జ్ఞాపకాల తరంగిణి-3

0
11

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]నే[/dropcap]ను చదివిన వెంకటగిరి రాజా హైస్కూలు చరిత్ర కూడా సామాన్యమైనది కాదు. 1870 ప్రాంతాలలో నెల్లూరు ఫ్రీ చర్చ్ మిషన్‍లో అధ్యాపకులుగా సుంకు నారాయణ సెట్టి పనిచేసేవారు. ఆయన ఆ స్కూలు యాజమాన్యం చేస్తున్న మతాంతరీకరణ కార్యక్రమాలను సహించలేక ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఒక బాడుగ ఇంటిలో హిందూ స్కూలును 1875లో నెలకొల్పారు. ఆ పాఠశాలలో వెంకటగిరి సంస్థానం దివాను రహమతుల్లా గారి కుమారుడు విద్యార్థి. తన తండ్రికి ఆంగ్లభాషలో వచ్చిన లేఖను ఆ బాలుడు గడగడ చదివి వివరించేసరికి, రహమతుల్లా ఆనందంతో 1300 రూపాయలు ఖరీదు చేసే విశాలమైన మైదానంతో కూడిన ఒక పురాతన భవాన్ని కొని హిందూ హైస్కూలుకు బహుకరించాడు. కొన్నేళ్ళ తర్వాత ఈ నారాయణసెట్టి గారిని వెంకటగిరి రాజా వెలుగోటి రాజగోపాలకృష్ణ తన దివానుగా నియమించుకొని, నారాయణసెట్టి నెలకొల్పిన హిందూ హైస్కూలుకు ఏభై వేల రూపాయల మూలనిధిని సమకూర్చాడు. ఆ విధంగా నెల్లూరులో వెంకటగిరి రాజా హైస్కూలు, కాలేజీ ఏర్పడ్డాయి. ఈ దివాను నారాయణసెట్టికి ‘బి.ఏ. నారాయణసెట్టి’ అని పేరు. ఆయన నెల్లూరు జిల్లాలో మొదటి గ్రాడ్యుయేట్.

‘గతమెంతో ఘనకీర్తి కలవోడా!’ అని పొగుడుకోవాల్సిందే! నేను చదివే రోజుల్లో వి.ఆర్.సి. అంటే బందెలదొడ్డి అనే పేరు స్థిరపడింది. నన్ను థర్డ్ ఫారం ఇ సెక్షన్‌లో వేశారు. యఫ్ సెక్షన్ కూడా వుండేదేమో! చచ్చుపుచ్చు సరుకును ఈ సెక్షన్లలో తోశారు. కొన్ని క్లాసులు అసలు జరిగేవి కావు. కాకుటూరు నరసింహారావు గారు హెడ్ మాస్టరు. దయామయులు. పిల్లల్ని దండించేవారు కాదు. ‘వచ్చే నలభై ఎనిమిది గంటల్లో ఉరుములతో కూడిన వర్షం పడవచ్చు’ అని రేడియోలో మధ్యాహ్నం వార్త విన్నారంటే మరుక్షణమే రెండు రోజులు స్కూలుకు సెలవులు ప్రకటించి లాంగ్ బెల్ కొట్టించేవారు. ఇదేమీ అతిశయోక్తి కాదు. 1953 సెప్టెంబరు 30న మా నాయనగారు స్వర్గస్థులయ్యారని చెప్పాను గదా! ఆ తర్వాత, అమ్మ మా ఊరిలో మేనత్తతో పాటు తనూ వ్యవసాయానికి అంకితమై పోయింది. 1951లో చిన్నక్క పెళ్ళిలో నాకు ఉపనయనం చేశారు. మా నాయన తన శిష్యుల వద్దకు పంపి దేవతార్చన, సంధ్యావందనం, అగ్నికార్యం వంటి విధులన్నీ బాగా నేర్పించారు.  మా దేవతార్చనలో సాలగ్రామాలున్నవి కనుక నేనే ఆ విధులన్నీ ఎం.ఏ. చదవడానికి హైదరాబాదు వెళ్ళేదాకా నిర్వహిస్తూ వచ్చాను. నాకు స్వరం పట్టుబడకపోవడంతో త్వరలోనే వేదం నేర్చుకొనే ప్రయత్నం ముగిసిపోయింది.  నెల్లూరులో ఒక్కణ్ణే వుంటూ, అన్నం వండుకొని తింటూ చదువుకున్నాను.

