జ్ఞాపకాల తరంగిణి-27

1
12

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

ఒక పుస్తక ప్రచురణ వెనక చరిత్ర:

[dropcap]‘క[/dropcap]విత్రయ కవితా వైజయంతి’ గ్రంథ ప్రచురణ వెనుక పెద్ద చరిత్రే వుంది. కోపతాపాలు, శాపాలు, నిష్ఠూరాలు, తిట్లు, దీవెనలు అన్నీ ఉన్నాయి. 1906లో ‘ది ప్రోగ్రెసివ్ యూనియన్’ పేరుతో ఒక సమాజాన్ని విద్యావంతులైన ఔత్సాహికులు నెల్లూరు కాపువీధిలో బాడుగ ఇంట్లో ప్రారంభించారు. నెల్లూరులో రేబాల లక్ష్మీనరసారెడ్డి గారు తమ పేరుమీద నిర్మించిన పెద్ద టౌన్ హాల్ 1915 ఏప్రిల్ మాసంలో ప్రారంభించబడింది. వి.ఆర్. హైస్కూల్ ప్రక్కన, ట్రంక్ రోడ్డు మీద విశాలమైన స్థలంలో, పెద్ద హాల్, హాల్ వెనుక టెన్నిస్ కోర్ట్, హాలు ముందు జలయంత్రం అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ లోనే గొప్ప ఆకర్షణ. బ్రిటిష్ దొరలు రేబాల లక్ష్మీనరసారెడ్డిని రావుబహదూరు బిరుదుతో గౌరవించారు కూడా.

టౌన్ హాల్ నిర్మాత పెద్ద మనసుతో టౌన్ హాల్ ఉత్తర భాగాన్ని నెల్లూరు ప్రోగ్రెసివ్ యూనియన్ లైబ్రరీ నెలకొల్పుకోడానికి రాసిచ్చారు. ప్రోగ్రెసివ్ యూనియన్ పేరును వర్ధమాన సమాజం అని తెలుగు చేశారు.  ‘వర్ధమాన’ అంటే ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న అని అర్థం. ఆ రోజుల్లోనే నెల్లూరులో ఎక్కడో త్రవ్వకాల్లో బయటపడిన జినముని విగ్రహాన్ని, వర్ధమాన సమాజం గోడ వద్ద స్థాపించడంతో, ఆ రోజుల్లో నాబోటి పసివారికి ఈ సమాజం ఏదో జైనులకు సంబంధిచినదని ఒక అభిప్రాయం కలిగేది. 1921లో గాంధీజీ నెల్లూరు వచ్చినపుడు వర్ధమాన సమాజం లైబ్రరీలో తిలక్ తైలవర్ణచిత్రాన్ని స్వహస్తాలతో ఆవిష్కరించారు. ఇప్పుడు కూడా ఆ చిత్రాన్ని ఆ గ్రంథాలయంలో దర్శించవచ్చు.

వర్ధమాన సమాజంలో గోడకు అలంకరించివున్న తిలక్ తైలవర్ణచిత్రం

1911లో వర్ధమాన సమాజంలో తిక్కన గ్రంథాలయం నెలకొల్పారు. ఆనాడు ఈ సమాజం నెల్లూరులో విద్యావంతులు, మేధావులు, రచయితలు కలుసుకొని మాట్లాడుకోను అనువైన ప్రదేశం.

1915లో వర్ధమాన సమాజం మొదటిసారి సెప్టెంబర్ 12న పురమందిరంలో జరిపిన తిక్కన జయంతిలో చిలకమర్తి వారు సభాధ్యక్షులు. స్థానిక విద్వాంసులు మాడభూషి నరసింహాచార్యులు వక్త. ఆ తరువాత ఈ సమాజం వారు వరసగా తిక్కన జయంతులు జరుపుతూ వచ్చారు. వేదిక వి.ఆర్.కళాశాల. నియమితమైన తేదీ ఏమీ లేదు. ఒక సారి ఫిబ్రవరిలో, ఇంకోసారి మరొక నెలలో. మధ్యలో యేవో అసౌకర్యాలవల్ల జరపని సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఏ కారణం చేతనో ఈ తిక్కన జయంతి సభలు వి.ఆర్.కళాశాలలో నిర్వహించారు.

1936లో తిక్కవరపు రామరెడ్డి సన్మానం ఖర్చు భరించడానికి ముందుకురావడమే కాక, తమ తండ్రి లక్ష్మీనారాయణరెడ్డి గారి స్మృత్యంకంగా, ఉపన్యాసకుణ్ణి ఏటా 116/- రూపాయలతో సన్మానించే ఏర్పాట్లు చేశారు. 1941 ప్రాంతంలో జయంతి వేదిక మళ్ళీ పురమందిరానికి మారింది.

