గర్భకవిత్వం వ్రాయడం ఎలా?

1
13

[శ్రీ ఎం.వి.ఎస్. రంగనాధం గారి ‘గర్భకవిత్వం వ్రాయడం ఎలా?’ అనే వ్యాసాన్ని అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]క ఛందస్సులో ఉన్న ఒక పద్యంలో ఒకటి లేక అంతకన్నా ఎక్కువ ఛందస్సులలో ఉన్న పద్యాలు ఇముడ్చటమే కాకుండా, ఇముడ్చుకున్న పద్యము ఇమిడిన పద్యాలు అర్థవంతంగా ఉండేటట్లు చూడడాన్ని గర్భకవిత్వం అంటారు. ఈ వ్యాసం సీస పద్యంలో మత్తేభ కంద పద్యాలను, ఉత్పలమాల పద్యంలో తేటగీతి కంద పద్యాలను, ఇమిడ్చి చూపించడానికి చేసిన ఒక చిన్న ప్రయత్నం. గణాల ఎంపిక ప్రత్యేక పద్ధతిలో చేస్తే గర్భకవిత్వం సాధ్యపడుతుంది. అది ఎలాగో ఉదాహరణల ద్వారా చూద్దాము.

ముందుగా సీస పద్యం పూర్వ భాగంలో మత్తేభం, ఉత్తరభాగంలో (తేటగీతిలో) కంద పద్యాన్ని ఇముడ్చడాన్ని పరిశీలిద్దాము. నాలుగు పాదాల మత్తేభ పద్యంలో, ఒక్కొక్క పాదంలో 20 అక్షరాల చొప్పున 80 అక్షరాలు, ప్రాస నియమం (2, 22, 42, 62వ అక్షరాలకి), ప్రతి పాదంలో మొదటి అక్షరానికి 14వ అక్షరానికి యతిమైత్రి (అంటే 1-14, 21-34, 41-54, 61-74వ అక్షరాలకు),  ప్రతి పాదంలో “స, భ, ర, న, మ, య, వ” అన్న 7 గణాలు, ఉంటాయి.

సీస పద్యం పూర్వభాగంలో 4 పెద్ద పాదాలు, ఒక్కొక్క పెద్ద పాదం రెండు చిన్న పాదాలుగా ఉంటాయి. ఒక్కొక్క పెద్ద పాదంలో 8 గణాలు (మత్తేభం కన్నా ఒక గణం ఎక్కువ), అంటే 6 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు ఉంటాయి. ఒక్కొక్క పెద్ద పాదంలో ఉన్న రెండు చిన్న పదాలలో మొదటి దాన్లో 4 ఇంద్ర గణాలు, రెండవ దాన్లో మిగిలిన రెండు ఇంద్ర గణాలు రెండు సూర్య గణాలు ఉంటాయి. రెండు చిన్న పాదాలలో మొదటి అక్షరానికి 3వ గణము మొదటి అక్షరానికి యతిమైత్రి ఉంటుంది. ప్రాస యతి కూడా చెల్లుతుంది. ప్రాస నియమం లేదు.

