జ్ఞాపకాల తరంగిణి-11

0
8

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

నెల్లూరులో టౌన్ హాల్

బెజవాడ గోపాలరెడ్డి గారి తండ్రి పట్టాభిరామిరెడ్డి గారి సలహా మేరకు, రేబాల లక్ష్మీనరసారెడ్డి అనే సంపన్నులు నెల్లూరులో టౌన్ హాల్ 35వేల ఖర్చుతో నిర్మించారు. 1915 ఏప్రిల్ నెలలో టౌన్ హాల్ ప్రారంభమయింది. నెలరోజుల లోపలే టౌన్ హాల్ ఆవరణలో, వెనుకవైపు బహిరంగ ప్రదేశంలో మద్రాసు ప్రెసిడెన్సీ కాన్ఫరెన్స్ మూడురోజులు జరిగింది.

నెల్లూరు టౌన్ హాల్

దక్షిణ ఆఫ్రికా నుంచి తిరిగి వచ్చిన గాంధీజీ, కస్తూర్బాలు ఆ సమావేశాలకు హాజరయ్యారు. ఈ కాన్ఫరెన్స్‌ను పురస్కరించుకొని నెల్లూరులో ఒకరోజు సంఘసంస్కరణ సభ, ఒకరోజు సనాతనుల, సంప్రదాయవాదుల సభ కూడా జరిగాయి. నెల్లూరు జిల్లా ఇంచార్జి కలెక్టర్ ఆర్. రామచంద్రరావుగారు గాంధీజీ దంపతులను, తన బంగళాలో అతిథులుగా ఉంచుకొన్నారు. గాంధీజీ మద్రాసు ప్రెసిడెన్సీ కాన్ఫరెన్స్‌కు మాత్రమే కాక, మిగతా రెండు సభలకు కూడా హాజరై ఆ సభల్లో ప్రేక్షకపాత్ర వహించారు. లిఖిత ఉపన్యాసప్రతులను ప్రేక్షకులకు పంచితే చాలా సమయం కలిసి వచ్చేదని మాత్రమే వారు మద్రాసు ప్రెసిడెన్సి సభలో సూచన చేశారు. మరురోజు వి.ఆర్.హైస్కూలు మైదానంలో విద్యార్ధులను ఉద్దేశించి ఉపన్యాసించినట్లు, ఉపన్యాస పాఠం ఆంధ్రపత్రిక ప్రచురించినట్లు పరిశోధకులు యస్.కె.రసూల్ గారి ద్వారా తెలిసింది. గాంధీజీని ఎందుకు బంగళాలో ఉంచుకుని ఆతిథ్యం ఇచ్చారని కలెక్టర్ రామచంద్రరావును ప్రభుత్వం సంజాయిషీ అడిగితే, నా ఎదురుగా ఉంటే ఆయన మీద నిఘా ఉంచడం సులభం కనుక ఆతిథ్యం ఇచ్చానన్నారు. దాంతో ప్రభుత్వం తృప్తిపడింది.

టౌన్ హాల్ లో 1915లో మహాత్ముడు, టౌన్ హాల్ నిర్మాత తదితరులతో ఫొటో
ఇదే ఇప్పుడు ట్రంకురోడ్డులో గాంధీ విగ్రహం కూడలి

టౌన్ హాల్ వి.ఆర్. కాలేజీ గ్రౌండ్‌కు ఆనుకొని ఉంది. మా యింటికి టౌన్ హాల్ రెండు ఫర్లాగుల దూరం మాత్రమే. ఈ హాల్లో పౌరాణిక నాటకాలు రాత్రి పది గంటలకు మొదలుపెట్టి తెల్లవార్లూ ఆడతారు. ఆ పద్యాలు, పాటలకు మాకు నిద్రాభంగం అయ్యేది. పిల్లలంగా ఉన్నప్పుడు ఆ పాటలు, హరికథలు వింటూ పడుకోడం సరదాగా ఉండేది. నృత్య ప్రదర్శనలు, నాటకాలు, హరికథలు, గారడీ ప్రదర్శనలు, నాటక పరిషత్తు పోటీలు, రాజకీయ సభలు ఒకటేమిటి అన్ని కార్యక్రమాలకు టౌన్ హాల్ ఒక సాంస్కృతిక కేంద్రం.

