జ్ఞాపకాల తరంగిణి-5

0
11

[box type=’note’ fontsize=’16’] జీవితంలోని వివిధ దశలలో తనకు కలిగిన విశేష అనుభవాలను సంచిక పాఠకులతో పంచుకుంటున్నారు డా॥ కాళిదాసు పురుషోత్తం. [/box]

[dropcap]1[/dropcap]953-54 ప్రాంతంలో అనుకొంటా, డాక్టర్ పుచ్చలపల్లి రామచంద్రారెడ్డి గారు ‘రాజా’ ప్రొడక్షన్ బ్యానరు మీద డాక్టర్ గరికపాటి రాజారావు దర్శకత్వంలో ‘పుట్టిల్లు’ సినిమా తీశారు. మిత్రా డిస్ట్రిబ్యూటర్ ఆఫీసు మా వీధిలో డాక్టర్ గారు పెట్టారు. మిత్రా వారి పెద్ద కుమారులు. ఒకసారి ఆ ఆఫీసుకు నటి జమున వచ్చారని, ఆమెని చూడాలని అక్కడ ఓ గుంపు చేరడం గుర్తుంది. పుట్టిల్లే జమున తొలి చిత్రం. అది బాక్సాఫీసు ముందు వైఫల్యం చెందింది. డాక్టర్ గారి పెద్దబ్బాయి మిత్రా మాత్రం చాలా పేరున్న గ్యాస్ట్రోఎంటరాలజిస్టు (వైద్యులు) పేరు తెచ్చుకొన్నాడు.

1937లో నెల్లూరులో కాసరం రామారావనే వకీలు ప్లాట్లు వేసి ఇళ్ల స్థలాలు అమ్ముతుంటే నాయనగారు స్థలం కొన్నారు. ఆ స్థలాలు బ్రాహ్మణులకు మాత్రమే అమ్మారు. మరుపూరు కోడందరామరెడ్డి గారికి స్థలం అమ్మడానికి ఒప్పుకోకపోతే, “మన బ్రాహ్మణుల కన్నా ఆయన బాగా చదువుకొన్న పండితులు. నా పక్క స్థలం ఖాళీగా వుంది. వారు నా పొరుగున వుంటే నాకేమీ అభ్యంతరం లేదు” అని మా నాయన గట్టిగా చెప్తే తనకు చోటు అమ్మినట్లు కోదండరామరెడ్డి గారు నాతో స్వయంగా అన్నారు. 1940లో మా నాయన ఇల్లు పూర్తి కాకపోయినా వచ్చి చేరారు. కోదండరామరెడ్డి గారు స్థలం నాలుగు వైపులా ప్రహరీ నిర్మించి, ప్రహరీ గోడ మీద ఎత్తుగా తూర్పు పడమరలుగా దూలాలతో, విడవలి కప్పుతో పర్ణశాల వంటి ఇల్లు కట్టారు. ఇంటి ముందు ఉదయ సూర్యునిలాగా పచ్చిక లాన్ వేయించి, నానా రకాల క్రోటన్ మొక్కలు నాటారు. వారి ఇంటికి మా ఇంటికి మధ్య గోడ వద్ద మెట్టదామర చెట్టు పెంచారు. అది మేగ్నోలియా కాదు కాని అటువంటి పువ్వులే పూచేది గొప్ప సుగంధంతో. కోదండరామరెడ్డి గారి ఇంటి ముందు రెండు మొత్తలకు, ఒక వైపు చలువరాతి మీద బంగారు అక్షరాలు ‘ప్రభాతకుటి’ అని, మరొకవైపు ‘మరుపూరు కోదండరామరెడ్డి’ అని చెక్కించి తీపించారు. ఆ వీధిలో వెళ్ళేవారెవరైనా క్షణం ఆగి, ప్రభాతకుటి వంక చూసి కాని వెళ్ళరు. వారి భార్య శ్రీమతి శంకరమ్మ ఆ చెట్ల మధ్య తిరుగుతూ వాటికి దోహదం చేస్తూ కన్పించేది. ఈ దంపతులకు ఆశాలత అనే కుమార్తె, తరువేందు శేఖరరెడ్డి అనే కుమారుడు ఉన్నారు. అమ్మాయి నా సమవయస్కురాలు. అబ్బాయి నా కన్నా మూడేళ్ళు చిన్న. మా తండ్రుల మధ్య స్నేహం మా తరం వరకూ కొనసాగింది.

