జ్ఞాన సంపత్తిని అందించే యాజ్ఞవల్క్య మహర్షి

0
12

గురు ప్రార్థన

ఓం వందేఽహం మంగళాత్మానం భాస్వంతం వేదవిగ్రహమ్।
యజ్ఞవల్క్యం మునిశ్రేష్ఠం జిష్ణుం హరిహర ప్రభుమ్॥
జితేంద్రియం జితక్రోధం సదాధ్యానపరాయణమ్।
ఆనందనిలయం వందే యోగానంద మునీశ్వరమ్॥
ఏవం ద్వాదశ నామాని త్రిసంధ్యా యః పఠేన్నరః।
యోగీశ్వర ప్రసాదేన విద్యావాన్ ధనవాన్ భవేత్॥
ఓం శ్రీ యాజ్ఞవల్క్య గురుభ్యో నమః

~

[dropcap]యా[/dropcap]జ్ఞవల్క్యుడు శుక్ల యజుర్వేద ప్రవర్తకుడు, బ్రహ్మరాతుని ప్రియపుత్రుడు. ప్రాచీన వేద భారతావనిలోని మహర్షులలో ప్రముఖుడు. శతపద బ్రాహ్మణాన్ని, యాజ్ఞవల్క్య స్మృతిని రచించి వైదిక లౌకిక ధర్మాలకు జీవము పోసిన ధర్మమూర్తి అయన. జనకుని సభలో రాజగురువుగా ఎన్నోసార్లు వాద ప్రతివాదాలలో సర్వోత్తముడిగా పారితోషకాలు అందుకున్నవాడు. వ్యాసుడు విష్ణు అంశ సంభూతుడు అటువంటి వ్యాసుడు ప్రతి ద్వాపరములో అవతరిస్తాడుట. ముప్పైమూడో ద్వాపరంలో వ్యాసుడు మహాతేజస్వి అయిన యాజ్ఞవల్క్యుడిగా అవతరించాడని వైఖానసము అంటుంది.

కురు పాంచాల దేశములో గంగ ప్రవహించే నదీ తీరమున చమత్కారపురమను నగరంలో యజ్ఞవల్కుడను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య సునంద. ఆ దంపతులకు ధనుర్లగ్నమున ఒక కుమారుడు జన్మించాడు. అతడే యాజ్ఞవల్క్యుడు. తన కుమారునకు అయిదవ ఏట అక్షరాభ్యాసమూ, ఎనిమిదవ ఏట ఉపనయనము చేశాడు. ప్రాతఃస్మరణీయులైన ఋషిపరంపరలో యాజ్ఞవల్క్య మహర్షి ఒకరు. ఇతను భాష్కలుని వద్ద ఋగ్వేదము, జైమిని వద్ద సామవేదము, అరుణి దగ్గర అధర్వణవేదమును అభ్యసించాడు. కుమారుడు అనతికాలముననే మూడు వేదములు అభ్యసించి జ్ఞానియైనందుకు తండ్రి సంతోషించాడు.

అతనంతరం తన కుమారుని వైశంపాయనుని వద్దకు పంపాడు. వైశంపాయనుని వద్ద యజుర్వేదాధ్యయనము కూడా చేసాడు. యాజ్ఞవల్క్యుడు వైశంపాయుని శిష్యుడై యజుర్వేదాధ్యయనం చేయసాగాడు. అతను వద్ద మరెన్నో విషయములు తెలుసుకొనసాగాడు. అహంకారము, విద్యామదము అంకురించాయి. ఆ సంగతి గురువు గ్రహించాడు. క్రమముగా నశించునని వైశంపాయనుడు ఊరుకున్నాడు. యాజ్ఞవల్క్యునకు విద్యామదము నశించడం లేదు సరికదా పెరుగుతోంది.

ఒకనాడు వైశంపాయనుడు తన మేనల్లుడు అవినీతుడై సంచరించుచున్నాడని కోపముతో ఒక తన్ను తన్నాడు. బ్రాహ్మణుని కాలితో దన్నిన అది బ్రహ్మహత్యతో సమానము. ఈ పాపము నుండి దూరమగుట ఎట్లా యని శిష్యులందరకు చెప్పగా విద్యా గర్వితుడైన యాజ్ఞవల్క్యుడు “గురువర్యా ఇది ఎవరివల్లా నశించదు. నేనొక్కడనే ఆపగలవాడను” అని గర్వంగా పలికాడు. వైశంపాయనుడు శిష్యుని అహంకారమునకు మండిపడి “యాజ్ఞవల్క్యా నా వద్ద అభ్యసించిన వేదశక్తితో నన్నే కించపరచదలచావా, నే నేర్పినది నా వద్ద క్రక్కి వెంటనే ఆశ్రమము విడిచిపో. గురుద్రోహి” అని కఠినంగా పలికాడు. యాజ్ఞవల్క్యుడు గురువు పాదములపై బడి శోకించాడు.

కరుణించమని వేడుకున్నాడు. తన తపోబలంతో బ్రహ్మహత్యాదోషము బాపి తాను నేర్చుకున్న వేదములను రుధిరరూపమున గ్రక్కి వెళ్ళిపోయాడు. ఈ గ్రక్కిన పదార్థమును దిత్తిరి పక్షులుతిన్నవి. అవి తిరిగి ఉపనిషత్తులయ్యాయి. అవే తైత్తిరీయోపనిషత్తులుగా ప్రసిద్ధికెక్కాయి.