స్థానం నరసింహారావు గారికి పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భాన్ని పురస్కరించుకొని పొణకా కనకమ్మ వారికి టౌన్హాల్ వేదిక మీదే సన్మానం చేశారు. హై స్కూల్ విద్యార్థిగా (1956) ఆ సభకు వెళ్లాను. స్థానం వారు సత్యభామ మొదలైన పాత్రలు అభినయించి చూపారు. బాల్యంలోనే సినిమా గాయకులు బాలసుబ్రమణ్యం గారి తండ్రి సాంబమూర్తి గారి హరికథలు, నాటక ప్రదర్శనలు ఆ రంగస్థలం మీదే చూచాను.

టౌన్ హాల్ ఆవరణ లోపలే, హాలుకు తూర్పు భాగంలో సిమెంటు గచ్చు చేసిన టెన్నిస్ హార్డుకోర్ట్ ఉండేది. ఇప్పడు ఆ ప్రదేశాన్నే ఓపెన్ ఎయిర్ సభాస్థలిగా మార్చారు.

హాల్‌లో ఉత్తర భాగాన్ని నెల్లూరు ప్రోగ్రెసివ్ యూనియన్ గ్రంథాలయానికి ఇచ్చారు శాశ్వతంగా. ఆంధ్రదేశంలో అతి గొప్ప గ్రంథాలయాల్లో ఇది ఒకటి. ఆ రోజుల్లో ఈ లైబ్రరీని తెలుగులో వర్ధమాన సమాజం గ్రంథాలయం అనేవారు. 1906 లో ఒక ప్రైవేటు భవనంలో ఈ లైబ్రరీ మొదలైనది. 1915లో టౌన్ హాల్‌లో ఉత్తరభాగంలో విశాలమైన హాల్‌లో దీన్ని శాశ్వతంగా ఏర్పాటు చేశారు. టౌన్ హాల్‌లో వర్ధమాన సమాజం ముందు ఒక జైన విగ్రహం ఉండేంది. దాన్ని చూచి వర్ధమానుడి పేరుతో గ్రంథాలయం పెట్టారని అనుకొన్నాను. ప్రోగ్రెసివ్ అనే పదాన్ని వర్ధమాన అని అనువాదం చేసినట్లు తర్వాత తెలిసింది. ఈ గ్రంథాలయం మెట్లమీద కూర్చొని తాను హైస్కూల్ విద్యార్థిగా ఉన్నపుడే తెలుగు ప్రబంధాలన్నీ చదివినట్లు పఠాభి రాసుకున్నారు. అతి పురాతనమైన ఈ గ్రంథాలయం ఈనాటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. మొదట నాటక ప్రదర్శనలు చేపట్టినా, తర్వాత ఈ గ్రంథాలయం ఒక సాంస్కృతిక సంస్థగా మార్పుచెందింది. ఏటా కవిత్రయ జయంతులు, ఇతర కవుల జయంతులు నిర్వహించేవారు. ఎందరో మహానుభావులు ఈ వేదికమీద ఉపన్యాసం చేస్తుంటే వినే భాగ్యం బాల్యంలోనే మాకు కలిగింది. రీడింగ్ రూంలో దినపత్రికలు చదివేవారం. పిల్లలకు కూడా చదువుకునేందుకు పుస్తకాలు ఇచ్చేవారు. ఈ గ్రంథాలయం ముందున్న పెద్ద పొగడ చెట్టుకింద నాపరాళ్ల అరుగుల మీద కూర్చొని పుస్తకాలు చదువుకొనేది. సాయంత్రమయితే పండితులు, కవులు పొగడ చెట్టు నీడలో బెంచీల మీద కూర్చొని ముచ్చట్లు చెప్పుకొనేవారు. మరికొందరు గ్రంథాలయం కార్యదర్శి గదిలో ఆసీనులై మాట్లాడుకొంటూ సాయంత్రాలు గడిపేవారు. టౌన్ హాల్ వేదిక మీద ఉపన్యసించని మహనీయులు, ఈ లైబ్రరీని దర్శించని ప్రముఖులు ఆంధ్రదేశంలో ఉండరు. బండి గోపాలరెడ్డి వర్ధమాన సమాజ కార్యదర్శిగా కట్టమంచివారి ఉపన్యాసాలు పుస్తకరూపంలో తెచ్చాడు. నార్లవారు ఇంగ్లీషులో రచించిన Vemana Through Western Eyes పుస్తకాన్ని మరుపూరు కోదండరామరెడ్డి గారు తెలుగులో “వేమన-పాశ్చాత్యులు” పేరుతో అనువదించగా ఆ పుస్తకాన్ని కూడా వర్ధమాన సమాజం ప్రచురించింది. కోదండరామరెడ్డిగారు దాన్ని నెల్లూరు జిల్లాలో విద్యానగర్ విద్యాసంస్థల వ్యవస్థాపకులు నేదురుమల్లి బాలకృష్ణారెడ్డిగారికి అంకితం చేశారు. పుస్తకావిష్కరణ వాకాడులో ఏర్పాటు చేశారు. నెల్లూరు నుంచి ప్రత్యేకంగా బస్సు వేశారు ఈ ఆవిష్కరణ సభకు హాజరయ్యేవారికోసం. ఆ రోజుల్లో వాకాడులో నేదురుమల్లి వారి సభలు, ఆతిథ్యం చాలా ఆడంబరంగా ఉండేవి.

