జ్ఞాపకాల తరంగిణి-21

0
12

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]ప్రొ[/dropcap]ఫెసర్ బహదూర్, నాయర్‌ని రేణిగుంటలో రైలెక్కించేముందు, టిటిడి పెద్దల సహకారంతో నేరుగా గర్భగుడిలోకి తీసుకొనివెళ్ళి మావాళ్ళు దర్శనం కూడా చేయించి పంపారు. నెల్లూరు పత్రికలు మా కోర్సుమీద బాగా రాసి ప్రచారం కలిగించాయి. ఈ కోర్సు జరిగిన వేసవిలో పూనా Film instituteలో ఆరువారాల ఫిల్మ్ అప్రీసియేషన్ కోర్సులో పాల్గొనమని ప్రొఫెసర్ బహదూర్ ఆహ్వానించారు. అట్లా పూనాలో ఆ వేసవిలో సినిమాలను అధ్యయనం చేస్తూ గడిపౌను. మణికౌల్ వంటి గొప్ప సినిమా దర్శకులు పాఠాలు చెప్పారు. ఆర్కైవ్సువారు హవరాఫ్ ఫర్నెసెస్ డాక్యుమెంటరీని, క్లాక్ వర్క్ ఆరంజి వంటి అరుదైన చిత్రాలను ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఆ చిత్రాలకు సెన్సార్ సర్టిఫికెట్ లభించక, సాధారణ ప్రజలకు చూచే అవకాశం లేదు. కోర్సులో మొత్తం భారదేశంనించి పార్టిసిపెంట్లు వచ్చారు. ఇక్కడ కూడా ఉదయం 9 గంటలకు క్లాస్లు ఆరంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసేవి. సెలవులు కనుక అక్కడే విద్యార్థుల హాస్టల్‌లో ఉండేవాళ్ళం. పూర్వం రాజ్ కమల్ స్టూడియోనే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్‌గా మార్చారు. ఆదివారం తరగతులకు సెలవు. ఫిల్మ్ఆర్కైవ్ లైబ్రరీలో కూర్చొని ఆబగా పుస్తకాలు చదివి నోట్సు తీసుకొనేవాళ్ళం.

రెండేళ్ళ తర్వాత పూనా ఆర్కైవ్, Film and Television Institute సయుక్తంగా ఇరవై మంది సినిమా విమర్శకులను డిగ్రీస్థాయిలో ఫిల్మ్ అప్రీసియేషన్ పాఠ్యాంశాలను ఎంపిక చేయడానికి ఆహ్వానించారు. అందులో అఃదరూ సినిమాకు సంబంధించిన వారే. ఫిల్మ్ సొసైటీల తరఫున నన్నుకూడా ఆహ్వానించారు. అంత పెద్దవారి మధ్య వారంరోజులు అక్కడ జరిగిన చర్చల్లో పాల్లొన్నాను.

1974 నుంచి 1984 వరకు పూర్తిగా పదేళ్ళు నెల్లూరు ప్రొపిల్మును అరడజను మంది మిత్రులం మా తీరికసమయాన్నంతా వెచ్చించి కొనసాగించాము. ఇంతలో టీవి రావడంతో ఆదివారాలు టివిలో సినిమా ప్రదర్శనలు మొదలయ్యాయి. రామారావు గారి ప్రభుత్వం వినోదం పన్ను విధానాన్ని మార్చింది. వారంలో ఎన్ని ప్రదర్శనలైనా వేసుకొనే స్వేచ్ఛ హాలు యాజమాన్యాలకిచ్చి, ఎన్ని సీట్లో అంత పన్ను కట్టే విధానం అమలు పరచింది. దాంతో మాకు సినిమా హాలు దొరకడం కూడా కష్టమైంది. మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఫిల్మ్ సొసైటీ ఉద్యమం మందగించింది. నిజామాబాద్, హైదరాబాదు వంటి చోట్ల మాత్రమే ఫిల్మ్ సొసైటీలు మిగిలాయి.

