[dropcap]అ[/dropcap]మ్మా నేను రాను ఆ లోకంలోకి
అమ్మా నన్ను రమ్మనకు ఆ పాప కూపంలోనికి
ఈ నీ చిన్న గర్భమే నా బడి నా గుడి
అమ్మా ఈ స్వర్గంలోనే నేనుంటాను
నన్ను పొమ్మనకమ్మా ఆ పాపిష్టి లోకంలోనికి
భయమట భయమట భయమట భయమట
బ్రతుకగ భయమట బలిచేతురట
ఆడబిడ్డకు అన్నింటా భయమట
ఇంటా బయటా రక్షణ లేదట
బడిలో భయమట బజారున భయమట
గుడిలోభయమట మడిలో భయమట
ఇరుగూ పొరుగూ అన్నాభయమట
గుట్టుగ వున్నా ఇంటనూ భయమట
వయసూ వరసా వదిలేశారట
పాప భీతినే పాతేశారట
కంచే మేస్తోందట కనికరమొదలి
తోడుజన్మయే తోడేలంటా
తోటి ఆడదీ శత్రువుయేనట
బంధు వర్గమే రాబందులు అంటా
అమ్మా నేనురాను ఆ లోకంలోకి
పాపకూపమౌ ఆ నరక కూపంలోకి
వెచ్చ వెచ్చటీ స్వర్గంలోనే
వుండనీయమ్మా దణ్ణంపెడతా
నీవచట వున్నంతవరకూ నేనిచటే వుంటా
కమ్మకమ్మనీ కబురులు వింటా