[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]
[dropcap]1[/dropcap]993 డిసెంబర్ 2వ తారీకు, కాలేజిలో క్లాసులు ముగించుకొని ఇంటికి వెళ్ళాను, ఇంతలో ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారంటూ మా కాలేజి గుమాస్తా పోలీసువారి కారులో నన్ను పిలుచుకొని పోవడానికి వచ్చాడు. ఏం కొంప మునిగిందోనని వెంటనే బయలుదేరి వెళ్ళాను. ప్రమాణాల పెళ్ళి జరిపించ వలసిన అవసరం ఉందని, నన్ను ఆ పెళ్ళి జరిపించమని మా ప్రిన్సిపాల్ గారు కోరారు.
మా కళాశాలలో కొంతమంది అభ్యుదయ భావాలున్న అధ్యాపకులం పూర్వం కొన్ని ప్రేమ వివాహాలు జరిపించిన మాట నిజమే. ఆ రోజుల్లో మదనపల్లి ప్రాంతం వారైన శ్రీ రామమోహనరెడ్డి అనే అధ్యాపకుల నాయకత్వంలో ఇటువంటి పనులు చేసేవాళ్ళం. అదంతా మా యవ్వనంలో. ఇప్పుడు డి.ఐ.జి హోదాలో ఉన్న పోలీస్ అధికారి ప్రిన్సిపాల్ గారి సహాయం కోరారు. పెళ్ళికొడుకు, వధువు ఇద్దరూ వైద్యులే, పెళ్లికొడుకు హిందూ పద్ధతిలో పెళ్లి జరగాలని, పెళ్లికుమార్తె తరఫువాళ్ళు క్రైస్తవ పద్ధతిలో జరపాలని పట్టుదలలకు పోవడంతో చివరకు ప్రమాణాల పెళ్ళికి ఒప్పించారు. ఈ పెళ్లి కందుకూరులో జరిపించాలి. నాకు ఇష్టం లేకపోయినా మా ప్రిన్సిపాల్ గారు, ఆ డి.ఐ.జి గారి అభ్యర్థన కాదనలేక అంగీకరించవలసి వచ్చింది. దంపతుల చేత ప్రమాణాలు చేయించి పూలమాలలు, ఉంగరాలు మార్పించి వివాహ ప్రాముఖ్యాన్ని గురించి నాలుగు మాటలు చెప్పి వేదిక దిగివస్తుంటే పెళ్లికూతురి తల్లిగారు సన్నగా రోదించడం వినపడింది. వారు క్రైస్తవులే కానీ మాంగల్యధారణ జరిపించలేదని బాధపడ్డారు. నేను వేదికపైనుండి దిగిన తర్వాత ఆ తతంగం కూడా జరిపించారు. వెంకట్ దంపతులు వైద్యులుగా చక్కగా స్థిరపడ్డారు. చాలాకాలం తర్వాత నాకు ఒక ఇబ్బంది కలిగినపుడు డి.ఐ.జి గారు నెల్లూరు పోలీసు సూపర్నెంట్ గారికి నన్ను గురించి చెప్పి మాట సహాయం చేశారు.
కాలేజీలో పనిచేస్తున్న కొత్తల్లో బ్రాహ్మణ వధువు, దళిత యువకుడి పెళ్లి జరిపించవలసి వచ్చింది. అలా మేము జరిపించిన కొన్ని వివాహాలు విజయవంతమయ్యాయి, ఒకటి రెండు విఫలమయ్యాయి కూడా.
నేను పనిచేసే కళాశాలలో అధ్యాపకుడికీ, అధ్యాపకురాలికి సహ అధ్యాపకులమే సంబంధం కుదిర్చి పరిణయం జరిపించాము. పెళ్లి ప్రమాణాలు రాసి పెళ్లిపెద్ద, వి.ఆర్. కళాశాల రసాయనశాస్త్ర అధ్యాపకులు శ్రీ ఎం. పట్టాభిరామారెడ్డిగారికిచ్చి నేను సహాయకుడిగా ఉన్నాను. కాగితాలు తారుమారై వధువు చదవాల్సిన పత్రం వరుడు, వరుడు చవవలసిన పత్రం వధువు చదివారు. పెళ్లిగోలలో పొరపాటు ఎవరు గమనించలేదు.
