకు ఇబ్బంది కలిగించినందుకు క్షమించమని వేడుకుంటున్నాను” అని చేతులు జోడించాడు పరిచిత వ్యక్తి.

“ఓహో ఐతే ఇతను గరళకంఠుడన్నన్నమాట!” సంస్థ కార్యదర్శి వ్యాఖ్యానం. కొందరు అయ్యో! అన్నారు. మరి కొందరి కళ్లలో చెమ్మ! హాలును నిశ్శబ్దం ఆవహించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here