సీస పద్యం పూర్వ భాగంలో ఉన్న ఒక్కొక్క పెద్ద పాదంలో ఒక మత్తేభ పద్యపాదం ఇముడ్చాలి. మత్తేభ పద్యపాదం కన్నా సీస పద్యం పెద్ద పాదం పెద్దది కాబట్టి మత్తేభంలో ఏమి చేరిస్తే సీస పద్యపాదం అవుతుందో చూడాలి. మత్తేభంలో ఉన్న మొదటి గణం సగణం (IIU). అది ఇంద్ర గణం కాదు. దాన్ని ఇంద్ర గణం చెయ్యాలంటే మొదట్లో ఒక లఘువు కలుపుకోవాలి. అప్పుడది నగము (IIIU) అవుతుంది. మత్తేభంలోని తరువాతి రెండు గణాలయిన భగణము (UII), రగణము (UIU) ఇంద్ర గణాలే కాబట్టి మార్పు అవసరం లేదు. తరువాతిది నలము (III). అది ఇంద్ర గణం కాదు. దాన్ని ఇంద్ర గణం చెయ్యాలంటే తరువాతి మగణంలోని మొదటి గురువును దీనితో జోడించాలి. ఆ విధంగా, నగము, భగణము, రగణము, నగము అన్న నాలుగు ఇంద్ర గణాలతో 14 అక్షరాలతో సీస పద్యం పెద్ద పాదం లోని మొదటి చిన్న పాదం పూర్తవుతుంది. మత్తేభంలోని తరువాతి ఆరు అక్షరాలు రెండు భగణాలు, అంటే రెండు ఇంద్ర గణాలు అవుతాయి. ఇంక ఒక్క గురువు మిగులుతుంది. దానికి ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు గానీ, నాలుగు లఘువులు కానీ, కలిపితే రెండు సూర్య గణాలు అవుతాయి. అంటే, రెండు గలములు (UI) కానీ, ఒక గలము ఒక నలము కానీ అవుతాయి. ఈ వ్యాసంలో తీసుకున్న ఉదాహరణలో రెండు గలములు (UI) వచ్చేటట్లుగా ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు కలపడం జరిగింది. ఆ విధంగా, రెండు భగణాలతో రెండు గలములతో, 10 అక్షరాలతో సీస పద్యం పెద్ద పాదం లోని రెండవ చిన్న పాదం పూర్తవుతుంది. అలా, 20 అక్షరాల మత్తేభ పాదాన్ని మొదట్లో ఒక లఘువు, చివర్లో ఒక లఘువు ఒక గురువు ఒక లఘువు కలిపి, 24 అక్షరాలతో సీస పద్యం పెద్ద పాదం తయారు చెయ్యవచ్చు. అంటే, 80 అక్షరాల మత్తేభంలో కొన్ని అక్షరాలు కలిపితే 96 అక్షరాల సీస పద్యం పూర్వభాగం అవుతుంది. అలా తయారైన సీస పద్యంలో ప్రతి పాదంలో మొదటి అక్షరం, ఆఖరి మూడు అక్షరాలు వదిలేసి చదివితే మత్తేభ పద్యం అవుతుంది. ఇక చూడాల్సినవి యతి, ప్రాసకి సంబంధించిన నియమాలు.

యతిమైత్రి (సీస పద్యం కోసం): 1-8, 15-21, 25-32, 39-45, 49-56, 63-69, 73-80, 87-93

యతిమైత్రి (మత్తేభ పద్యం కోసం): 2-15, 26-39, 50-63, 74-87

అంటే 96 అక్షరాలలో యతిమైత్రి ఉండవలసిన అక్షరాలు:  1-8,   2-15-21,   25-32,  26-39-45,  49-56, 50-63-69, 73-80, 74-87-93

మత్తేభ పద్యం కోసం ప్రాస నియమం పాటించాల్సిన అక్షరాలు: 3, 27, 51, 75

ఇక, సీస పద్యానికి ఉత్తర భాగమైన ఎత్తుగీతలో కంద పద్యాన్ని ఎలా గర్భితం చెయ్యాలి అన్న విషయం చూద్దాం. నేను తీసుకున్న ఉదాహరణలో తేటగీతి పద్యంలో కంద పద్యాన్ని ఇమిడ్చాను. తేటగీతి పద్యానికి ప్రతి పాదంలో 1 సూర్య గణము, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు ఉంటాయి. అంటే, నాలుగు పాదాలు కలిపి 20 గణాలు ఉంటాయి. ప్రాస నియమం లేదు. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి 4వ గణము మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాస యతి చెల్లుతుంది.

కంద పద్యంలో 1, 3 పాదాలకి 3 గణాలు, 2, 4 పాదాలకి 5 గణాలు ఉంటాయి. గణాలు చతుర్మాత్రా గణాలు. అంటే, 2 గురువులు గాని, 4 లఘువులు గాని, లేదా ఒక గురువు, 2 లఘువులు గాని ఉంటాయి. ప్రాస నియమం ఉంటుంది. 2, 4 పాదాలలో మొదటి అక్షరానికి 4వ గణము మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. 2, 4 పాదాల్లో 3వ గణము నలము గాని జగణము గాని కావాలి. జగణము బేసి గణము కాకూడదు. 2, 4 పాదాల్లో ఆఖరి అక్షరం గురువు అయ్యి ఉండాలి.

