జ్ఞాపకాల తరంగిణి-35

0
9

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. కార్యక్రమాలు-2

[dropcap]మా[/dropcap] కేంపు జరుగుతున్నన్ని రోజులు కాలనీవాసులందర్ని సమావేశపరచి రాత్రి వేళ పత్రికలు చదివి వినిపించడం, ఆరోగ్య సూత్రాలు వివరించడం వంటి పనులు చేశాము. మా విద్యార్థులు కాలనీవాసుల ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల మీద సర్వే చేశారు. కేంపు చాలా విజయవంతంగా జరిగింది. కాలనీవాసులు లాభపడ్డారు, మా విద్యార్థులు కూడా.

మాకు ఉంటడానికి గుడికి అనుబంధంగా ఉన్న సత్రాన్ని ఇచ్చిన గ్రామ పెద్ద, శాకాహరం మాత్రమే వండుకోవాలని నియమం పెట్టారు. ఒక ఆదివారం రాత్రి విద్యార్థుల బలవంతంతో మాంసాహారం వండించవలసి వచ్చింది. మా వంటవాడు ఒక గృహస్థు ఇంట్లో వండి విద్యార్థులకు తెచ్చి వడ్డించాడు. విద్యార్థులు భోజనం తర్వాత పళ్లాల్లో మిగిలిన పదార్ధాలను దూరంగా ఎక్కడో పారవేసి వచ్చారు. ఆ విధంగా కట్టె విరక్కుండా, పాము చావకుండా కాస్త లౌక్యంగా వ్యవహరించ వలసి వచ్చింది.

ఈ బుజబుజ నెల్లూరు కేంపు చివరి రోజు మేముంటున్న, సత్రం సమీపంలో వేదిక నిర్మించి చిన్న సభ జరిపాము. పిల్లలు ఆడిపాడారు. ఆ గ్రామవాసులకు మంచి వినోదం. తర్వాత జరిగిన మీటింగుకు తాను అధ్యక్షత వహిస్తానని గ్రామ పెద్ద చెప్పి పంపాడు. మా విద్యార్థులు కాలనీకి చెందిన పంచాయితీ అధ్యక్షుణ్ణే వేదిక ఎక్కించారు. ఇది గ్రామంలో వారికి కాస్త మనస్తాపం కలిగించింది. మరొక అపశ్రుతేమిటంటే ఈ పదిరోజుల్లో మా బృందంలో ఒక బాలిక మరొక యువకుడితో ప్రేమలో పడి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. ఆ యువతి తండ్రి చనిపోయాడు. బంధువుల ‘ఛారిటి’ మీద ఆధారపడి చదువుకొనసాగిస్తోంది. విధి లేని పరిస్థితుల్లో విషయం ఆ అమ్మాయి గార్డియన్ దృష్టికి తీసుకొని వెళ్ళవలసి వచ్చింది. ఆ యువతి బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది.

