లోతుల్లేని సినిమా ‘గెహరాయియాన్’

2
8

[dropcap]అ[/dropcap]మెజాన్ ప్రైమ్‍లో విడుదలయిన ‘గెహరాయియాన్’ (లోతులు) ప్రస్తుతం  సంచలనం సృష్టిస్తోంది. శకున్ బాత్రా దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మానవ సంబంధాలలోని వైచిత్రిని, వైరుధ్యాలను లోతుగా విశ్లేషించి ప్రదర్శించిన సినిమా అని కొందరు పొగుడుతున్నారు. దీపికా పడుకొనె అత్యద్భుతమైన నటన ప్రదర్శించిందని పొగడ్తలు వెదజల్లుతున్నారు. మరి కొందరు ఇంత విసుగెత్తించే చెత్త సినిమా మరొకటి లేదని విమర్శిస్తున్నారు. ‘సినిమాలో చూపించిన సముద్రం తప్ప లోతైనదేదీ ఈ సినిమాలో లేద’ని నిరాశ వ్యక్తపరుస్తున్నారు. ఈ సినిమా మెదడులో చేసిన గాయం తప్ప సినిమాకు సంబంధించి లోతైనదేదీ లేదని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇది పట్నానికి చెందిన పై తరగతి వారి మానసిక సమస్యలకు చెందిన సినిమా అని కొట్టేస్తున్నారు. దీనికి తగ్గట్టే, ఒక ప్రత్యేక భావజాలం, దృక్కోణం ఉన్న అర్బన్ విమర్శకులు సినిమాని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. మాస్ మసాలా ‘పుష్ప’ లాంటి సినిమాలకు అలవాటు పడ్డవారు ఇలాంటి ‘క్లాస్’ సినిమాలను ఆదరించటం కష్టం అని వ్యాఖ్యానిస్తున్నారు. వీటికి తోడు సినిమాలో విపరీతంగా ఉన్న ముద్దులు, స్త్రీ పురుషుల సాన్నిహిత్యాన్ని విపులంగా చూపించే దృశ్యాలు కొందరి విమర్శకు గురయితే, మరి కొందరి అభినందనలకి పాత్రమవుతున్నాయి.

ఇక సినిమాలో సంభాషణల్లో తండ్రి, తల్లి, కూతురు, స్నేహితుడు అన్న తేడా లేకుండా అందరూ విరివిగా, వాక్యానికి వందసార్లు ఎఫ్‍తో ఆరంభమయ్యే నాలుగు అక్షరాల బూతు పదాన్ని వాడేయడం, సినిమాలో హిందీ సంభాషణల కన్నా ఆంగ్ల సంభాషణలే అధికంగా ఉందడం కొందరు నిరసిస్తే, మరికొందరు ‘నేచురల్’గా ఉన్నాయి సంభాషణలని పొగుడుతున్నారు. ఈ రకంగా పరస్పర విరుద్ధము, వ్యతిరేకమయిన స్పందనలకు కారణమవుతున్న ‘గెహరాయియాన్’ సినిమాను ‘లోతు’గా విశ్లేషిస్తే సినిమాలో ‘లోతు’ లేకపోవటమే కాదు,  భారతీయీకరణం చేసిన హాలీవుడ్ సినిమా ఇది అని తెలుస్తుంది.

