[శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ రచించిన ‘జ్ఞానమొసగే దేవీ సూక్తం’ అనే ఆధ్యాత్మిక వ్యాసాన్ని అందిస్తున్నాము.]
[dropcap]ని[/dropcap]రుడు ఉత్తరకాశిలో మేము ఉపనిషత్ తరగతులకు హాజరైనప్పటి విషయము. మేము ఉన్న ఆశ్రమానికి ఒక మాతాజీ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఆమె ఒక విచిత్రమైన వ్యక్తి. ఇరవై సంవత్సరాల పూర్వం సన్యసించినా కూడా చాలా అహంకారమిళితమై ఉండేవారు ఆమె. ఆమెలో సున్నితత్త్వం చాలా అరుదుగా కనిపించేది.
ఆమె అహంకారం కంటే ఆమె అజ్ఞానము ఎక్కువ బాధించింది నన్ను. కారణం కథ ఏమంటే – మా తరగతిలో విదేశీయులు కూడా ఉండేవారు. వారిలో చైనీయుడిని ఆమె కొంత ఎక్కువ అభిమానించేది. అతనితో భారతదేశ చరిత్ర గురించి చెబుతూ “స్త్రీలను భారతీయులు అణిచివేయ్యటం తప్ప పైకి తేలేదు..” అన్న ఒక విచిత్రమైన స్టేట్‌మెంట్ విడుదల చేసింది తరగతిలో ఒకనాడు. ఆ తరగతిలో ఉన్న నేను ఆ సేట్ట్‌మెంట్ తప్పని అభ్యంతరం పెట్టాను. వేదకాలములో స్త్రీకి సమున్నతమైన స్థానమున్నది. అసలు ఆనాడు మాతృస్వామిక వ్యవస్థ ఉండేది. చరిత్రను వక్రీకరించవద్దని మనవి చేశాను. “ఎవరున్నారు స్త్రీలు ఆనాడు అని” ఆమె వాదనకొచ్చింది.
ఆ క్షణములో నాకు గార్గి, మైత్రేయి, వాగంభ్రణి గుర్తుకు వచ్చారు. ఆమెకు ఆ వివరాలే చెప్పాను. కావాలంటే ఋగ్వేదములో చూడమని కూడా ఆమెకు నేను సవాలు విసిరాను.
గురువంటే అమిత భక్తి కలిగిన నేను, వేదాంత తరగతిలో అంత కలత చెందటానికి కారణం – వక్రీకరించిన చరిత్రను విదేశీయులకు మన మాతాజీలు, మరొకరు బోధించటమే. వీరు సగం జ్ఞానంతో, అహంతో దేశాన్ని తమ వంతు భ్రష్టు పట్టిస్తున్నారని తెగ దిగులు కలిగింది. శ్రీవారు ఆ ఆశ్రమం హెడ్‌ఆఫీసులో ఫిర్యాదు చెయ్యమన్నారు, కాని నేను అక్కడ్నుంచి వచ్చాక ఆ విషయం వదిలేశాను. కాని చాలా మంది మన వేదకాలములో స్త్రీ గౌరవం గురించి, మన పూర్వపు మాతృస్వామ్య పద్ధతిని గురించి కన్వీనియంటుగా మరిచిపోయి నేటి పరిస్థితి గురించి అవాకులు చెవాకులు చెబుతారు. మన చరిత్రలో మధ్యయుగపు నాటి విదేశీదాడుల వలన స్త్రీని దాచి, చిన్నతనపు వివాహాలు మొదలైనవి ప్రవేశపేట్టినందు వలన ఈనాటి దుస్థితి కలిగింది. లేకపోతే ఏ మతంలో కూడా స్త్రీ దేవతలను పూజించటము మనకు తెలుసు? హిందువులలో తప్ప..
స్త్రీని ఆదిశక్తిగా కొలిచేది కేవలం హిందువులు మాత్రమే.
