గతించని గతం-5

0
8

[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]

[dropcap]ని[/dropcap]ద్ర మనిషికి వరం లాంటిది, శరీరాన్నీ, మనసునీ, చుట్టూరా ఉన్న ప్రపంచాన్నీ తాత్కాలికంగా అయినా మరిపిస్తుంది.

ఈ కాస్త సుషుప్తే లేకుంటే మనిషి బ్రతుకు మరీ నరక ప్రాయమయ్యేదేమో? ఆదమరిచి నిద్రించిన క్షణం మేనుకి సంపూర్ణంగా దొరికిన విశ్రాంతది.

రాజేంద్ర వచ్చి మంచం ఎక్కుతుంటే నాకు మెలకువ వచ్చింది. అప్పటికి పొద్దు పొడిచింది. వాని మొహం పీక్కుపోయి లంకణాలు చేసిన వాడిలా అనిపించాడు. లేచి కాలకృత్యాలు తీర్చుకుని బయటకు నడిచాను. కిందకి దిగి నాలుగడుగులు వేస్తుండగా సుజాత కనిపించింది. దగ్గరగా వెళ్ళాక మాట్లాడుకుంటూ ఆమె ఇంటి వరకు నడిచాము.

“ఇంటిలోకి పోయి రావాలి” అంది.

తలూపాను.

నన్నూ లోనికి రమ్మంది. హాల్లోకి వెళ్ళగానే పేపర్ చూస్తున్న పెద్దమనిషి వాలుకుర్చీలో కనిపించాడు.

“డాడీ” అని పిలిచి నన్ను చూపి పరిచయం చేసింది. నమస్తే చెప్పాను. కూర్చోమన్నాడు. స్వచ్చమయిన తెలుగు మాట్లాడాడు రావు గారు. నాకు సంతోషం అనిపించింది. తెలుగు నేల గుర్తులని ఓ గంట దాకా నెమరువేసుకున్నాము. వయస్సు అంతరం ఉన్నా… సరదాగా మాట్లాడాడు.

టిఫిన్‌కి లోనికి రమ్మంది సుజాత. నాకు మొహమాటం అనిపించినా తప్పలేదు. నేను బయటకు వస్తూ సెలవు తీసుకుంటుంటే “ఓ యంగ్ మాన్ అప్పుడప్పుడూ వస్తూ ఉండు” అన్నాడు రావు గారు. వినయంగా తలూపి గేటు దాటి స్కూల్‌కి వెళ్లాను.

నేను క్లాస్ రూమ్‌కి వెళ్ళగానే నాకో లెటర్ వచ్చిందని ఇచ్చారు. డా. పాండే రాసి ఉంటాడనుకుని తీసుకున్నాను. నేను మధ్య మధ్య రెండు ఉత్తరాలు రాసినా సమాధానం మాత్రం రాలేదు. ఇప్పుడు రాసాడంటే ఏదో విశేషముంటుదని విప్పాను.

“శివా….! నీ రెండు ఉత్తరాలు అందినవి. సమాధానం రాయాలని అప్పుడనిపించలేదు. శివుడూ….. ఉత్తరం కాదు నిన్ను చూడలనిపిస్తుందయ్యా. త్వరలో ఒక సారి నీదగ్గరకు వస్తాను. నీతో ఒకటి రెండు రోజులు అన్నీ మరచి గడుపుతాను.

ఇదిగో ఒక విషయం. నేను ఆరునెలల పాటు విదేశాలకు వెళుతున్నాను. జర్మనీకి. నా ప్రయత్నం అక్కడ ఫలిస్తుందనే ఆశ ఉంది. జర్మన్ శాస్త్రజ్ఞులు భూమిపై ప్రేతాత్మలు ఉన్నాయనీ తిరుగుతుంటాయని, అవి సంభాషించుకుంటాయని కూడా వారు ఒప్పుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో నిజమని నిరూపించారు కూడా. ఇంకా ముందుకెళ్ళి మనం కూడా వాటితో సంభాషించవచ్చు అంటున్నారు. నేను అక్కడకి వెళుతున్నాను, నా అనుభవంలో జరిగిన – లోకం నమ్మలేని నిజాన్ని – నిజంగా నిరూపించాలి. అంతా సవ్యంగా జరిగితే. నేను వినతతో సంభాషించగలనేమో? ఆశ.