అనంతరం యాజ్ఞవల్క్యుడు సూర్యభగవానుని ఆరాధించి అతను కరుణకు పాత్రుడై శుక్ల యజుర్వేదమును గ్రహించి గురువు కన్న అధికుడయ్యాడు. ఆ తరువాత సరస్వతిని ఉపాసించి సమస్త విద్యలు సంపాదించాడు. ఆ విధంగా అతడు అమానుష విద్యానిధియైనాడు.  సరస్వతీదేవిని ఉపాసించి సమస్త విద్యలు సాధించాడు. ఇతని  ప్రథమ శిష్యుడు కణ్వుడు. వీరే ప్రథమ శాఖీయులు, గాణ్వశాఖీయులు. జనకుడు యాగము చేయుచూ మహర్షులందరిని ఆహ్వానించాడు.

యాజ్ఞవల్క్యునకు కూడా వర్తమానం పంపాడు. వచ్చిన ఆ మహర్షిని ఉచితాసనం పై కూర్చుండబెట్టాడు. యాగము పరిసమాప్తి కాగానే అక్కడున్నవారిని ఉద్దేశించి. “మహానుభావులారా మీలో ఎవరు గొప్పవారో వారు ముందుకు వచ్చి ఈ ధనరాశులు స్వీకరించవచ్చు” అని గంభీరంగా పలికాడు. ఎవరూ సాహసించలేదు. ఎవరికి వారే సంశయంలో ఉండిపోయారు. అంత యాజ్ఞవల్క్యుడు తన శిష్యులతో ఆ ధనరాసులను గృహమునకు పట్టుకువెళ్ళమని ఆజ్ఞాపించాడు. విన్న విప్రకూటమి అతనితో వాదించి ఓడిపోయారు. శాకల్యుడను ముని కూడా వాదించి ఓటమి అంగీకరించి ప్రాణ త్యాగము చేసాడు. కానీ ప్రాణాలు కోల్పోయిన శాకల్యుణ్ణి జనకుని విన్నపాన్ని అనుసరించి మంత్రజలముతో ప్రాణ ప్రతిష్ఠ చేసిన కూర్చద్వారా పునర్జీవుడైన చేసిన మహాశక్తి సంపన్నుడు యాజ్ఞవల్క్యుడు. జనకుడు యాజ్ఞవల్క్యుని అందరికన్నా మిన్నగా భావించి పూజించాడు.  ఒకనాడు విశ్వావసుడను గందర్వుడు యాజ్ఞవల్క్యుని కడకు అరుదెంచి తత్త్వముపదేశించమని అర్థింపగా యాజ్ఞవల్క్యుడు ఆ గంధర్వునకు అనేక విషయాలు తెలియజేశాడు. అంత విశ్వావసుడు ఆనందించి ఆ మహర్షికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి వెళ్ళిపోయాడు.

ఈ కాలంలోనే  కతుడను ఒక బుషి ఉండేవాడు అతనుకు కాత్యాయని యనే కూతురుండేది. ఆమెను యాజ్ఞవల్క్యునకిచ్చి వివాహం చేయ నిశ్చయించి కతుడు ఈ విషయమును యాజ్ఞవల్క్యునకు తెలియజేశాడు. యాజ్ఞవల్క్యుడు సమ్మతించగా అతి వైభవంగా వివాహం జరిగింది. మిత్రుడను బ్రాహ్మణుని కుమార్తె, గార్గి శిష్యురాలగు మైత్రేయి యాజ్ఞవల్క్యుని తప్ప అన్యులను వివాహమాడనని శపథం చేసింది. ఈ విషయం తండ్రికి తెలిసి గార్గికి చెప్పాడు. గార్గి ఆమెను కాత్యాయినికి అప్పగించింది. వారిద్దరు స్నేహంగా ఉంటున్నారు. ఒకర్ని విడిచి మరొకరు ఉండలేని స్థితికి వచ్చారు. ఆ పరిస్ధితి రాగానే గార్గి అసలు విషయం కాత్యాయినికి తెలిపింది. కాత్యాయిని సంతోషించి మగని వల్ల వరం పొంది మైత్రేయికి వివాహం జరిపించింది. భార్యలిద్దరితో యాజ్ఞవల్క్యుడు హాయిగా కాలం వెలిబుచ్చుతున్నాడు.

ఆ మహర్షి అనుగ్రహంతో కాత్యాయిని చంద్రకాంతుడు, మహామేషుడు, విజయుడు అను ముగ్గురు కుమారులను కన్నది. బుషులందరూ యాజ్ఞవల్క్యునకు మాఘశుద్ధ పూర్ణిమ నాడు యోగీంద్ర పట్టాభిషేకం చేశారు. అతను బుషులకు తెలియజేసిన విషయాలే యోగశాస్త్రమని యోగ యాజ్ఞవల్క్య మనీ ప్రసిద్ధికెక్కాయి. యాజ్ఞవల్క్యుడు భార్యలకు తత్వమునుపదేశించి సన్యసించాడు. అతను పేర ఒక స్మతి ప్రచారంలో ఉంది. అందనేక విషయము ఉన్నాయి. కర్మ జ్ఞానముల వలన మోక్షము కలుగునని తెలియజేశాడు. యోగమును గురించి చెప్పిన విషయాలు యోగ యాజ్ఞవల్క్యుమను పేర ప్రచారంలో ఉన్నాయి. ఈ బుషి ప్రాతఃస్మరణీయుడు. అయన స్వతంత్ర ప్రవృత్తి తపశ్శక్తి పాండిత్యము అన్నిటికి మించి వైరాగ్య సంపద మనకు మార్గదర్శకాలు.

అయన ఉపదేశించిన ‘తమసో మా జ్యోతిర్గమయ’ మానవజాతిని అంధకారము నుండి వెలుగుకు నడిపించేది. అయనను ఆరాధిస్తే జ్ఞానసంపత్తి కలుగుతుంది.

(Image courtesy: Internet)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here