గిమ్మిక్కులు

0
6

[box type=’note’ fontsize=’16’] కనీసం లక్ష రూపాయలైనా బిల్లు చేసి చేతిలో పెట్టనిదే పేషంట్‌ని ఇంటికి పంపని ఆసుపత్రులు చేసే గిమ్మిక్కులను వివరిస్తున్నారు సలీం ఈ కల్పికలో. [/box]

[dropcap]వా[/dropcap]రిజ వంటగదిలోకి వెళ్ళబోతూ సోఫాలో కూచుని టీవీ చూస్తున్న అమ్మ వైపు నవ్వుతూ చూసి “ఇరవై నాలుగ్గంటలూ ఆ దిక్కుమాలిన సీరియల్స్ చూడకపోతే ఏదైనా పుస్తకం చదువుకోవచ్చుగా” అంది.

“రాచి రంపాన పెడ్తున్న అత్తను చంపాలని ప్లాన్ వేసిన కోడలు పాలల్లో విషం కలిపి అత్త గది తలుపు తడుండగా నిన్న సీరియల్ ఆపేశాడే. ఆ పాలు అత్త కిచ్చిందా? ఇస్తే ఆమె తాగిందా? తాగాక ఏమైంది? చచ్చిందా లేక కొడుకు చూసి ఆస్పత్రికి తీసుకెళ్తే బతికిందా? అమ్మో ఎన్ని ప్రశ్నలో.. ఈ పూట ఆ సీరియల్ చూడకపోతే వాటికి సమాధానాలు దొరకవు” టీవీ స్క్రీన్ పైనుంచి చూపు మరల్చకుండానే అంది జానకమ్మ.

“సర్లే.. టైం చూశావా? ఎనిమిది గంటలైంది. టీవీ ధ్యాసలో పడి మందులేస్కోవటం మర్చిపోతావేమో.. ఇంతకూ ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకున్నావా?”

“చేసుకున్నానే తల్లీ.. చాలా సేపైంది. అందుకేనేమో ఆకలి దహించివేస్తోంది”

“సారీ అమ్మా.. ఈ రోజు ఆఫీస్‌లో లేటయింది. ఒక్క అరగంటలో నీకు వేడివేడిగా చపాతీలు, కూరా చేసి పెడ్తాను” అంటూ వంట గదిలోకి దూరింది.

రోజూ ఏడింటికల్లా అమ్మకు మొదట భోజనం పెట్టేశాక మిగతా పనులు చేసుకునేది. ఈ రోజు ఆఫీస్‌లో ఆడిట్ జరుగుతోందని చెప్పి ఏడు వరకూ ఉంచేశారు. బస్సులు పట్టుకుని ఇంటికొచ్చేసరికి ఎనిమిదయింది. పాపం అమ్మ.. ఆకలేసినా వంట గదిలోకెళ్ళి ఏదైనా వండుకోలేనంత అశక్తురాలైపోయింది. ఒకప్పుడు ఎన్ని పనులు చేసేదో.. ఆ వయసులో కూడా అమ్మకున్న ఓపిక చూసి తను ఆశ్చర్యపోయేది.

“నువ్వు ఆఫీస్ పనితో అలసిపోయి వస్తావుగా. ఇంటిపనేమీ ముట్టుకోకు. అలా కూచుని రిలాక్సవ్వు. అన్నీ నేను చేస్తాగా’ అనేది.

అందరికీ అమ్మ చేసే వంటకాలంటే ఎంతిష్టమో.. వయసు పైబడటం వల్ల ఇప్పుడు ఓపిక తగ్గిపోయింది. శరీరం కూడా బరువెక్కింది. షుగరూ, బీపీ, మోకాళ్ళ నొప్పులు, ఆయాసం..

వారిజకు పెళ్ళి చేసిన పదేళ్ళకు జానకమ్మ భర్త గుండెపోటుతో చనిపోయాడు. వాళ్ళకు కొడుకుల్లేరు. ఒక్కతే కూతురు.. వారిజ తన భర్తను ఒప్పించి తల్లిని తెచ్చుకుని తన దగ్గరే ఉంచుకుంది. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో ఇంటి పనులన్నీ జానకమ్మే చూసుకునేది. వారిజకు ఓ కొడుకూ కూతురు. వాళ్ళ ఆలనా పాలనా చూసింది కూడా జానకమ్మే. ఇప్పుడు వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి.

