గీతార్థము

1
10

[dropcap]ఆ[/dropcap]రోజు ఆదివారము. అంతేకాదు వైకుంఠ ఏకాదశి. క్రిస్టమస్ కూడాను. చాలామందికి సెలవుదినము కాబట్టీ తమ ఇంట్లో ‘గీతాపారాయణం’ చేసుకుందామని పద్మ నిశ్చయించుకుంది. తన స్నేహితురాళ్లని, ఆ అభిరుచి ఉన్న తమ ఇంటి ప్రక్కన ఉంటున్న మరి కొందరిని పిలిచింది.

అందరూ ‘సరే’ అన్నారు. సుమారు ఇరవైమంది వస్తారని అంచనా వేసుకుంది. ఎందుకయినా మంచిదని మరొక అయిదుగురు కూడా వస్తారని అనుకుంది.

‘గీతాపారాయణం’ సుమారు నాలుగు గంటలసేపు అవుతుంది అనుకొని; ఉదయం తొమ్మిది గంటలకి ప్రారంభించినా, ఒంటిగంట అవుతుందనుకొని; ఫలహారంకోసం మరియు మధ్యాహ్నం లంచ్ కోసం ఆలోచించింది.

దగ్గర్లో ఉన్నకేటరర్స్‌కి బ్రేక్‌ఫాస్ట్‌కి – మనిషికి రెండు ఇడ్లీ ఒక వడ, రెండు పూరీ కూర మరియు లంచ్‌కి గోబీ మంచురియా, పులిహోర, బూరెలు, గుత్తి వంకాయి కూర, బెండకాయి వేరు సెనగపలుకుల వేపుడు, సాంబార్, అప్పడాలు, వడియాలు, పెరుగు మిరపకాయిలు, దోసకాయి ఆవకాయి, గోంగూర పచ్చడి, గులాబ్ జామూన్ ఆర్డర్ చేసింది. మధ్యలో దాహం వేస్తుందని ఫ్రూట్ జూస్ కూడా ఆర్డర్ చేసింది. ముందు రోజే ‘బుక్ సెంటర్’ నుండి గోరఖ్ పూర్ గీతా ప్రెస్ వారు ప్రచురించిన తెలుగు ‘భగవద్గీత’ తెలుగు లిపి కాపీలు 30 కిరణ్ చేత తెప్పించింది,

కిరణ్ పద్మ భర్త, ఒక ప్రముఖ విద్యా సంస్థనుండి గణాంక శాస్త్రంలో డాక్టరేట్, విశాఖపట్నంలో ఒక ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నత అధికారి.

అతని చదువుకి, ప్రతిభకి అవకాశం ఎదుగుదల ఉన్న ఉద్యోగం. ఆ సంస్థ ప్రముఖ ఉన్నతాధికారుల తలలో నాలుకగా వ్యవహరిస్తున్నాడు. తానొవ్వక, ఎవ్వరి మనసులను నొప్పించక అందరి మన్ననలు పొందుతున్నాడు.

‘తెలివి’, ‘చెలిమి’, ‘కలిమి’ ముగురమ్మల సుపుత్రుడు అంటే అతిశయోక్తి కాదు.

తాతగారు, తండ్రి ఇచ్చిన ఆస్తి, ఉద్యోగ్యరీత్య వస్తున్న జీతం, ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలలో వ్రాసే వ్యాసాలకు పారితోషకం, ఆకాశవాణి స్థానిక కేంద్రములో ప్రసంగించిన వ్యాసాలకు వచ్చిన డబ్బులు; ఆర్థికంగా ఎప్పుడూ ఇబ్బంది లేదు.