శ్రీ  మరుపూరు కోడందరామరెడ్డి గారు

మా కస్తూరీదేవి నగర్ పేరెత్తితే మరిద్దరు గొప్ప వ్యక్తుల విషయం చెప్పకపోతే అపచారం. మా యింటికి పడమరగా మూడో ఇల్లు వేమూరు లక్ష్మయ్య గారిది. లక్ష్మయ్య గారి స్వస్థలం నెల్లూరుకు ఇరవై మైళ్ళ దూరంలోని అల్లూరు. లక్ష్మయ్య గారు జాతీయోద్యమంలో జైలుకు వెళ్ళారు.

శ్రీ వేమూరు లక్ష్మయ్య గారు

ఎప్పుడూ ఖద్దరు ధరించి కనిపించేవారు. వారి ఏకైక సంతానం వేమూరు శివప్రసాదరావు నా యీడు వాడు. భారత ప్రభుత్వంలో గొప్ప ఉద్యోగం – Deputy Chief Labour Commissioner – చేసి పదవీ విరమణ చేశారు. మరొక మహానుభావుడు ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారి ఇల్లు, వారి కుమారుల ఇళ్ళు అన్నీ ప్రక్కప్రక్కనే ఉండేవి. వందేమాతరం ఉద్యమంలో వారు న్యాయవాద వృత్తి మానుకున్నారు. వారి కుమారులు వెంకటేశ్వరులు బెనారసు వెళ్ళి హిందీ అభ్యసించి వచ్చారు. తండ్రి ఆదర్శాలను అనుసరిస్తూ వారు గుంటూరు శారదానికేతన్‍లో ఒక వితంతు బాలికను పరిణయం చేసుకొన్నారు. మరొక కుమారుడు హైదరాబాదులో న్యాయవాదో, ప్రొఫెసరో అయ్యారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర శాఖ అధిపతి రామచంద్రయ్య గారు కూడా వీరి కుమారులే. వెంకట సుబ్బయ్య గారి శ్రీమతి భర్తను అనుసరిస్తూ అనేక పర్యాయాలు జైలుకు వెళ్ళివచ్చారు. 1942లో ఆచార్య రామచంద్రయ్య ఆంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థి. వారిని నిర్బంధించి, రైల్లో తీసుకొని వెళుతుంటే ఆయన రైల్లోంచి దూకి పారిపోయి రహస్య జీవితం గడిపారు. ఓరుగంటి వెంకట సుబ్బయ్య గారి కుమారులు వెంకటేశ్వరులు దురదృష్టవశాత్తు యవ్వనంలోనే చనిపోయారు. వెంకటేశ్వరులు పిల్లలను తాతగారే వృద్ధికి తెచ్చారు. 1942 ప్రాంతంలో తన పిల్లలు, భర్త కారాగారవాసం, మరణాలతో వెంకట సుబ్బయ్య గారి ధర్మపత్ని మనోవైక్లబ్యంతో చనిపోయారు.

