ప్రాంతీయ సినిమా -15 : డాలీవుడ్ కోసం ఘాలీవుడ్

0
9

[box type=’note’ fontsize=’16’] “రాష్ట్రం ఏర్పడి దశాబ్దంన్నర అయినా ప్రభుత్వం సినిమా రంగాన్ని పట్టించుకున్నది లేదు. చివరికి 2015లో ఒక విధాన ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్ ఫిలిం డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసింది. కానీ ఈ కౌన్సిల్‌లో నిపుణులైన సభ్యులు లేక మూలన బడింది” అంటూ ఘర్వాలీ సినిమాలను విశ్లేషిస్తున్నారు సికందర్. [/box]

[dropcap]ఏ[/dropcap] ప్రాంతీయ సినిమా చూసినా తమ ప్రాంతానికో, భాషకో ‘వుడ్’ తగిలించుకుని కమర్షియల్ బాట పడుతున్నాయి. చూసే స్థానిక ప్రేక్షకులు కూడా అలాగే తయారయ్యారు. సమస్యల మీద అర్థవంతమైన సినిమాలు చూసే ఓపిక లేదు. చూసేందుకు అరచేతిలో ప్రపంచ సినిమాలన్నీ అరచేతిలో అలరిస్తూంటే, ఇక సినిమా అంటే ఫక్తు వినోదమేనని అర్థం జేసుకుని, ఆ అవగాహనతో స్థానిక సినిమాల్ని శాసిస్తున్నారు.

ఉత్తరాఖండ్ ఇంకా నయం. ఈ రాష్ట్రం ఎందరో కళాకారుల్ని బాలీవుడ్‌కి అందించింది. అనూష్కా శర్మ, లావణ్యా త్రిపాఠీ, అర్చనా పూరణ్ సింగ్, రిచా పనానీ, తిగ్మాంశూ ధూలియా, నవాజుద్దీన్ సిద్ధిఖీ, అలీ అబ్బాస్ జాఫర్, నిర్మల్ పాండే, దీపక్ దొబ్రియాల్… ఇలా పదుల సంఖ్యలో బాలీవుడ్‌లో పాపులరైన వాళ్ళున్నారు. కళాకారులు కాని ప్రజలు ఢిల్లీ వలస వెళ్లి హోటళ్ళలో పనిచేస్తారు. ఉత్తరప్రదేశ్ విభజిత రాష్టమైన ఉత్తరాఖండ్ 2000లో ఏర్పడింది. ఇక్కడి ప్రజలు హిందీయే మాట్లాడతారు. కాకపోతే ఘర్వాలీ, కామోనీ, ఝాన్సరీ అనే యాసలుంటాయి. డెహ్రాడూన్, ముస్సోరీ, రూర్కీ, హరిద్వార్, రిషికేశ్ వంటి ముఖ్య పట్టణాలున్నాయి. డెహ్రాడూన్ రాజధానిగా వుంది.

అయితే ఉత్తరప్రదేశ్ లో కలిసి ఉన్నప్పుడే ఇక్కడ ప్రాంతీయ సినిమాల నిర్మాణం ప్రారంభమయింది. 1983లో పరాశర్ గౌర్ పునాది వేశాడు. ఆయన తీసిన ‘జగ్వాల్’ అప్పట్లో ఘర్వాలీ యాసలో సంచలనం. అయిదు రూపాయల టికెట్టు వంద రూపాయలకు అమ్మారు. ఉత్తరాఖండ్ అంటేనే పర్వతాల మయమైన ప్రాంతం, అందుకని ఇక్కడి ప్రజల్ని పహాడీలంటారు. పహాడీలు తమ భాషలో, తమ విలువలూ సంస్కృతీ ప్రతిబింబించే ‘జగ్వాల్’ తీయగానే బ్రహ్మరధం పట్టారు. ఇందులో బాలీవుడ్ మసాలాలు లేవు గానీ, బాలీవుడ్ శైలిలోనే కుటుంబ కథ వుంటుంది. ఇంకా అప్పట్లో ఉదిత్ నారాయణ్, అనూరాధా పౌడ్వాల్‌లు గాయకులుగా ఎవరికీ తెలియరు. ‘జగ్వాల్’ లో వీళ్ళిద్దరూ పాటలు పాడారు. నటీ నటులందరూ స్థానికులే.