కావలి ఫిల్మ్ సొసైటీ ప్రారంభం. వేదికపైన బావమరదళ్ళు నిర్మాత కృష్ణారావు, నెల్లూరు జమీన్ రైతు పత్రిక సహ సంపాదకులు పి.గోపాలకృష్ణ, కావలి జవహర్ భారతి ప్రిన్సిపల్ ఎం.పట్టాభిరామరెడ్డి, కాళిదాసు పురుషోత్తం తదితరులు.1975

నెల్లూరు ఫొటోగ్రఫి చరిత్ర: 

ప్రసిద్ధ డాక్యుమెంటరీ చిత్రనిర్మాత పిట్టమండలం సీతాపతి తాతగారు నెల్లూరులో ఫొటో స్టూడియో నిర్వహించారని నెల్లూరు విజ్ఞానసర్వస్వం అని పేరు పొందిన నేలనూతల శ్రీ కృష్ణమూర్తిగారు నాతో స్వయంగా అన్నారు. సీతాపతి  కుమారుడు మద్రాసులో కొంతకాలం ఫొటోగ్రఫి వృత్తిలో ఉంది, తర్వాత కార్ల కంపెని రెప్రజెంటేటివ్‌గా పనిచేశాడు. వీరి శ్రీమతి పెయింటర్. ఆమె మద్రాసు గవర్నర్ పోర్ట్రయిట్ చిత్రాన్ని చిత్రించి గవర్నరుగారికే బహుకరించింది. ఈ దంపతుల కుమారుడు పి.వి.పతి ఫ్రాన్స్ సారబాన్ విశ్వవిద్యాలయంలో సమకాలీన ఆంధ్ర నాటకరంగం మీద పరిశోధించి పి.హెచ్.డి పట్టా పొందాడు. ఈ ఆధారాలతో అయన తాతయ్య నెల్లూరులో ఫొటో స్టూడియో నిర్వహించాడని ఊహించుకుందాం.

1880 ప్రాంతాలకే నెల్లూరులో ఫొటోగ్రఫి ప్రవేశించింది. ఆనాటి నెల్లూరు జిల్లా గెజిట్ కాపీలు తిరుపతి స్టేట్ ఆర్కైవ్సు రీజినల్ ఆఫీసులో భద్రపరచి ఉన్నాయి. శ్రద్ధ ఉన్నవారు పరిశోధించండి. ఆంగ్లోయిండియన్, దేశీయ ఫొటొగ్రాఫర్ల ప్రకటనలు అందులో కన్పిస్తాయి. 1907నాటి ఫొటోలకింద స్టూడియోల ముద్రలున్నాయి. పాత ఫోటోలు వెదికి పరిశీలించవచ్చు. కవికోకిల దువ్వూరు రామిరెడ్డిగారు ఈ జిల్లాలో ఫొటోగ్రఫిలో పయొనీర్. కెవిఆర్ వారి కృషిని గ్రంథస్థం చేశారు. తిక్కవరపు రామిరెడ్డి గారి కుమారులు శివకుమార్ రెడ్డికి కూడా ఫోటోగ్రఫీలో ప్రవేశం వుంది. ఆయన తీసిన ఫొటోలు పత్రికలలో ప్రచురించబడ్డాయి.