కిరణ్ పద్మ దంపతులకి ఇద్దరు కలవ పువ్వుల్లాంటి కవల పిల్లలు- అమ్మాయిలు. ఇద్దరు తెలివి తేటలతో, కష్టపడి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ డిగ్రీతో ఉత్తీర్ణులై, అమెరికాలో ప్రముఖ విశ్వ విద్యాలయంలో ఎం.ఎస్ చేసి; ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

అమ్మాయిలు దివ్య, విద్య అభీష్టం కాదనకుండా వారు ఇష్టపడిన వారి సహ ఉద్యోగులైన రాజేష్, ప్రకాష్‌లతో మూడు నెలల వ్యవధిలో వారి ఇద్దరి వివాహాలు జరిపించేరు. పెళ్లిళ్లు అంత సునాయాసంగా జరిపించినందుకు బంధువులు స్నేహితులు అశ్చర్యపోయేరు.

కిరణ్ తండ్రి జోగారావుగారు నాస్తికవాది. సోషలిస్ట్. నెహ్రూగారి పాలనలో వ్యతిరేక ఉద్యమం జరుగుతున్న రోజులలో జైలుకి వెళ్లవలసివచ్చింది.

కిరణ్ హేతువాది, మానవవాది. తండ్రి సరళ జీవన విధానం వంటబట్టింది. తీరిక సమయమంతా స్థానిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటాడు. కొన్ని సంస్థలలో కార్యనిర్వాహక సభ్యుడు కూడా.

కిరణ్ కి ప్రముఖ ప్రజా కవులు శ్రీశ్రీ, ఆరుద్ర రచనలంటే ఎనలేని అభిమానం, గౌరవం.

శ్రీశ్రీగారి సంస్మరణ సభలో ఒక కవితను

“పురాణ గాథల్లో జనించి గతించిన కల్పిత పాత్రలను

పురవీధులలో గోపుర ఆలయాలల్లో స్థాపించిన వికృత ప్రతిమలను

స్మరించే మూఢ భక్తులు పెరుగుతున్న ఈ రోజుల్లో

మరువకే మానవతని; కొనియాడవె మానవ ప్రగతిని సిరిసిరి మువ్వ!” అని నివాళి అర్పించేడు.

***

అదే రోజు కిరణ్‌కి స్థానిక జిల్లా గ్రంధాలయం ఆడిటోరియంలో ‘స్థానిక ఫిల్మ్ క్లబ్’ వార్షికోత్సవం సందర్భంగా; ‘సినెమాటొగ్రాఫర్స్: మార్కస్ బర్ట్లీ, కమల్ ఘోష్, అలోసీస్ విన్సెంట్-ప్రతిభ- తెలుగు చిత్రసీమలో వారి ప్రభ’ అనే శీర్షిక పై సోదాహరణ ప్రసంగం ఏర్పాటు చేసేరు.

తనకి సహాయంగా ఉండటంలేదని పద్మ కిరణ్‌పై విసుక్కుంటూనే ఉంది. ప్రొద్దుటే పద్మ లేచి పనిమనిషి జయ సాయంతో ఇల్లంతా శుభ్రం చేస్తుంటే ; కిరణ్ తన ల్యాప్‌టాప్‌లో తన ప్రసంగానికి తుది మెరుగులు దిద్దుకున్నాడు.

మార్కస్ బర్ట్లీ, కమల్ ఘోష్ మరియు అలొసియస్ విన్సెంట్ జీవిత చరిత్రలను క్లుప్తంగా పవర్ పోయెంట్‌లో తయారు చేసేడు. వారు తెలుగు సినెమాలలో చిత్రీకరించిన కొన్ని సన్నివేశాలను ఒక దృశ్యమాలికగా తయారు చేసాడు. స్నానం ముగించికొని, బ్రెడ్ టోస్ట్ చేసుకొని తిని, కాఫీ కలుపుకొని త్రాగి బయలుదేరేడు.

పద్మ తన స్నేహితురాళ్లు కోసం నిరీక్షించసాగింది. వచ్చిన వాళ్లకి టిఫిన్ కాఫీ అందించింది. కేవలం పదకొండుమందే వచ్చేరు. టైం పది అయింది. ఇక ఎదురు చూడడం అనవసరం అనిపించి ప్రారభించేరు, ‘గీతాపారాయణం’. తెలుగు కూడా సరిగ్గా రాని వారు కొందరు సంస్కృత శ్లోకాలు అచ్చు తప్పులతో, అపలు, అపస్వరాలతో ఇష్టం వచ్చినట్టు పాడుతున్నారు.