‘జగ్వాల్’ విజయం స్థానికుల దృష్టిని సినిమా నిర్మాణం వైపు మళ్ళించింది. తర్వాత అదే సంవత్సరం బిందేష్ నౌడియాల్ అనే కొత్త నిర్మాత, దర్శకుడు బాలీవుడ్ శైలిలోనే, ఘర్వాలీ భాషలో, ‘కభీ సుఖ్- కభీ దుఖ్’ తీశాడు. అయితే ఇందులో బాలీవుడ్ పచ్చి మసాలా ఎక్కువై పోయింది. విద్యార్ధులు సినిమా ప్రింట్లు తగుల బెట్టడానికి బయల్దేరారు. ఇందులో అత్తగార్ని తాగుబోతుగా, విలువలు లేనిదిగా చూపించడమే ప్రధాన అభ్యంతరం.

ఆయినా మరుసటి సంవత్సరం బిడి నౌటియాల్ అనే అతను ‘ఘర్ జవాయిన్’ అనే ఇంకో కుటుంబ సినిమా బాలీవుడ్ మసాలాల తోనే తీశాడు. అయితే ఇందులో పాటలు అద్భుతంగా వుండేసరికి తమ మనోభావాలు దెబ్బతినే సంగతి మర్చిపోయారు ప్రేక్షకులు. పాటలు పాడిన నరేంద్ర సింగ్ నేగీ తర్వాత పాపులర్ గాయకుడయ్యాడు.

ఘర్వాలీ యాసలో విజయాలు చూసి, కామోనీ యాసలో కూడా సినిమాలు తీయడం మొదలెట్టారు. మొదటి కామోనీ యాస సినిమా ‘మేఘా ఆ’ ని 1987 లో ఎస్ ఎస్ భిష్ట్ నిర్మాతగా, కాకా శర్మ దర్శకత్వంలో తీశారు. ఇది కూడా హిట్టవడంతో ఈ యాసలో సినిమాలు తీయడానికి బాట పడింది.

విచిత్రమేమిటంటే ఉత్తరాఖండ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్ళిన కళాకారులు ఎందరున్నా ఎవరూ మొదట స్థానిక ఘర్వాలీ, కామోనీ సినిమాల్లో నటించింది లేదు. ఆ ప్రయత్నాలు చేసింది లేదు. బాలీవుడ్ వెళ్ళే ఆలోచన వుంటే నేరుగా బాలీవుడ్ వెళ్ళిపోవడమే. ఉత్తరాఖండ్ నిర్మాతలు మాత్రం తమ పరిశ్రమకి ఘాలీవుడ్ అని పేరు పెట్టుకున్నారు. అయితే ఘాలీవుడ్ సినిమాలు రానురాను ఆదరణ కోల్పోతూ వచ్చాయి. ఇక్కడ ప్రాంతీయ సినిమా అంటే ఎప్పుడూ కూడా వాస్తవిక సినిమాలు తీసింది లేదు. అన్నీ కమర్షియల్ సినిమాలే బాలీవుడ్‌ని అనుసరిస్తూ. బాలీవుడ్ సినిమాలు సాంకేతికంగా ఊహించని ఎత్తులకు ఎదగడంతో వాటిని అనుసరించే ఘర్వాలీ, కామోనీ సినిమాల పని ఖాళీ అయింది. థియేటర్‌లు మూతబడుతూ వచ్చాయి. ప్రధాన పట్టణాల్లో మల్టీప్లెక్స్ సంస్కృతి వచ్చింది. బాలీవుడ్, హాలీవుడ్ సినిమాల ప్రదర్శనలు వూపందుకున్నాయి. ప్రేక్షకులు అటువైపు తరలిపోసాగారు.

 

 

 

 

 

 

 

 

 

రాష్ట్రం ఏర్పడి దశాబ్దంన్నర అయినా ప్రభుత్వం సినిమా రంగాన్ని పట్టించుకున్నది లేదు. చివరికి 2015లో ఒక విధాన ప్రకటన చేసింది. ఉత్తరాఖండ్ ఫిలిం డెవలప్‌మెంట్ కౌన్సిల్‌ని ఏర్పాటు చేసింది. దీని అధ్యక్షుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి. మూతబడ్డ థియేటర్లని తెరిపించడం, టూరిస్టు కేంద్రాలని, షూటింగ్ స్పాట్స్‌ని అభివృద్ధి చేయడం, మౌలిక సదుపాయాల కల్పన చేపట్టడం వంటివి కార్యక్రమాలు. కానీ ఈ కౌన్సిల్‌లో నిపుణులైన సభ్యులు లేక మూలన బడింది.

నిర్మాతలు ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయాలు చేసి తమకి వసతులు, రాయితీలు కల్పిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ సహకారంతో ఘాలీవుడ్‌ని ఎప్పుడెప్పుడు అద్భుతమైన డాలీవుడ్ (డెహ్రాడూన్) గా చూసుకుంటామా అని కళ్ళు కాయలు చేసుకుని నిరీక్షిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here