జ్ఞాపకాల తరంగిణి-14

1
5

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]తె[/dropcap]లుగు పొయిట్రీలో ఆధునిక కవిత్వం కింద మధునాపంతులవారి ఆంధ్ర పురాణాన్ని మాకు పాఠ్య పుస్తకంగా పెట్టారు. మోడరన్ పొయిట్రి ఆచార్య నారాయణరెడ్డి గారు చెప్పేవారు. ఆయన ఎప్పడు ప్యాంటు స్లాక్‌లో ట్రిమ్‌గా, నల్లటి వంకీల క్రాఫుతో చాలా అందంగా ఉండేవారు. ఆంధ్రపురాణం ప్రాచీన కవిత్వ ధోరణిలో రచించబడిందని అంటూ, కొత్త పదబంధాలు, వర్ణనలను నూతనత్వం ఉన్న అంశాలను  వివరించేవారు. సినారె పద్యాన్ని వచనప్రాయంగా చదివేవారు. ఒకే ఒకసారి మాత్రం చాలా రాగయుక్తంగా చదివి, ఇటువంటి ధోరణిలో చదివితే శ్రోతలకు అర్థం మీద దృష్టి నిలవదని, విద్యార్థులకు పాఠం ఈ విధంగా పాడి వినిపించడం అలవాటు చేయకూడదని అన్నారు. అప్పుడప్పుడే ఆయన సినిమాలకు రాస్తున్నారు. ప్రయత్నాలు చేస్తున్నారు. సినిమా కవిగా గుర్తింపు వచ్చింది. అందువల్ల వారి పాఠం అంటే చాలా ఇష్టం అందరికీ.  నాకు కఠినపదాలకు అర్థం రాసుకొనే అలవాటు. వారు “ఇంకా ఆ అలవాటు పోలేదా” అని నన్ను చూచి అన్నారు. అప్పటినుంచి పాఠ్యపుస్తకంలోనే సన్నఅక్షరాల్లో రాసుకొనేవాణ్ణి. ఏకవీర సినిమా ఫెయిలయిలవడం నాకు చాలా విచారం కలిగించింది. ఎందుకు వైఫల్యం పొందిందని అడిగాను. “అందులో ఏముంది? నిట్టూర్పులు, కన్నీళ్ళు తప్ప” అన్నారు నారాయణరెడ్డి గారు నవ్వుతూ.

రెడ్డిగారు మాకు ఎర్రాప్రెగడ spl author paper చెప్పారు. ప్రతి విద్యార్థి చేత ఒక పేపర్ రాయించి సెమినార్లో చదివించారు. మా ముందు batch సెమినార్ పేపర్లను పుస్తకంగా ప్రచురించారు కూడా. కొన్నేళ్ల  తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో పోస్టుకు ఇంటర్వ్యూకు వెళ్ళినపుడు వి.సి. పదవిలో వున్న వారు నా క్షేమసమాచారాలు ఆత్మీయంగా విచారించారు. చాలా ఏళ్ల తర్వాత ఒక ప్రొఫెసర్ గారి చిరునామా తెలియక నా కుమారుడు నారాయణరెడ్డి గారి ఇంటికి వెళ్లి విచారించాడు. ఆయన వచ్చిన యువకుడు నెల్లూరు పురుషోత్తం అబ్బాయి అని తెలుసుకొని కారు  డ్రైవరును పిలిచి కారులో విడిచి పెట్టి రమ్మన్నారు. ఈ సంగతి విన్నపుడు నాకు చాలా సంతోషం కలిగింది. నెల్లూరులో వారికి చాలా సన్మానాలు జరిగాయి. సభల్లో ఉపన్యసించారు. ఆ రోజుల్లో ఆయన ఒక తారలా  వెలిగారు. కోఠి మహిళా కళాశాలలో ఏదో సాహిత్యసభ జరిగింది. సభ జరగడానికి ముందు ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి గారు, అక్కినేని, సినారె కొంచెం దూరంగా నిలబడి మాట్లాడుకొంటున్నారు. ముఖ్యమంత్రి గారు జోబులోంచి సిగరెట్ పెట్టె తీసి అక్కినేని, సినారెకు సిగరెట్లు ఇచ్చారు. ముగ్గురు పొగ తాగడం ముగించి సభాప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆ దృశ్యం తలచుకొంటే నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఇప్పటి వంగోని దండాలు, నక్కవినయాలు, తల్చుకొంటే ఆనాటి స్వేచ్ఛ యెంత గొప్పదో అనిపించింది.