శ్రీ సి.వి. సుబ్బరామయ్య, రచయిత మేనత్త కుమారులు, న్యాయవాది, రచయితకు బాల్యంలో ఇంగ్లీషు నేర్పించిన వారు.

ఎలాగో పై క్లాసులకు ప్రమోట్ అవుతూ వచ్చినా, నాకు ప్రాథమిక స్థాయిలో గణితం కూడా తెలియపోయినా, పట్టుబట్టి కాంపోజిట్ లెక్కలు తీసుకోడం నా కష్టాలకు తోడయ్యింది. SSLC ఆరు నెలల పరీక్షలలో గణితంలో నాకు సున్నా మార్కులు వచ్చాయి. యాదృచ్ఛికంగా, మా ఇంటికి వచ్చిన మా మేనత్త కుమారులు (న్యాయవాది) కంట నా సమాధాన పత్రం పడింది. వారు నన్ను తన వెంట ఇంటికి తీసుకొని వెళ్ళారు. అప్పటికే వాళ్ళ ఇంటిలో ఇంటర్మీడియట్ చదువుతున్న నా మిత్రుడు, ఆయన మేనల్లుడు నరహరి అనే కుర్రాడు, నేను రహస్యంగా సినిమాలకు, గ్రంథాలయానికీ వెళుతూండేవాళ్ళం. మా బావగారు (మేనత్త కుమారులు) కోర్టు, కోర్టు తర్వాత క్లబ్ అన్నీ చూసుకొని ఆలస్యంగా వచ్చేవారు. కొత్తగా కాపురానికి వచ్చిన భార్య, కమ్యూనిస్టు పార్టీ పనులు. వీటితో ఆయన ఎప్పుడూ తీరిక లేకుండా వుండేవారు. మా మేనత్త మమ్మల్ని చాలా ప్రేమగా చూసేది. మా బావగారు ఇంట్లో లేకుంటే రహస్యంగా శరత్, ప్రేమ్‌చంద్, కొవ్వలి – విచక్షణ లేకుండా దొరికిన పుస్తకమల్లా చదివేవాళ్లం. జిల్లా గ్రంథాలయ సంస్థలో సాయంత్రాలు పుస్తకాలు చదువుతూ గడిపేది. ఆనాటి విద్యార్థులంతా ఇలాగే వుండేవారు. ఇన్ని పుస్తకాలు చదివామని గొప్పగా చెప్పుకునేవాళ్లం.

మా మేనత్త కుమారుల ప్రభావం నా మీద బలంగా వుంది. ఆయన తరచూ ఫోటోలు తీసేవారు. తన శ్రీమతికి పేంటూ, షర్టూ, నెత్తిన దొరల టోపీ పెట్టి ఫోటో తీశారు. ఆయన ప్రవర్తన తండ్రికి నచ్చకపోయినా, ఏమీ అనేవారు కాదు, ఒకే కుమారుడు వారికి. ఒకరోజు ఉదయం మా మేనత్త పొన్నగంటి ఆకుకూర తెచ్చిన యానాది పిల్లతో కొసరి కొసరి ఆకు తీసుకొని చేటలో నూకలు తెచ్చిపెట్టింది! “అమ్మా! వాళ్ళు చాలా శ్రమ చేసి ఆకు కోసుకొస్తారమ్మా! బియ్యం పెట్టు! నూకలుంటే బిచ్చగాళ్లకు పెట్టమ్మా” అని అన్నారు. “అయ్యో! నూకలు బిచ్చంగా పెడ్తే వచ్చే జన్మలో చీమలై పుడ్తార్రా!” అంది మా మేనత్త. ప్రతిరోజూ ఉదయం ఒకతను చాత్తాని విష్ణుభక్తుని వేషంలో చిరతలతో తాళం వేస్తూ కమ్మగా పాడుతూ భిక్షకు వచ్చేవాడు. అతను చాలా పుష్టిగా దిట్టంగా ఉండేవాడు. మా మేనత్త చేటలో అర్ధ శేరు బియ్యం తెచ్చి అతని జోలెలో పోసేది. మిత్రుడు నరహరి, నేను ఒక రోజు ఆ యాచకుడికి తెలియకుండా వెంటపడ్డాము. అతను ఉదయం పడకొండు గంటలకు నెల్లూరులో పేరున్న కోమల విలాస్ హోటల్‌కు వెళ్ళి సుష్టుగా భోజనం చేసుకొని వెళ్ళిపోయాడు. మా బావగారి మాటల్లో అర్థం మాకు తెలిసింది. మొత్తం మీద ఆ మార్చిలో జరిగిన పబ్లిక్‍లో లెక్కల్లో 31 మార్కులొచ్చి నేను ఫెయిలయ్యాను.

