జ్ఞాపకాల తరంగిణి-15

0
8

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]ఎం[/dropcap].ఎ. ఫైనల్ ఫలితాలు తెలిశాయి. నేను ఫస్ట్ క్లాసులో క్లాస్ ఫస్టుగా వచ్చాను కనుక గురజాడ అప్పారావు గారి పేర ఇచ్చే స్వర్ణపతకం కూడా నాకు ఇస్తున్నట్లు యూనివర్సిటీ ప్రకటించింది. నేను ఈ ఫలితాన్ని ఊహించలేదు. జీవితంలో ఒక ఘట్టం పూర్తయింది. ఎం.ఎ. చదువుకు ఆర్థిక సహాయం చేసిన మా పెద్దమ్మ అల్లుడు, నెల్లూరులో ఇన్‌కమ్ టాక్సు ప్రాక్టీసులో అగ్రస్థానంలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం గారు తమ చిన్నమ్మాయిని చేసుకోమని కోరారు. కృతజ్ఞతాభావంతో అంగీకారాన్ని తెలిపాను, ఏ కారణం చేతో మా అక్కలకు, అమ్మగారికి అంత ఆమోదంగా లేకపోయినా. నా కాబోయే భార్యను ఒకసారే చూచాను. తను పి.యు.సి. చదువుతూ కొందరు నేస్తాలతో కలిసి మా యింటికి వచ్చి మంచినీళ్ళు అడిగి తాగి వెళ్ళిపోయింది. అప్పుడు ఎం.ఎ. చదువుతూ సెలవులకు ఇంటికి వచ్చివున్నాను. తనూ నన్ను చూడడం కూడా అప్పుడే. బాల్యంలో బాగా పరిచయం ఉన్నా పెద్దవాళ్ళం అయ్యాక మేము కలుసుకోలేదు. ఆర్థికంగా వాళ్ళ కుటుంబం చాలా ఉన్నతస్థితిలో ఉన్నారు. మేము వ్యవసాయం మీద ఆధారపడిన మధ్యతరగతివారం. పెళ్ళయిన మరురోజే మాయిద్దరినీ కలిపారు. కాని తెల్లవారి స్టేట్ ఆర్కైవ్సు హైదరాబాదు నుండి టెలిగ్రాం వచ్చింది, మరుసటి రోజు హైదరాబాదులో నేషనల్ స్కాలర్‌షిప్ కోసం ఇంటర్వ్యూకు హాజరు కమ్మని. మా పిన్నమ్మ భర్త ద్వితీయ విఘ్నం అని హైదరాబాదు ప్రయాణం మానుకోమని హితబోధ చేశారు. స్కాలర్‌షిప్ అవకాశం వదులుకోరాదని అనుకొన్నాను. మా అమ్మగారు నా శ్రీమతిని నాతో పాటు హైదరాబాద్ తీసుకుని పోవడానికి అంగీకరించలేదు. నా జీవిత సహచరికి నా సమస్యను వివరించి, ఎంతో బాధగా వీడ్కోలు తీసుకుని హైదరాబాదు వెళ్ళాను. ఇంటర్వ్యూ పూర్తయిన తర్వాత ఒకరోజు హైదరాబాదులోనే వుండి నెల్లూరు చేరాను. మా పెళ్ళి పదహారునాళ్ళ పండుగ రోజునే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పిహెచ్.డి ప్రవేశానికి ఇంటర్వ్యూకు హాజరుకమ్మని టెలిగ్రాం వచ్చింది. ఆరోజు మా పిన్నమ్మ మనమరాలు పదినెలల బిడ్డకు విరేచనాలై ప్రమాదకర పరిస్థితిలో హాస్పిటల్‌లో చేర్చి కాస్త కుదుటపడ్డాక మధ్యాహ్నం మూడు తర్వాత ఎప్పుడో మా అత్తగారింటికి వెళ్ళాను. విందుకు బంధువులందరినీ పిలుచుకొన్నారు. నాకోసం అందరూ ఎదురు చూస్తున్నారు. హడావిడిగా ఏవో సాంగాల తర్వాత భోజనాలు ముగించి హైదరాబాదు ప్రయాణానికి సిద్ధమయ్యాను. తనుకూడా నాతో హైదరాబాదు వస్తానంది. మా బావమరిది మమ్మల్ని హైదరాబాద్ రైల్లో ఎక్కిస్తూ మా ప్రయాణానికి అవసరమైన డబ్బు కూడా ఇచ్చాడు.