‘గెహరాయియాన్’లో కథ ఆధునిక విద్యావంతులయిన అప్పర్ క్లాస్ యువతీ యువకులకు సంబంధించినది. అలీషా (దీపికా పడుకొనె) యోగా నేర్పుతూంటుంది. ఆమె బాల్యం అంత ఆనందమైనది కాదు. తండ్రి పట్టించుకోడు. తల్లి  వైవాహిక సంబంధంలో ఊపిరి ఆడడం లేదని ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో అలీషాకు తండ్రి అంటే ద్వేషం. ఆమె తన బ్రతుకు కూడా తల్లిలా ఎక్కడ ఊపిరి ఆడని సంబంధాలలో ఇరుక్కుని ఎటూ పోలేని జడపదార్థంలా అవుతుందేమోనన్న భయం మనసులో ఉంటుంది. అది ఇతరులతో ఆమె సంబంధాలను నిర్దేశిస్తూంటుంది. ఆమె కరణ్ అనే బాల్యమిత్రుడితో కొన్నేళ్ళుగా లివ్-ఇన్-రిలేషన్‍లో ఉంటుంది. అతడు రచయిత అవ్వాలన్న ప్రయత్నాలలో ఉంటాడు. దాంతో వారి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. వీరిద్దరి బాల్య స్నేహితురాలు, ధనవంతురాలయిన టియా (అనన్యా పాండే)కి జైన్ (సిద్ధాంత్ చతుర్వేది) అనే యువకుడితో పెళ్ళి కాబోతూంటుంది. ఆమె వీరిద్దరినీ తామిద్దరితో కొన్ని రోజులు గడపమని పిలుస్తుంది. అక్కడి నుండి అసలు సినిమా ఆరంభమవుతుంది.

నలుగురు కలిసినప్పుడు జైన్, అలీషాలు ఒకరివైపొకరు ఆకర్షితులవుతారు. జైన్  తన వ్యాపారం కోసం టియా డబ్బుపై ఆధారపడవలసి ఉంటుంది. కానీ అతని మనసు అలీషాపై ఉంటుంది. అలీషాకు తాను తన స్నేహితురాలికి అన్యాయం చేస్తున్నానని తెలుసు. కానీ ఆమె జైన్‍తో వివాహ సంబంధం కోసం ఒత్తిడి చేస్తూంటుంది. ఇంతలో అంతా సవ్యంగా సాగుతోందనుకుంటున్న సమయంలో జైన్‍కు వ్యాపారంలో కష్టాలు మొదలవుతాయి. అలీషా గర్భవతి అవుతుంది. వ్యాపారం నిలుపుకోవటం కోసం టియాతో ప్రేమ నటించక తప్పడు జైన్‍కు. కానీ అతడు తనని మోసం చేస్తున్నాడని ఉద్రేకానికి వస్తూంటుంది అలీషా. ఎవరికీ ఎదుటివారిని అర్థం చేసుకునే ఓపికా, తీరికలుండవు. ఎవరికి వారు వారి స్వార్థం, లాభం, వారి సౌఖ్యాలు చూసుకోవడంలోనే మునిగి ఉంటారు. అవసరమైతే ప్రేమ నటించి మోసం చేయటమే కాదు, ప్రేమిస్తున్న వారిని స్వార్థం కోసం హత్య చేయాలనుకునే స్వార్థం, కాపట్యం కూడా పాత్రలు ప్రదర్శిస్తాయి. ఆధునిక యువతీయువకులు దీర్ఘకాలిక సంబంధాల కన్నా, విలువల కన్నా, మనసుకన్నా ‘కెరీర్‌లో అభివృద్ధి’, ధన సంపాదనకే ప్రాధాన్యం ఇస్తారన్న ఆలోచనను ఈ సినిమా బలంగా ప్రదర్శిస్తుంది. అయితే, ఈ రకమైన ప్రవర్తన సామాజికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారిలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందన్న ఆలోచనను ఈ సినిమా ప్రదర్శిస్తుంది. ఇంకా మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి వారు కొన్ని ఆదర్శాలు, విలువలు, సంబంధాల పట్ల గౌరవం సంపూర్ణంగా కోల్పోలేదు. ఈ సినిమాపై నిరసనగా అధికంగా వీరినుంచే వస్తోంది.

