గిరిపుత్రులు-8

0
11

[ప్రముఖ రచయిత్రి చివుకుల శ్రీలక్ష్మి గారు రచించిన ‘గిరిపుత్రులు’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[చలం, అన్నపూర్ణ దంపతులుగా కొత్త జీవితం ప్రారంభిస్తారు. దశరథరామయ్యగారి నుండి మళ్ళీ ఏ సందేశమూ రాదు. అపహరించినవాళ్ళు, ఆయనకు ‘లైఫ్ థ్రెట్’ ఉందనే పేరుతో స్థావరాలను మార్చేస్తూంటారు. వాళ్ళకి కావల్సిన పాటలు, రాతలూ రాయించుకుంటారయన చేత. నిర్బంధంలో ఆయన శారీరకంగా, మానసికంగా అలసిపోతారు. మొదడు పని చేయదు. చేతులు మొద్దుబాయిపోతాయి. తనని తన కుటుంబంతో చేర్చమని ఎంతగానో వేడుకుంటారు వాళ్ళని, నిస్సహాయతతో తిడతారు. చివరికి వాళ్ళు వాస్తవం గ్రహిస్తారు. నిర్బంధంలో ఆయన చనిపోతే, తమకే నష్టమని భావించి రహస్యంగా తీసుకువచ్చి ఇంటి ముందు పడుకోబెట్టి వెళ్ళిపోతారు. తెల్లవారుజామున లేచిన సుభద్రమ్మ అరుగు మీద నిద్రపోతున్న భర్తని చూసి గట్టిగా కేకవేస్తుంది. కొన్ని క్షణాల్లలోనే ఊరివారంతా అక్కడ చేరతారు. వైద్యం కోసం సమీప పట్నానికి తరలిస్తారు. ఊరి జనం కూడా అసుపత్రి లోనే పడిగాపులు కాస్తారు. దశరథరామయ్య గారికి తెలివి వస్తుంది. పక్కనే ఉన్న కూతురుని, చలాన్ని చూసి చిన్నగా నవ్వుతారు. పాదాల దగ్గర ఉన్న భార్య సుభద్రమ్మని చూడకుండానే ఆయన ప్రాణాలు పోతాయి. ఆయన కోరిక మేరకు ఆ గిరిజనులకు వారి జీవితం పట్లా, అన్యాయాలకు గురి అవుతున్న వారి అవిద్య పట్లా అవగాహన కల్పించి ముందుకు నడిపించే బాధ్యతను భుజాన వేసుకుంటారు పూర్ణా, చలం. విస్తృతమైన అధ్యయనం చేసి, చక్కటి ప్రణాళికలు రూపొందించి – తాము చేపట్టబోయే నూతన వ్యవసాయ పద్ధతులను అమలు చేయడానికి ముందుకొచ్చిన వారితో ‘గిరి పుత్రుల జట్టు’ పేరుతో ఒక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు. సేంద్రియ ఎరువులు మాత్రమే వాడాలని వారందరినీ; మంచి ఫలితాల కోసం మూడు పంటల వరకూ వేచి చూడాలని వాళ్ళని ఒప్పిస్తారు. అన్నపూర్ణకి కూతురు పుడుతుంది. నర్మద అని పేరు పెట్టుకుంటారు. వీరు చేసే కార్యక్రమాలతో నష్టపోయేవారు ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేకమంది. వారంతా కలిసి గిరిజనులను ప్రలోభపెట్టాలని చూసినా, గిరిపుత్రులు లొంగరు. ఆ ఏడాది భారీ ఎత్తులో నూతన పంటలను వేస్తారు. అందరిలో కొత్త ఉత్సాహం వెల్లువెత్తుతుంది. ఇక చదవండి.]

అధ్యాయం-10 మొదటి భాగం:

[dropcap]ల[/dropcap]క్ష్యాలు పెద్దవి అయినప్పుడు సమయం గురించి అవగాహన లేకుండా ఎంత తొందరగా మనం చేరుకుంటామా అని ఆత్రుతలో ఉండడమే కాకుండా నిత్యజీవితపు పనులు తమ యొక్క సంస్కృతి సంప్రదాయాలను నిలుపుకోవడం అనుకున్న లక్ష్యాన్ని చేరడం పడుగుపేక లాగా ఇవన్నీ కలబోసుకుంటూ ఆ గిరిజనులు జీవితాన్ని సాగిస్తున్నారు.