నేను ప్రి-యూనివర్సిటీ చదువుతున్న రోజుల్లో మా మేనమామ కుమార్తె ఒక యువకుడి మాయలో చిక్కుకొని ఇబ్బందిలో పడింది. మా పెద్దక్క, నేను ఆ అమ్మయిని, ఆ యువకుణ్ణి రహస్యంగా బిట్రగుంట కొండమీదకు తీసుకొనివెళ్ళి పెళ్లి జరిపించి కావలిలో మా చిన్నాన్నగారి ఇంట్లో బంధువులను పిలిచి విందు భోజనం పెట్టించి వివాహం జరిగినట్లు అందరికీ తెలిసేటట్లు చేసాము. ఆ అమ్మాయి జీవితం సుఖాంతమైనది.
నేను ఉద్యోగంలో ఉండగానే మా పెద్దబ్బాయి ఇష్టపడిన అమ్మాయితో అందరి సమ్మతితో ప్రమాణాల పెళ్లి చేద్దామనుకొన్నాము. మిత్రులు కె.ప్రసాదరావు ఐఇఎస్, ఈ వివాహం జరిపిస్తామన్నారు. వారు దళితులు కూడా. చివరి నిమిషములో ఆయన అనారోగ్యంతో రావడంలేదని కబురు పంపడంతో, నా ఆత్మీయ మిత్రులు పెన్నేపల్లి గోపాలకృష్ణ పెళ్లిపెద్దగా వ్యవహరించారు. మిగతా ఇద్దరు అబ్బాయిల వివాహాలు పెద్దలు ఏర్పాటు చేసినవే. ఈ వివాహాలు ముక్తసరిగా పురోహితులు జరిపించారు.
మా రెండో అబ్బాయి సింగపూర్‌లో పనిచేస్తూ “నేను తరవాత చేసుకొంటాను, ముందు తమ్ముడికి చెయ్యం”డని అంటే, హైదరాబాదు ఆర్.టి.సి క్రాస్‌రోడ్స్ సమీపంలో ఒక స్వచ్ఛందసంస్థ వారిని సంప్రదిస్తే సంబంధాలు చెప్పారు కానీ, ఏవీ నచ్చక వచ్చేస్తుంటే మాలాగా వచ్చిన దంపతులు బాబు ఫోటో చూసి “ఒక అమ్మాయి మీ బాబుకు ఈడుజోడుగా ఉంటుం”దని అడ్రెస్ ఇచ్చారు. మరుసటిరోజు సంప్రదిస్తే, మా విషయాలు తెలుసుకొని, మేనమామే తల్లిదండ్రులు రాకుండానే అమ్మాయిని చూపించారు. ఇద్దరు ఇష్టపడ్డారు, ముందు రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే అమ్మాయిని తనతో కూడా అమెరికా తీసుకొని వెళ్ళడానికి వీలవుతుందని బాబు కోరినా, ఆవైపు పెద్దలకు విషయం అర్థంకాక, వారంరోజుల తర్వాత కాకినాడలో వివాహం జరిపించారు. దంపతులు మరుసటిరోజే విశాఖాపట్నం వెళ్లి, 24 గంటలలోపలే అమ్మాయికి పాస్‌పోర్ట్ తెచ్చుకొన్నారుగానీ, వీసా రావడంలో వారం రోజులు ఆలస్యం అయి, ముందు మా బాబు, తరవాత కోడలు అమెరికా వెళ్ళవలసివచ్చింది. వాళ్లు అమెరికాలో హనీమూన్ జరుపుకొన్నారు.
మా మిత్రుల్లో అన్నకు సంబంధం కుదరక, తమ్ముడికి చూస్తే అన్న అసూయతో ప్రతిసారి అబ్బాయి మంచివాడు కాదని ఆడపెళ్ళివారికి ఆకాశరామన్నపేర జాబు రాసేవాడు. ఇద్దరికీ అయిందనుకోండీ వెనకాముందుగా.
