జ్ఞాపకాల తరంగిణి-49

1
10

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డాకాళిదాసు పురుషోత్తం. [/box]

‘ఆమె లేఖలు’ గురించి మరికొంత వివరణ (Letters from Madras – During the years 1836-39 కొన్ని వివరణలు)

[dropcap]రా[/dropcap]జమండ్రిలో 1836-39 మధ్య కాలంలో సివిల్-క్రిమినల్ జడ్జిగా పనిచేసిన జేమ్స్ థామస్ భార్య జూలియా థామస్ తాను రాజమండ్రి, సాముల్దీవి, బెంగుళూరు, రాయవేలూరు నుంచి రాసిన 27 ఉత్తరాలను ‘Letters from Madras – During the years 1836-39’ పేరుతో ‘By a Lady’ అని అజ్ఞాత రచయిత్రి పేరు మీద 1843లో లండన్ నుంచి ప్రచురించింది. ఈ పుస్తకంతో పరిశోధకులకు పరిచయం ఉంది గాని, రచయిత్రి జులియా థామస్ అని తెలుగువారికి 1980 ప్రాంతాల వరకూ తెలియదు.

నా మిత్రులు, సీనియర్ జర్నలిస్టు పెన్నేపల్లి గోపాలకృష్ణ మూడు దశాబ్దాల క్రితమే ‘లెటర్స్ ఫ్రం మెడ్రాస్’ను అనువదించారనడం కన్నా, సొంత మాటలతో వివరించారనడం సబబు. ఆయన అసంపూర్ణంగా వదిలిన ఆ రాత ప్రతిని పరిష్కరించి, ఆయన వదిలిన చివరి మూడు లేఖలను నేను యథామూలముగా అనువదించగా, ఆంధ్రప్రదేశ్ చరిత్ర సభ, ఎమెస్కో సంయుక్తంగా ‘ఆమె లేఖలు’ పేరుతో పుస్తకాన్ని ప్రచురించాయి. జూలియా పేరు తెలియని రోజుల్లో నా మిత్రులు ‘ఆమె లేఖలు’ అని పెట్టిన పేరును వారి మీది గౌరవంతో నేను మార్చలేదు. రచయిత్రి జూలియా థామస్ అని మాత్రం ముఖచిత్రం మీద వేయించాను. ఆమె ఎవరో తెలియదు కనుక ఒక పాశ్చాత్య యువతి లేఖ రాస్తున్న బొమ్మను మిత్రులు శ్రీ పావులూరి చిదంబరం గారు చాలా సజెస్టివ్‍గా పుస్తకానికి ముఖపత్రంగా వేశారు.

ఈ లేఖలు జూలియా ఎవరికి రాసిందీ తెలియదు. ఉత్తరంలో ప్రస్తావించిన పేర్లన్నిటిని ఆమె మరుగుపరిచి అచ్చు వేయించింది. ఉత్తరాల ద్వారా జూలియా ఉత్సాహం, స్వతంత్ర భవాలు, ప్రతీదీ తెలుసుకోవాలనే కుతూహలం, తను కన్నవీ, విన్నవీ అన్నీ తన వాళ్ళకు తెలియజేసింది. 27 లేఖల్లో ఆనాటి ఆంధ్ర దేశ సమాజం, విద్యా విధానం, న్యాయస్థానాలు, ప్రయోగాలు, జీవితంలో అనేక పార్శ్వాలు ప్రస్తావనకు వస్తాయి. ఆమె తిరిగిన, చూచిన ప్రదేశాలను కళ్ళకు కట్టినట్లు వర్ణించింది. ఆమెకు మన దేశంలో క్రైస్తవాన్ని ప్రచారం చేయడం, పై వర్ణాల ప్రజలకు ‘ఆధునిక ఇంగ్లీషు విద్యను’ అందించడం రెండు ఇష్టమైన అభిలాషలు. ఆనాటి ఆంగ్లేయులు చాలామంది భావించినట్లే భారతీయులు అజ్ఞానులు, అతి వినయం ప్రదర్శించేవారు, బానిన మనస్తత్వం కలిగిన వారు అని ఆమె భర్త జేమ్స్ థామస్ భావించేవాడు. ఆ భావాలే అతని ద్వారా జూలియాకు సంక్రమించాయి. ఆమె ఈ దేశానికి వచ్చినప్పుడు 28 ఏళ్ళ యువతి.

27వ లేఖ ముగింపులో జూలియా తన కుమార్తె ‘హెట్టా’ను అనారోగ్య కారణంతో ఇంగ్లాండు పంపవలసిన పరిస్థితి వచ్చినట్లు మాత్రం రాసింది.

