జ్ఞాపకాల తరంగిణి-47

0
7

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]1[/dropcap]972లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పిహెచ్.డి డిగ్రీ అందుకున్నాను. ఆరోజు నాతో పాటు డాక్టర్ ముదిగొండ శివప్రసాద్ గారు కూడా పిహెచ్.డి డిగ్రీ అందుకున్నారు. స్నాతకోత్సవం పూర్తయ్యేసరికి రాత్రి 9దాటి ఉంటుంది. ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారిని చూచి వారి ఆశీర్వాదాలు అందుకొందామని శివప్రసాద్, నేను బర్కత్‌పురాలో అవధానిగారి ఇంటికి వెళ్ళాము. అవధానిగారు మమ్మల్ని వెంటనే వెళ్లనివ్వకుండా ఇంటిముందు ఖాళీ స్థలంలో వేసి ఉన్న కుర్చీలలో కూర్చోబెట్టి చాలాసేపు మాట్లాడారు. మేము భోజనం చేయకుండా వచ్చామని గ్రహించి వారు అప్పటికప్పుడు ఉప్మా చేయించి పెట్టించారు. వారు చాలా మితభాషి కానీ ఆరోజు ఎందుకో మనసువిప్పి ఎన్నో కబుర్లు చెప్పారు.

అప్పటికే అవధానిగారు శ్రీ శ్రీ సత్యసాయి బాబాగారి భక్తులై తరచూ స్వామి వారి వద్దకు వెళ్లి వస్తున్నారు. ఒక వేసవిలో పుట్టపర్తి ఆశ్రమంలో రామాయణ ఉపన్యాసాలు జరిగాయి. అవధానిగారు, ఎంతోమంది పండితులు ఉపన్యాసాలు చేశారు గానీ అవధాని గారు ప్రథాన వక్త. విద్యార్థులకు, యువజనులకు బాబాగారు వేసవి తరగతులు నిర్విహించేందుకు గొప్ప పండితులను, విద్వాంసులను పిలిపించినట్లుంది. ఆ అనుభవాలన్నీ వారు వివరిస్తోంటే మేము ఆసక్తిగా విన్నాము.

పండితులందరికి బాబాగారు తమ నివాస భవనం లోనే, తమ గదిపక్కనే పెద్ద హాల్లో విడిది ఏర్పాటు చేశారట. రోజూ రాత్రి భోజనాల తర్వాత పండితులందరూ ముచ్చట్లు చెప్పుకొంటూ ఆనందంగా గడిపేవారట. ఎప్పడైనా ఒకసారి బాబాగారు తన గదిలోంచి తలుపు తీసుకొని పండితుల వద్దకు వచ్చి కాసేపుండి వెళ్లేవారట కూడా. పండితులు మాత్రం బాబాగారు పిలిచినపుడే వారి గదిలోకి వెళ్లే నియమం. ఎవరూ అనుజ్ఞ లేకుండా వారి గదిలోకి వెళ్లే అవకాశం లేకుండా బాబాగారి గదిలో గడియ పెట్టి ఉంటుందట.

ఆ ఉపన్యాసాల మధ్యలో అవధానిగారికి హైద్రాబాదులో పిహెచ్‌డి వైవాకు తప్పనిసరిగా వెళ్ళవలసి పరిస్థితి వచ్చిందట. బాబాగారు వైవాను వాయిదా వేయించుకోమని సూచించారట కాని, అవధానిగారు వెళ్లక తప్పదని పట్టుబడితే, బాబాగారు వారిని కారులో బెంగుళూరు పంపి అక్కడనుండి విమానంలో హైద్రాబాదు వెళ్ళే ఏర్పాట్లు చేశారట. వైవా చూచుకొని నాలుగయిదు రోజులు హైదరాబాదులో ఉండి వారు మరల బాబావారి వద్దకు వెళ్లారట.