ఉద్యోగవిరమణ తర్వాత మా అబ్బాయిల పెళ్ళిళ్ళ కోసం ప్రయత్నం చేస్తున్నపుడు పత్రికల్లో వచ్చిన ప్రకటనలు చూచి ఫోన్ చేస్తే అన్నీ కుదిరి, చివరకు మేము నియోగులము, అనీ, వెలనాడు అనీ, మా బామ్మ ఒప్పుకోరు, తాతగారు అంగీకరించరు అని శాఖాభేదంవల్ల అవతలివాళ్ళు అంగీకరించలేదు. పెళ్లి ప్రకటనలలో SSB, NoB వేస్తారని, అవి చూచి మాట్లాడాలనీ నాకు ఆలస్యంగా జ్ఞానోదయం అయింది. మా ముగ్గురు కోడళ్ళు వేరువేరు శాఖలవారే.
రిటైరైన రెండు మూడేళ్ళవరకు మా వద్ద ఉన్న సంబంధాల వివరాలు అవసరమైనవారికి చెప్పడం వ్యాపకమైనది. మా అబ్బాయి ప్రియ స్నేహితుడు అమ్మా, నాయన మాట వినకుండా వారికి నచ్చని అమ్మాయిని పెళ్లి చేసుకొంటానని మొండిపట్టు పట్టాడని, తల్లిదండ్రులు దుఃఖపడుతోంటే ఆ బాబును పిలిపించి, మా దంపతులం నచ్చచెప్పాము, “ఎన్ని సంబంధాలు చూడమంటారు, వాళ్ళు ఏదీ ఒప్పుకోరు, నేను మాటిమాటికి నెల్లూరు రాలేను” అని విసుగ్గా చెప్పాడు ఆ బాబు. తల్లితండ్రులను విచారిస్తే “అన్ని సంబంధాలు చూచాము, ఇక మిగిలింది ఒకటే, ఆ అమ్మయి బాబుకంటే 3నెలలు మాత్రమే చిన్నది” అన్నారు. మా దంపతులం వారికి నచ్చచెప్పి తెల్లవారి ఆ సంబంధం చూడడానికి వెళ్ళాము. ఆ అమ్మాయి బాగా చదువుకొన్నది, ఇంజనీరింగ్ కాలేజీలో ఫిజిక్స్ అధ్యాపకురాలు. ఆ సంబంధం నిశ్చయం చేసుకొన్నారు. ఇప్పుడు ఆ దంపతులకు ఇద్దరు ముత్యాలవంటి బిడ్డలు, చదువుల్లో సరస్వతులు.
మరొక అనుభవం, రైల్లో వెళుతుంటే పరిచయమైన దంపతులు వాళ్ళ అమ్మాయి పెళ్ళికి ఉన్నదంటే, మాకు తెలిసిన అబ్బాయి ఉన్నాడని ఫోన్ నంబర్ ఇచ్చాము. ఆ సంబంధమే కుదిరింది. ఆ పెళ్లిలో మా దంపతులం ప్రత్యేక అతిథులం. ఈ వ్యాపకం రెండో మూడో ఏళ్ళు కొనసాగింది. తర్వాత పుస్తక రచనలో నిమగ్నమై ఈ వ్యాసంగాన్ని వదిలేసాను.