ముసలితనం ఎంత భయంకరమైందో కదా.. కానీ ఎవ్వరూ దాన్నుంచి తప్పించుకోలేరు అనుకుంది వారిజ. వంట పూర్తి చేశాక ప్లేట్లో ఓ చపాతీ వేసి, పక్కన ఇంత కూరేసి “అమ్మా నీ భోజనం రెడీ” అంటూ హాల్లోకొచ్చిన వారిజ మ్రాన్పడిపోయింది. అమ్మ సోఫాలో ఒరిగిపోయి ఉంది. వారిజ భయంతో బిగుసుకుపోయి కొన్ని క్షణాలు బొమ్మలా నిలబడిపోయింది. అమ్మ చచ్చిపోయిందా.. అంత హఠాత్తుగా.. నాన్న కొచ్చినట్టే అమ్మక్కూడా గుండెపోటు వచ్చిందా..

కర్తవ్యం గుర్తొచ్చి సోఫాను సమీపించి అమ్మను తాకి చూసింది. వొళ్ళు వెచ్చగానే ఉంది. అనుమానం తీరక ముక్కు దగ్గర వేలు పెట్టి చూసింది. వూపిరి ఆడుతోంది. వెంటనే తన భర్తకు ఫోన్ చేసింది. అతను మున్సిపాలిటీలో చిరుద్యోగమేదో చేసి రిటైరైనాడు. కూకట్‌పల్లిలో ఉన్న బంధువుల ఇంటికి ఏదో పని మీద వెళ్ళాడు. “నువ్వు వెంటనే ఏదైనా హాస్పిటల్‌కి తీస్కెళ్ళు. నేను నేరుగా అక్కడికే వచ్చేస్తాను. అంబులెన్స్ సర్వీస్‌కి ఫోన్ చేయి” అన్నాడు.

వారిజ తమ ఇంటికి దగ్గరగా ఉన్న ఓ కార్పొరేట్ ఆస్పత్రికి ఫోన్ చేసింది. వాళ్ళు వెంటనే అంబులెన్స్ పంపించారు. దాన్లో ఉన్న ఇద్దరు సిబ్బందికి జానకమ్మని మోసుకెళ్ళటం వీలుపడలేదు. వారిజ చుట్టుపక్కలున్న ప్లాట్ వాళ్ళని బతిమాలుకుంది. ఓ కుర్చీలో జానకమ్మని కూచోబెట్టి నలుగురు నాలుగు వైపులా పట్టుకుని మోసుకుంటూ అంబులెన్స్లోకి ఎక్కించారు. ఆమెతో పాటు వారిజ కూడా ఎక్కి కూచుంది. అంబులెన్స్ హాస్పిటల్ ఆవరణలోకి ప్రవేశించడం ఆలస్యం స్టేచర్ మీద పడుకోబెట్టి జానకమ్మని నేరుగా ఐసియూలోకి తీసుకెళ్ళారు.

ఐసీయూ గదికి ఆనుకునిఉన్న వరండాలో ఓ కుర్చీలో కూచుంది వారిజ. రెండు నిమిషాల తర్వాత ఒక నర్స్ ఆమెను సమీపించి “మీరేనా పేషంట్‌తో పాటు వచ్చింది?” అని అడిగింది. ఔనని చెప్పాక పేషంట్ పేరూ, వయసు, ఆమెకున్న ఆరోగ్య సమస్యలు, వాడుతున్న మందులూ వగైరా వివరాలన్నీ కనుక్కుని వెళ్ళింది.

మరో మూడు నిముషాల తర్వాత ఒకతను ఆమె దగ్గరకొచ్చి “జానకమ్మను తెచ్చి జాయిన్ చేసింది మీరేనా?” అని అడిగాడు. ఔనని తల వూపింది. ఒక స్లీప్ ఆమె చేతికిచ్చి “కింద గ్రౌండ్ ఫ్లోర్లో కౌంటర్ ఉంటుంది. అక్కడికెళ్ళి పాతిక వేలు కట్టి, కట్టినట్టు రసీదు పట్టుకొచ్చి ఇవ్వండి. వైద్యం మొదలెడతాం” అన్నాడు.

వారిజ హతాశురాలైంది. అమ్మకేమైందోనన్న కంగారులో డబ్బులేమీ తీసుకోకుండానే వచ్చేసింది. ఐనా యింట్లో కూడా రెండు మూడు వేలకు మించి డబ్బుల్లేవు. బ్యాంక్‌లో తన భర్త ఎకౌంట్లో దాచుకున్న డబ్బులు డ్రా చేస్తే తప్ప పాతిక వేలు కట్టడం సాధ్య పడదు.

“కొద్దిసేపట్లో మా హజ్బెండ్ వస్తారండీ.. ఆయనొచ్చాక కట్టేస్తాం” అంది.