నేను వ్రాసిన తేటగీతి పద్యంలో గణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

మొదటి పాదము:        III IIUI UII III III (16 అక్షరాలు)

రెండవ పాదము:         UI IIIU IIII UI III (15 అక్షరాలు)

మూడవ పాదము:       III IIIU IIUI III III (17 అక్షరాలు)

నాల్గవ పాదము:         III IIII UII UI III (15 అక్షరాలు)

అంటే, మొత్తం 63 అక్షరాలు ఉన్నాయి. యతిమైత్రి ఉన్న అక్షరాలు: 1-11, 17-27, 32-43, 49-59. నేను వ్రాసిన తేటగీతి పద్యంలో 1, 3 పాదాల్లో ప్రాస యతి వేశాను. ఇక కంద పద్యం విషయాని కొస్తే, ప్రాస నియమము ఉన్న అక్షరాలు: 2, 12, 29, 40, యతిమైత్రి ఉన్న అక్షరాలు: 11-22, 39-50. తేటగీతిలోని ఆఖరి 7 అక్షరాలు తీసేస్తే, 56 అక్షరాల కంద పద్యం అయింది.  కంద పద్యంలో గణాలు క్రింది విధంగా ఉన్నాయి.

మొదటి పాదము:        IIII IUI UII (10 అక్షరాలు)

రెండవ పాదము:         IIII IIU IIII UII IIU (17 అక్షరాలు)

మూడవ పాదము:       IIII IIII IIU (11 అక్షరాలు)

నాల్గవ పాదము:         IIU IIII IIII IIII IIU (18 అక్షరాలు)

పై పథకం ప్రకారం వ్రాసిన సీస పద్యం అర్థవంతంగా ఉండాలి. దానిలో గర్భితమైన మత్తేభ, కంద పద్యాలు కూడా అర్థవంతంగా ఉండాలి. అలా, చిన్న ప్రయత్నం జేసి వ్రాసిన 159 అక్షరాల సీస పద్యం, దానిలో గర్భితమైన 80 అక్షరాల మత్తేభ పద్యం, 56 అక్షరాల కంద పద్యం క్రింద ఇవ్వబడ్డాయి.

సీ.
వినయ సంపన్నుడు విద్యతో చతురతన్
నానా విధాలన్ వినా పరాజ
య భయమున్ సంపద యంతయున్ విహితమున్
భార్యా సమేతప్రభల్ విశాల
విజయమున్ గోరుచు విశ్వశాంతి కొరకై
జాత్యమ్ము స్వీయప్రజన్ త్యజించి
విలయమున్ జేసిన విశ్వకీర్తి యొకడే
లక్ష్యంబు సాధించిలన్ యతండు
తే.గీ.
అనిశమును సత్య నిష్టను తన వ్రతముగ
జేసెను భరతావని యొక చేతను నడి
పెను విన హరి చంద్రుని గాధ తనువు మనసు
లను పులక కలిగెన్ యది జ్ఞానగుళిక.

(వినయంలో ధనవంతుడు, జ్ఞానముతో, నేర్పరితనముతో అనేక విధాలుగా, ఓడిపోతాననే భయం లేకుండా తన సంపద అంతటినీ, తనకు విహితమైనది, భార్యతో సహా సమస్త ప్రభలు, విస్తృతమైన విజయాన్ని ఆకాంక్షించి విశ్వశాంతి కోసం, తన మంచిని, స్వంతజనాల్ని వదలి త్యాగం చేసిన విశ్వకీర్తి ఒక్కడే. ఈ లోకంలో లక్ష్యాన్ని సాధించి, అతడు నిత్యము సత్యనిష్ఠ తన వ్రతంగా చేసుకున్నాడు. భారతదేశాన్ని ఒంటిచేత్తో నాయకుడుగా నడిపాడు. హరిశ్చంద్రుని కథ వింటే, శరీరములోను, మనసులోను పులకరింత కలిగింది. అది జ్ఞానగుళిక.)

