జ్ఞాపకాల తరంగిణి-43

0
9

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

బహుముఖ ప్రజ్ఞాశాలి, విద్యాంసులు ఇండాలజిస్టు స్వర్గీయ నేలనూతల శ్రీకృష్ణమూర్తితో ముఖాముఖి

ప్రశ్న: మీ బాల్య స్మృతులను వివరించండి.

సమాధానం: 1910 ఏప్రిల్ 16వ తారీకు శ్రీరామనవమి రోజు పుట్టాను. మా తండ్రిగారి కుటుంబం నెల్లూరుకు సమీపంలో కొడవలూరులో ఉండేది. మా తల్లిగారు గూడా వారి ఆడపడుచు. వారిది నెల్లూరుకు 18 మైళ్ల దురంలోని అల్లూరు. మా పెదనాయన అద్దంకిలో వైద్యులుగా పని చేస్తుంటే మా అమ్మగారు అక్కడ పురుడు పోసుకున్నారు.

మా నాయన శ్రీరాములుగారు PWD శాఖలో Head Clerk గా పనిచేస్తూ, విజయవాడ PWD సూపర్నెంటింగ్ ఇంజనీరు ఆఫీసులో ఫింఛను పుచ్చుకొన్నారు, ఆ తర్వాత వారు 20 సంవత్సరాలు జీవించారు.

ప్రశ్న: మీ విద్యాభ్యాసం, బాల్యం గురించి ఏమైనా జ్ఞాపకాలు?

సమాధానం : పెద్దనాయన పుత్తూరులో వైద్యులుగా పని చేస్తున్న సమయంలో వారి పెద్దకుమార్తె పెళ్లిలో నాకు అక్షరాభ్యసం చేశారు. ఈ పెళ్లి ఊరేగింపు కోసం కార్వేటినగరం రాజాగారు ఏనుగును పంపించారు.

మా నాయనగారు బాపట్లలో ఉద్యోగం చేస్తున్న సమయంలో అక్కడే 3-4 తరగతులు చదివాను. మా తల్లిగారు భాగవతం చదవడం గుర్తుంది. వావిళ్ల ప్రచురణ సంస్థ అధిపతి వావిళ్ల వెంకటేశ్వరశాస్తి మా కుటుంబ స్నేహితులు. మా నాయనగారు పుస్తకం అంతగా చదివేవారు కాదు గానీ, అమ్మగారు బాగా చదివేవారు. బాపట్లలో I ఫారం చదివాను. పంచాపకేశయ్యరుకు హెడ్ మాస్టారుగా గొప్ప పేరుండేది. ఆ తర్వాత, విజయవాడ S.K.P.D హిందూ హైస్కూల్లో II ఫారంలో చేరి IV ఫారం వరకూ చదివాను. అక్కడ కొడాలి రామారావు ప్రధానోపాధ్యాయిలు. నెల్లూరు వచ్చి వెంకటగిరి రాజా హైస్కూల్లో V ఫారంలో చేరాను. దర్భల వెంకటసుబ్బయ్య స్కూలు ప్రధానోపాద్యాయులు. ఆయన చక్కగా చరిత్ర పాఠాలు చేప్పేవారు. రామభద్రరావు రసాయన శాస్త్రం బాగా చెప్పేవారని ప్రసిద్ధి. నా చదువు కుదురుగా ఒకే స్కూల్లో కొనసాగలేదు. మద్రాసులో ఆర్మీనియన్ స్ట్రీట్ లోని సెయింట్ గేబ్రియల్ స్కూల్లో చేరి చదివాను. అప్పుడు మా పెద్దనాయన మద్రాసులో ఉద్యోగం చేస్తున్నారు. ఆయన కాపురం ఉండేది చింతాద్రి పేటలో. వారింట్లో ఉంటూ చదివాను. ఆ స్కూల్లో ఎన్.ఎస్.సుబ్బారావు, పి.వి.రాజమన్నారు నా క్లాస్ ఫ్రెండ్స్. సుబ్బారావు నాకంటే పెద్దవాడు, 1904లో పుట్టాడు. అతను ఇంగ్లాడు వెళ్లి భౌతికశాస్త్రంలో పరిశోధించి డాక్టరేట్ పట్టా పుచ్చుకొన్నాడు, దరదృష్టం అతను యవ్వనంలోనే పోయాడు. ఈ మిత్రుల ద్వారా నాకు పుస్తకాలంటే అభిమానం, ప్రేమ ఏర్పడ్డాయి.