1967 జనవరిలో భార్యతో రచయిత

హైదరాబాదులో మేము ఎం.ఎల్.సి. సింగరాజు రామకృష్ణయ్య గారికి కేటాయించిన న్యూ ఎం.ఎల్.ఎ. క్వార్టర్‌లో దిగాము. అక్కడ సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఆ రోజు మధ్యాహ్నం వైస్ ఛాన్సలర్ డి.యస్.రెడ్డి గారి గదిలో, వారి సముఖంలో ఇంటర్వ్యూ జరిగింది. తెలుగుశాఖ అధిపతి ప్రొఫెసర్ దివాకర్ల వెంకటావధాని గారు, నిడదవోలు వెంకట్రావు గారు ఇంటర్వ్యూ చేశారు. వెంకటగిరి సంస్థాన సాహిత్యం మీద పరిశోధించేందుకు ఏమీ లేదనీ తాము ఆ అంశంపై విశేషంగా రాసేశామని నిడదవోలు గారన్నారు. అప్పుడు అవధానిగారు వెంకటగిరి సంస్థాన కవులలో ఒక కవి పేరు, ఆయన రచనలు గురించి చెప్పమన్నారు. గోపినాథుని వెంకయ్య శాస్త్రి రామాయణం, మాఘం, శ్రీ కృష్ణ జన్మఖండం తెలిగించారని సమాధానం చెప్పగానే వెంకటగిరి సంస్థాన సాహిత్యం, గోపినాథుని వెంకటకవి, ఇతర కవులు అని అవధానిగారు పరిశోధనాంశాన్ని నిర్ణయించారు. వి.సి. గారు ఆమోదించారు. ఆ విధంగా యూనివర్సిటీలో ఎం.ఎ. పాసు కాగానే పరిశోధనకు అవకాశం కలిగింది.

గోపినాథుని వెంకయ్య శాస్త్రి

మా దంపతులను నా సహవిద్యార్థి సముద్రాల గోపాలకృష్ణమూర్తి భోజనానికి పిలిచి గౌరవించాడు. తర్వాత రెండు మూడు రోజులు మేము హైదరాబాదు నగరం అంతా తిరిగి చూశాము. తనను విశ్వవిద్యాలయానికి తీసుకుని వెళ్ళి చూపించాను. ఈ అవకాశం మాకు హనీమూన్ అయింది. నాలుగు రోజుల తర్వాత నెల్లూరు చేరాము.

పరిశోధన చేస్తున్న సమయంలో రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారు నన్ను బాగా దగ్గర తీశారు. ఒకసారి ఏదో విశేష సంచికకు తెలుగులో వ్యాసం dictate చేస్తూ నాచేత రాయించారు. రామరాజు గారు, నేలటూరువారు, భద్రిరాజు కృష్ణమూర్తి గారు, 1967/68 మే మాసంలో బుద్ధ పూర్ణిమనాడు నాగార్జున సాగర్ కుడి గట్టు వద్ద రంగనాయకస్వామి గుడిలో ఏటా రావిప్రోలు వారు జరిపించే కళ్యాణానికి వెళ్లారు. వారివెంట నేను కూడా సాగర్ వెళ్లాను. ఆ రాత్రి వెన్నెట్లో ఆచార్యవర్యు లందరు విశ్రాంతిగా కూర్చొని సింధు నాగరికత లిపిని అధ్యయనం చేసేందుకు అవసరమైన మార్గాలను గురించి చర్చించారు. వారి సన్నిధిలో కూర్చొని వినడమే గొప్ప అదృష్టం.