చూస్తూ ఉండగానే పాపకు ఐదో సంవత్సరం వచ్చేసింది. ఉపాధ్యాయురాలైన సుభద్రమ్మ గారి చేతుల మీదుగా అక్షరాభ్యాసం చేయాలని నిర్ణయించుకున్నారు చలం దంపతులు. అందరూ కలిసి అక్షరాలయం సందర్శన చేసి, అక్కడ పాపకు అక్షరాభ్యాసం చేయించాలి అనుకున్నారు.

కొన్ని గిరిజన తెగలలోని ఆచారాలు ఆరాధనలలో ఆధునికులు కూడా అనుసరించవలసిన అత్యుత్తమ సంస్కారాలు కనిపిస్తాయి.

ఏ జాతికైనా భాషా సంస్కృతికి మూలాధారం. వాటికి ఆలంబనంగా నిలిచేవి అక్షరాలే! ఆ జాతికి వెలుగు. అక్షరాన్ని ఆరాధించడం అపురూపమైన నాగరికత చిహ్నం. ఈ సంస్కృతి గుణుపురం సమీపంలోని పద్మాపూర్ సమితిలోని మిర్చిగూడలో ఉంది. భారతదేశంలోనే విలక్షణమైన ఈ సంప్రదాయం పేరు ‘అక్షరబ్రహ్మ’ గిరిజనతెగలలో ప్రాచీన సవరజాతికి చెందిన గిరిజనులు పాటిస్తున్నారు.

గిరిజనులు మూర్ఖులనీ, రాయికి, రప్పకు, చెట్టుకు, చేమకు, కొండదేవతలకు మొక్కుతారని భావించే ఆధునికులకు ఆశ్చర్యం కలిగించేటట్లుగా తమకున్న దేవతాగణాన్నంతా అక్షరాలలో దర్శించి ఆరాధిస్తారు. సుమారు ఒక 80 సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్షర బ్రహ్మ సంస్కృతిని వీరు కొనసాగిస్తున్నారు.

ఇది క్రమేపి ఉత్తరాంధ్ర వైపు కూడా వచ్చింది. సవర భాషలో ఉన్న 24 అక్షరాలను అక్షరబ్రహ్మ రూపంలో ఆరాధించడం వీరి ప్రత్యేకత. ఈ అక్షరాలను ఒక రాతిపైన చెక్కించి వాటికి ఒక ఆలయం కట్టి ఆరాధిస్తూ ఉంటారు. సమస్త దేవి దేవతలు ఆ అక్షరాలలో నిక్షిప్తమై తమను కాపాడుతాయని వారి నమ్మకం. ఆ అక్షరాలను తాము వాడే వస్తు సామగ్రిపై కూడా ముద్రించుకొని దేవుని ప్రతిరూపంగా ఆరాధిస్తారు.

అసలు ఈ అక్షర బ్రహ్మ ఆవిర్భావం ఏ విధంగా జరిగింది? అణగారిన గిరిజన తెగల ఆరాటం ఒకవైపు వారి నుంచి విడదీయలేని విశ్వాసాలు ఒకవైపు ఈ సంస్కృతి మాత్తర్ వనం పేరిట రూపుదిద్దుకుంది.

సవర భాషలో

మా అంటే చైతన్యం/

తర్ అంటే వెలుగు/

వనం అంటే మంచిదారి/

సవరజాతి ప్రముఖుడైన మావియా గొమాంగో తన జాతి వారికి జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి తమ భాషకు ఒక లిపి కావాలనుకుని సంవత్సరం పాటు తపస్సు చేసి సజీవ సమాధి అయిన అనంతరం అక్కడ ఒక శిలాఫలకంపై అక్షరాలుగా వెలిశారు.