ప్రశ్న: SSLC తర్వాత ఏం చేశారు?

సమాధానం: SSLC తప్పి, మళ్లీ నెల్లూరు వి.ఆర్.హైస్కూల్లో చదివి 1927లో పరీక్ష పాసయ్యాను. ఇంటర్ నెల్లూరు వి.ఆర్ కాలేజిలో చదివాను. అప్పుడు కాలేజీ ప్రిన్సిపాల్‌గా రాయసం వెంకటశివుడు గారుండేవారు. ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నపుడు వారు వెళ్లిపోతే, వారి స్థానంలో మామిడిపూడి వెంకటరంగయ్యగారు చేరారు. వెంకటశివుడుగారు మాకు ఇంగ్లీష్ బోధించేవారు. వారు కలకత్తాలో ఎం.ఏ. చదివారు. Sense of humor ఆయనకు బాగా ఎక్కువ. వెంకటరంగయ్య గ్రీకు, రోమన్ చరిత్ర పాఠాలు చెప్పేవారు. విద్యార్థులకు తేలికగా విషయం బోధపడేట్లు వ్యాసం రాసినట్లు ఆయన పాఠం ఉండేది.

1928లో బి.ఏ. చదవడానికి చిదంబరం – అన్నామలైకి వెళ్లాను. అక్కడికి వెళ్లే ముందు P.W.D శాఖలో ఉద్యోగంలో చేరాను. ఆ గుమస్తా ఉద్యోగం నాకు ఇష్టం లేదు. ఆ ఉద్యోగం మానడం మానాయన గారికి సుతరాము ఇష్టం లేదు. అప్పుడు చిదంబరంలో నెల్లూరు న్యాయవాది ఒంగోలు వెంకటరంగయ్య కుమారుడు పద్మరాజు, పసుమర్తి సాంబశివరావు ఇద్దరూ నెల్లూరు వాళ్లే, బి.ఏ చదువుతున్నారు. ఆ సమయంలో చిదంబరం కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్న ఎస్.ఎస్.సుబ్బారావుగారి ఆశ్రయం నాకు లభించింది. వారింట్లో ఉండి బి.ఏ. చదువు కొనసాగించాను. ఆయన కాలేజిలో చరిత్ర పాఠాలు చేప్పేవారు.

ప్రశ్న: బి.ఏ. పట్టా చేతికి వచ్చిన తర్వాత ఏం చెయ్యలనుకున్నారు?

సమాధానం: బి.ఏ. తర్వాత విజయవాడలో P.W.D ఆఫీసులో సెలవు మీద వెళ్లిన ఉద్యోగుల స్థానంలో తాత్కాలికంగా పని చేస్తూ కొంత కాలం గడిపాను. పై చదువులు చదివించేదుకు మా నాయనగారికి ఆర్థిక స్థోమత లేకపోయింది. గుంటూరు సమీపంలో గురజాలకు చెందిన బెల్లంకొండ సుబ్బారావనే న్యాయవాది ఉండేవారు. ఆయన పౌరాణిక నాటకాలలో కృష్ణుడి వేషం వేసేవారు. వారు తన కుమార్తెను నా కిచ్చి వివాహం జరిపించే ఆలోచనతో ఫీజులు కట్టి నన్ను మద్రాసులో లా లో చేర్పించారు. నెల్లూరులో వకీలు వృత్తి చేసే పి.వి.కృష్ణయ్యగారు ఈ సంబంధం కుదిర్చారు. నేను ఎఫ్.ఎల్. తప్పిన తర్వాత, పెళ్లి చేద్దామని జాతకాలు చూచినప్పుడు గాని ఇరువైపుల గోత్రాలు ఒకటే అని తెలియలేదు. పెళ్లి కుదరకపోయినా, జీతాలు చెల్లించి, నా చదువుకు వారు సహాయం చేస్తామన్నారు. వారి సహాయం స్వీకరించడానికి మా నాయన గారికి మనస్కరించలేదు. నా చదువు సజావుగా సాగలేదు, దారంతా ఎన్నో మిట్టపల్లాలు.