నెల్లూరూలో పొగతోటకు సమీపంలో, మా యింటికి కొద్ది దూరంలో కాదంబి ఆనే పేరుతో ఒక ఫోటోగ్రాఫర్ ఉండేవారు. పూర్తి పేరు కాదంబి కృష్ణమూర్తి అయినా నెల్లూరులో కాదంబిగారనే ప్రసిద్ధి. ఆ రోజుల్లో టౌన్‌లో గ్రూప్ ఫొటోలు ఆయనే తీసేవారు. నాకు పది పన్నెండు ఏళ్ళవయసుకే వారికి అరవై దాటివుంటాయి. సైకిల్ వెనుక కెమెరా, స్టాండు వగైరా సరంజామా పెట్టుకొని గ్రూప్ ఫొటో తీయవలసిన ఆఫీసుకో, స్కూలుకో వెళ్ళేవారు. చాలా నెమ్మదిగా తనకు అవరమైన పద్ధతిలో మనుషులను నిలబెట్టి ఫొటో తీసేవారు. గ్లాసు ప్లేటుకు రసాయనాలు పట్టించి తీసేవారో, ఫిల్మ్ వాడేవా‌రో తెలియదు. వారు శ్రీవైష్ణవులు. ఫఛ్చటి నామం ధరించేవారు. ధోవతి, పైన శాల్వ కప్పుకోవడం తప్ప షర్టు వేసుకోరు. విశాలమైన స్థలంలో రేకులతో పొడవాటి సాలవేసుకొని నివసించేవారు. నలుగురైదుగురు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆయన ఉదయంపూట స్నానం చేసి ఒక నాపరాతి అరుగుమీద కూర్చుని జపం చేసుకునేవారు. ఆయన భార్య పట్టుచీర కట్టుకొని ముఖంమీద తిరునామం ధరించి బావివద్ద నీరు తోడుతూ, పనులు చేసుకొంటూ కనిపించేవారు. ఆ యిల్లు చూస్తే ఏదో మున్యాశ్రమంలాగా తోచేది. ఇంటికి ప్రహరీగోడకు బదులుగా సీమచింత చెట్లతో కంచె ఏర్పాటు చేసుకున్నారు. మాకు తెలిసే సమయానికి పెద్ద కుమారుడు రైల్వే గార్డు. ఒక వెదురు బుట్టలో కేరియర్ పెట్టి దోటి కొసకు తగిలించి రైలుకట్ట ప్రక్కన నివబడేవారు ఆచార్యులవారు. గార్డు పెట్టెలో నుంచి వడుపుగా ఆ బుట్టను ఆయన కుమారులు అందుకునేది. ఆచార్యులవారి ఇల్లు రైలుకట్ట ఎదురుగానే. పిల్లల చదువులు ఆయిపోయాక ఇల్లు అమ్మి ఎటో వెళ్ళిపోయారు. వీరి సమకాలికులు వెంకోజీ కాబోలు,  పోలీస్ శాఖవారికి ఫోటోలు తీసేవారట. ఆయన. పెద్ద పోస్టోఫీసు సమీపంలోనో, మండపాల వీధిలోనో ఉండేవారు. వీరు కూడా ఫొటోగ్రఫీ వృత్తిలో జీవించారు. ఈలోగా సాగర్, హరనాథ్ వంటి స్టూడియోలు పుంజుకొన్నాయి.

1957 ప్రాంతాలలో కాకర్లవారి వీధిలోనో, కూరగాయల మార్కెట్ వీధిలోనో రమణయ్య కొడక్ ఫిల్మ్, రసాయనాలు అమ్మేవారు. బాల్యం నుంచీ కెమెరా పిచ్చి ఉన్నా, నేను నెల్లూరు హరనాథ్ స్టూడియో నరసింహాచారిగారి శుశ్రూషచేసి 1972లో ఫొటోలు తీయడం నేర్చుకున్నా. వారు రెండో ప్ర్రపంచయుద్ధ కాలానికే నెల్లూరులో స్టూడియో పెట్టారు. కోమలవిలాస్ ఎదురుగా మేడమీద ఎక్కడో ఆ స్టూడియో ఉండేదట. యుద్ధ కాలంలో మిలటరీవారు స్టూడియో ముందు వాహనాలు నిలిపి రోల్ ఫిల్మ్ కడిగించుకోడం(డెవలప్), ప్రింట్లు వేయిచుకోడం చేసేవారట. ఈ ఆచార్యుల తమ్ముడు రాధాకృష్ణ స్టూడియో నిర్వహించాడు. ఈయన గవర్నమెంట్ వారికి పనిచేసేవాడు.  హరనాథ్ ఆచార్యులు అంతర్జాతీయ ఫొటో మేగజైన్లకు చందాలు కట్టేవాడు. ఆ కళ మీద పుస్తకాలు తెప్పించుకొనేవాడు. ఆయన వద్ద లైకా యస్.యల్.ఆర్, (F2), లైకా కపుల్ రేంజి F2 ఉండేవి. అవి కాక ఇతర స్టూడియో సరంజామా కూడా. వారివద్దే exposure మీటర్లు వాడడం నేర్చుకున్నా. కంపోజ్ చెయ్యడం, లైటింగ్ (ప్లాస్టిక్స్) మీద సైంటిఫిక్ విషయాలమీద వారికి బాగా అవగాహన ఉంది. 1952లో వారి స్టూడియోలో తీసున్న ఫొటోలు ఇప్పటికీ చాలామంది ఇళ్ళల్లో కనిపిస్తాయి. ఈయన కొంతకాలం మ్యాజిక్ నేర్చుకొని ప్రదర్శనలిచ్చారు. ఏది చేసినా దాని అంతు కనుక్కొనేదాకా ఊరుకొనేవారు కాదు. ఈ ఆచార్యులకంటే కొంచెం పెద్దవారు సాగర్ స్టూడియో పంతులు. ఎప్పుడూ చుట్ట కాలుస్తూ కనిపించే వారు. కృష్ణా అండ్ కొ ఎదురు వరసలో మేడమీద  ఈయన స్టూడియో ఉండేది. ఈయన ఫొటోలు కూడా ఇప్పటికే ఇళ్ళల్లో కనిపిస్తాయి.