ఉస్మానియాలో మొదటి సంవత్సరం తెలుగు ఎం.ఏ. విద్యార్థులు కన్నడ లేదా తమిళమో ఒకటి తీసుకోవాలి. అందరూ కన్నడ పేపర్ తీసుకొన్నారు. నేను, ప్రభాకర్, సుధ, ఫణికుమారి తమిళం తీసుకొన్నాము. చింగారవేలు గారు ఆ శాఖ హెడ్. మాణిక్కం, శ్రీమతి చింగారం లెక్చరర్లు. ప్రీ యూనివర్సిటీ తమిళ పాఠ్యపుస్తకమ్, తమిళ సాహిత్య చరిత్ర, 40 తిరుక్కురళ్ పద్యాలు పాఠ్యాంశాలు. చాలా సరదాగా, చనువుతో వారివద్ద తమిళం చదివాము. నా పెళ్లి శుభలేఖ పంపితే మాణిక్కంగారు తమిళంలో ఆశీర్వచన పద్యాలు రాసి పంపారు. చింగారవేలు మొట్టమొదట మానవులు తమిళనాడులోనే, ఆవిర్భవించారని, తమిళమే అత్యంత ప్రాచీనమైన భాష అనీ అనేవారు.

ఎం.ఏ. మొదటి సంవత్సరం పరీక్షలు రాసి, వేసవి సెలవులకు నెల్లూరు వెళ్ళాను. ఆ వేసవిలో నా సహాధ్యాయి టి. ప్రభాకరరెడ్డి, అక్కిరాజు రమాపతి రావు గారు మహాభారత సంశోధితప్రతి ప్రాజెక్ట్ పని మీద కొన్నిరోజులు తంజావూరు సరస్వసతి మహల్ గ్రంథాలయంలో తెలుగు మహాభారత ప్రతుల వివరాలు సేకరించుకుని హైద్రాబాద్‌కు వెళ్తూ నెల్లూరులో ఆగేరు. ప్రభాకర్ కొద్దిరోజులు నెల్లూరులో ఉన్నాడు. తర్వాత ప్రయాణమయి బెజవాడలో ఉండవల్లి, మొగల్రాజపురం గుహలు, వరంగల్, రామప్పగుడి చారిత్రిక ప్రదేశాలు చూస్తూ కాలేజీ తెరిచేనాటికి హైద్రాబాదు చేరాము. అప్పుడే ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి పేపరు చదివి పరీక్ష రాసిన మా కళ్లకు బెజవాడలో గుహలు, మ్యూజియం, వరంగల్, రామప్పగుడి చారిత్రిక ప్రదేశాలు అద్భుతంగా అనిపించాయి. ఇప్పడు తెలుగు ఎం.ఎ.లో ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి  పేపర్ తొలగించారు. నావరకు ఆ పునాది బాగా ఉపయోగించింది.