యస్.యస్.యల్.సి. వరకు నాకు ట్యూషను వంటివేమీ లేవు. మా చిన్నక్క కమలమ్మ, బావగారు నరసింహం గారు నన్ను వెంకటగిరి తీసుకొని వెళ్ళి దగ్గర పెట్టుకొని ట్యూషన్ ఏర్పాటు చేశారు. 1958 సెప్టెంబరులో SSLC గట్టెక్కాను. మా చిన్నక్కను వెంకటగిరిలో ఇచ్చారు కనుక అనేక పర్యాయాలు బాల్యంలో వెంకటగిరి వెళ్లాను. వెంకటగిరి రెండు మూడు మైళ్లుందనగా, దూరం నుంచి తూర్పు కనుమలలో భాగమైన వెలిగొండలు, వెంకటగిరి దుర్గం నేపథ్యంలో కనిపిస్తాయి. రాజావారి భవనాలు, అంతఃపురం, ఇతర రాజ బంధువుల మేడలు, పాలరాతితో కట్టిన భవనాల మాదిరి మా పసివారి వూహల్లో నిలిచిపోయాయి. 1955-56లో వెంకటగిరిలో బాలికల పాఠశాలకు సత్యసాయిబాబా గారు వచ్చినపుడు వారిని చాలా దగ్గరగా నిలబడి చూశాను. ఆ రోజుల్లో యువబాబా గారు తరచూ వెంకటగిరి వచ్చి జమీందార్ల అతిథిగా వుండేవారు. నేను వెంకటగిరిలో ఉన్న సమయంలోనే వెంకటగిరి అమెచ్యూర్ ఆర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు ప్రదర్శించిన వేణు నాటిక ‘దిష్టిబొమ్మలు’ ఆంధ్ర నాటక కళాపరిషత్తు పోటీలలో ప్రథమ బహుమతి పొందింది. ఆ వార్త వెంకటగిరంతా దావానలంలాగా వ్యాపించి, ప్రజలందరూ ఉత్సాహంతో ఉప్పొంగిపోవడం నేనెరుగుదును. వేణు, నారాయణ, ఆ పాత్రధారులంతా నేనెరిగినవారే. ఆ రోజుల్లో వెంకటగిరి నాటక ప్రదర్శనలకు పేరు. వెంకటగిరి ఊళ్ళోకి ప్రవేశించే ముందు కైవల్యానది మీద వంతెన వస్తుంది. కైవల్య కొండవాగు. కొండల్లో వర్షాలు పడితే వాగు పొంగిపొరలుతుంది. గంటల్లో వాగు పొంగు తగ్గిపోతుంది. 1850 ప్రాంతంలో గుంటమడుగనే ఈ వాగుకు వెంకటగిరి స్థలపురాణంలో కైవల్యగా నామకరణం చేశారు. కైవల్య దక్షిణం ఒడ్డున జ్యోతి టాకీసు సినిమా హాలు. రాజాగార్ల కోసం ప్రత్యేక ప్రదర్శనలుండేవి. “ఈరోజు నగిరోళ్ళ ఆట” అంటూ ఆ రోజు ఊరంతా మైకులో చెప్పేవారు.

మా బావగారి తండ్రి శ్రీధర వెంకట సుబ్బయ్యగారు వెంకటగిరిలో రాజాగార్ల దేవాలయాల మీద అముల్దారు. పేరు గొప్ప, జీతం చాలా తక్కువ. వెంకటగిరి పాలకుల్లో 27వ తరం వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచమనాయుడు 1880 ప్రాంతంలో నిరుపేదలకు శాశ్వత నిత్యాన్నదానం కొనసాగించేందుకు ‘poor house’ (జగన్నాథ సత్రం) నెలకొల్పి కలిచేడు గ్రామాన్ని రాసిచ్చాడు. 1920లో రాజాగారు కలిచేడులో మైకా తవ్వకాలు మొదలుపెట్టారు. ఎంత ఆదాయం వచ్చినా 1958లో మా మామగారు పూర్ హౌస్ తరఫున నాలుగైదు పేద బ్రాహ్మణ కుటుంబాలకు మోయనలు పంపడం గుర్తుంది.