1921లో మహాత్మా గాంధీజీ నెల్లూరు వచ్చినపుడు వర్ధమానసమాజం హాల్లో తిలక్ వర్ణచిత్రాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు కూడా నూరేళ్లనాటి ఆ తైలవర్ణ చిత్రం అక్కడే గోడకు వేలాడుతోంది. టౌన్ హాల్ లోపల గోడలను నెల్లూరు ప్రముఖుల చిత్రాలతో అలంకరించారు. టౌన్ హాల్లో రంగస్థలం పైన సప్తాశ్వ రథారూఢుడైన సూర్యుని వర్ణచిత్రం చాలా పెద్దది నిలబెట్టారు. రంగస్థలం రెండు మొత్తలకు రెండు సుందర స్త్రీల చిత్రాలను నిలబెట్టారు. తైలవర్ణాలతో ఈ వర్ణచిత్రాలను వేసినవారు బళ్లారి బ్రదర్స్. వారి సంతకం కూడా ఆ చిత్రాలమీద ఉండేది. నెల్లూరులో సుప్రసిద్ధ కళాకారులు, రచయితలు, పురప్రముఖుల ఫొటోలు కూడా టౌన్ హాల్ లోపల గోడలకు అలంకరించారు. నెల్లూరుకు గర్వకారణమైన ఆ పురప్రముఖుల ఫొటోలు చూచినపుడల్లా ఆనందంగా ఉప్పొంగిపోయేవారం. టౌన్ హాల్ పునరుద్ధరణ సమయంలో లోపలి ఫొటోలన్నీ తొలగించి, రంగస్థలాన్ని అలంకరించిన నూరేళ్లనాటి తైల వర్ణచిత్రాలను తీసివేశారు. 1915లో గాంధీజీ టౌన్ హాల్ కు వచ్చినపుడు, టౌన్ హాల్ నిర్మాత, ఇతర పముఖులను కలిపి తీసిన గ్రూపు ఫోటో ఒక్కటి మాత్రమే మిగిలింది ఇప్పుడు. పునరుద్ధరణ కార్యక్రమాల పేరుతొ అన్ని ప్రాచీన ఆలయాలను నెల్లూరు టౌన్ హాల్ లాగే రూపుమార్చి వేస్తున్నారు. అదే విషాదం.