ఫోటోగ్రఫీలో తోడుగా ఉండే రచయిత మిత్రుడు శ్రీ రాజేంద్ర ప్రసాద్

వీళ్ళిద్దరికంటే ముందుతరం వారు మై స్టూడియో యజమాని, రవిగారి తండ్రి గారు బాంబే స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి. 1921లో మహాత్మా గాంధీజీ నెల్లూరు వచ్చినపుడు వర్థమాన సమాజం గ్రంథాలయంలో వీరు చిత్రించిన తిలక్  తైలవర్ణ  చిత్రాన్ని, గాంధీజీ ఆవిష్కరించారు. ఆసక్తి ఉన్నవారు వెళ్ళి చూడండి. ఈ పెయింటర్ కుమారులే అనస్థటిస్ట్ డాక్టర్ భాస్కర్. భాస్కర్ అన్న బాబురావు, మరొకరు కూడా చాలా మంచి చిత్రకారులు, ఫొటోగ్రాఫర్లు. ఈ అన్నదమ్ములు మై స్టూడియోను 50 ఏళ్ళు నడిపారు. మంచి పేరున్న స్టూడియో ఆ రోజుల్లో. ఈ సోదరుల్లో రవి నా క్లాస్‌మేట్, మంచి మిత్రుడు కానీ ఫొటొలు తీయడం మాత్రం నేర్పేవాడు కాదు. ఆ రోజుల్లో టౌన్ హాల్ ఎదురుగా మేడమీద యతిరాజ్ ఫొటో స్టూడియో ఉండేది. యతిరాజ్ ట్రెండ్ సెటర్. ఫేషన్ ఫొటోగ్రఫి ఇష్టం. అమ్మాయిలచేత సినిమా తారలమాదిరి పొజులు పెట్టించి ఫొటోలు తీసేవాడు. అతను స్ఫురద్రూపి. ఇంకేం, స్టూడియో బాగా జరిగింది. యతిరాజ్ తర్వాత అక్కడేనో లేక వి.ఆర్. బాస్కెట్బాల్ కోర్టు ఎదాళం వరుస మేడమీదో ఫైన్ ఆర్ట్స్ స్టూడియో 1970 ప్రాంతాల్లో వచ్చింది. దాన్ని ముస్లిం సోదరులు నిర్వహించారు. నెమ్మదస్తులు. కాపువీధిలో పి. గౌరీశంకర్ రెడ్డి పిజి.యస్. స్టూడియో నడిపేవారు. మంచి ప్రింట్లు వేసేవాడు. ప్రింట్లు కాస్త ఎక్కువగా మాడ్చేవాడని నాకనిపించేది. పెద్ద ఎన్లార్జిమెంట్లు వేసేవాడు. ధనవంతులే అతని కస్టమర్లు. నేచర్ ఫొటోగ్రఫి అతనికి ఇష్టం. అతని ఫొటోలు కొన్ని జమీన్ రైతులో వేశారు. ఆ వీధిలోనే పద్మా స్టూడియో, లత స్టూడియో ఉన్నట్లుగా గుర్తు. మిత్రా స్టూడియో వగైరా స్టూడియోలు నెల్లూరులో వుండేవి. వి.జి.కె. కృష్ణమూర్తి (సినీగాయని జానకి మామగారు ఫన్ డాక్టర్ చంద్రశేఖర్ గారి తమ్ముడు) గారి కుమారుడొకరు కొత్త హాలు సమీపంలో తన పేరుతో ప్రభు స్టూడియో నిర్వహించినట్లు మిత్రులు చెప్పారు. ఈ స్టూడియోలవారు  చాలావరకు పాస్‌పోర్ట్ ఫొటోలు తీసి బతికేవారు. మై స్టూడియో వంటి పెద్ద స్టూడియోలకు మరో రకం పని. ఎవరు స్వర్గస్థులైనా ఫొటోలు పెట్టే అలవాటు వచ్చింతర్వాత. కళాకారులు ఫొటోలకు  ఫినిషింగ్ టచెస్ ఇచ్చేవారు. ఇది మంచి వ్యాపారం.

