ఘటన!

12
8

[dropcap]అ[/dropcap]ది త్రేతాయుగం. అయోధ్యానగరంలో శ్రీరాముడు కొలువు తీరి ఉన్నాడు. అంతలో భటులు చాకలి తిప్పడిని సభలో ప్రవేశ పెట్టారు. ఆకర్ణాంతర నేత్రుడు శ్రీరాముడు విషయమేమిటని కళ్లతోనే ప్రశ్నించాడు.

“ప్రభూ! ఈ చాకలి తన భార్యను ఇంటినుంచి గెంటి వేయడమే గాక, పరుల ఇంట ఉండి వచ్చిన భార్యను ఏలుకోవడానికి నేనేమీ వెర్రిబాగుల రాముణ్ని కాదని వదరుతున్నాడు. ఇతడి ప్రేలాపన విని ప్రజలంతా ఒకటే గుసగుసలు. ఇతడిని కఠినంగా శిక్షించండి ప్రభూ!” చెప్పాడు భటుడు.

శ్రీరాముడు అది విని ఖిన్నుడయ్యాడు. అయినా గంభీరంగా “అతడు చెప్పింది నిజమేనా?” సూటిగా తిప్పడిని ప్రశ్నించాడు శ్రీరాముడు.

“నిజమే మారాజా! నా ఇంటిది రెండు రోజులపాటు ఎవరింట్లోనో ఉండి వచ్చింది. నేనెట్టా ఒల్లకుంటాను. బట్టలు మురికయితేనే నాకు అసయ్యం. తెల్లగా ఉతికిగాని కట్టుకోను. అట్లాంటిది మైలపడ్డ ఆడదాన్ని ఏలుకుంటానా? మడిసిని, బట్టలాగా శుభ్రం చెయ్యలేం కదా? మీకంటే గొప్ప మనసుంది. నాకంత గొప్ప మనసులేదు” అన్నాడు తిప్పడు కుండ బద్దలు కొట్టినట్లుగా.

వచ్చే ఆవేశాన్ని నిలువరించుకుంటూ “సీత అగ్ని ప్రవేశం చేసింది” చెప్పాడు శ్రీరాముడు.

“అగ్నిప్రవేశం చేసిందని మీరు చెపుతున్నారు. ఆ అగ్ని ప్రవేశాన్ని నేనే కాదు, ఈ అయోధ్యా వాసులెవరూ చూడలేదు. కట్టుకున్న ఆడది పరాయివాళ్ల ఇంట గడిపి వస్తే నేనే కాదు, ఎవరూ తిరిగి ఏలుకోవడానికి ఒప్పుకోరు” అంటూ “మీలో ఎవరైనా అట్లా ఒప్పుకుంటారా” అంటూ సభలోని వారివైపు ప్రశ్నార్థకంగా చూశాడు తిప్పడు.

శ్రీరాముడు కూడా ఏమంటారో అని అందరివంకా చూశాడు. సభలోని వారంతా మౌనంగా తలలు వంచుకున్నారు.

శ్రీరాముడి హృదయం ముక్కలైంది. “ఇతణ్ణి వదిలేయండి” అంటూ శ్రీరాముడు నిస్సత్తువగా లేచి ఏకాంతమందిరంవైపు నడిచాడు.

***

తిప్పడు, తానెంతో నిక్కచ్చిగా, నిర్భయంగా, నిజం మాట్లాడానన్న అదోరకం గర్వంతో, ఉన్మత్తతతో రొమ్ము విరుచుకుని ఇంటివైపు నడిచాడు. అంతలో ఆగనంటూ అతడిలో ఆలోచన మొదలైంది. ‘తన ఇంటిదాని మీద ఎంత ప్రాణం పెట్టాడు. కానీ చివరికి ఎలాంటి పనిచేసింది. ఆడబుద్ధి చంచలమైంది’.

ఇల్లు వచ్చేసింది. బోసిపోయి, బోరుమంటున్న ఇంటిని చూడగానే తిప్పడిని విచారం, నీరసం కమ్ముకున్నాయి. తల్లి గదిలో ఓ మూల అటువైపు తిరిగి పడుకుంది. తన మాట వినకుండా కొడుకు, కోడల్ని గెంటేశాడని ఆమెకు కోపం, బాధ.

