జ్ఞాపకాల తరంగిణి-22

2
12

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

దంపూరు వెంకట నరసయ్య (1849-1909):

[dropcap]సె[/dropcap]ప్టెంబరు 25న దంపూరు వెంకటనరసయ్య 171వ జయంతి.

‘ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య’ అన్న పుస్తకం అచ్చయి, నా చేతుల్లోకి వచ్చినపుడు ‘మనమేనా, ఇంత పరిశోధన చేసి, ఇంత శ్రమకోర్చి ఈ పుస్తకం రాసింది!’ అని నాలో నేనే విస్తుపోయాను. ఒక ఆశ్చర్యం, అద్భుతమైన అనిర్వచనీయమైన భావం, విస్మయం నన్ను లోగొన్నది. పుస్తక రచనకు పూనుకొనడం, అది పూర్తయి వెలుగు చూడడానికి మధ్య దాదాపు 16 సంవత్సరాలు గడిచిపోయాయి.

మిత్రుడు బండి గోపాలరెడ్డి వీరేశలింగం ఆత్మకథలో ‘సంఘసంస్కార షట్చక్రవర్తులు’ అని పేర్కొన్న ఆరుగురు Reformers లో దంపూరు వెంకటనరసయ్య కూడా ఉన్నాడని గ్రహించి తాను ఆయన జీవితం, కృషిని వెలికితీసి పుస్తకం రాయడానికి పూనుకొన్నట్లు నార్ల వారి నుంచి కెవిఆర్ వరకు అందరికీ ఉత్తరాలు రాసి తెలియజేశాడు. దురదృష్టవశాత్తు అతను అర్థాంతరంగా ఈ లోకం నుంచి నిష్క్రమించిన ఏడేళ్ళ తర్వాత, శ్రీశైలంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్రసభల్లో నరసయ్య మీద ఒక పరిశోధన పత్రం సమర్పించాను. అందుకోసం మద్రాసు ఆర్కైవ్సులో కొంత పరిశోధన చేయవలసి వచ్చింది. ఈ పత్రం చదివినపుడు డాక్టర్ వి.కె.బావా I.A.S., గారు ఛెయిర్లో ఆసీనులై ఉండి నా పత్రాన్ని ప్రశంసించి, నన్ను ప్రోత్సహించారు. అప్పుడే నరసయ్య గారి మీద పుస్తకం రాయాలనే ఆలోచన నాలో పొటమరించింది.

అప్పటికి నరసయ్య ముగ్గురు మనుమల్లో ఇద్దరు మనుమలు జీవించి ఉన్నారు. ఆయన తాలూకు కొన్ని పుస్తకాలు, రెండు దినచర్యలు, కొన్ని జాబులు వాళ్ళు దాచుకున్నవి ఇచ్చి ప్రోత్సహించారు. అప్పటి నుంచి నరసయ్య చుట్టాలున్న ఊళ్ళన్నీ తిరిగాను. ఆయనను చూచినవాళ్ళ జ్ఞాపకాలను సేకరించాను. ఒక్క చిన్న వివరం చెప్పినా రాసుకున్నాను. నరసయ్య కోడూరు గ్రామంలో ఉండి వ్యవసాయం చేస్తూ అక్కడి ప్రజల, కౌలుదార్ల కష్టసుఖాలను, అధికారుల, భూకామందుల దౌర్జన్యాలను తన పత్రిక ‘ఆంధ్రభాషా గ్రామ వర్తమాని’ ముఖంగా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. డాక్టర్ నేలటూరి వెంకట రమణయ్యగారు “నరసయ్యను చూస్తే లంచగొండి అధికారులకు హడల్” అన్నారు. ఆ రోజుల్లో కోడూరు గ్రామానికి పోస్ట్‌లో పత్రికలు వచ్చేది నరసయ్య కొక్కరికే అని 90 ఏళ్ల వృద్ధరైతు ఒకరు జ్ఞాపకం చేసుకున్నారు. “ఒక్కపొద్దులుంటే ఊరపందై పుడతారని” నరసయ్య అనేవారని నరసయ్య కుమారుడు తరచుగా తండ్రిని గురించిన జ్ఞాపకాలను నెమరువేసుకొనేవారని, తాను నరసయ్య గదిలో కూర్చుని ఆయన లైబ్రరీ లోని వీరేశలింగం పంతులుగారి పుస్తకాలన్నీ చదివా”నని నరసయ్య మనుమడి భార్య కమలమ్మ అన్నారు. ఇట్లా ఎందరెందరి జ్జాపకాలనో, మౌఖికచరిత్రను గ్రంథస్థం చేశాము. ఈ తిరుగుళ్ళలో మా సహ అధ్యాపకులు డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ నాకు తోడుగా ఉన్నారు.

నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్కైవ్సు వారిచ్చిన జాతీయ ఉపకారవేతనంతో డాక్టరేట్ డిగ్రీ కోసం పరిశోధన చేస్తూ మద్రాసు ఆర్కైవ్సులో ఏడాది పాటు ఆ రికార్డులతో కుస్తీపట్టాను. ఆ ఆనుభవంతో నెల్లూరు కలెక్టరాఫీసులో భద్రపరచిన రికార్డుల్లో నెల్లూరు గెజిట్ పత్రికలన్నీ శోధిస్తే నరసయ్య నెల్లూరులో చేసిన ఉద్యోగాల వివరం తెలిసింది. వెంకటగిరి పంచాయితీ ఆఫీసులో ఆయన మరణాన్ని రిజిస్టరులో రాసిపెట్టారు. మద్రాసు స్టేట్ ఆర్కైవ్సులో పరిశోధించగా, ఆయన పత్రికల వివరాలు, కొన్ని ఉత్తరాలు లభించాయి. ఫోర్ట్ సెంట్ జార్జి గెజిట్‌లో నరసయ్య ఉద్యోగ వివరాలు, చదువుసంధ్యల వంటి అంశాలు తెలిశాయి. ఇట్లా నా అన్వేషణ అనేక చోట్లకు దారితీసింది. నా పరిశోధన సాగుతున్న సమయంలో నేను సేకరించిన రికార్డు, రాసుకున్న నోట్సు అంతా ఆకస్మికంగా మా యింట్లోంచి మాయమయి, ఎంత వెదికినా ఆ పేపర్లు ఏమైపోయాయో తెలియలేదు. ఇక ఆ నైరాశ్యంలో నా పుస్తకరచన ప్రయత్నాలు విడిచిపెట్టాను.