ఫ్లాష్ ఫొటోలు తీయడం హరనాథ్ స్టూడియోనే మొదట ప్రవేశపెట్టినట్లు నా ఊహ. మొదట ప్రైవేట్ వ్యక్తులే నెల్లూరులో ఖరీదైన ఫొటోగ్రఫి ఎక్విప్‌మెంట్ తెచ్చారు. కూకటి కోదండరామిరెడ్డిగారి అల్లుడు దేవకుమార్ రెడ్డి నన్ను, పి.జి.ఎస్.రెడ్డిని డిన్నర్‌కు ఆహ్వానించి తన ఎక్విప్మెంటు, ఫొటోలు ప్రదర్శించారు (1975). ఎన్నో రకాల కెమెరాలు, ఫ్లాష్‌గన్‌లు, స్లేవ్ ఫ్లాష్‌లు, రిమోట్ కంట్రోల్ ఫ్లాష్‌లు. ఎక్విప్మెంటు ఉండడమేకాదు తను మంచి ఫొటోగ్రాఫర్. ఆ దంపతులు యూరప్, అమెరికా పర్యటన ఫొటోలు, స్లయిడ్లు చూపించారు. ఏ ఫేషన్ ఫొటోగ్రాఫరుకు తక్కువ కాకుండా  ఫొటోలు తీశాడు. అన్నింటిలోనూ వారి శ్రీమతిని చూపించారు.

వి.ఆర్.హైస్కూలు డ్రాయింగ్ మాస్టరు మునెయ్యగారు కూడా వృత్తి ఫొటోగ్రాఫరే. వేసవి సెలవులు ఇచ్చేముందు వీడ్కోలు సభల్లో ఒక్కో తరగతికి గ్రూపు ఫొటోలు తీసేవారు. వి.ఆర్. హైస్కూలు మరో డ్రాయింగ్ మాస్టరు భార్గవ గొప్ప చిత్రకారులు. ఆస్కూలు సైన్సు టీచరు లావణ్యరావు కూడా మంచి ఫొటోగ్రాఫరు.

ఇన్ని విషయాలు చెప్పి ఉషా స్టూడియో కూరపాటి కృష్ణమూర్తిని గురించి చెప్పకపోతే పెద్ద లోపం. 1970-80 దశకంలో ఫోటోగ్రఫీలో ఆసక్తి  ఉన్న మిత్రులకు ఆయన స్టూడియో రెండవూ. సాయంత్రం అయితే మిత్రబృందం అక్కడ చేరేది. వెంచెర్ల కృష్ణారావు గొప్ప సబ్జెక్టున్నవ్యక్తి. పి.జి.యస్.గుప్తా, రాజా (అసలు పేరు అచ్యుతరావు, ఛాయాచిత్రకళ మర్మజ్ఞులు), విద్యుత్ శాఖ ఉద్యోగి ఆచారి వగైరా సమూహం. కస్టమర్లు వస్తూపోతూ వుంటారు. వేడి వేడి చర్చలు, పకోడీలు, కాఫీలు, టీలు, టిఫిన్‌లు. మోహన్ 15 సంవత్సరాల కుర్రాడు అక్కడ డార్క్ రూం పనులు చేసేవాడు. కృష్ణమూర్తి తమ్ముళ్ళు, కృష్ణమూర్తి మేనల్లుడు శ్యాం, చుట్టం సత్యం కూడా పనిచేసేవాళ్ళు. స్టూడియో ఫొటోలు తీయడంలో సత్యం ప్రతిభావంతుడు. అన్నిటికన్నా అతని వ్యక్తిత్వం గొప్ప ఆకర్షణ. సత్యం రాకతో ఉషాస్టూడియోకు కస్టమర్ల పేట్రనేజ్ మరింతగా పెరిగింది. కృష్ణమూర్తి గొప్ప కాన్వర్జేషనిస్టు, హాస్యప్రియుడు. ఆ కారణం వల్ల కూడా మంచి పేరు వచ్చింది. కృష్ణమూర్తి ఇంద్రజాలం ప్రదర్శనలు కూడా ఇచ్చేవాడు. అతని హాస్యధోరణి, ఆకారం వల్ల హరిశ్చంద్ర వంటి నాటకాలలో వేషాలు కూడా వచ్చేవి. కృష్ణమూర్తి ఉషా స్టూడియోలో  డార్క్ రూం పనిచేసిన బాలుడే ఆ తర్వాత మోహన్ ఫొటోగ్రాఫర్‌గా కీర్తీ, ధనం రెండూ సంపాదించాడు. కృష్ణమూర్తి చేతి చలవ (ఈ కుర్రాడి తండ్రి ఆయిల్ పెంటింగ్ చేసేవారు. తాగుడు బలితీసుకుంది.).