2003లో ఆలిసన్ ప్రైస్ సంపాదత్వంలో ‘లెటర్స్ ఫ్రమ్ మెడ్రాస్’ పునర్ముద్రణ – న్యూయార్క్ నుంచి వెలువడింది. న్యూయార్క్ మ్యూజియంలో భద్రపరచబడిన జూలియా రికార్డునంతా పరిశీలించి సంపాదకులు ఆమె సమగ్ర జీవిత వివరాలను ఇవ్వడమే కాకుండా, ఆమె రాజమండ్రి, సాముల్దీవుల్లో వేసిన మూడు నీటి రంగుల చిత్రాలను, మద్రాసులో జూలియా చిత్రించిన తన మరిది జాన్ థామస్ బంగాళా చిత్రాన్నీ ఈ ఎడిషన్‌లో ముద్రించారు.

ఆలిసన్ ప్రైస్ ఇచ్చిన వివరాల ప్రకారం జూలియా హెన్రీ బార్‌నెట్, చార్లెటి దంపతుల కుమార్తె. తండ్రి హెన్రీకి వెస్టు ఇండీస్ ప్లాంటేషన్‌లో నష్టాలు రావడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయి, రిచ్‍మండ్ లో చిన్న బాడుగ ఇంట్లో ఎలాగో రోజులు నెట్టుకొచ్చింది. మగపిలల్లని బోర్డింగ్ స్కూలుకు పంపించారు. పేదరికానికి, తండ్రి పిచ్చి కోపం తోడవడంతో ఇంట్లో ఎవరికీ సంతోషం లేదు. జీవన వ్యయం తక్కువగా ఉంటుందని హెన్రీ దంపతులు ఆడపిల్లలలతో ఫ్రాన్సు, బెల్జియంలలో కొంత కాలం ఉన్నారు. జూలియా, ఆమె చెల్లెలు హెట్టి క్షయ రోగం బారిన పడినందువల్ల వైద్యం వైద్యం కోసం ఫ్రాన్సు, ఇటలీలకు వెళ్ళినట్టు కొందరు రాశారు. జూలియాకు స్వస్థత చేకూరింది గాని హెట్టి జీవించలేదు.

ఆ రోజుల్లో కాస్త పేరున్న, నవలాకారిణులైన జూలియా ఇద్దరు మేనత్తలు ఉత్తరాల్లో జూలియా అందమైన, ఋజుస్వభావం కలిగిన యువతి అని పేర్కొన్నారు. జూలియా అమ్మమ్మ కూచి, అమ్మమ్మతో పాటు ప్రయాణాలు చేస్తూ గడిపింది.

1830 కల్లా హెన్రీ కుటుంబం బ్రిగ్టన్‌లో స్థిరపడింది. అక్కడే చర్చి సమావేశాల్లో జూలియాకు కాబోయే భర్త, జేమ్స్ థామస్‌తో పరిచయం అయింది. అతను భారతదేశంలో కంపెనీ ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ, సెలవు మీద ఇంగ్లండుకు తిరిగి వచ్చాడు. అతను విధురుడు, ముగ్గురు చిన్న చిన్న ఆడపిల్లలున్నారు. జూలియాను మేనత్త కుమారుడు ఇష్టపడ్డా, ఆమె అతన్ని నిరాకరించి జేమ్స్ థామస్‌తో పెళ్ళికి ఇష్టపడింది, అమ్మమ్మ, అమ్మ అందరూ వ్యతిరేకించినా. పిల్లల తండ్రిని చేసుకుంటే భర్త జీతం పిల్లల పోషణకే ఖర్చవుతుందని పెద్దవాళ్ళ భావన. జూలియాను ఇష్టపడి కొందరు యువకులు ముందుకొచ్చినా, ఆ సంబంధాలను నిరాకరించి తన కన్నా వయసులో బాగా పెద్దవాడైన జేమ్స్ థామస్‌ను చేసుకొంది. అందుకు కుటుంబ పరిస్థితులు కూడా కారణం కావచ్చు. జేమ్స్ వ్యక్తిత్వం ఆమెకు బాగా నచ్చింది.