వంటింట్లో వంటగిన్నెలు ఎక్కడివక్కడ అలాగే ఉన్నాయి. తల్లి అన్నం తినలేదని అర్థమైంది. నిద్రపోతోందా? తను వెళ్లి లేపితే మళ్లీ గొడవ మొదలవుతుందేమో. అయినా తను తినకుండా ఆమె తినదు. తనకేమీ తినాలనే లేదు. ఓ చెంబుతో మంచినీళ్లు తీసుకుని గటగటా తాగాడు. వెళ్లి మంచం మీద వాలాడు. కానీ ‘నేను చెప్పేది విను’ అంటూ బతిమిలాడిన భార్య ముఖమే గుర్తుకు వస్తోంది. ‘తను తొందరపడ్డాడా? లేదు, లేదు’ మనసులో సంఘర్షణ సాగుతుండగానే, అలసట వల్ల మెల్లగా కునుకుపట్టింది. ఆ నిద్రలో ఓ మాయా ప్రపంచం ప్రత్యక్షమయింది…

తను, తన భార్య పచ్చని చిలుకలుగా ఎగురుతున్నారు. ఓ ఉద్యానవనం. అందులో ఓ అందాల బాల ఆడుకుంటోంది. తాము ఓ చెట్టుకొమ్మపై కూర్చుని కబుర్లాడుకుంటున్నారు. అంతలో భార్య చిలుక మాట్లాడుతూ “ఈ భూమ్మీద రాముడనే రాజు అవతరిస్తాడు. అతడి భార్య పేరు సీత. రాముడు, సీతతో కలిసి పద కొండువేల సంవత్సరాలు రాజ్యమేలుతాడు. ఇద్దరూ ప్రేమకు ప్రతిరూపాలుగా ఉంటారు” అంది.

ఆ మాటలు అక్కడే ఆడుకుంటున్న అందాలబాలకు వినిపించాయి కాబోలు, చెలికత్తెలతో “ఆ అందాల చిలుకల్ని నాకు తెచ్చివ్వండి” అంది.

వెంటనే వాళ్లు తమను ఆ అందాలబాల వద్దకు పట్టుకెళ్లారు. ఆమె తమవంక ఇష్టంగా చూస్తూ “ఓ చిలుకల్లారా, మీరెంత అందంగా ఉన్నారో. ఇంతకూ మీరు ఎక్కడినుంచి వచ్చారో చెప్పండి. రాముడు ఎవరు? సీత ఎవరు? మీకు వారి గురించి ఎలా తెలుసు? మీకేం భయంలేదు. చెప్పండి” అంది. తాము వెంటనే “మేము వాల్మీకి రుషి వాటిక నుంచి వచ్చాము. మేం అక్కడే నివసిస్తాం. వాల్మీకి రుషి ‘రామాయణము’ అనే పెద్ద గ్రంథాన్ని రాస్తున్నారు. ఆయన రామాయణంలోని పద్యాలను ఎప్పుడూ చదువుతుంటారు. మేం వింటూ ఉంటాం కాబట్టి మాకు తెలిసింది. అందులో సీతారాముల గురించి, వారి జీవిత ఘట్టాల గురించి ఉంది. శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి, విశ్వామిత్ర మహర్షి వెంట మిథిలకు, సీతా స్వయంవరానికి వెళతాడు. అక్కడ ఏ వీరుడికీ విరవడానికి సాధ్యపడని శివధనస్సును విరిచి జనకుడి కుమార్తె, సౌందర్యరాశి సీతను వివాహమాడతాడు. మాకు తెలిసిందంతా చెప్పేశాం. ఇక దయచేసి మమ్మల్ని వదిలేయండి” అన్నాయి.

సీత ఆ మాట వినిపించుకోకుండా “రాముడు ఎక్కడ ఉంటాడు? ఎవరి కుమారుడు? ఎలా ఉంటాడు?” అని ప్రశ్నలు వేసింది. అందుకు తన భార్య చిలుక “రాముడు ఎంతో అందగాడు. అతడి అందాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. అతడిని భర్తగా పొందనున్న సీత ఎంతో అదృష్టవంతురాలు. ఇంతకూ మీరెవరు? మీ పేరేమిటి? రాముడి గురించి ఎందుకంత కుతూహలంగా ప్రశ్నిస్తున్నారు?” అని ఆమెను అడిగింది. అందుకు ఆ అందాల బాల తన జన్మవృత్తాంతమంతా వివరించి “మీరు ఏ సీత గురించి మాట్లాడారో ఆ సీతను నేనే. రాముడు ఎప్పుడు వచ్చి నన్ను పరిగ్రహిస్తాడో అప్పుడే నిన్ను వదిలేస్తాను. అప్పటివరకు మేమందించే మధుర ఫలాలను తింటూ మా వద్దే ఉండు” అంది.