“తొందరగా కట్టకపోతే మీకే నష్టం. మీరు డబ్బు కట్టినట్టు రశీదు చూపిస్తే తప్ప వైద్యం చేయడం కుదరదు” అన్నాడతను కరుగ్గా.

‘అయ్యో అలా అంటే ఎలాగండీ.. డబ్బులు తప్పకుండా కడతాం. కొద్దిగా సమయం కావాలి. అంతే. అప్పటివరకూ వైద్యం చేయము అంటే ఎలా? ప్రాణానికేమైనా అయితేనో”

“ఇక్కడి రూల్ అంతేనండీ. డబ్బు కట్టాకే వైద్యం”

“అమానుషం కదా.. డబ్బు కట్టకుండా ఎక్కడికి పోతాము?”

“ఏమో కట్టకుండా పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు”

“అలా పారిపోయేదానిలా కన్పిస్తున్నానా?” వారిజకు కోపం, అవమానం, అసహనం అన్నీ ఒకేసారి అనుభవంలోకి వచ్చాయి.

“నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పన్చేస్తున్నాను తెలుసా?” అంది ఉక్రోషంతో.

“అవన్నీ మాకనవసరం మేడం. తొందరగా డబ్బులు కట్టి రసీదు తెచ్చి చూపించండి” అంటూ అతను విసవిసా వెళ్ళిపోయాడు.

వారిజ తన భర్తకు ఫోన్ చేసింది. డ్రైవింగ్‌లో ఉన్నాడేమో మొదట ఎత్తలేదు. మరో రెండు సార్లు చేశాక “ఓ అరగంటలో అక్కడుంటాను” అన్నాడు. ఏమనాలో తెలియక “తొందరగా రండి” అంది.

ఆమెకు కంగారు ఎక్కువైంది. నిజంగానే డబ్బులు కట్టేవరకు వైద్యం అందివ్వరా? ఆ కారణంగా అమ్మ చనిపోతే… అమ్మో.. అప్పుడు జీవితాంతం తను అపరాధభావనతో కుంగిపోతూ బతకాల్సి వస్తుంది.

ఆమె భర్త రాగానే డబ్బులు కట్టమంటున్న విషయం చెప్పింది. అప్పటికి సమయం రాత్రి పది కావస్తోంది.

“నేను వెళ్ళి మాట్లాడతానుండు” అనేసి అతను కౌంటర్ దగ్గరకెళ్ళి “పాతిక వేలు కట్టమన్నారట. ఇప్పుడు రాత్రి పదయింది. బ్యాంకులుండవు. రేపుదయం బ్యాంక్ తెరవడం ఆలస్యం డబ్బులు డ్రా చేసి కట్టేస్తాను” అన్నాడు.

“కుదరదండి. ఇప్పుడు కట్టాల్సిందే. ఏటియంలుంటాయిగా” అన్నాడతను. “నేను ఏటియం కార్డుని తీసుకోలేదు”

“క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ ఏదైనా పర్లేదు”

“అవి కూడా లేవు”

“ఐతే మీ పేషంట్ మరో ఆస్పత్రికి పిల్చుకెళ్ళండి. డబ్బులు కట్టకుండా మా దగ్గర ట్రీట్‌మెంట్ దొరకదు. ఇప్పటివరకూ ఐసీయూలో చేసిన ట్రీట్‌మెంట్‌కి డబ్బులు కట్టేస్తే డిశ్చార్జ్ చేసేస్తాం”

“డబ్బులు రేపుదయాన్నిగానీ చేతికందవని కదా చెప్తున్నాను. మళ్ళా డబ్బులంటారేమిటి?”

“ఏం చేస్తారో నాకు తెలియదు. మీకు మరో అరగంట టైం ఇస్తున్నాను. డబ్బులు అరేంజ్ చేసుకుని పాతిక వేలు అడ్వాన్స్ కట్టండి” మరో మాటకు అవకాశం లేదనేలా కంప్యూటర్ మీదకు దృష్టి మళ్ళిస్తూ అన్నాడు.

తనతోపాటు పని చేసి రిటైరైన మిత్రుడు గుర్తొచ్చాడు. అతని దగ్గర డెబిట్ కార్డుంది. అతనికి ఫోన్ చేసి “సారీ.. ఈ సమయంలో ఇబ్బంది పెడ్తున్నందుకు. అర్జెంట్‌గా పాతిక వేలు కావాలి. మా అత్తగార్ని హాస్పిటల్లో చేర్పించాం. అడ్వాన్స్ కట్టాలట. రేపుదయం బ్యాంకు తెరవంగానే విత్‌డ్రా చేసి నీ డబ్బు తిరిగిచ్చేస్తాను” మొహమాటంతో సగం చచ్చిపోతూ అడిగాడు. అతను తన కొడుకుని ఆస్పత్రికి పంపించి పాతిక వేలు అందచేశాడు. ఆ డబ్బులు తీస్కెళ్ళి కౌంటర్లో కట్టేశాడు.