సినిమాగా చూస్తే దర్శకుడి ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. స్క్రీన్‌ప్లే రచయితలు ప్రతి పాత్రను, పాత్ర వ్యక్తిత్వాన్ని ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్దటమే కాదు, వారి వ్యక్తిత్వాలను ఎస్టాబ్లిష్ చేసేందుకు చక్కని సన్నివేశాలను సృజించారు. కథలో మలుపులు, మెలికలు చక్కగా రూపొందించారు. సంభాషణలు మరీ పెద్దగా లేకుండా, చిన్నగా, విట్టీగా, పాత్రల ప్రవర్తనకు తగ్గట్టుగా ఉన్నాయి. ఎలాంటి సంక్లిష్టతా లేకుండా, గొప్ప గొప్ప సంభాషణల్లా కాకుండా చక్కగా సూటిగా ఉన్నాయి. నేపథ్య సంగీతం సందర్భోచితంగా ఉండి సంఘటనల మూడ్‍ను ఇనుమడింపజేస్తుంది. పాటలను సినిమా పూర్తవకముందే మరచిపోతాం. ఎందుకంటే సినిమా ప్రధానంగా థ్రిల్లర్ పంథాలో సాగటంతో దృష్టి సంఘటనలపైనా, సస్పెన్స్‌పైనా, పాత్రల మానసిక సంఘర్షణలపైనా ఉండటంతో పాటలు ఏదో ఉన్నాయి అన్నట్లున్నాయి తప్ప సినిమా గమనానికి ఏ మాత్రం తోడ్పడవు. ప్రాధాన్యం కూడా లేదు. సినిమాలో ప్రధానంగా చెప్పుకోదగ్గది కెమెరా పనితనం. దృశ్యం మూడ్‍ని ఇనుమడింప చేసే లైటింగ్, కెమెరా కోణాలతో, కెమెరా కూడా ఓ పాత్ర అయి సినిమా ప్రభావాన్ని పెంచుతుంది. పాత్రల మానసిక సంఘర్షణలను చేరువ చేస్తుంది. ఎడిటింగ్ ఉత్తమ స్థాయిలో ఉండి సినిమా ఊపును పెంచుతుంది. ముఖ్యంగా అలీషా అనుమానాలతో, ఒంటరితనంతో బాధపడుతూండటం, అదే సమయానికి జైన్, టియాలు సన్నిహితంగా ఉండటం, ఒకదాని వెంట ఒకటి చూపుతూ అలీషా ఉద్విగ్నత ఉన్మాదం స్థాయికి చేరటాన్ని కేవలం ఎడిటింగ్‍తో చూపించటం ఎడిటర్ నైపుణ్యానికి నిదర్శనం. పాతకాలంలో అయితే ఇప్పుడు ఎడిటర్ చేసిన పనిని ఓ పాట చేసేది. కానీ ఒక్క సంభాషణ లేకుండా దృశ్యాలను పారలల్ ఎడిటింగ్‌తో సాధించటం ప్రశంసనీయం. పారలల్ కటింగ్, క్రాస్ కటింగ్ టెక్నిక్‌లు ఈ సినిమాలో సృజనాత్మకంగా వాడటం అటు కౌశల్ షా కెమెరా పనితనానికి, ఇటు ఎడిటర్ నితేష్ భాటియాల ప్రతిభకూ, పనితనానికి; సినిమా సాంకేతికతపై అవగాహనకు నిదర్శనాలు. ఎగసిపడుతున్న కెరటాన్ని ప్రతీకాత్మకంగా వాడటం ప్రశంసనీయం. సినిమాలో ఇలా ఎగసిపడే కెరటం కనబడినప్పుడల్లా ఒకో అర్థాన్నిచ్చేట్టు రూపొందించాడు దర్శకుడు. అంటే, ఒక కోణంలో చూస్తే, ‘గెహరాయియాన్’ను ఉన్నత సాంకేతిక ప్రామాణికాలతో, సంక్లిష్టమైన మానవ సంబంధాలను విశ్లేషించి ప్రదర్శించాలని ప్రయత్నించిన సినిమాగా భావించవచ్చు. చివరికి అలీషాను గుర్తుపట్టే ముసలామె రంగప్రవేశం చేయటంతో పలు ప్రశ్నలను రేకెత్తిస్తూ, రెండవ భాగం ఉంటుందేమోనన్న ఆలోచనను కలిగిస్తుంది.