అది వినగానే భార్య చిలుక “జానకీ! మేం వనాలలో ఉండే పక్షులం. చెట్ల మీదే ఉంటూ అటు, యిటు తిరుగుతుంటాం. మీ రాజభవనంలో మేం సంతోషంగా ఎలా ఉండగలం. అందులోనూ నేను గర్భవతిని. నన్ను వెళ్లనీ. పిల్లలు పుట్టాక నేను మళ్లీ నీ దగ్గరకు వస్తాను” వేడుకుంది.

కానీ సీత దాని మాట మన్నించలేదు, దానిని విడిచి పెట్టలేదు. దాంతో భర్త చిలుక సీతతో తన భార్యకు స్వేచ్ఛ ప్రసాదించమని వేడుకుంది.

కానీ సీత, భార్యచిలుకను అక్కడే వదలి భర్త చిలుకను వెళ్లి పొమ్మంది.

దాంతో భర్త చిలుక విచారంగా ‘రుషి చెప్పింది నిజమే. ఎప్పుడూ మౌనంగా ఉండాలి. ఎవరికీ, ఏమీ చెప్పకూడదు. లేకపోతే ఆ మాటలకు కట్టుబడి ఉండాలి. మేం ఇక్కడ ఇలా ముచ్చట్లాడక పోతే ఇలా బందీ అయ్యే పరిస్థితి వచ్చేది కాదు’ అనుకుంటూ, భార్యచిలుకను వదిలి పెట్టవలసిందిగా సీతను మళ్లీ వేడుకుంది. కానీ సీత వినలేదు.

దాంతో భార్య చిలుకకు విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో ఇలా అంది.. “నేను గర్భవతినై ఉన్న సమయాన నన్ను, నా భర్తనూ వేరు చేస్తున్నందుకు నువ్వు కూడా భవిష్యత్తులో గర్భవతిగా ఉన్న సమయంలోనే రాముడి వియోగం అనుభవిస్తావు”.. అలా అంటూనే అది ఆవేదనతో ప్రాణాలొదిలింది. దాని నోటినుంచి రాముడి పేరు వచ్చిన పుణ్యం వల్ల కాబోలు తక్షణం ఓ విమానం వచ్చి ఆ చిలుకను తీసుకెళ్లింది.

అంతా చూసి ఖిన్నుడైన భర్తచిలుక సీతతో “నేను మళ్లీ అయోధ్య లోనే పుడతాను. నా మాటలతోనే రాముడు నిన్ను త్యజిస్తాడు” అంటూ ఎగిరివెళ్లింది.

అంతలోనే భర్తచిలుక తిప్పడిగా మారిపోయింది.

ఉలికిపాటుతో తిప్పడు కళ్లు తెరిచాడు. ‘ఈ కల నిజమేనా? కిందటి జన్మలో తను, తన భార్య చిలుకలా? తను కలలో అన్నట్లుగానే నడుచుకున్నట్లుంది. కానీ సీతను శిక్షించబోయి, తన భార్యనూ శిక్షించాడే!’ దాని వల్ల తనకూ శిక్ష పడినట్లయిందికదా. ఆ జన్మలో సీత వల్ల తమ జంటకు ఎడబాటు కలిగితే ఈ జన్మలో తమ ఎడబాటుకు కారణం స్వయంగా తానే అయ్యాడు. ‘ఉహూఁ అట్లా కాకూడదు. వెంటనే వెళ్లి తన ఇల్లాలిని బతిమిలాడి ఇంటికి తెచ్చుకుంటాను’ అనుకున్నాడు.