మ.
నయ సంపన్నుడు విద్యతో చతురతన్ నానా విధాలన్ వినా
భయమున్ సంపద యంతయున్ విహితమున్ భార్యా సమేతప్రభల్
జయమున్ గోరుచు విశ్వశాంతి కొరకై జాత్యమ్ము స్వీయప్రజన్
లయమున్ జేసిన విశ్వకీర్తి యొకడే లక్ష్యంబు సాధించిలన్

(ఈ లోకంలో లక్ష్యాన్ని సాధించిన, నయ సంపన్నుడు (అంటే పెద్ద అందగాడు), జ్ఞానముతో, నేర్పరితనముతో అనేక విధాలుగా, భయం లేకుండా, తన సంపద అంతటినీ, తనకు విహితమైనది, భార్యతో సహా సమస్త ప్రభలు, జయాన్ని ఆకాంక్షించి విశ్వశాంతి కోసం, తన మంచిని, స్వంతజనాల్ని వదలి త్యాగం చేసిన విశ్వకీర్తి ఒక్కడే.)

కం.
అనిశమును సత్య నిష్టను
తన వ్రతముగ జేసెను భరతావని యొక చే
తను నడిపెను విన హరి చం
ద్రుని గాథ తనువు మనసులను పులక కలిగెన్

(నిత్యము సత్యనిష్ఠ తన వ్రతంగా చేసుకున్నాడు. భారతదేశాన్ని ఒంటిచేత్తో నాయకుడుగా నడిపాడు. హరిశ్చంద్రుని కథ వింటే, శరీరములోను, మనసులోను పులకరింత కలిగింది.)

ఇక రెండవది ఉత్పలమాల పద్యంలో ఒక కందపద్యాన్ని, ఒక తేటగీతి పద్యాన్ని గర్భితం ఎలా చెయ్యాలా అన్న విషయం గురించి. ఉత్పలమాలలో గణాలు – భ, ర, న, భ, భ, ర, వ, అంటే, UII UIU III UII UII UIU IU. ఒక్కొక్క పాదంలో 20 అక్షరాలు, మొత్తం 4 పాదాలకీ 80 అక్షరాలు ఉంటాయి. ప్రాస నియమం కలదు. ప్రతి పాదమునందు 10 వ అక్షరము యతి స్థానము.

తేటగీతి పద్యానికి ప్రతి పాదంలో 1 సూర్య గణము, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు ఉంటాయి. అంటే, నాలుగు పాదాలు కలిపి 20 గణాలు ఉంటాయి. ప్రాస నియమం లేదు. ప్రతి పాదంలో మొదటి అక్షరానికి 4వ గణము మొదటి అక్షరానికి యతి చెల్లుతుంది. ప్రాస యతి కూడా చెల్లుతుంది. కంద పద్యం లక్షణాలు పైన వివరించడం జరిగింది.

ఉత్పలమాల పద్యంలో ప్రతి పాదంలో మొదటి రెండు గణాలు (భగణము, రగణము), ఆఖరి అక్షరం (గురువు) వదిలేస్తే, తేటగీతికి కావలసిన ఒక సూర్య గణం, 2 ఇంద్ర గణాలు, 2 సూర్య గణాలు సరి పోతాయి. ఆ గణాలు – III UII UII UI UI. ఈ తేటగీతిలో ప్రతి పాదంలో మొదటి అక్షరానికీ, 10వ అక్షరానికీ (4వ గణము మొదటి అక్షరం) యతి మైత్రి ఉండాలి. అంటే, తేటగీతి కోసం, అదనంగా ఉత్పలమాల పద్యంలో, ప్రతి పాదంలో 7వ అక్షరానికీ 16వ అక్షరానికీ యతి మైత్రి ఉండాలి. అంటే, తేటగీతి కోసం ఉత్పలమాల పద్యంలో యతిమైత్రి ఉండాల్సిన అక్షరాలు: 7-16, 27-36, 47-56, 67-76.

ఇక, కంద పద్యం విషయానికొస్తే, కావలసిన గణాలు చతుర్మాత్రా గణాలు. ఉత్పలమాలలో, మొదటి పాదంలో మొదటి అక్షరం (గురువు), రెండవ పాదంలో 5వ అక్షరం తర్వాత వదిలేస్తే కంద పద్యానికి కావలసిన మొదటి రెండు పాదాలు వస్తాయి. వాటి గణాలు ఏమిటంటే: IIU IUI IIU, IIU IIU IUI UU IIU. అదే విధంగా, ఉత్పలమాలలో, మూడవ పాదంలో మొదటి అక్షరం (గురువు), నాల్గవ పాదంలో 5వ అక్షరం తర్వాత వదిలేస్తే కంద పద్యానికి కావలసిన తరువాతి రెండు పాదాలు, అవే గణాలతో వస్తాయి. ఉత్పలమాల లాగానే, కంద పద్యంలో కూడా, ప్రతి పాదంలో రెండవ అక్షరం ప్రాసాక్షరం. అంటే, ఉత్పలమాలలో ప్రాస నియమం ఉండ వలసిన అక్షరాలు: 2-22-42-62, 3-12-43-52.

