జ్ఞాపకాల తరంగిణి-26

0
5

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]కా[/dropcap]వు కావంచు మనుజుండు కావరమున
వేకువను వేడుకొనకుంట విస్మయంబు
క్షుద్ర జంతువు కాకియు నిద్రలేచి
కావు కావంచు నరచును గాదె మొదట!

(ఈ చాటుపద్యం మా మిత్రులు డాక్టర్ మాచవోలు శివరామప్రసాద్ గారి ద్వారా తెలిసింది. వారి తండ్రి శ్రీరాములుగారు ఒక పుస్తకంలో ఈ చాటువును రాసిపెట్టుకున్నారు, దీన్ని కొంచం సవరించారు ప్రసాదు గారు).

సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఈ అపార్ట్‌మెంట్‌కు వచ్చాము. పదవీవిరమణ చేసిన ఇన్నేళ్ల తర్వాత, శైశవం నుంచీ నివసిస్తున్న ఇల్లు విడిచి అపార్ట్‌మెంట్‌కు రావడం, అదీ నగరంలో ఒక చివర రణగొణధ్వనులకు దూరంగా కేటాపడినట్లు జీవించడం వానప్రస్థమే కదా. ఈ ఏకాంతవాసంలో మాకు తోడు మా మనమరాలు. అది మాతో వుంటూ ఏడో తరగతి చదవడానికి వచ్చింది. మా వృద్ధ దంపతుల మధ్య నీరవకుడ్యాన్ని బద్దలుకొట్టి సందడి, సంతోషాన్ని తెచ్చింది ఈ అమ్మాయే.

మా అవసరాలన్నీ పనిమనిషి, వంటమనిషి చూసిపెడతారు. కాలు కదపవలసిన అవసరమే లేదు. ఏడాదిలో మా మనవరాలి కోసం రెండు మూడు సార్లు ఇల్లు కదిలామేమో!

చెట్ల మధ్య రచయిత అపార్ట్‌మెంట్

మా అపార్ట్‌మెంట్ ముందున్న పెద్దవృక్షం నా పడకగదిలోకి కన్పిస్తూ వుంటుంది. నాకు విసుగు పుట్టినప్పుడు బాల్కనీలో నిలుచుంటా. ఎదురుగా ఆ పచ్చని వృక్షం. అది ఏడాదిలో అప్పుడప్పడూ పూస్తుంది, కానీ ఒక కాకుల గుంపుకు ఆశ్రయం ఇచ్చింది. లెక్కపెట్టలేదు గాని యాభై పైనే ఉంటాయి. కొన్ని జతలు, చాలా ఒంటరి పక్షులు. మొదట ఇదేమి చెట్టు, ఏ పక్షులూ వాలవు, వెధవ కాకులు తప్ప అనుకొని ఆ వంక చూడగూడదనుకున్నా. దేన్నీ హీనంగా చూడకు నేస్తం అని శ్రీశ్రీ గుర్తు చేశాడు. ఎవరో కవి చిలుకలు వాలిన చెట్టు అన్నారు. కాకులు వాలిన చెట్టు కూడా బాగుందిలే అనుకున్నా. కరోనా కర్ఫ్యూ తర్వాత, ఆ చెట్టువంక దీక్షగా పరీక్షగా అస్తమానం చూస్తూనే వుంటా. సలీం ఆలీ అయితే చాలా హర్షించి మెచ్చుకొనేవారు.

మా అపార్ట్‌మెంట్ ముందే చెరువు, కాలువ గట్టున చిన్న గుడి, గుడి ఆవరణలో రెండు లేత రావిచెట్లు వున్నాయి. ఆ చెట్లమీద చిలుకలు, గోరువంకలు, కోయిలలు వాలి ఉదయం, సాయంత్రం సందడి చేస్తూ, పాడుతూంటాయి. మే మాసం వచ్చేముందే ఎక్కడినుంచో కొన్ని పుంస్కోకిలలు వాలి గొంతు విప్పి కూయడం ప్రాక్టీస్ చేస్తున్నాయి. అంత దగ్గరలో వున్నా మా వాయస రాజములు వాటి జోలికి వెళ్ళవు. ఏదో అప్రకటిత ఒప్పందం వున్నట్లుంది. రెండు పక్షుల గుంపులు తగాదాలు పడవు.