మొట్టమొదట అంటే విగ్రహారాధనకు పూర్వం, సమస్త చరాచరములను కదిలించు చైతన్యము ఒక్కటేనని, ఆ చైతన్యం ఆది (తొలి, మొదటి) శక్తి యన్న మంత్రాలు మనకు ఋుగ్వేదములో కనపడుతాయి. అంటే నేటి ప్రపంచము కన్ను తెరవక పూర్వం, నాగరికత అన్నది సోదిలో కూడా కనపడని యుగాలలో, 5000 సంవత్సరాలకు పూర్వం, ఒక స్త్రీ మూర్తి గొంతెత్తి ఈ నిఖిల జగత్తుకు కారణము ఆదిశక్తి యని గానం చేసింది. నమ్మశక్యము కాకపోయినా ఇది సత్యం. ఏకేశ్వరాధన, నిరీశ్వర వాదనలు రాక మునుపే, సమస్త సృష్టికి కారణము ఒక్క శక్తి మాత్రమే అని ఆమె గొంతెత్తి గానం చేసింది. ఆ గానము దేవి సూక్తం, ఆమె వాగంభ్రణి.
బుగ్వేదములో 10వ మండలము, 10 అనుమాకములో 125వ మంత్రం దేవీ సూక్తంగా ప్రసిద్ధి చెందింది. ఆ సూక్తం లేదా మంత్రమును చెప్పిన ఋషిక (స్త్రీ ముని) వాగంభ్రణి. ఆమె పేరు వాగ్/వాక్. అంభ్రణి అన్నది ఆమె తండ్రి పేరు. కాబట్టి ఆమెను వాగంభ్రణి అన్నారు. ఈ సూక్తాన్ని వాగ్సూత్రం యని కూడా అంటారు. అశ్వయిజ మాసపు దేవీ నవరాత్రులలో ఈ సూత్రాన్ని పఠించటం మనకు సాంప్రదాయకంగా వస్తున్నదే.
ఆ సూత్రాన్ని చదువుతుంటే మనకు చాలా ఆశ్చర్యకరముగా అనిపిస్తుంది. ఈనాటి ఈ ఏకఈశ్వర వాదము, సగుణ నిర్గుణోపాసన అన్నీ ఐదు వేల సంవత్సరాలకు పూర్వమే వాగంభ్రణి చెప్పింది. మనము నేడు కొత్తగా తెలుసుకున్నదేమీ లేదు అని అర్థమవుతుంది.
ఆ సూక్తం “అహం” అంటూ ప్రారంభమవుతుంది. అహం అనగా “నేను” అన్న అర్థం సంస్కృతంలో.
~
ఓం అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్యైరుత విశ్వదేవైః।
అహం మిత్రావరుణోభా బిభర్మ్యహమింద్రాగ్నీ అహమశ్వినోభా॥1
అహం సోమమాహనసం బిభిర్మ్యహం త్వష్టారముత పూషణం భగం।
అహం దధామి ద్రవిణం హవిష్మతే సుప్రావ్యే యే యజమానాయ సున్వతే॥2
అహం రాష్ట్రీ సంగమనీ వసూనాం చికితుషీ ప్రథామా యజ్ఞియానామ్।
తాం మా దేవా వ్యదధుః పురుత్రా భూరిస్థాత్రాం భూర్యావేశయంతీమ్॥3
మయా సో అన్నమత్తి యో విపశ్యతి యః ప్రాణితి య ఈం శృణోత్యుక్తమ్।
అమంతవోమాంత ఉపక్షియంతిశ్రుధి శ్రుతం శ్రద్ధివం తే వదామి॥4
అహమేవ స్వయమిదం వదామి జుష్టం దేవేభిరుతమానుషేభిః।
యం కామయే తం తముగ్రం కృణోమి తంబ్రహ్మాణం తమృషిం తం సుమేధామ్॥5
అహం రుద్రాయ ధనురాతనోమి హ్రహ్మత్విషే శరవే హంత వా ఉ।
అహం జనాయ సమదం కృణోమ్యహం ద్యావాపృథివీ ఆవివేశ॥6
అహం సువే పితరమస్య మూర్థన్ మమ యోనిరప్స్వంతః సముద్రే।
తతో వితిష్ఠే భువనాను విశ్వోతామూం ద్యాం-వర్ యోనిరప్స్వంతః సముద్రే॥7
అహమేవ వాత ఇవ ప్రవామ్యారభమాణాభువనా విశ్వా ।
పరో దివాపర ఏనా పృథివ్యై తావతీ మహినాసంబభూవ॥8
ఓం శాంతి శాంతి శాంతి
~
మొట్టమొదటి అద్వైత సూత్రం ఇక్కడే చెప్పబడింది. అద్వైతం శంకరాచార్యలతో మొదలవ్వలేదని, శంకరులు కొత్తగా చెప్పలేదని తెలుస్తుంది.