ఒకరోజు హాస్టలు వెలుపల రోడ్డు వద్ద నిలబడి ఉన్నాము. ఉదయం 11 గంటలయివుంటుంది. టాపులేని కారులో మన ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు నిలబడే వున్నారు. వెనక ముందు రెండు పోలీసు జీపులు, వాటి వెనక ఐదారు కార్లు అనుసరిస్తూ వెళ్ళాయి. ఆ విధంగా యాదృచ్ఛికంగా మన ప్రధానమంత్రిని దర్శించే అవకాశం కలిగింది. నాతో వున్న విద్యార్థులు శాస్త్రిగారు తార్నాకాలో ఒక పరిశోధన సంస్థను ప్రారంభించడానికి వెళుతున్నారనీ, అందులో మనబోటివాళ్ళకు ప్రవేశం కూడా అసాధ్యమని అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రిగారు ఆరోజు ఉదయం తార్నాకాలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్స్ నూతన భవనాన్ని ప్రారంభించడానికి వెళ్ళారు. 1966 జూన్‌లో స్టేట్ ఆర్కైవ్స్ హైదరాబాద్ సంస్థ అఖిలభారత స్థాయిలో ఎనిమిది స్కాలర్షిప్‍లను ప్రకటించింది. ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన ఏ అంశంమీదైనా పరిశోధించే పిహెచ్.డి విద్యార్థులను ఇంటర్వ్యూ చేసి ఎంపికైన పరిశోధకులకు స్కాలర్షిప్ ఇస్తారు. ఈ స్కాలర్షిప్ యుజిసి ఇచ్చే స్కాలర్షిప్ కన్నా పెద్దది. 1966లో తొలి బ్యాచ్‌లో నేను కూడా ఈ ఉపకారవేతనానికి ఎంపిక కావడం యాదృచ్ఛికం కావచ్చు. ఇక్కడే మరొక విషయం ప్రస్తావించాలి. శాస్త్రిగారి అకాలమరణంతో దేశమంతా విషాదంలో మునిగి పోయింది. ఆరోజు రాత్రి డైనింగ్ హాల్లో భోజనం చేస్తున్నపుడు ఒక విద్యార్థి శాస్త్రిగారు కాకుండా ఏ సత్యజిత్ రాయో చచ్చి పోయివుంటే బాగుండేదని అన్నాడు. సత్యజిత్ రాయ్ చనిపోతే నా కుటుంబసభ్యులు పోయినంత దుఃఖిస్తానని నేనన్నాను. మరుసటిరోజు ఒక గ్రూపు విద్యార్థులు నామీద మా హాస్టల్ ఇంఛార్జి ప్రొఫెసర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హాస్టల్ వదలిపెట్టి నాలుగైదు రోజులు నగరంలో మిత్రుల వద్ద ఉండవలసి వచ్చింది. హాస్టల్ ఇన్ఛార్జి ప్రొఫెసర్ నామీద చేసిన ఆరోపణలు అసత్యాలని తేల్చారు. వామపక్ష భావజాలానికి చెందిన విద్యార్థులు నాకు అండగా నిలబడడంతో నేను తిరిగి హాస్టలుకు వచ్చాను.

ఫైనల్ ఇయర్‌లో Students Federation తరఫున యూనివర్సిటీ విద్యార్థిసంఘం అధ్యక్ష పదవికి SF తరఫున అభ్యర్ధిని నిలిపి ప్రచారం చేశాము, కాని, అతను కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయాడు కానీ,  హాస్టల్లో ఆ భావజాలానికి చెందిన వారం సంఘటితమయ్యాము. రెండో సంవత్సరం నా రూమ్మేట్ లక్ష్మీకాంతరెడ్డి, ఆర్థికశాస్రం ఫైనల్ విద్యార్థి. అతనిది కర్నూలు ప్రాంతం. తండ్రి లేడు నాకు లాగే. మేనమామ చదివిస్తున్నాడు. చదువు తప్ప మరొక లోకం లేదు. నిద్ర రాకుండా ఉండేందుకు విపరీతంగా సిగరెట్లు కాల్చేవాడు.  పరీక్షల సమయంలో నేను కూడా నిద్ర కాచుకొను సిగరెట్లు అలవాటు చేసుకున్నా. పొగాకు వాసనతో వేళ్ళు పచ్చగా మారి భోజనంచేస్తే డోకొచ్చేది.