మరో సంగతి. నాలుగు నెల క్రితం ఇక్కడ నాకు సుమిత్ర అనే డాక్టర్‌తో పరిచయం అయ్యింది. ఆవిడ వివాహిత. భర్త ఉన్నాడు. కానీ ఆవిడ దగ్గర లేడు. మెంటల్ హాస్పటల్‌లో ఉన్నాడు. ఈ సుమిత్రను ఇష్టపడి పెళ్ళాడాడు. నాలుగైదు నెలల కాపురం తరువాత ఆయనకెందుకో చిత్తచాంచల్యం ప్రారంభమయ్యింది. త్వరిత గతిన ముదిరింది. అన్ని పరిధులనూ మించి చేసే జబ్బది. బాత్రూంలోకెళితే మూడు గంటలుండటం. తిండి తింటే అందరికి వండినంత తినేయడం. నిదురించినా మేలుకున్నా ముప్పై గంటలు పైనే. రాత్రి పక్క ఎక్కినా సుమత్రని పక్క దిగనియ్యక పోవడం, తను చెప్పినట్లు వినడం లేదని గొంతు పిసికే ప్రయత్నం చేయడం, ఈ పరిస్టితి భరించలేక ఆధునిక వైద్యం పూర్తయ్యాకా మెంటల్ హాస్పిటల్‌కి పంపాల్సి వచ్చింది. అక్కడ వారం దినాలు వారు అన్ని పరీక్షలు పూర్తిచేసి పిచ్చని తేల్చారు. అక్కడే ఉంచేసుకున్నారు. ఇది జరిగి నాలుగు సంవత్సరాలయ్యింది. వైద్య శాస్త్రం ప్రకారం అతనిలో ఏ మార్పూ రాలేదు. అనుభవజ్ఞుల అభిప్రాయం ప్రకారం బాగవుతాడనే ఆశ తొంబై శాతం నిర్ణయించారు. ఈ మద్యన స్విడ్జర్లాండ్ నుండి ఒక స్పెషలిస్ట్ వస్తే చూపారు. ఆయన పేషంట్‌ని పరిశీలించి ఒక అభిప్రాయం చెప్పాడు. ఇదే స్థితిలో ఆనతి కాలంలో చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పాడు.

నాకున్న పరిచయంతో సుమిత్రను ఓదార్చే ప్రయత్నం చేసాను. నా బ్రతుకున జరిగినదానిని కూడా వివరంగా చెప్పాను. నా ఓదార్పులో కొంత స్థిమితపడింది. నాతో అప్పటినించి ఆత్మీయంగా మెలగసాగింది. ఇప్పుడది చనువుగా మారి ప్రేమగా రూపొందిందేమో?

అయితే నాలుగు రోజుల క్రితం ఆవిడే ప్రపోజ్ చేసింది. విన్నాను. వినత గుర్తులోకొచ్చింది. మనస్సు చంచలంగా పరిగెత్తింది. స్థిమిత పడింది. సుమిత్ర అభిప్రాయంతో ఏకీభవిస్తే… అని కూడా అనిపించింది.

ఇది వినతకు ద్రోహం చేయడం కాదు కదా? కాదనిపించింది. కనుక సుమిత్రలో వినతను చూస్తున్నాను. మానసికంగా ఇద్దరం దగ్గరయ్యాము. ఆవిడ ఆత్మీయతలో కొంత ఊరట లభించింది. నేను జర్మనీ వెళ్ళేలోపే వీలు చూసుకుని మేమిద్దరమూ వస్తాము. ఇంకా ఏమయినా విశేషాలు గట్రా ఉంటే వ్రాయి. నీ ఉత్తరం కోసం మాత్రం ఎదురుచూడను. రాస్తుంటాను.

— డా. దేశ్ పాండే.

ఉత్తరం పూర్తయ్యాక వినత మనసులో కొచ్చి బాధ అనిపించింది. సుమిత్ర మనసున్న మనిషి లాగానే అనిపించింది. తనూ కష్టంలో నుంచి వచ్చిన మనిషే కదా! ప్రేమనూ ఆదరణనూ కోరుకొనడం దురాశయితే కాదు. నేను తెల్లవారే ఉత్తరం రాసాను.

“చేస్తున్న పనిన స్థిరచిత్తం ఉన్నప్పుడు చేసేయ్యడమే. మన నమ్మకమే మన మంచికి పునాది. సుమిత్రను అడిగానని చెప్పండి.

— శివుడు.

***

ఆవేళ స్కూల్‌కి వెళ్ళాలనిపించలేదు. తలారా స్నానం చేస్తాను. కళ్ళు మూసుకునిపోయే అంత మగత వచ్చింది. మరో ఆలోచన లేకుండా నిద్రపోయాను. నాకు మెలకువ వచ్చేసరికి పొద్దు గూకింది. నేను లేస్తుంటే తెలుగు మాటలు వినిపించినాయి. ఎవరయి ఉంటారని అటుగా చూసాను. సన్నటి ఎర్రటి రివటి లాంటి మనిషి టినోపాల్ తెలుపులో స్వచ్ఛంగా కనిపించాడు. మాట్లాడే విధానం బాగాలేదు. నేను బాత్రూంలో జొరబడి బయటకు వచ్చినా ఓ లావుపాటి వ్యక్తితో ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. లావుపాటి అతను టినోపాల్ తెలుపు వాగ్ధోరణికి దిమ్మరపోయి స్పృహ తప్పబోతున్నాడు. ఇదేదో బాగాలేదనుకుని మద్యన దూరి, “అసలు మీరెవరు? ఏం చేస్తుంటారు?” అని అడ్డగించాను.