1836 ఆగస్టు 9న వివాహం అయింది. అయిదు సంవత్సరాలు భారతదేశంలో ఉండి వెనక్కి వస్తామని జూలియాకు భర్త వాగ్దానం చేశాడు కూడా. ఇండియాకు వెళ్ళగానే మంచి పోస్టులో వేస్తారని కూడా ఆ దంపతులకు తెలుసు. ఆ రోజుల్లో ఇండియాలో కంపెనీ ఇంగ్లీషు ఉద్యోగులకు అమ్మాయిలు దొరకకపోతే స్థానికులనే పెళ్ళాడేవారు. సూయజ్ కాలువ పూర్తయిన తరువాత ఇంగ్లీషు యువతులు అర్హులైన భర్తల కోసం ఇండియాకు రావడంతో పరిస్థితి మారింది.

జూలియా భర్త జేమ్స్ థామస్ Hailey Bury Collegeలో శిక్షణ తీసుకున్నాడు. కంపెనీ ఉద్యోగులకు రెండో మూడో ప్రాచ్య దేశ భాషలలో శిక్షణ, గణితం, రాజకీయ ఆర్థిక శాస్త్రం, ఇంగ్లీషు సాహిత్యం నేర్పించి ఉద్యోగాలకు పంపేవారు. 1835 నాటికి జేమ్స్ – రైటర్, ఫ్యాక్టర్‌గా చేసి సీనియర్ మర్చెంటు ప్రొమోషన్ పొంది, కోయంబత్తూరు ప్రొవిన్షియల్ కలెక్టరుగా, మేజిస్ట్రేటుగా, మూడవ జడ్జిగా – సివిల్, క్రిమినల్ కోర్టుల్లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జేమ్స్ ఇద్దరు సోదరులు ఇండియాలో మర్చెంట్ హోదాగల ఉద్యోగాలు చేస్తున్నారు. గవర్నరు వంటి ఉన్నతోద్యోగుల పరిచయాలు ఉంటే ముందుగానే పదోన్నతులు లభిస్తాయి.

1836 డిసెంబరులో జూలియా దంపతులు మద్రాసులో ఓడ దిగి, జేమ్స్ సోదరుడు జాన్ థామస్ కుటుంబంతో దాదాపు 7 నెలలు ఉన్నారు. మద్రాసులోనే జూలియా ఆడశిశువు హెట్టాను ప్రసవించింది. 1837 ఆగస్టులో జేమ్స్ థామస్ రాజమండ్రిలో సివిల్, క్రిమినల్ కేసులు విచారించే అధికారమున్న జడ్జి పదవి చేపట్టాడు. జూలియా రాజమండ్రిలో భర్తతో పాటు రెండేళ్ళుంది; వేసవి సెలవుల్లో నరసాపురం పక్కనే సాముల్దీవి అనే సముద్ర తీరంలో బిడ్డను పెట్టుకొని జూలియా ఉంది. ఇప్పుడు సాముల్దీవి నరసాపురంలో కలిసిపోయింది, దాన్ని గురించి ఎంత విచారించినా ఎవరూ చెప్పలేకపోయారు. జూలియా తన భర్తను గురించి ఎవరు తక్కువగా మాట్లాడినా సహించేది కాదు.

జూలియాకు భారతీయుల పట్ల ఉన్న భావనలన్నీ, భర్త ద్వారా సంక్రమించినవే. భారతీయులు సోమరులు, మూర్ఖులు, బానిస మనస్తత్వం కలిగిన వారు, మోసగాళ్ళు మొదలైన అభిప్రాయాలు ఆనాటి అధిక సంఖ్యాకులైన ఇంగ్లాండు వాసులలో ఉన్నవే. ఈ లేఖల్లో జూలియా కంపెనీ పాలనకున్న నైతికతను గురించి ఎప్పుడూ ప్రశ్నించలేదు గాని, ఆఫ్రికా, ఇతర చోట్లకు బలవంతంగా వ్యవసాయ కూలీలను ‘ఇండెంచర్డ్ లేబరర్స్’ పేరుతో తరలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇండియాకు వచ్చిన సాటి ఇంగ్లీషు మహిళల మాదిరే భారతీయుల విషయాల మీద పట్టనితనం, ముఖావం తనలో ప్రవేశించకముందే ‘ఈ దేశం గురించి సాధ్యమయినంత విషయం సేకరించా’లని ఆమె నిశ్చయించుకొంటుంది. ఇంగ్లీషు అధికారుల భార్యలు ఎప్పుడు కలిసినా పుక్కిటి పురాణాలు, గాసిప్ మాట్లాడుకోవడం జూలియాకు సుతరామూ నచ్చదు.