వెంకటగిరి అనగానే రాజభవనాల ఎదుట ఒక మేడ – నౌబత్‌ఖానా. అందులో రకరకాల వాయిద్యాలు. ఝాములు, ఘడియలు తెలియజేయడానికి అప్పుడప్పుడూ ఢంకా మ్రోగించేవారు. ఆయా వేళల్లో షహనాయి వంటి వాయిద్యాల సంగీతం ఊరంతా వినిపించేది. నా బాల్యంలో వెంకటగిరి పౌరులు ఇన్నో ఝామయిందని అనేవారే గాని గంటలు, నిమిషాల కాలమానాన్ని అనుసరించేది లేదు. అదేదో ఒక పాత కాలం లోకం. నా వంటి బాలబాలికలకు ఎంతో సమ్మోహనంగా వుండేది.

వెంకటగిరి జమీందారుల పాలెస్… స్థానికులు నగిరి అంటారు

మా చిన్న మేనత్త భర్త కనుమళ్ల కృష్ణయ్యగారు జమీందారి రద్దయ్యే వరకూ వెంకటగిరి సంస్థానం ఖజాంజీగా చేశారు. 1948లో చిన్నపిల్లవాడిగా మొదటిసారి వెంకటగిరి పోయినపుడు, సాయంత్రం చీకటి పడుతున్న వేళ ఒక నౌకరు వీధి లాంతరులు తుడిచి, కిరోసిన్ పోసి, దీపాలు వెలిగించుకొంటూ వెళ్లేవాడు. అతని భుజం మీద నిచ్చెన వుండేది. మా మామగారు ఖజాంజీ ఇంటి ముంగిట నడుముకు తుండుగుడ్డ గట్టిగా బిగించి కట్టుకుని ఈశ్వరయ్య అనే సేవకుడు ఎప్పుడూ నిటారుగా నిలబడి వుండేవాడు. మా మేనత్తవాళ్లు అరవవీధిలో వుండేవాళ్ళు. ఆ వీధిలో అందరూ రాజోద్యోగులూ, టీచర్లూ. దానికి ముందున్న కరణకమ్మ వీధంతా రాజపురోహితులూ, ఇతర బ్రాహ్మణులు ఉండేవారు. రాజభవనాల ముందుగా ఒక విశాలమైన వీధి. ఆ వీధినే తూర్పు వీధి అనేవారు. బాల్యంలో వెంకటగిరి నాకు వింతగా, కుతూహలంగా అనిపించి దానితో ఒక అవినాభావ సంబంధం ఏర్పడింది.

***

నెల్లూరు వి.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ ఎంత మొత్తుకున్నా – ప్రిన్సిపాల్ గారి వద్దకు తోడుకొని వెళ్ళి తెలుగు బి.ఎ. స్పెషల్‍లో చేర్పించారు. ఒకరి ఉద్యోగం నిలబెడుతున్నాననే భావనతోనో, మానవత్వమో, ఒక నిస్పృహలోనో తెలుగు బి.ఎ. లోకి వచ్చి పడ్డాను.

ఆ రోజుల్లో తెలుగు శాఖాధిపతి శ్రీ పోలూరి జానకిరామశర్మ గారు. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి శిష్యులు. చాలా సంప్రదాయవాది. ఇంట్లో కూడా చాలా కఠినమైన మడి, ఆచారం. వారు పచ్చి గ్రాంథిక భాషావాదులు కూడా. నేను ప్రి-యూనివర్శీటీ లోనే SFI కార్యకర్తను. టీచర్ల తరఫున ఐదుసార్లు ఎం.ఎల్.సి.గా ఎన్నికైన స్వర్గీయ సింగరాజు రామకృష్ణయ్యగారి కుమారుడు రాజేంద్రప్రసాద్ నా బాల్యమిత్రుడు. వి.ఆర్. కళాశాల ఎన్నికలలో ప్రచారంలో అతనివెంట తిరిగేవాడిని. కళాశాల ఆంధ్ర భాషా సంఘం ప్రారంభోత్సవం మహకవి శ్రీశ్రీ చేత చేయించాను. ఇవన్నీ తెలిసినా జానకిరామశర్మగారు నన్ను దగ్గరకు తీసుకొని వాత్సల్యంతో నాకు పథ నిర్దేశం చేశారు. వారు నా పట్ల అసాధారణమైన శ్రద్ధ కనపరిచారు. నా రాజకీయ భావనలు ఎట్లా ఉన్నా వారి ప్రేమ, ఆదరణ నన్ను బంధించింది. వారింట్లో ఏవో చిన్న చిన పనులు running errands చేసి పెట్టేవాణ్ణి. ఆ రోజుల్లో రెండో సంవత్సరాంతంలో జనరల్ తెలుగు రెండు పేపర్లు, ఇంగ్లీషు మూడు పేపర్లు, జనరల్ ఎడ్యుకేషన్ ఒక పేపరు – మొత్తం ఆరు పేపర్లు. ఒక్కసారిగా పాసు కావాలి. ఏ పేపరు పోయినా, మళ్ళీ అన్ని పేపర్లు రాయాల్సిందే. పరమపద సోపానపటంలో పెద్ద పాము నోట్లో పడ్డట్టే. రెండో సంవత్సరం మొదటి ప్రయత్నంలో అన్ని పేపర్లు పాసయినవారే డిగ్రీ మొదటి ప్రయత్నంలో పాసవుతారని, లేని వారు డిగ్రీ పూర్తి చేయలేరని, వారు నిత్యం నా బుర్రలో ఎక్కించారు. ఆయన ఇచ్చిన ప్రోత్సాహం వల్లనే అనేక అననుకూల గృహ పరిస్థితుల మధ్య చదివి సెకండ్ ఇయర్ డిగ్రీ అన్ని పేపర్లు పాసయ్యాను. మా బి.ఎ. తరగతిలో 135 మందికి గాను 35 మంది మాత్రమే అలా పాసయ్యాము. మా సార్ కృపాకటాక్షాల వల్లే నా జీవితం గాటన పడింది..