గొమాంగో శిష్యుడైన మంగయ్య గోమాంగో తొలిసారిగా ఆ అక్షరాలను చూసి అక్షర బ్రహ్మ సంస్కృతిని వ్యాప్తిలోనికి తెచ్చారు. అందువలన మంగయ్య గోమాంగోని సవరభాషా పితామహుడని, సవర పండిట్ అని అంటారు. తరువాత ఈ అక్షర దేవాలయాన్ని మంగయ్య గోమాంగో మిర్చిగూడా గ్రామంలోని ‘ఈత్ మెరిట్ లియాంగుల్’ అనే కొండపై నిర్మించారు.

ప్రతి గురువారం అక్షరబ్రహ్మకు చేసే ఆరాధనలో వీరి ప్రార్థనలలో సమతా భావం సంప్రదాయాలు గోచరిస్తాయి. ఓంకారంతో ప్రారంభమయ్యే వీరి ప్రార్ధన సవర భాషలో సాగుతుంది. అది ఈ విధంగా ఉంటుంది.

ఓ దేవుడా! మూడు వర్షాలు కురిపించి, మూడు పంటలు పండించి, మా పిల్లాపాపలను కాపాడమని ప్రార్థిస్తారు.

ప్రతి ఏటా ఈ ఆలయం దగ్గర భారీ ఎత్తున ఉత్సవాలు చేసి, అన్ని ప్రాంతాల గిరిజనులు పాల్గొంటారు. ఈ సంస్కృతిని అనుసరిస్తున్న గ్రామాలలో మద్యం, మాంసం కనబడవు. గ్రామదేవత వేడుకలలో జంతుబలుల ప్రస్తావనే ఉండదు. ఈ తెగవారు ఏ పని చేసినా తొలి పూజలు అక్షర బ్రహ్మకై జరుపుతారు. ఇలా ఆటవిక పద్ధతుల నుంచి వెలుగు చైతన్యము నిండిన కొత్త మార్గంలో పయనించడానికి మంగయ్య మార్గదర్శనం చేశాడు.

అక్షరాలకు గుడి కట్టడంతోనే సరి పెట్టుకోకుండా గిరిజనులకు అక్షరజ్ఞానం కలిగించడం, లిపి ద్వారా తమ భాషకు రూపాన్ని కల్పించుకుని, తద్వారా బాహ్య ప్రపంచాన్ని అధ్యయనం చేయడం కూడా అక్షరబ్రహ్మ ఉద్యమ లక్ష్యాలుగా భావించారు. సవరభాష కోసం సొంత ముద్రణాలయాన్ని స్థాపించుకున్నారు. దాని ద్వారా పాఠ్యపుస్తకాలు వెలువరిస్తున్నారు. వంశపారంపర్యంగా వారి శిష్యులు దీన్ని నిర్వహిస్తున్నారు. గిరిజన జీవితాలలో వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి

అటువంటి గిరిజనులకు ప్రీతిపాత్రమైన అక్షరాలయంలో నర్మదకు అక్షరాభ్యాసం చేశారు.

గిరిజన వాయిద్యాల హోరులో థింసా నాట్యాలు సందడిలో.

నర్మద అమ్మమ్మ ఒడిలో గిరి పుత్రుల చెలిమిలో అంచెలంచెలుగా ఎదుగుతూ చుట్టుపక్కల అందరికీ వెలుగులు విరజిమ్ముతూ ఒక్కొక్క తరగతి ఉత్తీర్ణురాలు అవుతోంది.

అనుకోని సంఘటన!.

రైతుల జట్టు సంస్థలో ఒక పెద్ద దుమారం చెలరేగింది.

మైనింగ్ మాఫియా కొండలను తవ్వి ఖనిజాలను బయటకు తీయటానికి మరొక వ్యూహం మళ్లీ పన్నింది. ఈమారు మరింత పకడ్బందీగా పోలీసు బందూక్ బలగాన్ని తీసుకొని వచ్చి రైతులను ఆ ప్రదేశాలను ఖాళీ చేయించడానికి నోటీసులు జారీ చేసింది.

ఈ దురాక్రమణలతో ఉద్యమించిన గిరిజన రైతులు, జట్టునాయకులు నాయకత్వం వహించిన చలం పెద్ద ఎత్తున తమ నిరసనను తెలియజేస్తూ ఉద్యమాన్ని తీవ్రం చేశారు.