భవనంపై కాకి

కాకి గోల అని అంటాము, మనకు నచ్చని రణగొణ ధ్వనులు సహించలేకపోతే. నిజంగానే అప్పడప్పుడూ మా చెట్టుమీది కాకులు చేసే గోల భరించలేను. ఎప్పుడో ఒక కొత్త పక్షి – గుడ్లగూబో, గ్రద్దో వచ్చి ఆ చెట్టుమీద వాలి లెక్కాజమా లేకుండా తిష్ట వేస్తుంది. ఇహ చూడాలి మా కాకులు చేసే గోల, అరుపులు, అలజడి తగ్గవు. కాకులన్నీ ఒక్కసారిగా ఎగిరి గిరికీలు కొట్టి చెట్టుమీద వాలి క్షణంలో చిచ్చుబుడ్డి విచ్చుకున్నట్లు ఒక్కసారిగా తలా ఒక దిక్కుకు ఎగిరి మళ్ళీ వెనక్కివస్తాయి. ఈ తతంగం కొనసాగుతూనే వుంటుంది. అప్పుడు అవి చేసే గోలను కాకి గోలని అంటాను. ఆ కొత్త పక్షి చెట్టు మీద కాపురం వున్న ఏ ఉడతనో ఎగరేసుకుపోయేదాకా ఈ అలజడి ఆగదు.

సాయంత్రం ఆరులోపలే పక్షులన్నీ తమ వృక్షరాజం మీద చేరతాయి. కొన్ని జంటలు, కొన్ని ఏకాకులు. దాదాపు అన్ని కాకులూ అలవాటు ప్రకారం నియమిత ప్రదేశాల్లో వాలి, స్థిరపడతాయి. అసురసంధ్య దాటేవరకూ ఏవో ముచ్చట్లు చెప్పుకొంటున్నట్లు అరుపులు.. రాత్రి ఏడయ్యేసరికి అంతా సద్దుమణుగుతుంది. ఏ కొమ్మమీదో ఒక పిల్ల కాకి గోల చేస్తూంటే నిశ్శబ్దంగా ఉండమన్నట్లు ఒక వృద్ధవాయసం ‘కా..’ అంటుంది. అడవిలో కాకుల సంగతేమో కానీ మా చెట్టుమీది కాకులు ప్రతి చిన్న శబ్దానికీ జవాబుగా ‘గయ్’ మని అరుస్తాయి. నా గదిలో ఒక రాత్రివేళ లైటు వేసినా చెట్టు మీది ఏదో పిల్లకాకి శబ్దం చేసి అన్నిటినీ లేపుతున్నట్టు అరుస్తుంది, గోల చేస్తుంది. తల్లో సహచరో వూరుకో అన్నట్టు జవాబుగా అంటుంది. శీతాకాలంలో బాగా తెల్లవారేవరకు అన్నీ నిశ్శబ్దంగా పడుకుంటాయి. వేసవిలో నాలుగైతే చాలు ఒక్కొక్కటీ లేచి కాగుణింతం చదువుతున్న చందంగా క..క…అని సన్నగా అరుస్తాయి.

మేతకు వెళ్ళిన కాకులు మధ్యమధ్యలో వెనక్కి వచ్చి చెట్టుమీద వాలి ముక్కులు శుభ్రం చేసుకోడం తమాషాగా వుంటుంది చూడడానికి. కరోనా భయంతో మనం, వాటికి అది నిత్యం కార్యక్రమంలో భాగం. మధ్యాహ్నం చెట్టు మీద దాదాపు అన్నీ ఒకే దిక్కుకు తిరిగి కూచొని వుంటాయి. అన్నీ పైకొమ్మలమీదే, యెత్తైన ప్రదేశాల్లో వాల్తాయి.