శ్రీ వేమూరు లక్ష్మయ్య దంపతులు

నేను హైస్కూలు చదువుతున్న కాలంలో వెంకట సుబ్బయ్య గారు వాకిట్లో ఏపుగా పెరిగిన గంగరావి చెట్టు నీడలో పడకకుర్చీలో కూర్చొని పత్రికలు, పుస్తకాలు చదువుతూ ఉదయం పూట కనిపించేవారు. మా జిల్లాలో జాతీయోద్యమం వారి ఇంటి నుంచే పుట్టింది. కుటుంబంలో అందరూ అశేష త్యాగాలు చేశారు. నెల్లూరులో ఎందరో చిల్లర నాయకుల విగ్రహాలు అనేక శృంగాటకాల్లో దిష్టిబొమ్మల్లా దర్శనమివ్వచ్చు గానీ వీరి వంటి త్యాగధనుల విగ్రహాలు పెట్టరు. ఇంకొక్క విషయం చెప్పి త్యాగమయ కుటుంబ విషయం ముగిస్తాను. ఓరుగంటి వారందరూ అనిబీసెంటు దివ్యజ్ఞాన సమాజం అనుయాయులు. ఆ కారణంతో వీరు అమ్మవారుకు వేసే టీకాలను వేయించుకోడానికి నిరాకరిస్తే, అదొక కేసు జరిగింది.

మా వీధి ఘన చరిత్రలో మరొక విషయం చెప్పి ముగిస్తాను. మా వీధి, ఆ పై వీధుల్లో తొలి యజమానులు ఇప్పుడు ఎవరూ దాదాపు లేరు. అన్ని ఇళ్ళూ వైద్య వ్యాపారుల నర్సింగ్ హోమ్‍లయ్యాయి. నాలుగేళ్ల క్రితం ఒక అక్రమార్కుడు, అధికార పార్టీ అండదండలతో మా వీధుల చివర తన పేరుతో బోర్డులు పెట్టాడు. పెట్టారంటే కార్పోరేషన్ వారే రాత్రికి రాత్రి పెట్టించారు. మహాత్ముని జీవన సహచరి కస్తూర్బా పేరు తొలగించడానికి, ఆ పాపిష్టి డాక్టరుకూ, కార్పోరేషన్ వారికి చేతులెట్లాడాయో తెలియదు.

అక్రమార్కులు కస్తూరిదేవి పేరు తీసివేసి తమపేరుతో వీధులకు బోర్డులు..

నేను 75 సంవత్సరాలు వయసు దాటిన తర్వాత వీధి పేరు మార్పు మీద పోరాటం జరుపవలసి వచ్చింది. జిల్లా మంత్రివర్యులను కలిసి చెప్పుకుంటే తనకేమీ తెలియదని, తన పక్కనే ఆసీనులయిన మునిసిపల్ కమీషనర్‍ వంక చూశారు. ఆయన రికార్డు చూస్తే గాని చెప్పలేమని, ఎవరు బోర్డు పెట్టుకొన్నా, పోస్టాఫీసులో మార్పు చెయ్యాలని సెలవించారు. అందరూ అమాయకులే! పత్రికలకు రాశాను. వీధి పేరు మార్పును వ్యతిరేకిస్తూ పిటిషన్‍లో సంతకం పెట్టడానికి కూడా మా వీధుల్లోని కొందరు వైద్యులకు ధైర్యం లేకపోయింది.

జమీన్ రైతు వారపత్రిక గళం విప్పింది. దేశ ఉపాధ్యక్షులు వెంకయ్యనాయుడి గారి వరకు విషయం వెళ్ళింది. ఆయన ఆ వీధిలో వుందే వి.ఆర్. కళాశాలలో చదువుకొన్నారు. చివరకు వారి చొరవతో రాత్రికి రాత్రి డాక్టరు గారిని తృప్తి పరచడానికి కార్పోరేషన్ వారు పెట్టించిన బోర్డులు తీసివేశారు. ఈ ఉద్యమానికి ఇప్పుడు జిల్లా మంత్రివర్యులు డా. అనిల్, ఆయన సోదరులు అండగా నిలిచి, కొత్త బోర్డులు పెట్టించారు. ఇంత జరిగినా లజ్జ లేకుండా ఆ డాక్టర్ తన హాస్పిటల్ ప్రకటన బోర్డులు పెద్దవిగా పెట్టించి కస్తూర్బా పేరు కనబడకుండా చేస్తే, నాతో పాటు వుద్యమించిన శ్రీమతి గూడూరు లక్ష్మి ఆ బోర్డులు తీయించారు. ఇదీ మన స్వాతంత్ర్య పోరాటం తర్వాత దేశభక్తులకిచ్చే గౌరవం!