ఆ ఏడు డిసెంబర్ సెలవులలోనే మా హాస్టల్ విద్యార్థులు అజంతా, ఔరంగాబాద్, ఎల్లోరా EXCURSION వేశారు. మిత్రులతో కలిసి ఆ యాత్రకు వెళ్లిరావడం మరచిపోలేని అనుభవం. మాతోపాటు యూనివర్సిటీలో జపాన్ భాష బోధించే జపాను దేశ ఆచార్యులు, వారి శ్రీమతి కూడా ఈ టూర్‌కు వచ్చారు. అజంతా, ఎల్లోరాలను చూచి పరవశమైపోతూనే భారతదేశంలో బౌద్ధం నశించిపోయిందని దుఃఖించారు. మాతో జాన్, జెర్రీ  విదేశీ విద్యార్థులు కూడా వచ్చారు. వాళ్ళకు అజంతా కానీ ఎల్లోరా కానీ ఏమీ నచ్చలేదు. ఇద్దరూ ఇప్పుడు ఆ గుహలు తవ్వితే డాలర్లలో ఎంత ఖర్చవుతుందో లెక్కలు వేశారు. మేము ఔరంగాబాదులో చిన్న లాడ్జిలో దిగాము. జాన్ జెర్రీ ద్వయం రాత్రి సందులో దిసమొలలతో జలకాలాడుతూ ఇద్దరూ ఎందుకో కౌంటర్ వద్ఠకు పరిగెత్తారు. లాడ్జి యజమానురాలు నడివయసు మహిళ, కళ్ళు మూసుకుని పెద్దగా కేకలు వేసింది. వాళ్ళు మళ్ళీ బాత్రూమ్‌కు పరుగుదీశారు. అందరికీ ఒక కల్చరల్ షాక్. ఈ విదేశి విద్యార్థులను గురించి మరొక విషయం కూడా చెప్పాలి. ఎ హాస్టల్ ప్రవేశ ద్వారం వద్ద పెద్ద హాలు, రెండువైపులా గదులకు వెళ్ళే విశాలమైన దారి, రెండో అంతస్తు కూడా ఈ మాదిరే ఉంటుంది. హాస్టల్ ప్రవేశ ద్వారం వద్ద హాల్‌లో టిటి బోర్డు ఉంటుంది. వస్తూపోతూ విద్యార్థులు టిటి ఆడుతూనే ఉంటారు. సాయంత్రం ఏడుగంటలవేళ టిటి మేచ్ జరుగుతోంది.  ఆట మంచి రసపట్టలోవుంది. ఇంతలో బోర్డు పైన వెలిగే పెద్ద బల్బు కాలిపోయింది. కొత్త బల్బు పెట్టడానికి ఎవరికీ అందనంత ఎత్తులోవుంది. ఏంచేయాలో తోచక అందరూ నిట్టూరుస్తున్నారు. ఇంతలో జాన్, జెర్రీ భోజనం చేసి గదికి వెళ్తూ పరిస్థితి గమనించారు. జాన్ టెన్నిస్ టేబుల్ పైన చేతులు టేబిల్‌కు ఆన్చి ఒక స్టూలులాగా కూర్చున్నాడు. జెర్రీ బూట్లు విప్పకుండానే జాన్ వీపుమీద నిలబడి బల్బు బిగించాడు. ఇద్దరూ ఏమీ జరగనట్లే వెళ్ళిపోయారు. అక్కడ నిలబడ్డ మా విద్యార్థుల్లో ఒకరికి కూడా అటువంటి ఆలోచన, ఉపాయం స్ఫురించలేదు.

ఎంఎ ఫైనల్ ఇయర్‌లో మొదటి సంవత్సరమంతగా కష్టపడలేదు. కొంచెం సినిమాలు, సాహిత్యసభలు, రవీంద్ర భారతిలో బి.ఎస్ ఆర్ కృష్ణగారి డ్రామా స్కూల్ ప్రదర్శించిన నాటకాలు చూడగలిగాను. ఎందరో కవిపండితులు దాశరథి, జ్వాలాముఖి, బోయి భీమన్న, వరంగల్ కవులను కలిసాను, విన్నాను. హోటల్ గోపిలో మొదటిసారి లత, స్వామి తల్లావజ్ఝల శివశంకరస్వామిని చూసాను. రవీంద్రభారతి ఎదురుగా, రోడ్డుకు ఆవలివైపు ఎత్తుగా ఒక గుట్టమీద ఉన్న హొటెల్ గోపిలో బల్లల ముందు కూర్చొని కాఫీ తాగుతుంటే కనిపించే దృశ్యం చాలా బాగుండేది. తివోలి, ప్లాజా సినిమా హాళ్లలో ఇంగ్లీష్ సినిమాలు చూచాను. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో హైదరాబాద్ ఫిల్మ్ క్లబ్ వారు పథేర్ పాంచాలి 16mm ప్రొజెక్టర్‌తో ప్రదర్శించారు. తర్వాత ఆ క్లబ్ వారే ఆర్.ఆర్. ల్యాబ్‌లో సభ్యులకు సినిమాలు ప్రదర్శించేవారు. ఈ స్ఫూర్తితోనే 1974లో నెల్లూరులో మేము ఫిల్మ్ సొసైటీ ప్రారంభించాము.