చివరకు నా చదువుకు మా నాయనగారే డబ్బు ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లో ఇంగ్లీషు పుస్తకాలు విపరీతంగా చదివాను. మద్రాసులో ప్రైవేటు లైబ్రరీలు కూడా ఉండేవి. ఒక ప్రైవేటు గ్రంథాలయం అర్మీనియాన్ స్ట్రీట్‌లో ఉండేది. అడ్వకేట్‌గా నమోదు చేసుకోను ఏడెనిమిది వందలు అవసరం. అంత మొత్తం సమకూర్చుకొనే పరిస్థితి లేదు. పి.వి. కృష్ణయ్యగారే నెల్లూరులో సీనియర్ లాయర్ రేబాల దశరథరామిరెడ్డి గారికి సిఫార్సు చేసి వారి చేత అవసరమైన ఫీజు చెల్లించే ఏర్పాటు చేశారు (దశరధరామిరెడ్డి తర్వాత ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి అయ్యారు).

ప్రశ్న: ప్రాక్టీసు ఎప్పుడు మొదలు పెట్టారు?

సమాధానం: 1939లో లాయరుగా ఎన్‌రోల్ అయ్యాను. లా చదివి ఎన్‍రోల్ కావడం అంటే నన్ను బందిలదొడ్లోకి తోలినట్లు అనిపించింది.

1935 ఆగస్టు 15 నా వివాహం సూళ్ళూరుపేటలో జరిగింది. వధువు పార్వతమ్మ తండ్రి సూళ్ళూరుపేట తాలూకాఫీసులో షరాఫ్ ఉద్యోగం చేసేవారు. పార్వతమ్మ వీధి బడి చదువు. కాపురానికి వచ్చిన తర్వాతే, ఆమె పుస్తకాలు చదవడం మొదలు పెట్టారు. మా ఇంట్లో వారాలబ్బాయి ఆమెకు హిందీ నేర్పించేవాడు. నేను హరిద్వార్ వెళ్లినప్పుడు తులసీదాసు రామాయణం, సవ్యాఖ్యానంగా ఉండే పుస్తకం తెచ్చి ఇచ్చాను. ఆమె తులసీదాసు రామాయణం, జాయిసి పద్మవత్ కావ్యం అనువదించారు.

ప్రశ్న: సంగీతం, శిల్పం, నాట్యం, చరిత్ర వంటి విషయాల మీదకు మీ దృష్టి ఎందుకు మళ్ళింది?

సమాధానం: చిదంబరంలో చదివే సమయంలో ప్రొఫెసర్ల నివాసాలకు సమీపంలో నేను ఉండటం వల్ల కొందరు ప్రొఫెసర్లతో పరిచయం కలిగింది. చరిత్ర శాఖ అధిపతి డాక్టర్ బి.వి.నారాయణ స్వామి, ఫిలాసఫీ డిపార్టుమెంటు అధిపతి ప్రొఫెసర్ పి.ఎస్.నాయుడు, చిదంబరం నటరాజ ఆలయ శిల్పాల మీద ఆసక్తితో వాటిని ఫోటోలు తీసేవారు. వాళ్లతో కూడా ఉండి నేనూ చిదంబరం ఆలయ విగ్రహాలను పరిశీలిస్తూ ఉండేవాణ్ణి. భరతశాస్త్రంలో నాలుగో అద్యయంలో చెప్పిన 108 కరణాలను ఆ ప్రొఫెసర్లు నాకు చక్కగా వివరించి చెప్పారు. తాండవ లక్షణానికి దృష్టాంతాలుగా చిదంబంరం ఆలయంలో గండరించిన 108 విగ్రహాలను పరిశీలించిన అనుభవం నాకు నాట్య శాస్త్రంలో అభిరుచి కలిగించింది. నెల్లూరులో న్యాయవాదిగా ఉన్న ఒంగోలు వెంకటరంగయ్య, చిదంబరంలో ప్రొఫెసర్లు పి.ఎస్. నాయుడు, డాక్టర్ బి.వి.నారాణస్వామి నాయుడు గార్లు రచయితలుగా ‘తాండవ లక్షణం’ అచ్చయింది. ఇందులో శ్రమంతా ఒంగోలు వెంకటరంగయ్యగారిదే.