పోలీసులు బాష్పవాయువు ప్రయోగం చేసి నాయకులను అరెస్టు చేసి జైల్లో పెట్టారు. అన్నపూర్ణ తండ్రికి నక్సలైట్లతో సత్సంబంధాలు ఉన్నాయన్న అభియోగంపై చలంని రాష్ట్ర రాజధానిలోనే ఉంచి కారాగార శిక్ష విధించారు.

అస్తవ్యస్తంగా ఉన్న ఆ కొండ ప్రాంతాలను పచ్చని పంట భూములుగా తయారు చేసుకున్న గిరిపుత్రులను అరెస్టు చేయించారు. ఆ భూములను ఖాళీ చేయించి ప్రోహిబిటెడ్ ఏరియాగా ప్రకటించారు. దానిని దాటడానికి ఎవరికీ శక్యం కాకుండా ఎలక్ట్రికల్ ఫెన్సింగ్ వేయించి చుట్టూ మిలిటరీ కాపలా పెట్టారు.

అన్నపూర్ణ ఇవన్నీ చూస్తూ మౌనంగా ఉండలేకపోయింది. ఒకపక్క కర్తవ్యం ఒకపక్క కూతురు ఆ చిన్నారి మొహం కనిపిస్తుంటే ఏ నిర్ణయం తీసుకోలేకపోతోంది.

“అమ్మా! నా భర్తను అరెస్టు చేసి కారాగారంలో పెట్టేశారు. పైగా ఎప్పుడు లేపేస్తారో తెలియదు. రోజూ అతని గురించి ఆలోచిస్తూ, ఆలోచిస్తూ కర్తవ్య విమూఢనై బ్రతకలేను. అందుకని..” ఆపేసింది

సుభద్రమ్మ ఒక్క క్షణం నిరుత్తరురాలయింది. కూతురు ఏమంటోందో అర్థం కాలేదు. లీలగా అర్థం అవుతున్నా

“అమ్మా! నేను అన్నలతో చేరిపోతాను. ఎవరైతే ఈ గిరిపుత్రులకు అన్యాయాలు చేస్తున్నారో అవన్నీ చూస్తూ నేను మౌనంగా ఉండలేకపోతున్నాను. ఎలాగమ్మా?

నాన్నగారు శాంతిగా ఏదో చేయాలని ప్రయత్నించారు. కానీ దాన్ని కూడా సహించలేక నాన్నను చంపేయాలని ప్రయత్నించిన భూస్వాముల నుండి రక్షించాలని మిషతో అన్నలే మనకు నాన్నగారిని దూరం చేశారు. చలం సాయంతో వారిని ఎదిరించగలను అనుకున్నాను. కానీ నా భర్తని కూడా నాకు దూరం చేశారు. నా కూతురు నా బంగారుతల్లి కాళ్లకు సంకెలలా చుట్టుకుందమ్మా! దీన్ని నువ్వే పెంచి పెద్ద చేయి.” దుఃఖంతో జలజలా కన్నీరు రాలిపోతుంటే..

“అమ్మా! అది పెద్దదై కలెక్టరుగా ఈ ఊరు రావాలి. ఈ భూస్వాములు భూమితో చేసే ఆటలు కట్టించి, గిరిపుత్రులు సొంతంగా తమ భూమిలో తాము వ్యవసాయం చేసుకునే రోజు చూడాలని ఉంది.” ఎటో చూస్తూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్న అన్నపూర్ణని చూస్తూ

“నువ్వు దళంలో చేరితే ఎలా చేయగలవు?” సుభద్రమ్మ ప్రశ్నించింది.

“దళంలో చేరి పాటలు పాడుకుంటూ అందరిని ఉత్తేజపరుస్తాను. అన్నల దగ్గర శిక్షణ పొంది, గిరిపుత్రులకు జరిగే అన్యాయాలను వారికి వివరిస్తాను. అందరం కలిసి భూస్వాముల లిస్టు తయారు చేసుకుంటాము. వారి ఇళ్లపై దాడి చేసి, ఒక్కొక్కరిని నిద్రలేపి, వాడి పొలాల కాగితాల మీద సంతకాలు తీసుకుని వాడిని లేపేస్తాము..”