నా హాస్టల్ మిత్రుడు, కన్నడ యం.ఎ విద్యార్థి కులకర్ణి రామారావు వర్ధమాన కవి. అతని సాహచర్యంలో కన్నడ డిపార్ట్మెంట్ అధిపతి ఆచార్య శివరుద్రప్ప, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్  డైరెక్టరు ప్రొఫెసర్ వి.కె . గోకాక్ వంటి మహా రచయితలను, మేధావులను కలుసుకొని వారు కవిత్వం చదువుతూంటే వినే అవకాశం, వారితో సంభాషించే అవకాశం కలిగింది.  మిత్రుడు రాజమల్లాచారి తెలుగు ఎంఏలో నాకన్నా ఒక సంవత్సరం జూనియర్. వెన్నెల రాత్రులు హాస్టల్ వెలుపల రోడ్డు పక్కన కూర్చొని అతను మధురమైన కంఠంతో గొంతెత్తి పాడుతూంటే మళ్ళీ మళ్ళీ పాడించుకొని వినేవాణ్ణి. రవీంద్రభారతి ఆవరణలోని లలితకళా అకాడమీలో ఏర్పాటయిన చిత్రకళా ప్రదర్శనలు, ఫోటోగ్రఫీ ప్రదర్శనలు కొన్ని చూచాను. హాస్టలు విద్యార్థులం ఉషశ్రీ గారి శిక్షణలో రేడియో నాటకంలో పాల్గొన్నాము. ఆ నాటకం ద్వారా ముట్టిన పారితోషికంతో ఉషశ్రీగారితో గ్రూపు ఫొటో, పార్టీ, సినిమా చూసి రాత్రి పదిగంటలకు హాస్టళ్ళకు చేరాము. మా బృందంలో వసంత, దుర్గ ఇద్దరూ లేడీస్ హాస్టల్‌లో వుండేవారు. అంతరాత్రివేళ హాస్టల్ తలుపులు మూసి ఉంటాయి. మాలో సాహసులు ప్రసాదరావు,(IES), మాణిక్యాలరావు ఇద్దరమ్మాయిలను పెరటివైపు ఎత్తైన గోడమీదుగా దాటించారు. నేను అసలే భయస్తుణ్ణి, గడగడ వణుకుతూ ఆటోలో కూర్చొని ఉన్నా.

స్వర్గీయ శ్రీ ప్రసాదరావు

ఒకసారి నాట్యసంఘంలో అధ్యాపకులు అబ్బూరి రామకృష్ణారావు గారి కుమారులు గోపాలకృష్ణ నా మిత్రుడు రామారావుతో మాట్లాడుతూ ఉర్దూ “పవర్ఫుల్  లాంగ్వేజ్ అనీ, కన్నడ feminine లాంగ్వేజ్” అని అన్నపుడు నా మిత్రుని ముఖం ముడుచుకుపోయింది. అతని మాతృభాష  కన్నడ. ఈ అనుభవాలు పరోక్షంగా నా మనోవికాసానికి తోడుపడ్డాయి. యూనివర్సిటీలో చేరిన కొద్దిరోజులకే వరవరరావుగారి పరిచయం చిత్రంగా జరిగింది. జ్యోతి మాసపత్రికలో వారు మార్లిన్ మన్రో మీద అకవితావస్తువు శీర్షికతో కవిత – ఎలిజీ కాబోలు రాశారు. రాత్రి భోజనం చేస్తూ ఆ కవితను గురించి మిత్రులతో గొప్పగా చెప్తున్నాను. మా ఎదురుగా కుర్చొనివున్న బక్కపల్చని విద్యార్థి “నేనేనండీ వరవరరావుని” అన్నారు. వారు అప్పుడు పి.హెచ్.డి చేస్తున్నారు.

ఎం.ఎ. పరీక్షలు ప్రైవేటుగా రాస్తున్న కొందరు అధ్యాపకులు మా రూంలో ఉండడానికి అవకాశం ఇవ్వమని కోరారు. మాది ఇద్దరు మాత్రమే ఉండే డబుల్ రూం. వాళ్ళు స్నానాదులకు మాత్రమే రూంలోకి వెళ్ళాలని, మిగిలిన సమయంలో వరండాలో పెద్ద హాల్లో పడుకోవాలనే నిబంధన పెట్టి ఒప్పుకొన్నా. అలాగే సద్దుకొని పరీక్షలు రాశారు. మా రూంమేట్ ఈ అసౌకర్యానికి చాలా బాధపడ్డాడు. పరీక్షలు పూర్తయ్యాక కృతజ్ఞతతో నాతో కలిసి స్టూడియోలో ఫొటో దిగారు. వారిలో శ్రీనివాసాచారి కేలిఫోర్నియా వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రథాన పూజారి అయ్యాడు.