1957లో తిక్కన జయంతిలో బెజవాడ గోపాలరెడ్డిగారు ఉపన్యసిస్తూ, నెల్లూరు మాండలికానికి పట్టంకట్టిన తిక్కన జయంతితో పాటుగా నన్నయ, ఎర్రాప్రగడ జయంతులు కూడా జరపమని సూచించారు. మరు సంవత్సరం నుంచి వర్ధమాన సమాజం కవిత్రయ జయంతులు నిర్వహించడం మొదలుపెట్టింది. తిక్కవరపు రామరెడ్డి గారే ఖర్చు భరించేవారు. నన్నయ జయంతి తమ తల్లి రంగమ్మ గారి జ్ఞాపకంగా, ఎర్రన జయంతి సతీమణి సుదర్శనమ్మ జ్ఞాపకంగా జరపమని, మూలనిధిని ఏర్పాటుచేసి ఆ వడ్ఢీతో జయంతులు జరిగేలాగా చేశారు.

ఈ జయంతుల చరిత్ర సేకరించి పుస్తకం ప్రచురిస్తే బాగుంటుందనే ఆలోచన కూడా రామరెడ్డి గారికే కలిగి, అందుకు కమిటీని ఏర్పాటుచేశారు, ఆ కమిటీమీద అసంతృప్తితో మరొక కమిటీ ఏర్పాటు చేశారు, వర్ధమాన సమాజం కార్యదర్శి బంగోరె, మరుపూరు కోదండరామరెడ్డి, గోసుకోండ వెంకటసుబ్బయ్య మరికొందరితో. బంగోరె 1971 చివర నెల్లూరు జమీన్ రైతులో ఉద్యోగం మానుకొని మద్రాసులో అమెరికన్ రిపోర్టర్ పత్రికలో జర్నలిస్టుగా చేరిపోయాడు. అతని స్థానంలో వర్ధమాన సమాజం కమిటి పెన్నేపల్లి గోపాకృష్ణను సమాజం కార్యదర్శిగా ఎంపికచేసుకొంది. పైగా జమీన్ రైతు బంగోరె స్థానంలో గోపాలకృష్ణను సహ సంపాదకులుగా వేసుకొన్నది. అంతకు ముందు గోపాలకృష్ణ న్యాయవాదిగా ఉంటూ, ఏడేళ్లు యూత్ కాంగ్రెస్ వారపత్రిక సంపాదకులుగా ఉన్నారు.

గోపాలకృష్ణ వర్ధమాన సమాజం కార్యదర్శి అయిన తరువాత తిక్కవరపు రామరెడ్డిగారు తిక్కన జయంతుల సమాచారం సేకరించి పుస్తకరూపంలో తెచ్చే బాధ్యతను తనకు అప్పగించారు. ముందున్న రెండు కమిటీలు కొంత పనిచేశాయి. జమీన్ రైతు, ఆంధ్ర పత్రిక వంటి వార్తా పత్రికలలో వార్తలు సేకరించి పెట్టారు. ఈసారి కమిటీలో బంగోరె, వి.ఆర్. కళాశాల చరిత్ర అధ్యాపకులు సి.వి.రామచంద్రరావు, రామరెడ్డి ఆస్థాన విద్వాంసులు, సి.ఎ.యమ్ హైస్కూల్ తెలుగు పండితులు గోసుకొండ వెంకట సుబ్బయ్య, నన్ను కూడా వేసుకొన్నారు. సమాచారం సేకరించి పుస్తకం తయారుచేసే బాధ్యత పైనవేసుకుని మేము పనికొనసాగించాము.