జానకమ్మకి అన్ని రకాల రక్తపరీక్షలు చేశారు. చివరికి హెచ్.ఐ.వి, హెపటైటిస్ కూడా. ఈసీజీ తీశారు. ఫుల్ బాడీ స్కాన్ చేయాలని చెప్పి సీటీ స్కాన్ చేశారు. డ్రిప్ పెట్టి సెలైన్‌తో పాటు ఏవేవో మందులెక్కించారు.

డాక్టర్ బైటికి రాగానే వారిజ ఆదుర్దాగా ముందుకెళ్ళి “మా అమ్మకెలా ఉంది డాక్టర్?” అని అడిగి ంది.

“సమస్యేమిటో తెలియడం లేదమ్మా. పరిస్థితి క్రిటికల్‌గానే ఉంది. నలభై ఎనిమిది గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేం” అన్నాడు.

వారిజ సన్నగా వెక్కిళ్ళు పెట్టి ఏడ్వసాగింది.

మరునాడు మరో పాతిక వేలు కట్టాలన్నారు. మూడు రోజులు ఐసీయూలో ఉంచాక జనరల్ వార్డ్‌కి మార్చారు. జానకమ్మకి స్పృహ వచ్చింది. మామూలుగానే ఉంది.

“ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చు డాక్టర్” అని అడిగింది వారిజ.

“మృత్యుముఖం దాకా వెళ్ళిన మీ అమ్మను మా శాయశక్తులా ప్రయత్నించి బైటికి లాక్కొచ్చాం. ప్రమాదం పూర్తిగా తప్పి పోలేదు. రెండు మూడు రోజులు అబ్జర్వేషన్లో ఉంచడం మంచిది” అన్నాడు డాక్టర్.

మరో మూడు రోజుల తర్వాత డిశ్చార్జ్ చేసే ముందు బ్యాలన్స్ నలభై వేలు కట్టించుకుని ఇంటికి పంపించారు. వారిజ భర్త తన బ్యాంక్‌లో దాచిపెట్టుకున్న కొద్దిపాటి డబ్బు తుడిచిపెట్టుకుపోయింది.

“పోతే పోయింది. మా అమ్మను బతికించుకున్నాం చాలు” అనుకుంది వారిజ.

జానకమ్మ డిశ్చార్జ్ కావడానికి మూడ్రోజుల ముందు కొత్తగా డ్యూటీలో చేరిన నర్స్ ఆమెకు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చి వచ్చాక స్టాఫ్ రూంలో ఉన్న హెడ్ నర్స్‌ని అడిగింది. “ఆమెకేమిటీ జబ్బు? మూడు రోజులు ఐసీయూలో ఉన్నాక ఈ రోజే జనరల్ వార్డ్‌కి షిఫ్ట్ చేశారని చెప్పింది” అని అడిగింది.

హెడ్ నర్స్ నవ్వి “జబ్బా పాడా.. ఏమీ లేదు. షుగర్ పేషంట్ కదా. ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకుని చాలా సేపైనా ఏమీ తినకపోవడంతో షుగర్ లెవెల్స్ పడిపోయి స్పృహ తప్పింది. ఓ అరగ్లాసు నీళ్ళలో చెంచాడు చక్కెర వేసి తాగిస్తే లేచి కూచునేది. భయపడిపోయి ఆస్పత్రికి పిల్చుకొచ్చారు. వాళ్ళ భయాలే కదా ఇటువంటి ఆస్పత్రులకు కాసుల పంట పండించేది” అంది.

“మరి మూడు రోజులు ఐసీయూ, మరో మూడు రోజులు అబ్జర్వేషన్…”

“నువ్వు కొత్తగా వచ్చావు కదా. అందుకే అమాయకంగా ఆ ప్రశ్న వేశావు. మన ఆస్పత్రికి ఏ పేషంట్ వచ్చినా కనీసం లక్ష రూపాయలైనా బిల్లు చేసి చేతిలో పెట్టాల్సిందే. దానికోసం అలాంటి గిమ్మిక్కులు తప్పవు కదా” అంటూ పెద్దగా నవ్వింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here