ఘండికోట బ్రహ్మాజీ రావు కథల్లో రైల్వే ప్రస్తావన

0
10

[శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు శతజయంతి ఉత్సవాలలో డా. చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి చేసిన ప్రసంగానికి ఇది వ్యాస రూపం.]

[dropcap]ఒ[/dropcap]కసారి రైల్వే ఉద్యోగి అయితే.. ఇక జీవితాంతం రైల్వే ఉద్యోగిగానే ప్రవర్తిస్తారని ఒక నానుడి. రచయిత రైల్వే ఉద్యోగి అయితే ఎలా ఉంటుందో, శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారి కథాసాహిత్యం విషయంలో చూద్దాం.

 నేను  రైల్వేలో  పనిచేస్తాను. తెలుగులో రచనలను చేస్తాను. అలాగని చెప్పి,   శతజయంతి జరుపుకుంటున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారితో పోల్చుకునే దుస్సాహసం మాత్రం చేయలేను; ఆయన సాహితీ సేవను విశ్లేషించనూ లేను. ఎందుకంటే, ఆయన సూర్యుడైతే, నేను హోరుగాలిలో రెపరెపలాడుతున్న, ఇప్పుడే వెలిగించబడిన ఒక దీపాన్ని. అందుకని, రైల్వే వాళ్ళకి వాడుకైన విషయాల గురించి మాత్రమే ముచ్చటిస్తాను.

తెలుగు భాషలో లెక్కకి ఎనభై ఆరు వ్రాసిన ఆయన కథల్లో, రైల్వే గురించిన షార్ట్-కట్ దొరుకుతుందేమో అని చూశాను. ఊహూ, రెండూళ్ళ పేర్లు, ఒక ప్లాట్‌ఫారం  నెంబర్. ఒక ఊరి పేరు నేను వాల్తేరులో పనిచేశాను కాబట్టి తెలుసు. రెండవది నేను చదివేదాకా అది ఊరి పేరని నిర్ధారణ కాలేదు .  ఎందుకంటే, నేను రౌర్‌కెలా-ఝార్సుగుడా సెక్షన్లో  పనిచేయలేదు కాబట్టి, ఆ గ్రామం ఆ ఊళ్ళ మధ్య ఉంది కాబట్టి!

రైల్వే, ఆయన కథల్లో దండలో దారంలా కలిసిపోతుంది; పాఠకులు గుర్తు పెట్టుకునేటంత ప్రముఖంగా ఉండదు; అలాగని, మరచిపోవడానికి వీలు కూడా ఉండదు. ఎందుకంటే, కొన్ని కథల్లో ముఖ్య ఘట్టాలు పరుగెడుతున్న రైళ్ళల్లో జరుగుతాయి. ఉదా: ‘ఆరోహణ-అవరోహణ’లో నాయిక భర్త నిర్లక్ష్యానికి కొన్ని ఉదాహరణలు, ఆమెను ఓదార్చే మనిషిని పొందడం, అన్నీ నడిచే రైల్లోనే జరుగుతాయి.

‘స్వామీజీ’ కథ నడిచే రైలుతో మొదలయ్యి, రైలు ప్రమాదం కలిగించిన వాళ్ళు పారిపోవడంతో ముగుస్తుంది. ‘చినిగిన కాగితాలు’ కథలో ముఖ్య పాత్రధారులు ఒక రైల్లో మొదటి తరగతి పెట్టెలోంచి దిగి, మరొక రైల్లో మూడవ తరగతి పెట్టె ఎక్కడం వల్ల కథ ముగింపు వైపు పరుగు తీస్తుంది. అలాగే, ‘కావేరీ సేతురామన్’ లో ముఖ్యపాత్రలు కలుసుకునేది నడిచే రైల్లో. అందునా పురుషులు ఎక్కరాని లేడీస్ బోగీలో. మళ్ళీ మనమెప్పుడూ చూసే బ్రాడ్ గేజీలో కాదండోయ్! ఒకప్పుడు ఎగ్మూరు నుండి వెళ్ళే మీటర్ గేజీ లైన్‌‌లో!

గ్రాండ్ ట్రంక్ ఎక్స్‌ప్రెస్‌లో కొత్త ఢిల్లీ నుండి తెనాలి వెళ్ళేలోపు జరిగే కథే ‘జనమేజయుడు’. నాగపూర్‌ స్టేషన్¬లో పెరుగువడల రేటు హెచ్చుగా ఉందని, అందులోని రెండు పాత్రలు, కాజీపేట స్టేషన్‌లో పూరీలతో కడుపు నింపుకుంటాయి. ఒకప్పటి పాంట్రీ కార్‌లలో డైనింగ్ ఏరియా ఉండేదని నాకు ‘మయూరాక్షి’ కథ చదివేవరకూ తెలియలేదు సుమీ! అక్కడే ముఖ్యపాత్రలు కలుసుకునే ఏర్పాటు చేశారు రచయిత.