మా ఎన్.ఎస్.ఎస్. యూనిట్ బుజబుజ నెల్లూరు యానాది కాలనీలో సుమారు ఆరు నెలలు రాత్రి పాఠశాల నిర్వహించింది. విద్యార్థులతో పాటు అధ్యాపకులు వెళితేనే కాలనీవాసులు పాఠశాలకు వచ్చేది. విద్యార్థులు మాత్రమే వెళ్లినప్పుడు సరిగ్గా హజరయ్యేవారు కారు. ఆ కాలనీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి సహకారంతో మలేరియా, ఫైలేరియా వంటి వ్యాధులున్న రోగులున్నారేమో అని నిశి రాత్రి వేళ పెట్లోమాక్స్ లైట్లు పెట్టుకొని గుడిసె గుడిసె తిరిగి రక్త నమూనాలు తీసి పరీక్ష చేయించాము. విద్యార్థులు చాలా కమిట్‌మెంట్ వున్నవారు కనుక ఈ ప్రోగ్రాంలను విజయవంతం చెయ్యగలిగాము. ఇటువంటి పరీక్షలు జరుపుతున్న సమయంలోనే నాకు ఫైలేరియా ఇన్‌ఫెక్షన్ వున్నట్లు తెలిసి, వైద్యం చేయించుకోవలసి వచ్చింది. మెడికల్ డిపార్ట్‌మెంట్ వారి సహకారం వల్ల మా విద్యార్థులకు చాలా విషయాలు తెలిశాయి. ఒక గ్రామీణుడికి మెడమీద, చెవుల వద్ద ఎర్రగా మచ్చలుండడం గమనించి అతనికి కుష్ఠు వ్యాధి సోకిందనే సందేహంతో నెల్లూరు పెద్దాసుపత్రిలో చూపించాము. అతనిని నా స్కూటరు వెనక కూర్చోబెట్టుకొని ప్రభుత్వాసుపత్రికి తీసుకొని వెళ్లాను. అతనికి కుష్ఠు వ్యాధి సోకిందని, ఇతరులకు సోకగల స్థితిలో, ఇన్‌ఫెక్షియస్ దశలో వుందని చెప్పి మందులిచ్చారు. ప్రభుత్వ వైద్యశాఖ ఉద్యోగులే వారం, వారం అతని ఇంటికి వెళ్లి మందులు ఇచ్చి పర్యవేక్షించారు.

నాలుగు నెలలో లోపలే అతను రోగం నుంచి విముక్తుడైనాడు. నేను తనను పరీక్షకు తీసుకొని వెళుతున్నపుడు గ్రామస్థులందరు అది మహా పొడ అని, ఏమీ చెయ్యదని నా ప్రయత్నాన్ని నిరుత్సాహపరచేవారు. ఎన్.ఎస్.ఎస్.లో వుండడం బట్టే నాకిట్టి అనుభవాలు వచ్చాయి.

అప్పుడే వైద్యశాఖ టైఫాయిడ్ వ్యాక్సిన్ ఇస్తోంది. నేను నా ముగ్గురు పిల్లలకు ఆ వ్యాక్సిన్ వేయించాను. కొంచెం జ్వరం మాత్రం వచ్చింది. ఆ రోజుల్లో డాక్టర్లు కూడా తమ పిల్లలకు టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించడానికి జంకుతున్నారు. ఇప్పుడు కూడా వేక్సిన్ ఇంజెక్షన్ రూపంలో, కేప్యూల్స్ రూపంలో లభిస్తుందనుకుంటాను.

మా సర్వోదయ కళాశాల ఎన్.ఎస్.ఎస్. యూనిట్ మూడేళ్లలో మూడు కేంపులు నిర్వహించింది. ఒక కేంపు నెల్లూరులోనే. విద్యార్థులతో పాటు నేను కూడా ఆ రాత్రి కళాశాలలోనే ఉన్నాను. వేరు వేరు కళాశాలల నుంచి కూడా కొన్ని యూనిట్లు మా కళాశాల భవన సముదాయంలోనే కేంపు చేశాయి. మా యూనిట్ కాస్త ప్రైవసీ కోసం కళాశాల పాత కేంపస్ లోని పాత భవనంలో కేంపు వేసుకున్నాము. మా కళాశాలలో కేంపు వేసుకున్న ఎన్.ఎస్.ఎస్. ఆఫీసర్లు మాత్రం ఎదురుగా వున్న లాడ్జిలో దిగారు. నేను ఒక్కణ్ణే విద్యార్థులతో వుండిపోయాను. ఆ రోజు రాత్రి పెద్ద తుఫాను, తెల్లవారులూ గడగడలాడుతూ అందరం మేలుకొని కూర్చోన్నాము. ఉదయానికి తుఫాను శాంతించింది గాని కాంపస్‌లో రెండేళ్ల క్రితం వేసిన చెట్లు కూలిపోయాయి. కొన్ని పెద్ద వృక్షాలు కొమ్మలు విరిగిపడ్డాయి. మా విద్యార్థులు కళాశాలలో కూలిన వృక్షాలను తొలగించి, క్యాంపస్ శుభ్రం చేశారు, కొన్ని మొక్కల్ని నిలబెట్టి మళ్లీ పూడ్చి పెట్టారు. ఆ తర్వాత మా విద్యార్థులు ఇతర కళాశాలల విద్యార్థులతో కలసి నెల్లూరు టౌన్‌లో పెద్దాసుపత్రి, ఇతర చోట్ల పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.