2003లో కాబోలు విజయవాడలో జరిగిన ఎ.పి. చరిత్ర సభలలో నా ఆత్మీయ మిత్రులు శ్రీ పెన్నేపల్లి గోపాలకృష్ణ ‘ఇంద్రధనుస్సులో ఏడోరంగు’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. నా పుస్తకం కూడా చరిత్ర సభల వేదికమీద జరిగితే ఎంత బాగుండుననే ఒక ఊహ నాలో మళ్ళీ తలెత్తింది. అలాంటి సమయంలోనే, పోగొట్టుకొన్నాననుకున్న ఫైలు మేము వాడకుండా తాళం బిగించిన గది తెరిచి శుభ్రం చేయిస్తుంటే బయటపడింది. కొన్ని కాగితాలు పురుగులు కొట్టేశాయి. కొన్ని తేమకు చివికి పనికిరాకుండా పోయాయి. మళ్లీ మొదటినుంచీ పని ఆరంభించాను. మా మిత్రుల సహాయంతో నరసయ్య దినచర్య ఒకదానిని చదివాను. రెండో దినచర్య చదవడానికి సాధ్యం కాలేదు. కరక్కాయ సిరాతో రాయడం వల్ల ఊరిపోయి అక్షరాలు అలికినట్లయిపోయాయి. 2005లో అమెరికా వెళ్ళినపుడు నరసయ్య దినచర్యలను స్కాన్ చేసి యిచ్చారు పిల్లలు. అక్కడే ఆ దినచర్యలు కంప్యూటర్ తెరమీద చదివి నోట్సు తీసుకుని పుస్తకం రాశాను. అచ్చుకు సిద్ధంచేసి ఒక సీనియర్ పత్రికా రచయితకు చూపించాను. ఆయన సమూలమైన మార్పులు చేర్పులు చెయ్యమని సూచించారు. చాలా నిరాశ, అయినా ఆయన సలహా ప్రకారం మళ్ళీ రచన మొదలుపెట్టి పూర్తి చేశాను. ఇట్లా రెండు మూడు పర్యాయాలు రాతప్రతి టైపు చేయించడం, మళ్ళీ మార్పులు, చేర్పులు చేయడం కొనసాగింది. అచ్చుకు వెళ్ళేముందు ఒక ఆలోచన బుర్రలో మెరిసింది. దింపుడుకళ్ళం ఆశగా మరోసారి మద్రాసు ఆర్కైవ్సు దర్శించాలనుకొన్నాను, నరసయ్య నిర్వహించిన ఒక్క పేపరైనా దొరకుతుందనే ఆశ వదులుకోలేక. నా శ్రీమతి నాతో కూడా వచ్చింది. ఆర్కైవ్సు ఆఫీసు కేటలాగులు చూస్తూంటే ఒక పబ్లిక్ జిఓలో పీపుల్స్ ఫ్రెండ్ పేరు నమోదైవుంది. మూడు రోజుల తర్వాత వస్తే ఆ ఫైల్ వెతికి పెడతామన్నారు అక్కడి ఉద్యోగులు. ఆఫీసు ఎదురుగానే ఉన్న ఎగ్మూరు స్టేషన్‌లో మధుర వెళ్ళే రైలు బయలుదేరుతోందని విని, ఆ రైలెక్కి మధుర, రామేశ్వరం వగైరాలు తిరిగి నాలుగో రోజు మద్రాసు చేరాము. ఆర్కైవ్సులో ఫైలు వెతికితీసిపెట్టారు. ఆశ్చర్యం! పీపుల్స్ ఫ్రెండ్ పత్రిక అందులో ఉంది కానీ తెరవగానే పటపట విరిగి కాగితాలు ముక్కలయ్యాయి. నా బాధ, కన్నీళ్ళను అర్థం చేసుకొన్న ఉద్యోగులు వారం తర్వాత వస్తే కాగితాలు మెండ్ చేసి పెడతామన్నారు. వారం తర్వాత మద్రాసుకు వెళ్ళాను. Archives వాళ్ళు మాట నిలబెట్టుకోడమేగాక, పత్రిక పేజీలు స్కాన్ చేసిన డివిడి కూడా ఇచ్చారు. ఆ పేపర్లు కంప్యూటర్‌లో చదివి నోట్సు తీసుకుని పుస్తకంలో అదనంగా ఏభై పేజీలు చేర్చాను.

భద్రజీవితం, బంగారంవంటి స్కూళ్ళ ఇన్.స్పెక్టరు ఉద్యోగం విడిచిపెట్టి, జీవితమంతా పేదరికాన్ని వరించి ప్రజల కోసం, పత్రికలు నిర్వహించిన, నరసయ్యగారి జీవితం, కృషి మీద రాసిన పుస్తకానికి ఎవరిచేత పరిచయ వాక్యాలు రాయించుకోవాలి? చాలా విచికిత్స తర్వాత విశాలాంధ్ర పూర్వ సంపాదకులు స్వర్గీయ సి.వి. రాఘవాచారి గారిని సంప్రదిస్తే వారు సంతోషంగా రాస్తామన్నారు. అయితే వారినించి ఎంతకూ మేటరు రాలేదు. స్వయంగా విజయవాడ వెళ్ళి వారిని కలిస్తే ఆరోగ్యం బాగలేక రాయలేదని, వారు ఎండపొడ కోసం వాకిలిగుమ్మం మెట్టుమీద కూర్చొని ఆశువుగా చెబుతూంటే నోటుబుక్‌లో రాసేసుకున్నా.