భారతదేశంలో అత్యధికంగా ఉద్యోగులుండే డిపార్ట్‌మెంట్  రైల్వే అని మనందరికీ తెలుసు. వాళ్ళలో అతి పెద్ద అధికారి (బోర్డు ఛైర్మన్) నుండి చిన్న ఉద్యోగుల దాకా ఉంటారు. ఒకపరి మన రచయిత, వారిలో ఎంత మందిని, ఎలా మనకి పరిచయం చేశారో చూద్దాం. బోర్డు ఛైర్మన్, ఎప్రెంటిస్, అసిస్టెంట్ ఆఫీసర్, చీఫ్ ఇన్స్‌పెక్టర్‌లు ‘ప్రయోజకుడు’ లో దర్శనమిస్తే, సీనియర్ డివిజన్ సూపరింటెండెంట్, మెకానికల్ ఫోర్మన్, గుమస్తా (‘జీవన మాధుర్యం’) లో కనిపిస్తారు. ఇలా చూసుకుంటూ పోతే, రెండవ తరగతి అధికారులు, స్టేషన్ మాస్టర్, పాయింట్స్‌మన్, కపులింగ్ పోర్టర్  (‘చరముల కుసుమి శకుంతల’), నౌకర్లు, చాకర్లు తిరిగే పెద్ద బంగళాలో ఉండే రైల్వే ఆఫీసర్ (‘పెళ్లి చూపులు’), ఆగ్నేయ రైల్వేలో మెయిల్ డ్రైవరు (‘కార్తీక్’), ఇన్స్‌పెక్టర్ (‘రైళ్ళు మళ్ళా నడిచాయి’), పెర్సనల్ బ్రాంచిలో సీనియర్ క్లర్కు, స్టోర్స్ ఆఫీసరు, స్టోర్స్ ఇష్యూవర్ (‘మయూరాక్షి’), వెయిటింగ్ రూము బేరరు, పోర్టరు (‘ఎవరు బాధ్యులు?’), గార్డు (‘స్వామీజీ’), చీఫ్ ఇంజనీర్, సీనియర్ ఇన్స్‌పెక్టర్, గాంగుమన్ (‘చేయని తప్పుకు శిక్ష’), బాక్స్ బాయ్, బొగ్గింజను డ్రైవర్(లు) (‘ది గైడ్ డాగ్’, ‘పురుగు’), ప్యాసింజర్ ఇంజను డ్రైవరు, సూపర్‌వైజరు , ఫోర్మన్ దొరగారు, హాస్పిటలు (‘పురుగు’),  కండక్టర్ (‘ఆరోహణ-అవరోహణ’), టికెట్ కలెక్టర్ (‘నిజం మాత్రం చెప్పకండి’), ఓయస్ (అనగా ఆఫీసు సూపరింటెండెంట్), ఐ.ఆర్.టి.యెస్.ఆఫీసర్, సీనియర్ స్టెనో, జీప్ డ్రైవరు, సెలూన్ అటెండెంట్ (‘మిస్ నీహారిక’), ఫిట్టర్ (‘పురుగు’), పాంట్రీ కార్ బేరరు (‘జనమేజయుడు’) – ఇలా కథను బట్టి ప్రత్యక్షమవుతారు.

ఇక, రైల్వే ఆస్తిపాస్తుల గురించి ఎలా ప్రస్తావించారో చూద్దాం. రైళ్ళు, పట్టాలు చాలా కథలలోనే కనిపిస్తాయి.   ‘దొమ్మరి మేళం’లో నాయికా నాయకులు జనతా ఎక్స్‌ప్రెస్‌లో మామూలు బోగీలో ప్రయాణించినట్టు చిత్రించారు రచయిత. ‘కావేరీ సేతురామన్’ లో నాయకుడు ఆఖరి నిముషంలో రామేశ్వరం ఎక్స్‌ప్రెస్‌ ఎక్కుతాడు.

ఒక ఆవు, దూడ రైలు పట్టాలపై కలుసుకుని, గూడ్సు బండి చక్రాలకి బలవడం ‘చేయని తప్పుకు శిక్ష’లో మనం చూస్తాం. ‘స్వామీజీ’ కథలో ఆగంతకులు పట్టాలను పీకి పారేయడం వలన రైలు ప్రమాదానికి గురి అవుతుంది. ‘ఆరోహణ-అవరోహణ’లో రైలు తాలూకు ఇనుప చక్రాలు పట్టాలపై మద్దెలలు మంద్ర, మధ్యమ, తార స్థాయిలలో భేదాలు ప్రకటిస్తున్నట్టు రచయిత ఉత్ప్రేక్షించారు.