ఈ కమిటీ ఏర్పడ్డట్లు ఎవరికీ తెలియదు. మేమందరం రహస్యంగానే పనిచేస్తూ, పుస్తకావిష్కరణ వరకు విషయం బయటికి పొక్కనివ్వకూడదని ప్రమాణాలు కూడా చేసుకొన్నాము – పూర్వం పనిచేసిన వారి ఆగ్రహానికి బలవుతామనే భయంతో. రామరెడ్డి గారికి మరుపూరు కోదండరామరెడ్డి గారితో ఏవో ఆర్థిక విషయాలలో అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. అంతకు ముందు కూడా కస్తూరిదేవి విద్యాలయం విషయంలో రామరెడ్డి ఏమాత్రం పట్టువిడుపు లేకుండా కోదండరామరెడ్డి గారి అక్క పొణకా కనకమ్మగారిని విద్యాలయంనుచి నిర్దాక్షిణ్యంగా పంపించి వెయ్యడం వంటి దారుణ సంఘటనలవల్ల ఇద్దరిమధ్య శైత్యం నెలకొన్నది. రామరెడ్డి పట్టు విడుపులేని మనస్తత్వం కలిగిన వ్యక్తని నెల్లూరులో అంటారు. మరుపూరు కోదండరామరెడ్డి గారికి వాక్పారుష్యం వున్నా వారి కోపం తాటాకు మంట వంటిది. వారిది కుడిమిస్తే పొంగిపోయే మనస్తత్వం అని అందరూ అంటారు. ఏమయితేనేం, మేము రహస్యంగానే పని సాగించి, పుస్తకం పూర్తయిన తర్వాత రామరెడ్డి గారికి తెలియజేస్తే, వారు సంతృప్తి చెంది పుస్తకం ముద్రణకు పంపారు. అయితే పుస్తకం వెలువడక ముందే విషయం కోదండరామరెడ్డి గారికి తెలిసిపోయింది. మాలోనే ఒకరు విషయం బయటపెట్టారు. బంగోరె ఒప్పేసుకొన్నాడు తాను మద్రాసునుంచి రైల్లోవస్తూ రెడ్డిగారు కనపడితే మాటల్లో ఒక బలహీనమైన క్షణంలో వారికి ఈ వార్త వినిపించానని. వెంటనే మా కమిటీలో సభ్యులందరు కోదండరామరెడ్డి గారి పక్షంలోకి మారారు, అంటే వారి శరణుకోరారు. ఆ కష్టకాలంలో గోపాలకృష్ణతో నిలబడింది నేనొక్కడినే. ఈ పరిస్థితుల్లో, పుస్తకావిష్కరణ జరక్కముందే తిక్కవరపు రామరెడ్డి గారు స్వర్గస్థులయ్యారు. వారి అల్లుడు బెజవాడ గోపాలరెడ్డి గారు మాకు ఆలంబనమై పుస్తకం అచ్చయి వెలుగు చూచేవరకు అండగా ఉన్నారు. మా మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణ పుస్తకానికి ఉపోద్ఘాతం రాసిన తర్వాత 1974లో పుస్తకం అచ్చయి చేతికి వచ్చింది. ఈ పుస్తకానికి నేను బాపూగారి చేత ముఖపత్రం వేయించాను. మిత్రుడు ఎంవిఎల్ బాపుగారిని పరిచయం చేశాడు. నెల్లోపలే మా పుస్తకానికి బాపుగారు అద్భుతమైన వర్ణచిత్రం వేసిచ్చారు. వారు అడగలేదుగానీ, నేనే యధాశక్తి 116/- రూపాయలు ఎంవిఎల్ చేతికిచ్చివచ్చాను. ఈ గ్రంథానికి ‘కవిత్రయ కవితా వైజయంతి’ అని పేరు పెట్టాము. పుస్తకాన్ని వర్ధమాన సమాజం కార్యదర్శి హోదాలో గోపాలకృష్ణ బాపు రంగుల ముఖపత్రంతో చాలా ఆకర్షణీయంగా ప్రచురించారు. 400 పుటల పైచిలుకు పుస్తకానికి 15/- రూపాయలు ధర నిర్ణయంచాము.

వైజయంతి ముఖపత్రం, వెనుక అట్ట మీద బాపు వేసిన చిత్రాలు

‘కవిత్రయ కవితా వైజయంతి’ గ్రంథాన్ని మూడు భాగాలుగా విభజించాము. 1915 నుంచి 1935 వరకు ఒకభాగం. ఈ కాలంలో వర్ధమాన సమాజమే తిక్కన జయంతులు జరిపింది. 1936నుంచి తిక్కవరపు రామరెడ్డి గారి ఔదార్యంతో తిక్కన జయంతులు జరిగాయి, కనక అదొక భాగం. 1958 నుంచి నన్నయ, తిక్కన, ఎర్రాప్రగడ జయంతులను కవిత్రయ జయంతుల పేరుతో నిర్వహించారు కనక అదొక భాగం. ఆంధ్రపత్రిక దినపత్రిక, కృష్ణాపత్రిక, నెల్లూరు స్థానిక పత్రికలు జమీన్ రైతు, సుబోధిని, యూత్ కాంగ్రెస్, మందాకిని వంటి పత్రికలలో జయంతి సభలపై వచ్చిన రిపోర్టులు సేకరించాము. మాకంటేముందు ఏర్పడిన కమిటీలు కొంత పనిచేశాయి కూడా, కానీ గ్రాంథికభాషలో రచన చేయబడింది. దాన్నంతా వీలైనంత వాడుకభాషలోకి మార్చాము. కొంతకాలం సభలు రెండు రోజులు జరిగాయి. రెండవరోజు ఉదయం ఎర్రన జయంతి, సాయంత్రం తిక్కన జయంతి జరిపారు. కొన్ని సంవత్సరాలు వరుసగా మూడు సాయంత్రాలు జయంతులు నిర్వహించారు. సభల్లో పాల్గొన్నవారి జీవితవిశేషాలు ‘బ్లర్బు’ (blurbs) లాగా ఒక పేరాలో సంగ్రహంగా ఇచ్చాము. సభాధ్యక్షులెవరు, వక్తలెవరు వంటి అంశాలను క్రమపద్ధతిలో పట్టికలో ఇచ్చాము. తిక్కన జయంతి సభకు అధ్యక్షత వహించిన వ్యక్తిని మరుసటి సంవత్సరం సన్మానించే సంప్రదాయం కొంతకాలం పెట్టుకొన్నారు. 1969 తిక్కన జయంతికి శ్రీశ్రీ అధ్యక్షత వహించారు. మరుసటి సంవత్సరం 1970లో శ్రీశ్రీని సన్మానించారు. ఈ పుస్తకం 1970 సభా విశేషాలతో ముగుస్తుంది.