1970 ప్రాంతంలో ఆంధ్రజ్యోతి విలేకరి రమణయ్యగారికి గూడూరులో గిరి స్టూడియో ఉండేది. వారి మరో కుమారుడు గుణశేఖర్ సర్వోదయ కళాశాల ఎదుట కొంతకాలం స్టూడియో నిర్వహించినట్లు నా పూర్వ విద్యార్థులు చెబుతున్నారు.. 1966 ప్రాంతాల్లో వర్ధమాన సమాజం కార్యదర్శి పందిపాటి వేణుగోపాలరెడ్డి మంచి బతిక్ చిత్రకారులు, ఫొటోగ్రాఫర్. తర్వాత ఆయన విశాఖలో స్థిరపడ్డారు. నెల్లూరు వారైన ఒక వెటర్నరీ డాక్టర్ రమణారెడ్డి, బుచ్చిలో డాక్టర్ సీతారామారావు మంచి ఫొటోగ్రాఫర్లు. మా కస్తూరిదేవినగర్ మిత్రులు మధ్వపతి జయరామారావుకూ ఫొటోగ్రఫి సైన్సు మీద గొప్ప అవగాహన వుండేది. వారూ నేనూ గ్రహణాల ఫొటోలు, వెన్నెల వెలుగులో ఫొటోలు చాలా ప్రయోగాలు చేశాము. 1972లో జై ఆంధ్రా ఉద్యమం వచ్చింది. మా కళాశాల కమిటీ సెక్రటరీ సి.సి.సుబ్బరాయుడుగారు ఉద్యమంలో దిగాక నేను కెమెరాతో ఆయనవెంట ఉండి ఫొటోలు తీసి పత్రికల వాళ్ళకు చేర్చవలసి వచ్చింది. క్రమంగా ప్రకృతి విలయాలు, వగైరాలు ఫొటోలు తీసి జమీన్ రైతుకు పంపేవాణ్ణి. ఆ రోజుల్లో ఆంధ్రపత్రిక ఫొటో ప్రచురిస్తే 25/- రూపాయలు MO పంపేది. ఒకటి రెండు ఫోటోలు ఆంధ్రపత్రిక, ప్రభ ప్రచురించాయి.  అలా మిత్రుల పెళ్ళిళ్ళు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యా స్వచ్ఛందంగా.  శ్రీ రేబాల లక్ష్మీ నరసారెడ్డిగారి షష్టిపూర్తి సభ మొత్తం కలర్ ఫోటోలు తీసి బొంబాయిలో ప్రింట్లు వేయించి తెప్పించాను. ఆరోజుల్లో నెల్లూరులో వివాహాది కార్యక్రమాలను కలర్‌లో బంధించాను. 1990 వరకూ ఆత్మీయులు కోరితే ఫొటోలు తీసిపెట్టేవాణ్ణి. ఈ సోదె ఇక ముగిస్తా. కొరవలు గుర్తున్నవాళ్ళు పూరించండి.

నెల్లూరు కెమెరా క్లబ్ చరిత్ర:

1969 డిసెంబర్లో కొందరు ఔత్సాహికులు నెల్లూరు కెమెరా క్లబ్‌ను నెలకొల్పారు. న్యాయవాది పందిపాటి వేణుగోపాలరెడ్డి అధ్యక్షుడు, టి.యస్.ఆర్.మూర్తి కార్యదర్శి, పులిగండ్ల నాగరాజు జాయింట్ సెక్రటరీ. కె.కృష్ణమూర్తి, ఎన్.కృష్ణమాచారి, వెంచర్ల కృష్ణారావు, కె.అచ్యుతరావు, పిజియస్.రెడ్డి, చలవాది సంపూర్ణరావు, పచ్చిపులుసు సుబ్రమణ్యగుప్త, రవీంద్ర నాథ గుప్తా, ఎ.యస్.దేవకుమార్ రెడ్డి, నూనె సాయినాధ్, సాయిబాబా ఫొటో స్టోర్ యజమాని నారాయణ సభ్యులు. ఆర్నెల్ల లోపలే వేణుగోపాలరెడ్డి వైజాగ్ కు వెళ్ళిపోవడంతో డాక్టర్ పి.మధుసూదనశాస్త్రి క్లబ్ అధ్యక్షులయ్యారు.

నెల్లూరు కెమెరా క్లబ్ కార్యవర్గ సభ్యులు. అధ్యక్షుడు డాక్టర్ పి. మధుసూదనశాస్త్రిగారు (మొదటి వరుస లో 4వవ్యక్తి)
నెల్లూరు కెమెరా క్లబ్ అధ్యక్షుడు డాక్టర్ పి. మధుసూదనశాస్త్రిగారు

కెమెరా క్లబ్ బెంగుళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫొటోగ్రఫీకి అనుబంధించబడింది. ఆరోజుల్లో డాక్టర్ ఎన్.జి.థామస్ FIP అధ్యక్షులు. నెల్లూరు కెమెరా క్లబ్ ఆంధ్రప్రదేశ్ ఫొటోగ్రఫీ అకాడమీ, హైదరాబాదులో కూడా సభ్యత్వం తీసుకొంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎన్.భగవాన్ దాసు ఫ్రభుత్వసంస్థగా ఈ అకాడమీని ప్రారంభించారు. జిల్లాలలో కెమెరా క్లబ్బులను అకాడమీ ప్రోత్సహించడంతో కెమెరా క్లబ్బులు క్రియాశీలంగా పనిచేశాయి. నెల్లూరు క్లబ్బు రాజన్ తీసిన ఆదివాసీల ఫొటో ప్రదర్శన ఏర్పాటు చేసింది.  నెల్లూరులో వీచిన గాలివాన వల్ల జరిగిన నష్టాన్ని ఫొటోప్రదర్శన ద్వారా ప్రజలకు తెలియజేసింది. ఆ సందర్భంగా అక్కడ ప్రజలు అందజేసిన విరాళాలను జిల్లా అధికారులకు పంపించింది. క్లబ్ అఖిల భారత స్థాయిలో మొత్తం ఏడు ఫోటోగ్రఫీ ప్రదర్శనలు ఏర్పాటు చేసి విజేతలకు బహుమతులు ఇచ్చింది. 1972లో నేను క్లబ్‌లో సభ్యుణ్ణయ్యాను. క్లబ్ తరఫున ఎఫ్.ఐ..పి ప్రతినిధిగా కొంతకాలం ఉన్నాను. ఒక ఏడాది క్లబ్ నిర్వహించిన అఖిల భారత ఫొటో ఎగ్జిబిషన్‌కు వచ్చిన ఫొటోలను నేనూ, వెంచర్ల కృష్ణారావు బెంగుళూరు తీసుకుని వెళ్ళాము. సుప్రసిద్ధ ఫొటోగ్రాఫర్లు రాజగోపాల్, వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్ పెరుమాళ్ళు ఉత్తమ ఫొటోలను ఎంపిక చేశారు. డాక్టర్ థామస్ గారిని కూడా కలుసుకొన్నాము. అప్పుడే ఫోటోగ్రఫీలో కాంపోజిషన్ గురించి కొన్ని ప్రాథమిక అంశాలు తెలిశాయి. మేము నెల్లూరు క్లబ్ సభ్యులకు నిర్వహించిన ఫొటోలను కూడా జడ్జమెంటు కోసం బెంగుళూరు పంపేవారం. ఫొటోల వెనక వివరంగా సమీక్ష రాసి పంపేవారు. కొన్ని ఫొటోలు ఎంతవరకు ఉంటే చాలో, పెన్సిల్ తో గీతలు గీచి సూచించేవారు. మా సభ్యుల అవగాహన క్రమంగా మెరుగవుతూ వచ్చింది. 1980 తర్వాత నెల్లూరు కెమెరా క్లబ్ కార్యక్రమాలు మందగించి, మూతపడింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here