ఈ కేంపులో కొన్ని అనుభవాలు చెప్పాలి. యూనివర్శిటి ఎన్.ఎస్.ఎస్. అధికారి పర్యవేక్షకుడు వచ్చి తనకు కొంత డబ్బు కావాలని నా వద్ద చేబదులుగా తీసుకొని, వారి మిత్రులైన మరొక కళాశాల అధికారి ఆ డబ్బులు నాకు చెల్లిస్తారని చెప్పి వెళ్ళారు. కాని వారు చెప్పిన ప్రకారం ఆ డబ్బు చెల్లించలేదు. ఆరు నెలలయినాక, ఈ విషయం మా ప్రిన్సిపాల్ గారి దృష్టికి తెచ్చాను. “ఏం చేస్తాం! ఏదో లెక్కల్లో అడ్జస్టు చెయ్యి” అన్నారు. అందుకు నేను అంగీకరించకుండా విశ్వవిద్యాలయం అధికారికే ఆ చేబదులు మొత్తం పంపమని రాశాను. వారు “అయ్యో! ఆ డబ్బు అతన్నిమ్మన్నానుగదా!” అని అతనికి రాశారు. యూనివర్శిటీ నుంచి లెటరు వెళ్లినా ఆ ఆఫీసరు ఖాతరు చెయ్యలేదు. ఐతే అతను ప్రభుత్వద్యోగి. నెలనెల జీతం పోస్టాఫీసు ద్వారా అతనికి అందుతుంది. నాకు తెలిసిన పోస్టల్ అధికారి అతణ్ణి ఒప్పించి, రెండు వాయిదాలలో అతని వద్ద వసూలు చేసి నాకు పంపించారు. ఆ రోజుల్లో కేంపు పూర్తయిన తర్వాత కొంత డబ్బు మిగిల్చి మా ఎన్.ఎస్.ఎస్. యూనిట్‌కు అవసరమైన పారలు, పలుగులు, టకారాలు కొనగలిగాము. నేను ఎన్.ఎస్.ఎస్.ను విరమించుకొంటున్న సమయంలో వాటిని కళాశాల స్టోర్‌కు వప్పజెప్పాను.

ఎన్.ఎస్.ఎస్.లో మూడేళ్లలో మూడు కేంపులు నిర్వహించాము. ఒక కేంపు నెల్లూరుకు 12 మైళ్ల దూరంలోని కుమ్మరిమిట్ట అనే గ్రామంలో నిర్వహించాము. అప్పుడు మండల పరిషత్తు అధ్యక్షులొకరు దళితులుండేవారు. వారి సూచన మేరకు ఆ గ్రామాన్ని ఎన్నుకొన్నాము. కేంపు నిర్వహించడానికి ముందు ఆ గ్రామంలో పెద్ద భూస్వామిని కలిశాము. ఆయన పంచాయితీ ప్రెసిడెంటును పిలిపించారు. అతను దళితుడు, తను కూర్చోకుండానే మాట్లాడుతున్నాడు. ఇంతలో కాఫీ ఇచ్చారు పని వాళ్లు. కాఫీ తాగి, నేను జేబులోనుంచి సిగరెట్ పెట్టె తీసుకొని రెడ్డిగారికి, పంచాయితీ ప్రెసిడెంటుకు ఆఫర్ చేశాను. ఇద్దరూ సిగరెట్లు తీసుకున్నారు. మేము సిగరెట్ వెలిగించి మాట్లాడుతున్నాము. ప్రెసిడెంటు సిగరెట్ జేబులో వేసుకొని నిలబడే వున్నాడు.