ఆనాటి తెలుగు దేశంలోని ఏ పండితుల పేరైనా గర్తు చేసుకోండి, కట్టమంచి రామలింగారెడ్డి నుంచి దివాకర్ల వరకూ వారి పేరు ఇందులో ఉంటుంది. ఆ రోజుల్లో పండితులు ఈ జయంతి సభల్లో పాల్గొనడం తమకు విశేష గౌరవంగా భావించేవారు. రామరెడ్డిగారు వర్ధమాన సమాజ కార్యకర్తలకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు, లేకపోతే శ్రీశ్రీని ఆహ్వానించడం మాకు సాధ్యమయ్యేదికాదు.

కొందరు బెజవాడ గోపాలరెడ్డి గారి సహకారంతో కమిటీగా ఏర్పడి 1995 ప్రాంతాల్లో కవిత్రయ జయంతుల నిర్వహణ వర్ధమాన సమాజ యజమాన్యం నుంచి తప్పించి విడిగా జరుపుతూ వచ్చారు. వారి నిర్వహణలో షుమారుగా 2006 సంవత్సరం వరకు జయంతులు కొనసాగించి ఉండొచ్చు. మేము 1970లో పుస్తక రచనకు పూనుకొన్నాము కనక జయంతుల కథ ఆ యేడుతో, శ్రీశ్రీ సన్మాన సభలతో ముగుస్తుంది.

తిక్కవరపు రామరెడ్డిగారిని స్మరిస్తూ పుస్తకంలో ఇట్లా రాశాము.

~

ఆరని జ్యోతి వెలిగించి

అజరామర కీర్తి నార్జించి

కవిత్రయ పవిత్ర పాదసన్నిధి

చేరుకున్న దాన సరిత్పతి

శ్రీ తిక్కవరపు రామరెడ్డి

మహనీయస్మృతికి

ఇది అక్షర నీరాజనం.

~

వైజయంతికి బెజవాడ గోపాలరెడ్డి గారు దివాకర్ల వెంకటావధాని గారి చేత, తుమ్మల సీతారామమూర్తి గారి చేత రెండు పరిచయ వ్యాసాలు రాయించారు. అవధానిగారు దాదాపు సభల్లో పాల్గొన్న వక్తల ఉపన్యాసాలలో ప్రధాన అంశాలను సంగ్రహంగా చెప్పి, మంచి విషయాలు ఉద్ధరించారు. మేము గ్రంథం చివర నామసూచిని కూడా చేర్చాము. పాఠకులు సులభంగా ఎవరేమి మాట్లాడారో శ్రమలేకుండానే తెలుసుకోవచ్చు.

ఈ గ్రంథావిష్కరణ సభ ఎప్పుడు జరిగిందో నాకు గుర్తురాలేదు.

పుస్తకమేమో వెలుగు చూచింది కానీ నెల్లూరులో మేము కొందరి ఈర్ష్యాసూయలకు, కోదండరామరెడ్డి గారి కోపాగ్నికి శలభాలయ్యాము! మేము చేసిన ఈ కృషిని తీసిపారేసినవారు, మెచ్చుకొన్నవారూ ఉన్నారు. నెల్లూరు స్థానిక కవి బండి నాగరాజు గోపాలకృష్ణ, సి.వి. రామచంద్రరావు, గోసుకొండ వెంకటసుబ్బయ్య, నన్ను(సంపాదకవర్గం) కలిపి దుష్టచతుష్టయం అని అభివర్ణిస్తూ స్థానిక పత్రికలో లేఖ రాశాడు. తర్వాత, యేన్నో ఏళ్లకు తానే నన్ను కలిసినప్పుడు, తను చేసింది పొరపాటని చెప్పాడు. అది తన సంస్కారం. నాకు పరిచయమున్న వి.ఆర్.కళాశాల తెలుగు అధ్యాపకులొకరు మా కృషిని తేలికపరుస్తూ దండగమారి పుస్తకం అని చులకన చేసి మాట్లాడారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here