మా ఎరుకలోని ఒక మధ్యవయసు ఉద్యోగికి భార్య చనిపోయి విధురుడుగా జీవితం గడుపుతూ, ఒక రోజు నిశిరాత్రివేళ మాకు ఫోన్ చేసి ఒంటరితనం పీడిస్తోందని, ఆత్మహత్య చేసుకోవాలనే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయని మాట్లాడుతూంటే, నా శ్రీమతి అతన్ని ఓదార్చి మంచిమాటలు చెప్పి శాంతింపజేసింది. తర్వాత కొద్దిరోజులకు మాకు తెలిసినవారి ద్వారా ఒక అమ్మాయి, విద్యాధికురాలు, వితంతువు గురించి విని ఇద్దరూ కలుసుకొనే ఏర్పాటు చేశాము. ఆరోజు మా దంపతులం కూడా ఉన్నాము. నా శ్రీమతి “ఈ అమ్మాయిని చూస్తుంటే అంతా నీ భార్య గుర్తొస్తోం”దని అబ్బాయిని ప్రోత్సహించింది. నా వరకు సంబంధం కుదుర్చుకొంటారని నమ్మకం కుదరలేదు. తర్వాత మా ప్రమేయమేమీ లేకుండానే వారిద్దరూ అన్నవరంలో పెళ్లి చేసుకొన్నారు. ఎవరికీ ఇబ్బందిలేదు. కానీ అబ్బాయి తరఫువారు, చనిపోయిన అతని భార్య తరఫువారు అందరూ ఈ పెళ్లిని వ్యతిరేకించారు, మా దంపతులను, మరొకరిని కుట్ర చేసి పెళ్లి చేశామని తిట్టిపోశారు. ఆ అమ్మాయి తన భర్త తొలి భార్య కుమార్తెను సొంతబిడ్డలాగా చదివించి, ఆ అమ్మాయి ఇష్టపడిన అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేసింది. సవతి తల్లని కాకుండా ఆ పాప కూడా సొంత తల్లిలాగా అనుసరించుకొని నడచుకొన్నది. అంతా బాగుందిగానీ నేను, ఈ సంబంధం కుదర్చడంలో సహకరించిన మరొకరు మాత్రం దుష్టపాత్రలుగా మిగిలిపోయాము.
మరొక అనుభవం రాసి ఈ వివాహ పురాణం ముగిస్తాను. 1999 మార్చి చివర్లో మా మేడమీద పోర్షన్ ఖాళీగా ఉంటే ఒక పాతికేళ్ల యువకుడు ఇల్లు బాడుగకు కావాలని, తను యు.యస్. వెళ్ళిపోతున్నట్లు తన తల్లి, చెల్లి మాత్రమే ఉంటారని చెప్పాడు. అభ్యంతరం లేదని చేర్చుకొన్నాము. ఆ యువకుడు వారం తర్వాత పూనాకు వెళ్ళిపోయాడు. అతని తల్లికి ప్రభుత్వ ఉద్యోగం, రోజూ ఉదయం వెళ్లి రాత్రికి వస్తుంది. 18 సంవత్సరాల ఆమె కూతురు రోజూ టైపు నేర్చుకొని వస్తుంది. నా శ్రీమతితో ముచ్చట్లాడుతూ ఉంటుంది తీరిక సమయాల్లో. ఇంతలోనే టైపు ఇన్‌స్టిట్యూట్‌లో 20 ఏళ్ళ యువకుడితో పరిచయం పెంచుకొంది. విచారిస్తే చదువు సంధ్య లేని అల్లరిచిల్లరి పిల్లవాడని తెలిసింది. నా శ్రీమతి మాటలను విని ఆ అమ్మాయి స్నేహాన్ని తెంచుకొన్నా, వాడు బలవంతంగా ఇంటికి రావడం మొదలుపెట్టాడు. నా శ్రీమతి ఈ విషయంలో సహాయం కోరింది.