ఇక విఆర్ కాలేజీ మైదానం గురించి. ఈ మైదానంలో ఎన్ని రాజకీయ సభలు జరిగాయో! 1907 ఏప్రిల్ చివరన వి.ఆర్. హైస్కూలు మైదానంలోనే వందేమాతరం ఉద్యమం సందర్భంగా బిపిన్ చంద్రపాల్ గంభీరోపన్యాసం చేశారు. 1921ఏస్రిల్ 7వతేది గాంధీజీ ఈ మైదానంలోనే ఉపన్యసించారు. దేబర్, రంగాజీ, కామరాజ్ నాడార్, సుందరయ్య, అరుణా అసషాలి, అజయ్ ఘోష్, ఎందరెందరినో మా బాల్యంలో ఈ మైదానంలో జరిగిన సభల్లో దర్శించే భాగ్యంకలిగింది. ఈ క్రీడా స్థలానికి మాటలే వస్తే ఎన్నెన్ని పురాగాథలను చెబుతుందో!

విఆర్.కళాశాల ఎదుట రచయిత

వి. ఆర్. కళాశాల “ఈస్ట్ హాల్” లో కూడా షుమారైన సభలు జరిగేవి. నేను ఆ కాలేజీ ఆంధ్ర భాషాసంఘం కార్యదర్శిగా శ్రీశ్రీ సభ ఈ హాల్లోనే నిర్వహించాను. ఈస్టు హాల్లో రంగస్థలం కూడా ఉండేది. ఇదికాక కాలేజీలో ఒక బహిరంగ రంగస్థలం 1956లో ఏర్పాటయింది. . మేము హైస్కూల్ చదివేరోజుల్లో కళాశాల ప్రిన్సిపాల్ సచ్చిదానంద పిళ్లె సారథ్యంలో సాంస్కృతికోత్సవాలు మహా వైభవంగా జరిగేవి. ఆ ఉత్సవాలు ఒక్క విఆర్ కాలేజీకి మాత్రమే కాదు, నెల్లూరుకంతా మరొక రంగడి తిరనాళ్లే. డిసెంబర్ మాసంలో జరిపే సాంస్కృతికోత్సవాల్లో తెలుగు, ఇంగ్లీష్ నాటికల పోటీలు, మోనో యాక్షన్ పోటీలు నిర్వహిచేవారు. ఆ వేదిక మీదనే హోయర్సు అఫ్ కోల్, బిషప్స్ కేండిల్ స్టిక్స్ ఇంగ్లీష్ నాటకాలు చూచాను. ఆ సాంస్కృతికోత్సవాలు మా హైస్కూలు విద్యార్థులకు వినోదం, విజ్ఞానదాయకంగానూ ఉండేవి. బి.ఎ. ఆఖరి సంవత్సరం సాంస్కృతికోత్సవాల్లో మా మిత్రబృందం వేణు రాసిన దిప్టిబొమ్మలు నాటకం ప్రదర్శించాము.

నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ లైబ్రరీ కాపువీధిలో ఉండేది. పత్తేదారు, డిటెక్టివ్ పుస్తకాలు, శరత్ నవలలు, విశ్వనాథనవలలు, చలం నవలలు, ఆంధ్రపత్రిక వార పత్రిక, చందమామ అన్నీ అక్కడే చదివేది. పుస్తకం కోసం చాలా సేపు వేచి ఉండాల్సి వచ్చేది. ఒక కుర్రాడు పుస్తకం చదివి వాపసు చేసేదాకా పక్కనే కూర్చొని ఉండేవాళ్ళం. ఆరుద్ర వెండిపలకల గ్లాసు అక్కడే చదివాను. ఆ రోజుల్లో ఇన్ని పుస్తకాలు చదివామని అందరం ఒకరితో ఒకరు పోటీపడి గొప్పలుపోయేవాళ్ళము. నేను 13 ఏళ్లకే హిందీలో రాష్ట్రభాష పాసై , ప్రవేశిక తప్పాను. అదీ మౌఖిక పరీక్షలో తప్పాను. అయితేనేం, ప్రేమ్ చంద్ నిర్మల, సేవాసదన్, గోదాన్, గబన్ నవలలు, వారి కథలు కొన్ని బాగా ఇష్టంగా చదివాను. జైనేంద్రకుమార్ సుఖద, సుమన, కల్యాణి చదివేసాను. కొన్ని హిందీ నాటకాలు కూడా చదివాను. శరత్ సాహిత్యం లభించింది అంతవరకు చదివాను. నా ప్రయత్నం ఏమీ లేకుండానే సాహిత్య వాతావరణంలో ప్రవేశించాను. యస్.యస్.యల్. సి చదివేరోజుల్లోనే విశ్వనాథ వారి వేయిపడగలు మా పెద్దక్క నేను చదివాము.