ఒక వైపు సంపదలు, మరొకవైపు మురికి, అశుభ్రమైన ప్రదేశాలు, జమీందార్లు – ఆమెకు ఆశ్చర్యం కలుగుతుంది. సవర్ణ హిందువుల కోసం ‘ఇంగ్లీషు శాస్త్రీయ విద్య’ బోధించే పాఠశాలలు నెలకొల్పటం, క్రైస్తవ మత ప్రచారం ఆమె లక్ష్యాలు. ఆమె భర్త జేమ్స్ హిందూ సవర్ణ బాలుర కోసం రాజమండ్రిలో నెలకొల్పిన స్కూల్ గురించి ఆమె చాలా ఆసక్తి ప్రదర్శిస్తుంది. సంగీతం, చిత్రలేఖనం, మిషనరీ కార్యక్రమాలు వంటి పనులలో జూలియాకు ఆసక్తి. రాజమండ్రి సమీపంలో ద్రాక్షారామం ప్రాంతంలో వేణుగోపాల రాజు (?) అనే బ్రాహ్మణ జమీందారు ఆహ్వానిస్తే భర్తతో కలిసి వారి అతిథిగా ఉంటుంది. రెండు వేసవులు నరసాపురం సమీపంలోని సాముల్దీవిలో గడిపినప్పుడు అక్కడి పరిస్థితులన్నీ వివరంగా రాస్తుంది. కంపెనీ పరిపాలనలో విద్యా విధానం మీద సంస్కరణల అవసరాన్ని వివరిస్తూ ఆమె 1837లో మద్రాసు పత్రిక ‘ఎథీనియం అండ్ డెయిలీ న్యూస్’కు సుదీర్ఘమైన లేఖ రాస్తుంది.

1839 జూలైలో జడ్జి జేమ్స్ థామస్‌కు బదిలీ అవుతుంది. జేమ్స్ కుటుంబం మద్రాసు మీదుగా అక్టోబరు కల్లా బెంగుళూరు చేరుతుంది. ఆ తర్వాత విషయాలన్నీ 2003 ప్రతి ద్వారా తెలుస్తున్నాయి. బెంగుళూరులో జేమ్స్ థామస్ ఉదరకోశ సంబంధ వ్యాధితో తీవ్రంగా జబ్బు పడ్డాడు. రకరకాల వైద్యం తరువాత కూడా బాధ తగ్గకపోవడంతో బాధా నివారణకు నల్లమందు ఇస్తారు. అదీ పని చేయదు. వైద్యం కోసం మద్రాసు తీసుకెళ్తుంది జూలియా. వైద్యులు అతన్ని వెంటనే ఇంగ్లాండు తరలించమని సలహా ఇస్తే, జూలియా ఓడ ప్రయాణానికి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. “None knows what he was to me of late, more precious even than before” అని రాసుకొంటుంది.

1840 జనవరి ఆరవ తేదీ జేమ్స్ థామస్ మద్రాసు లోనే తన ఇద్దరు పసిపిల్లల పక్కన ఆడుకుంటుంటే, వాళ్ల ముద్దు మాటలు వింటూ ఊపిరి విడుస్తాడు. జూలియాను, ఆమె బిడ్డలను, మరిది వెంట పెట్టుకొని లండన్ తీసుకొని పోయి వదిలిపెడతాడు.

1842లో జూలియాకు పూర్వం నుంచి పరిచయం ఉన్న ఛార్లెస్ మెయిట్‌ల్యాండ్‌తో పునర్వివాహం జరుగుతుంది. మెయిట్‍ల్యాండ్ వైద్య విద్యలో శిక్షణ పొందినా, మతబోధకుడిగా స్థిరపడ్డాడు. ఈ వివాహంలో పుట్టిన కుమారుడు, తొలి వివాహంలో పుట్టిన పిల్లలు అందరూ పైకి వచ్చారు. జూలియా చివరి దశల్లో భర్త కూడా దూరమైతే, ఆమె తల్లి, సోదరుడు అండగా నిలిచారు. బాల్యంలో బాధించిన క్షయ రోగం మళ్ళీ తిరగబెట్టి ఏడేళ్ళు బాధ పడి, 55 వ ఏట జూలియా మరణించింది. ఆమె తన పిల్లల కోసం నాలుగు పుస్తకాలు రచించి బాలసాహిత్యకారిణిగా పేరు తెచ్చుకొన్నది. జూలియా జీవితాన్ని, ఆమెకు సంబంధించిన రికార్డులనుంచి పునర్నిర్మాణం చేసిన ఆలిసన్ ప్రైస్ అభినందనీయులు.

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here