‘తాండవ లక్షణం’ పుస్తకం కోసం వాళ్లు చేసిన కృషి నన్ను ఆకట్టుకొన్నది. చిదంబరంలో చదువుకుంటున్న రోజుల్లోనే శిల్పం, నాట్యం చరిత్రల మీద దృష్టి పెట్టాను. బెజవాడలో ఉన్న రోజుల్లో మా నాయనగారి ఆఫీసులో typewriter మీద స్వయం కృషితో చక్కగా టైపు చెయ్యడం నేర్చుకున్నాను. ఇది నా రచనా వ్యాసంగానికి ఎంతగానో తోడ్పడింది.

ప్రశ్న: మీ న్యాయవాద వృత్తిలో విశేషాలేమైనా చెప్తారా?

సమాధానం: 1939తో న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యానని చెప్పాను కదా! నేను బి.రామస్వామి అనే సుప్రసిద్ధ వకీలు వద్ద అప్రెంటీసు చేశాను. మొదట్లో క్రిమినల్ కేసులు చేసినా, తర్వాత సివిల్ కేసులకి పరిమితమయ్యాను. రెండేళ్లు నెల్లూరు బార్ కౌన్సిల్ ప్రెసిడెంటుగా ఉన్నాను.

ప్రశ్న: మీకు వెంకటరంగయ్యగారితో పరిచయం, ఆ అనుభవాలు చెప్పండి?

సమాధానం: ఒంగోలు వెంకటరంగయ్యగారు నా సహాధ్యాయి తండ్రిగారు, నాకు గురువు. కోర్టులో తీరిక సమయాల్లో, మధ్యాహ్నల్లో కూర్చుని వారితో అనేక విషయాలు చర్చించేవాణ్ణి. ఆయన పాదధూళి కాస్త నా మీద పడి, నా కృషికి నాంది పలికింది. వారు సంస్కృతంలో మంచి పండితులు. కళాప్రపూర్ణ వేదం వెంకటరామశాస్త్రి తమ్ముడు వేదం వెంకటాచలయ్యర్ తరం వారు. వెంకటరంగయ్యగారికి చరిత్ర పరిశోధనలో అభినివేశం ఎక్కువ. ‘కొందరు నెల్లూరు గొప్పవారు’ పేరుతో చాలా మంది జీవిత చరిత్రలు గ్రంథస్థం చేశారు. బార్‌లో కూర్చొని తీరిక సమయాల్లో వారి వద్ద నాట్య శాస్త్రం సాంతం చదివాను.

వెంకట రంగయ్యగారు ఒక మాదిరి ఉపన్యాసకులు. నెల్లూరులో ఏ సభ జరిగినా ఆయన పేరు ఉపన్యాసకుల జాబితాలో ఉండేది. ఒక సభలో ఆయన ముస్లింలకు అంకితమైన కావ్యాల మీద విపులంగా ఉపన్యసించడం నాకు గుర్తుంది. వెంకటరంగయ్యగారి మీద, సుబోధిని పత్రిక మీద ఎవరైనా పరిశోధన చేస్తే బాగుంటుంది. (1920-36 ప్రాంతంలో నెల్లూరు నుంచి వెలవడిన వారపత్రిక). వెంకటరంగయ్య నెల్లూరులో జరిగిన ఆంధ్రోద్యమ సభలకు అధ్యక్షత వహించారు. వారు నెల్లూరు వర్ధమాన సమాజంలో బాధ్యులుగా పని చేశారు.