అక్కడ స్థానిక గ్రంధాలయం ఆడిటోరియం పూర్తిగా నిండిపోయింది. ఔత్సాహిక యువతి యువకులు, తెలుగు చిత్రసీమ అంటే అభిమానము ఉన్న ఉన్న వృధ్ధులు అందరూ వచ్చేరు.. స్థానిక ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి కిరణ్ బయోగ్రఫీ చదివి ప్రసంగం శీర్షిక వివరించేడు.

కిరణ్ మౌనంగానే పవర్ పోయింట్‌లో మార్కస్ బర్ట్లీ, కమల్ ఘోష్ అలోసియస్ విన్సెంట్ జీవ్త చరిత్రలు సంగ్రహంగా చూపించి;

మార్కస్ బర్ట్లీ చిత్రీకరించిన (యోగి వేమన చిత్రములోని “అందాలు చిందే”; షావుకారు చిత్రములో “పలుకరాదటే; పాతాళభైరవి చిత్రములో “ఎంత ఘాటు ప్రేమయో”; మిస్సమ్మ చిత్రములో “రావోయి చందమామ”, మాయాబజార్ చిత్రములో “లాహిరి లాహిరి లాహిరిలో”; అప్పుచేసి పప్పుకూడు చిత్రములో “ఎచటినుండి వీచెనో” ; జగదేక వీరుని కథ చిత్రములో “అయినదేమో అయినది”; గుండమ్మకథ చిత్రములో “సన్నగవీచే చల్లగాలికి”; పెళ్లిచేసి చూడు చిత్రములో “ఏడుకొండలసామి”) పాటలతో ఒక దృశ్యమాలిక ప్రదర్శించేడు.

కమల్ ఘోష్ ప్రతిభను విశ్లేషిస్తూ, అనార్కలి చిత్రములో “రాజశేఖరా”; మాబాబు చిత్రములో “బాబూ నిద్దురపోరా”; బభ్రువాహన చిత్రములో “నీ సరి వయ్యారులు”; బొబ్బిలియుద్ధం చిత్రములో “నినుచేరమనసాయెరా”; అభిమానం చిత్రములో “మధురానగరిలో”; శాంతినివాసం చిత్రములో “శ్రీరఘురాం జయరఘురాం”; గోవులగోపన్న చిత్రములో “ఆకాశములో హంసలమై”; శ్రీకృష్ణార్జునయుద్ధం చిత్రములో “మనసు పరిమళించెను”; “రోజులు మారాయి” చిత్రములో “ఏరువాక సాగారోయి” పాటల దృశ్యమాలికను ప్రదర్శించేడు.

విన్సెంట్ ప్రతిభను విశ్లేషిస్తూ; చండీరాణి చిత్రములో “ఓ తారక”, ఇల్లరికం చిత్రములో “నేడు శ్రీవారికి”; పెళ్లికానుక చిత్రములో “వాడుక మరచెదవేల”; కులగోత్రాలు చిత్రములో “చెలికాడు నిన్నే రమ్మని పిలువ”; జ్తోతి చిత్రములో “సిరిమల్లెపూవ్వల్లె నవ్వు”; అడవిరాముడు చిత్రములో “కోకిలమ్మపెళ్లికి”; ప్రేమనగర్ చిత్రములో “తేటతేట తెలుగులా”; ప్రేమలేఖలు చిత్రములో “ఇదితీయని వెన్నెల రేయి”; లేతమనసులు చిత్రములో “పిల్లలు దేవుడు”; భక్తప్రహ్లాద చిత్రములో “నమో నారసింహ” పాటల దృశ్యమాలిక ప్రదర్శించేడు.