లావుపాటి అతను ఒక అంగలో నా ముందుకు వచ్చి “అయితే మీరు తెలుగు వారేనా?” అని విప్పారినట్టుగా మొహం పెట్టాడు. వివరాలడుగుతూ తల ఊపాను. నా వివరాలు చెపుతూ “మీరెక్కడ ఉంటున్నారు?” అని ఎదురెళ్ళాను.

గుక్క తిప్పుకోకుండా బయోడేటా అంటా చెప్పాడు. అతని పేరు రామారావని, ఉండేది మహిం వెనక రోడ్ నందున్న శ్రీ సినిమా హాల్ లైన్‌లో మొదటి మలుపు తీసుకోగానే మూడో ఇల్లని.

“ఏం చేస్తుంటారు?” అన్నాను, చెప్పాలన్నట్టు చూస్తూ.

దీనికి సరయిన సమాధానం చెప్పలేదు రామారావు. సెలవు తీసుకుని వెళుతూ “మీరు ఒక్క సారయినా నా ఇంటికి రావాలి” అన్నాడు. తల ఊపాను అలాగే అని.

కిందికి దిగాను. సుజాత బజార్ నుండి వస్తూ దూరాన కనిపించింది. ఆమెకోసం ఆగాను. దగ్గరగా వచ్చి “ఇవ్వాళ రాలేదు అంది.

నా దగ్గర సమాధానం లేదు. నన్ను పరిశీలనగా చూసి “కళ్ళెమీటి అంతగా ఉబ్బి ఉన్నవి. అంతలా నిద్రపోయారా?” అని నవ్వింది.

నేనూ నవ్వాను. ఇంటి వైపుగా నడుస్తున్నామిద్దరము.

“కాఫీ తాగుదామని కిందికి వచ్చాను” అన్నాను.

ఆగి నాతో స్కూల్ విషయాలు చాలా మాట్లాడింది. రామోజీ అని కొత్తగా వచ్చిన టీచర్ అందరి విషయాలలోనూ అనవసరంగా జోక్యం చేసుకుని లేనిపోని చికాకుగా తయారయ్యాడని చెప్పింది.

“మనం మనకు చేతనయిన పద్దతిన ఎదుర్కొందాం” అన్నాను.

“ఎలా?” అంది.

ఇంతలో మా ఎదురుగా ఒక టాక్సీ వచ్చి ఆగింది. దానిలోంచి పసిబిడ్డను చేతనుంచుకుని రాణి దిగింది. గబగబా దగ్గరకు వెళ్లి బాబును నా చేతుల్లోకి తీసుకున్నాను.

“బొత్తిగా నల్లపూసవయ్యావు” అంది నిష్ఠూరంగా.

“ఆదర్శ గృహిణి వయ్యావుకదా, నిన్ను బాబును చూడాలనే ఆలోచన ఉంది. భగవదనుగ్రహం వలన నువ్వే కనిపించావ్” అని అంటూ రాణిని పరీక్షించి చూసి “ఒక్క సంవత్సర వ్యవదిలో ఆడాళ్ళు ఎంతలా మారిపోతారో నిన్ను చూస్తే చాలు అర్థమవుతుంది” అన్నాను.

మనస్ఫూర్తిగా నవ్వింది.

సుజాతను పిలిచి రాణికి పరిచయం చేసాను. “నా ఖాళీని భార్తీచేసిన ఆవిడ ఈమెనన్నమాట!” అంది రాణి. “సుజాతా జాగ్రత్త… ఇతనికంటే చాపకిందికి వచ్చే నీళ్ళు నయం” అంది.

సుజాతా రాణి ఇద్దరూ నవ్వుకున్నారు.

“రాజేష్ ఎలా ఉన్నాడు” అన్నాను బాబును ముద్దు చేస్తూ.

“ప్రమోషన్ వచ్చింది. రెండు నెలలలో కలకత్తా వెళ్ళాలి, మా ప్రయాణం లోపు తప్పక ఒకసారి రా.”

“అంతకంటేనా” అన్నాను బాబును తనకు ఇస్తూ.

“నువ్వు కనిపిస్తేనే ఆగాను. ఇహ వెళతాను” అని టాక్సీ ఎక్కింది.