ఇక్కడ వాగంభ్రణి తనకు కలిగిన జ్ఞానాన్ని చెబుతున్నది.
“నేనే అన్నీ దేవతలూ, రుద్రులు, ఎనిమిది వసువులూ, పన్నెండూ ఆదిత్యులూ, పదమూడు విశ్వ దేవతలూ నేనే.
మిత్రుడు (సూర్యుడు), వరుణుడూ, అగ్ని, ఇంద్రుడూ, అశ్వినీదేవతలూ, సోమదేవుడు(చంద్రుడు) నేనే”..
హిందువులకు దేవతలు అనంతం అంటారు. దేవతలు అనంతం కాదు, ఎన్ని రూపాలుగా కొలచినా శక్తి మాత్రం ఒక్కటే. అందుకే ఏ రూపములో కొలచినా అది నేనే అని ఇక్కడ వాగంభ్రణి ఋషిక గానం చేసినదంటే ఆ శక్తుల వెనక ఉన్న ఆది శక్తి చైతన్యము తానన్న జ్ఞానము అప్పుడే యున్నది. ఆమె ఆ విషయమే చెబుతున్నది.
“దేవతలు ఎందరున్నా ఆయా రూపాలలో ఉన్నది నేనే, యాగాలలో హవిస్సులు అందుతున్నది నాకే, ఎందరు దేవతల పేరున మీరు హవిస్సులు అందిస్తున్నా అది నాకే చెందుతున్నది. మీమీ కోరికలు తీరుసున్నది నేనే వివిధ దేవతల రూపములో.
జలము ఏ రూపములో ఉన్నా, సముద్రానికి చెందుతుంది. అలాగే హవిస్సులన్నీ నాకే చెందుతాయి.
మీకు అందుతున్న సమస్త కానుకలూ నా నుంచే అందుతున్నాయి.
ఈ మానవాళికి తల్లిని నేనే. నా నుంచే మీరు జన్మించారు. మిమ్ములను లయం చేసేది కూడా నేనే.
ఈ మానవాళి నా (దేవీ) ఉపాసన చెయ్యటానికే ఏర్పడింది. ఈ సంస్కృతి ఉపాసన చేసి కోరికలు తీర్చుకోగలుగుతుంది.
అందరూ ఆహారం మీద ఆధారపడి జీవిస్తారు. ఆ ఆహారానికి కారణము నేనే.
కర్మేంద్రియాలకు, జ్ఞానేంద్రియాలకు ఏ కాంతి కారణముగా ప్రవర్తిస్తున్నాయో ఆ కాంతి నేనే.”
ఇక్కడ వాగంభ్రణి చెబుతున్నది ఈ సూత్రంలో నిఖిల చరాచరానికి కారణమైన చైతన్యం గురించి.
“ఎవరు ఈ జ్ఞానము గ్రహించలేకపోతున్నారో వారు తిరిగి తిరిగి ఈ జనన మరణ చక్రంలో పడుతున్నారు.
ఇక్కడ మరో మాట కూడా చెబుతున్నది వాగంభ్రణి. ఈ చెప్పబడుతున్న జ్ఞానము ఉపాసన వలననో, సాధన వలననో వచ్చినది కాదు. ఇదే నా నిజస్వరూపము..” అన్నది.
అంటే అసలు సృష్టి రహస్యం ఇదేయని నొక్కి వక్కాణిస్తున్నది ఇక్కడ.