ఫిల్మ్ క్లబ్ కార్యదర్శి శ్రీనివాస్ వచ్చిన వారందరికి కృతజ్ఞతలు చెప్పి కిరణ్ పరిజ్ఞానాన్ని, పరిశోధనకి; హర్షం వ్యక్తీకరిస్తూ; అంత చక్కటి ప్రదర్శనను అందించినందుకు ఫిల్మ్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియ చేసి; కిరణ్‌ని పూల గుత్తి, పళ్ల బుట్ట బహుకరించి; ఒక శాలువా కప్పి సత్కరించేరు.

“ప్రతిభ వారిది సత్కారం నాకు” అని చమత్కరించి; తనకి ఈ అవకాశం ఇచ్చినందుకు ఫిల్మ్ క్లబ్ కి వచ్చిన అభిమానులకి కిరణ్ కృతజ్ఞతలు తెలిపేడు.

***

కిరణ్ కారు ఎక్కుతుంటే శ్రీనివాస్ ఒక కవర్ అందించేరు. కవర్ విప్పి చూస్తే ‘వెయ్యి నూట పదహారు రూపాయిలు’ ఉన్నాయి.

అప్రయత్నంగానే కిరణ్ పెదవుల మీద చిరునవ్వు మెదిలింది. అందులో వంద రూపాయిల నోట్ తీసి డ్రైవర్ పైడిరాజుకి ఇచ్చేడు.

“కంకటాల షాప్ కి తీసుకెళ్లు” అని కిరణ్ చెప్పేడు.

షాప్‍కి వెళ్లి చీరల కౌంటర్లో “వెయ్యి రూపాయిలకి ఏదైనా మంచి బెంగాలీ కాటన్ చీర చూపించండి” అని కిరణ్ అడిగేడు.

సేల్స్ గర్ల్ చూపించింది. కనకాంబరం రంగులో ఉన్న చీర వెంటనే ఎంచి వెయ్యి రూపాయిలు ఖర్చు చేసి వచ్చేడు. అంత వేగంగా కొన్నందుకు పైడిరాజు ఆశ్చర్యపోయాడు.

దారిలో హౌసింగ్ కోలనీ దగ్గర ట్రాఫిక్ నిలిచిపోయింది. అక్కడ ఉన్న వెంకటేశ్వరస్వామి ఆలయం దగ్గర భక్తులతో కిటకిట లాడుతోంది. ఎవరో ఇద్దరు ‘పెద్దమనుషులు’ కారులు అడ్డంగా పార్క్ చేసేరు.

వాడిపోయిన అరటి పళ్లు, కల్తీ నెయ్యితో వత్తులు చిల్లర వ్యాపారస్తులు అమ్మేస్తున్నారు. బీట్ కానిస్టేబెల్ తన కమిషన్ తీసుకుని ఒక టీ స్టాల్ దగ్గర కూర్చుని టీ సేవిస్తున్నాడు.

తను ఏమైనా అదుపు చేయడానిక్ సహాయం చేయగలడేమోనని కిరణ్ కారు బయటకి వచ్చాడు. ఆలయం గట్టు మీదే కొందరు పూజారులు భక్తులని కూర్చోబెట్టి అర్థం తెలియని, అర్థం కాని శ్లోకాలు వల్లించి వారి దగ్గరనుండి దక్షిణ తీసుకొని మొలలో దాచేసుకుంటున్నారు. కిరణ్‌కి ఆరుద్రగారి కూనలమ్మ పదం “మంచి పెంచని భాష మనసు తెలపని భాష ఒట్టి సముద్రపు ఘోష ఓ కూనలమ్మ” మెదిలింది.