రాణి వెళ్లక “మీరు ఇంటి దాకా వస్తారా?” అంది సుజాత.

“వస్తాను. మంచి కాఫీ దొరుకుతుంది కదా.”

“కాఫీ కోసమయితే వస్తారా?” అంది.

“అలా చెప్పాను కానీ రావాలనే ఉంది. ఇప్పటికి నాలుగు సార్లు మీ వెంట నడుస్తూ కనిపించడం మీ నాన్న గారికి రుచించక నా కాళ్ళతో నేను నడిచే భాగ్యాన్ని తీసేయిస్తారేమో” అని అంటుండగా…

ఆగి విరగపడి నవ్వింది. కళ్ళలో నీరు ఉబికేంత నవ్వది. అలా నవ్వుతూనే ఆవిడ నడుస్తుంటే…. నేను ఆ నవ్వును మనస్ఫూర్తిగా ఆస్వాదించాను.

సుజాత ఇంటికి చేరుకున్నాము. రావు గారు లేరు. పనిపిల్ల మాత్రం కనిపించింది. నాలుగు నిమిషాల్లో కాఫీ తెచ్చి ఇచ్చింది సుజాత. తాగాను. కమ్మటి అనుభూతి కలిగింది. కప్పు కింది పెడుతుండగా రావుగారు బయటనుండి వచ్చారు. లేచి నిల్చోని విష్ చేసాను. మనస్సున కొంచం బెదురనిపించింది. ఒకసారి నన్ను చూసి ఓ క్షణం ఆగి గుర్తులోకి తెచ్చుకుని “ఓర్ని నువ్వటోయ్… ఇప్పుడే వచ్చారా? సుజాత లోపలే ఉంది కదా” అని లోనకి నడిచారు.

నాకు తిరిగి కూర్చోవాలనిపించలేదు. నెమ్మదిగా నడక ప్రారంభించాను. సుజాత ఇంతలో బయటకు వచ్చి “వెళుతున్నావా?” అంది,

ఆగి “నేనా? ఎటు వెళుతున్నాను” అన్నాను సుజాత వైపు తిరిగి.

“ఏమయిందయ్యా నీకు” అంటూ దగ్గరకు వచ్చింది.

“వాతావరణం ఇంత చల్లగా ఉంటే ఒళ్ళంతా చెమటేమిటి? నాన్నగారిని చూసా? నీకేమయినా పిచ్చా? ఆయన్ని పులనుకుంటున్నావా? రా…” అంది నిండుగా నవ్వుతూ.

తిరిగి వచ్చి మళ్ళా యథాస్థానంలో కూర్చున్నాను.

“ఇవ్వాళ ఏదయినా సినిమాకెళదామేం?” అంది.

నాకు వెళ్ళాలనిపించకపోయినా ఆమాట అనలేదు.

“పది నిముషాల్లో వస్తాను, ఉండు” అని టైం చూసుకుంటూ లోనకి వెళ్ళింది. వెంటనే బయటకు వచ్చి “ఇదిగో, అక్కడ టాయ్‌లెట్ ఉంది వెళ్లి ఫ్రెష్ అయ్యి రా” అంటూ లోనకి వెళ్ళిపోయింది.

ఆవిడ బయటకి వచ్చేసరికి అరగంట పట్టింది. ఇద్దరం కలిసి దగ్గరలో ఉన్న శ్రీ థియేటర్‍కి వెళ్ళాము. ఆల్‌ఫ్రెడ్ హిచ్‍కాక్ సైకో సినిమా అది. సినిమా బాగుంది. భయము అనిపించింది. అయితే విశ్రాంతి టైంలో ఓ అపరిచిత వ్యక్తితో నాకు పరిచయం అయ్యింది. విశ్రాంతి అప్పుడు నేను బయటకి వచ్చి యురినల్ వైపుకు మళ్ళడంతో లోపలినించి వస్తూ నా కాలు తగిలి బొక్కబోర్ల పడేంతగా రెండు మొగ్గులు మొగ్గాడు. నేను గబుక్కున పట్టుకుని ఆపాను. థాంక్స్ చెప్పాడు కృతజ్ఞతగా చూస్తూ.

నా కాలే అలా అతను మొగ్గటానికి కారణం అన్నది గమనించలేదుగా ఉంది. ఒకరినొకరం తెలుసుకున్నాం, పలకరించుకున్నాం.

‘పి.యం. భేది’ అని పేరు. మోహన్ స్టూడియో లోని కెమెరా డిపార్ట్‌మెంట్‌కి హెడ్. అతను చాలా సరదా అయిన మనిషిలా అనిపించాడు. షూటింగ్ చూసేందుకు రమ్మని అన్నాడు.