అయితే ‘గెహరాయియాన్’లో ప్రధాన లోపం సినిమాలో కొత్తదనం అన్నది లేకపోవటం. మొదటి దృశ్యం చూడగానే కథ మొత్తం తెలిసిపోతుంది. ‘ఏకవీర’ నవల మనకు పరిచయమే. ఎవరు ప్రేమ కథ రాసినా, తీసినా ఆ పరిధిలో ఒదగటం  తప్ప, దాన్ని దాటిపోలేదు. అందుకే, నలుగురు కలవగానే, మోసాలు, అక్రమ సంబంధాలు ఆరంభమయిపోతాయని ఊహించేస్తాం. హత్య కూడా ఊహకు అందుతుంది. హత్య చేయాలని వచ్చినవాడు, హత్యకు గురవటం ‘డయల్ ఎం ఫర్ మర్డర్’ నుంచి మనకు అలవాటే. అయితే, హత్య చేయించాలనుకున్నవాడు కానీ, చేసిన వాడు కానీ ఎలాంటి నేర భావనకు గురికాకపోవటం మనకు కొత్త. అంతే కాదు, తనను నమ్మిన స్నేహితురాలికి ద్రోహం చేసి మరీ తనను తాను కాపాడుకోవటం ఇంకా కొత్త. పాత కాలంలో ఇలాంటి పాత్రలు విలన్‍లు. ప్రస్తుతం ఇవే ప్రధాన పాత్రలు. ఏ ఒక్క పాత్రకూడా మనస్సాక్షి వున్నట్టు ప్రవర్తించకపోవటం, ఈ సినిమా ఉనంత సాంకేతికను వ్యర్ధం చేస్తుంది.

‘గెహరాయియాన్’ స్క్రిప్ట్  బాగనే ఉన్నా, స్క్రిప్ట్ దృష్టి ఏ అంశంపై ఫోకస్ కాకపోవడంతో, కథ అర్థవిహీనమైన మలుపులు తిరుగుతూంటుంది. కథ ఎటుపోతోందో, సినిమా ఏ వైపు పరుగెడుతోందోనన్న భావన కలిగిస్తుంది. విసిగిస్తుంది. ఇందువల్ల ఫలితమేమిటంటే, ప్రేక్షకుడు ఏ పాత్రతోనూ తాదాత్మ్యం చెందడు. ఏ పాత్రతోనూ ఐడెంటిఫై కాడు. దాంతో తెరపై జరుగుతున్నవి ప్రేక్షకుడికి ఉద్విగ్నత కలిగించవు, బాధించవు. ఏ పాత్రలోనూ స్వార్థం తప్ప మంచి లేకపోవటంతో, పైగా, ఇలాంటి కథలు అనేకం సినిమాలుగా రావటంతో ప్రేక్షకుడు జరగబోయేది ముందే ఊహిస్తాడు. తెరపై ఏం జరిగినా ఆశ్చర్యపోడు. నిర్లిప్తంగా చూస్తాడు. సినిమాలో నేర పరిశోధన అన్నదే లేక హాస్యాస్పదంగా అనిపిస్తుంది. అంటే ఒక వ్యక్తి తలచుకుంటే పోలీసులు నేర పరిశోధన ఆపేస్తారన్నమాట? ఒక వ్యక్తి నడి సంద్రంలో పడిచనిపోయాడు. అతను చనిపోయిన తరువాత అతనున్న పడవ క్షేమంగా ఒడ్డుకు ఎలా చేరింది? ఒడ్దుకు తెచ్చి ఎవరు దాన్ని భద్రంగా పెట్టారు? అన్న ప్రశ్న కనీసం పోలీసులు అడగకున్నా, జర్నలిస్టులో, అతని కాబోయే భార్యనో, బంధువులో అడగవచ్చుగా? ఎవ్వరూ అడగరు. ఇది స్క్రిప్టు రచనలోని ప్రధానలోపం.