ప్రశ్న: మీరు లా ప్రాక్టీసు చేస్తున్నారు కదా? మళ్లీ ఎం.ఏ. ఎందుకు చదివారు?

సమాధానం: M.A. History మద్రాసు విశ్వవిద్యాలయంలో ప్రైవేటుగా చేశాను. నేను FL చదువుతున్న సమయంలో అప్పుడే M.A ప్రైవేటుగా చదవడానికి చివరి అవకాశం అన్నారు. నేను, తాములూరు రాఘవయ్య, బెజవాడ మిత్రులు, శ్యామలరావు M.A ప్రైవేటుగా చేశాం. ఈ డిగ్రీ కూడా పనికొచ్చింది. వి.ఆర్. కాలేజీలో ఏదో రెండేళ్లు చరిత్ర ఉపన్యాసకుడుగా పని చేశా. ఒక ఏడాది వి.ఆర్ కాలేజీ archeivist బాధ్యతలు నిర్వహించాం.

ప్రశ్న: మీ యాత్రనుభవాలు చెప్పండి?

సమాధానం: చతుర్వేదుల రామచంద్రయ్య దంపతులతో ఉత్తర దేశ యాత్ర చేశా. మాకు వండి పెట్టడానికి చతుర్వేదుల వారి వంటామె కూడా వచ్చింది. ఈ యాత్ర చరిత్ర జమీన్ రైతు పత్రికలో వారం వారం రాశా. హైదరాబాదు, పండరి, బొంబాయి, ఢిల్లీ, కాశ్మీరం, హరిద్వార్ మొదలైన ప్రదేశాలన్నీ ఈ ఉత్తరదేశ యాత్రలో దర్శించాము.

ప్రశ్న: నెల్లూరు వర్ధమాన సమాజం గ్రంథాలయం కమిటి సభ్యులుగా, గౌరవ గ్రంథాలయాధికారిగా చాలా కాలం వ్యవహరించారు కదా?

సమాధానం: ఆ రోజుల్లో గ్రంథాలయం లైబ్రేరియన్‍గా సుబ్బారావు పని చేసేవాడు. చాలా పెద్దవాడు. ఎంతో ఓపికగా, పరిశోధకులకు, సాధారణ పాఠకులకు కావలసిన గ్రంథాలు ఇచ్చేవాడు. అనేక రిఫరెన్సు గ్రంథాలు చదవమని పరిశోదకులకు తానే సూచించేవాడు. ఇదే ఇతర దేశంలో పుట్టి ఉంటే, సుబ్బారావు వంటి వ్యక్తికి ఎంత గౌరవం, ఆదరం లభించేదో! ఆయన మధ్యాహ్నం వేళ పిల్లలకు హిందీ పాఠాలు చెప్పేవాడు. కె.పి.నారాయణరావు, నేను, మరి కొంత మందిమి సుబ్బారావు గారి వల్ల బాగా ప్రభావితులమయ్యాము. నేను వర్ధమాన సమాజం కమిటి సభ్యుడిగా, గౌరవ గ్రంథాలయాధికారిగా చాలా కాలం ఉన్నాను.

ప్రశ్న: Andhra Dance Sculpture రచన నేపథ్యం గురించి చెప్తారా?