ఆరోజు రాత్రి భోజనాలు అయిన తర్వాత తాంబూల చర్వణంచేస్తూ, పండితులు కబుర్లు చెప్పకొంటూంటే “అవధానీ! ఎంత దురదృష్టవంతుడవయ్యా! నీవు లేకపోతివి, రాజస్థాన్ నుండి ఒక మహారాణి బాబాగారి సన్నిధికి వస్తూ ఆమె తెచ్చిన అపూర్వమయిన కాశ్మీరు శాల్వలను బాబాగారు ఇక్కడ ఉన్న పండితులందరికి బహూకరించి సన్మానించారు” అని జమ్మలమడక మాధవరాయశర్మ గారు కాబోలు అనగానే తనకు మనస్సు చివుక్కుమనిపించిందట. ఇంతలోనే బాబాగారు తలుపు తీసుకొని పండితుల విడిది గదిలోకి వచ్చి కాశ్మీర్ శాలువా అవధానిగారికి కప్పి, వెళ్ళిపోతూ రెండు చేతులూ గాలిలో కదిలిస్తూ రూపాయల నోట్ల వర్షం కురిపించి, వాటిని తీసుకోమన్నట్లు చేతులు ఊపుతూ తమ గదిలోకి విలాసంగా వెళ్లిపోయారట. పండితులందరూ చిన్న పిల్లలాగా ఎగబడి నోట్లు ఏరుకొన్నారట. తనకు 232/-రూపాయలు లభించాయని, ఆరోజు తన ‘అల్పత్వానికి’ సిగ్గుపడ్డానని అవధాని గారు అన్నారు. ఈ విషయం ముదిగొండ శివప్రసాదు గారికి కూడా గుర్తుండి ఉంటుంది. నా జీవితంలో వెంకటావధానిగారు ఆరోజు మాట్లాడినట్లు మళ్లీ ఎన్నడూ మనసు విప్పి మాట్లాడిన సందర్భం ఎరగను.

“అయితే మీరు బాబాగారిని దేవుడని నమ్ముతున్నారా” అని శివప్రసాద్ గారు అడిగినపుడు అవధానిగారు “వారొక దివ్యపురుషులు” అని సమాధానం చెప్పారు. ఆరోజు మా సమావేశం రాత్రి పన్నెండు గంటలకు ముగసింది.

1976 చివరనో 77 ఆరంభంలోనో అనంతపురం శ్రీ సత్యసాయి మహిళా కళాశాలలో రామాయణం మీద గొప్ప సెమినార్ జరిగింది. అవధానిగారి శిష్యురాలు డాక్టర్ హేమలత ఆ కళాశాల ప్రిన్సిపాల్ హోదాలో సెమినార్ ఏర్పాటుచేసారు. అవధానిగారు నా పేరు సూచించి ఉంటారు, నాకు కూడా ఆహ్వానం అందింది. అవధానిగారు, రామరాజుగారు, జంధ్యాల పాపయ్యశాస్త్రి మొదలైన గొప్ప కవిపండితుల మధ్య నేనొక్కణ్ణే పేరు ప్రతిష్ఠలు లేని అనామకుణ్ణి. గోపినాథుని రామాయణం మీద పరిశోధించాను కనక, అవధానిగారు నా పేరు సూచించి ఉంటారు. మొదటిరోజు ఉదయం ప్రారంభసభ చాలా వైభవంగా బాబామీద ఉపన్యాసాలతో, కవిపండితులు రాసుకొని వచ్చిన పద్యపఠనంతో ముగిసినది. మధ్యాహ్నం సభ ఆరంభానికి ముందు రామరాజుగారు, అవధానిగారు మరి కొందరు పుట్టపర్తి వెళ్ళడానికి కార్లు ఏర్పాటు చేశారు. నేను వారితోపాటు కారు ఎక్కబోతుంటే శ్రీమతి హేమలతగారు నన్ను వెళ్లవద్దని చనువుతో అడ్డుకొన్నా, నేను మొండిగా బయలుదేరాను. మూడు కార్లలో సుమారు పదిహేనుమందిమి. అవధానిగారు, రామరాజుగారు కాక, కేంద్ర ప్రభుత్వానికి సలహాదారు, భూగర్భజల శాస్త్రవేత్త డాక్టర్ బవేజా కూడా ఆ బృందంలో ఉన్నారు.