తిరిగి కారు దగ్గరకి వస్తుంటే పద్మకి అప్పుడప్పుడు వంటలో సహాయం చేసే సుందరమ్మగారు కనిపిపించేరు. భక్తులని యాచించుకోడం చూసి జాలి వేసింది. భర్త పిల్లల నిర్లక్ష్యానికి గురి అయిన అభాగ్యురాలు. పిలిచి తనకి ఇచ్చిన పూల గుత్తి, పండ్ల బుట్టా, శాలువా, చిల్లర నోట్లు పదహారు రూపాయిలు ఆమెకి ఇచ్చేసాడు కిరణ్.

ట్రాఫిక్ క్లియర్ అవడానికి ఒక గంట పట్టింది, కిరణ్ ఇంటికి వచ్చేసరికి ఒంటిగంట అయింది. పద్మ కిరణ్ మీద కారాలు మిరియాలు నూరసాగింది.

“ఫోన్ ఎందుకు తీసికెళ్లలేదు. అది పూజ చేయడానికా కొనుకున్నది. కరెంట్ పోయి అరగంట అయింది. అందరం ఉక్కబెట్టి చచ్చిపోతున్నాం! కరెంట్ ఆఫీస్ వాళ్లకి ఫోన్ చేయండీ” అని కిరణ్‌కి లెక్చర్ ఇచ్చింది.

కిరణ్ తన పలుకుబడి ఉపయోగించి ఒక లైన్ మెకానిక్‌ని ఏర్పాటు చేసాడు. ఆడవాళ్లు పట్టు చీరల్తో నానా అవస్థలు పడుతున్నారు.

వచ్చిన మెకానిక్ పేరు అబ్దుల్ రజాక్. నిచ్చెన ఎక్కి పోల్ మీద షార్ట్ సర్క్యూట్ అయిన చోట వైర్లు కలుపుతున్నాడు. అంతలో రెండు పందులు ఆ నిచ్చెనలో దూరి నిచ్చెన పడిపోయలా చేసాయి.

ఇంటికి కరెంట్ వచ్చింది కాని, అబ్దుల్ రజాక్ తలకి పెద్ద గాయం అయింది.. అదృష్టవశాత్తు కిరణ్ చిన్నాన్నగారి అబ్బాయి శ్రీరాం ఆ రోజు కె.జి.హెచ్ లో డ్యూటీ డాక్టర్. ఫోన్ చేసిన వెంటనే ఆంబులెన్స్ పంపించేడు.

కిరణ్ కూడా వెళుతుంటే “ముందు భోజనం చేయండి” అంది పద్మ. వినిపించుకోకుండా బయలుదేరేడు.

“మిగిలిపోయిన ఈ వంటలన్ని ప్రేమ సమాజంలో ఇచ్చేయండి. దారిలో జయని వాళ్లింటి దగ్గర డ్రాప్ చేయండి” అంది పద్మ.

దారిలో జయ కిరణ్‌ని అడిగింది: “బాబూ, మీరు భగవద్గీతని చదివేరా?”

“ చదివేను. ఎందుకు?”.

“అమ్మగార్లు చదువుతుంటే నాకు ఏమి అర్థం కాలేదు! అర్థం ఏమిటి బాబు?” అనడిగింది జయ.

“కాలానికి అనుగుణంగా మనం నడవాలి కాని కాలం మనకోసం ఆగదు, మారదు. మన ఎదుర్కొనే సమస్యలకంటే మనం ధైర్యవంతులం. మనకి మనమే మిత్రులం శత్రువులం. ప్రతీ మనిషిలో ఒక ప్రత్యేకత ఉంటుంది అంచేత మనం ప్రతి మనిషిని కాలాన్ని గౌరవించాలి” అని క్లుప్తంగా చెప్పేడు కిరణ్.

“మరి వాళ్లు నాలుగు గంటలు ఎందుకు చదివేరు”.