విశాలాంధ్ర పూర్వ సంపాదకులు, తన పుస్తకానికి పరిచయం రాసిన స్వర్గీయ చక్రవర్తుల రాఘవాచారి గారితో రచయిత

వారి ఆశీస్సులు తీసుకొని నేరుగా హైదరాబాద్ వెళ్ళి శ్రీ ‘రమణజీవి’ గారి చేతుల్లో నా టైపు ప్రతిని ఉంచా. ఆయన నాలుగురోజుల్లో పుస్తకం ముద్రించి పంపించారు. ముఖచిత్రం కూడా వారే వేశారు.

2007 జనవరిలో కడపలో జరిగిన ఆంధ్రప్రదేశ్ చరిత్ర సభల్లో ఆ పుస్తకాన్ని ప్రొఫెసర్ నంబూద్రిగారు ఆవిష్కరించగా ప్రొఫెసర్ వకుళాభరణం రామకృష్ణ పుస్తకాన్ని సభకు పరిచయం చేశారు.

తిరుపతిలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్‍లో – ప్రొఫెసర్ వకుళాభరణం గారు, డా. సి.వి. రామచంద్రరావు, రిటైర్డ్ హిస్టర్ హెడ్, వి.ఆర్.ఆర్. కాలేజి, రచయిత

నా పుస్తకాన్ని హిందూ, ఇండియా టుడే వంటి యాభై పైగా పత్రికలు సమీక్షించాయి. శ్రీరమణగారు నవ్యలో ఈ పుస్తకం మీద సంపాదకీయమే రాశారు.

ఇన్ని విఘ్నాలు, అడ్డంకులు, నిరాశలు అధిగమించి నాపుస్తకం అచ్చై, పండిత పరిశోధకుల మెప్పు పొందడంకన్నా సార్థకత మరేముంటుంది!

గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం అచ్చయిన వెంటనే నరసయ్యగారు పీపుల్స్ ఫ్రెండ్ పత్రికలో గురజాడ హృదయాన్ని ఆవిష్కరిస్తూ గొప్ప సమీక్ష చేశారు. కన్యాశుల్కం నాటకంలో మౌలికాంశాలను తరచిచూపిన సద్విమర్శకులు నరసయ్యగారు. చిరకాలంగా ఉన్న నాటకరచనా సంప్రదాయాలను గురజాడ తృణీకరించారని, తెలుగు నాటకరచనలో కన్యాశుల్కం కొత్త పుంతలు తొక్కిందనీ, కన్యాశుల్క ఇతివృత్తం అపూర్వ మైనదనీ, నాటక పాత్రలు యథార్థ జీవిత ప్రతిబింబాలని నరసయ్యగారు గుర్తించడమేకాక ఈ నాటకాన్ని ప్రదర్శనగానే కాక సహృదయులు చదివి కూడా ఆనందిస్తారని భవిష్యవాణిని వినిపించారు, వ్యావహారిక భాషకు స్వాగతం పలికారు. అందుకే గురజాడ తన రెండో ముద్రణను నరసయ్యకు పోస్ట్ చేయాలనే ఉద్దేశ్యంతో “there was a scholar by-name D.V. Narasaiah who used to edit a bright English weekly ‘The People’s Friend’ now defunct. He was a native of Nellore. Is he living- if so give me his address. He had a wonderful command on English. Please see him.” అని ఒంగోలు మునిసుబ్రహ్మణ్యం గారికి రాసిన ఉత్తరంలో నరసయ్య గారి వైదుష్యాన్ని ప్రశంసించారు.

ఇంగ్లీషు జర్నలిజంలో తొలి తెలుగు వెలుగు దంపూరు నరసయ్య‘ పుస్తకం తెలుగు వికీసోర్సులో ఉచితంగా చదువుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here