పుట్టపర్తి చేరే సమయానికి నాలుగు అయి ఉంటుంది. అక్కడ ఒక పెద్ద హాలు, వేదిక పైన నేలమీద పరచిన తివాచీలమీద కూర్చొన్నాము. బాబావారు రాగానే, అందరం లేచి నిలబడ్డాము. బాబాగారు అందరి చేతుల్లో విభూది వేశారు. పరిచారకులు పేపరు చించి ముక్కలు చేసి విభూతి పొట్లం కట్టుకోడానికి ఇస్తున్నారు. నేను అరచేయి అలాగే తెరచి ఉంచడం చూచి బాబావారు “నీకు కాగితం ఇవ్వలేదా” అన్నారు. ఎవరో అప్పుడు కాగితం ఇస్తే విభూతి పొట్లం కట్టి జోబీలో దాచుకున్నాను. బాబాగారు అతిథులను నేలమీద కూర్చోబెట్టినందుకు నొచ్చుకొని కుర్చీలు తెప్పించి వేయించారు. అరగంట పైగా బాబాగారు మా బృందం సభ్యులతో సంభాషించారు. కొందరు అడిగిన ప్రశ్నలకు బాబాగారు సమాధానాలు చెప్పారు. బవేజా గారూ ఎమర్జెన్సీ ఎప్పుడు పోతుంది అని సూటిగా అడగకుండా ఏదో విషయాన్ని అడిగినట్లు మర్మంగా అడిగారు. బాబాగారు “దుష్టశక్తులు త్వరలో తొలగి పోతా”యని సూటిగా కాకుండా వ్యంగంగా జవాబు చెప్పారు. ఆరోజు బాబాగారు అన్న మాటల్లో ఒక మాట “ఈ హాలు నేను స్వయంగా కట్టించాను” అని నేను మీద నొక్కి అన్నారు. ఎందుకో నాకు ఆ మాట రుచించలేదు. తర్వాత వారు పక్క గదిలోకి వెళ్లి కూర్చొని ఒక్కొక్కర్ని లోపలికి పిలిపించుకొన్నారు.. లోపల సంభాషణలు వెలుపలికి తెలియవు. అందరూ వెళ్లారు, చివరకు నన్ను లోపలి వెళ్లామన్నారు పరిచారకులు. నేను వెళ్ళలేదు. “మీకు సమస్యలు లేవా” స్వామివారి సేవకుడు అడిగాడు. నేను నవ్వి ఊరుకున్నా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి మా గురువుగారు బిరుదురాజు రామరాజు గారికి బాబా గారితో ఇదే ప్రథమ పరిచయం. వారు సమావేశం తర్వాత గదిలోంచి రుద్ధ కంఠంతో, కన్నీళ్లు పెట్టుకొని వచ్చారు. ఆ దృశ్యాన్ని నేను ఎప్పటికి మరచిపోలేను. అప్పుడు వారు పరిష్కారం దొరకని కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నారు.

సాయంత్రం బాబాగారు పెద్ద ఆడిటోరియంలో వేదికమీద కుర్చీలో ఆసీనులై ఉంటే, భక్తులు వంద మంది పైగా బాబాగారి మీద సన్నుతి గీతాలు, భజన పాటలు పాడుతున్నారు. మేము వేదిక ముందు వేసిన కుర్చీలలో కూర్చొని ఆ భజనలో పాల్గొన్నాము. బాబాగారు మమ్మల్ని వేదికపైకి పిలిపించారు. బాబాగారి కుర్చీకి ఇరువైపులా అందరం సద్దుకోని తివాచీమీద పద్మాసనాలు వేసుకొని గంట సేపు ఆ భజన కార్యక్రమంలో పాల్గొన్నాము. మమ్మల్ని వెళ్ళమని బాబుగారే అనుజ్జ ఇవ్వడంతో అందరం లేచి ఆశ్రమ సేవకుల వెంట భోజనశాలకు నడిచాము. అక్కడ కొద్దిమందే భోజనం చేస్తున్నారు. ఉత్తర దేశ భక్తులు తెచ్చారని ప్రతేకంగా మాకు కొన్ని మిఠాయిలు భోజనంలో వడ్డించారు. భోజనం ముగిసిన వెంటనే బయలుదేరి అందరం అనంతపురానికి బయలుదేరాము.