ఇంకా రైల్వే స్టేషన్లు (బోలెడన్ని కథల్లో), డ్రైవర్ల పెట్టెలు (‘ది గైడ్ డాగ్’), ట్రాలీ (‘మిస్ నీహారిక’, ‘రైళ్ళు మళ్ళా నడిచాయి’), టూరిస్ట్ వ్యాన్ (‘ప్లాట్‌ఫారం నెంబరు 15’), లెవెల్ క్రాసింగ్ (‘చేయని తప్పుకు శిక్ష’), టనెల్, రైల్వే ఉద్యోగుల క్వార్టర్లు, ట్రాక్షన్ స్తంభాలు, సిగ్నల్ బాక్సులు, కేబిళ్ళు (‘రైళ్ళు మళ్ళా నడిచాయి’), మెయిల్ డ్రైవరుకుండే లంకంత రైల్వే ఇల్లు (‘కార్తీక్’), స్టేషన్ మాస్టర్ గారిల్లు (‘ఆరోహణ అవరోహణ’), బంగళాలు (‘చరముల కుసుమి శకుంతల’, ‘పెళ్లి చూపులు’), గోదావరి మీద పాత బ్రిడ్జి (‘వారసులు(డు)’, కృష్ణా బ్రిడ్జి (‘జనమేజయుడు’), వెయిటింగ్ రూము (‘జీవన మాధుర్యం’), లోకో షెడ్డు (‘పురుగు’)- ఇలా ఎన్నో విషయాలను పాఠకులు తెలుసుకోవచ్చు.

రైల్వేని నమ్ముకుని బ్రతుకుతెరువు ఏర్పాటు చేసుకున్న వాళ్ళని గురించి ‘ప్లాట్‌ఫారం నెంబరు 15’, ‘కార్తీక్’ కథల్లో మనం తెలుసుకుంటాం.

రైల్వేలో ఎక్కువగా వినబడే మాటలు, చేయబడే చేష్టలు- ప్రమాదం తరువాత రైల్వే లైన్‌ని పునరుద్ధరించడం (‘బాగ్దేహి’), పంచ్యువాలిటీ, బయటి వాళ్ళు ఎవరూ లోపలకి రాకుండా ఆఫీసర్లు రెడ్ లైట్ వెయ్యడం, నైట్ ఇన్స్‌పెక్షన్, ఇంజను మీద ప్రయాణం (దాన్ని మా పరిభాషలో ‘ఫుట్ ప్లేటింగ్’ అంటాం ), ఇంజను పడిపోయిన ఎంక్వయిరీ, ఆకస్మిక తనిఖీ, తత్సంబంధిత బదిలీలు, సస్పెన్షన్లు (‘మిస్ నీహారిక’), పనిష్మెంట్ పోస్టింగులు (‘చరముల కుసుమి శకుంతల’,  ‘రైళ్ళు మళ్ళా నడిచాయి’), క్రమశిక్షణా చర్యలు, వాటి పర్యవసానాలు (ప్రమోషనుకి అర్హత కోల్పోవడం కూడా) (‘చేయని తప్పుకి శిక్ష’), బోర్డుకి వెళ్ళవలసిన స్టేట్మెంట్లు (‘ప్రయోజకుడు’)- ఇవన్నీ తెలుసుకోవాలంటే ఘండికోట వారి కథలు చదివాలి మరి!

రైల్వే పరిభాషలో మరో నానుడి ఉందండోయ్.. ఒక రైల్వే ఉద్యోగి రైల్వే నుండి దూరం కావచ్చు గానీ, ఆ ఉద్యోగి నుండి రైల్వే ఎప్పటికీ దూరమవదు, అని. ఈ విషయం ఘండికోట వారి రచనలు చదివిన వారికి ప్రస్ఫుటంగా తెలుస్తుందని వేరే చెప్పనక్కర లేదనుకుంటాను!

శ్రీ ఘండికోట బ్రహ్మాజీరావు గారి శతజయంతి సందర్భంగా ఆయన చేసిన సాహితీసేవకి నా నమస్సులు అర్పిస్తున్నాను.  వారి రచనల్లో రైల్వే ప్రతిఫలించిన విధానాన్ని విహంగ వీక్షణంగా చేసిన ఈ పరిశీలన ఆ మహా రచయితకు నేను అర్పిస్తున్న నివాళి.

నమస్కారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here