సమాధానం: అదొక పెద్ద కథ. ఆంధ్రప్రదేశ్ లలిత కళా, నాటక అకాడమి నా పుస్తకాన్ని ప్రచురించింది. ఈ పుస్తక ప్రచురణ వెనక కొంత బాధ కలిగించిన చరిత్ర ఉంది. ఒంగోలు వెంకటరంగయ్యగారి వద్ద నాట్య కళకు సంబంధించిన చాలా గ్రంథాలుండేవి. వారి సహకారంతో ఆ గ్రంథాలన్నీ చదివాను. Andhra Dance Sculpture పుస్తకం కోసం పదేళ్లు శ్రమపడ్డాను. నాట్య శాస్త్రం మీద అనేక రచనలు అధ్యయనం చేశా. నా తోడల్లుడి తమ్ముడు రావిప్రోలు సుబ్రహ్మణ్యం నా పుస్తకానికి అవసరమైన ఫోటోలన్నీ సేకరించి ఇచ్చాడు. ఆయన స్నేహం ఈ గ్రంథ రచనకు చాలా తోడుపడింది. అకాడమి నా manuscript పొగొట్టడంతో మళ్లీ పుస్తకం edit చేసి, ఫోటోలు సేకరించి పంపడం… అవన్నీ బాధ కలిగించే జ్ఞాపకాలు.

ప్రశ్న: మీరు ఆనందకుమార స్వామి అభిమానులనీ, కొన్ని సంవత్సరాలు వారి జయంతి జరుపుతూ వచ్చారని విన్నాను?

సమాధానం: రెండు మూడేళ్లు జరిపినట్లుంది. ఒక ఏడాది అడ్వకేటు వి.అనంతరామయ్య గారింట్లో, మరొక సంవత్సరం వి.ఆర్.కాలేజి ఇంగ్లీషు లెక్చరర్ ఎస్.కొండారెడ్డి గారింట్లో జరిపాము. ఆరుగురో ఏడుగురో శ్రోతలు. సి.వి.రామచంద్రరావు (వి.ఆర్ కాలేజి చరిత్ర అధ్యాపకులు) మొదలైన అభిమానులు సభలో పాల్గొన్నారు.

చిదంబరంలో చదువుకొనే రోజుల్లోనే ఆనందకుమార స్వామి రచనలతో పరిచయం కలిగింది. వారు చాలా గొప్ప ఇండాలజిస్టు. కుమారస్వామి విద్యార్థినులలో Dona అనే సౌత్ అమెరికన్ విద్యార్థిని ఉండేది. కుమార స్వామి ఆమెను వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడ్డారు. ఆమె కుమారస్వామి కంఠస్వరాన్ని గ్రామఫోను రికార్డు మీద కెక్కించి నాకు బహుమతిగా పంపించారు. 1965లో ఆమె మద్రాసు వచ్చినప్పుడు నెల్లూరుకు, మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లోనే బస చేశారు. మాతో కలిసి భోజనం చేశారు. తన భర్త పోయిన 17 సంవత్సరాల తర్వాత ఆయన అస్థికలను గంగలో నిమజ్జనం చేసేందుకు వచ్చినట్లు చెప్పారు. ఆ రోజు మా తల్లిగారు దేవుడికి పూజ చేస్తూంటే, పక్కనే కూర్చొని తనూ పుజ చేశారు. శ్రీమతి కుమారస్వామి – దొడ్ల కౌసల్యమ్మ ప్రభుత్వ మహిళా కళాశాలలో, ఆంధ్రసభలో ఉపన్యసించారు.

మద్రాలు స్కూలు ఆఫ్ ఆర్ట్స్ ఆనందకుమార స్వామి మీద నిర్వహించిన సెమినార్‌లో పరిశోధనా పత్రం చదివాను. ఆ సంస్థ ఉపన్యాసకులు ఎం.వి.రాజగోపాల్ గారు నన్ను సెమినార్‍కు ఆహ్వనించారు. మద్రాసు విశ్వవిద్యాలయం ఆచార్యలు రాఘవన్ గారు ఆ సెమినార్‌కు అధ్యక్షత వహించారు. ఆనాడు చదివిన పేపర్నే మళ్లా ఆంధ్రసభలో శ్రీమతి ఆనంద కుమారస్వామి ఉపన్యసించిన సభలో చదివాను.

ఆనందకుమారస్వామి దంపతులకు రాజకుమార్ అనే కుమారుడు కలిగాడు. అతను వైద్య వృత్తిలో స్థిరపడి ఇటలియన్ మహిళను వివాహం చేసుకున్నాడు.