దీపిక పాత్ర, తన స్నేహితురాలికి కాబోయే భర్త రెండు మాటలు మాట్లాడగానే పడిపోవటమే కాదు, భౌతిక సాన్నిహిత్యానికి సిద్ధమైపోతుంది. ఇక జైన్ పాత్ర హీరోనా, విలనా తెలియదు. ఒక వ్యక్తిత్వం అన్నది లేకుండా గాలి ఎటు వీస్తే అటు ఊగేవాడిలా అనిపిస్తాడు. కాబోయే మామ డబ్బుల్తో వ్యాపారం చేస్తాడు. అలీషా కనబడగానే ఆమె వెంట పడతాడు. మళ్ళీ డబ్బు అవసరం అవగానే టియా పాత్రతో ప్రేమ నటిస్తూ డబ్బులు లాగుతాడు. మోసం చేసి సంతకాలు పెట్టించుకుంటాడు. అలీషా గర్భవతి అయి పెళ్ళి చేసుకొమని ఒత్తిడి చేస్తుంటే ఆమెని చంపాలనుకుంటాడు. టియా పాత్ర ఎవరిని పడితే వారిని నమ్మే అమాయకురాలు. కరణ్ పాత్ర ఎందుకుందో అర్ధంకాదు. ఆ పాత్ర తీసేసినా నష్టంలేదు.   ఏ పాత్రకూ సరైన వ్యక్తిత్వం లేకపోవటం, కథ ఒక అంశంపై కేంద్రీకృతం కాకపోవటంతో, సాంకేతికంగా ఎంత ప్రతిభ ప్రదర్శించినా, సినిమా ప్రేక్షకులపై ప్రభావం చూపించలేకపోయింది. అటు ప్రేమ కథగా ఎదగలేక, ఇటు క్రైమ్ థ్రిల్లర్‌గా మిగలలేక, కనీసం ప్రేమలోని మానసిక సంఘర్షణలు లోతుగా చూపిన సినిమాగా కూడా పరిగణనకు గురికాక, ఏ లోతులో తెలియని లోతుల్లేని సినిమా మిగిలిపోయింది ‘గెహరాయియాన్’.

ఈ సందర్భంగా మన కళాకారులు ‘స్ఫూర్తి’ పొంది ఆ స్ఫూర్తిని భారతీయీకరణం చేయటంలో వైఫల్యం చెందటాన్ని ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది. సినిమా ఓ పది పదిహేను నిమిషాలవగానే కథ అర్థమయిపోవటమే కాదు, వూడీ అల్లన్ సినిమా ‘మ్యాచ్ పాయింట్’ గుర్తుకువస్తుంది. ‘మ్యాచ్ పాయింట్’లో ఓ రిటైరయిన టెన్నిస్ ఆటగాడు, తన శిష్యుడి సోదరితో ప్రేమలో పడతాడు. అంతలో శిష్యుడి ప్రేయసిని చూస్తాడు. ఇద్దరూ ఒకరివైపొకరు ఆకర్షితులవుతారు. ఓ వైపు శిష్యుడి ప్రేయసితో శారీరక సంబంధం కొనసాగిస్తూనే, అతడి సోదరిని వివాహమాడతాడు. ఇంతలో శిష్యుని ప్రేయసి గర్భవతి అవుతుంది. పెళ్ళి చేసుకోమని పోరుతుంది. దాంతో ఆమెని చంపేస్తాడు. ఇలా సాగుతుంది ‘మ్యాచ్ పాయింట్’ సినిమా కథ. మొదటి దృశ్యం నుంచి ‘మ్యాచ్ పాయింట్’తో పోలిస్తే, అక్కడ టెన్నిస్ ఆటగాడిని చూపించి నేపథ్యంలో అదృష్టం గురించి చెపితే, ఇక్కడ దీపిక పాత్రను చూపిస్తూ అదృష్టం గురించి నేపథ్యంలో చెప్తారు. దాన్లో టెన్నిస్ ఆటగాడు, దీంట్లో వ్యాపారి. దాంట్లోనూ మామగారిపై ఆధారపడతాడు. దీంట్లోనూ అంతే. గర్భవతి అయిన తరువాత ఉద్విగ్నత, ఒత్తిళ్ళు రెంటిలోనూ ఒకటే. ఆంగ్లంలో ఇంటి బయట వీధిలో ఆమె పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తే, హిందీలో అపార్ట్‌మెంట్ పార్కింగ్‍లో జరుగుతుందీ సంఘటన. ఇలా పోలుస్తూ పోతే ‘గెహరాయియాన్’లో మానవ సంబంధాల గురించి, మానవ మనస్తత్వంలోని కౌటిల్యం గురించి, కాపట్యం గురించి ఏమైనా అర్థవంతమైన సంఘటనలు ఉంటే  అవి హాలీవుడ్ నుంచి దిగుమతి అయి హిందీలో రూపాంతరం చెందినవి అని అర్థమవుతుంది. ఈ అనువాదంలో సంఘటనల్లోని ‘లోతు’ ఆవిరైపోయినట్టు అనిపిస్తుంది.