తెల్లవారి సెమినార్‌లో నావంతు వచ్చినపుడు ‘గోపినాథుని రామయణంలో అవాల్మీకీయాలు’ అనే అంశం మీద అరగంట ప్రసంగించాను. గోపినాథ రామాయణం వాల్మీకి రామాయణానికి అనుసరణ అని, యథా మూలమని ఒక అపప్రథ ఉంది. కొన్ని అవాల్మీకీయాలను వివరించి నా ప్రసంగం ముగించాను. నా ప్రక్కనే ఆసీనులైన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు “అబ్బాయీ కమ్మగా నాలుగు పద్యాలు చదివితే సరిపోదా? ఇదంతా ఎందుకు?” అని అన్నారు. నేనేమో అది సీరియస్ సెమినార్ అని తయారయ్యాను, వచ్చినవారు బాబాగారిమీద కమ్మగా పద్యాలు చదివారు. బహుశా రామరాజు గారు ఒకరే సెమినార్‌లో సీరియస్‌గా పేపరు సమర్పించారు. నా పేపరు ఆ సెమినార్ విశేష సంచికలో అచ్చయింది.

బాబాగారికి నెల్లూరులో చాలామంది భక్తులున్నారు. నా బాల్యంలో నెల్లూరు వారందరు రమణ మహర్షి భక్తులు, పొణకా కనకమ్మ గారితో సహా. 1945 ప్రాంతాల్లో బెంగాలు నుండి వచ్చిన ఒక కల్ట్ కుసుమ హరనాథ భక్తి ఉద్యమం నెల్లూరులో దట్టంగా వ్యాపించి, ప్రతి ఇంట్లో హరనాథులు, కుసుమలు అని పిల్లలకు పేర్లుపెట్టారు. మా అమ్మగారు చెప్పిన విషయం, భక్తులు తన్మయత్వంలో భజన చేస్తున్న సమయంలో అక్కడ కుసుమహరనాథ పటం ముందు పెట్టిన ప్రసాదంలో చేతి వేళ్ళ గుర్తులు కనిపించాయని, స్వామివారు ప్రసాదం స్వీకరించారని అనేవారట. మా యింటి సమీపంలో హరనాథ మందిరం ఉండేదని గుర్తు. ఆ తర్వాత వారం వారం షిరిడీ సాయి భక్తుల భజనలు మొదలయ్యాయి, ఈ భక్త బృందానికి డాక్టర్ రాజగోపాలాచారి గారు ముఖ్యులు. రాజవీధిలో పటం పెట్టి ఒక ఇంట్లో భజనలు జరిపేవారు. తర్వాత డాక్టర్ గారి చొరవతో రేబాల లక్ష్మీనరసారెడ్డి గారు స్వతంత్ర పార్కుకు తూర్పువైపు మందిరం కట్టించారు. ఈ రోజు ఆ గుడికి నెలకు 50లక్షల ఆదాయం ఉంటుంది.

1940కే నెల్లూరు భూస్వాములు, రెడ్డిగార్లు కొందరు అరవింద భక్తులై పాండిచ్చేరి వెళ్లి స్థిరపడ్డారు. పల్లిపాడు పినాకిని సత్యాగ్రహ ఆశ్రమ స్థాపకులలో ముఖ్యులైన చతుర్వేదుల వెంకట కృష్ణ, 1929లో పల్లిపాడు ఆశ్రమ విడిచిపెట్టి అరవింద శిష్యులై ఆశ్రమ పత్రిక అర్కకు జీవితాంతం సంపాదక బాధ్యతలు నిర్వహించారు. తిక్కవరపు దయాకర్ రెడ్డి గారి తండ్రి పాండిచ్చేరిలో స్థిరపడి యావత్తు ఆస్తి ఆశ్రమానికి రాసిస్తే, వారి భార్య కొర్టుకెక్కి తన భాగాన్ని దక్కించున్నారు.

1955 ప్రాంతాలకే సత్య సాయి బాబాగారిని, యువ బాబాగారిని రేబాల లక్ష్మీనరసారెడ్డి, తదితర ప్రముఖులు నెల్లూరు తీసుకొని వచ్చి పూజలు పునస్కారాలు చేస్తున్నారు. వెంకటగిరి సర్వజ్జ కుమార యాచేంద్ర బాబాగారిని వెంకటగిరి తీసుకొనివచ్చి పాలస్ లోనే మహారాణి గారి నివాసాన్ని ఖాళీ చేయించి అందులో బాబాగారికి ఆతిథ్యమిచ్చి దర్శనాదులు ఏర్పాటు చేసేవారు. ఆ రోజుల్లో బాబాగారు వెంకటగిరి ఆస్థాన గాయని బెంగుళూరు నాగరత్నమ్మగారితో కలిసి కొన్ని భజన గీతాలు పాడారని తెలిసింది. 1958లో వెంకటగిరి ఆర్.వి.ఎం బాలికల భవనాన్ని బాబా ప్రారంభించిన సభకు 16 సంవత్సరాల హైస్కూలు విద్యార్థిగా హాజరయ్యాను.