1965 డిసెంబర్‌లో ఉస్మానియా చరిత్ర శాఖ అధిపతిగా ప్రొఫెసర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారు డెప్యూటేషన్ మీద చేరారు. వారు ఉస్మానియాకు రాకముందు అర్కిలాజికల్ సర్వే అఫ్ ఇండియాలో ఒక జోన్‌కు అధిపతిగా ఉన్నారు. అప్పుడు యంఏ చరిత్ర మొదటి సంవత్సరం చదువుతున్న బొందు నరసింహం నన్ను రావిప్రోలు వారికి పరిచయం చేశారు. చరిత్ర శాఖలో ఆచార్యులందరి పరిచయం అయింది.

1957లో నందికొండ వద్ద తవ్వకాల సమయంలో ప్రొఫెసర్ రావిప్రోలు సుబ్రమణ్యం గారు, అప్పటి ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ త్రివేది గారు, బి. గోపాలరెడ్డి గారు, పి.వి.సి.శర్మ గారు, ఇద్దరు కాంగ్రెస్‌వాదులు
నందికొండ త్రవ్వకాల్లో లభించిన రంగనాథస్వామి విగ్రహం
ఆలయం గోడ

రావిప్రోలు వారు రాక ముందు ఒక పెద్దాయన – చరిత్ర శాఖ అధిపతి, నెల్లూరు బియ్యం కావాలన్నారు. సెలవులకు వెళ్లి తిరిగి వచ్చేసమయంలో చిన్న బస్తా బియ్యం వారి ఇంటికి చేర్చాను. వారు ముస్లింలు. సికింద్రాబాదులో రైలు పెట్టెలాగా ఇల్లు కట్టారు. ఆఫీస్ రూమ్ లోనుంచి రెండడుగుల దారి. వరసాగ్గా ముగ్గురు కుమారులు, కోడళ్లకు మూడు గదులు. ప్రొఫెసర్ గారికి ఒక బెడ్రూము, చివర డైనింగ్ హాల్, వంటగది. ఇల్లంతా చూపించారు. స్త్రీలను గూడా పరిచయం చేశారు. ఘోషా లేదు. నాకు బియ్యం ధర, ఖర్చులు కూడా ఇచ్చిపంపారు. గొప్ప సంస్కారులు.

ఎంఎ ఫైనల్ పరీక్షలు రాసి, దాదాపు ఏడునెలల తర్వాత నెల్లూరు వెళ్ళాను. పరీక్షల సమయంలో నేను పెట్టవలసిన రెండు తిథులు వచ్చాయి. మా అమ్మగారు  సికిందరాబాదులో పౌరోహితుల ఇంట్లో తిథి పెట్టుకోమని జాబు రాయించారు. ఐతే మా చిన్నక్క భర్త అవసరం లేదని, నెల్లూరు వచ్చిన తర్వాత ఆ తద్దినాలు జరుపుకోవచ్చనీ జాబు రాశారు. వారి సలహా ప్రకారం నడుచుకొన్నాను. నేను పరీక్షలు పూర్తై నెల్లూరు వచ్చినరోజే మా అమ్మ నాచేత రెండు తిథులు ఒకేరోజు జరిపించింది.

నెల్లూరు వచ్చిన పదిరోజులకే నా సహాధ్యాయి, ప్రియమిత్రుడు టిప్పిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనకు పెళ్ళి నిశ్చయమైందని, ఉన్నపళంగా బయల్దేరి రమ్మని టెలిగ్రాం ఇచ్చాడు. వెంటనే హైదరాబాదు వెళ్ళాను. మరుసటి రోజే పెళ్ళివారి వెంట జడ్చెర్ల వద్ద ఎక్కడో బస్సు దిగాము. అక్కడ నుంచి రెండెద్దుల గూడుబళ్ళల్లో ఆడపెళ్ళివారి గ్రామానికి చేరాము. తెలంగాణలో ఒక కుగ్రామంలో  వెళ్ళికి వెళ్ళడం గొప్ప అనుభవం.  తిరుగు ప్రయాణంలో యస్.వి.రామారావు (ఆచార్య) గారి వెంట వారి స్వగ్రామం శ్రీరంగాపురం వెళ్ళాను. వాళ్ళ ఇల్లూ వ్యవసాయం, ఆ పనివాళ్ళూ చూస్తే భూస్వాములనిపించింది. స్నానానికి నీళ్ళు తోడడానికి కూడా మనిషే. ఆవూళ్ళో రంగనాథస్వామి ఆలయం, ఆ మండపాలు అన్నీ తిప్పి చూపించారు రామారావు గారు.