హిందీ అర్థమవుతుంది కనక తరచు హిందీ సినిమాలు చూచేవాణ్ణి. తెలుగు సిన్మాలంటే కొంచం చిన్నచూపు. నా టైలర్ మిత్రుడు టీవీఎస్ హిందీసినిమాలకు తీసుకొనివెళ్లేవాడు. ఆ విధంగా సినిమాల మీద అభిరుచి ఏర్పడింది.

నెల్లూరులో హిందీ భాషోద్యమం

మహాత్మాగాంధీ హిందీ భాషా ప్రచారాన్ని జాతీయోద్యమంలో భాగంగా స్వీకరించారు కనక హిందీ నేర్చుకోడం దేశభక్తిలో భాగమైంది.1951 ప్రాంతాలకు హిందీ బోధన నెల్లూరులో చాలా జోరుగా సాగుతోంది. వి.ఆర్. కళాశాల హిందీ అధ్యాపకులు పల్లెకొండ వెంకటసుబ్బయ్య గారు మా పొరుగున ఉండేవారు. వారు ఖద్దరుధోవతి, ఖద్దరులాల్చి ధరించి నల్లటి శరీరం, తెల్లగా నెరసిన జుట్టుతో, దృఢమైన శరీరంతో ఒక వస్తాదులాగా అనిపించేవారు. పరమ శాంతస్వభావులు. బాల్యంలో చదువుకొనే అవకాశం లేని యువజనులను చేరదీసి హిందీలో తరిఫీదు యిచ్చి వారిని హిందీపండితులుగా తీర్చిదిద్దారు. మా యింట్లో బాడుగకుండి సంగీతపాఠాలు- గాత్రం, వయోలిన్ నేర్పించి జీవనం సాగిస్తున్న రామచంద్రయ్య గారు వీరివద్ద హిందీ చదువుకొని పండితులై హిందీ ట్యూషన్లు చెప్పడం మొదలుపెట్టారు. నేను, మా అక్కలు రామచంద్రయ్య గారివద్దే హిందీచదివి పరీక్షలు పాసయ్యాము. విఆర్.కాలేజి హిందీ అధ్యాపకులు పల్లెకొండ వెంకట సుబ్బయ్య గారు దురదృష్టవశాత్తు క్షయరోగపీడితులై మంచంపడితే, డిపార్టుమెంట్లో సహ లెక్చరర్ భట్టారం వెంకటసుబ్బయ్య గారు వారిబదులు వారిక్లాసులు కూడా తనే తీసుకుని విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చేశారు. ఆ రోజుల్లో కమిటీ కూడా మానవత్వంతో వారు కాలేజీకి రాకున్నా వారికి పూర్తిజీతం ఇచ్చి ఆదుకున్నారు.