ఇందులో ఇంకో మాట కూడా చెప్పింది – ఎవరు భక్తితో నన్ను ఆరాధిస్తారో వారిని ఈ విశ్వానికి బ్రహ్మను చెస్తాను యని. అంటే నిజంగా బ్రహ్మ యని కాదు వారు తన స్వస్వరూప జ్ఞానము తెలుసుకోగలరు. ఆ స్వస్వరూపము వలన అర్థం అవుతుంది సర్వత్రా ఉన్న చైతన్యం ఒక్కటే అని.
ఆ దివ్య మాతృశక్తి ఈ విశ్వానికి కారణము. ఆ ఆదిశక్తి కృపతో మాత్రమే సాధ్యమయ్యే జ్ఞానము ఇది.
ఇంకా ఇలా చెబుతోందీ సూత్రం – “బ్రహ్మానికి చేరటానికి సాధన చేసే ఉపాసకులకు వచ్చే అడ్డంకుల మీద రుద్రుని బాణం ఎక్కు పెట్టించేది నేనే. జనుల సుఖం కోసం యుద్ధం చేసేది నేనే. ప్రజలందరూ నా గర్భసంజాతులే. ఈ విశ్వంలో వెలిగే లోకాలన్నీ నా గర్భం నుంచే జన్మిస్తున్నాయి.”
మనము కేవలము జనని ఒడిలో ఉన్నాము.
“ఈ విశ్వం మొదలైనప్పుడు నేనే యున్నాను, ఆ విశ్వంలో చిరుగాలిలా ప్రవహించినదీ నేనే.. సత్ చిత్ ఆనందము నేనే.. ఈ విశ్వాలన్నింటికీ అతీతమైన వెలుగుతున్న సత్‌చిత్‌ఆనందము నేనే. ఈ విశ్వము నా నుంచి జన్మించి, నాలో వెలిగి, నాలో కలిసిపోతుంది..”
ఇలా సాగే ఆ అద్భుతమైన సూక్తం ఐదు వేల సంవత్సరాల పూర్వం ఋగ్వేదములోని 10 మండలములో 10 అనువాకం 125వ మంత్రంగా చెప్పబడింది. ఈ వేద సూత్రం మీద సాయన బాష్యం అందుబాటులో ఉంది.
బుద్ధుడు తరువాత కాలములో చెప్పిన జ్ఞానమిదే. శంకరులు అద్వైతంగా విరచించినది ఇదే. ఆయన సౌందర్యలహరిలో మొట్టమొదటి శ్లోకమే కూడా ఇదే వివరిస్తుంది.
“శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి,
అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి”
అని శంకరులు సౌందర్యలహరిలో తొలిశ్లోకంలో చెప్పినది కూడా ఇదే కదా.
శక్తి లేకపోతే శివుడు సైతం కదలలేడు. తనలోతానుగా రమించే సదాశివునిలో సృష్టి చెయ్యాలన్న సంకల్పమే శక్తి కదా. అమ్మవారి వలననే అయ్యవారు సృష్ఠచేశారు.. అదే ఈ సూత్రం కూడా చెబుతోంది. శంకరభగవద్పాదులవారు కూడా ఇదే విషయము సౌందర్యలహరిలో తొలి శ్లోకములో ఉటంకించినారు.
అంతటి దివ్యమైన విషయము తెలుసుకోలేక సనాతన ధర్మం గురించి హిందూ మతం గురించి మాట్లాడేవారిని చూస్తే చాలా జాలి కలుగుతుంది. పైగా ఆ విషయము పిలిచి విదేశీ విద్యార్థులకు చెప్పటం మరింత హేయము. వారు చరిత్ర కాకపోయినా కనీసం సనాతన ధర్మమన్నా తెలుసుకునుండాలి. అదీ తెలియకనే ఉపనిషత్తులు బోధించే ఘనులయ్యారంటే ఆ విద్యార్థులకు అందే జ్ఞానమేపాటిదో మనం ఊహించగలము.
ఏది ఏమైనా జగదంబ ఆదిశక్తిగా మొదటి కీర్తించబడిన ఈ అత్యంత శక్తివంతమైన సూక్తం అర్థవంతముగా చదివిన వారికి జ్ఞానము పెంచుతుందన్న మాటలో ఎటువంటి సందేహము లేదు.