వేలాడే కాకి

ఊళ్ళో మాయిళ్ళలో కాకులు కనిపించకుండా పోయి చాలా ఏళ్ళయింది. పితృదేవతలు వాయసరూపంలో కన్పించి ఆ తద్దినంరోజు పెట్టే చిన్న ముద్ద తినిపోతారని విశ్వాసం. ఆ దేవతలు రాక, గృహస్థు “కా కా” అని అరుస్తూ కాకుల్ని ఆహ్వానించడం, కొన్ని సార్లు కాకులు ఆముద్ద ముట్టుకోడం, అవి రాకపోతే ఏదో వెలితి జరిగిందని చింతించడం కొంతకాలం. ఇప్పుడు కాంట్రాక్టు తద్దినాలు. కాకులూ గోవులూ వేటినీ పట్టించుకోరు.

మా చిన్నతనంలో కాకులు దేన్నీ బతకనిచ్చేవి కావు. నేతిమిళ్ళులు, సబ్బుముక్కలు, కొబ్బెర చిప్పలు ఏమారితే తన్నుకుపోయేవి.. దొంగకాకులు. వాటిని ఏ రాయితోనో కొట్తే సామూహికంగా పగతీర్చుకునేవి. వెంటపడి తరిమేవి, తలమీద పొడిచేవి, రెట్టలు వేసేవి. దొంగకాకులు అని తిట్టుకునేవాళ్ళం.

ఇక శకునాలకూ అవే కావాలి. వాయసం తీర్చిందనో కట్టిందనో అనుకునేవాళ్ళు. పొద్దున్నే వాకిట్లో చెట్టుమీదో పిట్టగోడమీదో చేరి కాకి అరిస్తే ఆరోజు ఇంటికి చుట్టాలు వస్తారని అనుకునేవాళ్ళం. కాకి నెత్తిన మొట్టినా, రెట్టవేసినా సచేలస్నానం తప్పదు. అవి మనతో వుంటూ మలినాలన్నీ శుభ్రం చేసే పక్షులు.

మేడమీద ఒడియాలు పెట్టి కాకులు రాకుండా పిల్లల్ని కాపలా పెట్టేవాళ్ళు. నోరూరుతుంటే ఎంతసేపని చూస్తాం! పిల్లలం ‘పెద్దమడి’లో కొన్నివడియాలు తస్కరించి కాకులమీదకి నెట్టేసేవాళ్ళం. పెద్దలూ కాకిమీద పెట్టే గదా అంటారు? పిల్లలేం తక్కువ తిన్నారు? ఒకటో తరగతిలోనే ’కాకి ఒకటి నీళ్ళకూ’ వచ్చేసేది. ఇప్పుడు లండన్ కాన్వెంట్‌లో లాగే మనపిల్లూ ఆ పాటలే పాడుతున్నారు. అది సరేలేండి. చిన్నయ్య వాయసరాజూ ఏవేవో మా పసిఊహల్లో నిలిచి పోయాయి. యవ్వనంలో దివా కాకరతాత్ భీతా రాత్రౌ తరతి నర్మదా.. సామెతలూ, వసంతకాల సంప్రాప్తే కాకః కాకః పికః పికః, నన్ను ముట్టుకోకు నామాలకాకి వంటి సుద్దులూ ఎన్నో విన్నాము.

పికాలేం తక్కువ కాదండోయ్. మోసంలో కాకలు దీరిన కాకులను మించిపోయాయి. పాపం! కాకి కట్టుకున్న గూట్లో దాని గుడ్లను తోసివేసి తమ గుడ్లను పెఢ్తాయి. మంచి ఆయాలు కాకులు, పొదిగి పిల్లల్ని చేస్తాయి. పిచ్చుకలకూ అస్సలు కృతజ్ఞత లేదు. గాలీవానలో ఆశ్రయం ఇచ్చిందీ కాకమ్మే! అయినా మనం కోయిలల జట్టే. ఏం న్యాయం?

మే మాసం సగపడగానే ఎవరో ముహుర్తం పెట్టినట్లు మా అపార్ట్‌మెంటు పక్కన చెట్టుమీది కాకులన్నీ గూళ్ళుకట్టుకోడం మొదలుపెట్టి, వెనకా ముందుగా సామూహిక గృహప్రవేశం చేశాయి. చిక్కటి దట్టమైన కొమ్మల నడుమ గూళ్ళు కట్టుకోడంతో నాకు స్పష్టంగా కనిపించినవి రెండు గూళ్ళే. గూడు తయారైన రెండు మూడు రోజుల్లో గుడ్లు పెట్టి, ఆడ కాకమ్మ పొదిగే బాధ్యత తీసుకుంటే మొగుడు కాకి పోషణ బాధ్యత తీసుకొంది.