ఆ రోజుల్లో నెల్లూరులో చాలామంది పండితులు హిందీక్లాసులు చెప్పడం ఉద్యమస్ఫూర్తితో కొనసాగించారు. సుబ్రహ్మణ్యాచార్యులు, కపిల్ దేవ్, వంటి అనేకులు ఈ ఉద్యమాన్ని కొనసాగించారు. 1940లలో మోటూరు సత్యనారాయణ గారు పొణకా కనకమ్మగారి అండతో కొంతకాలం నెల్లూరులో హిందీ బోధించారు. మధ్యతరగతి కుటుంబాల్లో ఆడపిల్లలకు సంగీతం అంటే పెళ్లి సంగీతం చెప్పించేవారు, కొందరు నోటిపాట, కొందరు వయోలిన్. మా బంధువులు అవధానం హనుమంతన్న, పాణ్యం గోపీనాథశర్మ వయోలిన్ పాఠాలు చెప్పేవారు. సంగీతం మాస్టార్లందరూ దుర్భర దారిద్ర్యంలో బ్రతుకులు వెళ్ళదీసినట్లు నాకు అనిపించింది. గోపినాథశర్మ కుటుంబం మద్రాసులో స్థిరపడి సినిమా సంగీతంలో కొంచం బాగుపడింది.1960 కల్లా పెద్ద పెద్ద ఉద్యోగుల అమ్మాయిలకు ఈసం రామకృష్ణయ్య చిత్తూజిల్లానుంచి వచ్చి వీణె, గాత్రం పాఠాలు దాదాపు పాతికేళ్ళు చెప్పారు. జడ్జిగార్లు, ధనికుల పిల్లలు ఆయన విద్యార్థులు. ఆయన శిష్యురాలు బొందు లక్ష్మీ మంచి వీణె టీచరుగా ప్రసిద్ధి లోకి వచ్చి, సెయింట్ జోసెఫ్ బాలికల హైస్కూల్ లో మ్యూజిక్ టీచరుగా స్థిరపడ్డారు. 1950 ప్రాంతాల్లో పొణకా కనకమ్మ ఆదరణలో నటరాజ రామకృష్ణ నెల్లూరులో కొద్దికాలం నృత్య పాఠశాల నిర్వహించారు. కోట సుబ్రహ్మణ్యశాస్త్రి మూడు దశాబ్దాలకాలం నెల్లూరులో బాలికలకు భరతనాట్యంలో శిక్షణ ఇచ్చి ప్రదర్శనలిప్పించేవారు. గవర్నమెంట్ అధికారుల పిల్లలు, ధనికుల పిల్లలు నృత్యం అభ్యసించేవారు.

నెల్లూరులో సినీమాహాళ్లు

1932 ప్రాంతాలకు నెల్లూరులో మెక్లీన్సు క్లబ్ పక్కనే, ఇప్పుడు టెలిఫోన్ బిల్లులు కట్టించుకొనే ఆఫీసున్న స్థలంలో కృష్ణా సినిమా హాల్లో మూగ సినిమాలు ఆడేవి. నృత్యప్రదర్సనలు గూడా అందులోనే జరిగేవి. 1932 అక్టోబరులో రామ్ ప్యారీ అనే బొంబాయి సినిమా నటి వారంరోజులు కృష్ణ సినిమా హల్ లో నృత్యప్రదర్శనలిచ్చి 800 రూపాయలు సంపాదించుకొని పోయిందట! నెల్లూరు న్యాయవాదులు, సంపన్నులు ఎగబడ్డారట ఆమె నాట్యం చూడ్డానికి. పడిపోయిన కృష్ణహాలు గోడలు 1960 వరకూ ఉన్నాయి. ఆ ఖాళీచోటులోనే 1960 ప్రాంతంలో ఒక మంచిగుమ్మడి తీగకొస పాముపడిగలాగా ఏర్పడింది. ఆ వింత, దైవమహిమగా భావించి జనంవేలంవెర్రిగా దాన్ని చూడడానికి వళ్ళారు.. కొన్ని సంవత్సరాల తర్వాత నెల్లూరు నుంచి కనపర్తిపాడు వెళ్ళేదారిలో బీడుపొలంలో గమ్మడి తీగకు పడిగ ఆకృతి ఏర్పడింది. నెల్లూరు సిపిఐ నాయకులు కనుపర్తి రమణయ్య గిరి తల్లిగారు అక్కడ నాగేంద్రుడికి గుడికట్టి పూజారిని ఉంచారు. ఇప్పుడు కూడా ఒక పేద కుటుంబం ఆ గుడిపూజలు చేసి జీవనం గడుపుతున్నారు.

1956 నాటికి నెల్లూరులో కొత్తహాలు, వినాయక, శేష్ మహాల్, రంగమహల్, మణిటాకీస్ మాత్రమే ఉండేవి.