నా పిహెచ్.డి పరిశోధనకు రామరాజు గారు గైడ్. తరచూ వారి ఇంటికి వెళ్ళాల్సి వచ్చేది. భోజన సమయంలో వెళితే ముందు లోపలికి వెళ్లి భోజనం చెయ్యమనేవారు. మారుమాట్లాడకుండా లోపలికివెళ్ళి భోజనం చేసేవాణ్ణి. రామరాజుగారు గారి భార్య లేదా వంటమనిషి వడ్డించేవారు. ఒకరోజు ఉదయం పదిగంటలవేళ రామరాజు ఇంటికి వెళ్ళాను. వారు భోజనం చేస్తున్నారు. వరండాలో కూర్చున్నాను. అక్కడ ఒక పెద్దాయన కూడా రామరాజుగారి కోసం వేచివున్నారు. ఆ పెద్దాయన నా గురించి వివరాలు అడిగారు. నాది నెల్లూరని, విద్యార్థినని సమాధానంగా చెప్పాను. ఆయన ఆంధ్రావాళ్ళను గురించి ఏదో అన్నారు. నేను గొంతు పెంచి పెద్దగా ఏదో సమాధానం చెప్పాను. ఆవేశంలో నేను ప్రొఫెసర్ గారి ఇంట్లో ఉన్నానన్న స్పృహ కూడా కోల్పోయాను. అప్పుడే రామరాజుగారు భోజనం ముగించి మా వద్దకు వస్తూ “వారెవరనుకున్నావు? కాళోజిగా‌రు” అన్నారు. నేను కాళోజీ గారికి నమస్కరించాను. కాళోజీ ఖలీల్ జిబ్రాన్‌ అనువాదం మీద రాచమల్లు రామచంద్రారెడ్డి గారు దారుణమైన విమర్శ చేశారు. ఎం.వి.ఎల్, నేనూ “రాచమల్లు కాదు రాచముల్లు” అని పేరు పెట్టాము. లోపాలు ఉండివుంటాయి కానీ అంత దారుణంగా విమర్శ రాసి ఉండకూడదని విద్యార్థులమైన మాకు అనిపించింది. తెలంగాణ ఉద్యమం కొనసాగుతున్న సమయంలో ఆంధ్రా విద్యార్థులు హాస్టళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. యూనివర్సిటీ మూతపడింది. కొందరు విద్యార్థులం మాత్రమే హాస్టల్‌లో ఉంటూ, electronic స్టవ్ లమీద వండుకొని తిన్నాము. మమ్మల్ని ఎవరూ వెళ్ళమని అనలేదు.

నేను ఒకసారి యధాలాపంగా రాక్షసగుళ్ళంటే(cairns) ఎలా ఉంటాయని రావిప్రోలు వారిని అడిగాను. సాగర్ ప్రయాణంలో వారు దారిలోకారు ఆపి furlong దూరం నడిపించి అక్కడి రాక్షస గుళ్లను చూపించారు.

నందికొండ సాగర్ డాం నిర్మాణమవుతున్నప్పుడు అక్కడి చారిత్రిక అవశేషాలను, డాం వలన ఏర్పడే సరస్సులో మునిగి పోకుండా కుడిగట్టుమీదకు తరలించి సందర్శకులకు, పర్యాటకులు వీక్షించేందుకు అనువుగా భద్రపరిచారు. Archaeological Survey of India ఉన్నతోద్యోగిగా అక్కడ ఎస్కవేషన్స్‌లో ప్రొ. సుబ్రమణ్యంగారు ప్రముఖపాత్ర నిర్వహించారు (1956-61). అక్కడ త్రవ్వకాలలో రంగనాథస్వామి విగ్రహం దేవేరులతో సహా లభించింది. కృష్ణ కుడి గట్టు మీద, పూర్వం ఐలాండ్ మ్యూజియంకు లాంచీ బయలుదేరే ప్రదేశంలో, మాచర్ల, సాగర్ మధ్య 11 వ మైలురాయి వద్ద గుడి కట్టి స్వామిని అందులో ప్రతిష్ఠించారు. ASI ఉద్యోగులు, స్థానికులు ఈ జీర్ణోద్ధరణలో సహకరించారు. నెల్లూరు రాజు మనుమసిద్ధి శత్రువుల చేతిలో పరాజితుడయి, పల్నాటి సీమలో తలదాచుకుని ఉన్నసమయంలో ఈ గుడి నిర్మించారట. సుబ్రహ్మణ్యం గారు జీవించినన్ని రోజులు సకుటుంబంగా వెళ్లి కళ్యాణం జరిపించేవారు. వారి కుమారులు కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.