స్థానికుల ఉద్యమాన్ని సపోర్టు చేస్తూ రాసిన జమీన్ రైతు పత్రిక

***

నేను కాలేజీ చదువుకు వచ్చేసరికి మా పెద్దక్క ముగ్గురు బిడ్డలతో శాశ్వతంగా పుట్టిల్లు చేరింది. ఆమె భర్త మా నాయనగారి శిష్యుడే. నాయనగారు నెల్లూరు రాయాజీ వీధిలో సుమారు పదేళ్ళు పుష్పగిరి పీఠాధిపతులకు సంబంధించిన శంకరమఠం ఆవరణలో వుంటూ సంస్కృత పాఠశాల నిర్వహించారు. అంతకు పూర్వం కూడా కూడా నాయన పుష్పగిరి పీఠాధిపతుల ఆస్థాన పండితులుగా ఉన్నారు. నెల్లూరు జిల్లా పడమట పల్లెల నుంచి, సముద్ర తీరంలో తుమ్మగుంట వగైరా గ్రామాల నుంచి చాలామంది బ్రాహ్మణ బ్రహ్మచారులు నాయన నిర్వహించిన పాఠశాలలో చేరి చదువుకున్నారు. ఆ విద్యార్థులలో చాలా చురుకైన ఒక విద్యార్థిని నాయన మా పెద్దక్కయ్యకు వరుడిగా ఎంపిక చేసి, ఆమె 8వ ఏట, 1932 ప్రాంతంలో పెళ్ళి చేశారు. ఆ పెళ్ళి కూడా ఇద్దరు మైనరు తీరని పిల్లల పెళ్ళి కనుక నాయన సొంతవూరు తూమాడులో రహస్యంగా జరిపి, మా మేనత్త ఆదెమ్మత్తను తోడుగా అక్కడే మా సొంత ఇంటిలో ఆరు నెలలు వుంచారు. 16 సంవత్సరాల వయసులో మా బావగారికి టైఫాయిడ్ వచ్చి చావు బతుకుల మధ్య అపస్మారక స్థితిలో నలభై రోజులు పైగా వున్నారు. మా నాయన, ఆయన ఆయుర్వేద వైద్య మిత్రులు పులిగండ్ల నరసింహశాస్త్రి కలిసి వైద్యం చేసి మా బావగారి ప్రాణాలు కాపాడారు. అయితే బావగారు తను జిల్లా బోర్డులో తెలుగు అధ్యాపక వృత్తిలో ప్రవేశించాక భార్యను కాపురానికి తీసుకొని వెళ్ళలేదు. సరిగా ఏలుకోలేదు. ముగ్గురు బిడ్డల తల్లైనా అతను కనికరం చూపలేదు. చివరకు మా అమ్మగారే అక్కయ్యను ఆదరించి కాపాడింది. నేను ప్రీయూనివర్శిటీ చదివే సమయంలో ఆమె ఆఖరుసారి తన ఇద్దరు కుమారులతో వచ్చేసారు. బావగారు పెద్ద కుమారుడిని వంట వండడానికి సహాయంగా ఆపుకున్నారు. తర్వాత SSLC ఫెయిలై మా అక్క పెద్ద కొడుకు కూడా పారిపోయి నెల్లూరు చేరాడు. మా అమ్మ కష్టాలు రెట్టింపయ్యాయి. అక్క బిడ్డలను వృద్ధిలోకి తీసుకొని రావడం ఆమె బాధ్యతైంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here