“పార్ట్ టైం జాబ్ లాంటిది మీ స్టూడియోలో ఏదయినా దొరుకుతుందా?” అని అడిగాను మాట సందర్భంగా.

“ఉద్యోగమా” అని నా వైపు చూసాడు. నాపై అప్పటివరకూ ఉన్న మంచి భావన తరిగినట్టు అనిపించింది.

“ఉద్యోగాలుండవు అని చెప్పను కాని అక్కడ ఉద్యోగాలిచ్చే అధికారం మాత్రం నాకు లేదు” అని నవ్వి, “కావాలంటే నా దగ్గర అప్రెంటిస్‌గా పెట్టుకోగలను, రెండు నెలల వరకు జీతం ఇవ్వరు. తిండి పెట్టి సాదర ఖర్చులు ఇస్తారు” అన్నాడు.

విని తలూపాను. అక్కడ నుంచి విడిపోయాము. హాల్ లోకి వెళ్ళి కూర్చున్నాను. సినిమా పూర్తయ్యింది. లాడ్జ్‌కి వచ్చిన దాకా మాటాడుకునే సందర్భమూ రాలేదు. మౌనానికి కారణమూ కనిపించలేదు.

బై అని విడిపోయాము.

నాలుగైదు రోజుల తరువాత మోహన్ స్టూడియోకి వెళ్లాను. భేదిని కలిసాను. సాదరంగా మాట్లాడి నా అప్లికేషన్ వ్రాయించి తీసుకున్నాడు. “ఒకటో తారీకు నుంచి రా, ఎక్కువగా రాత్రి షిఫ్ట్‌లు చేయాల్సి వస్తుంది. బత్తా ఇస్తారు. చాయ్ పానీ చూసుకుంటారు. రాత్రి ఏడుగంటల నుంచి పన్నెండు గంటల వరకు డ్యూటీ ఉంటుంది” అన్నాడు.

నేను తలూపాను. లోకల్ ట్రైన్ పట్టుకుని మహీంలో దిగాను. రామారావు గుర్తులోకొచ్చాడు. కలిసి వెళదామనిపించింది. అతను చెప్పిన అడ్రస్ ప్రకారం శ్రీ సినిమా హాల్ వెనక్కు వెళ్లి రామారావు కోసం వాకబు చేసాను. అంత త్వరగా అంతుపట్టలేదు. ఒకతను కలిస్తే అడిగాను.

“మా బాస్ రామారావా సర్?” అని అడిగాడు నన్ను చిత్రంగా చూస్తూ.

అర్థం కాకున్నా తలూపాను. శుభ్రంగా తీసుకువెళ్ళి ఆయన ఉన్న గది చూపాడు. గడప దాకా వెళ్ళగానే ఆ గదిలోని దృశ్యం నాకంతగా రుచించలేదు. రామారావు బాగా తాగి ఉన్నాడు. అతని ఒళ్ళో ఓ ఆడపిల్ల కూర్చొని ఉంది. అరమోడ్పు కనులతోనే మత్తులో ఉన్నా ఆవిడ అవయవాలను అతని చేతులు ఆగక తడుముతున్నాయి. ఆవిడకా స్పర్శ కితకితలు పెట్టినట్టుగా ఉందేమో? ఆగక సన్నగా నవ్వుతోంది. నవ్వుతున్నప్పుడు శరీరంలో కదిలే కదలికలను గమ్మత్తుగా చూస్తూ నిండా ఆనందిస్తున్నాడు.

గడపన నన్ను చూసి ఒళ్లోని పిల్లని పక్కకు నెట్టి “ఓ మీరా? ప్లీజ్ కం. ఇలా వచ్చి నా పక్కన కూర్చోండి” అన్నాడు.

లేచి వెళుతున్న ఆ అమ్మాయి నన్ను అదోలా చూస్తూ వెళ్ళిపోయింది.

ఓ రెండు నిముషాలు కూర్చుని “ఇటుగా వచ్చాను. ఒకసారి మిమ్మల్ని చూసి పలకరించి పోదామనిపించింది” అని ఇప్పుడు ఇతనితో మాట్లాడేది ఏముంటుంది అనుకుని “వీలువెంట మళ్ళీ కలుస్తానేం” అంటూ లేచాను.

“పరవాలేదు” అన్నాడు, కానీ బాధపడ్డాడు. ‘తప్పక ఏదో ఒక రోజు వస్తాన’ని చెప్పి బయటకు నడిచాను. లాడ్జ్‌కి వచ్చి పడుకున్నాను.