రంగనాథస్వామి

1966 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్సులో నాకు పిహెచ్.డి పరిశోధనకు స్కాలర్‌షిప్ కోసం ఇంటర్వ్యూ జరిగిందని ముందే రాశానుగదా! నేను నేరుగా ఇంటర్వ్యూకు హాజరై, ఒక రోజు హైదరాబాదులో వుండి, మరుసటి రోజు రైల్లో నెల్లూరు బయల్దేరాను. నిశిరాత్రివేళ విజయవాడ స్టేషన్లో రైలు ఆగినపుడు, ప్లాట్‌ఫాం మీద కేంటిన్ వద్ద కాఫీ తాగుతున్నా. టికట్ కలెక్టర్ నా వద్దకు వచ్చి ఫస్ట్ క్లాస్‍లో మీ ప్రొఫెసర్ గారున్నారు, నిన్ను రమ్మన్నారు అని చెప్పాడు. నా సంచీ తీసుకొని వారి సీటు వద్దకు వెళ్ళాను. ప్రొఫెసర్ ఆర్. సుబ్రహ్మణ్యం గారు నన్ను చూసి, “ఏమయ్యా! స్కాలర్‌షిప్ ఇంటర్వ్యూకు హాజరవుతున్నట్లు నాకు మాట మాత్రం చెప్పనక్కర్లేదా?” అని మందలించారు. ఆ ఇంటర్వ్యూ విషయం వారికి చెప్పాలని తోచలేదు. ఆ రోజు ఇంటర్వ్యూ చేసిన వారిలో ప్రొఫసర్ సుబ్రమణ్యం గారు కూడా ఉన్నారు. బిట్రగుంట వచ్చేవరకూ వారు నాతో అవీ ఇవీ మాట్లాడుతున్నారు. నేను నా కంపార్టుమెంట్‌కు వెళ్ళాను. వారు నాలాంటి ఎందరికో అయాచితంగా సహాయం చేశారు. నేను స్కాలర్‌షిప్‌కు ఎంపిక కావడంలో వారి ప్రమేయం వుంది. ఆ జాతీయస్థాయి ఉపకార వేతనానికి ఎంపికైన ఎనిమిది మందిలో అందరికంటే ముందు నాకే డాక్టరేట్ అవార్డయింది. వారు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదనుకుంటాను.

ప్రొఫెసర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారికి సంబంధించిన ఒక సంఘటన వివరించకుండా, ఈ కథనం ముగించలేను. ఒకరోజు ఉదయం 9గంటల వేళ వారు మా వాకిట్లో రిక్షా ఆపించి, ఆయన వద్ద ఎం.ఏ. హిస్టరీ చదివిన బొందు నరసింహంను ఇంట్లోకి పంపి ఉన్నపళంగా బయల్దేరమన్నారు. వారొక రిక్షాలో నేను, నరసింహం మరొక రిక్షాలో బయలుదేరి నెల్లూరు మూలపేటలోని వేణుగోపాలస్వామి ఆలయానికి చేరుకొన్నాము. కంచికామకోటి పీఠాధిపతి శ్రీశ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి వారు అక్కడ విడిది చేసి ఉన్నారు. సుబ్రహ్మణ్యం గారు వచ్చారని విని పరిచారకులు చొక్కాలు విప్పి స్వామివారి గదిలోకి వెళ్ళమన్నారు. నరసింహానికి, నాకు యజ్ఞోపవీతాలే లేవు. సుబ్రహ్మణ్యం గారు తాము ధరించిన యజ్ఞోపవీతాలలో చెరి ఒకటి ఇచ్ఛి వేసుకోమన్నారు. వారి శరీరంపైన ఒక్క జంధ్యమే మిగిలింది. స్వామి వారు, సుబ్రహ్మణ్యంగారు దాదాపు మూడు గంటలు సంభాషించారు. తెలంగాణాలో ఆప్పుడే బయల్పడిన కేవ్ పెయింటింగ్స్ నుంచి ఆలయాల సంరక్షణ తదితర అనేక ఆసక్తికరమైన విషయాలమీద ఇంగ్లీషులో చర్చసాగింది. పరిచారకులు అప్పుడప్పుడు వచ్చి చాలా సమయం అయిందని సూచన చేసినా స్వామి వారు సంభాషణ కొనసాగించారు. దాదాపు మూడుగంటలు స్వామివారి సాన్నిధ్యంలో ఉన్నాము. సుబ్రమణ్యం గారు స్వామివారికి ఎంతటి ఆత్మీయమైన భక్తులో గ్రహించాము. నందికొండ త్రవ్వకాల్లో బయటపడిన రంగనాథస్వామి విగ్రహానికి గుడికట్టించి ప్రతిష్ఠించమని సుబ్రహ్మణ్యం గారిని స్వామి వారే ప్రోత్సహించారని తెలిసింది.