“తరువాత???

ఏం చేస్తావో చెప్పు. ఒకరినో ఇద్దరినో అలా చేయగలవు. తరువాత నిన్ను ఉంచుతారా? నర్మద కంటే పసిపిల్ల లాగా మాట్లాడుతున్నావు. తల్లి తండ్రి ఇద్దరూ లేని అనాథగా నీ బిడ్డ నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరగలదా? పూర్ణా! వాస్తవంగా ఆలోచించు. మనం ఇద్దరం ధైర్యంగా నర్మదను పెంచుదాం. నేను పెద్దదాన్ని నిన్ను చూసుకొని ధైర్యంగా బ్రతుకుతున్నాను.”

కూతురి మనసు మార్చాలని సుభద్రమ్మ ఒక విఫల ప్రయత్నం చేస్తోంది మారుతుందని ఆశ లేదు. అన్నపూర్ణ తెగింపు తెలుసు.

అన్నపూర్ణ ఒకరోజు ఒంటరిగా అడవిలోకి బయలుదేరింది. విమలక్కను కలుసుకోవాలని తను ఏదైనా దారి చూపిస్తుంది అని ఆశతో బయలుదేరింది. కొంచెం దూరం అడవిలో మెల్లగా నడుస్తూండగా యూనిఫాంలో ఉన్న అన్నలు ఆమెను ఆపారు – “ఎక్కడికమ్మా వెళ్తున్నావు?” అంటూ

“విమలని కలవడానికి” అని చెప్పింది.

“తను ఇప్పుడు ఇక్కడ లేదు కదా! చత్తీశ్‌ఘఢ్ అడవులలోకి వెళ్ళింది.” చెప్పారు.

“అవునా! తను నాకు ఏదైనా అవసరం వస్తే తన పేరు చెప్పి నన్ను కలవమంది.” అని చెప్పడంతో వాళ్ళిద్దరూ సౌంజ్ఞలు చేసుకొని అన్నపూర్ణని ఆమెతో కల్పించాలని నిర్ణయించుకున్నారు.

“కబురు పెడతాము ఈ రాత్రికి. తను రావచ్చు మరి మీరు రేపు రావచ్చు కదా! మళ్ళీ.”

“లేదు నేను ఇక్కడే ఉండి ఎదురు చూస్తాను ఆమెతో అర్జెంటుగా మాట్లాడవలసిన పని ఉంది.”

అనగానే ‘సరె!’ అంటూ వాళ్ళ స్థావరానికి తీసుకువెళ్లారు.

వెళుతున్న త్రోవలో అక్కడక్కడ అన్నల పాటలు వినిపిస్తున్నాయి.

‘కంటికి నిదురుండదు
కడుపుకు కూడుండదు
మల్లెపూల బాట కాదు తమ్ముడా!
మరణాన్ని కోరి చేరు తమ్ముడా!

ఎత్తైన కొండలలో ఎక్కి దిగగలవా?
వాగులు వంకలలో సక్కంగా నడవగలవా?

ఎవ్వరో ఈ బిడ్డలు
ఎత్తయిన నెలవంకలు’

ఒక పూటంతా ఎదురు చూశాక విమల వచ్చింది. రాగానే అన్నపూర్ణని చూసి దగ్గరగా తీసుకుని, “ఏం అక్క ఇట్టా వచ్చావు?” ప్రేమగా అడిగింది. అంతమందిలో జవాబు ఇవ్వడానికి అన్నపూర్ణ సంశయించింది. అర్థం చేసుకొని కళ్ళతో ఆజ్ఞాపించి, వారిని పంపించేసింది విమల.

జరిగినదంతా చెప్పడానికి ముందు కొంచెం ధైర్యంగా మొదలుపెట్టి ఒక్కొక్క విషయం చెప్పింది కానీ ఆఖరికి వచ్చేసరికి దుఃఖంతో గొంతుపూడి పోయింది.

“అవునా! పోలీసులతో వ్యవహారం అంటే కొంచెం కష్టమే. అందులో జైల్లో ఉన్నవాడిని తీసుకురావడం చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం అయినా ప్రయత్నం చేస్తాము. నువ్వు ధైర్యంగా ఉండు.” చెప్పింది విమల.