ఆ తరువాత రామారావు గురించి తెలుసుకున్నాను. మహీం ఏరియాలో కాపుసారా (గుడుంబా) కాసి అమ్మే వాళ్లకు ఇతను నాయకుడు. ఈ వ్యాపారంలో ఏ ఒడిదొడుకులు లేకుండా ఒక్క రామారావు మాత్రమే పదిహేను సంవత్సరాలుగా నడిపిస్తున్నాడట. పోలీసులు ప్రొహిబిషన్ వాళ్ళు కూడా అతనితో పేచీకి దిగటానికి జంకుతారట. పోలీసులకు ప్రొహిబిషన్ వాళ్లకు నెలకి ఇన్ని కేసులని అతనే స్వయంగా అప్పగిస్తాడట, కోర్టున ఫైన్ కట్టి అతనే విడిపించుకుని వెళతాడట. మొత్తానికి ఈ రకమయిన బడుగు వర్గాలకు కావలసినవాడు, అయిన వాడునూ. పెళ్లి పెటాకులూ లేనివాడు. చాలా జల్సాగా బతికేవాడు. లొంగడం అనేది అతనెరగడని అంటుంటారు. తనంతట తాను ఎవ్వరి జోలికి పోడట. అనవసర దర్పాలూ ఇష్టపడడట. తానేమో తన వాళ్ళేమో తన వ్యాపారమేమో ఒక గిరి గీసుకుని దాన్ని దాటాడట. చెడు స్మృతి లాంటిదయితే కాదతని బ్రతుకు. చెడు వ్యాసంగంలో చెడు అనబడే వ్యాపారంలో ఉన్నాడు. అంతే.

***

నాకెందుకో ఆ మరునాడు కూడా స్కూల్‌కి వెళ్లాలని అనిపించలేదు. మంచం దిగలేదు. ఆ సాయంత్రం సుజాత లాడ్జ్‌కి వచ్చింది. కూర్చోమన్నాను.

“అలా ఉన్నావే” అడిగింది.

“బాగానే ఉన్నాను నాకేం” అన్నాను.

“స్కూల్‍కి రాలేదేం” అని అడిగింది.

“రావాలని అనిపించలేదు.”

“మీ ఊరు, మీ వాళ్ళు గుర్తులోకొచ్చారా?” నిజానికి సుజాత అడిగాక హఠాత్తుగా గుర్తుకొచ్చారు. నన్ను పూర్తిగా మర్చిపోయి ఉంటారేమో?

“సుజాతా నువ్వు గుర్తు చేశాకనే మా వాళ్ళ ధ్యాస నాలో మెదిలింది. మనసున అల్లరి ప్రారంభమయ్యింది. అంతా చిందర వందర. అసలెందుకు బయలుదేరాను. దీనికో గమ్యమంటూ లేదు కదా. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నాన్న, తమ్ముడు, నన్ను నమ్మి కాపురానికి వచ్చిన ఇల్లాలు….” కళ్ళ వెంట నీరు కమ్మింది.

నన్ను గమనిస్తున్న సుజాత నా ఆలోచనలను అప్పటికి ఆపాలని “శివా….. మనస్సు బాగున్నట్టు లేదు. అలా తిరిగొద్దాం రా” అంది.

అనాలోచితంగా లేచాను. దాదాపు రాత్రి తొమ్మిది గంటలవరకు తిరిగాము. నిజంగానే బాధ చాలావరకు తగ్గినట్టు అనిపించింది.

“ఏదయినా సినిమాకెళితే” అంది. సరేనంటూ తలూపాను. కానీ, రెండవ ఆటకు సుజాతతో బాగుండదని అనిపించింది.

ఆటోని ఆపనే ఆపింది సుజాత. వద్దని చెబుదామనుకుంటూనే ఆమె వెంట ఆటో ఎక్కాను. దగ్గరలో ఉన్న సినిమా హాల్‌లో ఆటో ఆగింది. ఆటోకి పైసలు ఇస్తుంటే ఆపాను. ఏమిటన్నట్టు చూసింది.

“ఇప్పుడు సినిమాకి వెళ్లకపోతే ఏం?” అన్నాను. విచిత్రంగా చూసింది. అక్కడే చెప్పవచ్చును కదా అనే భావన సుజాత కళ్ళలో కనిపించింది.

“ఇప్పుడు టైం ఎంత?”

“తొమ్మిది” అంది వాచ్ చూసుకుంటూ.

“మన స్కూల్ ఎన్ని గంటలకు వదులుతారు?”

“ఐదు.”

“రాత్రి పన్నెండున్నర దాకా ఆడపిల్ల ఇంటికి రాకుంటే ఇంట్లోని వారి పరిస్థితి ఎలా ఉంటుంది?”

“అవును. కనీసం చెప్పి రాలేదు. నాన్నగారు ఇప్పటికే చూస్తుంటారు. ఫోన్ చేస్తా” అంది.