ఆ రెడ్డిగారి ఇంటికి సమీపంలోనే ప్రభుత్వ పాఠశాల – ఒక మంచి పాకలో నడుస్తోంది. అందులో కేంపు పెట్టుకొన్నాము. మా విద్యార్థులు దాదాపు అందరూ కాయకష్టం చేయగల కులాల నుంచి వచ్చినవారే. వంటవాడున్నాడు. పిల్లలు డ్యూటీల ప్రకారం పారిశుధ్యం, వంటకు సహాయం, పాత్రలు కడగడం చేసేవారు. దళితవాడ నుంచి కుమ్మరిమిట్ట ఊళ్లోకి వచ్చికలిసే డొంక ఇరువైపులా గవర్నమెంటు తుమ్మ చెట్లు పెరిగి చాలా ఇరుకైపోయింది. దాన్ని శుభ్రం చేసి, వెడల్పు చేయ్యడం మాకు అప్పగించబడ్డ పని.

ఉదయం 7.30 కల్లా టీ తాగి విద్యార్థులు పనిలోకి వెళ్లేవారు. 9 గంటలకు ఫలహరం. మళ్లా 12 వరకు పని. మధ్యాహ్నం భోజనం తర్వాత, రెండు గంటల నుంచి సాయంత్రం 5 దాకా పని, ఆ తర్వాత విద్యార్థులు స్నానంకు వెళ్లేవారు. కుమ్మరిమిట్టలో అందమైన కొలనుంది. అందులో స్నానాలు చేసి బట్టలుతుక్కొని కేంద్రంకు వచ్చే సరికి 6.30 దాటేది. టీ తాగిన వెంటనే ఒక క్లాసుండేది. మా కళాశాల అధ్యాపకులు ఒకరో ఇద్దరో పిల్లలకు ప్రత్యేకంగా రెండు వుపన్యాసాలు చేసేవారు. గ్రీకు నాటకాలు, షేక్‌స్పియర్ నాటకాలు, ఇట్లా ప్రతి రోజు రెండు ఉపన్యాసాలు. పిల్లలు నిద్రకళ్లతో పాఠం విని భోజనానికి ఉపక్రమించేది. ఇందంతా ఎట్లా నిర్వహించామో అని తలచుకుంటే కొంచెం ఆశ్చర్యంగా వుంది. ఇప్పుడు కూడా!

మేము దళితవాడ వద్ద డొంకలో ముళ్ల చెట్లన్నీ కొట్టి శుభ్రం చేస్తున్నా, దళితవాడ ప్రజలు మావైపు తొంగి చూడడంలేదు. రెండు రోజుల తర్వాత మా పిల్లలు వారి ముభావానికి కారణం కనిపెట్టారు. ఊరి పెద్ద రెడ్డిగారి చెరుకు పొలంలో త్వరలోనే కొట్టి ట్రాక్టర్లకెత్తుతారు. చెరుకు ట్రాక్టర్లు సులభంగా వెళ్లడానికి ఈ ఎన్.ఎస్.ఎస్. విద్యార్థుల చేత ఈ పని చేయిస్తున్నారని! కుమ్మరిమిట్టకు వెళ్లి కేంపు వేసుకొని పని చేయ్యామని సలహా యిచ్చిందే ఒక దళిత మండల ప్రెసిడెంటు! పైగా కుమ్మరిమిట్ట పంచాయితీ ప్రెసిడెంటు కూడా దళితుడే! అప్పుడు మా అధ్యాపకులు, కుమ్మరిమిట్ట దళితవాడ యువకులతో చర్చించారు. కుమ్మరిమిట్ట నుంచి ప్రధాన రోడ్డు కలిసే దారి గుంతలు మిట్టలుగా వుందని దాన్ని బాగు చేయవలసిందిగా ఆ యువకులు సూచిస్తూ, అరడజను మంది దళితవాడ యువకులు మాతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా మా మీద చాలా పెద్ద భారమే పడింది. మా అధ్యాపకులు కూడా కొందరు సిద్ధపడ్డారు. అయినా అప్‌హిల్ టాస్కు అయింది.