కంద పద్యంలో యతి మైత్రి ఉండవలసిన అక్షరాలు, రెండు, నాలుగు పాదాల్లో, మొదటి అక్షరానికీ నాల్గవ గణం మొదటి అక్షరానికీ ఉండాలి. అంటే, ఉత్పలమాలలో మామూలుగా యతి మైత్రి ఉండ వలసిన అక్షరాలు: 1-10, 21-30, 41-50, 61-70, అదనంగా యతిమైత్రి ఉండవలసిన అక్షరాలు: 11-20, 51-60.

సంగ్రహంగా చెప్పాలంటే, ఉత్పలమాల కడుపులో ఒక కంద పద్యాన్ని ఒక తేటగీతి పద్యాన్ని కూర్చాలంటే, ప్రాస నియమం పాటించాల్సిన అక్షరాలు: 2-22-42-62, 3-12-43-52, యతిమైత్రి ఉండ వలసిన అక్షరాలు: 1-10, 7-16, 11-20, 21-30, 27-36, 41-50, 47-56, 51-60, 61-70, 67-76. అలా, భ, ర, న, భ, భ, ర, వ గణాలతో నాలుగు పాదాలూ, మూడు పద్యాలూ కూడా అర్థవంతంగా ఉండేటట్లుగా వ్రాస్తే గర్భకవిత్వం అవుతుంది. పైన చెప్పిన విధంగా వ్రాసిన 80 అక్షరాల ఉత్పలమాల పద్యం, దానిలో గర్భితమైన 52 అక్షరాల తేటగీతి పద్యం, 46 అక్షరాల కంద పద్యం క్రింద ఇవ్వబడ్డాయి.

ఉ.
ఈ మనుజన్మలో హితము నీయని నైజము హేయమే నయా,
కామన తోడనే జటిల కర్మలు, బాధలు చాల చూచియున్,
వే మననంబుచే వగచి, వేదన పద్యపు బాణి జెప్పె, తా
వేమనయే కదా, రసిక విశ్వము నందభి రామమూర్తియై.

(ఈ మానవ జన్మలో హితము నివ్వని స్వభావము నీచమైనదేనయా. సంకల్పంతోనే, చిక్కులున్న పనులు, బాధలు చాలా చూసి, అనేక విధాలైన (త్వరిత గతిని) చింతనతో దుఃఖించి తన పరితాపాన్ని పద్యపు బాణిలో చెప్పిన వాడు, సహృదయ లోకంలో అందరికి ప్రియమైన వ్యక్తిత్వము ఉన్న వేమనయే కదా.)

కం.
మనుజన్మలో, హితము నీ
యని నైజము హేయమే నయా, కామనతో
మననంబుచే వగచి, వే
దన పద్యపు బాణి జెప్పె, తా వేమనయే.

(మానవ జన్మలో హితము నివ్వని స్వభావము నీచమైనదేనయా. సంకల్పంతో, చింతనతో దుఃఖించి తన పరితాపాన్ని పద్యపు బాణిలో చెప్పిన వాడు, వేమనయే.)

తే.గీ.
హితము నీయని నైజము హేయమేన,
జటిల కర్మలు బాధలు చాల చూచి,
వగచి వేదన పద్యపు బాణి జెప్పె,
రసిక విశ్వము నందభి రామమూర్తి.

(హితము నివ్వని స్వభావము నీచమేనా. చిక్కులున్న పనులు, బాధలు చాలా చూసి, దుఃఖించి తన పరితాపాన్ని పద్యపు బాణిలో సహృదయ లోకంలో అందరికి ప్రియమైన వ్యక్తిత్వము ఉన్న వాడు చెప్పెను.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here