ప్రశ్న: ఆచార్య బిరుదురాజు రామరాజుగారు, మీరు ఒక తల్లి కడుపున పుట్టకపోవడం తప్ప అన్నదమ్మల కన్నా అన్యోన్యంగా ఉన్నారు కదా! వారితో మీకు పరిచయం ఎట్లా జరిగింది?

సమాధానం: డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి (1960 ప్రాంతాల్లో నెల్లూరు ప్రభుత్వ బి.ఇ.డి కాలేజి ప్రిన్సిపాల్‌గా ఉన్నారు) జానపద గేయాలు సేకరించేవారు. ఆ సందర్భంలోనే శ్రీపాద వారు రామరాజుగారికి జాబు రాయడం, అట్లా పరిచయం ఏర్పడింది. ఒక మాటు కోర్టు పని మీద బొంబాయి, నాసిక్ వెళ్లి తిరుగు ప్రయాణంలో రామరాజుగారిని కలిశాను. అదే తొలి పరిచయం.

ప్రశ్న: వ్యాస రచనల సూచి’, ‘తెలుగు రచయితల రచనలు’ – రెండు బృహద్గ్రంథాలు పరామర్శ గ్రంథాలు తయారు చేశారు గదా! ఆ పనికి పూనుకొవాలన్న ఆలోచన ఎట్లా కలిగింది?

సమాధానం: Indexing మీద మద్రాసు విశ్వవిద్యాలయంలో చాలా పుస్తకాలు చదివాను. అటువంటి రిఫరెన్సు గ్రంథాలుంటేనే తప్ప పరిశోధనలకు వీలుపడదని తోచింది. మన సమాజ గ్రంథాలయంలో గౌరవ గ్రంథాలయాధికారిగా ఉన్నాను గదా! పత్రికలన్నీ అందుబాటులో ఉన్నాయి. పుస్తక రచనకు పూనుకున్నా. విజ్ఞాన దీపికలు శీర్షికతో మూడు సంపుటాలు రూపొందించా.

ప్రశ్న: వర్ధమాన సమాజం ఆధ్వర్యంలో మీరు భారత వీరులుకార్యక్రమం నిర్వహించారు గదా?

సమాధానం: అవును! 18 రోజులు, 18 ఉపన్యాసాలు. దీపాల పిచ్చయ్య శాస్తి, మరుపూరు కోదండ రామిరెడ్డి, ఈ ఉపన్యాసాలు విషయంలో ఘర్షణ పడి జమీన్ రైతులో వ్యాసాలు కూడా రాశారు.

ప్రశ్న: నేను బి.ఏ. చదువుతున్న కాలంలో మీరు విక్రమసింహపురి మండల సర్వస్యం సంపాదకులుగా బాధ్యత నిర్వర్తిస్తున్నట్లు గుర్తు?

సమాధానం: నిజమే. 1500 పేజీల పైబడిన గ్రంథం, పెద్ద రిఫరెన్సు గ్రంథం, ఎంతో మంది పండితులు, రచయిత్రులు, మిత్రులు రచనలు పంపి సహకరించారు. నా సాహిత్య కృషి వల్ల సంజీవదేవ్, పి.వి రాజమన్నార్, శ్రీమతి ఆనందకుమారస్వామి, బిరుదురాజు రామరాజు, రావిప్రోలు సుబ్ఱహ్మణ్యం, పుట్టపర్తి నారాయణాచార్యులు, ఎంతో మంది స్నేహం. Family friends ఏర్పడ్డారు.

(ఇది శ్రీ నేలనూతల శ్రీకృష్ణమూర్తిగారితో జరిపిన అసంపూర్ణమైన ఇంటర్వ్యూ. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక రంగంలో కృషి చేసే వారెవరికైనా వారి పేరు తెలియకుండా ఉండదు. NSK గారి సతీమణి పార్వతమ్మగారు గొప్ప విదుషీమణి.)

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here