“ఇంక బయలుదేరుతావా?” విమల ప్రశ్నకు తల అడ్డంగా ఊపిన అన్నపూర్ణని చూస్తూ “ఇంకేమైనా చెప్పాలా?” అని అడిగింది.

“లేదక్కా! నేను కూడా మీతో చేరిపోతాను. అన్నల సాయంతో నా భర్తను విడిపించుకుంటాను” మెల్లగా అస్పష్టంగా చెప్పింది.

“అన్నపూర్ణా! ఊర్లోకి వచ్చినప్పుడు మాకు కడుపునిండా ఇంత అన్నం పెట్టిన తల్లివి నువ్వు. ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరమైన మార్గం” అంటూ – మెడలో ఉన్న ఒక తాయత్తును చూపిస్తూ “మేము నిత్యము ప్రాణాలు వదలడానికి ఏ క్షణం అయినా సిద్ధంగా ఉంటాము. ఇందులో సైనేడ్ ఉంది.

పోలీసులు, అన్నలు ఇద్దరు కూడా ప్రత్యర్ధులు ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టే ఉంటారు. ఒకరిని ఒకరు అంతం చేసుకుంటూ ఉంటారు.

నువ్వు గిరిజనుల మీద పుస్తకాలు రాస్తున్నావని నాకు తెలిసింది. నీకు వీలున్నప్పుడు నా కథను కూడా ఒక పుస్తక రూపంగా అందరికీ అందించు. చూసేవాళ్ళకి నెగడు దగ్గర కూర్చొని హాయిగా పాటలు పాడుకుంటూ ఉన్నట్టు మేము కనిపిస్తాము కానీ అది నిజం కాదు.

రెండు యుద్ధాల మధ్య సంధి కాలం. అది శాంతి కాలం కూడా.

మేము హైదరాబాదు వెళ్లి జైల్లో ఉన్న చలపతిని గురించి వివరాలు తెలుసుకుంటున్నాము అని తెలియగానే మా మీద దాడి ప్రారంభం అవుతుంది. ఒక్కోసారి మామూలుగానే చిన్నపాటి దెబ్బలతో వదిలేస్తారు ఇంకోసారి పై వాళ్ళ యొక్క సూచనలతో మమ్మల్ని చిత్రహింసలు పెడతారు. అన్నిటికీ సిద్ధంగానే ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు చలంని వేరే చోటికి మార్చేసినా, లేపేసినా కూడా మనకు తెలియదు. ఇప్పుడైతే కనీసం ఫలానా జైల్లో ఉన్నాడని తెలుసు.

నీకు చిన్న పాప ఉంది కదా! దానిని చక్కగా చదివించి మంచి ఉద్యోగం వచ్చేటట్టు చూడు ఎందుకంటే అలాంటి ఆఫీసర్లు మనకి అవసరం. వారు మన కొండ రైతులకు అవసరమైన భూభాగాలను పంపిణీ చేయగలరు.

నీ భర్త ఎక్కడ ఉన్నాడో వివరాలు కనుక్కొని అతని క్షేమసమాచారం నీకు తప్పకుండా నీకు చెప్తాను. ప్రస్తుతం దళంలో చేరాలని అన్నలతో పనిచేయించుకోవాలని ఆలోచన తీసేయ్!

అమ్మ చాలా పెద్దది. పాప చాలా చిన్నది. ఇద్దరికీ మధ్య వారధి నువ్వు. ఇద్దరి బాధ్యతను విస్మరించకు. దళంలో చేరడం వలన మీ వారికి మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది.

నువ్వు నన్ను కలిసి వివరంగా అడిగేవు కనక నీకు మంచి సలహా చెప్పడం నా బాధ్యత.” అంటూ విమల అన్నపూర్ణ దగ్గర నుంచి సెలవు తీసుకుంది.

అన్నపూర్ణను తీసుకువచ్చిన ఇరువురు అన్నలు ఆమెను మళ్ళీ జాగ్రత్తగా కొండదిగువ ప్రాంతం చేర్చారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here