రాత్రి భోజనాలు చేశాక ఆరుబయట మంచాలు వేశారు. ఒకరాత్రివేళ ఒక మహిళ రోదన ఉండి ఉండి వినిపిస్తోంది. నాకు నిద్ర పట్టలేదు. రామారావు గారిని లేపాను. “ఏమీలేదులే, మా అమ్మగారికి తేలుకుట్టింది, పడుకో” అన్నారు. నెల్లూరులో అయితే ఎంత హడావిడి, ఎన్ని ఉపచారాలు, బాధితురాలి చుట్టూ ఎంతమంది గుమిగూడేవారు! అందరూ నిబ్బరంగా పడుకొని ఉన్నారు. నేనొక్కడినే నిద్రపోలేదు. ఉదయం బస్సెక్కిస్తే హైదరాబాదు చేరి మా మిత్రుడు, పెళ్ళికొడుకు ప్రభాకరరెడ్డి ఇంటికి వెళ్ళాను. వాడు పెళ్ళిలో తనకు ఇచ్చిన ఉంగరం తీసి చూపించాడు. చాలా బాగుందన్నా. దాన్ని నా వేలికి తొడిగాడు. తీసి ఇవ్వబోతే రేపు ఇద్దూలే అని ఉంగరం తీసియివ్వనివ్వలేదు. ఆరోజు ఒక పాత పరిచయస్థులను చూడను వెళ్ళి బలవంతంచేస్తే వాళ్ళింట్లో ఉన్నా. తెల్లవారి స్నానం చేసేముందు బాత్రూమ్‌లో ఉంగరం తీసిపెట్టి స్నానం చేసి వెలుపలికి వచ్చాను. నా వెంటనే స్నానంచేసి వస్తూ వారింట్లో ఒకవ్యక్తి ఆవుంగరం వేలికి పెట్టుకొని వచ్చాడు. అది నా వుంగరం అన్నా. సాయంత్రం ఇస్తాలే అంటూ ఆఫీసుకు వెళ్ళాడు. సాయంత్రం అడిగితే ఉంగరం కుదువ పెట్టాన్నాడు. ప్రభాకర్ రెడ్డిని చూడకుండానే నెల్లూరు వెళ్ళిపోయాను. ప్రభాకరరెడ్డికి నేను ఏమీ చెప్పలేదు, తను అడగనూలేదు. 1969లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా సాగుతోంది. నాకే కష్టంవేసి కొంతమొత్తం తనకు ఎం.ఓ చేశాను. అతనొక జాబు రాశాడు. “ఎం.ఓ. తీసుకోకపోతే నిన్ను అవమానించినట్లు అవుతుందని నాన్నగారు తీసుకోమన్నారు, ఈమారు హైదరాబాద్ వచ్చినపుడు డబ్బు తీసేసుకో” అని రాశాడు. వాళ్ళ నాయనగారు రాజమల్లారెడ్డి గారు చిక్కడపల్లి ఆంధ్ర విద్యోదయ హైస్కూలు హెడ్మాస్టరు. చాలా గంభీరంగా, పిల్లతో స్నేహంగా ఉండేవారు. ప్రభాకరరెడ్డి దోమల్‌గుడా ఎవికాలేజిలో పిజి డిపార్టుమెంట్ అధిపతిగా పనిచేసి రిటైరైనాడు. 2013లో హైదరాబాద్ వెళ్ళినప్పుడు నిజాంక్లబ్‌లో మధ్యాహ్నం లంచ్‌కి తీసుకుని వెళ్ళి, తర్వాత వీడ్కోలు తీసుకున్నాడు. 2019లో కాబోలు వెళ్ళిపోయాడు.

నిజాం క్లబ్ ఎదురుగా మిత్రులు టి. ప్రభాకర్ రెడ్డి గారితో రచయిత

ప్రభాకరరెడ్డి పిల్లలందరూ చదువుకొని పైకొచ్చారు. అలాంటి మిత్రులు అరుదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here