హైదరాబాదులో పరిశోధన విద్యార్థిగా ఉన్నకాలంలోనేలో ప్రసిద్ధ చిత్రకారులు పి.టి. రెడ్డిగారితో పరిచయం అయింది. వారింట్లోనే వారు చిత్రించిన చిత్రాలు చూచాను. రెడ్డి గారు వెయిల్డు పోర్ట్రెయిట్ అనే తైలవర్ణచిత్రాన్ని మరుపూరు కోదండరామరెడ్డిగారికి బహుకరించారు. ఇప్పుడు కూడా ఆ చిత్రం కోదండరామరెడ్డిగారి ఇంట్లో గోడకు అలంకరించి ఉంది. పి.టి. రెడ్డి గారు నెల్లూరులో నేలనూతల శ్రీ కృష్ణమూర్తి గారి అతిథిగా ఉన్నపుడు వారిని వెంకటగిరికి తీసుకుని వెళ్ళి చూపించాను. కాశీవిశ్వనాథస్వామి రథాలలో దారుశిల్పాలను చూచి ముగ్ధులయ్యారు. ఆ శిల్పాలు శిల్పకళ దృష్ట్యా అపూర్వమైనవని ప్రశంసించారు. పాతికేళ్ల క్రితం ఆ రథాలను యాంటిక్ వ్యాపారులు ఖరీదుచేసి ఊడదీసి (dismantle) తీసుకుని వెళ్ళారనీ, ఒక రథంలో ఉత్సవ విగ్రహాలను నిలిపే పీఠంక్రింద అపూర్వమైన కొన్ని మణులు లభించాయని కూడా మిత్రులు చెప్పగా విన్నాను.

స్టేట్ ఆర్కైవ్సు ఆఫీసులో పరిశోధక విద్యార్థులకు క్యూబికల్సు ఇచ్చారు, అందులో మా పుస్తకాలు, తదితర మెటీరియల్ ఉంచుకుని ఏకాంతంగా రికార్డులను పరిశీలించవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు. ఒకరోజు అల్వి అనే సహపరిశోధకుడు తన క్యూబికల్‌కు రమ్మన్నాడు. కాసేపు అవీ యివీ మాట్లాడి, లంచ్ చేస్తామని కేరియర్ తీసి కేరియర్ మూతలో రెండు చపాతీలు కొంచం కూరపెట్టాడు. నేను ఒక ముక్కతుంచి కూర కొంచం తీసుకుని తినబోతున్నా. “క్యా ఆప్ ఘోష్ ఖాతే” అన్నాడు తను. నాకు, హిందీ, ఉర్దూ ధారాళంగా వచ్చు. హైదరాబాదులో చదువుకోవడం వల్ల మరింత మెరుగైంది. నిర్ఘాంతపోయాను. అతను చెప్పకుండా ఉంటే తినేవాణ్ణి. ఆవు మాంసం కూర అది. 1976 వరకు నేను సంపూర్ణంగా శాఖాహారిని.