వినాయక సినిమా హాల్

మణి టాకీస్ తప్ప అన్నీ ఒక కిలోమీటరులోపు దూరంలోనే. గురువారం నుంచి శేష్ మహల్, రంగమహళ్లలో ఇంగ్లీష్ సినిమాలు వేసేవారు. నా మిత్రుడు మరుపూరు తరుణేందుశేఖర్ రెడ్డి తండ్రి గారి వెంట వెళ్లి మంచి ఇంగ్లీష్ సినిమాలు చూచేవాడు. కాలేజి చదువులకు వచ్చిన తర్వాతర్వాత మేము ఒకటి రెండు సార్లు మద్రాసు వెళ్ళి కొన్ని మంచి ఇంగ్లీషు, హిందీ సినిమాలు చూసి వచ్చాము. తర్వాత రోజుల్లో సినిమాలకోసమే నెల్లూరులో టూరిస్ట్ బస్సుల ఏర్పాటు వాడుకలోకి వచ్చింది.

మిత్రుడు శేఖర్ రెడ్డి అప్పుడపుడు నన్ను ఇంగ్లీషు సినిమాలకు తీసుకొని వెళ్ళేది. వాడు తర్వాత కాలంలో హాలీవుడ్ సినిమాలమీద అథారిటీ అయ్యాడు. ఈ సినిమా పిచ్చే మా చేత నెల్లూరులో “ది ప్రోగ్రెసివ్ ఫిల్మ్ అసోసియేషన్” పేరుతో ఫిల్మ్ సొసైటీని 1974లో స్థాపించేట్లు చేసింది.

హైస్కూలు చదివే రోజుల్లోనే కురసావా రషోమన్ నెల్లూరు కొత్త హాలులో వేస్తే చూశాము. అది ఒక క్లాసిక్ అని మాకు తెలీదు. కొత్త హాల్లో అధివాస్తవిక సినిమా “హౌస్ ఆఫ్ వేక్సు” చూసి సాయంత్రం ఇంటికి వెళ్ళడానికే భయపడ్డాము. ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ సినిమాలన్నీ మ్యాటినీలుగానో, ఉదయం షోలుగానో వేస్తే చూశాము. శాంతారాం సినిమాలు, పాల్ ముని నటించిన గుడ్ ఎర్తు నెల్లూరు లోనే చూశాము. మాలో గొప్ప సినిమా అభిరుచి రూపుదిద్దుకొంటోందని ఆ రోజుల్లో మేము గుర్తించనేలేదు. ప్రీ యూనివర్సిటి చదువుతున్న సమయంలో(1960) శేష్ మహల్లో సత్యజిత్ రే పథేర్ పాంచాలి సినిమా ప్రదర్శించారు. మైక్‌తో తెరవద్ద నిలబడి ఒకరు తెరమీద జరుగుతున్న సంఘటనలను వివరించి, వర్ణించి చెప్పడం మొదలుపెట్టగానే జనం పెద్దగా కేకలువేసి వాడి నోరు మూయించారు. ఆ తర్వాత నెల్లూరులో సినిమా ప్రదర్శనల్లో కామెంటరీ చెప్పడం చూడలేదు. పథేర్ పాంచాలి సినిమా చూసి వెలుపలికి వస్తున్నపుడు మామేనత్త కుమారులు, న్యాయవాది, సుబ్బరామయ్య కనిపించి ఆ సినిమాలో చివరి సన్నివేశం ప్రాముఖ్యాన్ని గురించి వివరించారు. దుర్గ చనిపోయాక, ఆ కుటుంబం బెనారస్ వెళ్ళిపోతుంది. ఇల్లు ఖాళీచేస్తున్నపుడు ఒక కొబ్బెర చిప్పలో దుర్గ జమీందారు ఇంటి నుంచి తెచ్చి దాచిన దండ కనిపిస్తుంది. అపూ దాన్ని ఇంటిముందు నీటిగుంటలో విసరేస్తాడు. నీటిపైన ఆవరించిన పాచి తొలగి దండ నీటిలో పడగానే క్రమంగా పైన పేరిన పాచి యధాస్థితికి వస్తుంది, కాని నీటి ఉపరితలంలో చిన్న మచ్చ మాదిరి ఏర్పడి అలాగే ఉండిపోతుంది. దుర్గ లేకపోయినా మచ్చ మాసిపోదు అని ఈ ప్రతీక ద్వారా సత్యజిత్ రే సూచించారని ఆయన వివరించారు. 1980లో పూనా ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సులో పథేర్ పాంచాలి సినిమాను పాఠ్యాంశంగా పెట్టారు. ప్రొఫెసర్ సతీశ్ బహదూర్ పథేర్.. సినిమా మీద ఎంత అద్భుతంగా పాఠాలు చెప్పారో!