“వద్దు వెళ్దాం” అన్నాను. అదే ఆటోలో వెనక్కు మళ్ళాము. నన్ను లాడ్జ్ దగ్గర దింపి వెళ్లిపోయింది ఆటోలో. మనస్సు పిండినట్టయ్యి తలంతా నాదుగా ఉంది. మంచంపై చెప్పులయినా విడవకుండా పడుకున్నాను. క్షణికమయిన ఆలోచనలతో ముందూ వెనకా చూడక ఇంటిని-ఇల్లాలిని వదలి దేశదిమ్మరిగా మారడమేమిటి? ఇది ఎందరిని మనస్తాపానికి గురిచేసి ఉంటుంది? వారిని భాదించే హక్కు నాకెక్కడిది? ఇలా తెగని ఆలోచనలు. ఏ ప్రశ్నకూ సమాదానం దొరకని స్థితి.

ఒక్క క్షణాన జుట్టు పీక్కుని బజార్ల వెంట పరిగెత్తాలనిపించింది. గబుక్కున లేచి కూర్చున్నాను. రాజేంద్ర మెట్లెక్కి వస్తూ కనిపించాడు. అతన్ని చూసేందుకే మనసు ఒప్పుకోలేదు. వచ్చిన రాజేంద్ర బిస్తరు సర్దుకుటున్నాడు.

‘ఎక్కడిక’ని అడిగాను అతన్ని చూడకుండానే.

‘వెళ్ళాలి’ అన్నాడు.

నేను గుడ్డలు మార్చుకుని వచ్చేసరికి వెళ్ళిపోయాడు,

ఆ తెల్లార్లు అనేకసార్లు మెలకువ వచ్చింది. నిద్రలేచి స్నానం చేసి కిందికి దిగాను. పొద్దు పొడుస్తుంది. సిటీబస్ స్టాప్ దగ్గరకు వెళ్లేసరికి సుజాత కనిపించింది.

పలకరించాను. “ఇప్పుడే ఇంటికెళ్ళి వస్తాను ఉండూ” అంది.

వచ్చాక ఇద్దరం స్కూల్‌కి వెళ్ళాము. నాతో ఏమి చెప్పలేదు కాని సుజాత చాలా సంతోషంగా కనిపించింది.

స్కూల్ ముగియగానే బయలుదేరాను. సుజాత మధ్యానమే వెళ్ళిపోయిందట. నాతో మాట మాత్రంగా కూడా చెప్పలేదు.

ఆ రోజు సాయంత్రం రెండు రొట్టెలు తిని స్టూడియోకి వెళ్లాను. గూర్కా నన్ను లోనికి రానీయలేదు. చిన్నతనంగా అనిపించింది. చీటీ పై పేరు రాసి భేది సాబ్‌కు పంపాను. పది నిముషాల తరువాత పాపం ఆయనే వచ్చి లోనికి తీసుకెళ్ళాడు.

“ఇవ్వాళ నుంచే పనిలో చేరుతున్నాను” అన్నాను నడుస్తూ. నవ్వాడు.

ఎందుకంటే ఇంకా ఒకటవ తేదీకి సమయం ఉంది. నన్ను రెండవ ఫ్లోర్ లోకి తీసుకెళ్ళాడు. అక్కడ కెమెరా అసిస్టెంట్‌లకు నన్ను పరిచయం చేసి “ఇవ్వాల్టి నుంచి మీతో ఉంటాడు” అని చెప్పాడు.

ఆ సెట్ లో ప్రఖ్యాతులయిన ఇద్దరు తారలు పని చేస్తున్నారు. సెట్ అంటా హడావిడిగా ఉంది. కొద్ది సేపాగి, అక్కడినుంచి మూడవ ఫ్లోర్‌కి వెంటపెట్టుకుని వెళ్ళాడు. పూల తోట సెట్ వేసారు అందులో. షూటింగ్ జరుగుతున్నది. పక్కన పిల్ల కాలువ కూడా నడుస్తున్నది.

అంతా కృత్రిమం. కెమెరాకి సరిపడే పద్దతిన సెట్ ఉంది. లైట్లను చకచక మార్చేందుకు సెట్ పైనున్న చెక్కల మీద లైట్ బాయ్ కనిపించారు.

‘పంజా…. ఆ… టిల్ట్ ప్లీస్….టిల్ట్ అప్… ఆ… అంతే అక్కడ ఫిక్స్ అయ్యింది” అరుస్తున్నడొకడు.

కాంతిని కొలిచే మీటరు ఒకదానిని తీసుకుని హీరోయిన్ మొఖం పైన, డ్రెస్ పైనా కొంచం ఎడంగా ఉంచి లెక్కలు చేసుకుంటున్నాడొకడు.