ఇక్కడే మరొక అనుభవం చెప్పాలి. ఎంఎ చదువు పూర్తై నెల్లూరు వెళుతున్నా. ఆరోజు ప్రయాణం హడావిడిలో మధ్యాహ్నం భోజనం కూడా చెయ్యలేదు. నాంపల్లిలో రైలెక్కాను. సికిందరాబాదులో సరిగ్గా కేంటిన్ వద్ద మా పెట్టె ఆగింది. హడావుడిగా కేంటిన్ వద్దకువెళ్ళి రెండు సమోసాలిమ్మన్నా. సమోసాలు గబగబా తింటూ తలపైకెత్తి చూశాను. నాన్ వెజిటేరియన్ అని బోర్డు మీద మాసిపోయిన అక్షరాలు స్పష్టాస్పష్టంగా కనిపించాయి. సమోసాలు నాన్ వెజిటేరియన్‌వే అని కేంటిన్ వాడు ధ్రువపరిచాడు. వెంటనే అసంకల్పితంగా పెద్దగా వమనం చేసుకున్నాను. నీళ్ళతో నోరు ఎన్నిమార్లో శుభ్రం చేసుకున్నా ఏదో వికారం. మరుసటి రోజు కూడా సరిగ్గా అన్నం తినలేకపోయాను.

1975లో ఇంటర్మీడియట్ పరీక్షల పేపర్లు దిద్దడానికి ఏలూరు సి.ఆర్.రెడ్డి కళాశాలలో సెంటరు పెట్టారు. ఎక్కడెక్కడి అధ్యాపకులు ఏలూరులో హోటళ్ళన్నీ ఆక్రమించుకొన్నారు. ముందుచూపున్న తల్లిదండ్రులు తమ పుత్రరత్నాలతో ఆ హోటళ్ళలోనే దిగారు. దాన్ని స్టడీ టూర్ అని మా వాళ్ళెవరో పరిహాసంగా అన్నారు. మా మిత్రుడు ఎం.వి.ఎల్ నూజివీడు నుంచి రోజూ వచ్చిపోయేవాడు. అప్పుడే బాపు రమణల అందాల రాముడు కాబోలు విడుదలైంది. మెదటిరోజే ఎం.వి.యల్ నేను first show కు వెళ్ళాము. సినిమా చాలా బాగుంది కానీ సగటు జనం మెచ్చలేదు. ఫెయిల్ అయినట్లు టాక్ వచ్చింది. ఆతను చాలా దుఃఖపడ్డాడు. రూంకు తీసుకుని వెళ్ళి, మరిద్దరు మిత్రులను పిలిచి చిన్న పార్టీ ఏర్పాటు చేశాను. ఆ సందర్భంగా మా నెల్లూరు మిత్రులు రామచంద్రప్రసాదు గారి వద్ధ చేబదులు తీసుకోవలసి వచ్చింది. నేను రెమ్యునరేషన్ తీసుకుని బైటపడేసరికి ప్రసాద్ రూం ఖాళీచేసి వెళ్ళిపోయాడు.

రచయిత మిత్రులు ఎం.వి.ఎల్.