1956/57 ప్రాంతాలలో మరుపూరు కోదండ రామరెడ్డి, ఇస్మాయిల్ అనే పత్రికాధిపతులు బాబా గారిమీద వారం వారం వారి పత్రికలలో విమర్శ వ్యాసాలు రాశారు. బాబాగారు ఒక భక్తుడికి రాసిన ఉత్తరాలు ఈ పత్రికలలో చదివిన గుర్తు.

నెల్లూరులో మా సర్వోదయ కాలేజీ వ్యవస్థాపకులు, వాకాటి సంజీవిశెట్టి గారు బాబా గారికి గొప్ప భక్తులై బాబాగారు కొన్ని రోజులు ఉన్న తమ ప్రశాంతి నిలయం భవనంలో పెద్ద హాలును బాబాగారి మీది భక్తితో పవిత్రంగా అలాగే విడిచిపెట్టారు. బాబాగారు వాడిన తల్పం, సోఫా వగయిరా లకు రోజు పూజ జరిపించేవారు. 1972లో మా సర్వోదయ కళాశాలను సంజీవి సెట్టి గారు ప్రారంభించబోయేముందు బాబాగారి అనుజ్ఞ కోసం పుట్టపర్తి వెళ్లారు. కాలేజీ నిర్వహించడం సామాన్యం కాదని, చిన్న పిల్లల కోసం కిండర్ గార్టెన్ వంటి బడిని పెట్టమని బాబాగారు సలహాయిచ్చారట,

సెట్టిగారు నెల్లూరు వైశ్యప్రముఖులతో కలిసి కాలేజి నెలకొల్పడంతో బాబాగారు సెట్టిగారికి దర్శన భాషణాలను నిరాకరించారట. మా సెట్టిగారు అప్పుడప్పుడు పుట్టపర్తివెళ్లి సాధారణ భక్తులవలె వారిని దర్శించుకొని వచ్చేవారని, బాబా గారు తన ఉనికి గుర్తించకుండా ఎదురుగా తను లేనట్లే ప్రవర్తించారని సెట్టిగారు ఎంతో దుఃఖపడుతూ చెప్పేవారు. ఆ విధంగా మాకు, అధ్యాపకులకు బాబాగారితో పరోక్ష సంబంధం ఏర్పడింది. సంజీవిసెట్టిగారి బాల్యమిత్రులు దీపాల పిచ్చయ్యశాస్త్రి బాబాగారి ఆస్థాన పండితగౌరవాన్ని పొందారు.

ఒకరోజు జ్వరం తగ్గిన తర్వాత నీరసంగా ఉన్న సమయంలో మధ్యాహ్నం వరండాలో నిలబడ్డాను. నాకు ఎదురుగా బాబాగారు నిలబడి ఉన్నట్లు అనిపించి దిగ్భ్రాంతికి లోనయ్యాను. మళ్ళీ తేరిపార చూస్తే మా ఎదురింటి వారు హాల్లో పటంకట్టించి తగిలించిన బాబా నిలువెత్తు పటం ఏదో భ్రాంతి వల్ల అట్లా కనిపించిందని అర్థమైంది.

1965- 70లలో సింగరాయకొండ వద్ద బండ్లమాంబ అనే యోగినిని ఇళ్ళల్లో పెట్టుకొని ఆతిథ్యాలు వంటి హడావుడి నెల్లూరులో ఎక్కువగా ఉండేది.