ఎందుకో పాపమనిపించి కాకులకు మధ్యాహ్నం నా భోజనం ముగిసిన తర్వాత పిడికెడు పెరుగన్నం మా బాల్కనీలో గోడమీద పెట్టాను. పదినిమిషాల తర్వాత చూస్తే తినేశాయి. రోజూ వాటి ప్రోగ్రెస్ గమనించేవాడిని. కొన్ని రోజుల తర్వాత ఒక గూటిలో పిల్లలయ్యాయి. మరోగూడు కట్టుబడిలో నేర్పు చాలక కాబోలు జారి సగం కూలి పోయింది. పిల్ల కాకులు, కొత్త దంపతులు కాబోలు, గూడు సరిదిద్దడానికి విఫల ప్రయత్నం చేసి మళ్ళీ మరోకొమ్మ మీద గూడు కట్డడంలో నిమగ్నమయ్యాయి. పిల్లల్ని చేసిన జంటలు సంతానాన్ని కాపాడుకొంటూ పెంచుతున్నాయి. కొన్ని రోజుల తర్వాత గూటిలోంచి పిల్లలు స్పష్టంగా కనిపించాయి. మానవుల సంతానం మాదిరే పిట్టల సంతానంలోను దుడుకు బిడ్డలుంటాయేమో? గూటిలోంచి కాకిపిల్ల ఒకటి కింద పడిపోయింది. ఆరోజు చెట్టమీది కాకులన్నీ కాపలా కాచాయి కుక్కలూ, పిల్లులు దగ్గరకు రాకుండా. చెట్టు కింద రెండో మూడో వీధికుక్కల నివాసం. చెట్టువద్దకు కుక్కలు వస్తే కాకులన్నీ పెద్దగా అరుస్తూ కుక్కల మీదికి దాడిచేసేవి. తల్లి కాకి కాకిపిల్లకు ఎగిరి చూపించేది. పాపం! దానిది ఎగిరే వయసు కాదు. మొత్తం మీద తల్లి ఆహారం తెచ్చి చెట్టు కిందనే పిల్లకు అందించేది. ఆరోజు రాత్రికి పిల్లను ఎక్కడ దాచాయో, తెలీదు. వేకువన కాకిపిల్ల గుర్తొచ్చి అయ్యో దానికేమయిందో అని దిగులుతో నిద్ర పట్టలేదు.

ఉదయం మెలకువ రాగానే బాల్కనీ వద్దకు గబగబావెళ్లి చూస్తే కాకిపిల్ల చెట్టు మొదట్లో కూర్చొని వుంది. అట్లా కాకులు వారం రోజులు కాపాడుకొంటూ వచ్చాయి. వీధికుక్కలు విచిత్రంగా ఆపిల్ల జోలికి వెళ్ళకుండా ఆ సమీపంలోనే కాపలా కాస్తున్నట్లు పడుకొనేవి. ఒక ఉదయం చూస్తే బుజ్జి కాకమ్మ పెద్ద చెట్టుకు సమీపంలో కాలవ గట్టుమీద అయిదడుగుల చెట్టు పైన కూర్చుని ఉంది. తల్లి కాకి ఆక్కడికే ఆహారం తీసుకెళ్లి పెట్తూంది. నాలుగైదు రోజుల తర్వాత ఆచెట్టుమీది ఆ పిల్లకాకి ఏమయిందో కనిపించలేదు. కాకిపిల్ల కథ సుఖాంతం అయిందనే భావిస్తాను.