నెల్లూరులో ఆతను ఎదురైనపుడల్లా ఏదో అపరాధభావంతో సతమతమయ్యేవాణ్ణి. అతను ఎప్పుడూ చేబదులు గురించి ప్రస్తావించలేదు. అలా రెండేళ్ళ గడిచిపోయాయి. జీతం తీసుకున్న మరుసటి రోజు ఉదయమే ఆదివారం, సైకిల్‌పై అతని ఇంటకి వెళ్ళాను. ఆతను నెల్లూరు టౌన్‌కు దూరంగా చెరువు ఒడ్డున పౌల్ట్రీ ఫారం నిర్వహిస్తూ పర్ణశాలలో కాపురం ఉన్నాడు. అతనికి డబ్బిచ్చి వెనక్కి రాబోతే అతని శ్రీమతి బలవంతంగా నన్ను కూర్చోబెట్టి పళ్ళాలలో నాకూ, తన భర్తకూ ఆమ్లెట్లు వేడివేడిగా తెచ్చిపెట్టింది. నేను తిననన్నా. “అయ్యా మేము అడవిలో ఉన్నాము. ఏమీ దొరకవు. ఈరోజు మీరు తినకుండా పోకూడదు” అంది. ఆ దంపతుల అభిమానానికి తలవొగ్గవలసివచ్చింది. మాంసాహారం తిన్నా సూకర మాంసం, గోమాంసం తినకూడదని ప్రతిజ్ఞ పూనాను. 2005లో మొదటి పర్యాయం అమెరికాలో మా చిన్నబ్బాయి వద్దకు వెళ్ళాము. మేమున్న ఫెయిర్ ఫాక్స్ నుంచి నాలుగు గంటల ప్రయాణం పిట్సుబర్గు వెంకటేశ్వరస్వామి ఆలయానికి. దోవలో కారు ఆపి అరగంట తర్వాత మా బాబు పిజ్జా తెచ్చి ముందుసీటులో కూర్చొని ఉన్న నా చేతిలోపెట్టి “రెండు ముక్కలు తినండి, మేము బిడ్డకు డైపర్ మార్చిన తర్వాత తింటాము” అన్నాడు. నేను మూత తెరిచి చూస్తే పీజామీద ఎర్రని రంగులో ముక్కలు వేసివున్నాయి. ఒక ముక్క తీసుకుని నోట్లో పెట్టుకున్నా. ఏమాత్రం రుచించలేదు. అయిష్టంగా నములుతున్నా. మావాడు పీజ్జాను చూచినట్లున్నాడు. ఒక్క ఉదుటున కారు తలుపు తెరిచి నా వడిలో ఉన్న పీజా పెట్టెను తీసుకుని వెళ్ళాడు. అరగంట తర్వాత మరొక పెట్టెతో వచ్చాడు. “నాన్నా అది పోర్కుతో చేసినది. అక్కడ పనిచేసే అమ్మాయి కూడా మనదేశం విద్యార్థినే. అజాగ్రత్తగా ఇచ్చింది” అన్నాడు. నాకు కడుపులో ఏదో గందరగోళం గావుంది. పిట్సుబర్గు ఆలయంలో ప్రసాదం పెడితే తిన్నా. ఏవేవో రకరకాల ప్రసాదాలు తెచ్చారు. గుడి భోజనశాలో ఒక ఆఫ్రోఅమెరికన్ మహిళ వడ్డన చేస్తోంది. ఆలయ నిర్వాహకులను మనసులోనే అభినందించాను.

తిరుగు ప్రయాణంలో “నాన్నా మరొకరైతే చాలా గొడవ చేసేవాళ్ళు” మా అబ్బాయి మెచ్ఛుకోలుగా అన్నాడు. పోర్కు రుచి చూసినా పూర్తిగా తినకుండా తప్పినందుకు నన్ను నేను అభినందించుకున్నాను.

***

నిడదవోలు వెంకటరావుగారు, ఆచార్య భూపతి లక్ష్మీ నారాయణరావు మహాభారతం ప్రాజెక్టులో పనిచేస్తూ మాకు ఎం.ఎ. క్లాసులు తీసుకొన్నారు. ఒకరోజు క్లాసు వదలిన తర్వాత వెంకటరావుగారు గురజాడ అప్పారావు గారిని గురించి ఎంవిఎల్.తో, నాతో అరగంటసేపు సంభాషించారు. తమ తండ్రి సుందరేశ్వరరావు గారికి గురజాడతో ఉన్న స్నేహాన్ని గురించి ఆత్మీయంగా మాట్లాడారు. వెంకటరావు గారు కుమా‌రుడికి సుందరేశ్వరరావు అని పేరు పెట్టుకున్నారు. ఈ సుందరేశ్వరరావు మహాభారతం ప్రాజెక్టు ఆఫీసులో స్టాఫ్‌గా పనిచేసేవారు. మహాభారతం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ భూపతి లక్ష్మీనారాయణరావుగారు. వీరి ఆఫీసు విశ్వవిద్యాలయం లైబ్రరీ భవనంలో ఉండేది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here