మేము విడిది చేసిన పాఠశాలకు కరెంటు లేదు. ఆ సమయంలో భూస్వామి ఇంటి నుంచి వైరు కట్టి తాత్కాలికంగా కరెంటు తీసుకొన్నాము. మా విద్యార్థుల్లో ఒక కుర్రాడు చాలా ఖరీదైన టేప్ రికార్టర్ వెంటతెచ్చాడు. విశ్రాంతి సమయాల్లో పాటలతో విద్యార్థులు వినోదించేవారు. మాకు కరెంటు ఇచ్చిన గృహస్థు పిల్లలను వాడుకొని తిరిగి ఇస్తామని టేప్ రికార్డర్ అడిగాడు. ఆ కుర్రవాడు ఒప్పుకోలేదు. దాంతో మాకు కరెంటు కట్ చేశారు. పెట్రమాక్సు దీపాలతో సద్దుకున్నాము.

కుమ్మరిమిట్ట సముద్రానికి ఐదారు మైళ్ల దురంలో వుంది. పిల్లలు సముద్రతీరానికి వెళ్లి జాలర్ల వద్ద కారు చౌకగా పెద్ద పెద్ద చేపలు కొని తెచ్చేవారు. మరో విషయం, మా అధ్యాపక మిత్రులు కొందరు చేపలు, కోళ్లు తరిగి, ముక్కలు చేసి వంటవాడికి అందించేవాళ్లు, అంతా ఒక పండుగలాగా సాగేది. సాయంత్రం కొలనులో స్నానం చేసిన విద్యార్థులు కలువపువ్వలు దండలాగా మెడలో వేసుకొని కేంపు వచ్చేవారు. ఆ దృశ్యం నేను ఇప్పటికీ మరిచిపోలేను.

ఒక రోజు మా విద్యార్థులు, దళితవాడ యువజనులు కలసి ముత్తుకూరు బీచ్‌కి వెళ్లాము. అక్కడ నిర్జన ప్రదేశంలో ఒక లైట్ హౌస్, దాని సంరక్షకులుగా ఒక ఆంగ్లో ఇండియన్, సమీపంలో వివిక్త ప్రదేశంలో నిర్మించిన కేంప్ హౌస్‌లో అతని కుటుంబం వుండేది. లైట్ హౌస్ చూడడానికి రూపాయో, అర్ధో టికెట్ వుండేది. టికట్‌లు అయిపోయాయని, మళ్లీ వస్తే తప్ప తాను లైట్ హౌస్ పైకి పంపనని లైట్‌హౌస్ కీపర్ చెప్పారు. మా విద్యార్థులైతే నా మాట విని తిరిగి వచ్చేసేవారు, స్థానిక యువకులు వెంట వుండడంతో, ఆయనను లెక్క పెట్టకుండా పైకి వెళ్లి చూసివచ్చారు. నాకు చాలా బాధ కలిగించిన విషయం ఇది. లైట్‌హౌస్ కీపర్ తన కోపం అంతా నా మీద ప్రదర్శించి గట్టిగా మాట్లాడారు. ఇది జరిగిన నాలుగు నెలల తర్వాత ఢిల్లీ నుంచి నౌకాయాన శాఖ నుంచి మా విద్యార్థుల ప్రవర్తన మీద ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ వచ్చింది. వారేదో సమాధానం రాశారనుకోండి, గుంపులో వున్నపుడు మనుషుల ప్రవర్తనకు ఇదొక ఉదాహరణ.

