జ్ఞాన తస్కరణ

0
8

[dropcap]కాం[/dropcap]భోజపురం రాజు చంద్రసేన మహారాజు అనేక దేశాలు తిరిగి అక్కడ లభించే వింత వస్తువులు, గ్రంథాలు వంటివి ఎన్నో సేకరించేవాడు. వాటన్నిటినీ ఒక అందమైన ప్రదర్శనశాలలో ప్రదర్శించేవాడు. తద్వారా ఆయా దేశాల చరిత్ర, సంస్కృతి ప్రజలకు తెలిసేవి.

ఒకసారి ఆయన సముద్రం మీద ప్రయాణించి సుదూర తీరాల్లో ఉన్న గండకీ ద్వీపాన్ని చేరాడు. గండకీ ద్వీపంలోని వారి భాష చంద్రసేన మహారాజు గారికి కానీ ఆయన పరివారానికి కానీ అర్థం కాలేదు.

అయినా సంజ్ఞల ద్వారా ద్వీపంలోని వారికి భావాలు వ్యక్తపరుస్తూ ఆ ద్వీపంలో చూడదగిన ప్రదేశాలను చూస్తున్నారు. అక్కడ శిల్ప కళ, భవన నిర్మాణ శైలి చూసి చంద్రసేన మహారాజు ఆశ్చర్య పోయాడు.

ఒక దేవాలయానికి వెళ్ళి అందులోని శిల్ప సంపద చూస్తూ చంద్రసేన మహారాజు తెలుగులో తన అంతరంగికుడుతో శిల్పాలను గురించి మాట్లాడుతుండగా అక్కడే ఉన్న ఒక వ్యక్తి రాజుగారితో “మీరు తెలుగు వారా?” అని అడిగాడు.

రాజుగారు సంతోషంతో “అవును నీకు తెలుగు భాష తెలుసా?” అడిగాడు.

“తెలుసు. నా పేరు విద్యాపతి. వంద సంవత్సరాల క్రితం మా పూర్వీకులు వ్యాపార నిమిత్తం కాంభోజపురం నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు. కాంభోజపురం అతి దూరంగా ఉండటం వలన రాకపోకలు లేవు” చెప్పాడు విద్యాపతి.

“అయ్యా ఈయన కాంభోజపురం మహారాజుగారు” అని రాజుగారి అంతరంగీకుడు రాజుగారిని విద్యాపతికి పరిచయం చేశాడు.

విద్యాపతి మహారాజుకి నమస్కరించి, “ద్వీపం లోని విశేషాలు నేనే మీకు చూపి వివరిస్తాను” చెప్పాడు విద్యాపతి.

“చూపించు, నీకు బహుమతి ఇస్తాను” అన్నారు రాజు.

“మహారాజా తమరు ఈ ద్వీపానికి వచ్చిన అతిథులు, నాకు బహుమతి అక్కరలేదు, అన్నీ చూపించి వివరిస్తాను” చెప్పాడు విద్యాపతి.

విద్యాపతి మంచితనానికి, అతని పూర్వీకులు కాంభోజపురానికి చెందినవారు అవడంవలన చంద్రసేనుడు ఎంతో సంతోషించాడు.

గండకీ ద్వీపంలోని నాగరికతను గమనించిన తరువాత అక్కడి శాస్త్ర సాంకేతికతను కూడా విద్యాపతి వివరించాడు. అక్కడి సాహిత్యం కూడా తీసుకవెళ్ళితే తమ దేశంలోని విద్యార్థులకు మేలు జరుగుతుందని తలచాడు చంద్రసేనుడు.

గండకీ ద్వీప భాషను, సాంకేతిక విషయాలను నేర్పేందుకు కొందరు పండితులను ఆ ద్వీపపు గ్రంథాలను కాంభోజపురం తీసుకవెళ్ళేందుకు అనుమతి కోసం గండకీ ద్వీపపు రాజు గారివద్దకు తీసుక వెళ్ళమని విద్యాపతిని కోరాడు చంద్రసేనుడు.