“సినెమాలో చూడు. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. మూడు నాలుగు గంటలు తరువాత ఎన్నో మలపులు త్రిప్పి పెళ్లి చేస్తారు, అలాగే ఇది ఒక కావ్యం. చదవ డానికి అంత సమయం పడుతుంది. భగవద్గీత చదవని లాయర్లు భగవద్గీత చదవని దోషులచేత భగవద్గీత పై ప్రమాణం చేయిస్తారు. దానికేమిటి గాని ఈ వంటలు అన్ని నువ్వు తీసుకుని మీ ఇంటి ప్రక్కన వాళ్లకి పంచి పెట్టేయి” అని జయని ఆ వంట సామానుని దించేసేడు కిరణ్.

***

కె.జి.హెచ్.లో శ్రీరాం ని కలసి “రజాక్ ఎలాగ ఉన్నాడు” అనడిగేడు కిరణ్.

“రక్తం చాలా పోయింది. రక్తం ఇంకా ఎక్కించాలి. రక్తం కోసం చూస్తున్నాము.” చెప్పాడు శ్రీరాం.

“ఏ గ్రూప్”

“ఓ ప్లస్”

“నాది ఓ ప్లస్. సరిపోతుందేమో చూడు.” అని ఆత్రుతగా అడిగేడు కిరణ్,

సరిపోవడంతో ఇవ్వడానికి సిద్ధపడ్డాడు కిరణ్.

పద్మకి ఫోన్ చేసాడు. పరిస్థితి వివరించాడు.

“మీకెందుకండి? ఆ బాధ తాపత్రయం. కె.జి.హెచ్ అంత మంచి హాస్పిటల్ కాదు. మీకేదయినా అయితే నేను అవస్థ పడాలి తరువాత.!” అని నిష్ఠూరంగా మాట్లాడింది పద్మ.

 “ఏం ఫరవాలేదు. మా చెల్లి రమ, బావగారు శర్మ ఇక్కడే చదివేరు. మా చిన్నాన్నగారి అబ్బాయి శ్రీరాం ఇక్కడే డాక్టర్. ఎంసెట్ లో ర్యాంక్లు వచ్చిన వారందరూ ఇక్కడే చదువుతున్నారు” అని ఫోన్ కట్ చేసాడు కిరణ్. రక్తం ఎక్కించి ఆపరేషన్ పూర్తి అయ్యేసరికి రాత్రి ఏడయ్యింది.

“ఇక ఏమి ఫరవాలేదు. రెండు రోజులు అబ్జర్వేషన్ లో ఉంచి డిస్చార్జ్ చేస్తాము” అని శ్రీరాం హామీ ఇచ్చాడు.

కిరణ్ ఇంటికి వచ్చిన వెంటనే రజాక్ భార్య నూర్జహాన్ స్వీట్స్ ప్యాకెట్ తో వచ్చింది.

కిరణ్ అశ్చర్యపోయాడు.

బాబుగారు, మీరు అల్లాహ్ లాగ వచ్చి రక్షించేరు..” అని కొనియాడింది.

“నేను చేసింది ఏమి లేదు. అంతా చేసింది డాక్టర్ శ్రీరాం’ అని అన్నాడు కిరణ్.

నూర్జహాన్ వెళ్లిపోయింది. ఆ స్వీట్ ప్యాకెట్ డ్రైవర్ పైడిరాజుకి ఇచ్చి “ఇక వెళ్లిపో” అని చెప్పేడు కిరణ్.

స్నానం చేసి అరటిపండు తిని పాలు త్రాగి; మర్నాడు మీటింగ్‌కి కావాల్సిన పేపర్స్ సర్దుకుని ప్రశాంతంగా నిద్ర పోయాడు.

ఏమి తోచక పద్మ టి.వి.లో – సాటి స్త్రీలనే అవమానించే సీరియల్స్‌లో ఏ సీరియల్ చూడాలో తెలియక రిమోట్ నొక్కుతూ సోఫాలో కూలబడింది.

కిరణ్ కోసం ఉంచిన ‘పులిహోర, బూరులు’ పద్మని చూసి జాలిగా నవ్వాయి.

@@@@@@

కని పెంచి పెద్ద చేసిన “అమ్మ” చరణ కమలాలకు ‘ఫణి’ నివాళి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here