మా కళాశాలలో పార్ట్ టైమ్ అధ్యాపకులు ముందుకొచ్చారు. రోజు పగలు ఇద్దరు రాత్రికి ఇద్దరు వాకిట్లో కుర్చీలు వేసుకొని కూర్చొని జాగ్రత్తగా ఉండేవారు. ఒకరోజు రాత్రి 12 గంటలప్పుడు మా అధ్యాపకులు “పెద్ద పెద్ద రౌడీలు జీపులు వేసుకుని వీధిలో తిరుగుతున్నారని వాళ్ళను ఆడ్డుకోలేమని, ఎలాగైనా పోలీసులను పిలిపించమ”ని చెప్పి పారిపోయారు. నేను భయపడి పోలీసులకు ఫోన్ చేస్తూ “సర్వోదయ కాలేజి ప్రిన్సిపాల్‌ని, సహాయం కావాల”ని అడుగుతున్నా. పోలీసుల నుంచి ఎవరూ అందుబాటులో లేరని జవాబు వస్తోంది. వీధిలో రౌడీలు జీపుల్లో తిరుగుతున్నారు. మేము అందరం ప్రాణాలు అరచేతిలో పెట్టకొని ఆ యువతిని బెడ్రూమ్‌లో పెట్టి తాళంవేశాము. ఇంతలో పోలీసులు వచ్చి “భయపడకండి, మేము ఇక్కడే ఉంటాము” అని ధైర్యం చెప్పి, పోలీసు ఎ.యస్.పి గారు వీధిచివర జీపులో ఉన్నారని చెప్పారు. నన్ను చూడగానే ఆయన జీపు దిగి మా వాకిట్లోకి వచ్చి నిలబడ్డారు. అమ్మాయిని తీసుకొని వచ్చి ఆయనకు చూపించాము. ఆయన నేరుగా అమ్మాయిని Do you like him? అని అడిగారు. No అని చెప్పగానే వారు వెళ్ళపోయారు. తెల్లవార్లు వాకిట్లో నలుగురు పోలీసులు కావలి ఉన్నారు. తర్వాత కూడా ప్రతిరోజు వాకిట్లో రాత్రి పగలు పోలీసులు వచ్చికూర్చొనేవారు.
శనివారం పదిగంటలకు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది, ఆ అమ్మాయిని తీసుకొని రమ్మని. నెల్లూరులో పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా చేసి విశ్రాంత జీవితం గడుపుతున్న శ్రీ ఎం.చలపతిరావు గారిని సంప్రదిస్తే ఆ అమ్మాయి తల్లికి సమాధానం రాసిచ్చారు.
సాయంత్రం 5.30 కి ఆ అమ్మాయి, తల్లి, నేను స్టేషన్‌కు వెళ్ళి ఆఫీసరు గారిని కలిశాము. వాకిట్లో ఆ యువకుడు, అతని బంధువులు నిలబడి ఉన్నారు. చలపతిరావు గారు రాసిచ్చిన కంప్లైంట్ ఆఫీసర్ గారికి ఇచ్చాము. వారు నన్ను మాత్రం స్టేషన్ పెరట్లోకి పిలుచుకొని వెళ్ళి కొన్ని కాగితాలు, ఫొటోలు స్వయంగా మంటలో వేసి కాల్చి మాకు ధైర్యం చెప్పి వెళ్ళమన్నారు. ఆయన ట్రెయినీ ఎస్.పి అనీ, నేను పోలీసుల సహాయం అర్థించడం వైర్‌లెస్‍లో విని ఆ రాత్రి వచ్చారని, కాలేజీ ప్రిన్సిపాల్ అని వెంటనే చర్య తీసుకొన్నారని తెలిసింది.
ఇంత జరిగిన తర్వాత కూడా ఆ యువకుడి తల్లి మా యింటికి వచ్చి నా భార్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నించడంతో ఆ యువతి, ఆమె తల్లి, నా శ్రీమతి రహస్యంగా హైదరాబాద్ వెళ్ళి కొన్ని రోజులు ఉండి వచ్చారు. తర్వాత ఆ యువతిని యిష్టపడి ఒక బ్యాంకు ఆఫీసరు పెళ్ళి చేసుకొని వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయాడు.
ఈ విషయంలో నా భార్య పట్టుదల వల్లే నేను శ్రద్ధపెట్టి పనిచేశాను, మాకు కలిగిన లాభం ఏమీ లేకపోయినా ఒక యువతి జీవితాన్ని కాపాడామనే తృప్తి మిగిలింది. మా కాలేజి అధ్యాపకులు స్వచ్ఛందంగా సహాయపడ్డారు. వాళ్ళలో ఒకరు విశ్వవిద్యాలయం రిజిస్ట్రారు, ఒకరు ప్రొఫెసర్ అయ్యారు.
(మళ్ళీ కలుద్దాం)