ఇంతలో ‘డైరెక్టర్ సాబ్’ అంటున్నారిద్దరు ముగ్గురు. ఒకాయన చకచక లోనికి వచ్చాడు. ఆయన వెంట ముగ్గురు. వనంలో నిలబడి మేకప్ టచ్ చేసుకుంటున్న హీరోయిన్ డైరెక్టర్‌ని విష్ చేసింది మొహం అంతా నవ్వు పులుముకుని.

ఆయనేమో చేతినున్న కాగితంలోని నాలుగు డైలాగులని ఆవిడకు వినిపించి, ఎక్కడినుంచి ఎక్కడకు కదులుతూ ఎలా చేయాలో చెపుతూ కెమెరామెన్ వైపు చూసి ఒకసారి ఆవిడచేత చేయించి కెమెరామెన్‌తో కొద్దిసేపు మాట్లాడి సెట్ పరిసరాలను కొద్దిసేపు పరిశీలించి అక్కడక్కడ కొద్ది మార్పులు చేస్తూ…. కెమెరా నుంచి తను చూసుకుని ‘ఒకేనా’ అన్నాడు.

తల ఊపాడు కెమెరామన్. హీరోయిన్‌కి సైగ చేసి రెడీ కమ్మని ‘సైలెన్స్’ అని అరిచాడు.

‘షాట్ రెడీ’ అన్నాడు. ‘లైట్స్ ఆన్’ అన్నాడొకడు. ‘క్లాప్ కొట్టేవాడేడి’ అని విసుగ్గా అనుకుని చుట్టూరా చూసి అతను కనిపించగానే ‘నువ్ రెడీగా ఉండ’మని చెప్పి అందరికీ సైగ చేసి షాట్ రెడీ అన్నాడు.

లైట్లు వెలిగినవి. కెమెరా కదిలింది. హీరోయిన్ కదిలింది. చెక్క పట్టుకున్న అతను ‘షాట్ నెంబర్ అని..’ చెప్పి చెక్క టాక్ అని కొట్టి తప్పుకున్నాడు. ఇంతా చేస్తే వనకన్య నడక డైరెక్టర్‌కు అంత తృప్తిగా అనిపించలేదు.

కట్ అని అరిచాడు. అందరూ ఆగారు. వెంటనే మేకప్‌మాన్ అద్దంతో తారామణి ముందుకు వెళ్ళాడు. ఆవిడ లిప్‌స్టిక్ సరిచేసుకుని మేకప్ చెరగకుండా చెమట అద్దుకుని, జుట్టు సవరించుకుని రెడీ అంది.

మళ్ళీ అందరిని రెడీ చేసి టేక్ అని క్లాప్ కొట్టగానే పునఃప్రారంభమయ్యింది. ఇలా నాలుగవ సారి కాని డైరెక్టర్ గారి మనస్సులోని అభిప్రాయానికి అనుగుణంగా షాట్ రాలేదు.

‘ఓకే’ అన్నాడు కుర్చీలో కూర్చుంటూ. నాకు పరమ చిరాకనిపించిది.

ఇంతటి కష్టం, ఇంత సమిష్టి కృషి, ఇంత ఖర్చు, ఇందరు టెక్నీషియన్లు, ఇందరు సహాయకులు…… అమ్మో అనిపించింది. లైట్ బాయ్ నుంచి డైరెక్టర్ వరకు ఇది నాపని అని చేయకుంటే నడిచేదిగా అనిపించలేదు. నటీనటుల పైన మాత్రం చులకన భావం ఏర్పడింది. ఇందరి సమిష్టి కృషికి కనిపించే బొమ్మలు వీరు. ఇలా ఉండాలి అని తపనతో చేసే ఈ బృహత్ కార్యాన వీరు విక్టిమ్స్.

కానీ మనకు సినిమా చూసేప్పుడు వీరు తప్ప మరేమీ కనిపించదు. అంతా వీరి చేతాళమే అన్న ప్రేమ ప్రేక్షకుడి మెదడును వదలదు. నిజానికి దర్శకుని చేతిలోని మట్టిముద్దలు వీరు.

అక్కడినించి బయటకి వచ్చాము. డిపార్టమెంట్ లోని మిగతా వారిని కూడా పరిచయం చేసాడు భేది. చివరకు రాము అనే సీనియర్ టెక్నీషియన్‌ను పరిచయం చేసి “ఇతను నా వాడు. ఎలా పని నేర్పుతావో?” అని అప్పగించాడు. తప్పకుండా అన్నాడతను సంతోషంగా.

రాము వయస్సు నలబై దాకా ఉండవచ్చు. పన్నెండేళ్ళుగా అక్కడ పని చేస్తున్నాడట. మరునాటినుండి వస్తానని చెప్పి లాడ్జ్‌కి వచ్చాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here