నా భోజనం కాగానే కాకులకు ఆహారం పెట్డడం అలవాటయింది. సాయంత్రం స్నాక్స్ తినేప్పుడు కూడా పెడతాను. ఆ చెట్టుమీద కాకులు అలవాటయ్యాయి. ఎప్పుడు బాల్కనీలో నేను కనిపించినా అన్నీ ఒకేసారి అరుస్తాయి. ఒక్కోసారి నన్ను డౌన్ డౌన్ అని అంటున్నాయా అని సందేహం కలుగుతుంది. వాటికి రుచులు, ఇష్టాలు అయిష్టాలు అన్నీ మనలాగే ఉన్నాయని తెలిసి ఆశ్చర్యం కలిగింది. చద్దన్నం ఇష్టం ఉండదు. పెరుగన్నం ఇష్టంగా తింటాయి. వాటి ఆహారసేకరణ అంతా ఉదయం వేళలాగుంది. ఎటోవెళ్ళి మధ్యమధ్య మాతృవృక్షం మీద వాల్తాయి. వస్తాయి, మళ్ళీ వెళ్తాయి. ఎందుకో ఎండవేళ విశ్రాంతిగా అన్నీ పడమటవైపుకే తిరిగి కూర్చుని ఉంటాయి..

ఏమౌతుందిలే అనే అశ్రద్ధ పక్షుల ప్రాణానికి వస్తుంది. పోయిన వేసవిలో గాలిపటం మా అపార్టుమెంటు ముందు చెట్టు కొమ్మల్లో చిక్కపడి దాని దారం కొమ్మల్లో వైరులా తగులుకుంది. ఆరునెలలుగా ఆ చెట్టమీద నివాసం ఉంటున్న వాయసాలు తిరుగుతూనే ఉన్నాయి ఆ దారంలో చిక్కుకోకుండా. నాలుగు రోజుల క్రితం అసురసంధ్యవేళ కాకులు పెద్దగా గోలచేస్తున్నాయి. ఒక కాకి దారానికి తగులుకొని తన్నుకుంటోంది. కొంచెం సేపట్లో అది నేలమీద చచ్చి పడింది. చాలా బాధ.

వేకువన కాకుల అలికిడే లేదు. తెల్లవారి చూస్తే చెట్టు మీద అయిదారు పిల్ల కాకులు, రెండో మూడో వృద్ధ వాయసాలు మాత్రమే ఉన్నాయి. చెట్టు, చెట్టతోపాటు మనసు బోసిపోయింది. మనిషికి నేస్తాలు పక్షులు. మన అజాగ్రత్తతో, అశ్రద్ధ వల్ల ప్రకృతిని నాశనం చేస్తున్నాము. ఇది కాకిపురాణం.

నెల్లూరు జిల్లాలో మాలకాకులని ఒకరకం కాకులున్నాయి. ఆకారంలో కాకికన్నా కాస్తంత పెద్దవి. అరుదుగా పట్నవాసాల్లో కనిపిస్తాయి. నన్ను ముట్టకోకు నా మాలకాకి సామెత ఈ జిల్లాలో వాడుకలో వుంది. మాల పేరుతో విన్నమాల, అందలమాల, మాలకొండ(ప్రకాశం)కొన్ని పల్లెల పేర్లు కూడా ఉన్నాయి. మాల పూర్వం అడవి అనే అర్థంలో వాడేవారు కాబోలు. మా జిల్లాలో మరొక పక్షి జెముడుకాకి. గ్రామీణప్రాంతాల్లో, పొలాల్లో, తోటల్లో కనిపిస్తుంది. వీపు జేగురురంగులో చిన్నపిట్ట. ఇది దూరాలకు, ఎత్తుకు ఎగరలేదు. ఒక పొదనుంచి మరొక పొదకు, రెండో మూడో అడుగుల ఎత్తున ఎగురుతుంది. పొదల్లో కూర్చొని ఇది అరుస్తూంటే ఎక్కడో గుమ్మెట వాయించినట్లుంటుంది. దీని రక్తం, మాంసం ఆహారంగా తీసుకొంటే పక్షవాతం నయమవుతుందని మా గ్రామీణుల విశ్వాసం.

నగరాల్లో, చిన్న చిన్న టౌన్లలో వైద్యశాలలు మెడికల్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయించడంతో కాకులు ఆ వ్యర్థాలను తిని చనిపోవడంతో నగరశివాల్లకు వలసలు వెళ్ళిపోయాయి. అవివేకంతో పర్యావరణానికి మనం చేస్తున్న అన్యాయం ఇది. పిచ్చుకలు కనిపించకుండా పోయాయి, ఇప్పుడు కాకుల వంతు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here