1978 ప్రాంతాల్లో డాక్టర్ సుబ్బారావు అనే జిల్లేళ్ళమూడి అమ్మ భక్తులు అమ్మను నెల్లూరు తీసుకొని వచ్చి దర్శనం ఏర్పాటు చేశారు. ఆమె విఆర్ కాలేజి భవనం పైనుంచి కాలేజి మైదానంలో సమావేశమైన వేలాది భక్తులకు దర్శనం ఇచ్చి, అందరినీ అక్కడ ఏర్పాటు చేసిన భోజనం తిని వెళ్ళమని సైగలతోనే కోరారు. ఆ రోజుల్లో నెల్లూరు బియిడి ట్రైనింగ్ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి వంటి పెద్దలు జిల్లేళ్ళమూడి అమ్మ భక్తులు.

చివరగా మా సొంత ఊరు గొలగముడి స్వామి, వెంకయ్య స్వామిని గూర్చి చెప్పకుండా ముగించను. వారి జీవిత చరిత్రలో అనేక మహత్యాల గురించి, భక్తుల వైయక్తిక అనుభవాలను చేర్చి రాస్తూంటారు. వాటిని గురించి నేను వ్యాఖ్యానించను. వెంకయ్య స్వామి వైరాగ్యంతో మా గొలగముడి వచ్చి ఆంజనేయ స్వామి గుడికి సమీపంలో పాక వేసుకొని నలుగురు అనుచరులతో ఉండేవారు. వారు నిరంతరం ధుని వేసుకుని దాని ముందు గోతం పరచుకొని తంబుర మీటుతూ ఏవో తత్వాలు పాడుకొనేవారు. నిరుపేదలైన గ్రామీణులు రోగాలకు, ఇతర ఇబ్బందుల నివారణకోసం వద్దకు వచ్చేవారు. వారేవో కొన్ని ప్రతీకలతో మాటలు చెప్పి, సమాధానపరచి ఊరట కలిగించి పంపేవారు. వారి వద్ద ఉన్న శిష్యులు వారి మాటలకు వ్యాఖ్యానం చేసి చెప్పేవారు. స్వామి పెళ్లి ముహుర్తాలు లేని సమయంలో పెళ్లి ముహూర్తం పెట్టి పెళ్లిళ్ళు జరిపించడం నేను ఎరుగుదును. వారు వీరబ్రహ్మేంద్రస్వామి వంటి యతి అని తోస్తుంది. మావూరు పక్కన అనికేపల్లిలో చిన్న భూస్వామిని తులశమ్మ వెంకయ్య స్వామిని జీవితాంతం కనిపెట్టుకొని ఉండి వారి అవసరాలు గమనించుకొన్నారు. అటువంటి మరికొందరు భక్తులు కూడా ఉన్నారు. తులశమ్మ గారు స్వామికోసం కట్టించిన హాలులోనే వెంకయ్య స్వామిని సమాధి చేశారు. వారు సజీవవులై ఉండగా అనేక పర్యాయాలు గొలగముడిలో, నెల్లూరు వేణుగోపాలస్వామి గుడిలో చూచాను. 1973లో కొందరు విశ్వవిద్యాలయం ఆచార్యులను వెంటబెట్టుకొని మా ఊరు గొలగముడి వెళ్ళాను. వారి ప్రశ్నలకు స్వామి సాంకేతిక భాషలో సమాధానం ఇస్తే, పక్కన ఉన్న అనుచరులు వ్యాఖ్యానించి చెప్పారు. నా వెంట వచ్చిన ఆచార్యులు వారిచేతికి కొంత డబ్బు ఇవ్వబోతే వారు తీసుకోలేదు. శిష్యులు వారు కూర్చొని ఉన్న గోతం పట్ట కింద ఆ డబ్బు పెట్టి వెళ్ళమన్నారు.

వెంకయ్య స్వామి తెల్లకాగితాల మీద సిరాతో తన చేతి ముద్రలు వేసి ఇచ్చేవారు. భక్తులు వాటిని పటం కట్టించుకొని పూజలో పెట్టుకొనేవారు. స్వామి సిద్ధి పొందిన తర్వాతనే భక్తుల రాక ఎక్కువైంది.

ఇనమడుగు స్వామి, రామయోగి వంటి యోగులు జిల్లాలో చాలా మంది ఉన్నారు. మా గురువుగారు ఆచార్య బిరుదురాజు రామరాజు గారి యోగుల చరిత్రలో వారందరి చరిత్రలు గ్రంథస్థం అయ్యాయి.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here