ఇంకా చీకట్లు పూర్తిగా తొలగిపోనే లేదు. కానీ తిప్పడు నిలువలేక పోయాడు. తను కాదంటే ఆమె వెళ్లేది పుట్టింటికే అని తెలుసు. అది పొరుగూరే. వెంటనే లేచి ఇంటి తలుపు దగ్గరగా వేసి బయటకు నడిచాడు. తాను చేసిన అవమానానికి ఎంత బాధపడి ఉంటుందో. తను ఏం ముఖం పెట్టుకుని అత్తింటికి వెళ్తున్నాడు? కానీ తప్పదు. ‘తప్పు చేయడం ఒక తప్పు అయితే, దాన్ని సరిదిద్దుకోక పోవటమనేది ఇంకా పెద్ద తప్పు అవుతుంది’ ఆలోచిస్తూ నడుస్తుండగా అత్తగారిల్లు రానే వచ్చింది. తెల్లవారినందుకు గుర్తుగా ఎక్కడో కోడి కొక్కొరొక్కో అని తన కర్తవ్యాన్ని నిర్వహించింది. వెళ్లి మెల్లగా ఇంటి తలుపు తట్టాడు. వెంటనే తలుపు తెరుచుకుంది. ఎదురుగా ఉంది తన భార్యే. వెంటనే ఆమె చేతులు పట్టుకున్నాడు. “నిన్న నేను అన్నయేయీ మససులో పెట్టుకోమాకు. క్షమించే, ఇవి సేతులు కావు, కాళ్లు, నాకు రేతిరి ఒక కల వొచ్చిందే” అంటూ తన కొచ్చిన కలనంతా వివరించాడు. ఆమె ఆశ్చర్యంగా విని “ఇదే కల నాక్కూడా వచ్చింది. ఇంక నిద్రపట్టలేదు. ఆలోచిస్తూ ఉన్నా, ఇంతలో నువ్వు వచ్చావు. కానీ నువ్వు సెప్పినట్లుగా నేను మల్లీ వచ్చి నీతో సంతోషంగా ఉండలేను” అంది ఆమె.

“ఏం, ఎందుకు, ఎందుకు సంతోషంగా ఉండలేవు?” ఆవేశంగా అడిగాడు తిప్పడు.

“ఆలుమగలకు ఎడబాటు కలిగితే అది ఎంత బాదో తెలిసిన దాన్ని. నా కారణంగా, అందులోనూ అయోధ్య పెజలను కన్నబిడ్డల్లా, సల్లగా పాలిస్తున్న రాముడి భార్యకు ఎడబాటు కలిగితే నేను సుఖంగా ఉండలేను. నీ వదరుపోతు మాటలు విన్నాక ఆ మారాజు, సీతమ్మను ఏలుకోడన్నది ముమ్మాటికీ ఖాయం. అత్త కోరిందని రాముడు అడవులకు బయలుదేరితే, రాజబవనంలో సుకంగా ఉండాల్సిన సీతమ్మ, నారచీర కట్టి మగని వెంటే నడసి అడవులకెల్లింది. ఆ తర్వాత ఆ రాక్షసుడు రావణాసురుడి చెరలో లంకలో కష్టపడ్డ ఆయమ్మకు మళ్లీ మన వల్ల భర్త నుంచి ఎడబాటు కలుగుతోంది. ఆ తల్లి బాధపడతా ఉంటే నేను, నీతో కలిసి ఆనందంగా ఉండటానికి నా మనసు ఒప్పుకోదు. ఏనాడైతే మళ్లీ సీతారాములు తిరిగి కలుసుకుంటారో, ఆనాడే మళ్లీ మనిద్దరం కలుసుకునేది. లేదంటే ఈ జన్మకింతే” స్థిరంగా చెప్పి, “ఇంక నువ్వు వెళ్లిపో ఇక్కడ్నుంచి” అంది.

“అంతేనా, నీ నిర్ణయం మారదా” అడిగాడు తిప్పడు ఆశ చావక.

“ఎప్పటికీ మారదు” అంటూ ఈసారి ఆమె అతడివంకైనా చూడక తలుపు మూసేసింది.

అప్పటిదాకా ఆ పక్కనే ఉండి అంతా విన్న ఓ బ్రాహ్మణుడు “నీ ఇల్లాలు నీతిమంతురాలు. ఒకరికి వియోగం కల్పించి, తాను సంతోషంగా ఉండలేను అనటంలోనే తెలుస్తోంది. ఆమె మనసు ఎంత గొప్పదో! ఏం చేస్తాం. ‘విధి బలీయం’ నాయనా!” అంటూ ముందుకు కదిలాడు.

‘సేతులారా సేసుకున్నా, అనుభవించక తప్పదు’ అనుకుంటూ, మూసిన తలుపువంక చూసి, తీరని చింతతో వెనుతిరిగాడు చాకలి తిప్పడు.

(రామాయణంలో చాకలి తిప్పడు తన భార్యను అనుమానించడం, శ్రీరాముడిని నిందించడం జరిగాక, తిప్పడి ప్రస్తావన ఎక్కడా ఉండదు. అయితే పద్మపురాణంలోని చిలుకల జంట ఉదంతాన్ని ఆధారంగా చేసుకొని, ఆ తర్వాత తిప్పడి జంట జీవితానికి సంబంధించి చేసిన కల్పన).

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here