అన్నీ చూపాక విద్యాపతి చంద్రసేనుణ్ణి గండకీ ద్వీపపురాజు గిరిపుత్ర వద్దకు తీసుక వెళ్ళి చంద్రసేనుడి ఆలోచనలు వివరించాడు.

గిరిపుత్ర చంద్రసేన మహారాజుని గురించి తెలుసుకుని తగిన ఆతిథ్యం ఇచ్చి కొంతమంది పండితులను తమ దేశపు గ్రంథాలను, కొన్ని కళాఖండాలను తీసుకవెళ్ళమని ఆనందంగా చెప్పాడు. ఆ పండితులు కూడా తమ ద్వీపపు భాషను కాంభోజపురంలో బోధించడానికి అంగీకరించారు.

అందరు గిరిపుత్ర దగ్గర శెలవు తీసుకుని కాంభోజపురం బయలుదేరారు.

ఆ విధంగా గండకీ భాషను కాంభోజపుర గురుకులాల్లో ఆ పండితులు బోధన చేయసాగారు. చంద్రసేన మహారాజు కూడా ఆ భాషను నేర్చుకుని గండకీ భాషలో ఒక గ్రంథాన్ని చదివితే, అది తన తన ఆస్థానంలో ఉన్న వేమయ్య కవి గ్రంథం లాగే ఉంది! చంద్రసేనుడు ఆశ్చర్యపోయి, వేమయ్యను పిలిచి “నేను గండకీ భాషలో చదివిన గ్రంథం అచ్చం తమరు తెలుగు భాషలో వ్రాసిన గ్రంథ విషయంతోనే ఉంది… చాలా చిత్రంగా ఉంది” అన్నాడు చంద్రసేనుడు.

ఆ విషయం చెప్పాక ఎప్పటికయినా నిజం బయట పడకపోదని వేమయ్య తలచి, ఈ విధంగా చెప్పాడు.

“క్షమించండి మహారాజా, ఇన్నాళ్ళూ నేను మీకు చెప్పలేదు. నాకు గండకీ భాష తెలుసు, కేవలం స్వార్థంతో ఆ గ్రంథాన్ని నేను కొన్ని సంవత్సరాల క్రితం తెలుగులోకి అనువాదం చేసి, ఇక్కడ ఆ భాష ఎవ్వరికీ తెలియదని దానిని నేను వ్రాసినట్టే ప్రచారం చేసుకుని మీకు అంకితమిచ్చాను” అని తల వంచుకుని చెప్పాడు వేమయ్య.

“దీనిని జ్ఞాన తస్కరణ అంటారు. ఒకవేళ అనువాదం చేస్తే, దాని మూల రచయితను గురించి వివరించాలి… ఇంకొక విషయం ఏమిటంటే తెలిసిన కొత్త భాషని మనవారికి బోధించాలి. జ్ఞానాన్ని పంచాలి తప్ప, మనలో దాచేసుకోకూడదు. అన్నీ తెలిసిన మీరు ఈ విధంగా చేస్తారనుకోలేదు” అన్నాడు చంద్రసేనుడు.

“మహారాజా నేను శిక్షార్హుణ్ణి, నా తప్పు నేను తెలుసుకున్నాను. గండకీ ద్వీపంనుండి వచ్చిన పండితులతో పాటు నేను కూడా గండకీ భాష బోధిస్తాను. ఇక మీదట నేను ఏ గ్రంథాన్ని  తర్జుమా చేసినా దాని మూల రచయిత వివరాలు పొందు పరుస్తాను” అని నమస్కారం పెట్టి నమ్రతతో చెప్పాడు.

వేమయ్యలో వచ్చిన అవగాహన, మార్పుకి చంద్రసేన మహారాజు సంతోషించి, వేమయ్యలో పండిత జ్ఞానం ఉన్నందుకు క్షమించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here