కుమ్మరిమిట్ట ఎన్.ఎస్.ఎస్. క్యేంపు అంటే రెండు విషయాలు గుర్తొస్తాయి. ఒక నిశి రాత్రి వేళ కుర్రాణ్ణి తేలు కుట్టింది. ఆ అబ్బాయిని స్కూటర్ మీద ఎక్కించుకొని ముత్తుకూరు తీసుకొని వెళ్ళాను. ఆ డాక్టర్ (RMP) రెండో ఆట సినిమాకు వెళ్ళారని ఇంట్లో వాళ్లు చెప్పారు. అప్పట్లో ముత్తుకూరు చిన్నవూరు. సినిమా హాలు ప్రొజెక్టరు ఆపరేటర్‌తో చెప్తే, అతను మనిషిని పంపి డాక్టర్‌ని తీసుకొని వచ్చాడనుకోండి! మేము కేంపు మొదలు బెట్టిన రెండో రోజు ఒక విద్యార్థికి కాలి మీద గడ్డపార దెబ్బ, రక్తస్రావం. ప్రతి రోజు ఆ కుర్రాణ్ణి ముత్తుకూరు పంపి కట్టుకట్టించి, తీసుకొచ్చే వాళ్ళం. కేంపు చాలా సంతృప్తిగా ముగిసింది. చివరి రోజు రాత్రి భోజనాలు తర్వాత, కేంప్ ఫైర్ వేసి విద్యార్థులు ఆనందోత్సాహాలతో ఆడిపాడారు. అప్పుడు చూసుకొంటే ఒక యువకుడి జేబులో పర్సు మాయమయింది. మాలో ఎవరో ఒకరు తీసివుంటారని అందరికీ తెలుసు. ఎవరైనా పొరబాటున తీసివుంటే మేముండే స్కూలు పాకలో వొక చోట గుర్తుగా పెట్టమని అభ్యర్ధించాను. దొంగతనం చేసిన వాళ్లు తిరిగి యిస్తారా? అంత మంచి వాలంటీర్లలో ఇటువంటి వాడొకడున్నాడనుకొన్నపుడు మనసుకు చాలా వేదన కలిగింది.

మా కళాశాలలో ఎన్.ఎస్.ఎస్. మహిళా యూనిట్‌ను కొంచెం ఆలస్యంగా  ప్రారంభించారు. మా తెలుగు డిపార్ట్‌మెంట్ అధ్యాపకురాలు కుమారి ఎం.గిరిజ నాయకత్వంలో ఎన్ఎస్.ఎస్.యూనిట్ చాలా చక్కగా పనిచేసింది. ఆమె కూడా ఏమాత్రం సంకోచం లేకుండా పిల్లలకు మార్గదర్శనం చేసి నాలుగైదేళ్ళు గొప్ప సేవచేశారు.

చివర చెప్పినా మా ఎన్.ఎస్.ఎస్. చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమం రక్తదాన ఉద్యమం. నెల్లూరు వి.ఆర్.కాలేజి ఎన్.ఎస్.ఎస్. యూనిట్‌లో విద్యార్థి తిక్కవరపు సుకుమార్ రెడ్డి (ఇప్పుడు రెడ్డి తీసేసుకున్నాడు) ప్రేరణతో మా యూనిట్ నెల్లూరు అమెరికన్ బాప్టిస్ట్ మిషన్ ఆస్పత్రి సహకారంతో కాలేజిలోనే రక్తదాన ప్రదర్శన ఏర్పాటు చేశాము. నలుగురు విద్యార్థులు రక్తదానం చేశారు. డాక్టర్ బేరమ్మే స్వయంగా రక్తం తీశారు. మా కళాశాలకు వచ్చి ఎవరు రక్త సహాయం కోరినా, విద్యార్థులు, అధ్యాపకులు, ఆఫీసు సిబ్బంది ఎవరో ఒకరు వెళ్లి రక్తం ఇచ్చివచ్చేవారు. ఎన్.ఎస్.ఎస్. కార్యక్రమాలు మందగించినా రక్తం ఇవ్వడానికి మాత్రం ఎవరో ఒకరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చేవారు.

నెల్లూరు జేమ్స్ గార్డెన్‌లో కొందరు యువకులు స్వచ్ఛంద రక్తదాన సంస్థను ఏర్పరచి దానికి నన్ను గౌరవాధ్యక్షణ్ణి చేశారు. నేను 58 ఏళ్లు పూర్తయి, పదవీ విరమణ చేసి, ఇంటికి వస్తూ చివరిసారి నెల్లూరు రెడ్ క్రాస్‌కి వెళ్లి రక్తం యిచ్చి వచ్చాను. నా శ్రీమతి, పిల్లలు కూడా రక్తదానం, లేదా మా సుకుమార్ మాటల్లో ‘రక్త వితరణ’ చేశారని చెప్పడం ఈ సందర్భంలో నాకు చాలా ఆనందంగా వుంది.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here