మాకు ఊహవచ్చేసరికి పులిగండ్ల రామకృష్ణయ్య గారి తుఫాను నాటికను తరచు ఎవరో ఒకరు ప్రదర్శించేవారు. విఆర్.కళాశాల రంగస్థలంమీద, న్యాయవాదులు కోర్టు ఆవరణలో, తంతి తపాలాశాఖ ఏటా జరిపే సాంస్కృతికోత్సవాల్లో ఎక్కడో వొకచోట తుపాను నాటిక ప్రదర్శించబడుతూనే ఉండేది. నెల్లూరు రెడ్లయాస, ఆదీమద్రాసు యాసలో పాత్రల సంభాషణలు. ఈ నాటిక గొప్ప విజయాన్ని సాధిచి రామకృష్మయ్యగారికి మంచి పేరుతెచ్చిపెట్టింది. ధోవతి, లాల్చి ధరించి అచ్చం బెంగాలీబాబులాగా,చాలా సౌమ్యులుగా, నిరాడంబరంగా వుండేవారు. మరొక రచయిత అబ్దుల్ ఖాదర్, ఏదో ప్రభుత్వోద్యోగం, ఆయన రాసిన దేవాంగం పిల్లులు కూడా కొంచెం పేరు తెచ్చుకుంది. ఆనాటి ప్రత్తి జూదమో ఏదో ఇతివృత్తం. ఖాదర్ సొంతబృందమే నాటికను ప్రదర్శించేవారు. ఖాదర్ నటుడేగాని కంఠం చాలా తక్కువ స్థాయిలో పలికేది.

నెల్లూరు పత్రికలు

నెల్లూరు పత్రికలకు ప్రసిద్ది. చిత్తలోపుట్టి మఖలో పోయేవి చాలా. 1930లో పొణకా కనకమ్మగారి చేత జమీన్ రైతు పత్రిక స్థాపించబడి, నెల్లూరు వెంకట్రామానాయుడు గారిచేత నిర్వహించబడింది. ఇప్పటికీ నిరంతరాయంగా తెలుగులో వెలువడుతున్న సజీవ పత్రిక ఇదొక్కటే. మన్నేపల్లి రామకృష్ణరావు సుబోధిని పత్రికను 1920-30 దశకంలో నిర్వహించారు. జాతీయోద్యమానికి, సాహిత్యానికి, స్థానిక వార్తలకు ఈ పత్రిక అంకితమైంది.1954 ప్రాంతంలో మరుపూరు కోదండరామారెడ్డి గారు మందాకిని వారపత్రికను పారంభించి పుష్కరకాలం కొనసాగించారు. ఆయన 1937 ప్రాంతం లోనే ప్రభాత ప్రెస్ నెలకొల్పి, ‘రంధ్రాన్వేషి’ పత్రిక కొద్దికాలం నిర్వహించారు. విద్యార్థిగా మందాకిని పత్రిక చదివేవాణ్ణి. ఓ హెన్రీ కథలు, మరికొందరి కథలు కోదండరామారెడ్డి గారు అనువదించి అందులో ప్రచురించారు. అట్లా కొన్ని ఇంగ్లిష్ కథలతో పరిచయంకలిగింది. బంగోరె, నేను పరిశోధించి 1870లో నెల్లూరు తొలిపత్రిక “నెల్లూరు పయోనీర్”ను దంపూరు నరసయ్య, ఆయన మిత్రుడు ఎంబెరుమాళ్ళయ్య రెండు మూడేళ్లు నిర్వహించినట్లు నిరూపించాము. ఇటీవల మనసు ఫౌండేషన్ వారి సహకారంతో వర్ధమాన సమాజం కొన్ని ముఖ్యమైన నెల్లూరు పాత పత్రికలను డిజిటైజ్ చేయించగలిగింది. ఈ సత్కార్యంలో ఈ రచయితకు కూడా చిన్న పాత్ర ఉంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here