హాలీవుడ్ నుంచే కాదు ఇతర భాషలు, ప్రాంతాల సినిమాలను భారతీయీకరణం చేసేటప్పుడు ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటుంది. ఇతర ప్రేక్షకులకు సగటు భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రధానమైన తేడా ఉంది. ప్రధాన పాత్రలు దుష్టులయితే ఆ దౌష్ట్యాన్ని సమర్థించేందుకు ఏదో ఒక కారణం కావాలి. అలాగే ప్రధాన పాత్రలు ఎంత చెడ్డవయినా, వాటిలో ఏదో ఓ మంచి గుణం, సెంటిమెంట్ పరంగా కనబడాలి. లేకపోతే సగటు భారతీయ ప్రేక్షకుడు ఆ సినిమాను మెచ్చడు. ‘పుష్ప’ సినిమాలో అందరూ ఆ పాత్ర స్మగ్లరు అని దూషిస్తున్నా సగటు ప్రేక్షకుడు ఆ పాత్రను మెచ్చడంలో తోడ్పడిన అంశం ఒకటుంది. వాళ్ళమ్మను అవమానించిన వాడి ముఖాన డబ్బు కొట్టి, వాడు అవమానించినప్పుడు ఎవరెవరున్నారో వారందరి దగ్గరకు లాక్కెళ్ళి క్షమార్పణలు చెప్పిస్తాడు. కారు కొనగానే వాళ్ళమ్మను కారులో ఎక్కించుకుని తిప్పుతాడు. ఈ రెండు దృశ్యాలు చాలు ‘పుష్ప’ ఎలాంటివాడయినా, ప్రేక్షకులు మరిచి మెచ్చుకునేందుకు. ‘గెహరాయియాన్’లో అలాంటి దృశ్యాలు లేకపోవటమే కాదు, పాత్రలన్నీ సగటు ప్రేక్షకునికి అందనివి. సానుభూతి పొందలేనివి. అందుకే అర్బన్ విమర్శకులు, తెలివైన సినీ ప్రేమికులు ఎంతగా పొగిడినా సగటు ప్రేక్షకుడు ఆమోదించలేని, అభినందించలేని, లోతులేని మామూలు సినిమాగా మిగిలిపోతుంది ‘గెహరాయియాన్’. ఎంతగా ఆధునిక అప్పర్ క్లాస్ మానసిక సమస్యలను ప్రస్తావించే చిత్రంగా పొగడినా, సరిగా అంటుకట్టని, ఎదిగీ ఎదగక, అటు చెందక, ఇటు పొందలేక ‘రెంటికి చెడ్డ రేవడి’ లాంటి సినిమా ‘గెహరాయియాన్’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here