బి.ఎ. మూడవ తరగతిలో కృతార్థుణ్ణయ్యాను. జనరల్ తెలుగు, గ్రూపు తెలుగులో C Plus మార్కులు వచ్చాయి. అంటే 45-50 మధ్య మార్కులు. ఆ యేడు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మొత్తం తెలుగు బి.ఎ. పాసైన విద్యార్థులు నలుగురైదురు కన్నా మించి లేరు. యస్. వి. యూనివర్శిటీలో తెలుగు ఎం.ఏ. చదవడానికి అప్లికేషన్ పంపుకున్నా. మా వి.ఆర్. కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ. ఆర్. సుబ్బారెడ్డి గారు, మా గురువు గారు జానకిరామశర్మ గారూ యస్. వి. యూనివర్శిటీ తెలుగు శాఖ అధిపతి ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారికి ఉత్తరాలు ఇచ్చాయి. తిరుపతి వెళ్ళి వారిని కలుసుకుని వచ్చాను కూడా. నా అదృష్టం ఏమిటో ఆ విశ్వవిద్యాలయంలో నాకు సీటు రాలేదు. జనరల్ తెలుగులో ఎక్కువ మార్కులు తెచ్చుకొన్న విద్యార్థులకే సీటిచ్చారు. నాతో పాటు మా గురువు గారు కూడా చాలా నిరాశకు గురయ్యారు.

మా పెద్దమ్మ అల్లుడు సోలా బాలసుబ్రహ్మణ్యం ఆ రోజుల్లో నెల్లూరులో చాలా గొప్ప పేరున్న ఇన్‌కమ్‌టాక్స్ ప్రాక్టీషనర్. ఆయన నన్ను లా చదివి తన వద్ద ఆ వృత్తిలో చేరమని ప్రోత్సహించారు. టాక్సు సలహాదారుడిగా జీవించడం అంటే దోపిడీదారులకు సహాయం చెయ్యడం అని అప్పటికే నా మనస్సులో ముద్రపడిపోయింది. అందువల్ల ఆ ప్రతిపాదన నాకు ఆమోదయోగ్యం కాలేదు.

పెరుగు బుట్ట తల వెంట్రుకలతో కళాప్రపూర్ణ మరుపూరు కోదండరామరెడ్డి. వారి ప్రక్కన వి.ఆర్. కాలేజి చరిత్ర అధ్యాపకులు డాక్టర్ సి. వి. రామచంద్రరావు

కళాప్రపూర్ణ మరుపూరు కోదందరామరెడ్డిగారు చాలా కాలం మా పొరుగున ఇల్లు కట్టుకొని ఉన్నారు. వారి పిల్లలతో నేనూ చాలా స్నేహంగా ఉండేవాణ్ణి. నా పరిస్థితి కోదండరామరెడ్డి గారికి తెలిసింది. ‘మద్రాసులో చదువుతావా? మైసూరులో చదువుతావా? హైదరాబాదులో చదువుతావా? ఎక్కడ చదవాలన్నా ఉత్తరం ఇస్తాను’ అన్నారు వారు. ఆయన ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యులు కూడా!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here